కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీతిమంతులు పోవుమార్గము”లో నడవండి

“నీతిమంతులు పోవుమార్గము”లో నడవండి

“నీతిమంతులు పోవుమార్గము”లో నడవండి

‘నీతిమంతులకు మేలు కలుగును, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు’ అని యెషయా ప్రవక్త ఉద్ఘాటించాడు. “నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును” అని కూడా ఆయన చెప్పాడు. (యెషయా 3:​10; 26:⁠7) దీన్ని బట్టి, మన క్రియలు మంచి ఫలితాలనివ్వాలంటే, దేవుని దృష్టిలో సరైనదేదో దానిని మనం తప్పనిసరిగా చేయాలని స్పష్టమౌతోంది.

అయితే, నీతిమంతుల మార్గములో మనమెలా నడవవచ్చు? అలా నడిచినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని మనమెదురు చూడవచ్చు? దేవుని నీతిమంతమైన ప్రమాణాలకు పొందికగా మనం నడుచుకోవడం వల్ల ఇతరులు ఎలా ప్రయోజనం పొందగలరు? ఈ ప్రశ్నలకు జవాబులు బైబిలు పుస్తకమైన సామెతలు 10వ అధ్యాయంలో, ప్రాచీన ఇశ్రాయేలు రాజు సొలొమోను నీతిమంతులను దుష్టులను తారతమ్యం చేస్తూ ఇస్తున్నాడు. ఆయనలా చెబుతున్నప్పుడు “నీతిమంతుని,” “నీతిమంతుడు,” “నీతిమంతుల,” “నీతిమంతులు” అన్న మాటలను మొత్తం 13 సార్లు ఉపయోగించాడు. ఈమాటలు 15వ వచనం నుండి 32వ వచనం వరకు మొత్తం తొమ్మిదిసార్లు కనిపిస్తాయి. కాబట్టి సామెతలు 10:​15-32 వచనాలను పరిశీలించడం మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. *

క్రమశిక్షణను అంగీకరించండి

సొలొమోను, నీతి ప్రాముఖ్యతను సూచిస్తున్నాడు. “ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును” అని ఆయన అంటున్నాడు.​—⁠సామెతలు 10:15,16.

బలమైన పట్టణంలో నివసించేవారికి ఆపట్టణం కొంతమేరకు రక్షణనిచ్చినట్లే, సిరిసంపదలు జీవితంలో ఎదురయ్యే కొన్ని అనిశ్చితమైన పరిస్థితుల నుండి రక్షణనివ్వగలవు. ఎదురుచూడని పరిణామాలు ఏర్పడినప్పుడు పేదరికం వినాశకరంగా ఉండగలదు. (ప్రసంగి 7:​12) అయితే, జ్ఞానియైన రాజు ఐశ్వర్యంలోనూ, పేదరికంలోనూ ఉన్న ప్రమాదాన్ని కూడా సూచిస్తుండవచ్చు. ధనికుడు తన ఆస్తి “ఆశ్రయపట్టణము”వంటిదని అనుకుని, తనకున్న విలువైన సంపదలపైనే పూర్తిగా ఆధారపడడానికి మొగ్గు చూపుతుండవచ్చు. (సామెతలు 18:​11) పేదవాడు తన పేదరికం తన భవిష్యత్తును నిరాశాజనకంగా చేస్తుందని తప్పుగా దృష్టిస్తుండవచ్చు. అలా, ఇద్దరూ దేవుని ఎదుట మంచి పేరును సంపాదించుకోలేకపోతారు.

మరొకవైపు, నీతిమంతుడికి భౌతిక సంపదలు అతి ఎక్కువగా ఉన్నా అతి తక్కువగా ఉన్నా, ఆయన నీతిమంతమైన క్రియలు ఆయనను జీవానికి నడిపిస్తాయి. ఎలా? ఎలాగంటే, ఆయన తనకున్నదానితో తృప్తిపడతాడు. తన ఆర్థిక స్తోమత, దేవుని ఎదుట తనకున్న స్థానానికి భంగం కలిగించడానికి అనుమతించడు. నీతిమంతుడు ధనికుడైనా పేదవాడైనా సరే, ఆయన జీవన విధానం ఆయనకిప్పుడు సంతోషాన్నిస్తుంది, భవిష్యత్తులో నిత్యజీవమనే నిరీక్షణనిస్తుంది. (యోబు 42:​10-13) దుష్టుడు సిరిసంపదలను సంపాదించినా వాటి నుండి ప్రయోజనం పొందడు. దానికున్న సంరక్షణా శక్తికి కృతజ్ఞుడై ఉంటూ దేవుని చిత్తానికి పొందికగా నడిచే బదులు, పాపపు జీవితాన్ని గడిపేందుకు తన సంపదలను ఉపయోగిస్తాడు.

“ఉపదేశము [“క్రమశిక్షణ,” NW] నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును” అని అంటూ ఇశ్రాయేలు రాజు కొనసాగిస్తున్నాడు. (సామెతలు 10:​17) ఈవచనాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చని ఒక బైబిలు పండితుడు సూచిస్తున్నాడు. ఒక అర్థం ఏమిటంటే, క్రమశిక్షణకు లోబడుతూ, నీతిని అనుసరిస్తూ ఉండే వ్యక్తి జీవపు మార్గంలో ఉన్నాడు; అయితే, గద్దింపును పెడచెవినబెట్టే వ్యక్తి ఆమార్గం నుండి తొలగిపోతాడు. “క్రమశిక్షణను అనుసరించే వ్యక్తి [ఉంచే మంచి మాదిరి ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది కాబట్టి ఆయన వారికి] జీవపు మార్గాన్ని చూపిస్తాడు, అయితే, దిద్దుబాటును నిర్లక్ష్యం చేసేవారెవరైనా సరే వారు ఇతరులను తప్పుదోవపట్టిస్తారు” అని కూడా అర్థం చేసుకోవచ్చు. (సామెతలు 10:​17, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌) ఏ అర్థం తీసుకున్నా సరే, మనం క్రమశిక్షణను అనుసరించి గద్దింపును నిర్లక్ష్యం చేయకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యం!

ద్వేషానికి బదులు ప్రేమకు తావివ్వండి

తర్వాత సొలొమోను ఒకే విషయాన్ని తెలుపుతున్న రెండు భాగాలుగల సామెతను చెబుతున్నాడు. రెండవ భాగం మొదటి భాగాన్ని నొక్కి చెబుతుంది. “అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు” అని ఆయన అంటున్నాడు. ఒక వ్యక్తి తన హృదయంలో మరొక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకుని, తియ్యని మాటలతో లేక ముఖస్తుతితో మరుగు చేస్తున్నట్లయితే, అతడు వంచకుడు, “అబద్ధికుడు.” అందుకే, “కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు” అని కూడా జ్ఞానియైన సొలొమోను రాజు అంటున్నాడు. (సామెతలు 10:​18) కొందరు తమకున్న ద్వేషాన్ని దాచక, తాము ద్వేషించే వ్యక్తి గురించి తప్పుడు ఆరోపణలను చేస్తారు, లేదా వారి మంచి పేరును పాడుచేసే వ్యాఖ్యానాలను ప్రచారం చేస్తారు. అది మూర్ఖత్వం, ఎందుకంటే కొండెములు చెప్పి ప్రచారం చేసినంత మాత్రాన ఆవ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం మారదు. శ్రద్ధగా విని గ్రహించే వ్యక్తి, ఆమాటల వెనుకవున్న దురుద్దేశాన్ని గ్రహిస్తాడు, కొండెములు చెప్పే ఆవ్యక్తిని గురించి తక్కువగా ఎంచుతాడు. అబద్ధాన్ని ప్రచారం చేసేవ్యక్తి ఆవిధంగా తనకు తాను హాని కలిగించుకుంటాడు.

మోసం చేయడం గానీ కొండెములు చెప్పడం గానీ నీతిమంతమైన పని కాదు. “నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు” అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (లేవీయకాండము 19:​17) “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని యేసు తన శ్రోతలకు ఉపదేశించాడు. (మత్తయి 5:​44,45) మన హృదయంలో ద్వేషాన్ని నింపుకునే బదులు ప్రేమను నింపుకోవడం ఎంత మేలు!

‘పెదవులను మూసుకోండి’

నాలుకను అదుపులో ఉంచుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ, జ్ఞానియైన రాజు అన్నాడు: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.”​—సామెతలు 10:⁠19.

“బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు.” (ప్రసంగి 10:​14) అతని “నోరు మూఢవాక్యములు కుమ్మరించును.” (సామెతలు 15:⁠2) ఎక్కువగా మాట్లాడే ప్రతివ్యక్తీ మూర్ఖుడని కాదు. కానీ అతిగా మాట్లాడే వ్యక్తి హానికరమైన వదంతులు లేదా పుకార్లు వ్యాప్తికావడానికి కారకుడవడం చాలా సులభం! పేరు పాడైపోవడానికి, మనస్సు నొచ్చుకోవడానికి, సంబంధాలు దెబ్బతినడానికి, అంతెందుకు శారీరకంగా కూడా దెబ్బలు పడడానికీ కూడా తరచూ మూర్ఖపు మాటలు కారణమౌతున్నాయి. “విస్తారమైన మాటలలో పాపం దొర్లక మానదు.” (సామెతలు 10:​19, ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌) అంతేకాక, ప్రతివిషయం గురించి ఏదో ఒక వ్యాఖ్యానం చేసే వ్యక్తి దగ్గరుండడం చాలా చిరాకు కలిగిస్తుంది. కనుక మనం అతిగా మాట్లాడకుండా ఉందాం.

అబద్ధాలు చెప్పకుండా ఉండడమే కాక, ఆచితూచి మాట్లాడేవాడు వివేచనాపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన మాట్లాడే ముందు ఆలోచిస్తాడు. యెహోవా మార్గాల మీద తనకున్న ప్రేమ, తన తోటి మానవులకు సహాయం చేయాలన్న నిజమైన కోరికల చేత పురికొల్పబడినవాడై, తాను మాట్లాడే మాటలు ఇతరులపై చూపగల ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన మాటలు ప్రేమపూర్వకంగా దయాపూర్వకంగా ఉంటాయి. ఇతరులను సంతోషపెట్టేలా సహాయకరంగా ఉండేలా మాట్లాడడమెలాగన్నది ధ్యానిస్తాడు. ఆయన మాట “చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది,” అన్నివేళలా నేర్పు గలదై ఉంటుంది, మర్యాదగా ఉంటుంది.​—⁠సామెతలు 25:⁠11.

‘అనేకులకు ఉపదేశిస్తూ ఉండండి’

సొలొమోను ఇంకా ఇలా చెప్పుకుపోతున్నాడు: “నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.” (సామెతలు 10:​20) నీతిమంతుడు చెప్పేది నిర్మలమైనది, అంటే అది మడ్డిలేకుండా శుద్ధిచేయబడిన ప్రశస్తమైన వెండిలాంటిది. యెహోవా సేవకులు జీవాన్ని కాపాడే దేవుని వాక్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటున్నప్పుడు అది నిశ్చయంగా నిజం. వాళ్ళ గొప్ప బోధకుడైన యెహోవా దేవుడు వారికి విద్య నేర్పాడు, ‘అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము వారికి కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఆయన వారికి దయచేసి యున్నాడు.’ (యెషయా 30:​20; 50:⁠4) నిజానికి వారి నాలుక బైబిలు సత్యాన్ని గురించి మాట్లాడుతుంది కనుక, అది ప్రశస్తమైన వెండిలాంటిది. దుష్టుల ఉద్దేశాలవలె కాకుండా, వారి మాటలు యథార్థ హృదయులైన వారికి ఎంతో విలువైనవిగా ఉంటాయి! కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని అద్భుతమైన పనులను గురించి మాట్లాడాలన్న ఆతురతతో మనముందాం.

నీతిమంతుడు తన చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదంగా ఉంటాడు. సొలొమోను అంటున్నాడు: “నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుటచేత మూఢులు చనిపోవుదురు.”​—సామెతలు 10:⁠21.

“నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును” అన్నది ఏ భావంలో? ఇక్కడ ఉపదేశించును అన్నదానికి ఉపయోగించబడిన హీబ్రూ మాట “మందను కాయు” అనే తలంపును తెలియజేస్తుంది. ఆమాట, ప్రాచీన కాలాల్లో మందకాపరులు తమ మందలను ఎలా చూసుకునేవారో అలా మందను నడిపించడం వాటిని పోషించడం అన్న తలంపునిస్తుంది. (1 సమూయేలు 16:​11; కీర్తన 23:​1-3; పరమగీతము 1:⁠7) నీతిమంతుడు ఇతరులను నీతిమంతమైన మార్గంవైపుకు నిర్దేశిస్తాడు లేదా నడిపిస్తాడు. అతని మాటలు వినేవాళ్ళకు క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి. దాని ఫలితంగా, వాళ్ళు మరింత సంతోషకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. అంతేకాక, నిత్యజీవాన్ని కూడా పొందవచ్చు.

అయితే, మూర్ఖుని విషయమేమిటి? అతడికి స్థిరచిత్తము లేక, మంచి లక్ష్యాలు ఏమీ లేక, తన జీవన శైలి వల్ల కలిగే పర్యవసానాలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఉంటాడు. అలాంటి వ్యక్తి తనకిష్టం వచ్చినట్లు చేస్తుంటాడు, రాగల పర్యవసానాలను పట్టించుకోడు. కనుక, ఆయన తన చర్యలకు శిక్షను అనుభవిస్తాడు. నీతిమంతుడు ఇతరులు కూడా జీవించివుండేందుకు సహాయపడితే, స్థిరచిత్తంలేని వ్యక్తి తన సొంత ప్రాణాన్ని కూడా నిలబెట్టుకోలేడు.

అనైతిక ప్రవర్తనను విడనాడండి

ఒక వ్యక్తి వ్యక్తిత్వం అతని ఇష్టాయిష్టాల ద్వారా తరచూ వెల్లడవుతుంది. ఈవాస్తవాన్ని పేర్కొంటూ ఇశ్రాయేలు రాజు అంటున్నాడు: “చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.”​—సామెతలు 10:⁠23.

కొందరు విచ్చలవిడితనాన్ని ఒక క్రీడగా లేదా ఆటగా దృష్టించి, “సరదా” కోసం దానికి పాల్పడుతారు. అలాంటి ప్రజలు, మనమందరం దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉందన్న విషయాన్ని లక్ష్యపెట్టరు. తాము చేసే తప్పిదాలను అలా గుడ్డిగా చేస్తూనే ఉంటారు. (రోమీయులు 14:​12బి) తాము చేసే తప్పిదాలను దేవుడేమీ చూడడులే అని అనుకునేంత స్థాయిలో వాళ్లు వక్రంగా తమలో తాము తర్కించుకుంటారు. ఆవిధంగా వాళ్ళు తమ క్రియల ద్వారా, “దేవుడు లేడని” చెబుతారు. (కీర్తన 14:1-3; యెషయా 29:​15,16) ఎంత అవివేకం!

మరొకవైపు వివేకి విచ్చలవిడితనం ఒక ఆట కాదని గ్రహిస్తాడు. అది దేవుణ్ణి దుఃఖపరుస్తుందని, ఒక వ్యక్తికి ఆయనతో ఉన్న సంబంధాన్ని పాడు చేస్తుందని ఆయనకు తెలుసు. అలాంటి ప్రవర్తన మూఢమైనది, ఎందుకంటే, అలాంటి ప్రవర్తన ప్రజల ఆత్మగౌరవాన్ని హరింపజేస్తుంది, వైవాహిక జీవితాలను పాడు చేస్తుంది, మానసికంగాను శారీరకంగాను హాని కలిగిస్తుంది, అది ఆధ్యాత్మికతను కోల్పోయేలా చేస్తుంది. మనం విచ్చలవిడి ప్రవర్తనను వదిలిపెట్టి, ఎంతో ప్రియమైన అక్క మీద ఆప్యాయతను పెంచుకున్నట్లుగా జ్ఞానము మీద ఆప్యాయతను పెంచుకోవడం వివేకవంతమైన పని.​—⁠సామెతలు 7:⁠4.

సరైన పునాదిపై నిర్మించండి

ఒకరి జీవితాన్ని సముచితమైన పునాదిపై నిర్మించడానికున్న విలువను సూచిస్తూ సొలొమోను ఇలా అన్నాడు: “భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడములె ఉన్నాడు.”​—సామెతలు 10:​24,25.

దుష్టుడు ఇతరులకు ఎంతో భయం కలిగిస్తుండవచ్చు. అయినా, చివరికి అతడు దేని గురించి భయపడతాడో అదే అతడి మీదికి వస్తుంది. తన పునాది నీతియుక్తమైన సూత్రాలతో వేసింది కాకపోవడం వల్ల, పెను తుపాను వచ్చినప్పుడు కూలిపోయేటువంటి దృఢత్వం లేని భవనంలా ఉంటాడాయన. ఆయన ఒత్తిడులకు గురైనప్పుడు పడిపోతాడు. మరొకవైపు నీతిమంతుడు, యేసు చెప్పిన మాటలకు పొందికగా నడుచుకునే వ్యక్తి. ఆయన ‘బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు.’ “వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు” అని యేసు చెప్పాడు. (మత్తయి 7:​24,25) అలాంటి వ్యక్తి స్థిరంగా ఉంటాడు, ఆయన ఆలోచనలకు, క్రియలకు, దైవిక సూత్రాలనే గట్టి పునాది ఉంది.

దుష్టుడికీ నీతిమంతుడికీ ఉన్న మరొక తేడా గురించి మాట్లాడే ముందు, జ్ఞానియైన రాజు క్లుప్తమైనదే అయినా ఒక ప్రాముఖ్యమైనదాని గురించి హెచ్చరిస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.” (సామెతలు 10:​26) వినిగర్‌ పళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. అందులో ఉండే అసిటిక్‌ యాసిడ్‌ నోటికి పుల్లగా ఉండి, పళ్ళు జివ్వుమంటాయి. పొగకు కళ్ళు మండి బాధకలుగుతుంది. అదే విధంగా ఎవరైతే సోమరిని పనికి తీసుకుంటారో, లేదా తనకు ప్రతినిధిగా ఉపయోగించుకుంటారో, వారు తప్పకుండా సమస్యలను తెచ్చుకుంటారు, లేదా నష్టపోతారు.

“యెహోవా యేర్పాటు ఆశ్రయ దుర్గము”

ఇశ్రాయేలు రాజు ఇలా కొనసాగిస్తున్నాడు: ‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్షు తక్కువై పోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.’​—⁠సామెతలు 10:27,28.

నీతిమంతుడు దైవిక భయం చేత నడిపించబడినవాడై, తన తలంపుల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా యెహోవాను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. దేవుడు ఆయన మీద శ్రద్ధ చూపిస్తాడు, నీతిమంతమైన ఆయన నిరీక్షణలను నెరవేరుస్తాడు. అయితే, దుష్టుడు దైవభక్తి లేని జీవితాన్ని గడుపుతాడు. ఆయన ఆశలు నెరవేరుతున్నట్లు కొన్నిసార్లు అనిపించినా, అవి కేవలం తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే, దౌర్జన్యం మూలంగా లేదా తన జీవన శైలి వల్ల కలిగిన వ్యాధుల మూలంగా అతడిలాంటివారి ఆయుష్షు తరచూ తగ్గించబడుతుంది. ఆయన చనిపోయే రోజు ఆయన కలలన్నీ కల్లలవుతాయి.​—⁠సామెతలు 11:⁠7.

“యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయ దుర్గము పాపముచేయువారికి అది నాశనకరము” అని సొలొమోను అంటున్నాడు. (సామెతలు 10:​29) ఇక్కడ యెహోవా యేర్పాటు అన్నది మనం నడవవలసిన జీవమార్గాన్ని సూచించడం లేదు, మానవులతో దేవుడు వ్యవహరించే విధానాన్ని సూచిస్తోంది. “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు” అని మోషే అన్నాడు. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) దేవుని న్యాయవంతమైన మార్గాలు నీతిమంతులకు భద్రతనిస్తాయి, దుష్టులకు నాశనాన్ని తెస్తాయి.

తాను తన ప్రజలకు ఎంతటి ఆశ్రయదుర్గముగా ఉన్నాడో యెహోవా నిరూపించుకుంటాడు! “నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.”​—సామెతలు 10:30-32.

నీతిమంతులు నీతిమంతమైన మార్గాల్లో నడుస్తారు కనుక నిశ్చయంగా క్షేమంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు. నిజానికి, “యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.” (సామెతలు 10:​22, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కనుక, మనం దైవిక సూత్రాలకు పొందికగా ప్రవర్తిస్తూ ఉండేలా అన్నివేళలా కావలసిన జాగ్రత్తలను తీసుకుందాం. అంతేకాక మనం అతిగా మాట్లాడకుండా పెదవులను మన అదుపులో పెట్టుకుందాం, దేవుని వాక్యంలోవున్న జీవాన్ని కాపాడే సత్యంతో ఇతరుల క్షేమాభివృద్ధికి తోడ్పడేలా మన నాలుకను ఉపయోగించుదాం, వారిని నీతిమంతమైన యేర్పాటు వైపుకు నడిపించుదాం.

[అధస్సూచి]

^ పేరా 3 సామెతలు 10:​1-14 వచనాల విపులమైన చర్చ కోసం, జూలై 15, 2001 కావలికోట 24-7 పేజీలను చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

నాలుక “ప్రశస్తమైన వెండి”లా ఉండగలదు