కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం

క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం

క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం

“క్షమాపణలు చాలా శక్తివంతమైనవి. అవి హింస లేకుండానే వివాదాలను పరిష్కరిస్తాయి, దేశాల మధ్య ఏర్పడిన చీలికలను సరిచేస్తాయి, ప్రభుత్వాలు తమ పౌరులనుభవిస్తున్న బాధలను గుర్తించడానికి అనుమతిస్తాయి, వ్యక్తిగత సంబంధాల మధ్య సమతుల్యాన్ని పునఃస్థాపిస్తాయి.” ఈ మాటలు, వాషింగ్‌టన్‌, డి.సి.లో ఉన్న జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయంలో సోషియోలింగ్విస్ట్‌గా పనిచేస్తున్న ప్రజాదరణ పొందిన రచయిత్రి అయిన డెబ్రా టెనన్‌ వ్రాసినవి.

పాడైన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి నిజాయితీగా క్షమించమని అడగడం ఒక ప్రభావవంతమైన మార్గమని బైబిలు ధృవీకరిస్తోంది. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో, కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి హృదయపూర్వకంగా క్షమించమని అడిగినప్పుడు, తండ్రి అతడిని తిరిగి ఇంట్లోకి చేర్చుకోవడానికి ఎంతో ఆత్రుత చూపించాడు. (లూకా 15:​17-24) అవును, ఒక వ్యక్తి అహంకార భావాలను ప్రక్కనపెట్టి, క్షమించమని అడగడానికి గర్వం ఎన్నడూ అడ్డురాకూడదు. క్షమాపణ చెప్పడం నిజంగా వినయస్థులైన వ్యక్తులకు అంత కష్టమేమీ కాదన్నది వాస్తవం.

క్షమాపణకున్న శక్తి

ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతురాలైన అబీగయీలు తన భర్త చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నప్పటికీ, క్షమాపణ యొక్క శక్తికి ఒక మంచి ఉదాహరణగా ఉండేలా ఆమె ప్రవర్తించింది. దావీదు తాను అరణ్యంలో నివసిస్తున్నప్పుడు తన మనుష్యులతో కలిసి, అబీగయీలు భర్త అయిన నాబాలుకు చెందిన మందలను కాపాడాడు, ఈయన ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అయితే, దావీదుతో ఉన్న యౌవనస్థులు రొట్టె నీళ్ళ కోసం అడిగినప్పుడు, నాబాలు వారితో అవమానకరంగా మాట్లాడి వారిని పంపించివేశాడు. దానితో ఉగ్రుడైన దావీదు తనతోపాటు దాదాపు 400 మంది పురుషులను వెంటబెట్టుకుని నాబాలు మీదికి, ఆయన కుటుంబం మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న అబీగయీలు దావీదును కలవడానికి బయల్దేరింది. ఆమె ఆయనను కలుసుకుని ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసింది. తర్వాత ఆమె ఇలా అన్నది: “నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము.” తర్వాత అబీగయీలు దావీదుకు పరిస్థితిని వివరించి, ఆయనకు ఆహారాన్ని పానీయాలను కానుకగా ఇచ్చింది. దానికి ఆయనిలా అన్నాడు: “నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొ[మ్ము].”​—⁠1 సమూయేలు 25:​2-35.

అబీగయీలుకున్న వినయ స్వభావం, తన భర్త దురుసు ప్రవర్తనకు ఆమె క్షమాపణ చెప్పడం ఆమె ఇంటి వారిని రక్షించాయి. పగతీర్చుకొనకుండ ఆపినందుకు దావీదు ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. దావీదుతోనూ ఆయన మనుష్యులతోనూ దురుసుగా ప్రవర్తించింది అబీగయీలు కాకపోయినా, ఆమె తన కుటుంబం తరపున నిందను అంగీకరించి దావీదుతో సమాధానపడింది.

ఎప్పుడు క్షమాపణ చెప్పాలో తెలిసిన వ్యక్తిని గురించిన మరో ఉదాహరణ అపొస్తలుడైన పౌలు. ఒకసారి యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహా సభ ఎదుట తనను తాను సమర్థించుకోవలసిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. పౌలు యథార్థంగా పలికిన మాటలకు ఉగ్రుడైన ప్రధానయాజకుడైన అననీయ పౌలు నోటి మీద కొట్టమని ఆయన దగ్గర నిలబడివున్న వారికి ఆజ్ఞాపించాడు. దానితో, పౌలు ఆయనతో ఇలా అన్నాడు: “సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా?” చూస్తున్నవారు పౌలు ప్రధానయాజకుడిని దూషిస్తున్నాడని ఆరోపించినప్పుడు, అపొస్తలుడు “సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు​—⁠నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్న[ది]” అంటూ వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 23:​1-5.

న్యాయాధిపతిగా నియమించబడిన వ్యక్తి హింసకు పాల్పడకూడదని పౌలు పలికిన మాటలు సముచితమైనవే. అయినప్పటికీ ప్రధానయాజకునితో తెలియక, అమర్యాదకరమైనదిగా దృష్టించబడే విధంగా మాట్లాడినందుకు ఆయన క్షమించమని అడిగాడు. * పౌలు చెప్పిన క్షమాపణ, మహా సభ ఆయన చెప్పాలనుకుంటున్నది వినేలా మార్గాన్ని సుగమం చేసింది. న్యాయస్థానం సభ్యుల మధ్యనున్న వివాదం గురించి పౌలుకు తెలుసు గనుక, ఆయన తాను పునరుత్థానమందు తనకున్న నమ్మకాన్ని బట్టి విచారణ చేయబడుతున్నానని వారికి చెప్పాడు. తత్ఫలితంగా, పరిసయ్యులు పౌలు పక్షం వహించడంతో ఎంతో కలహము రేగింది.​—⁠అపొస్తలుల కార్యములు 23:​6-10.

బైబిలులోని ఈ రెండు ఉదాహరణల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ రెండు సంఘటనల్లోనూ చేసిన తప్పుకు నిజాయితీగా విచారాన్ని వ్యక్తం చేయడం సంభాషణ కొనసాగడానికి మార్గాన్ని సుగమం చేసింది. కాబట్టి క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి తోడ్పడుతుంది. అవును, మన పొరపాట్లను అంగీకరించి చేసిన నష్టానికి క్షమాపణ చెప్పుకోవడం నిర్మాణాత్మకమైన చర్చలకు అవకాశాలను కలిగిస్తుంది.

‘కానీ నేను ఏ తప్పూ చేయలేదు’

మనం అన్నదాన్ని బట్టి లేదా చేసినదాన్ని బట్టి ఎవరికైనా బాధ కలిగిందని మనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి నిర్హేతుకంగా ప్రవర్తిస్తున్నాడనో మరీ అతిగా ప్రతిస్పందిస్తున్నాడనో మనకు అనిపించవచ్చు. అయినా, యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలా సలహా ఇచ్చాడు: “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.”​—⁠మత్తయి 5:​23, 24.

ఉదాహరణకు, మీరు తనకు వ్యతిరేకంగా పాపం చేశారని ఒక సహోదరుడు భావించవచ్చు. అలాంటి పరిస్థితిలో, మీరు ఆయన పట్ల తప్పు చేశారని మీరు భావించినా భావించకపోయినా మీరు వెళ్ళి ‘మీ సహోదరునితో సమాధానపడాలి’ అని యేసు చెబుతున్నాడు. గ్రీకు మూలపాఠం ప్రకారం, యేసు ఇక్కడ ఉపయోగించిన పదం ‘పరస్పర శత్రుత్వం తర్వాత పరస్పరం రాజీపడడాన్ని సూచిస్తుంది.’ (వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌) వాస్తవానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు, ఇద్దరూ అపరిపూర్ణులు గనుకా పొరపాటు చేసే అవకాశం ఉంది గనుకా ఇద్దరి వైపు నుండి కొంత తప్పు జరిగే ఉండవచ్చు. సాధారణంగా దీనికి పరస్పరం రాజీ పడడం అవసరం.

తప్పెవరిది, ఒప్పెవరిది అన్నది కాదు కానీ సమాధానపడడానికి ఎవరు చొరవ తీసుకుంటారన్నదే ప్రశ్న. కొరింథులోని క్రైస్తవులు ఆర్థిక గొడవల వంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలను బట్టి తమ తోటి దేవుని సేవకులను లౌకిక కోర్టులకు తీసుకువెళుతున్నారని అపొస్తలుడైన పౌలు గమనించినప్పుడు, ఆయన వారినిలా సరిదిద్దాడు: “అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?” (1 కొరింథీయులు 6:⁠7) లౌకిక కోర్టుల్లో అందరూ వినేలా తమ వ్యక్తిగత భేదాభిప్రాయాలను వ్యక్తపర్చడాన్ని నిరుత్సాహపరచడానికి పౌలు ఇలా చెప్పినప్పటికీ దాని వెనుకనున్న సూత్రం స్పష్టంగా ఇలా ఉంది: ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిరూపించడం కంటే తోటి విశ్వాసుల మధ్య సమాధానం ఉండడం ప్రాముఖ్యం. ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకోవడం, మనం తమ పట్ల తప్పు చేశామని భావించే వారికి క్షమాపణ చెప్పడం సులభమయ్యేలా చేస్తుంది.

నిజాయితీ అవసరం

అయితే కొంతమంది ప్రజలు, క్షమాపణను వ్యక్తం చేయవలసిన మాటలను పదేపదే ఉపయోగిస్తారు. ఉదాహరణకు జపానులో, క్షమాపణ అడగడానికి ఉపయోగించే విలక్షణమైన పదమైన సూమీమాసెన్‌ వేలసార్లు వినిపిస్తుంది. తమపట్ల చూపించబడిన అనుగ్రహానికి అనుగుణంగా ప్రతిస్పందించలేకపోతున్నందుకు ఇబ్బంది పడుతుండడాన్ని సూచిస్తూ కృతజ్ఞతలు వ్యక్తపర్చడానికి కూడా ఆ పదాన్ని ఉపయోగించవచ్చు. దానికున్న బహుముఖ ఉపయోగాన్ని బట్టి, కొందరు ఈ పదం మరీ తరచుగా ఉపయోగించబడుతోందని భావిస్తూ ఆ పదాన్ని చెబుతున్నవారు నిజాయితీగా చెబుతున్నారా అని అనుకోవచ్చు. ఇతర సంస్కృతుల్లో కూడా క్షమాపణ చెప్పడమనే పదానికి సంబంధించిన వివిధ రూపాలు అతిగా ఉపయోగించబడుతున్నట్లు అనిపించవచ్చు.

ఏ భాషలోనైనా, క్షమాపణ చెప్పేటప్పుడు నిజాయితీగా ఉండడం ప్రాముఖ్యం. బాధ యొక్క యథార్థతను మాటలు, స్వరము తెలియజేయాలి. యేసుక్రీస్తు తాను కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో తన శిష్యులకిలా బోధించాడు: “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:​37) మనం క్షమాపణ చెబితే, నిజంగా మన ఉద్దేశం అదే అయ్యుండాలి! సోదాహరణంగా చెప్పాలంటే: ఒక విమానాశ్రయంలో చెక్‌-ఇన్‌ కౌంటర్‌ వద్ద లైనులో నిలబడి ఉన్న ఒక వ్యక్తి తన సూట్‌కేస్‌ లైనులో తన వెనుక నిలబడి ఉన్న స్త్రీకి తగిలినప్పుడు ఆమెను క్షమాపణ చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత, లైను కాస్త ముందుకు కదిలాక, ఆయన సూట్‌కేస్‌ మళ్ళీ ఆమెకు తగిలింది. మరోసారి, ఆ వ్యక్తి మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పాడు. మరోసారి మళ్ళీ అలాగే జరిగే సరికి, ఆ స్త్రీతోపాటు ప్రయాణిస్తున్న వ్యక్తి, క్షమాపణ చెప్పినప్పుడు నిజంగా ఆయన ఉద్దేశం అదే అయితే ఆ సూట్‌కేస్‌ మళ్ళీ ఆమెకు తగలకుండా చూసుకోమని అతనితో అన్నాడు. అవును, యథార్థంగా క్షమాపణ చెప్పినప్పుడు, దానితోపాటు ఆ పొరపాటును మళ్ళీ చేయకుండా ఉండాలనే నిశ్చయత కూడా ఉండాలి.

మనం యథార్థంగా క్షమాపణ చెబుతున్నట్లయితే, మనం మన తప్పును ఒప్పుకుని, క్షమించమని అడిగి, సాధ్యమైనంత మేరకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తాము. దానికి ప్రతిస్పందనగా, గాయపర్చబడిన వ్యక్తి కూడా పశ్చాత్తాపపడుతున్న తప్పిదస్థుడ్ని వెంటనే క్షమించాలి. (మత్తయి 18:21, 22; మార్కు 11:25; ఎఫెసీయులు 4:32; కొలొస్సయులు 3:​13) ఇరువర్గాల వారూ అపరిపూర్ణులే గనుక సమాధానపడడం ఎల్లప్పుడూ అంత సరళంగా జరగకపోవచ్చు. అయినప్పటికీ సమాధానపడడంలో క్షమాపణ చెప్పడం బలమైన ప్రభావంగా పనిచేస్తుంది.

క్షమాపణ చెప్పడం ఉచితంకాని సందర్భాలు

విచారాన్ని, బాధను వ్యక్తం చేసే పదాలు ఉపయోగించడం ఉపశమింపజేసే ప్రభావాన్ని చూపించి సమాధానపడడానికి దోహదపడినప్పటికీ, అలాంటి పదాలను ఉపయోగించడం సముచితం కానప్పుడు జ్ఞానవంతుడైన వ్యక్తి వాటిని ఉపయోగించడాన్ని నివారిస్తాడు. ఉదాహరణకు, ఆ అంశంలో దేవునిపట్ల యథార్థంగా ఉండడం ఇమిడి ఉందనుకోండి. యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.” (ఫిలిప్పీయులు 2:⁠8) అయితే, ఆయన తాను పడుతున్న బాధను తగ్గించుకోవడానికి తన నమ్మకాల విషయమై క్షమాపణ చెప్పలేదు. ప్రధానయాజకుడు “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నా[ను]” అన్నప్పుడు యేసు క్షమాపణ ఏమీ చెప్పలేదు. భయపడిపోయి క్షమాపణ చెప్పే బదులు యేసు ధైర్యంగా ఇలా సమాధానమిచ్చాడు: “నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతు[రు].” (మత్తయి 26:​63, 64) తన తండ్రియైన యెహోవా దేవునిపట్ల తన యథార్థతను పణంగా పెట్టి ప్రధానయాజకుడితో సమాధానపడడమనే తలంపే యేసుకు ఎన్నడూ కలుగలేదు.

క్రైస్తవులు అధికారంలో ఉన్న వారిని గౌరవిస్తారు, ఘనపరుస్తారు. అయినప్పటికీ వారు తాము దేవునికి విధేయులై ఉన్నందుకు, తమ సహోదరులపట్ల ప్రేమ కలిగివున్నందుకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు.​—⁠మత్తయి 28:19, 20; రోమీయులు 13:​5-7.

సమాధానపడడానికి అడ్డంకులు ఉండవు

మనం మన పితరుడైన ఆదాము నుండి అపరిపూర్ణతను, పాపాన్ని వారసత్వంగా పొందాము కాబట్టి నేడు మనం తప్పులు చేస్తాము. (రోమీయులు 5:12; 1 యోహాను 1:​10) ఆదాము పాపభరితమైన స్థితికి కారణం ఆయన సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే. అయితే, మొదట్లో ఆదాము హవ్వలు పరిపూర్ణంగా పాపరహితంగా ఉన్నారు, పరిపూర్ణమైన ఈ స్థితికి మానవులను తిరిగి తీసుకువస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన పాపాన్నీ దాని ప్రభావాలన్నిటినీ నిర్మూలిస్తాడు.​—⁠1 కొరింథీయులు 15:​56, 57.

దాని భావమేమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి! నాలుకను ఉపయోగించడం గురించి ఉపదేశిస్తూ యేసు సహోదరుడైన యాకోబు ఇలా అన్నాడు: “ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” (యాకోబు 3:⁠2) పరిపూర్ణ మానవుడు తన నాలుకను అదుపు చేసుకోగల్గుతాడు, అప్పుడతడు దాన్ని దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉండదు. ఆయన “తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” మనం పరిపూర్ణులమైనప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! అప్పుడు, వ్యక్తులందరూ సమాధానంగా ఉండడానికి ఏ అడ్డంకులూ ఉండవు. అయితే ఈ లోగా, చేసిన తప్పుకు నిజాయితీగా, సముచితంగా క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి ఎంతగానో సహాయపడగలదు.

[అధస్సూచి]

^ పేరా 8 బహుశా పౌలు కంటిచూపు సరిగా లేకపోవడం మూలంగా కావచ్చు ఆయన ప్రధానయాజకుడ్ని గుర్తించలేదు.

[5వ పేజీలోని చిత్రం]

పౌలు ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

[7వ పేజీలోని చిత్రం]

ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా ఉన్నప్పుడు, సమాధానపడడానికి ఏ అడ్డంకులూ ఉండవు