కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడు?

యేసు ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడు?

యేసు ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడు?

“అసంభవం!” యేసు జనన వృత్తాంతాన్ని వినగానే అనేకమంది క్రైస్తవేతరులు అలా అంటారు. ఒక కన్యక పురుష సంగమం లేకుండానే గర్భం ధరించి కుమారునికి జన్మనివ్వగలదనే విషయాన్ని నమ్మేందుకు అది వైజ్ఞానికమైనది కాదని వారు భావిస్తారు. మరి మీరేమనుకుంటున్నారు?

లండన్‌లోని ద టైమ్స్‌ పత్రిక 1984 లో ఒక ఉత్తరాన్ని ప్రచురించింది, అది ఈ విషయంపై తర్కిస్తూ, “అద్భుతాలకు వ్యతిరేకంగా వాదించడానికి విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించడం హేతుబద్ధం కాదు. అద్భుతాలు జరిగే అవకాశం లేదనే నమ్మకం ఎలాగైతే విశ్వాసానికి సంబంధించినదో, అద్భుతాలు జరిగే అవకాశం ఉందనే నమ్మకం కూడా అలాంటిదే” అని వ్యాఖ్యానించింది. ఆ ఉత్తరంపై బ్రిటీష్‌ యూనివర్సిటీల్లోని 14 మంది విజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్లు సంతకం చేశారు. “కన్యక ప్రసవించడాన్ని, సువార్తల్లోని అద్భుతాలను, క్రీస్తు పునరుత్థానాన్ని చారిత్రాత్మక సంఘటనలని మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం” అని వారు చెప్పారు.

అయినప్పటికీ, యేసు ఒక కన్యకకు జన్మించాడన్న విషయం ఒక వ్యక్తి మొదటిసారిగా విన్నప్పుడు తికమక పడడం అర్థం చేసుకోదగినదే. కన్యయైన యేసు తల్లితో, “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు” అని దేవదూత చెప్పినప్పుడు ఆమె కూడా కంగారు పడింది. అప్పుడు మరియ, “నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగు[ను?]” అని అడిగింది. దానికి ఆ దేవదూత, దేవుడు ఈ అద్భుతాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా చేస్తాడని, “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని” ఆమెకు వివరించాడు. (లూకా 1:​31, 34-37) మానవునిలో పునరుత్పత్తి అనే అద్భుతమైన ప్రక్రియను సృష్టించినవాడే, ఒక కన్యక పురుష సంయోగం లేకుండానే గర్భం ధరించేలా, ఆమె నుండి యేసు జన్మించేలా చేయగలడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి దానిలోని నియమాలను ఆయనే చక్కగా శృతి చేసినట్లయితే, పరిపూర్ణమైన ఒక మానవ కుమారుణ్ణి జనింప చేయడానికి మరియ అండకోశం నుండి ఒక అండాన్ని కూడా ఆయనే ఉపయోగించగలడు.

ఆ అవసరం ఎందుకు వచ్చింది?

మరియ గర్భం ధరించిన సమయానికి దైవభక్తిగల యోసేపుకు ఆమెతో నిశ్చితార్థం జరిగింది. ఒక దేవదూత యోసేపుకు కలలో కనబడి కన్యక అయిన ఆయన కాబోయే భార్య గర్భం ధరించడానికి గల అద్భుతమైన కారణాన్ని వివరించాడు. ఆ దేవదూత ఇలా అన్నాడు: “నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు[వు].” (మత్తయి 1:​20, 21) హీబ్రూలో యేసు అనే పేరుకు “యెహోవా రక్షణ” అని భావం. అది పాప మరణాల నుండి మనం రక్షించబడాల్సిన అవసరాన్నీ, అలాంటి రక్షణ కోసం యేసు ద్వారా యెహోవా దేవుడు చేసిన ఏర్పాటునూ మనకు గుర్తు చేస్తుంది.

మొదటి మానవుడైన ఆదాము పాపం చేయడం వల్ల అతని వారసులందరూ అపరిపూర్ణులుగా దేవుని నియమాలను ఉల్లంఘించే ఉన్ముఖతతో జన్మించారు. (రోమీయులు 5:​12) ఆదాము వారసులు పాపం నుండి రక్షించబడి పరిపూర్ణతను ఎలా పొందవచ్చు? న్యాయపు తులాభారాన్ని సమతూకపరచాలంటే ఆదాముకు సమానమైన విలువగల మరొక పరిపూర్ణమైన మానవ ప్రాణం చెల్లించబడాలి. అందుకే దేవుడు, యేసును పరిపూర్ణ మానవుడిగా అద్భుతమైన రీతిలో జనింపజేశాడు. ఆ కారణంగానే యేసు, తనను చంపడానికి శత్రువులను అనుమతించాడు. (యోహాను 10:​17, 18; 1 తిమోతి 2:​5, 6) యేసు పునరుత్థానుడై పరలోక జీవితానికి ఆరోహణమయ్యాక, “[నేను] మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము [మనుష్యుల సాధారణ సమాధి] యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” అని ఆయన దృఢంగా చెప్పగలిగాడు.​—⁠ప్రకటన 1:​18.

యేసు పాపభరిత మానవుల కోసం మరణము, పాతాళలోకాల సూచనార్థక తాళపుచెవులతో ఒక మార్గాన్ని తెరుస్తాడు, దాని ద్వారా వారు ఆదాము మానవులు నష్టపోయేలా చేసినదాన్ని తిరిగి పొందగలుగుతారు. యేసు ఇలా వివరించాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” (యోహాను 11:​25, 26) ఎంత అద్భుతమైన వాగ్దానం! అయితే యేసు మరణానికి మరో గొప్ప కారణం కూడా ఉంది.

అత్యంత ప్రాముఖ్యమైన కారణం

యేసు మరియ గర్భంలో పడడమే ఆయన జీవితానికి ఆరంభం కాదు. “నేను . . . పరలోకమునుండి దిగి వచ్చితిని” అని యేసు స్పష్టంగా తెలియజేశాడు. (యోహాను 6:​38) యేసు సృష్టి ఆరంభం నుండే ఆత్మ లోకంలో తన పరలోకపు తండ్రితోపాటు జీవించాడు. వాస్తవానికి బైబిలు ఆయనను ‘దేవుని సృష్టికి ఆదియైనవాడు’ అని వర్ణిస్తోంది. (ప్రకటన 3:​14) దేవుని పరిపాలనకు విరుద్ధంగా ప్రవర్తించేలా మొదటి మానవులను పక్కదారి పట్టించి ఒక దుష్ట దూత చేసిన తిరుగుబాటును యేసు పరలోకం నుండి చూశాడు. తాను దేవుని పరిపూర్ణ మానవ కుమారునిగా జన్మించాలని కోరుకోవడానికి యేసుకది అత్యంత ప్రాముఖ్యమైన హేతువయ్యింది. ఇంతకూ ఏమిటది?

ఈ విశ్వాన్ని పరిపాలించే హక్కు తన పరలోకపు తండ్రికే ఉందని నిరూపించడమే ఆ కారణం. యేసు భూమిపై తన జననం నుండి మరణం వరకు విశ్వసనీయంగా ఉండడం ద్వారా, యెహోవా తన ప్రాణులను పరిపాలించే విధానానికి లోబడి ఉండేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. యేసు, దేవుని శత్రువుల చేతుల్లో మరణించడానికి ముందు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి తాను ఎందుకు ఇష్టపడుతున్నాడో స్పష్టంగా తెలియజేశాడు. ఆయన తండ్రిని ప్రేమించాడు అని లోకము తెలుసుకోవడానికి అలా చేస్తున్నానని ఆయన చెప్పాడు. (యోహాను 14:​31) మొదటి మానవ జంట అయిన ఆదాము హవ్వలు అలాంటి ప్రేమనే గనుక పెంపొందించుకుని ఉండుంటే, తాము ఎదుర్కొన్న అతి సులభమైన పరీక్షలో తాము విశ్వాసులమని నిరూపించుకోగలిగి ఉండేవారు.​—⁠ఆదికాండము 2:​15-17.

యేసు చూపించిన విశ్వసనీయత దుష్ట దూత అయిన సాతాను అబద్ధికుడు అని కూడా స్పష్టం చేసింది. సాతాను పరలోకంలోని దేవదూతలందరి ఎదుట, “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని చెప్పడం ద్వారా దేవుణ్ణి, మానవుణ్ణి నిందించాడు. (యోబు 2:​1, 4) తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం మానవులందరూ దేవునికి అవిధేయులవుతారని సాతాను తప్పుగా ఆరోపించాడు.

పైన పేర్కొన్న వివాదాలు దేవుని పరిపాలనా హక్కును సవాలు చేశాయి. వాటిని పరిష్కరించడానికి, యేసు ఒక మానవుడిగా జన్మించి తన మరణం వరకు విశ్వసనీయంగా ఉండడానికి ఇష్టపడ్డాడు.

ఆ విధంగా, యేసు భూమిపై జన్మించడానికి ముఖ్య కారణం ఆయనే స్వయంగా చెప్పినట్లుగా, ‘సత్యమునుగూర్చి సాక్ష్యమివ్వడానికే.’ (యోహాను 18:​37, 38) దేవుని పరిపాలన పూర్తిగా న్యాయమైనదనీ, దానికి లోబడడం ద్వారా శాశ్వతమైన సంతోషం లభిస్తుందనీ ఆయన తన మాటల ద్వారా చేతల ద్వారా చూపిస్తూ సాక్ష్యమిచ్చాడు. యేసు తన మానవ జీవితాన్ని “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” ఇచ్చి, పాపభరిత మానవులు పరిపూర్ణతను, నిత్యజీవాన్ని పొందే మార్గాన్ని తెరవడానికి ఈ లోకంలోకి వచ్చానని కూడా వివరించాడు. (మార్కు 10:​45) ప్రాముఖ్యమైన ఈ విషయాలను గ్రహించాలంటే, మానవాళికి యేసు జనన వివరాల ఆవశ్యకముంది. అంతేకాదు, యేసు జన్మకు సంబంధించిన సంఘటనల్లో ఇతర ప్రాముఖ్యమైన పాఠాలూ ఉన్నాయి, వాటిని తరువాతి ఆర్టికల్‌ అందిస్తుంది.

[4వ పేజీలోని చిత్రాలు]

ఆదాము సంతానం పాపము నుండి ఎలా రక్షించబడగలదు?