కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తెలుసుకోదగిన దేవుడు

యెహోవా తెలుసుకోదగిన దేవుడు

యెహోవా తెలుసుకోదగిన దేవుడు

మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనదాన్ని మీరు కోల్పోయే అవకాశముందా? మీకు దేవుని గురించి కేవలం కొద్దిగానే తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రాముఖ్యమైనదాన్ని కోల్పోతున్నారు. ఎందుకు? ఎందుకంటే బైబిలులోని దేవుని గురించి తెలుసుకోవడం వల్ల జీవితంలో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విషయాన్ని లక్షలాదిమంది గ్రహించారు. ఈ ప్రయోజనాలు వెంటనే ఆరంభమై భవిష్యత్తులోనూ ఉంటాయి.

మనం తన గురించి తెలుసుకోవాలని బైబిలు గ్రంథకర్త అయిన యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని కీర్తనకర్త వ్రాశాడు. యెహోవా గురించి తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన గుర్తించాడు. “నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.” మహోన్నతుడైన యెహోవా దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాము?​—⁠కీర్తన 83:​18; యెషయా 48:​17.

ఒక నిజమైన ప్రయోజనం ఏమిటంటే మన దైనందిన సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన మార్గదర్శకం, భవిష్యత్తు గురించి స్థిరమైన నిరీక్షణా మనశ్శాంతీ లభిస్తాయి. అంతేకాదు యెహోవాను సన్నిహితంగా తెలుసుకోవడం వల్ల, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నల గురించి భిన్నమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించుకొనేలా కదిలించబడతాం. ఏమిటా ప్రశ్నలు?

మీ జీవితానికి సంకల్పం ఉందా?

మానవాళి సాంకేతికపరంగా అద్భుతమైన అభివృద్ధి సాధించినప్పటికీ ప్రజలు, ‘నేనిక్కడ ఎందుకున్నాను? నేనెక్కడికి వెళ్తున్నాను? జీవిత సంకల్పమేమిటి?’ వంటి ప్రధానమైన ప్రశ్నలను ఇప్పటికీ అడుగుతున్నారు. వీటికి సంతృప్తికరమైన జవాబులు ఒక వ్యక్తికి లభించకపోతే అతని జీవితానికి నిజమైన సంకల్పమనేది లేకుండాపోతుంది. ఈ లోపాన్ని అనేకమంది గ్రహిస్తున్నారా? 1990 చివరి దశలో జర్మనీలో జరిగిన ఒక సర్వేకు ప్రతిస్పందించిన వారిలో సగం మంది తరచూ లేదా అప్పుడప్పుడు తమ జీవితానికి సంకల్పమంటూ ఏమీ లేదన్నట్లుగానే భావించారని ఆ సర్వే వెల్లడి చేసింది. బహుశా మీరు జీవిస్తున్న ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితే ఉండవచ్చు.

జీవితానికి ఒక సంకల్పమంటూ ఏమీ లేని వ్యక్తికి తన లక్ష్యాలను నిర్మించుకోవడానికి సరైన పునాది ఉండదు. చాలామంది విజయవంతమైన జీవితగమనాన్ని లేదా సంపదలను సమకూర్చుకోవడాన్ని ధ్యేయంగా చేసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా ఆ లోటు లోటుగానే ఉండిపోవచ్చు. జీవితానికి సంకల్పం లేకపోవడం కొందరిని ఎంతగా కలవరపరుస్తుందంటే వారిక జీవించడానికి కూడా ఇష్టపడరు. అందమైన ఒక యువతి అనుభవం అలాగే ఉంది, ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ ప్రకారం, “గొప్ప సంపదలు, ఎనలేని హోదాల” మధ్య ఆమె పెరిగింది. ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ ఒంటరితనాన్ని అనుభవించింది, తన జీవితానికి సంకల్పమంటూ ఏమీ లేనట్లే భావించింది. చివరికి ఆమె నిద్ర మాత్రలు మింగి మరణించింది. అలా తమ జీవితాలను విషాదకరంగా అంతం చేసుకున్నవారి గురించి, ఒంటరితనంతో బాధపడుతున్నవారి గురించి మీకు తెలిసి ఉండవచ్చు.

అయినా విజ్ఞానశాస్త్రం జీవితానికి సంబంధించిన అన్ని విషయాల గురించి వివరించగలదని ప్రజలు అనడాన్ని మీరు విన్నారా? డీ వోక్‌ అనే జర్మనీ వారపత్రిక ఇలా పేర్కొంది: “విజ్ఞానశాస్త్రం నిజమే కావచ్చు కానీ అది ఆధ్యాత్మికపరంగా బలహీనమైనదే. ఊహకందని దాని అస్థిరమైన అభిప్రాయాలను బట్టి చూస్తే పరిణామ సిద్ధాంతమేకాదు క్వాంటమ్‌ భౌతికశాస్త్రము కూడా అపరిణత స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది, అది దేన్నైనా ఇవ్వగలదేమో కానీ ఓదార్పును, భద్రతను మాత్రం ఇవ్వలేదు.” విజ్ఞానపరమైన ఆవిష్కరణలు జీవితాన్ని వివిధ రీతుల్లో వర్ణించడానికీ జీవితాన్ని కాపాడే సహజమైన ప్రక్రియలను, కార్యకలాపాలను వివరించడానికీ ఎంతో దోహదపడ్డాయి. అయినప్పటికీ మనమిక్కడ ఎందుకున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నామనే విషయాలను విజ్ఞానశాస్త్రం మనకు చెప్పలేదు. మనం పూర్తిగా విజ్ఞానశాస్త్రం పైనే ఆధారపడినట్లయితే, జీవిత సంకల్పం గురించిన మన ప్రశ్నలకు జవాబులు లభించవు. దాని ఫలితంగా, స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ అనే వార్తాపత్రిక నివేదించినట్లు, “మనకు మార్గదర్శకం చాలా అవసరం.”

అలాంటి మార్గదర్శకం ఇవ్వడానికి సృష్టికర్త గాక ఇంకెవరు సరైన స్థానంలో ఉన్నారు? ప్రాథమికంగా భూమ్మీద ప్రజలను ఉంచింది ఆయనే కాబట్టి, వారిక్కడ ఎందుకున్నారో ఆయనకే తెలిసుండాలి. మానవులు తమ సంతానంతో భూమిని నింపి దాని సంరక్షకులుగా దాన్ని శ్రద్ధగా చూసుకునేందుకు యెహోవా వారిని సృష్టించాడని బైబిలు తెలియజేస్తోంది. మానవులు తమ కార్యకలాపాలన్నిటిలోనూ న్యాయం, జ్ఞానం, ప్రేమ వంటి ఆయన లక్షణాలను ప్రతిబింబింపజేయాలి. యెహోవా మనల్ని ఎందుకు సృష్టించాడన్నది ఒకసారి అర్థం చేసుకున్నామంటే మనమిక్కడ ఎందుకున్నామో సులభంగా తెలుస్తుంది.​—⁠ఆదికాండము 1:​26-28.

మీరేమి చేయవచ్చు?

‘నేనిక్కడ ఎందుకున్నాను? నేనెక్కడికి వెళ్తున్నాను? జీవిత సంకల్పమేమిటి?’ వంటి ప్రశ్నలకు మీకు గతంలో సంతృప్తికరమైన జవాబులు లభించకపోయినట్లయితే అప్పుడెలా? యెహోవాను సన్నిహితంగా తెలుసుకొమ్మని బైబిలు మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” దేవుని లక్షణాలను పెంపొందించుకొని ప్రత్యేకించి ప్రేమను పెంపొందించుకొని త్వరలో రానున్న దేవుని మెస్సీయా రాజ్య పాలనకు లోబడి జీవించడాన్ని మీ లక్ష్యంగా చేసుకొమ్మని కూడా మీరు ప్రోత్సహించబడుతున్నారు. అప్పుడు మీ జీవితానికి ఒక సంకల్పం ఉంటుంది, భవిష్యత్తు గురించి అద్భుతమైన సురక్షితమైన నిరీక్షణ ఉంటుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తికమక పెట్టిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు లభించవచ్చు.​—⁠యోహాను 17:⁠3; ప్రసంగి 12:​13.

అది మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎలాంటి ప్రభావం చూపిస్తుందో హాన్స్‌కు తెలుసు. * కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు దేవుని మీద సాధారణ నమ్మకమే ఉండేది, కానీ ఆ నమ్మకం హాన్స్‌ జీవితంపై ఎలాంటి ప్రభావమూ చూపించలేదు. హాన్స్‌ మాదకద్రవ్యాలతో, స్త్రీలతో, చిన్న చిన్న నేరాలతో, మోటారుసైకిళ్ళతో ఆనందిస్తూ జీవితాన్ని గడిపాడు. “కానీ జీవితం నిరర్థకంగా ఉండేది, నిజంగా సంతృప్తినిచ్చేది కాదు” అని ఆయన చెబుతున్నాడు. హాన్స్‌ తన 20వ పడి మధ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తగా బైబిలు చదవడం ద్వారా దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయన యెహోవాను సన్నిహితంగా తెలుసుకొని జీవిత సంకల్పమేమిటో అర్థం చేసుకున్న వెంటనే తన జీవన శైలిని మార్చుకొని ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందాడు. ఆయన గత పది సంవత్సరాల నుండి పూర్తికాల సేవ చేస్తున్నాడు. ఆయన నిర్మొహమాటంగా ఇలా అంటున్నాడు: “యెహోవాను సేవించడం అత్యంత శ్రేష్ఠమైన జీవనవిధానం. దానికి ఏదీ సాటిరాదు. యెహోవాను తెలుసుకోవడం వల్ల నా జీవితానికొక సంకల్పం లభించింది.”

చాలామందిని కలవరపరిచేది కేవలం జీవిత సంకల్పం గురించిన ప్రశ్న మాత్రమే కాదన్నది నిజమే. ప్రపంచంలోని పరిస్థితులు దిగజారిపోతుండగా చాలామంది ప్రజలు మరో ప్రధాన ప్రశ్నతో కలత చెందుతున్నారు.

ఎందుకిలా జరిగింది?

దుస్థితిలో ఉన్నప్పుడు ఎందుకిలా జరిగింది అనే ప్రశ్న మీదే తరచుగా బాధితుల మనస్సు కేంద్రీకృతమవుతుంది. ఆ ప్రశ్నకు సరైన జవాబు పొందడంపైనే దుస్థితిని మానసికంగా తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దానికి సంతృప్తికరమైన జవాబు లభించకపోతే బాధ అలాగే కొనసాగుతుంది, బాధితులు విసిగిపోవచ్చు కూడా. ఉదాహరణకు బ్రూనీ ఉదాహరణ తీసుకోండి.

బ్రూనీ అనే మధ్య వయస్కురాలైన ఒక తల్లి ఇలా చెబుతోంది: “కొన్ని సంవత్సరాల క్రితం నా కూతురు శిశువుగానే చనిపోయింది. నాకు దేవుని మీద నమ్మకముండేది కాబట్టి స్థానిక ప్రీస్టు నుండి ఓదార్పు లభిస్తుందేమోనని చూశాను. దేవుడు నా కూతురు సూసాన్‌ను పరలోకానికి తీసుకువెళ్ళాడని, ఇప్పుడామె అక్కడ ఒక దేవదూతగా ఉంటుందని ఆయన నాతో చెప్పాడు. నా కూతురు మరణం వల్ల నా జీవితం చైతన్యరహితమవడమే కాక దేవుడు ఆమెను తీసుకువెళ్ళినందుకు నేను ఆయనను ద్వేషించాను కూడా.” బ్రూనీ వేదన, బాధ కొన్నేళ్ళపాటు కొనసాగాయి. “కొంతకాలం తర్వాత ఒక యెహోవాసాక్షి, నేను దేవుణ్ణి ద్వేషించడానికి ఎలాంటి కారణమూ లేదని నాకు బైబిలు నుండి చూపించింది. యెహోవా సూసాన్‌ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు, ఆమె ఒక దేవదూత కాదు. మానవ అపరిపూర్ణతే ఆమె అనారోగ్యానికి కారణం. సూసాన్‌ మరణంలో నిద్రిస్తోంది, పునరుత్థానం చేయబడడానికై ఆమె యెహోవా కోసం ఎదురుచూస్తోంది. ఆయన మానవులను భూపరదైసుపై నిరంతరం జీవించడానికి సృష్టించాడని, అది త్వరలోనే నిజమవుతుందని కూడా నేను తెలుసుకున్నాను. యెహోవా నిజంగా ఎలాంటి వ్యక్తో నేను అర్థం చేసుకోవడం ప్రారంభించగానే, నేను ఆయనకు సన్నిహితమయ్యాను, నా బాధ తగ్గడం మొదలైంది.”​—⁠కీర్తన 37:​29; అపొస్తలుల కార్యములు 24:​14, 15; రోమీయులు 5:​12.

వ్యక్తిగతంగా ఎదుర్కొనే విషాదం, యుద్ధం, కరవు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటిలో ఏదో ఒక దాని కారణంగా లక్షలాదిమంది దుస్థితికి గురయ్యారు. బ్రూనీ తన దుస్థితికి యెహోవా బాధ్యుడు కాదనీ, మానవులు బాధపడాలని ఆయన ఎన్నడూ ఉద్దేశించలేదనీ, ఆయన త్వరలోనే దుష్టత్వాన్ని అంతమొందిస్తాడనీ బైబిలు నుండి తెలుసుకోగానే ఆమెకు ఒక్కసారిగా తెప్పరిల్లినట్లయింది. దుష్టత్వం అధికమవుతోందనే ఈ వాస్తవమే మనం ప్రస్తుతం ఈ దుష్ట విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామనడానికి ఒక సూచన. మనమందరమూ ఎదురు చూస్తున్న మెరుగైన స్థితిని తెచ్చే నాటకీయమైన మార్పు అతి సమీపంలో ఉంది.​—⁠2 తిమోతి 3:​1-5; మత్తయి 24:7, 8.

దేవుని గురించి తెలుసుకోవడం

హాన్స్‌కు, బ్రూనీకి దేవుని గురించి ఒకే విధమైన సాధారణ తలంపు ఉండేది. ఆయన గురించి ఎక్కువగా తెలియకుండానే వారు ఆయనలో నమ్మకముంచారు. వారు యెహోవాను ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమయం వెచ్చించినప్పుడు వారి ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించింది. వారు మన కాలంలోని అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులను పొందారు. అది వారికి మనశ్శాంతిని, భవిష్యత్తు గురించిన సురక్షితమైన నిరీక్షణను ఇచ్చింది. లక్షలాదిమంది యెహోవా సేవకులకు అలాంటి అనుభవమే ఉంది.

యెహోవా గురించి తెలుసుకోవడం బైబిలును జాగ్రత్తగా పరిశీలించడంతో ప్రారంభమవుతుంది, అది ఆయన గురించీ ఆయన మన నుండి ఏమి కోరుతున్నాడనే దాని గురించీ చెబుతుంది. మొదటి శతాబ్దంలో కొందరు అలాగే చేశారు. గ్రీసులోనున్న బెరయలోని యూదుల సంఘ సభ్యులు “ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి” అని చరిత్రకారుడూ, వైద్యుడూ అయిన లూకా నివేదించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 17:​10, 11.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘాల్లో కూడా సమకూడారు. (అపొస్తలుల కార్యములు 2:​41, 42, 46; 1 కొరింథీయులు 1:​1, 2; గలతీయులు 1:​1, 2; 2 థెస్సలొనీకయులు 1:⁠1) నేడు కూడా అలాగే జరుగుతోంది. యెహోవాసాక్షుల సంఘాలు యెహోవాకు సన్నిహితమవడానికీ ఆయన సేవలో ఆనందం పొందడానికీ సహాయపడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన కూటాల కోసం ఒకచోట సమకూడతాయి. స్థానిక సాక్షులతో సహవసించడం మరొక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మానవులు నెమ్మది నెమ్మదిగా తాము ఆరాధించే దేవుని మాదిరిని అనుకరిస్తారు కాబట్టి యెహోవాసాక్షులు​—⁠పరిమితంగానే అయినా​—⁠యెహోవా స్వయంగా వ్యక్తం చేసే లక్షణాలను కనబరుస్తారు. కాబట్టి సాక్షులతో సమకూడడం యెహోవాను మరింత బాగా తెలుసుకోవడానికి మనకు దోహదపడుతుంది.​—⁠హెబ్రీయులు 10:​24, 25.

కేవలం ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉందే అనిపిస్తోందా? తప్పకుండా కృషి అవసరమే. మీ జీవితంలో మీరు సాధించాలనుకునే అనేక విషయాలకు కూడా కృషి అవసరం కాదంటారా? అగ్రస్థానంలో ఉన్న ఒక క్రీడాకారుడు శిక్షణ పొందేటప్పుడు ఎంత కష్టపడతాడో ఆలోచించండి. ఉదాహరణకు ఒలింపిక్స్‌ స్కీయింగ్‌ గోల్డ్‌ మెడలిస్టు ఫ్రాన్సుకు చెందిన జేన్‌ క్లాడ్‌ కీలీ, అంతర్జాతీయ ఆటల్లో విజయవంతమైన పోటీదారునిగా నిలబడడానికి ఏమి అవసరమవుతుందో ఇలా చెబుతున్నాడు: “మీరు ఒలింపిక్స్‌కు 10 సంవత్సరాల ముందు నుండి సిద్ధపడడం ప్రారంభించాలి, సంవత్సరాలపాటు ప్రణాళిక వేసుకోవాలి, దాని గురించి ప్రతిరోజు ఆలోచించాలి . . . అది మానసికంగా, శారీరకంగా సంవత్సరంలో 365 రోజులు చేసే పని.” ఆ సమయమూ కృషీ అంతా కేవలం పది నిమిషాలపాటు ఉండే పరుగు పందెంలో పాల్గొనడానికి మాత్రమే! యెహోవా గురించి తెలుసుకోవడం ద్వారా పొందేది మరెంతో ఎక్కువ కాలం ఉంటుంది, మరి దాని కోసం ఇంకెంత కష్టపడాలి?

మరింత సన్నిహితమయ్యే సంబంధం

జీవితంలో ప్రాముఖ్యమైనదాన్ని పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు? ఎవ్వరూ కోరుకోరు. కాబట్టి మీ జీవితానికి నిజమైన సంకల్పం లోపించిందని గానీ దుస్థితి ఎందుకు కలుగుతుందో తెలుసుకోవాలని గానీ మీకేమాత్రం అనిపించినా, బైబిలులోని దేవుడైన యెహోవాను తెలుసుకోవాలని స్థిరంగా నిర్ణయించుకోండి. ఆయన గురించి తెలుసుకోవడం మీ జీవితాన్ని శాశ్వతంగా మంచిగా మార్చివేయగలదు.

మనం యెహోవా గురించి తెలుసుకోవడాన్ని ఎన్నటికైనా ఆపుతామా? అనేక సంవత్సరాల నుండి ఆయనను సేవిస్తున్నవారు ఆయన గురించి తెలుసుకున్న వాటి గురించీ, ఆయన గురించి నిరంతరం తెలుసుకొంటున్న కొత్త విషయాల గురించీ ఇప్పటికీ అబ్బురపడుతుంటారు. అలాంటి విషయాలను తెలుసుకోవడం మనల్ని సంతోషపరచడమే కాక మనల్ని ఆయనకు మరింత సన్నిహితం చేస్తుంది. “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?” అని వ్రాసిన అపొస్తలుడైన పౌలు తలంపులతో మనమూ ఏకీభవించుదాం.​—⁠రోమీయులు 11:​33, 34.

[అధస్సూచి]

^ పేరా 12 పేర్లు మార్చబడ్డాయి.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలను అడుగుతారు: ‘నేనిక్కడ ఎందుకున్నాను? నేనెక్కడికి వెళ్తున్నాను? జీవిత సంకల్పమేమిటి?’

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“యెహోవా నిజంగా ఎలాంటి వ్యక్తో నేను అర్థం చేసుకోవడం ప్రారంభించగానే నేను ఆయనకు సన్నిహితమయ్యాను”

[7వ పేజీలోని బ్లర్బ్‌]

“యెహోవాను సేవించడం అత్యంత శ్రేష్ఠమైన జీవనవిధానం. దానికి ఏదీ సాటిరాదు. యెహోవాను తెలుసుకోవడం వల్ల నా జీవితానికొక సంకల్పం లభించింది”