కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞానయుక్తమైన నిర్ణయాలను మీరెలా తీసుకోవచ్చు?

జ్ఞానయుక్తమైన నిర్ణయాలను మీరెలా తీసుకోవచ్చు?

జ్ఞానయుక్తమైన నిర్ణయాలను మీరెలా తీసుకోవచ్చు?

“జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను చెప్పాడు. మనలో చాలామందిమి కేవలం ఇతరులిచ్చిన సలహాను నిర్లక్ష్యం చేయడంవల్ల కొన్నిసార్లు అవివేకమైన నిర్ణయాలు తీసుకున్నాము.​—⁠సామెతలు 1:⁠5.

సొలొమోను చెప్పిన ఆ మాటలు, ఆయన కూర్చిన “మూడు వేల సామెతల”తోపాటు ఆ తర్వాత బైబిలులో వ్రాయబడ్డాయి. (1 రాజులు 4:​32) ఆయన జ్ఞానయుక్తమైన మాటలను తెలుసుకొని, వాటిని లక్ష్యపెట్టడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చా? తప్పకుండా. “జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు” అవి మనకు సహాయం చేస్తాయి. (సామెతలు 1:​2, 3) మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయగల ఐదు బైబిలు ఆధారిత సూత్రాలను మనం పరిశీలిద్దాం.

దీర్ఘకాలిక పర్యవసానాల గురించి ఆలోచించండి

కొన్ని నిర్ణయాలకు గంభీరమైన పర్యవసానాలుంటాయి. కాబట్టి ఆ పర్యవసానాలెలా ఉండగలవో ముందుగానే ఆలోచించడానికి ప్రయత్నించండి. తలెత్తగల అవాంఛితమైన దీర్ఘకాలిక పర్యవసానాలను తాత్కాలిక ప్రయోజనాలు కనుమరుగు చేయకుండా జాగ్రత్త వహించండి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని సామెతలు 22:3 హెచ్చరిస్తోంది.

తాత్కాలిక ప్రయోజనాలను, దీర్ఘకాలిక పర్యవసానాలను ఒక కాగితంపై వ్రాసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. ఒక నిర్దిష్టమైన ఉద్యోగం చేయాలని ఎంపిక చేసుకోవడం వల్ల మంచి జీతం, ఆనందకరమైన పనిలాంటి తాత్కాలిక ఫలితాలు కలుగవచ్చు. కానీ దీర్ఘకాలిక పర్యవసానాల్లో భాగంగా, ఉద్యోగమైతే ఉంది కానీ జీవితానికి నిజమైన భవిష్యత్తు లేకుండా ఉండే అవకాశం ఉందా? ఆ ఉద్యోగం కారణంగా చివరకు మీరు మీ స్నేహితులను, కుటుంబ సభ్యులను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చే అవకాశముందా? అది మిమ్మల్ని హానికరమైన పరిస్థితుల్లో పడవేసే అవకాశం ఉండవచ్చా, మిమ్మల్ని నిరాశకు గురిచేసేంత అనాసక్తికరంగా ఉండే అవకాశం ఉందా? అనుకూలతలను, అననుకూలతలను జాగ్రత్తగా పరిశీలించి, ఆ తర్వాత దేనికి ప్రాధాన్యతనివ్వాలో నిర్ణయించుకోండి.

తగినంత సమయం తీసుకోండి

హడావుడిగా తీసుకొన్న నిర్ణయాలు అవివేకమైన నిర్ణయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామెతలు 21:5 మనకు ఇలా హెచ్చరిక చేస్తోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు, తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” ఉదాహరణకు వ్యామోహంలో పడిన యౌవనస్థులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు సమయం తీసుకోవాలి. లేకపోతే, 18వ శతాబ్దపు తొలిభాగానికి చెందిన ఆంగ్ల నాటక రచయిత మాటలు నిజమేనని వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆయన ఇలా అన్నాడు: “హడావుడిగా వివాహం చేసుకుంటే, తీరిగ్గా పశ్చాత్తాపపడవలసి వస్తుంది.”

అయితే తగినంత సమయం తీసుకోవడమంటే పనులను వాయిదా వేయడమని కాదు. కొన్ని నిర్ణయాలు ఎంత ప్రాముఖ్యమైనవంటే, వాటిని సాధ్యమైనంత త్వరగా తీసుకోవడమే జ్ఞానయుక్తమైనది. అనవసరంగా ఆలస్యం చేస్తే అది మనకు లేదా ఇతరులకు ఎంతో నష్టాన్ని కలుగజేయవచ్చు. నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడమే ఒక నిర్ణయంగా, బహుశా అవివేకమైన నిర్ణయంగా మారిపోవచ్చు.

ఉపదేశాన్ని స్వీకరించండి

ఏ రెండు పరిస్థితులు పూర్తిగా ఒకేలా ఉండవు కాబట్టి, ఒకేవిధమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఖచ్చితంగా ఒకేవిధమైన నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయినప్పటికీ, మనకు ఎదురైనటువంటి పరిస్థితులు ఇతరులకు ఎదురైనప్పుడు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది. వారు తాము తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఎలా దృష్టిస్తున్నారో అడగండి. ఉదాహరణకు, ఒక వృత్తిని ఎంపిక చేసుకునేటప్పుడు, ఇప్పటికే ఆ వృత్తిని చేపట్టిన వ్యక్తులను దానికి సంబంధించిన అనుకూలతలను, అననుకూలతలను వివరించమని అడగండి. వారి ఎంపికవల్ల కలిగిన ప్రయోజనాలేమిటని వారు గ్రహించారు, దానివల్ల కలిగిన అననుకూలతలేమిటి లేదా ఎదురుకాగల ప్రమాదాలేమిటి?

“ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును” అని మనకు హెచ్చరించబడింది. (సామెతలు 15:​22) అయితే ఇతరుల ఉపదేశం విని వారి అనుభవాల నుండి నేర్చుకుంటున్నప్పుడు, చివరకు మనమే స్వయంగా నిర్ణయం తీసుకోవాలని, మనం తీసుకున్న నిర్ణయానికి మనమే బాధ్యత వహించాలని పూర్తిగా గ్రహించాలి.​—⁠గలతీయులు 6:4, 5.

చక్కగా శిక్షణపొందిన మనస్సాక్షిని లక్ష్యపెట్టండి

మనం ఏ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా జీవించాలనుకుంటామో ఆ సూత్రాలకు పొందికగా ఉండే నిర్ణయాలను తీసుకోవడానికి మన మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది. ఒక క్రైస్తవుడు, దేవుని తలంపులను ప్రతిబింబించేలా తన మనస్సాక్షికి శిక్షణనివ్వాలి. (రోమీయులు 2:​14, 15) దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:⁠6) అయితే కొన్ని పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు, అంటే చక్కగా శిక్షణపొందిన మనస్సాక్షిగల ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ముగింపులకు వచ్చి తద్వారా వేర్వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు.

కానీ దేవుని వాక్యంచే ఖచ్చితంగా ఖండించబడిన చర్యలకు సంబంధించిన అంశాల్లో మాత్రం, చక్కగా శిక్షణపొందిన మనస్సాక్షి అలాంటి తేడాలు లేకుండా చేస్తుంది. ఉదాహరణకు, బైబిలు సూత్రాల ద్వారా శిక్షణపొందని మనస్సాక్షి, స్త్రీపురుషులు తాము సహజీవనం చేయగలమో లేదో పరీక్షించుకోవడానికి వివాహానికి ముందే తాత్కాలికంగా కలిసి జీవించడానికి అనుమతించవచ్చు. తమ నిర్ణయం, తాము అవివేకంగా వివాహం చేసుకోకుండా ఆపుచేస్తుందని తర్కిస్తూ వారు తమ నిర్ణయం జ్ఞానయుక్తమైనదేనని తలంచవచ్చు. వారి మనస్సాక్షి వారిని ఖండించకపోవచ్చు. అయితే లైంగికతకు, వివాహానికి సంబంధించి దేవుని దృక్కోణాన్ని అవలంబించే ఎవరైనా సరే అలాంటి తాత్కాలిక అనైతిక ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు.​—⁠1 కొరింథీయులు 6:18; 7:1, 2; హెబ్రీయులు 13:⁠4.

మీ నిర్ణయాలు ఇతరులపై ఎలా ప్రభావం చూపుతాయో ఆలోచించండి

తరచూ మీ నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి స్నేహితులతో, బంధువులతో, లేదా మరింత ప్రాముఖ్యంగా దేవునితో మీకున్న అమూల్యమైన సంబంధాన్ని పాడుచేయగల అవివేకమైన, మూర్ఖమైన నిర్ణయాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకోకండి. సామెతలు 10:1 ఇలా చెబుతోంది: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.”

మరోవైపున, కొన్నిసార్లు మీరు ఎక్కువ ప్రాముఖ్యమైన స్నేహాలనో తక్కువ ప్రాముఖ్యమైన స్నేహాలనో ఎంపిక చేసుకోవడం అవసరమని గ్రహించండి. ఉదాహరణకు, మునుపు మీకున్న మతపరమైన దృక్కోణాలు లేఖనాలకు విరుద్ధమైనవని ఇప్పుడు తెలుసుకున్నారు కనుక వాటిని తిరస్కరించాలని మీరు నిర్ణయించుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు అంగీకరించిన దైవిక మార్గనిర్దేశాలకు అనుగుణంగా జీవించాలనే మీ కోరిక కారణంగా మీ వ్యక్తిత్వంలో పెద్ద మార్పులు చేసుకోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు. మీ నిర్ణయాన్ని మీ స్నేహితుల్లోని, బంధువుల్లోని కొందరు ఇష్టపడకపోవచ్చు కానీ దేవుణ్ణి సంతోషపరిచే నిర్ణయమేదైనప్పటికీ అది జ్ఞానయుక్తమైన నిర్ణయమే.

జ్ఞానయుక్తంగా అత్యంత గొప్ప నిర్ణయం తీసుకోండి

నేడు ప్రతి ఒక్కరూ జీవితాన్ని లేదా మరణాన్ని ఎంపిక చేసుకోవలసిన అవసరముందని సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు. సా.శ.పూ. 1473లో వాగ్దాన దేశపు సరిహద్దు దగ్గర బసచేసినప్పుడు ప్రాచీన ఇశ్రాయేలీయులకు అదే విధమైన పరిస్థితి ఎదురైంది. దేవుని ప్రతినిధిగా మాట్లాడుతూ మోషే వారికిలా చెప్పాడు: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉం[చాను] . . . నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.”​—⁠ద్వితీయోపదేశకాండము 30:19, 20.

మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నామని, “ఈ లోకపు నటన గతించుచున్నది” అని బైబిలు ప్రవచనాలు, బైబిలు వృత్తాంతం చూపిస్తున్నాయి. (2 తిమోతి 3:1; 1 కొరింథీయులు 7:​31) ప్రవచించబడిన మార్పు, దివాలా తీసిన మానవ వ్యవస్థ నాశనం చేయబడి దాని స్థానంలో దేవుని నీతియుక్తమైన నూతనలోకం స్థాపించబడడంతో ముగింపుకు వస్తుంది.

మనం ఆ నూతనలోకపు ప్రవేశ ద్వారంవద్ద ఉన్నాము. మీరు దేవుని రాజ్యంలో భూమిపై నిత్యజీవితం అనుభవించేందుకు ఆ నూతనలోకంలోకి ప్రవేశిస్తారా? లేక మీరు సాతాను విధానం నిర్మూలించబడినప్పుడు భూమిపైనుండి తీసివేయబడతారా? (కీర్తన 37:9-11; సామెతలు 2:​21, 22) ఇప్పుడు ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలనేది మీరే నిర్ణయించుకోవాలి, ఆ నిర్ణయం ఖచ్చితంగా జీవన్మరణాలకు సంబంధించినదే. సరైన నిర్ణయం, అంటే జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయం కావాలా?

మీరు జీవించాలని నిర్ణయించుకుంటే, ముందుగా దైవిక అవసరతల గురించి నేర్చుకోవాలి. ప్రజలకు ఈ అవసరతలను ఖచ్చితంగా తెలియజేయడంలో చర్చీలు చాలామేరకు విఫలమయ్యాయి. వాటి నాయకులు తరచూ తప్పుడు విషయాలను నమ్మడానికి, దేవునికి బాధకలిగించే పనులను చేయడానికి ప్రజలను తప్పుదోవ పట్టించారు. దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేందుకు వ్యక్తిగత నిర్ణయం తీసుకోవలసిన అవసరతను వివరించడాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. (యోహాను 4:​24) కాబట్టి చాలామంది ప్రజలు దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం లేదు. కానీ యేసు ఏమి చెప్పాడో గమనించండి: “నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.”​—⁠మత్తయి 12:30.

దేవుని వాక్యం గురించి మరింత జ్ఞానం సంపాదించుకునేందుకు యెహోవాసాక్షులు ప్రజలకు సంతోషంగా సహాయం చేస్తారు. వారు ఆయా వ్యక్తులతో లేదా గుంపులతో వారికి అనుకూలమైన సమయాల్లో, వారికి అనుకూలమైన ప్రాంతాల్లో క్రమంగా బైబిలు చర్చలను నిర్వహిస్తారు. ఈ ఏర్పాటును సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు స్థానిక సాక్షులను సంప్రదించాలి లేదా కావలికోట ప్రచురణకర్తలకు వ్రాయాలి.

దేవుడు కోరేవాటి గురించి కొందరికి ఇప్పటికే ప్రాథమిక జ్ఞానం ఉండివుండవచ్చు. బైబిలు సత్యవంతమైనదని, ఆధారపడదగినదని వారిప్పటికే దృఢంగా విశ్వసిస్తుండవచ్చు కూడా. అయినప్పటికీ వారిలో చాలామంది తమనుతాము దేవునికి సమర్పించుకోవాలనే నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేస్తున్నారు. ఎందుకు? దానికి అనేక కారణాలుండవచ్చు.

దేవునికి సమర్పించుకోవడంలోని ప్రాముఖ్యత బహుశా వారికి తెలియదా? యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.” (మత్తయి 7:​21) కేవలం బైబిలు జ్ఞానం ఉంటే సరిపోదు; చర్య తీసుకోవడం అవసరం. ఈ విషయంలో తొలి క్రైస్తవ సంఘం మనకు మాదిరినుంచింది. మొదటి శతాబ్దంలోని కొందరి గురించి మనం ఇలా చదువుతాము: “ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.” (అపొస్తలుల కార్యములు 2:41; 8:​12) కాబట్టి ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి, అది చెప్పేవాటిని నమ్మి, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకుంటే, తన సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకోకుండా అతనిని ఏమి ఆపుతుంది? (అపొస్తలుల కార్యములు 8:​34-38) అయితే దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలంటే, ఆయన ఈ చర్యను ఇష్టపూర్వకంగా, సంతోష హృదయంతో తీసుకోవాలి.​—⁠2 కొరింథీయులు 9:⁠7.

దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకోవడానికి తమకు తగినంత జ్ఞానం లేదని కొందరు భావించవచ్చు. కానీ ఒక క్రొత్త జీవన విధానాన్ని ప్రారంభించేవారెవరికైనా పరిమితమైన జ్ఞానమే ఉంటుంది. తనకు నేడు తెలిసినన్ని విషయాలు, తను తన వృత్తిని ప్రారంభించినప్పుడు కూడా తెలుసని ఏ నిపుణుడైనా చెప్పగలడా? దేవునికి సేవచేయాలని నిర్ణయించుకోవడానికి ప్రాథమిక బైబిలు బోధలకు మరియు సూత్రాలకు సంబంధించిన జ్ఞానం, వాటికి అనుగుణంగా జీవించాలనే యథార్థమైన కోరిక ఉంటే చాలు.

తమ నిర్ణయానికి తగినట్లు జీవించలేమేమో అనే భయంవల్ల కొందరు నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారా? మానవులు చేసుకునే చాలా ఒప్పందాల్లో కూడా విఫలమవుతామని కొంత చింతించడం ఇమిడివుంటుంది. వివాహం చేసుకొని గృహస్థుడ్ని కావాలని నిర్ణయించుకునే పురుషుడు తనకు తగినంత యోగ్యత లేదని భావించవచ్చు కానీ ఆయన అలా ఒప్పందం చేసుకోవడమనేది ఆయనకు సాధ్యమైనదంతా చేయడానికి ప్రేరకంగా పనిచేస్తుంది. అదేవిధంగా, క్రొత్తగా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకున్న యౌవనస్థునికి ఆక్సిడెంట్లకు సంబంధించి కొంత భయం ఉండవచ్చు, ప్రత్యేకించి వయోధికులైన డ్రైవర్లతో పోలిస్తే యువ డ్రైవర్లే ఎక్కువగా ఆక్సిడెంట్లకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని చూపించే గణాంకవివరాల గురించి అతనికి తెలిస్తే ఆయన అలా భయపడే అవకాశముంది. అయితే ఆ విషయాలు తెలిసి ఉండడమనేది అతను మరింత జాగ్రత్తగా డ్రైవ్‌ చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి అది ప్రయోజనకరంగా ఉండవచ్చు. అసలు డ్రైవింగ్‌ లైసెన్సే తీసుకోకుండా ఉండడమనేది ఖచ్చితంగా పరిష్కారం కాదు!

జీవించాలని నిర్ణయించుకోండి!

ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, మతపరమైన ప్రపంచ వ్యవస్థ, దానిని సమర్థించేవారు త్వరలోనే భూమిపై లేకుండా పోవడం ఖాయమని బైబిలు చూపిస్తోంది. అయితే జీవించాలని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకున్నవారు, దానికి అనుగుణంగా ప్రవర్తించేవారు నిలిచివుంటారు. నూతన ప్రపంచ సమాజానికి కేంద్ర బిందువుగావుండి, వారు దేవుడు మొదట ఉద్దేశించినట్లుగా భూమిని పరదైసులా మార్చడంలో భాగం వహిస్తారు. దేవుని నడిపింపు క్రింద మీరు ఆ ఆహ్లాదకరమైన పని చేయడంలో ఆనందిస్తారా?

అలా అయితే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించుకోండి. దేవుణ్ణి సంతోషపరచడానికి దైవిక అవసరతల గురించి నేర్చుకోవాలని నిర్ణయించుకోండి. ఆ అవసరతలకు తగినట్టు జీవించాలని నిర్ణయించుకోండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా చివరి వరకు మీ నిర్ణయాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి నిర్ణయించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవించాలని నిర్ణయించుకోండి!

[4వ పేజీలోని చిత్రాలు]

గంభీరమైన నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి

[5వ పేజీలోని చిత్రం]

వృత్తిని ఎంపిక చేసుకునేటప్పుడు ఇతరుల ఉపదేశం లక్ష్యపెట్టడానికి సుముఖంగా ఉండండి

[7వ పేజీలోని చిత్రాలు]

ఇప్పుడు దేవుని సేవచేయాలని నిర్ణయించుకునేవారు, భూమిని పరదైసుగా మార్చడంలో భాగం వహిస్తారు