కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యాకోబు ఆధ్యాత్మిక విలువలను ఉన్నతంగా పరిగణించాడు

యాకోబు ఆధ్యాత్మిక విలువలను ఉన్నతంగా పరిగణించాడు

యాకోబు ఆధ్యాత్మిక విలువలను ఉన్నతంగా పరిగణించాడు

యాకోబు జీవితమంతా సంఘర్షణలతో, విపత్తులతో సాగింది. యాకోబు తన కవల సోదరుడు తనను చంపేంత కోపం పెట్టుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెండ్లిచేసుకోవడానికి బదులు మొదట మరొకరిని చేసుకొనేలా మోసగించబడి చివరకు నలుగురు భార్యలతో, తత్ఫలితంగా అనేక సమస్యలతో సతమతమయ్యాడు. (ఆదికాండము 30:​1-13) ఆయన ఎవరి కోసం 20 సంవత్సరాలు పనిచేశాడో ఆ వ్యక్తి చేతనే మోసగించబడ్డాడు. దేవదూతతో కుస్తీపట్టి దాని ఫలితంగా శాశ్వత హాని అనుభవించాడు. అయన కుమార్తెపై అత్యాచారం జరగ్గా, కోపించిన ఆయన కుమారులు నరసంహారానికి పాల్పడ్డారు, అలాగే ఆయన ప్రియ కుమారుణ్ణి, భార్యను పోగొట్టుకొని దుఃఖాక్రాంతుడయ్యాడు. కరవు తప్పించుకోవడానికి వృద్ధ్యాప్యంలో బలవంతంగా వలసవెళ్లాడు. తను “జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా” ఉన్నాయని ఆయన ఒప్పుకున్నాడు. (ఆదికాండము 47:⁠9) ఇన్ని జరిగినా, యాకోబు దేవునిపై నమ్మకముంచిన ఒక ఆధ్యాత్మిక పురుషుడే. ఆయన సరైన దానిపై విశ్వాసం ఉంచలేదా? యాకోబు అనుభవాల్లో కేవలం కొన్నింటిని పరిశీలించడం నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?

తన సోదరునినుండి ఆయనెంతో భిన్నంగా ఉన్నాడు

యాకోబుకు తన సోదరుడైన ఏశావుతో ఏర్పడిన వైషమ్యానికి కారణమేమంటే ఆయన ఆధ్యాత్మిక సంపదలను అమూల్యమైనవిగా ఎంచుతుండగా ఏశావు వాటిని తృణీకరించడమే. అబ్రాహాముకు చేయబడిన నిబంధనా వాగ్దానంలో యాకోబు శ్రద్ధచూపి వారసులుగా దేవుడు నియమించిన కుటుంబ సంరక్షణకు తనను తాను అంకితం చేసుకున్నాడు. అందువల్ల యెహోవా ఆయనను ‘ప్రేమించాడు.’ యాకోబు “సాధువై” యుండెను. ఈ పదం నైతిక శ్రేష్ఠతను సూచిస్తుంది. దీనికి భిన్నంగా, ఏశావు తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని చిన్నచూపు చూశాడు అందుకే అల్ప విలువకు యాకోబుకు దాన్ని అమ్ముకున్నాడు. యాకోబు దేవుని ఆమోదంతో తన జేష్ఠత్వపు హక్కు తీసుకొని, తన అన్నకు దొరకవలసిన ఆశీర్వాదం తాను పొందినప్పుడు, ఏశావు క్రోధం పెంచుకున్నాడు. అప్పుడు యాకోబు తాను ప్రేమించిందంతా విడిచి పారిపోయాడు, అతనికేమైనా నిరాశాభావాలు కలిగివుంటే వాటిని ఆ తర్వాత జరిగింది నిశ్చయంగా తీసివేసి ఉంటుంది.​—⁠మలాకీ 1:2, 3; ఆదికాండము 25:27-34; 27:1-45.

ఒక స్వప్నంలో దేవుడు దేవదూతలు పరలోకానికి భూమికి మధ్యనున్న నిచ్చెనపై లేదా రాతిమెట్లపై ఎక్కుచు దిగుచు ఉండడాన్ని యాకోబుకు చూపి, యాకోబును అతని సంతానాన్ని కాపాడతానని చెప్పాడు. “భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను.”​—⁠ఆదికాండము 28:10-15.

ఎంత గొప్ప హామీ! అబ్రాహాముకు, ఇస్సాకుకు చేయబడిన వాగ్దానాలు యాకోబు కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా సంపన్నం చేస్తాయని యెహోవా ధృవీకరించాడు. దేవుని ఆమోదంగల వారికి దేవదూతలు సపర్యలు చేస్తారని యాకోబుకు తెలియజేయబడడంతోపాటు, అతనికి దేవుని రక్షణ ఉంటుందని హామీ ఇవ్వబడింది. కృతజ్ఞతాపూర్వకంగా దానిని గుర్తిస్తూ, యెహోవాకు తాను నమ్మకంగా ఉంటానని యాకోబు ప్రమాణం చేశాడు.​—⁠ఆదికాండము 28:16-22.

యాకోబు ఏ విధంగానూ ఏశావు స్వాస్థ్య సంపదను అక్రమంగా చేజిక్కించుకోలేదు. కుమారులు పుట్టకముందే ‘పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని’ యెహోవా చెప్పాడు. (ఆదికాండము 25:​23) ‘యాకోబే మొదట పుట్టేటట్టు దేవుడు చేసివుంటే పరిస్థితి సులభంగా ఉండేదికాదా?’ అని ఒకరు ప్రశ్నించవచ్చు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రాముఖ్యమైన సత్యాలు బోధించాయి. తమకు దక్కాలని భావించేవారి కోసం దేవుడు ఆశీర్వాదాలు ముందే నిలిపి ఉంచడు గాని తాను ఎంచుకున్న వారిపట్ల ఆయన తప్పక అనర్హ దయ చూపిస్తాడు. ఆ విధంగా జన్మహక్కును విలువైనదిగా పరిగణించని అతని అన్నకు కాదుగాని యాకోబుకు అది సంక్రమించింది. అదే ప్రకారం, సహజ యూదులు ఒక జనాంగముగా ఏశావువంటి దృక్పధమే చూపిన కారణంగా వారి స్థానం ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు ఇవ్వబడింది. (రోమీయులు 9:​6-16, 24) దేవుని భయంగల కుటుంబంలో లేదా పర్యావరణంలో ఒక వ్యక్తి జన్మించినప్పటికీ, యెహోవాతో మంచి సంబంధాలు అప్రయత్న వారసత్వ సంపదగా లభించవు. దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు దైవభక్తిగల వారిగా, ఆధ్యాత్మిక విషయాలపట్ల నిజమైన కృతజ్ఞతాభావంగల వారిగా ఉండడానికి తప్పక కృషిచెయ్యాలి.

లాబానుచే స్వాగతించబడ్డాడు

బంధువుల్లో తనకొక భార్యను చూసుకోవడానికి యాకోబు పద్దనరాముకు వచ్చినప్పుడు, లాబాను కూతురు, తన సమీపజ్ఞాతి అయిన రాహేలును ఒక బావి దగ్గర కలుసుకొని ఆమె మేపుతున్న పశువులకు నీరు పెట్టడానికి దానిమీదున్న బరువైన రాయిని తొలగించాడు. * రాహేలు ఇంటికి పరుగెత్తి యాకోబు వచ్చాడని చెప్పగానే, లాబాను పరుగెత్తుకొచ్చి ఆయనను కలుసుకున్నాడు. అబ్రాహాము సేవకుడు తన కుటుంబానికిచ్చిన ధనాన్ని ఒకవేళ లాబాను గుర్తుచేసుకుంటుంటే అతడు నిరాశచెందక తప్పదు, ఎందుకంటే యాకోబు వట్టి చేతుల్తో వచ్చాడు. అయితే, లాబాను తాను లాభం పొందే అవకాశం ఉందని గ్రహించాడు అదేమిటంటే పరిశ్రమించగల పనివాడిని అతనిలో చూశాడు.​—⁠ఆదికాండము 28:1-5; 29:1-14.

యాకోబు తన గాథ వినిపించాడు. జన్మహక్కు పొందడానికి తానుపయోగించిన యుక్తిని ప్రస్తావించాడో లేదో స్పష్టంగా తెలియదు అయితే లాబాను “ఈ సంగతులన్నియు” విన్న తర్వాత, ఇలా అన్నాడు: “నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు.” ఈ మాటలను, తనతోపాటు ఉండిపొమ్మని యాకోబుకు ఇవ్వబడిన వాత్సల్యపూరితమైన ఆహ్వానంగా లేదా రక్తసంబంధాన్నిబట్టి ఆయనను ఆదుకొనవలసిన బాధ్యత తనకుందని లాబాను అంగీకరించడంగా అర్థంచేసుకోవచ్చని ఒక విద్వాంసుడన్నాడు. ఏదేమైనా, లాబాను ఆ వెంటనే తన అల్లుడి నుండి ఎలా లాభం పొందవచ్చో ఆలోచించాడు.

రాగల 20 సంవత్సరాల్లో వివాదం కాగల అంశాన్ని లాబాను ప్రస్తావించాడు. “నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా?” అని అంటూ, “నీకేమి జీతము కావలెనో చెప్పుమని” అడిగాడు. లాబాను మేలుచేసే మామయ్య పాత్ర పోషించినా, యాకోబుతో తనకున్న రక్తసంబంధాన్ని అతను ఓ పనికుదుర్చుకునే ఒప్పందానికి దిగజార్చాడు. యాకోబు ప్రేమలో పడినందువల్ల దానికి, “నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.”​—⁠ఆదికాండము 29:15-20.

పిల్ల ఇంటివారికి కన్యాశుల్కం చెల్లించడంతో నిశ్చితార్థం అమల్లోకివస్తుంది. బలత్కరింపబడిన కన్యలకు మోషే ధర్మశాస్త్రం 50 తులముల వెండిని మూల్యంగా నియమించింది. ఇది “అత్యధిక వివాహ బహుమానం” అని, కాని అధికశాతం బహుమానాలు ఇంతకంటే ఎంతో “తక్కువగా” ఉండేవని విద్వాంసుడైన గోర్డన్‌ వెన్‌హమ్‌ నమ్ముతున్నాడు. (ద్వితీయోపదేశకాండము 22:​28, 29) యాకోబు ఆ సొమ్ము చెల్లించే ఏర్పాటు చేయలేకపోయాడు. లాబానువద్ద ఏడు సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. “ప్రాచీన బబులోనీయుల కాలంలో సాధారణ పనివాడికి నెలకు అర్ధ తులం నుండి ఒక తులం లోపు చెల్లించబడేది” (ఏడు సంవత్సరాలకు 42 నుండి 84 తులాలు) అని అంటూ వెన్‌హమ్‌ ఇంకా ఇలా చెప్పాడు: “రాహేలు చెయ్యి అందుకోవడానికి యాకోబు బహు ఉదారమైన వివాహ బహుమతి లాబానుకు ఇవ్వడానికి ముందుకొచ్చాడు.” లాబాను మారు మాట్లాడకుండా దానికి ఒప్పుకున్నాడు.​—⁠ఆదికాండము 29:19.

రాహేలును యాకోబు ఎంత ప్రగాఢంగా ప్రేమించాడంటే అతనికి ఏడు సంవత్సరాలు ‘కొద్ది దినాలుగానే తోచాయి.’ ఆ పిమ్మట, లాబాను మోసం చేస్తాడేమోనని కొద్దిగానైనా అనుమానించకుండా మేలిముసుగులో ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ మరుసటి ఉదయం తను రాహేలుతో కాదుగాని, ఆమె అక్క లేయాతో శయనించాడని తెలుసుకొని ఆయనెంత దిగ్భ్రాంతికి గురయ్యుంటాడో ఊహించండి! “నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితి[వి]” అని యాకోబు గట్టిగా అడిగాడు. దానికి లాబాను, “పెద్దదానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మా దేశ మర్యాదకాదు. ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెనుకూడ నీకిచ్చెదమని” సమాధానమిచ్చాడు. (ఆదికాండము 29:​20-27) వేరే దారిలేక చిక్కుల్లోపడ్డ యాకోబుకు రాహేలు దక్కాలంటే ఆయన ఆ షరతు అంగీకరించక తప్పలేదు.

మొదటి ఏడు సంవత్సరాల మాదిరిగా కాక, తర్వాతి సంవత్సరాలు అత్యంత భారంగా గడిచాయి. లాబాను చేసిన క్రూరమైన మోసాన్ని యాకోబు ఎలా మరచిపోగలడు? దానిలో పాత్ర వహించిన లేయా విషయమేమిటి? నిజానికి, లేయా రాహేలులకు తాను సిద్ధంచేసిన కల్లోలిత భవిష్యత్తుపై లాబానుకు అసలు ఆసక్తే లేదు. స్వీయాసక్తే అతని చింత. తను ఒకప్రక్క గొడ్రాలుగా ఉన్న సమయంలోనే, లేయాకు వెంటవెంటనే నలుగురు పిల్లలు కలగడంతో రాహేలు కోపానికి అసూయ తోడయ్యింది. పిల్లలు కావాలనే తీవ్రవాంఛగల రాహేలు తన తరఫున పిల్లలు కనడానికి తన దాసిని ఇవ్వగా, దానికి పోటీగా లేయా కూడ అలాగే చేసింది. దానితో సంతోషభరిత కుటుంబం మాట అటుంచి యాకోబుకు ఇప్పుడు నలుగురు భార్యలు, 12 మంది పిల్లలు అయ్యారు. అయినప్పటికీ, యాకోబును యెహోవా ఓ పెద్ద జనాంగంగా తయారుచేయనున్నాడు.​—⁠ఆదికాండము 29:28-30:24

యెహోవాచే సంపన్నుడయ్యాడు

కష్టాలొచ్చినా, వాగ్దానం చేసినట్లు దేవుడు తనతో ఉన్నాడని యాకోబు గ్రహించాడు. ఆ విషయాన్ని లాబాను కూడా గ్రహించాడు ఎందుకంటే, యాకోబు వచ్చినప్పుడు తన దగ్గరున్న కొన్ని పశువులు మేనల్లుడి పెంపకంలో బహుగా విస్తరించాయి. యాకోబును పంపడానికి ఇష్టపడని లాబాను మరింతకాలం పనిచేయడానికి ప్రత్యేకంగా ఏమికావాలంటూ బేరం పెట్టాడు, దానికి యాకోబు లాబాను మందలో అసాధారణ రంగులుగల పశువులు కావాలని అడిగాడు. ఆ ప్రాంతంలో సాధారణంగా గొర్రెలు తెల్లవిగాను మేకలు నల్లవిగా లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయని, కేవలం కొన్నిమాత్రమే భిన్నరంగుల పొడలతో ఉంటాయని చెప్పబడింది. అందువల్ల మంచి బేరమే దొరికిందని లాబాను దానికి వెంటనే ఒప్పుకొని, యాకోబు సంరక్షణలో మిగిలివున్న తన మందలోని అసాధారణ రంగుల పశువులతో తన మందలోని మిగతా జంతువులు కలవకుండా ఉండేందుకు వాటిని వెంటనే దూరం చేశాడు. చేసుకున్న ఒప్పందం ప్రకారం యాకోబుకు తక్కువే దక్కుతుందని అంటే ప్రాచీనకాల మందకాపరులకు జీతం కింద దొరికే కొత్తగా పుట్టిన దూడల్లోని గొర్రెపిల్లల్లోని 20 శాతం అతనికి ఎంతమాత్రం దక్కదని అతను నమ్మాడు. అయితే లాబాను నమ్మకం తప్పు, ఎందుకంటే యెహోవా యాకోబుకు తోడైయున్నాడు.​—⁠ఆదికాండము 30:​25-36.

దేవుని మార్గదర్శకం క్రింద, యాకోబు తాను కోరిన వర్ణంగల బలమైన పశువులు వృద్ధయ్యేటట్టు చూసుకున్నాడు. (ఆదికాండము 30:​37-42) ఆయన పశుసంవర్ధక ఆలోచనలు సరైనవికావు. అయితే, “విజ్ఞానశాస్త్రం ప్రకారం పొడలురావడానికి అప్రభావక జన్యువులుగల . . . ఏకవర్ణ జంతువులతో క్రమంగా జోడుకట్టించడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు, అలాంటి జంతువులను . . . [వాటికున్న] సంకరజాతి బలాన్నిబట్టి కనిపెట్టవచ్చు” అని విద్వాంసుడైన నాహుమ్‌ సార్నా వివరిస్తున్నాడు.

ఫలితాలు గమనించిన లాబాను తన మేనల్లుడికి చెందిన పశువులు అంటే చారలు, చుక్కలు, రంగు పొడలు లేదా మచ్చలుగల పశువులకు సంబంధించిన ఒప్పందాన్ని సవరించడానికి ప్రయత్నించాడు. లాబాను తన స్వలాభం చూసుకొని ఒప్పందాన్ని ఏవిధంగా సవరించినా అన్ని సందర్భాల్లో యాకోబు వర్ధిల్లేలా యెహోవా చూశాడు. లాబాను కేవలం పళ్లు కొరకడం తప్ప మరేం చేయలేకపోయాడు. యాకోబు అనతికాలంలోనే తన సొంత తెలివితో కాదుగాని యెహోవా తోడ్పాటుతో అపారమైన సంపదను, మందలను, సేవకులను, ఒంటెలను, గాడిదలను సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన రాహేలు లేయాలకు ఇలా వివరించాడు: “మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయనియ్యలేదు. . . . దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.” లాబాను చేస్తున్నదంతా తాను గమనించానని యాకోబు దాని గురించి బాధపడాల్సిన పనిలేదని కూడా యెహోవా ఆయనకు హామీయిచ్చాడు. “నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదను” అని దేవుడు చెప్పాడు.​—⁠ఆదికాండము 31:1-13; 32:⁠9.

ద్వంద ప్రమాణాల లాబానును విడిచి చివరికి యాకోబు తన స్వదేశానికి బయలువెళ్లాడు. 20 సంవత్సరాలు గడిచిపోయినా, ఏశావు భయమింకా ఆయనను విడిచిపెట్టలేదు, దానికితోడు ఏశావు నాలుగువందలమందితో వస్తున్నాడనే వార్త విన్నప్పుడు ఆయన మరింతగా భయపడ్డాడు. యాకోబు చేయగలిగిందేమిటి? సదా దేవునిపై నమ్మకముంచే ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయన విశ్వాసంతో ప్రవర్తించాడు. యెహోవా ఔదార్యానికి తాను పాత్రుడను కానని అంగీకరిస్తూ ఆయన ప్రార్థించాడు అలాగే ఏశావు బారినుండి తనను, తన కుటుంబాన్ని కాపాడతాననే దేవుని వాగ్దానాల ఆధారంగా ఆయనకు విన్నవించుకున్నాడు.​—⁠ఆదికాండము 32:2-12.

అప్పుడు తాను అనుకోని ఓ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఒక దేవదూత అని తేలిన, ఓ కొత్త వ్యక్తి యాకోబుతో ఒక రాత్రంతా పెనుగులాడి, ఒక్క దెబ్బతో యాకోబు తొడ గూడువసిలేలా చేశాడు. మొదట ఆ దేవదూత ఆశీర్వదించితేనేగాని యాకోబు పట్టువదల్లేదు. యాకోబు “కన్నీరు విడిచి అతని బతిమాలెను” అని ఆ తర్వాత హోషేయ ప్రవక్త చెప్పాడు. (హోషేయ 12:2-4; ఆదికాండము 32:​24-29) పూర్వం దేవదూతలు కనబడడానికీ, అబ్రాహాము సంతానము ద్వారా ఆయన నిబంధన నెరవేర్చబడడానికీ సంబంధం ఉందని యాకోబుకు తెలుసు. అందుకని ఆయన తనశక్తినంతా ప్రయోగించి పెనుగులాడి ఆశీర్వాదం పొందాడు. ఈ సమయంలోనే దేవుడు ఆయన పేరును ఇశ్రాయేలుగా మార్చాడు, దానికి “దేవునితో పోరాడువాడు” లేదా “దేవుడు పోరాడుట” అని అర్థం.

మీరు పోరాడడానికి ఇష్టపడుతున్నారా?

దేవదూతతో కుస్తీ పట్టడం, ఏశావును తిరిగి కలుసుకోవడంవంటి సంక్షోభాలను మాత్రమే యాకోబు అధిగమించలేదు. అయిననూ, ఇక్కడ పరిశీలించిన సంఘటనలు ఆయనెలాంటి వ్యక్తో ఉదహరిస్తున్నాయి. ఏశావు తన జన్మహక్కు నిమిత్తం కాస్తయినా ఆకలి తట్టుకోలేని వ్యక్తిగా ఉంటే, ఆశీర్వాదాలు సంపాదించుకునేందుకు యాకోబు దేవదూతతో పెనుగులాడడంతో సహా తన జీవితమంతా పోరాడాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే, యాకోబు దేవుని మార్గదర్శకాన్ని, సంరక్షణను పొంది ఓ గొప్ప జనాంగానికి మూలపురుషుడూ, మెస్సీయకు పితరుడూ అయ్యాడు.​—⁠మత్తయి 1:2, 16.

దేవుని అనుగ్రహం పొందేందుకు మీరు శ్రమించడానికి, సూచనార్థకంగా చెప్పాలంటే పెనుగులాడడానికి ఇష్టపడుతున్నారా? దేవుని చిత్తం చేయాలని కోరుకునే వారికి నేడు జీవితమంతా కష్టాలతో సవాళ్లతో నిండివుంటుంది. కొన్నిసార్లయితే సరైన నిర్ణయాలు తీసుకునేందుకూ పోరాడాలి. అయితే, యెహోవా మనయెదుట ఉంచిన ప్రతిఫలపు నిరీక్షణకు హత్తుకొని ఉండడానికి యాకోబు చూపిన చక్కని మాదిరి మనకు బలమైన ప్రేరణగా ఉంటుంది.

[అధస్సూచీలు]

^ పేరా 9 వారు కలుసుకున్న తీరు యాకోబు తల్లి రిబ్కా, ఎలీయెజెరు ఒంటెలకు నీరుపెట్టినప్పటి పరిస్థితిలాగే ఉంది. ఓ క్రొత్త మనిషి రాకను గురించి చెప్పడానికి రిబ్కా ఇంటికి పరుగెత్తింది. తన చెల్లికి బహుమానంగా ఇవ్వబడిన బంగారు ఆభరణాలను చూసిన లాబాను ఎలీయెజెరును ఆహ్వానించడానికి పరుగెత్తుకెళ్లాడు.​—⁠ఆదికాండము 24:28-31, 53.

[31వ పేజీలోని చిత్రాలు]

ఆశీర్వాదాలు పొందేందుకు యాకోబు తన జీవితమంతా పోరాడాడు