కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమే

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమే

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమే

చరిత్రంతటిలోను, కోట్లాదిమంది తాము చివరికి భూమిని విడిచి పరలోకానికి వెళతామని విశ్వసించారు. ఈ భూమి మన శాశ్వత నివాస స్థలంగా ఉండాలని మన సృష్టికర్త ఉద్దేశించనేలేదని కొందరు భావించారు. సన్యాసులు ఇంకో అడుగు ముందుకు వెళ్ళారు. వారిలో చాలామంది ఈ భూమి మరియు దానిలోని భౌతికమైనవన్నీ చెడ్డవని, అంటే అవి నిజమైన ఆధ్యాత్మిక సంతృప్తి, దేవునితో సాన్నిహిత్యం పొందకుండా అడ్డుపడతాయని భావించారు.

పైన ప్రస్తావించబడిన తలంపులుగలవారికి భూపరదైసుకు సంబంధించి దేవుడు చెప్పిన విషయాల గురించి తెలియదు లేదా వారు కావాలనే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి, దేవుడు తన వాక్యమైన బైబిలులో ఈ విషయం గురించి ఏమి నమోదు చేయడానికి మానవులను ప్రేరేపించాడో పరిశీలించడానికి నేడు చాలామంది ఆసక్తే చూపించడంలేదు. (2 తిమోతి 3:​16, 17) కానీ మానవుల సిద్ధాంతాలను స్వీకరించే బదులు దేవుని వాక్యాన్ని నమ్మడం జ్ఞానయుక్తం కాదంటారా? (రోమీయులు 3:⁠4) నిజానికి మనం దేవుని వాక్యాన్ని నమ్మడం ఎంతో ఆవశ్యకం, ఎందుకంటే ఒక శక్తివంతమైన అదృశ్య ప్రాణి ప్రజలను ఆధ్యాత్మికంగా అంధులను చేసి ప్రస్తుతం ‘సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు’ అని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది.​—⁠ప్రకటన 12:9; 2 కొరింథీయులు 4:⁠4.

ఎందుకు ఈ గందరగోళం?

జీవన్మరణాలకు సంబంధించి అనేక పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల కారణంగా, ఈ భూమిపట్ల దేవుని సంకల్పం విషయంలో ప్రజలు తికమకపడుతున్నారు. మానవ శరీరం నుండి వేరుగా ఉండేదేదో మనలో ఉందని, మరణం తర్వాత కూడా అది ఉనికిలోనే ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఈ అదృశ్యమైనదేదో మానవ శరీరం సృష్టించబడకముందే ఉనికిలో ఉండిందని మరికొందరు నమ్ముతారు. మానవునిలో ఉండే ఈ అదృశ్య భాగం “పరలోకంలో ఉన్నప్పుడు చేసిన పాపాలకు శిక్షగా మానవ శరీరంలో నిర్బంధించబడుతుంది” అని గ్రీకు తత్వవేత్త ప్లేటో తలంచేవాడని ఒక రెఫరెన్సు గ్రంథం తెలియజేస్తోంది. అదేవిధంగా మూడవ శతాబ్దపు వేదాంతి అయిన ఆరిజెన్‌, ఒక వ్యక్తిలోని ఆ అదృశ్య భాగం ఒక శరీరంతో జతచేయబడక ముందు పరలోకంలో పాపం చేసిందని, అది దాని పాపాలకు శిక్షగా భూమిపై మానవ శరీరంలో నిర్బంధించబడిందని చెప్పాడు. మానవుడు పరలోకానికి వెళ్ళేందుకు చేసే ప్రయాణంలో ఈ భూమి కేవలం ఒక పరీక్షా స్థలం వంటిదేనని లక్షలాదిమంది నమ్ముతారు.

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా విభిన్న తలంపులు ఉన్నాయి. హిస్టరీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఫిలాసఫీ అనే పుస్తకం ప్రకారం, “చనిపోయినవారు పాతాళానికి వెళతారు” అని ఐగుప్తీయులు నమ్మేవారు. ఆ తర్వాత, చనిపోయినవారు పాతాళానికి వెళ్ళరు కాని ఉన్నతమైన ఆత్మ జగత్తుకు ఆరోహణమవుతారని తత్వవేత్తలు వాదించారు. గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటీసు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన “[ఒక] అదృశ్య లోకానికి వెళ్ళి . . . ఇక తాను ఉనికిలోవుండే మిగతా సమయాన్ని దేవుళ్ళతో గడుపుతాడు” అని నమ్మేవాడని ఆయన సమకాలీనులు నివేదించారు.

బైబిలు ఏమని చెబుతోంది?

మానవుల్లో అదృశ్యమైనదేదో ఉందని, అది అమర్త్యమైనదని దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు ఎక్కడా చెప్పడం లేదు. ఆదికాండము 2:7లోని వృత్తాంతాన్ని చదవండి. అది ఇలా చెబుతోంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ [మూల హీబ్రూ పదం “నెఫెష్‌,” దీనికి ‘శ్వసించువాడు’ అని అర్థం] ఆయెను.” అక్కడ చెప్పబడిన విషయం ఎంతో స్పష్టంగా, అనుమానానికి తావులేకుండా ఉంది. దేవుడు మొదటి మానవుడైన ఆదామును సృష్టించినప్పుడు, ఆయన ఆదాములో అభౌతికమైనదేదో పెట్టలేదు. ఒక నిర్జీవ శరీరంలోనికి “జీవవాయువు” ఊదబడినప్పుడు ఆ శరీరమే ఒక మానవునిగా లేదా సజీవమైన ఒక వ్యక్తిగా తయారయ్యింది అని బైబిలు చెబుతోంది.

యెహోవా భూమిని, మానవ కుటుంబాన్ని సృష్టించినప్పుడు, మానవుడు చనిపోవాలని ఆయన ఎంతమాత్రం ఉద్దేశించలేదు. మానవులు పరదైసు పరిసరాల్లో ఈ భూమిపై నిరంతరం జీవించాలని దేవుడు సంకల్పించాడు. ఆదాము దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపినందువల్లే మరణించాడు. (ఆదికాండము 2:8, 15-17; 3:1-6; యెషయా 45:​18) మొదటి మానవుడు చనిపోయినప్పుడు ఆయన ఆత్మ జగత్తుకు వెళ్ళాడా? లేదు! ఆయన, అంటే మానవుడైన ఆదాము, తాను ఏ మన్నుతో సృష్టించబడ్డాడో నిర్జీవమైన ఆ మన్నులో కలిసిపోయాడు.​—⁠ఆదికాండము 3:17-19.

మన పితరుడైన ఆదాము నుండి మనందరం పాపమరణాలను వారసత్వంగా పొందాము. (రోమీయులు 5:​12) ఈ మరణం వల్ల ఆదాము ఉనికిలో లేకుండా పోయాడు, మనం కూడా అలాగే ఉనికిలో లేకుండా పోతాము. (కీర్తన 146:​3, 4) నిజానికి బైబిల్లోని 66 పుస్తకాల్లో ఎక్కడా కూడా మనిషిలోవుండే అమర్త్యమైనదేదో ఆ మనిషి మరణం తర్వాత ఉనికిలోనే ఉంటుందని సూచించడం లేదు. అందుకు విరుద్ధంగా, ఒక మనిషి చనిపోయినప్పుడు అతని జీవితం పూర్తిగా అంతమవుతుందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.​—⁠ప్రసంగి 9:5, 10.

భౌతికమైనవి స్వాభావికంగా చెడ్డవా?

భూమితో సహా భౌతికమైనవన్నీ దుష్టమైనవి అనే సిద్ధాంతం విషయమేమిటి? పర్షియాలో సా.శ. మూడవ శతాబ్దంలో మణి అనే వ్యక్తి ద్వారా స్థాపించబడిన మణిచేయిజమ్‌ అనే మతాన్ని అవలంబించేవారు అలాగే విశ్వసించేవారు. ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతోంది: “మానవుల్లో స్వతహాగా ఉండే తీవ్రమైన బాధ నుండే మణిచేయిజమ్‌ పుట్టుకొచ్చింది.” మానవునిగా ఉండడం “సహజమైనది కాదు, సహించలేనిది, పూర్తిగా దుష్టమైనది” అని మణి నమ్మేవాడు. ఈ “తీవ్రమైన బాధ” నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం, మానవునిలోవుండే అదృశ్యమైనదేదో శరీరం నుండి తప్పించుకొని ఈ భూమిని విడిచిపెట్టి ఆత్మ లోకానికి వెళ్ళి ఆధ్యాత్మిక ఉనికిని సంపాదించుకోవడమేనని ఆయన భావించేవాడు.

దానికి భిన్నంగా దేవుడు ఈ భూమిని, మానవజాతిని సృష్టించిన తర్వాత ఆయన దృష్టికి “తాను చేసినది యావత్తును” “చాలమంచిదిగ” ఉందని బైబిలు మనకు చెబుతోంది. (ఆదికాండము 1:​31) ఆ కాలంలో మానవులకు దేవునికి మధ్య ఎలాంటి ప్రతిబంధకం ఉండేది కాదు. పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు తన పరలోక తండ్రితో సన్నిహిత సంబంధం అనుభవించినట్లే ఆదాము హవ్వలు కూడా యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండేవారు.​—⁠మత్తయి 3:17.

మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు పాపభరితమైన మార్గం అనుసరించకుండా ఉంటే వారు పరదైసు భూమిపై జీవిస్తూ నిరంతరం యెహోవా దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండేవారు. వారు తమ జీవితాలను పరదైసులోనే ప్రారంభించారు, లేఖనాలు మనకిలా చెబుతున్నాయి: “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.” (ఆదికాండము 2:⁠8) పరదైసు పరిసరాలుగల ఆ తోటలోనే హవ్వ సృష్టించబడింది. ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉంటే, వాళ్ళూ వాళ్ళ పరిపూర్ణ సంతానమూ మొత్తం భూమంతా పరదైసులా మారేవరకూ సంతోషంగా కలిసి పనిచేసివుండేవారు. (ఆదికాండము 2:21; 3:​23, 24) పరదైసు భూమి నిరంతరం మానవజాతికి నివాస స్థలంగా ఉండేది.

కొందరు పరలోకానికి ఎందుకు వెళతారు?

‘కానీ బైబిలు పరలోకానికి వెళ్ళే ప్రజల గురించి కూడా చెబుతోంది కదా?’ అని మీరు ప్రశ్నించవచ్చు. అవును బైబిలు పరలోకానికి వెళ్ళేవారి గురించి కూడా చెబుతోంది. ఆదాము పాపం చేసిన తర్వాత యెహోవా పరలోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు, ఆదాము సంతానంలోని కొందరు ఆ రాజ్యంలో యేసుక్రీస్తుతోపాటు ‘భూలోకాన్ని పరిపాలిస్తారు.’ (ప్రకటన 5:10; రోమీయులు 8:​17) వారు పరలోకంలో అమర్త్యమైన జీవితానికి పునరుత్థానం చేయబడతారు. వారి పూర్తి సంఖ్య 1,44,000, వారిలో మొదటివారు యేసు మొదటి శతాబ్దపు విశ్వసనీయులైన శిష్యులు.​—⁠లూకా 12:32; 1 కొరింథీయులు 15:42-44; ప్రకటన 14:1-5.

అయితే, నీతిమంతులైన మానవులు భూమిని విడిచి పరలోకానికి వెళ్ళాలనేది దేవుని ఆది సంకల్పం కాదు. నిజానికి యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలా చెప్పాడు: “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను 3:​13) “మనుష్యకుమారు[డైన]” యేసుక్రీస్తు ద్వారా దేవుడు విమోచన క్రయధనం ఏర్పాటు చేశాడు, దానివల్ల యేసు బలిపై విశ్వాసముంచేవారు నిత్యం జీవించడం సాధ్యమవుతుంది. (రోమీయులు 5:⁠8) అయితే అలా విశ్వసించే కోట్లాదిమంది నిత్యజీవితం ఎక్కడ అనుభవిస్తారు?

దేవుని తొలి సంకల్పం నెరవేర్చబడుతుంది

పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతోపాటు సహపరిపాలకులుగా ఉండేందుకు మానవజాతి నుండి కొందరిని తీసుకువెళ్ళాలని దేవుడు సంకల్పించినప్పటికీ, దానర్థం మంచి వాళ్ళందరూ పరలోకానికి వెళతారని కాదు. మానవ కుటుంబానికి పరదైసు గృహంగా ఉండడానికే యెహోవా ఈ భూమిని సృష్టించాడు. త్వరలోనే, దేవుడు తన తొలి సంకల్పం నెరవేరేలా చేస్తాడు.​—⁠మత్తయి 6:9, 10.

యేసుక్రీస్తు మరియు ఆయన పరలోక సహపరిపాలకుల పరిపాలన క్రింద భూమిపై శాంతి సంతోషాలు ప్రబలుతాయి. (కీర్తన 37:​9-11) దేవుని జ్ఞాపకములోవున్న వారు పునరుత్థానం చేయబడతారు, వారు పరిపూర్ణ ఆరోగ్యం అనుభవిస్తారు. (అపొస్తలుల కార్యములు 24:​14) దేవునికి విశ్వసనీయంగా ఉండడంవల్ల విధేయులైన మానవులకు మన మొదటి తల్లిదండ్రులు పోగొట్టుకున్నది అంటే మానవ పరిపూర్ణతతో పరదైసు భూమిపై జీవితం అనుగ్రహించబడుతుంది.​—⁠ప్రకటన 21:3, 4.

యెహోవా దేవుడు తాను సంకల్పించినదానిని ఎన్నడూ నెరవేర్చకుండా ఉండడు. తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన ఇలా ప్రకటించాడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.”​—⁠యెషయా 55:10, 11.

బైబిలు పుస్తకమైన యెషయాలో, పరదైసు భూమిపై జీవితం ఎలా ఉంటుందనే విషయానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తాయి. పరదైసులో నివసించే ఏ వ్యక్తీ “నాకు దేహములో బాగులేదు” అనడు. (యెషయా 33:​24) జంతువులు మానవులకు హాని చేయవు. (యెషయా 11:​6-9) ప్రజలు అందమైన ఇళ్ళు నిర్మించుకుని వాటిలో నివసిస్తారు, వారు పొలాలు నాటి తృప్తిగా భుజిస్తారు. (యెషయా 65:​21-25) అంతేకాకుండా దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”​—⁠యెషయా 25:⁠8.

విధేయులైన మానవులు త్వరలోనే ఇలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తారు. వాళ్ళు ‘దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతారు.’ (రోమీయులు 8:​20) వాగ్దానం చేయబడిన పరదైసు భూమిపై నిరంతరం జీవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! (లూకా 23:​43) లేఖనాలకు సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానము ప్రకారం జీవిస్తూ యెహోవా దేవునిపై, యేసుక్రీస్తుపై విశ్వాసముంచితే మీరు ఆ పరదైసులో జీవించగలుగుతారు. భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమే అని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు.

[5వ పేజీలోని చిత్రం]

ఆదాము హవ్వలు పరదైసు భూమిపై నిరంతరం జీవించడానికి సృష్టించబడ్డారు

[7వ పేజీలోని చిత్రం]

భూపరదైసులో . . .

వాళ్ళు ఇళ్ళు నిర్మిస్తారు

వాళ్ళు ద్రాక్షతోటలు నాటుతారు

వాళ్ళు యెహోవాచే ఆశీర్వదించబడతారు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA