కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లేవీయకాండములోని ముఖ్యాంశాలు

లేవీయకాండములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

లేవీయకాండములోని ముఖ్యాంశాలు

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడి సంవత్సరం కూడా కాలేదు. వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త జనాంగంగా వ్యవస్థీకరించబడి కనాను దేశానికి వెళ్తున్నారు. అక్కడ ఒక పరిశుద్ధ జనాంగం నివసించాలని యెహోవా ఉద్దేశించాడు. అయితే కనానీయుల జీవిత విధానం, వాళ్ళ మతాచారాలు ఎంతో దిగజారిపోయి ఉన్నాయి. కాబట్టి సత్య దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన సేవ కోసం ప్రత్యేకంగా వేరుపరచి ఉంచే నియమాలను వారికి ఇచ్చాడు. ఆ నియమాలు బైబిలు పుస్తకమైన లేవీయకాండములో నమోదు చేయబడ్డాయి. బహుశా సా.శ.పూ. 1512లో, సీనాయి అరణ్యప్రాంతంలో ఉండగా మోషే ప్రవక్త వ్రాసిన ఈ పుస్తకంలో చాంద్రమాన క్యాలెండర్‌లోని ఒక నెలలో జరిగిన విషయాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. (నిర్గమకాండము 40:17; సంఖ్యాకాండము 1:​1-3) యెహోవా తన సేవకులను పరిశుద్ధులుగా ఉండమని పదేపదే ప్రోత్సహించాడు.​—⁠లేవీయకాండము 11:44; 19:2; 20:7, 26.

దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేడు యెహోవాసాక్షులు పాటించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ ధర్మశాస్త్రం రద్దు చేయబడింది. (రోమీయులు 6:14; ఎఫెసీయులు 2:​11-16) అయితే లేవీయకాండములోని నియమాలు మన దేవుడైన యెహోవా ఆరాధన గురించి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి కాబట్టి అవి మనకు ప్రయోజనం చేకూర్చగలవు.

పరిశుద్ధ అర్పణలు​—⁠స్వచ్ఛందంగా, తప్పనిసరిగా ఇవ్వవలసినవి

(లేవీయకాండము 1:​1-7:⁠38)

ధర్మశాస్త్రంలో పేర్కొనబడిన అర్పణల్లో కొన్ని స్వచ్ఛందంగా ఇవ్వవలసినవి, కొన్ని తప్పనిసరిగా ఇవ్వవలసినవి. ఉదాహరణకు దహనబలి స్వచ్ఛందంగా అర్పించబడేది. యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగా, సంపూర్ణంగా తన ప్రాణాలను విమోచన క్రయధన బలిగా అర్పించినట్లే ఆ బలి దేవునికి సంపూర్ణంగా అర్పించబడేది. అయితే స్వచ్ఛందంగా అర్పించబడే సమాధానబలిలో ఇతరులకు కూడా భాగముండేది. ఒక భాగము బలిపీఠంపై దేవునికి అర్పించబడేది, మరో భాగం యాజకునికి ఇవ్వబడేది, మరో భాగం దానిని అర్పించిన వ్యక్తికి ఇవ్వబడేది. అదేవిధంగా, అభిషిక్త క్రైస్తవులకు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ భోజనం అందరూ పాలుపంచుకొనే సహవాస భోజనంలాంటిది.​—⁠1 కొరింథీయులు 10:​16-22.

పాపపరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు తప్పనిసరిగా అర్పించవలసిన బలులు. పాపపరిహారార్థ బలులు పొరపాటున చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించబడేవి. అపరాధ పరిహారార్థ బలులు ఒక వ్యక్తి ఇతరుల హక్కును భంగపరచినప్పుడు యెహోవాను తృప్తిపరచడానికి లేదా పశ్చాత్తాపపడుతున్న అపరాధికి కొన్ని హక్కులు తిరిగి లభించేలా చేసేందుకు అర్పించబడేవి, లేక పైరెండు కారణాలను బట్టి కూడా అవి అర్పించబడేవి. యెహోవా సమృద్ధిగా అందజేసినవాటికి కృతజ్ఞతగా నైవేద్యము కూడా అర్పించబడేది. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఆజ్ఞాపించబడిన బలులు యేసుక్రీస్తువైపు ఆయన అర్పించిన బలివైపు లేదా ఆ బలినుండి వచ్చే ప్రయోజనాలవైపు అవధానం మళ్ళిస్తున్నాయి.​—⁠హెబ్రీయులు 8:3-6; 9:9-14; 10:5-10.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​11, 12​—⁠‘హోమముగా దహించబడిన తేనె’ యెహోవాకు ఎందుకు అంగీకారయోగ్యమైనది కాదు? ఈ లేఖనంలో పేర్కొనబడిన తేనె తేనెటీగలు తయారుచేసే తేనెను సూచించకపోవచ్చు. దేవుడు దానిని ‘హోమముగా దహించడానికి’ అనుమతించలేదు కానీ దానిని ‘ప్రథమఫలములలో’ భాగంగా అర్పించవలసిందిగా పేర్కొన్నాడు. (2 దినవృత్తాంతములు 31:⁠5) కాబట్టి ఈ తేనె పళ్ళ రసాన్ని సూచిస్తోందని స్పష్టమవుతోంది. అది పులిసే అవకాశం ఉంది కాబట్టి అది బలిపీఠంపై అర్పించబడేందుకు అంగీకారయోగ్యమైనది కాదు.

2:⁠13​—⁠“ప్రతి నైవేద్యమునకు” ఉప్పు ఎందుకు చేర్చాలి? బలులుగా అర్పించబడేవాటి రుచిని పెంచడానికి ఉప్పు చేర్చబడేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారపదార్థాలు చెడిపోకుండా ఉంచేందుకు ఉప్పు ఉపయోగించబడుతుంది. అది కుళ్ళిపోకుండా ఉండడాన్ని సూచిస్తుంది కాబట్టి బహుశా అది బలులతోపాటు అర్పించబడేది.

మనకు పాఠాలు:

3:​16. క్రొవ్వు శ్రేష్ఠమైన లేదా అత్యుత్తమమైన భాగంగా భావించబడేది కాబట్టి దానిని తినకూడదని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడినప్పుడు, శ్రేష్ఠమైనది యెహోవాకే చెందుతుందనే విషయం వారికి స్పష్టం చేయబడింది. (ఆదికాండము 45:​18) మనం యెహోవాకు అత్యంత శ్రేష్ఠమైనదానిని ఇవ్వాలని అది మనకు గుర్తుచేస్తుంది.​—⁠సామెతలు 3:9, 10; కొలొస్సయులు 3:23, 24.

7:​26, 27. ఇశ్రాయేలీయులకు రక్తం తినకూడదని ఆజ్ఞాపించబడింది. దేవుని దృష్టిలో రక్తం జీవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. “రక్తము దేహమునకు ప్రాణము” అని లేవీయకాండము 17:⁠11 చెబుతోంది. రక్తం తీసుకోకూడదనే ప్రమాణం నేటి సత్యారాధకులకు కూడా వర్తిస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 15:28, 29.

పరిశుద్ధ యాజకత్వం స్థాపించబడింది

(లేవీయకాండము 8:1-10:20)

బలులకు, అర్పణలకు సంబంధించిన విషయాలను చూసుకునే బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? ఆ బాధ్యత యాజకులకు ఇవ్వబడింది. దేవుడు నిర్దేశించినట్లుగా మోషే ప్రధాన యాజకుడిగా ఉండేందుకు అహరోనును, సహ యాజకులుగా ఉండేందుకు ఆయన నలుగురు కుమారులను ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ ప్రతిష్ఠాపనా కార్యక్రమం ఏడు రోజులపాటు జరిగింది, ఆ తర్వాతి రోజునుండి యాజకులు తమ బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

9:​9​—⁠బలిపీఠము అడుగున రక్తం పోయడం, దాని కొమ్ములమీద రక్తాన్ని చల్లడం ఎందుకు ప్రాముఖ్యం? ప్రాయశ్చిత్తం కోసం రక్తం అర్పించడాన్ని యెహోవా అంగీకరిస్తాడని అది చూపించింది. ప్రాయశ్చిత్తం చేసుకునే ఏర్పాటంతా రక్తంపైనే ఆధారపడివుండేది. “ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు” అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.​—⁠హెబ్రీయులు 9:22.

10:​1, 2​—⁠అహరోను కుమారులైన నాదాబు అబీహులు చేసిన పాపంలో ఏమేమి ఇమిడి ఉండవచ్చు? నాదాబు అబీహులు తమ యాజకత్వపు బాధ్యతలను నిర్వహించడంలో యథేచ్చగా ప్రవర్తించిన తర్వాత, గుడారములో సేవ చేస్తున్నప్పుడు యాజకులు ద్రాక్షారసాన్ని గాని మద్యాన్ని గాని సేవించకూడదని యెహోవా ఆజ్ఞాపించాడు. (లేవీయకాండము 10:​8-9) ఇక్కడ పరిశీలించబడుతున్న సందర్భంలో, అహరోను కుమారులిద్దరూ బహుశా మద్యము సేవించివుండవచ్చు అని అది సూచిస్తోంది. అయితే వారు చనిపోవడానికి అసలు కారణం, వారు “యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని” ఆయన సన్నిధికి తేవడమే.

మనకు పాఠాలు:

10:​1, 2. నేడు యెహోవాను సేవించే బాధ్యతాయుతమైన సేవకులు దైవిక నియమాలకు కట్టుబడివుండాలి. అంతేకాక వారు తమ బాధ్యతలను నెరవేర్చేటప్పుడు దురహంకారంతో ప్రవర్తించకూడదు.

10:⁠9. మద్యపానీయాలు సేవించి, దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చకూడదు.

పరిశుద్ధ ఆరాధన చేయడానికి పవిత్రంగా ఉండడం అవసరం

(లేవీయకాండము 11:1-15:33)

పవిత్రమైన, అపవిత్రమైన జంతువులకు సంబంధించిన ఆహార నియమాలు ఇశ్రాయేలీయులకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూర్చాయి. ఆ నియమాలు వారిని హానికరమైన క్రిముల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ల నుండి కాపాడడమే కాక వాళ్ళకు చుట్టుప్రక్కల జనాంగాల ప్రజలకు మధ్యగల సరిహద్దును బలపరిచాయి. శవాలను ముట్టుకోవడం వల్ల కలిగే అపవిత్రత, ప్రసవించిన స్త్రీల శుద్ధీకరణ, కుష్ఠు రోగానికి సంబంధించిన పద్ధతులు, స్త్రీపురుషుల లైంగిక స్రావములవల్ల కలిగే అపవిత్రతకు సంబంధించి కూడా వారికి నియమాలు ఇవ్వబడ్డాయి. అపవిత్రులైన వ్యక్తులతో వ్యవహరించడానికి సంబంధించిన విషయాలను యాజకులు చూసుకోవాలి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

12:​2, 5, NW​—⁠పిల్లలను కనడం స్త్రీని ఎందుకు ‘అపవిత్రురాలిని’ చేస్తుంది? జననేంద్రియాలు పరిపూర్ణమైన మానవ జీవితాన్ని సంక్రమింపజేయడానికి చేయబడ్డాయి. అయితే మనకు వారసత్వంగా వచ్చిన పాపపు ప్రభావాలవల్ల అపరిపూర్ణమైన పాపభరితమైన జీవితం పిల్లలకు సంక్రమింపజేయబడింది. పిల్లలు పుట్టిన తర్వాత, రక్తస్రావం మరియు వీర్యస్ఖలనం వంటి ఇతర విషయాలకు సంబంధించి ఉండే తాత్కాలికమైన ‘అపవిత్రత’ మనకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని గుర్తుచేస్తుంది. (లేవీయకాండము 15:16-24; కీర్తన 51:5; రోమీయులు 5:​12) పవిత్రులవ్వడానికి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన నియమాలు, మానవాళి పాపభరితమైన పరిస్థితిని నిర్మూలించి మానవ పరిపూర్ణతను పునరుద్ధరించడానికి విమోచన క్రయధన బలి అవసరం అని అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేస్తాయి. కాబట్టి ధర్మశాస్త్రము వారిని ‘క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకుడిగా’ మారింది.​—⁠గలతీయులు 3:24.

15:​16-18​—⁠ఈ వచనాల్లో ప్రస్తావించబడిన “వీర్యస్ఖలనం” ఏమిటి? ఇది రాత్రిపూట జరిగే స్రావమును, వైవాహిక లైంగిక సంబంధాలను సూచిస్తుంది.

మనకు పాఠాలు:

11:​45. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు పరిశుద్ధ సేవ చేసేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటూ శారీరకంగా ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండాలి.​—⁠2 కొరింథీయులు 7:1; 1 పేతురు 1:​14-16.

12:⁠8. పేదవాళ్ళు బలి అర్పణగా ఖరీదైన గొర్రెలను కాకుండా పక్షులను అర్పించడానికి యెహోవా అనుమతించాడు. ఆయన పేదవారి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు.

పరిశుద్ధతను కాపాడుకోవాలి

(లేవీయకాండము 16:1-27:34)

పాపపరిహారార్థం అత్యంత ప్రాముఖ్యమైన బలులు వార్షిక ప్రాయశ్చితార్థ దినమున అర్పించబడేవి. యాజకుల కోసం, లేవీ తెగ కోసం ఒక కోడెదూడ అర్పించబడేది. ఇశ్రాయేలుకు చెందిన యాజకులుకాని తెగల కోసం ఒక మేక అర్పించబడేది. మరో మేకపై ప్రజల పాపాలు మోపిన తర్వాత దానిని సజీవంగా అరణ్యంలో విడిచిపెట్టేవారు. ఆ రెండు మేకలు కలిపి ఒకే పాపపరిహారార్థ బలిగా పరిగణించబడేవి. ఇదంతా యేసుక్రీస్తు బలిగా అర్పించబడతాడని, ఆయన మన పాపాలను మోసుకొని వెళతాడని సూచించింది.

మాంసము భుజించే విషయానికి, ఇతర విషయాలకు సంబంధించి ఇవ్వబడిన నియమాలు, మనం యెహోవాను ఆరాధించేటప్పుడు పరిశుద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. యాజకులు తమను తాము పవిత్రంగా ఉంచుకోవలసి రావడం సముచితమే. మూడు వార్షిక పండుగలు సంతోషించడానికి, సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సందర్భాలుగా ఉండేవి. యెహోవా తన ప్రజలకు తన పరిశుద్ధ నామమును దుర్వినియోగపరచడానికి, విశ్రాంతి దినములను మరియు సునాదకాలమును ఆచరించడానికి, పేదలతో వ్యవహరించడానికి, బానిసలతో వ్యవహరించడానికి సంబంధించిన నియమాలను కూడా ఇచ్చాడు. దేవునికి విధేయత చూపించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలకు, ఆయనకు అవిధేయత చూపించడం ద్వారా వచ్చే శాపాలకు తేడా చూపించబడింది. మ్రొక్కుకోవడానికి వెలను నిర్ణయించడానికి సంబంధించిన అర్పణలు, జంతువులకు పుట్టిన తొలిచూలు పిల్లలు, ప్రతిదానిలోను దశమభాగం ‘యెహోవాకు ప్రతిష్ఠించడం’ వంటి విషయాలకు సంబంధించి కూడా నియమాలు ఇవ్వబడ్డాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

16:​29​—⁠ఇశ్రాయేలీయులు ‘తమను తాము ఎలా దుఃఖపరచుకోవాలి’? ప్రాయశ్చిత్తార్థ దినము తర్వాత జరిగే ఆ కార్యక్రమం, పాపాలకు క్షమాపణ వేడుకోవడానికి సంబంధించినది. ఆ సమయంలో ఉపవాసముండడం, పాపాలను ఒప్పుకోవడాన్ని సూచిస్తుందని తెలుస్తోంది. కాబట్టి బహుశా ‘తమను తాము దుఃఖపరచుకోవడమనేది’ ఉపవాసముండడాన్ని సూచిస్తుండవచ్చు.

19:​27​—⁠“నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు,” “గడ్డపు ప్రక్కలను గొరగకూడదు” అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమేమిటి? యూదులు తమ జుట్టును లేదా గడ్డాన్ని అన్యదేశస్థుల ఆచారాలను అనుకరించే విధంగా కత్తిరించుకోకుండా ఉండడానికి ఆ ఆజ్ఞ ఇవ్వబడిందని స్పష్టమవుతోంది. (యిర్మీయా 9:25, 26; 25:23; 49:​32) అయితే యూదులు తమ జుట్టును గడ్డాలను అసలు కత్తిరించుకోకూడదని దేవుని ఆజ్ఞ నిర్దేశించలేదు.​—⁠2 సమూయేలు 19:24.

25:​35-37​—⁠ఇశ్రాయేలీయులు వడ్డి తీసుకోవడం అన్ని సందర్భాల్లోను తప్పా? వ్యాపారం కోసం డబ్బు అప్పుగా ఇవ్వబడితే, అప్పు ఇచ్చిన వ్యక్తి వడ్డిని వసూలు చేయవచ్చు. అయితే పేదలను విడుదల చేయడానికి ఇవ్వబడిన అప్పులపై వడ్డి వసూలు చేయకూడదని ధర్మశాస్త్రం నిర్దేశించింది. పేదవాడైన పొరుగువాని కష్టాలను సొమ్ము చేసుకోవడం తప్పు.​—⁠నిర్గమకాండము 22:25.

26:​19​—⁠“ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను” ఎలా కాగలదు? వర్షాలు లేని కారణంగా కనాను దేశపు ఆకాశము చూడడానికి ఇనుమంత గట్టిగా కనిపిస్తుంది. వర్షాలు లేకపోవడంతో భూమి ఇత్తడి రంగులో లోహంలా మెరుస్తుంది.

26:​26​—⁠‘పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే ఆహారము వండడం’ అంటే ఏమిటి? సాధారణంగా ప్రతి స్త్రీకి తన వంట పూర్తిచేసుకోవడానికి ఒక పొయ్యి అవసరం. అయితే ఆహారం ఎంత తక్కువగా లభిస్తుందంటే పదిమంది స్త్రీలు వంట చేసుకోవడానికి కూడా ఒకే పొయ్యి సరిపోతుందని ఆ మాటలు సూచిస్తున్నాయి. పరిశుద్ధతను కాపాడుకోవడంలో విఫలమైనప్పుడు వచ్చే పర్యవసానాల్లో ఇది కూడా ఒకటి.

మనకు పాఠాలు:

20:⁠9. ద్వేషపూరితమైన, అవినీతికరమైన స్ఫూర్తి యెహోవా దృష్టిలో హత్య చేయడంతో సమానం. కాబట్టి ఆయన, తన తల్లిదండ్రులను దూషించే వ్యక్తికి వారిని హత్య చేస్తే విధించబడే శిక్షనే విధించమని సూచించాడు. మనం మన తోటి విశ్వాసులను ప్రేమించడానికి అది మనలను పురికొల్పవద్దా?​—⁠1 యోహాను 3:14, 15.

22:​32; 24:​10-16, 23. యెహోవా నామంపై నింద వేయకూడదు. దానికి బదులుగా మనం ఆయన నామాన్ని స్తుతించి అది పరిశుద్ధపరచబడాలని ప్రార్థించాలి.​—⁠కీర్తన 7:17; మత్తయి 6:⁠9, 10.

లేవీయకాండము మన ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

నేడు యెహోవాసాక్షులు ధర్మశాస్త్రమును పాటించవలసిన అవసరం లేదు. (గలతీయులు 3:​23-25) అయితే యెహోవా వివిధ విషయాలను ఎలా దృష్టిస్తాడో లేవీయకాండము మనకు తెలియజేస్తుంది కాబట్టి అది మన ఆరాధనపై ప్రభావం చూపగలదు.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సిద్ధపడేటప్పుడు మీరు మీ వారపు బైబిలు పఠనం చేస్తుండగా, దేవుడు తన సేవకులు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడనే వాస్తవం మీకు స్పష్టమవుతుందనడంలో సందేహం లేదు. మీరు సర్వోన్నతుడైన దేవునికి మీ శ్రేష్ఠమైనవాటిని ఇవ్వడానికి, ఎల్లప్పుడూ మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయనను స్తుతించడానికి ఈ పుస్తకం మిమ్మల్ని పురికొల్పగలదు.

[21వ పేజీలోని చిత్రం]

ధర్మశాస్త్రములో సూచించబడిన బలులు యేసుక్రీస్తువైపు, ఆయన బలివైపు అవధానం మళ్ళించాయి

[22వ పేజీలోని చిత్రం]

పులియని రొట్టెల పండుగ సంతోషకరమైన సందర్భంగా ఉండేది

[23వ పేజీలోని చిత్రం]

పర్ణశాలల పండుగవంటి వార్షిక పండుగలు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించడానికి సందర్భాలుగా ఉండేవి