కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

రక్తంనుండి విడగొట్టిన సూక్ష్మభాగాలను యెహోవాసాక్షులు అంగీకరిస్తారా?

ఈ క్రింది జవాబు జూన్‌ 15, 2000 సంచికలో ముద్రించబడిన సమాచార సారాంశమైయుంది.

ప్రాథమికంగా చెప్పాలంటే యెహోవాసాక్షులు రక్తాన్ని స్వీకరించరు. రక్తానికి సంబంధించిన దేవుని నియమం ఈ లోకంలో మారుతున్న అభిప్రాయాలకు తగ్గట్టు సవరించడానికి వీల్లేనిదని వారు దృఢంగా నమ్ముతారు. కానీ, రక్తాన్ని ఇప్పుడు నాలుగు ప్రధాన భాగాలుగా, ఆ భాగాలనే మళ్లీ సూక్ష్మభాగాలుగా విడగొట్టడం సాధ్యమవుతోంది కాబట్టి, కొత్త వివాదాలు తలెత్తుతాయి. అలాంటివి స్వీకరించవచ్చా లేదా అనేది నిర్ణయించుకోవడంలో ఒక క్రైస్తవుడు వైద్యపరంగా రాగల ప్రయోజనాలను, ప్రమాదాలను మాత్రమే చూస్తే సరిపోదు. బైబిలు ఏమి చెబుతోంది, సర్వశక్తిగల దేవునితో తనకున్న సంబంధంపై అదెలాంటి ప్రభావం చూపవచ్చు అనేవి కూడా ఆ క్రైస్తవుడు శ్రద్ధగా ఆలోచించాలి.

ఇమిడివున్న కీలకమైన వివాదాలు సరళమైనవే. అలా ఎందుకో గ్రహించడానికి బైబిలులోని, చరిత్రలోని, వైద్యరంగంలోని నేపథ్యాన్ని కొంత పరిశీలించండి.

రక్తాన్ని ప్రత్యేకమైనదిగా దృష్టించాలని యెహోవా దేవుడు మనందరి పూర్వీకుడైన నోవహుతో చెప్పాడు. (ఆదికాండము 9:​3, 4) ఆ తర్వాత, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్ర నియమాలు రక్తానికున్న పవిత్రతను ప్రతిబింబించాయి: “ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై[యుందును].” దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం ద్వారా ఒక ఇశ్రాయేలీయుడు ఇతరులను పాడుచేస్తాడు కాబట్టి, దేవుడు అదనంగా ఇలా చెప్పాడు: “జనులలోనుండి వాని కొట్టివేయుదును.” (లేవీయకాండము 17:10) ఆ తర్వాత, యెరూషలేములో ఒక సమావేశంలో అపొస్తలులూ పెద్దలూ మనం ‘రక్తాన్ని విసర్జించాలి’ అని ఆజ్ఞాపించారు. అలా చేయడం లైంగిక దుర్నీతిని, విగ్రహారాధనను విసర్జించవలసినంత ప్రాముఖ్యం.​—⁠అపొస్తలుల కార్యములు 15:​28, 29.

ఆ కాలంలో “విసర్జింపవలెను” అనేది ఏ అర్థాన్నిచ్చింది? క్రైస్తవులు తాజా రక్తాన్ని లేదా గడ్డకట్టిన రక్తాన్ని సేవించలేదు; లేదా వాళ్ళు రక్తం ఒలికించని జంతు మాంసం తినలేదు. అలాగే రక్తం చేర్చిన సాసేజ్‌ల వంటి ఆహారం తినడం వాళ్లలో నిషేధించబడింది. ఆ రీతుల్లో రక్తాన్ని ఏ విధంగా సేవించినా లేదా తిన్నా అది దేవుని నియమాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది.​—⁠1 సమూయేలు 14:​32, 33.

ప్రాచీనకాలాల్లో అనేకమంది రక్తాన్ని తినడం విషయంలో కలతచెంది ఉండరని (సా.శ. రెండవ, మూడవ శతాబ్దాలకు చెందిన) టెర్టూలియన్‌ వ్రాతల్నిబట్టి మనకు తెలుస్తుంది. క్రైస్తవులు రక్తాన్ని తిన్నారనే అబద్ధ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, రక్తాన్ని రుచిచూడడం ద్వారా ఒప్పందాల్ని ఖరారు చేసుకున్న తెగలను టెర్టూలియన్‌ ప్రస్తావించాడు. “క్రీడా స్థలంలో జరిగే ప్రదర్శనప్పుడు రక్తదాహంగల [కొందరు] . . . తమ మూర్ఛరోగ స్వస్థతకోసం అపరాధుల తాజా రక్తం సేకరించి తీసుకెళ్లేవారు” అని కూడా ఆయన పేర్కొన్నాడు.

అలాంటి అలవాట్లు (కొందరు రోమన్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం అలా చేసినప్పటికీ) క్రైస్తవులకు తప్పుగా ఉండేవి: “జంతు రక్తాన్ని సైతం మేము మా సహజ ఆహారంలో చేర్చము” అని టెర్టూలియన్‌ వ్రాశాడు. నిజ క్రైస్తవుల యథార్థతను పరీక్షించడానికి రోమన్లు రక్తం కలిసిన ఆహారాన్ని ఉపయోగించారు. టెర్టూలియన్‌ ఇంకా ఇలా వ్రాశాడు: “[క్రైస్తవులు] జంతు రక్తాన్ని తినడానికే తీవ్ర విముఖత చూపిస్తారని మీకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు, వారు మానవ రక్త పిపాసులని ఎలా భావిస్తున్నారు? అని నేనిప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను.”

నేడు, ఒక వైద్యుడు రక్తం తీసుకొమ్మని చెప్పినప్పుడు, అందులో సర్వశక్తిగల దేవుని నియమాలు ఇమిడి ఉన్నాయని కొద్దిమందే ఆలోచిస్తారు. యెహోవాసాక్షులుగా మనం బ్రతికి ఉండాలనే ఖచ్చితంగా కోరుకున్నప్పటికీ, రక్తానికి సంబంధించి యెహోవా నియమానికే కట్టుబడి ఉంటాం. ప్రస్తుత వైద్య విధానం దృష్ట్యా దీని భావమేమిటి?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యథాతథంగా రక్తాన్ని ఎక్కించుకోవడం సర్వసాధారణం అవుతుండగా, అది దేవుని నియమానికి విరుద్ధంగా ఉన్నట్లు యెహోవాసాక్షులు దృష్టించారు​—⁠ఇప్పటికీ మన నమ్మకం అదే. అయితే కాలగమనంలో వైద్య విధానం మారిపోయింది. నేడు, అనేక రక్తమార్పిడుల్లో రక్తాన్ని యథాతథంగా కాక దాని ప్రధాన భాగాల్లో ఒక దానిని అంటే: (1) ఎర్ర రక్త కణాలు; (2) తెల్ల రక్త కణాలు; (3) ప్లేట్‌లెట్‌లు; (4) ద్రవపదార్థంగా ఉండే ప్లాస్మా (సెరం) వంటివి ఎక్కించడం జరుగుతోంది. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు, లేదా ప్లాస్మా ఎక్కించాలని నిర్దేశించవచ్చు. ఈ ప్రధాన భాగాలను మాత్రమే ఎక్కించడంవల్ల, కేవలం ఒక యూనిట్‌ రక్తాన్నే చాలామంది రోగులకు ఎక్కించడానికి వీలవుతుంది. రక్తాన్ని యథాతథంగా ఎక్కించుకోవడం లేదా ఆ ప్రధాన భాగాల్లోని దేన్నైనా అంగీకరించడం దేవుని నియమాన్ని ఉల్లంఘించడమేనని యెహోవాసాక్షులు నమ్ముతారు. ఈ బైబిలు ఆధారిత వైఖరికి కట్టుబడి ఉండడం, రక్తం నుండి సంక్రమించగల హెపటైటిస్‌, ఎయిడ్స్‌ వంటివాటితో సహా అనేక వ్యాధుల నుండి వారిని కాపాడింది.

అయితే, వివిధ ప్రక్రియల ద్వారా రక్తాన్ని ఆ నాలుగు ప్రధాన విభాగాల కంటే ఇంకా ఎక్కువగా విడగొట్టడం సాధ్యంకాగలదు కాబట్టి, రక్తంయొక్క ఆ ప్రధాన భాగాల నుండి సేకరించే సూక్ష్మభాగాల విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి సూక్ష్మభాగాలు ఎలా వాడబడుతున్నాయి, వాటి వాడుక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒక క్రైస్తవుడు వేటిని పరిగణలోనికి తీసుకోవాలి?

రక్తం సంశ్లిష్టమైన ద్రవం. అందులో 90 శాతం నీరున్న ప్లాస్మా సైతం ఖనిజాలు, చక్కెరతోపాటు విస్తారంగా హార్మోనులను, అసేంద్రీయ లవణాలను, ఎంజైములను, న్యూట్రియంట్లను మోసుకెళుతుంది. అంతేగాక ఈ ప్లాస్మా, అల్బుమిన్‌, రక్తాన్ని గడ్డకట్టించే క్లాటింగ్‌ ఫ్యాక్టర్లు, వ్యాధి నిరోధక ప్రతిరక్షకాల వంటి మాంసకృత్తులను కూడా మోసుకెళుతుంది. సాంకేతిక నిపుణులు ప్లాస్మాను విడగొట్టి, అందులోని చాలా మాంసకృత్తులను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, త్వరగా రక్తం గడ్డకట్టని హిమోఫీలియా రోగులకు రక్తాన్ని గడ్డకట్టించే క్లాటింగ్‌ ఫ్యాక్టర్‌ 8 ఇవ్వబడుతుంది. లేదా కొన్ని రకాల వ్యాధులకు, అప్పటికే రోగ నిరోధకశక్తి ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా నుండి సేకరించిన గామా గ్లోబ్యులిన్‌ ఇంజక్షన్‌లు ఇవ్వాలని వైద్యులు సూచించవచ్చు. మరితర ప్లాస్మా మాంసకృత్తులు వైద్యపరంగా వాడబడుతున్నాయి, అయితే సూక్ష్మభాగాలను సేకరించడానికి రక్తంలోని ఒక ప్రధాన భాగాన్ని (ప్లాస్మాను) ఎలా విడగొడతారో పైన పేర్కొనబడిన విషయం ఉదహరిస్తోంది. *

రక్తంలోని ప్లాస్మా వివిధ సూక్ష్మభాగాలకు మూలాధారం కాగలిగినట్లే, ఇతర ప్రధాన భాగాలను కూడా (ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ప్లేట్‌లెట్‌లను) సూక్ష్మభాగాలుగా విడగొట్టవచ్చు. ఉదాహరణకు, కొన్నిరకాల వైరల్‌ ఇన్ఫెక్షన్‌లకు, క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించబడే ఇంటర్‌ఫెరాన్‌లను, ఇంటర్‌లూకిన్‌లను తెల్ల రక్త కణాల నుండి సేకరించవచ్చు. ప్లేట్‌లెట్‌ల నుండి గాయాన్ని మాన్పే ఫ్యాక్టర్‌ను సేకరించవచ్చు. రక్తంలోని పదార్థాల నుండి సేకరించిన (కనీసం మొదట్లో అలా సేకరించిన) ద్రావణాలతో ఇతర రకాల మందులు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి చికిత్సలు ఆ ప్రధాన భాగాల మార్పిడులుగా ఉండవు; ఆ చికిత్సల్లో సాధారణంగా వాటినుండి సేకరించిన భాగాలు లేదా సూక్ష్మభాగాలు చేరివుంటాయి. తమకు జరిగే వైద్య చికిత్సలో అలాంటి సూక్ష్మభాగాల్ని క్రైస్తవులు అంగీకరించాలా? ఈ విషయంలో ఇదమిత్థంగా మనమేమీ చెప్పలేము. బైబిలు వివరాలు ఇవ్వడం లేదు, అందుకని ఒక క్రైస్తవుడు దేవుని ఎదుట తన మనస్సాక్షినిబట్టి సొంతగా నిర్ణయించుకోవాలి.

కొందరు రక్తం నుండి సేకరించబడిన దేన్నైనా (పరోక్ష రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా ఇవ్వడానికి ఉద్దేశించిన సూక్ష్మభాగాలను సైతం) తిరస్కరిస్తారు. ‘రక్తమును విసర్జించండి’ అనే దేవుని ఆజ్ఞను వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఒక జీవి శరీరంలో నుండి బయటకు వచ్చిన రక్తాన్ని ‘భూమిమీద పారబోయాలి’ అని వారు తర్కిస్తారు. (ద్వితీయోపదేశకాండము 12:22-24) అదెందుకు సముచితం? ఉదాహరణకు, గామా గ్లోబ్యులిన్‌లు, రక్తాధారిత క్లాటింగ్‌ ఫ్యాక్టర్‌లు వగైరా తయారు చేయడానికి రక్తాన్ని సేకరించి దాన్ని వివిధ ప్రక్రియలకు లోనుచేయవలసి ఉంటుంది. అందువల్ల, కొంతమంది క్రైస్తవులు, యథాతథంగా రక్తం ఎక్కించుకోవడాన్నీ లేదా దాని నాలుగు ప్రధాన భాగాలను ఎక్కించుకోవడాన్నీ నిరాకరించినట్లే అలాంటి ఉత్పత్తుల్ని కూడా నిరాకరిస్తారు. వారి యథార్థమైన మనస్సాక్షిపూర్వకమైన ఆ నిర్ణయాన్ని ఇతరులు గౌరవించాలి.

మరి కొంతమంది క్రైస్తవులు ఇంకొక విధంగా నిర్ణయించుకుంటారు. వారు కూడా యథాతథంగా రక్తం ఎక్కించుకోవడాన్ని, ఎర్ర రక్త కణాల్ని, తెల్ల రక్త కణాల్ని, ప్లేట్‌లెట్‌లను, ప్లాస్మాను నిరాకరిస్తారు. అయితే, వారు ఆ ప్రధాన భాగాల నుండి సేకరించిన సూక్ష్మభాగాలతో తమకు చికిత్స చేయడానికి వైద్యుణ్ని అనుమతించవచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. ఒక క్రైస్తవుడు గామా గ్లోబ్యులిన్‌లను ఇంజక్షన్‌ తీసుకోవడానికి అంగీకరించవచ్చు, అయితే ఆయన ఎర్ర రక్త కణాల నుండి లేదా తెల్ల రక్త కణాల నుండి సేకరించిన ద్రావణపు ఇంజక్షన్‌ తీసుకోవడానికి అంగీకరించకపోవచ్చు. ఏదేమైనా, తాము రక్తంలోని సూక్ష్మభాగాలను అంగీకరించవచ్చని కొంతమంది క్రైస్తవులు నిర్ణయించుకోవడానికి వారిని ఏది నడిపించవచ్చు?

కావలికోట (ఆంగ్లం) జూన్‌ 1, 1990 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్లాస్మా మాంసకృత్తులు (సూక్ష్మభాగాలు) గర్భస్థ శిశువుకున్న ప్రత్యేక రక్త ప్రసరణా వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి అని పేర్కొంది. ఆ విధంగా ఒక తల్లి అమూల్యమైన రోగనిరోధక శక్తినిస్తూ తన బిడ్డకు ఇమ్యునోగ్లోబ్యులిన్‌లను అందజేస్తుంది. ప్రత్యేకంగా, ఆ పిండంలోని ఎర్ర రక్త కణాల సాధారణ జీవనకాలం ముగుస్తుండగా, వాటిలో ఆక్సిజన్‌ మోసుకెళ్లే భాగం మార్పుచెందుతుంది. దానిలో కొంత బిలిరుబిన్‌గా మారి జరాయువు గుండా తల్లి శరీరంలో ప్రవేశించి, ఆ తర్వాత ఆమె శరీరపు వ్యర్థపదార్థాలతోపాటు తొలగించబడుతుంది. రక్తంలోని సూక్ష్మభాగాలు ఇలా సహజంగానే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిలోకి ప్రవేశించగలవు కాబట్టి, రక్తంలోని ప్లాస్మా నుండి లేదా జీవకణాల నుండి వచ్చిన రక్తపు సూక్ష్మభాగాలను అంగీకరించవచ్చని కొందరు క్రైస్తవులు నిర్ణయించుకోవచ్చు.

అభిప్రాయాలు, మనస్సాక్షినిబట్టి తీసుకునే నిర్ణయాలు విభిన్నంగా ఉండవచ్చంటే, వివాదాంశం పర్యవసానరహితమని దానర్థమా? ఎంతమాత్రం కాదు. అది గంభీరమైన విషయమే. అయితే, ప్రాథమికంగా ఆ వివాదాంశం సరళమైనది. పైన ప్రస్తావించబడిన సమాచారమంతా యెహోవాసాక్షులు యథాతథంగా రక్తాన్నీ, దానిలోని ప్రధాన భాగాలను ఎక్కించుకోవడానికి నిరాకరిస్తారని చూపిస్తుంది. క్రైస్తవులు ‘విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తాన్ని, జారత్వాన్ని విసర్జించాలి’ అని బైబిలు నిర్దేశిస్తోంది. (అపొస్తలుల కార్యములు 15:29) దానికిమించి, రక్తంలోని ప్రధాన భాగాల్లోని సూక్ష్మభాగాల విషయానికి వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవుడు విషయాన్ని జాగ్రత్తగా, ప్రార్థనా పూర్వకంగా ధ్యానించి, తన మనస్సాక్షినిబట్టి సొంతగా నిర్ణయించుకోవాలి.

చాలామంది, తక్షణ ఉపశమనమిచ్చే ఏ చికిత్సనైనా, అంటే దానిలో ఆరోగ్య ప్రమాదాలున్నాయని తెలిసినప్పటికీ, దాన్ని అంగీకరించడానికి సుముఖంగా ఉంటారు, రక్తం నుండి తయారుచేసిన ఉత్పత్తుల విషయంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. నిజ క్రైస్తవుడు భౌతిక విషయాలకంటే ఎక్కువే ఇమిడివున్న మరింత విస్తృతమైన, సమతుల్యమైన దృక్కోణంతో ఉండడానికి కృషిచేస్తాడు. మెరుగైన వైద్య చికిత్సను అందించే ప్రయత్నాలపట్ల యెహోవాసాక్షులు కృతజ్ఞతతో ఉంటారు, అలాగే వారు ఏ చికిత్సయినా అందులోని ప్రమాదాల/ప్రయోజనాల నిష్పత్తిని అంచనా వేసుకుంటారు. అయితే, రక్తం నుండి తయారుచేసిన ఉత్పత్తుల విషయంలో వారు, తమ జీవదాతయైన దేవుడు చెబుతున్న విషయాలను, ఆయనతో తమకున్న సంబంధాన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటారు.​—⁠కీర్తన 36:⁠9.

“దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. . . . యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు” అని వ్రాసిన కీర్తనకర్తలాంటి నమ్మకాన్నే కలిగివుండడం ఒక క్రైస్తవునికి ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా!​—⁠కీర్తన 84:11, 12.

[అధస్సూచి]

^ పేరా 13 కావలికోట (ఆంగ్లం) జూన్‌ 15, 1978, మరియు, అక్టోబరు 1, 1994 సంచికల్లో “పాఠకుల ప్రశ్నలు” చూడండి. మందుల కంపెనీలు రక్తం నుండి సేకరించబడని కొన్ని సింథటిక్‌ ఉత్పత్తుల్ని అభివృద్ధిపరచాయి. అందువల్ల గతంలో రక్తంలోని సూక్ష్మభాగాల కోసం వాడబడిన వాటికి బదులు వీటిని వాడేందుకు వైద్యులు సిఫారసు చేయవచ్చు.

[31వ పేజీలోని బాక్సు]

వైద్యుడిని అడగడానికి సూచించబడిన ప్రశ్నలు

రక్తం నుండి తయారుచేసిన ఉత్పత్తిని ఉపయోగించే శస్త్రచికిత్స లేదా చికిత్స మీకు అవసరమైతే ఇలా అడగండి:

నేనొక యెహోవాసాక్షిగా ఎట్టి పరిస్థితుల్లోను నాకు ఎలాంటి రక్త మార్పిడి (రక్తాన్ని యథాతథంగా ఎక్కించడం, ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ప్లేట్‌లెట్‌లను, లేదా రక్తంలోని ప్లాస్మాను ఎక్కించడం) చేయకూడదని నిర్దేశిస్తున్నట్లుగా నాకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిలో అందరికీ తెలుసా?

సిఫారసు చేయబడే మందేదైనా బహుశా రక్తంలోని ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు లేదా తెల్ల రక్త కణాలు, లేక ప్లేట్‌లెట్‌ల నుండి తయారుచేసినదైతే ఇలా అడగండి:

ఆ మందు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల్లో ఒకదాని నుండే తయారుచేయబడిందా? అలాగైతే, అదెలా తయారుచేయబడిందో నాకు వివరించగలరా?

రక్తం నుండి తయారైన ఈ మందు ఎంత మోతాదులో ఇవ్వబడుతుంది, ఎలా ఇవ్వబడుతుంది?

రక్తంలోని ఈ సూక్ష్మభాగాన్ని నేను అంగీకరించడానికి నా మనస్సాక్షి అనుమతిస్తే, ఆ చికిత్స మూలంగా వైద్యపరంగా ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి?

ఈ సూక్ష్మభాగాన్ని నిరాకరించాలని నా మనస్సాక్షి నన్ను ప్రేరేపిస్తే వేరే ఎలాంటి చికిత్సలకు అవకాశముంది?

ఈ విషయాన్ని నేను మరింతగా ఆలోచించిన తర్వాత, నా నిర్ణయం గురించి నేను మీకెప్పుడు తెలుపవచ్చు?