కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి మీపట్ల నిజంగా శ్రద్ధ ఉంది

దేవునికి మీపట్ల నిజంగా శ్రద్ధ ఉంది

దేవునికి మీపట్ల నిజంగా శ్రద్ధ ఉంది

మనం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించడం సహజమే. ఎందుకంటే ఆయన “అధిక శక్తిగలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు.” (కీర్తన 147:⁠5) మన సమస్యలను అధిగమించేలా మనకు సహాయం చేసేందుకు ఆయనే అత్యంత సమర్థుడు. దానికితోడు ఆయన సన్నిధిలో ‘మన హృదయాలు కుమ్మరించాలని’ బైబిలు మనల్ని ఆహ్వానిస్తోంది. (కీర్తన 62:⁠8) అలాంటప్పుడు చాలామంది, దేవుడు తమ ప్రార్థనలకు జవాబివ్వడం లేదనే అభిప్రాయంతో ఎందుకున్నారు? అంటే నిజంగానే ఆయనకు మనపట్ల శ్రద్ధలేదని దానర్థమా?

దేవుడు జోక్యం చేసుకోవడం లేదని ఏ మాత్రం అనిపించినా వెంటనే ఆయనను నిందించడానికి బదులు, మీ చిన్నప్పటి రోజుల్ని గుర్తుతెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మీరు అడిగిందల్లా ఇవ్వనప్పుడు, వాళ్లకు మీ మీద ప్రేమ లేదని మీరెప్పుడైనా వారిని నిందించారా? చాలామంది పిల్లలు అలాగే నిందిస్తారు. కానీ మీ మీద ప్రేమ అనేక విధాలుగా చూపబడిందనీ, అలాగే అడిగిందల్లా ఇవ్వడమే నిజమైన ప్రేమ కాదనీ మీరు పెరిగి పెద్దయ్యాక గ్రహించారు.

అదే ప్రకారంగా, మన అభీష్టం మేరకు మన ప్రార్థనలకు యెహోవా అన్ని సందర్భాల్లో జవాబివ్వకపోయినంత మాత్రాన, ఆయన మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని దానర్థం కాదు. నిజానికి, దేవుడు అనేక విధాలుగా మనందరిపట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు.

“మనమాయనయందు బ్రదుకుచున్నాము”

మొట్టమొదట, దేవుని మూలంగానే ‘మనం బ్రదుకుతున్నాము, చలిస్తున్నాము, ఉనికికలిగి ఉన్నాము.’ (అపొస్తలుల కార్యములు 17:​28) మనమంటే ఆయనకు శ్రద్ధ ఉందనడానికి ఆయన మనకిచ్చిన జీవమే స్పష్టమైన రుజువు!

అంతేకాకుండా, మనం జీవంతో ఉండడానికి కావలసినవన్నీ యెహోవా దయచేస్తున్నాడు. మనమిలా చదువుతాం: “పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు.” (కీర్తన 104:​14) వాస్తవానికి, మన సృష్టికర్త మన జీవితావసరాలను తీర్చడం కంటే ఎక్కువే చేస్తున్నాడు. ఆయన మనకు ఉదారముగా ‘ఆకాశమునుండి వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేస్తూ, ఉల్లాసముతో మన హృదయములను నింపుతున్నాడు.’​—⁠అపొస్తలుల కార్యములు 14:17.

‘దేవుడు మనలను ఇంతగా ప్రేమిస్తున్నట్లయితే, మనకు బాధలు కలగడానికి ఆయనెందుకు అనుమతిస్తున్నాడు?’ అని కొందరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఆ ప్రశ్నకు జవాబేమిటో మీకు తెలుసా?

దేవుడే బాధ్యుడా?

మానవాళి అనుభవించే బాధల్లో అనేకం స్వీయాకృతాలే. ఉదాహరణకు, కొన్నిరకాల కార్యకలాపాలు ప్రమాదభరితమని చాలామందికి తెలుసు. అయినాసరే, ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడుతున్నారు, మత్తుపానీయాలను, మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేస్తున్నారు, పొగాకు వాడుతున్నారు, ప్రాణాపాయకరమైన క్రీడల్లో పాల్గొంటున్నారు, మితిమీరిన వేగంతో డ్రైవింగ్‌ చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటి హానికరమైన ప్రవర్తన కారణంగా బాధలు కలిగితే దానికి ఎవరు బాధ్యులు? దేవుడా లేక అజ్ఞానంగా ప్రవర్తించిన వ్యక్తా? దేవుని ప్రేరేపిత వాక్యమిలా చెబుతోంది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”​—⁠గలతీయులు 6:⁠7.

దానికితోడు, మానవులు తరచూ ఒకరినొకరు బాధపెట్టుకుంటుంటారు. ఒక దేశం యుద్ధం ప్రకటించినప్పుడు, దాని ఫలితంగా కలిగే బాధలకు నిశ్చయంగా దేవుడు నిందార్హుడు కాడు. ఒక నేరస్థుడు తోటి పౌరునిపై దాడిచేస్తే దానివల్ల కలిగే హానికి లేదా మరణానికి దేవుడు బాధ్యుడా? ఎంతమాత్రం కాదు! ఒక నియంత తన ఆధీనంలో ఉన్నవారిని అణచివేస్తూ, హింసిస్తూ, హత్యలకు పాల్పడితే దానికి మనం దేవుణ్ణి నిందించాలా? అది అసమంజసంగా ఉంటుంది.​—⁠ప్రసంగి 8:9.

మరి బీదరికంలో మగ్గుతున్న లేదా ఆకలితో అలమటిస్తున్న లక్షలాదిమంది విషయమేమిటి? దానికి దేవుడు బాధ్యుడా? కానేకాదు. మన భూమి ప్రతీ ఒక్కరికి సరిపడేంతకంటే ఎక్కువ ఆహారాన్నే ఉత్పత్తి చేస్తోంది. (కీర్తన 10:2, 3; 145:​16) దేవుడు అనుగ్రహించిన సమృద్ధిని సరిగా సరఫరా చేయకపోవడమే విస్తృతంగా వ్యాపించిన ఆకలిబాధలకు, బీదరికానికి కారణమవుతోంది. ఆ సమస్య పరిష్కారానికి మానవ స్వార్థం అడ్డుపడుతోంది.

ప్రధాన కారణం

ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేదా వృద్ధాప్యంవల్ల మరణిస్తే దానికి ఎవరిని నిందించాలి? దానికి కూడా దేవుడు నిందార్హుడుకాదని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగిస్తోందా? దేవుడు, మానవుణ్ణి వృద్ధుడై చనిపోవడానికి సృష్టించలేదు.

మొదటి మానవ దంపతులైన ఆదాము హవ్వలను ఏదెను వనంలో పెట్టినప్పుడు, భూపరదైసులో నిత్యం జీవించే ఉత్తరాపేక్షను యెహోవా వారి ముందుంచాడు. అవును, తమ వారసత్వ సంపదను విలువైనదిగా ఎంచే మానవులతో ఈ భూమిని నింపాలని ఆయన కోరుకున్నాడు. అందువల్ల, ఆయన వారి భవిష్యత్‌ జీవిత ఉత్తరాపేక్షలకు షరతులు పెట్టాడు. ఆదాము హవ్వలు తమ ప్రేమగల సృష్టికర్తకు విధేయత చూపినంత కాలమే పరదైసులో జీవించగలుగుతారు.​—⁠ఆదికాండము 2:​17; 3:⁠2, 3, 17-23.

కానీ విచారకరంగా, ఆదాము హవ్వలు తిరుగుబాటు చేశారు. హవ్వ అపవాదియగు సాతాను మాట వినడానికి నిర్ణయించుకుంది. దేవుడు మేలైనదేదో ఆమెకు దక్కకుండా చేస్తున్నాడని సాతాను ఆమెతో అబద్ధాలు చెప్పాడు. అందువల్ల ఆమె స్వేచ్ఛా మార్గం చేపట్టడానికి, ‘మంచి చెడ్డలు ఎరిగిన దేవునివలె’ ఉండడానికి ప్రయత్నించింది. ఆ తిరుగుబాటులో ఆదాము కూడా ఆమెతో చేతులు కలిపాడు.​—⁠ఆదికాండము 3:⁠5, 6.

ఆ విధంగా ఆదాము హవ్వలు పాపం చేయడం ద్వారా, వారు నిరంతరం జీవించడానికి తాము అర్హులం కాదని నిరూపించుకున్నారు. వారు వినాశనకరమైన పాపపు ఫలితాలు అనుభవించారు. వారి బలం, చేవ ఉడిగి చివరకు చనిపోయారు. (ఆదికాండము 5:⁠5) అయితే, వారి తిరుగుబాటు పర్యవసానాలు అంతకంటే తీవ్రమైనవి. ఆదాము హవ్వల పాపపు ప్రభావాలతో మనమింకా బాధ అనుభవిస్తూనే ఉన్నాం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:​12) అవును, ఆదాము హవ్వల తిరుగుబాటు కారణంగా పాపమరణాలు మరణకరమైన వ్యాధిలా మానవజాతి అంతటికీ వ్యాపించాయి.

దేవుని శ్రద్ధకు అత్యంత బలమైన రుజువు

అంటే దేవుడు సృష్టించిన మానవులు ఇక శాశ్వతంగా నాశనమైపోయినట్లే అని దానర్థమా? కాదు, దేవునికి మనమంటే శ్రద్ధ ఉందనడానికి బలమైన రుజువు ఇక్కడే కనిపిస్తుంది. దేవుడు తనవైపు నుండి గొప్ప త్యాగంచేస్తూ మానవాళిని పాపమరణాల నుండి విమోచించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరిపూర్ణమైన యేసు ప్రాణం, ఆయన దానిని మన తరఫున ఇష్టపూర్వకంగా అర్పించాడు. (రోమీయులు 3:​24) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) ప్రేమకు సంబంధించిన ఈ అసాధారణమైన చర్య ఫలితంగా, మనకు తిరిగి నిత్యజీవపు ఉత్తరాపేక్ష లభించింది. రోమీయులకు పౌలు ఇలా వ్రాశాడు: “ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.”​—⁠రోమీయులు 5:​18.

దేవుని నిర్ణయకాలంలో ఈ భూగ్రహంపై ఇక ఎన్నటికీ బాధ, మరణం ఉండవనే నమ్మకంతో మనం ఉండవచ్చు. వాటికి బదులు, ప్రకటన గ్రంథంలో ముందుగానే చూపబడిన ఈ పరిస్థితులు విలసిల్లుతాయి: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:​3, 4) కానీ ‘ఆ కాలం వచ్చేవరకు నేను బ్రతికి ఉండను’ అని మీరు అంటారేమో. అయితే వాస్తవమేమిటంటే, మీరు బ్రతికి ఉండే అవకాశముంది. మీరొకవేళ చనిపోయినా, దేవుడు మృతుల్లో నుండి మిమ్మల్ని లేపగలడు. (యోహాను 5:​28, 29) మనకొరకు దేవుడు సంకల్పించింది అదే, అది తప్పక జరిగి తీరుతుంది. దేవునికి మానవాళిపట్ల శ్రద్ధ లేదని చెప్పడం ఎంత అసత్యమో కదా!

“దేవునియొద్దకు రండి”

మానవ బాధలకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారానికి దేవుడు చొరవ తీసుకున్నాడని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది. మరైతే ప్రస్తుత విషయమేమిటి? మన ప్రియమైన వారొకరు చనిపోతే లేక మన పిల్లవాడికి జబ్బుచేస్తే అప్పుడు మనమేమి చేయవచ్చు? దేవుడు వ్యాధిని, మరణాన్ని తీసివేసే సమయమింకా రాలేదు. వాటి నిర్మూలనకు మనమింకా కొద్దికాలం వేచి ఉండాలని బైబిలు సూచిస్తోంది. అయితే మనకెలాంటి సహాయం లేకుండా దేవుడు మనలను విడిచిపెట్టలేదు. శిష్యుడైన యాకోబు ఇలా చెప్పాడు: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:⁠8) అవును, సృష్టికర్త తనతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకొమ్మని మనలను ఆహ్వానిస్తున్నాడు, అలాంటి సన్నిహిత సంబంధం ఉన్నవారికి అతి కష్టభరితమైన పరిస్థితుల్లో సైతం ఆయన మద్దతు తమకుందనే భావన ఉంటుంది.

అయితే మనమెలా దేవునియొద్దకు చేరగలం లేదా సన్నిహితులం కాగలం? దావీదు రాజు దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం అలాంటి ప్రశ్నే అడిగాడు, ఆయనిలా అన్నాడు, “యెహోవా . . . నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు?” (కీర్తన 15:⁠1) ఆ ప్రశ్నకు తానే జవాబిస్తూ దావీదు ఇంకా ఇలా అన్నాడు: “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు.” (కీర్తన 15:​2, 3) మరొక విధంగా చెప్పాలంటే, ఆదాము హవ్వలు నిరాకరించిన జీవన విధానాన్ని అనుసరించే వారిని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. తన చిత్తం చేసేవారికి ఆయన సన్నిహితమవుతాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:​24, 25; 1 యోహాను 5:⁠3.

మనం దేవుని చిత్తం ఎలా చేయగలం? మొదట మనం “మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు” నేర్చుకొని, ఆ తర్వాత దానికి అనుగుణంగా ప్రవర్తించాలని నిర్ణయించుకోవాలి. (1 తిమోతి 2:⁠3) ఆ నిర్ణయంలో దేవుని వాక్యమైన బైబిలు ప్రామాణిక పరిజ్ఞానం సంపాదించుకోవడం ఇమిడివుంది. (యోహాను 17:3; 2 తిమోతి 3:​16, 17) దానికి ఊరకే బైబిలు చదివితే సరిపోదు. పౌలు ప్రచారం విన్న బెరయలోని మొదటి శతాబ్దపు యూదులను మనం అనుకరించాలి. వారి గురించి మనమిలా చదువుతాము: ‘వీరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి, సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.’​—⁠అపొస్తలుల కార్యములు 17:​11.

అదే ప్రకారం నేడు కూడా జాగ్రత్తతో చేసే బైబిలు అధ్యయనం దేవుని మీదున్న మన విశ్వాసాన్ని దృఢపరిచి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 11:⁠6) అలాగే యెహోవా మానవాళితో అంటే సరైన మనోవైఖరిగల వారందరితో కేవలం స్వల్పకాల ప్రయోజనాల కోసం కాదుగానీ దీర్ఘకాలిక మేలుకోసం ఖచ్చితంగా ఎలా వ్యవహరిస్తాడో అర్థంచేసుకోవడానికి కూడా మనకు సహాయం చేస్తుంది.

దేవునితో సన్నిహిత సంబంధంగల కొద్దిమంది క్రైస్తవుల మాటలు పరిశీలించండి. “నేను యెహోవాను ఎంతో ప్రేమిస్తున్నాను, నేనాయనకు కృతజ్ఞత చెల్లించాల్సింది ఎంతో ఉంది. ఆయనపట్ల నిజమైన ప్రేమవున్న, ఆయన వాక్యానుసారం నాకు బోధించిన ప్రేమగల తల్లిదండ్రులను ఆయన నాకు ప్రసాదించాడు” అని 16 సంవత్సరాల డానియెల్లీ చెబుతోంది. ఉరుగ్వేలోని ఒక క్రైస్తవుడు ఇలా వ్రాస్తున్నాడు: “కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది, యెహోవా చూపిన ఉచిత కృపనుబట్టి, ఆయన స్నేహాన్నిబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పేలా నేను పురికొల్పబడ్డాను.” చిన్న పిల్లలను సైతం దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఏడు సంవత్సరాల గాబ్రియేలా ఇలా చెబుతోంది: “నేను ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించేది దేవుణ్ణే! నాకు నా సొంత బైబిలు ఉంది. దేవుని గురించి, ఆయన కుమారుని గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం.”

నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, “దేవుని పొందు ధన్యకరము” అని చెప్పిన కీర్తనకర్తతో హృదయపూర్వకంగా ఏకీభవిస్తారు. (కీర్తన 73:​28) వారిప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను తాళుకోవడానికి సహాయం పొందారు, అలాగే వారికి భూపరదైసులో నిత్యం జీవించే నిశ్చయమైన ఉత్తరాపేక్ష ఉంది. (1 తిమోతి 4:⁠8) కాబట్టి మీరు ‘దేవునియొద్దకు వెళ్ళడాన్ని’ లేదా సన్నిహితమవడాన్ని లక్ష్యంగా ఎందుకు పెట్టుకోకూడదు? నిజానికి, మనకిలా హామీ ఇవ్వబడింది: “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:⁠26) అవును, దేవునికి మీపట్ల నిజంగా శ్రద్ధ ఉంది!

[5వ పేజీలోని చిత్రాలు]

మనమంటే యెహోవాకున్న శ్రద్ధ అనేక విధాలుగా రుజువవుతోంది

[7వ పేజీలోని చిత్రం]

చిన్నపిల్లలు సైతం దేవునికి సన్నిహితులు కాగలరు

[7వ పేజీలోని చిత్రాలు]

నేడు వ్యాధిని, మరణాన్ని సహించడానికి యెహోవా మనకు సహాయం చేస్తున్నాడు, తగినకాలంలో ఆయన వాటిని తొలగిస్తాడు