కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తీవ్రమైన దుఃఖమున్నా సంతృప్తికరమైన జీవితం

తీవ్రమైన దుఃఖమున్నా సంతృప్తికరమైన జీవితం

జీవిత కథ

తీవ్రమైన దుఃఖమున్నా సంతృప్తికరమైన జీవితం

ఓడ్రీ హైడ్‌ చెప్పినది

నేను చేసిన 63 సంవత్సరాల పూర్తికాల పరిచర్యను, అందులో 59 సంవత్సరాలు యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో చేసిన సేవను పునరాలోచిస్తే, నేను సంతృప్తికరమైన జీవితమే జీవించానని చెప్పగలను. నిజమే, నా మొదటి భర్త క్యాన్సర్‌తో చనిపోవడం, నా రెండవ భర్త అల్జెమీర్‌ వ్యాధి భయానక ప్రభావాలవల్ల చనిపోవడం తట్టుకోలేని విషయాలే. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నా ఆనందాన్ని నేనెలా కాపాడుకున్నానో మీకు చెప్పనివ్వండి.

నెబ్రాస్కా సరిహద్దుకు దగ్గర్లో, కొలొరాడో ఈశాన్య మైదానాలకు ఆనుకొనివున్న హాక్స్‌టన్‌ పట్టణానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నా బాల్యం గడిచింది. ఓరెల్‌, నీన మోక్‌ దంపతుల ఆరుగురు పిల్లల్లో నేను ఐదవదాన్ని. వారికి 1913-1920 మధ్యకాలంలో రస్సెల్‌, వేన్‌, క్లారా, ఆర్డిస్‌ జన్మించగా ఆ తరువాతి సంవత్సరం నేను జన్మించాను. కర్టిస్‌ 1925లో జన్మించాడు.

మా అమ్మ 1913లో బైబిలు విద్యార్థిని అయ్యింది, ఆ కాలంలో యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులని పిలువబడేవారు. ఆ తర్వాత కుటుంబంలోని వారందరం కూడా యెహోవాసాక్షులమయ్యాం.

మైదానాల్లోని ఆరోగ్యదాయకమైన జీవితం

నాన్నగారు చక్కని అభ్యుదయ భావాలున్న వ్యక్తి. మా వ్యవసాయ క్షేత్రంలోని మా ఇళ్ళన్నింటిలో విద్యుద్దీపాలు ఉండేవి, ఆ రోజుల్లో ఇలా ఉండడం చాలా అరుదు. అలాగే మా ఇంట్లో పాడి అంటే కోడిగుడ్లు, ఆవు పాలు, మీగడ, వెన్న పుష్కలంగా ఉండేది. పొలం దున్నడానికి గుర్రాలను ఉపయోగించేవాళ్ళం, మేము స్ట్రాబెర్రీలు, ఆలుగడ్డలు వాటితోపాటు గోధుమ, మొక్కజొన్న సాగుచేసే వాళ్లం.

పిల్లలంతా పనిచేయడం నేర్చుకోవాలని మా నాన్నగారి ఉద్దేశం. నేను పాఠశాలకు వెళ్లకముందే పొలాల్లో పనిచేయడం నాకు నేర్పించారు. వేసవి మండుటెండలో మా తోటలో కలుపు తీయడం నాకింకా గుర్తుంది. ‘ఆ చివరి వరకు నేనసలు చేరుకుంటానా?’ అని అనుకునేదాన్ని. ఒళ్లంతా చెమట ధారలు కట్టేది, తేనెటీగలు కుట్టేవి. కొన్నిసార్లు నా మీద నాకే చాలా జాలికలిగేది, ఎందుకంటే ఇతర పిల్లలెవరూ చేయనంతగా మేము కష్టపడి పని చేసేవాళ్ళం. నా బాల్యాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అలా పనిచేయడం మాకు నేర్పించినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.

మా అందరికీ పనులుండేవి. ఆర్డిస్‌ నాకంటే బాగా పాలు పితికేది, అందువల్ల గుర్రపు శాలలో గదులు శుభ్రంచేయడం, పేడ బయటకు నెట్టడం నా పని. పనితోపాటు మేము సరదాగా ఆటలు కూడా ఆడుకునే వాళ్లం. స్థానిక జట్టులో నేను, ఆర్డిస్‌ బేస్‌బాల్‌ ఆడేవాళ్లం. నేను మూడవ బేస్‌ నుండి బంతి విసరడమో, ఆడడమో చేస్తే, ఆర్డిస్‌ మొదటి బేస్‌ నుండి ఆడేది.

ఆ మైదానపు ప్రాంతాల్లో రాత్రిపూట కనబడే నిర్మలమైన ఆకాశం ఎంతో అందంగా కనిపించేది. వేలాది నక్షత్రాలు మన సృష్టికర్తయైన యెహోవా దేవుణ్ణి నాకు గుర్తుచేసేవి. చిన్నతనంలోనే నేను కీర్తన 147:4లోని మాటల గురించి ఆలోచించే దాన్ని. అక్కడిలా ఉంది: “నక్షత్రముల సంఖ్యను ఆయన [యెహోవా] నియమించియున్నాడు; వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.” అలాంటి నిర్మలాకాశపు అనేక రాత్రులు మా కుక్క జడ్జ్‌ నా ఒళ్లో తలపెట్టి పడుకొని నాకు తోడుగా ఉండేది. నేను మధ్యాహ్నాలు తరచూ మా వసారాలో కూర్చొని పచ్చని గోధుమ పంటచేల మీదుగా పైరగాలి వీచినప్పుడల్లా అవి సూర్యకాంతిలో వెండిలా మిలమిలాడ్డం చూసి ఆనందించేదాన్ని.

అమ్మ చక్కని మాదిరి ఉంచింది

మా అమ్మ అంకితభావంగల భార్యగా ఉండేది. మా నాన్నగారు ఎప్పుడూ చక్కని ఇంటి యజమానిగా వ్యవహరించేవారు, ఆయనను గౌరవించడం మా అమ్మ మాకు నేర్పింది. 1939లో ఆయన కూడా యెహోవాసాక్షి అయ్యారు. మమ్మల్ని అతి గారాబం చేయకుండా మేము కష్టపడి పనిచేసేలా ఆయన చూసినప్పటికీ, మా నాన్నగారు మమ్మల్ని ప్రేమించేవారని మాకు తెలుసు. ఆయన శీతాకాలంలో తరచూ మంచుమీద గుర్రాలు లాగే బల్లపరుపు చెక్కపై మేము విహరించేలా ఏర్పాటు చేసేవారు. మెరిసే ఆ మంచు చూసి మేమెంత ఆనందించేవాళ్లమో!

నిజానికి మేము దేవుణ్ణి ప్రేమించేలా, బైబిలును గౌరవించేలా మాకు నేర్పింది మా అమ్మే. దేవుని పేరు యెహోవా అనీ, ఆయనే జీవానికి ఊట అనీ మేము తెలుసుకున్నాము. (కీర్తన 36:9; 83:​18) మనకు ఆనందం లేకుండా చేయాలని కాదుగానీ ప్రయోజనం కలగడానికే ఆయన మనకు మార్గదర్శక సూత్రాలిచ్చాడని కూడా మేము తెలుసుకున్నాము. (యెషయా 48:​17) చేయడానికి మాకొక ప్రత్యేకమైన పని ఉందనే వాస్తవాన్ని మా అమ్మ ఎప్పుడూ నొక్కి చెబుతుండేది. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు తన అనుచరులకు చెప్పాడని మేము తెలుసుకున్నాం.​—⁠మత్తయి 24:14.

మా చిన్నతనంలో, నేను పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మ ఇంట్లో లేనప్పుడల్లా ఆమెను వెతుక్కుంటూ వెళ్లేదాన్ని. అలాగే నాకు ఆరేడు సంవత్సరాలున్నప్పుడు ఒకసారి నేను మా అమ్మను వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె గుర్రాల శాలలో ఉంది. అప్పుడు కుండపోతగా వర్షం కురవడం మొదలుపెట్టింది. మేము గడ్డిపేర్చే అటకమీద ఉన్నాము, అప్పుడు నేను, దేవుడు మళ్లీ జలప్రళయం తీసుకొస్తున్నాడా అని అమ్మను అడిగాను. దేవుడు జలప్రళయం ద్వారా ఇక ఎన్నడూ భూమిని నాశనం చేయనని వాగ్దానం చేశాడని నాకు హామీ ఇచ్చింది. ఆ ప్రాంతంలో తుఫానులు రావడం మామూలే కాబట్టి చాలాసార్లు మేము నేల మాళిగలోకి పరిగెత్తడం కూడా నాకు గుర్తుంది.

నేను పుట్టకముందే, మా అమ్మ ప్రకటనా పనిలో భాగం వహించింది. మా ఇంట్లోనే కొంతమంది కలుసుకునేవారు వారందరికీ పరలోకంలో క్రీస్తుతోపాటు జీవించే నిరీక్షణే ఉంది. మా అమ్మకు ఇంటింటికి వెళ్లి ప్రకటించడం ఒక సవాలుగా ఉన్నప్పటికీ, ఆమె దేవునిపట్ల తనకున్న ప్రేమనుబట్టి ఆ భయాన్ని అధిగమించింది. తన 84 ఏళ్ల వయస్సులో 1969 నవంబరు 24న చనిపోయేంతవరకు ఆమె విశ్వసనీయంగా జీవించింది. “అమ్మా నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, అక్కడ నీకు తెలిసినవారితో నువ్వుంటావు” అని నేను ఆమె చెవిలో చెప్పాను. ఆమె చనిపోయినప్పుడు నేనామె దగ్గరవుండి తనతో నా నమ్మకం పంచుకోగలిగినందుకు నేనెంత సంతోషపడ్డానో! ఆమె మెల్లిగా “నేనంటే నీకెంత ప్రేమో” అని అంది.

మేము ప్రకటించడం ఆరంభించాము

1939లో రస్సెల్‌ పయినీరు అయ్యాడు, యెహోవాసాక్షుల్లోని పూర్తికాల సువార్తికులు పయినీర్లని పిలువబడతారు. ఆయన ఓక్లహామాలో, నెబ్రాస్కాలో పయినీరు సేవచేస్తుండగా, 1944 లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న (బెతెల్‌ అని పిలువబడే) యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవచేయడానికి ఆహ్వానించబడ్డాడు. నేను 1941, సెప్టెంబరు 20న పయినీరు సేవ ఆరంభించి, కొలొరాడో, కాన్జాస్‌, నెబ్రాస్కా వంటి వివిధ ప్రాంతాల్లో సేవచేశాను. యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయగలిగినందుకే కాదు ఆయనపై ఆధారపడడం నేర్చుకున్నందువల్ల పయినీరు సేవచేసిన ఆ సంవత్సరాలు సంతోషంగా గడిచాయి.

రస్సెల్‌ పయినీరు సేవ ఆరంభించేటప్పటికి, వేన్‌ అప్పటికే తనకాళ్లపై తాను నిలబడడానికి కొద్దికాలం ఉద్యోగం చేసి, ఆ తర్వాత తూర్పు తీరంలోని ఒక కాలేజీలో చదువు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన కూడా బెతెల్‌కు ఆహ్వానించబడ్డాడు. ఆయన కొంతకాలం న్యూయార్క్‌లోని ఇథాకా సమీపంలో ఉన్న రాజ్య వ్యవసాయ క్షేత్రంలో పనిచేశాడు. అక్కడే ఆ వ్యవసాయ క్షేత్రంలోవున్న చిన్న కుటుంబానికి, బ్రూక్లిన్‌ బెతెల్‌లో పనిచేస్తున్న 200 మంది సిబ్బందికి ఆహారం పండించబడేది. వేన్‌ 1988లో చనిపోయేంత వరకు యెహోవా సేవలో తన నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించాడు.

మా అక్క ఆర్డిస్‌, జేమ్స్‌ కెర్న్‌ను వివాహం చేసుకుంది, వారిది ఐదుగురు పిల్లలుగల కుటుంబం. ఆమె 1997లో చనిపోయింది. ఇంకో అక్క క్లారా ఇప్పటికీ యెహోవాను నమ్మకంగా సేవిస్తూవుంది, నేను సెలవు తీసుకున్నప్పుడల్లా కొలొరాడోలోవున్న ఆమె ఇంటికి వెళుతుంటాను. మా తమ్ముడు కర్టిస్‌ 1940లలో బ్రూక్లిన్‌ బెతెల్‌కు వచ్చాడు. ఆయన బ్రూక్లిన్‌ నుండి వ్యవసాయ క్షేత్రానికీ, వ్యవసాయ క్షేత్రం నుండి బ్రూక్లిన్‌కూ వివిధ రకాల సరుకులు, సామగ్రి రవాణా చేస్తుండేవాడు. ఆయన పెళ్లిచేసుకోలేదు, 1971లో ఆయన చనిపోయాడు.

బెతెల్‌ సేవచేయాలనే నా కోరిక

మా అన్నయ్యలు ముందే బెతెల్‌ సేవకు వెళ్లారు, నేను కూడా అక్కడ సేవచేయాలని కోరుకున్నాను. వారి మంచి మాదిరే నేను అక్కడకు ఆహ్వానించబడేందుకు దారితీసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుని సంస్థయొక్క చరిత్ర గురించి మా అమ్మ చెప్పింది వినడం, అంత్యదినాలకు సంబంధించిన బైబిలు ప్రవచనాలు నెరవేరడాన్ని స్వయంగా చూడడం బెతెల్‌లో సేవచేయాలనే కోరికను నాలో వృద్ధిచేశాయి. బెతెల్‌లో సేవచేయడానికి నన్ను అనుమతిస్తే, నా క్రైస్తవ బాధ్యతలపట్ల శ్రద్ధ చూపించడానికి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బెతెల్‌ విడిచిపెట్టనని ప్రార్థనలో యెహోవాకు ప్రమాణం చేశాను.

నేను 1945, జూన్‌ 20న బెతెల్‌కు వచ్చాను, అక్కడ నాకు హౌస్‌కీపింగ్‌ పని నియమించబడింది. ప్రతీరోజు నేను 13 గదులు శుభ్రంచేసి 26 పడకలు సిద్ధంచేయడమే కాక వసారాలు, మెట్లు, కిటికీలు కూడా శుభ్రం చేయాలి. పని చాలా కష్టంగా ఉండేది. ప్రతీరోజు పనిచేసేటప్పుడు, నాలో నేను ‘నిజమే నువ్వు అలసిపోయావు, కానీ నువ్వు బెతెల్‌లో దేవుని గృహంలో ఉన్నావ్‌!’ అని చెప్పుకునేదాన్ని.

నేను బెతెల్‌లో సేవచేస్తున్న తొలిరోజుల్లో, నన్ను కంగారుపెట్టిన ఒక సంగతి జరిగింది. పల్లె ప్రాంతాల్లో పెరిగినందువల్ల, సరుకులను క్రింది అంతస్తు నుండి పైఅంతస్తుకు చేరవేసే డంబ్‌వెయిటర్‌ అంటే చిన్నసైజు లిఫ్ట్‌ అని నాకేమాత్రం తెలియదు. ఒకరోజు నేను పనిచేస్తుండగా ఎవరో సహోదరుడు ఫోన్‌చేసి “డంబ్‌వెయిటర్‌ను క్రిందకు పంపండి” అని చెప్పాడు. ఆ ఫోన్‌ చేసిన ఆయన వెంటనే ఫోన్‌ పెట్టేశాడు, ఏం చేయాలో నాకు తోచలేదు. అంతలో నేను హౌస్‌కీపింగ్‌ చేస్తున్న అంతస్తులోనే వెయిటర్‌గా పనిచేస్తున్న ఒక సహోదరుడు ఉంటున్నాడని గుర్తొచ్చింది. వెంటనే ఆయన తలుపుతట్టి “మిమ్మల్ని క్రింద కిచెన్‌కు రమ్మని పిలుస్తున్నారు” అని చెప్పాను.

నేథన్‌ నార్‌ను వివాహం చేసుకోవడం

1920లలో బెతెల్‌లో ఉన్నవారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే బెతెల్‌ విడిచిపెట్టి రాజ్యసేవకు మరోచోటికి వెళ్లవలసి వచ్చేది. అయితే 1950ల తొలి సంవత్సరాల్లో బెతెల్‌లో కొంతకాలం సేవచేసిన కొన్ని జంటలు పెళ్లిచేసుకొని అక్కడే సేవచేయడానికి అనుమతించబడ్డారు. అందువల్ల, ఆ కాలంలో ప్రపంచవ్యాప్త రాజ్య పనికి సారథ్యం వహిస్తున్న నేథన్‌ హెచ్‌. నార్‌ నాపై ఆసక్తి చూపినప్పుడు, ‘ఇదిగో, ఇక్కడ ఉండే వ్యక్తే నాకు లభించాడు’ అని ఎగిరి గంతేశాను!

యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సేవను పర్యవేక్షించడానికి సంబంధించి నేథన్‌కు చాలా బాధ్యతలుండేవి. అందువల్ల, ఆయన వివాహ ప్రతిపాదనను నేను అంగీకరించడానికి ముందు నేను జాగ్రత్తగా ఆలోచించుకోవడానికి అనేక కారణాలు చెబుతూ ఆయన నాతో చాలా నిజాయితీగా వ్యవహరించారు. ఆ రోజుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు సందర్శిస్తూ ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు, కొన్నిసార్లు అనేక వారాలపాటు అలా వెళ్లాల్సివచ్చేది. అందువల్ల మేము ఎడబాటుగా ఉండాల్సిన సమయాలు ఉంటాయని ఆయన నాకు వివరించారు.

యౌవనురాలిగా నేను వసంత రుతువులో పెళ్లిచేసుకొని పసిఫిక్‌ దీవులైన హవాయిలో హనీమూన్‌కి వెళ్లాలని కలలు కన్నాను. కానీ, మేము 1953, శీతాకాలంలో జనవరి 31న పెళ్లి చేసుకొని ఆ శనివారం మధ్యాహ్నం, ఆదివారం న్యూజెర్సీలో మా హనీమూన్‌ జరుపుకున్నాం. సోమవారం మేము మళ్లీ పనిలో చేరిపోయాం. కానీ ఒక వారం తర్వాత, మేము మళ్లీ ఒక వారం రోజులు హనీమూన్‌కి వెళ్లాం.

కష్టపడి పనిచేసే సహవాసి

1923లో నేథన్‌ బెతెల్‌కు వచ్చేసరికి ఆయనకు 18 సంవత్సరాలు. సాక్షుల సేవకు సారథ్యం వహించిన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, ప్రింటరీ మేనేజర్‌ రాబర్ట్‌ జె. మార్టిన్‌ వంటి అనుభవజ్ఞుల నుండి ఆయన విలువైన శిక్షణ పొందారు. 1932లో సహోదరుడు మార్టిన్‌ చనిపోయినప్పుడు, నేథన్‌ ప్రింటరీ మేనేజర్‌ అయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం యూరప్‌లో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలను సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ సందర్శించినప్పుడు, నేథన్‌ను కూడా ఆయన తనవెంట తీసుకెళ్లాడు. 1942 జనవరిలో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ చనిపోయినప్పుడు యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సేవను పర్యవేక్షించే బాధ్యత నేథన్‌కు అప్పగించబడింది.

ప్రగతిశీల భావంతో నేథన్‌ ఎల్లప్పుడూ భవిష్యత్‌ అభివృద్ధికి ముందుగానే పథకాలు వేస్తుండేవాడు. యుగసమాప్తి అత్యంత సమీపంగా ఉంది కాబట్టి ఇది సముచితం కాదని కొందరు తలంచారు. నిజానికి, నేథన్‌ ప్రణాలికల్ని చూసిన ఒక సహోదరుడు “బ్రదర్‌ నార్‌ ఏమిటిదంతా? అంతం సమీపంగా ఉందని మీరు విశ్వసించడం లేదా?” అని అడిగాడు. అందుకాయన “నాకు ఆ విశ్వాసం ఉంది, కానీ మనం ఆశించినంత త్వరగా అంతం రాకపోతే, మనం సిద్ధంగా ఉంటాం.”

మిషనరీల కోసం ఒక పాఠశాల స్థాపించాలనే ఆలోచన నేథన్‌కు ఉండేది. కాబట్టి, 1943 ఫిబ్రవరి 1న రాజ్య వ్యవసాయ క్షేత్రంలో మిషనరీ పాఠశాల ఆరంభించబడింది, అప్పట్లో మా అన్నయ్య వేన్‌ అక్కడే సేవచేసేవాడు. ఆ పాఠశాల విద్యావిధానంలో దాదాపు ఐదు నెలలపాటు బైబిలును లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నప్పటికీ, ఆ విద్యార్థులకు కొంతమేరకు క్రీడా వినోదంకూడా లభించేటట్లు నేథన్‌ చూశాడు. తొలి తరగతులప్పుడు ఆయన కూడా బేస్‌బాల్‌ ఆడేవారు, అయితే దెబ్బలు తగిలి వేసవికాల జిల్లా సమావేశాలకు హాజరుకావడానికి తనకు అంతరాయం కలుగుతుందేమోననే భయంతో ఆయన ఆడడం మానేశారు. బదులుగా ఆయన అంపైర్‌గా ఉండడానికి ఇష్టపడేవారు. ఆడుతున్న విదేశీ విద్యార్థులకు అనుకూలంగా ఆయన ఆట నియమాలను మార్చడం చూసి విద్యార్థులు ఆనందపడిపోయేవారు.

నేథన్‌తో ప్రయాణాలు

చివరకు నేను కూడా నేథన్‌తో విదేశాలకు ప్రయాణం చేయడం ఆరంభించాను. బ్రాంచి స్వచ్ఛంద సేవకులతో, మిషనరీలతో అనుభవాలు పంచుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. నేను వారి ప్రేమను, భక్తిని ప్రత్యక్షంగా చూడడమే కాక వారి నియామక దేశాల్లోని వారి అలవాటు క్రమాన్ని, జీవన పరిస్థితుల గురించి నేర్చుకోగలిగాను. గడచిన చాలా సంవత్సరాలుగా అలాంటి సందర్శనాలపట్ల ప్రశంసను వ్యక్తంచేసే ఉత్తరాలు నేనింకా అందుకుంటూనే ఉన్నాను.

మేము చేసిన ప్రయాణాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకెన్నో అనుభవాలు గుర్తొస్తాయి. ఉదాహరణకు, మేము పోలాండ్‌ను సందర్శించినప్పుడు, ఇద్దరు సహోదరీలు నా సమక్షంలోనే గుసగుసలాడుకోవడం నేను చూశాను. “మీరెందుకు గుసగుసలాడుకుంటున్నారు?” అని నేను వారినడిగాను. వారు దానికి మన్నించమని అడిగి, పోలాండ్‌లో యెహోవాసాక్షుల సేవ నిషేధించబడి వారి ఇళ్లలో రహస్యంగా మైక్రోఫోనులు బిగించిన కారణంగా వారలా గుసగుసలాడేవారని వివరించారు.

పోలాండ్‌లో నిషేధం ఉన్నప్పుడు సేవచేసిన అనేకమందిలో సహోదరి ఆదా ఒకరు. ఆమెకు నుదుటి మీదుగా వేళ్లాడే ఉంగరాల జుట్టు ఉండేది. ఒకసారి ఆమె నుదుటి మీదుగా వేళ్లాడే ఆ జుట్టును పైకెత్తి అక్కడ హింసకు పాల్పడిన ఒక వ్యక్తి కొట్టినందువల్ల లోతుగా ఏర్పడ్డ గాయపు మచ్చను నాకు చూపించింది. మన సహోదర సహోదరీలు భరించవలసివచ్చిన క్రూరత్వపు ఫలితాలెలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూసి నేను నిర్ఘాంతపోయాను.

బెతెల్‌ తర్వాత నాకు బాగా నచ్చిన ప్రాంతం హవాయి. 1957లో హిలో నగరంలో జరిగిన సమావేశం నాకు గుర్తుంది. మొత్తం స్థానిక సాక్షుల కంటే ఎక్కువ మంది హాజరైన ఆ సమావేశం మరువలేనిది. నగర మేయర్‌, నేథన్‌కు అధికారిక ఆహ్వానం పలికాడు. పూదండలతో మమ్మల్ని అభినందించడానికి చాలామంది వచ్చారు.

ఉల్లాసకరమైన మరో సమావేశం 1955లో జర్మనీలోని న్యూరెమ్‌బర్గ్‌లో హిట్లర్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌ అని పిలువబడిన స్టేడియంలో జరిగింది. జర్మనీలో యెహోవా ప్రజలను నామరూపాల్లేకుండా చేస్తానని హిట్లర్‌ ఒట్టుపెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు ఆ స్టేడియమంతా యెహోవాసాక్షులతో నిండిపోయింది! అశ్రువులతో నా కళ్లు నిండిపోయాయి. ఆ వేదిక విశాలంగా ఉండడంతోపాటు దానివెనక పెద్ద స్తంభాలు 144 ఉన్నాయి. వేదికపై కూర్చోవడంవల్ల, ఆ సమావేశానికి వచ్చిన 1,07,000 కంటే ఎక్కువున్న జనసమూహాన్ని చూడగలిగాను. ప్రేక్షకులు ఎంత దూరంవరకు కూర్చున్నారంటే చివరి వరుసను దాదాపు చూడలేకపోయాను.

నాజీ పరిపాలన క్రింద హింస ప్రబలంగా ఉన్న కాలంలో జర్మన్‌ సహోదరులు చూపిన యథార్థతను, యెహోవా నుండి వారు పొందిన బలాన్ని నేను గ్రహించగలిగాను. యెహోవాపట్ల విశ్వాస్యతను, యథార్థతను కాపాడుకోవాలన్న మా నిర్ణయాన్ని అది బలపరిచింది. నేథన్‌ చివరి ప్రసంగమిస్తూ ముగింపులో మేము వెళ్లొస్తాం అన్నట్లు ప్రేక్షకులకు చెయ్యి ఊపాడు. దానికి వాళ్లంతా వెంటనే ప్రతిస్పందిస్తూ వీడ్కోలు చెబుతూ తమ చేతి రుమాళ్లు గాలిలో ఆడించారు. ఆ దృశ్యం విరబూసిన అందమైన పూతోటలా కనిపించింది.

1974 డిసెంబరులో మేము పోర్చుగల్‌ను సందర్శించడం కూడా మరువలేనిదే. మన సేవ చట్టబద్ధంగా గుర్తించబడిన తర్వాత లిస్బన్‌లో సాక్షుల మొదటి కూటానికి మేము హాజరయ్యాం. అక్కడ 50 సంవత్సరాలుగా సేవ నిషేధంలో ఉంది! ఆ సమయంలో, ఆ దేశంలో కేవలం 14,000 మంది సాక్షులే ఉన్నప్పటికీ, అక్కడ నిర్వహించబడిన రెండు కూటాలకు 46,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు. “మేమింక దాక్కోవలసిన అవసరం లేదు. మాకు స్వేచ్ఛ లభించింది” అని సహోదరులు చెప్పినప్పుడు నా కళ్లు చెమర్చాయి.

నేథన్‌తో ప్రయాణాలు చేసిన కాలం దగ్గర నుండి ఇప్పటికీ విమానాల్లో, రెస్టారెంట్లలో అనియత సాక్ష్యమివ్వడమన్నా, వీధి సాక్ష్యమివ్వడమన్నా నాకెంతో ఇష్టం. దాని కోసం సిద్ధంగా ఉండడానికి నేను ఎల్లప్పుడూ సాహిత్యాలు తీసుకెళతాను. ఒక సందర్భంలో ఆలస్యమైన విమానం కోసం వేచి ఉన్నప్పుడు, నేనెక్కడ పనిచేస్తున్నానని ఒక స్త్రీ నన్ను అడిగింది. అది ఆమెతో సంభాషణకు దారితీయగా, మా చుట్టూవున్న ఇతరులు మా సంభాషణ విన్నారు. నా బెతెల్‌ సేవ, ప్రకటనా కార్యక్రమం నేను పనిలో మునిగి ఉండేలా చేయడమే కాక, చాలా సంతోషంగా ఉండేలా చేశాయి.

వ్యాధి మరియు వీడ్కోలు ప్రోత్సాహం

1976లో నేథన్‌కు క్యాన్సర్‌ రావడంతో, ఆ వ్యాధిని తట్టుకోవడానికి, నేను నాతోపాటు ఇతర బెతెల్‌ సభ్యులు ఆయనకు సహాయం చేశాం. ఆరోగ్యం క్షీణిస్తున్నా, ప్రపంచ నలుమూలల నుండి శిక్షణ కోసం బ్రూక్లిన్‌కు వచ్చిన వివిధ బ్రాంచి కార్యాలయాల సభ్యుల్ని మేము మా గదికి ఆహ్వానించేవాళ్లం. డాన్‌, ఎర్లీన్‌ స్టీల్‌; లాయిడ్‌, మెల్బా బ్యారీ; డగ్లస్‌, మేరీ గెస్ట్‌; మార్టిన్‌, గెర్‌ట్రూడ్‌ పోయెట్‌జింగర్‌; ప్రైస్‌ హ్యూస్‌ ఇంకా చాలామంది మమ్మల్ని సందర్శించడం నాకు గుర్తుంది. తరచూ వాళ్లు తమ దేశపు అనుభవాలు మాతో పంచుకునేవారు. ప్రత్యేకంగా నిషేధం క్రిందవున్న మన సహోదరుల స్థిరత్వానికి సంబంధించిన అనుభవాలు నాపై ప్రగాఢ ముద్రవేశాయి.

తనకు మరణం సమీపించిందని గ్రహించిన నేథన్‌, నాకు వియోగాన్ని తట్టుకోవడానికి సహాయపడే కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఆయనిలా చెప్పారు: “మనం సంతోషంగా మన వైవాహిక జీవితం గడిపాం. అలా జీవించడం చాలామందికి సాధ్యం కాదు.” నేథన్‌కున్న ఆలోచనాశీలతే మా వివాహాన్ని సంతోషమయం చేసింది. ఉదాహరణకు, మా ప్రయాణాల్లో మేము వివిధ వ్యక్తులను కలిసినప్పుడు ఆయన నాతో ఇలా అనేవారు: “ఓడ్రీ, కొన్నిసార్లు నేను వారిని నీకు పరిచయం చేయకపోతే, దానికి కారణం నేను వారి పేరు మరచిపోవడమే.” ఆయన ముందుగానే ఆ విషయం నాకు చెప్పినందుకు నేనెంతో సంతోషించాను.

నేథన్‌ నాకిలా గుర్తుచేశారు: “మరణం తర్వాత మన నిరీక్షణ సఫలమవుతుంది, మనం మళ్లీ బాధనెప్పుడూ అనుభవించం.” ఆ పిమ్మట ఆయన నాకిలా ఉద్బోధించాడు: “ముందుకు చూడు, అక్కడే నీ బహుమానముంది. నీ జ్ఞాపకాలు నిన్ను వెంటాడినా, నువ్వు మాత్రం గతంలో జీవించకు. నెమ్మదిగా తేరుకోవడానికి కాలమే నీకు సహాయం చేస్తుంది. నీ మీద నీవే కోపం తెచ్చుకోకు, నీ మీద నీవే జాలిపడకు. నీకు ఈ ఆనందం, ఆశీర్వాదాలు ఉన్నందుకు సంతోషంగా ఉండు. కొంతకాలం గడచిన తర్వాత ఆ జ్ఞాపకాలే నీకు ఆనందాన్నివ్వడం నువ్వు చూస్తావు. జ్ఞాపకాలు దేవుడు మనకిచ్చిన వరాలు.” ఆయనింకా ఇలా అన్నారు: “పనిలో నిమగ్నమై ఇతరులకోసం ఏదైనా చేయడానికి నీ జీవితం ఉపయోగించు. జీవించడంలో ఉన్న ఆనందాన్ని కనుగొనడానికి ఇది నీకు సహాయం చేస్తుంది.” చివరకు 1977 జూన్‌ 8వ తేదీన నేథన్‌ తన భూజీవితం చాలించారు.

గ్లెన్‌ హైడ్‌తో వివాహం

జ్ఞాపకాలతో నేను గతంలో జీవించవచ్చు లేదా ఒక కొత్త జీవితం ఆరంభించవచ్చు అని నేథన్‌ నాకు చెప్పాడు. అందువల్ల నేను న్యూయార్క్‌, వాల్‌కిల్‌లోని వాచ్‌టవర్‌ వ్యవసాయ క్షేత్రాలకు బదిలీ చేయబడిన తర్వాత, చక్కనివాడు, నెమ్మదస్థుడు, మృధుస్వభావి అయిన గ్లెన్‌ హైడ్‌ను వివాహం చేసుకున్నాను. సాక్షి కాకముందు ఆయన జపాన్‌తో అమెరికా యుద్ధం చేసినప్పుడు నౌకాసైన్యంలో పనిచేశాడు.

గ్లెన్‌ PT నౌకలో (గస్తీ జలాంతర్గామిలో) ఇంజన్‌ గదిలో నియమించబడ్డాడు. ఆ ఇంజన్‌ శబ్దం కారణంగా ఆయనకు కాస్త చెవుడు వచ్చింది. యుద్ధం తర్వాత, ఆయన అగ్నిమాపక దళం సభ్యుడయ్యాడు. యుద్ధకాలంనాటి అనుభవాలవల్ల చాలా సంవత్సరాలు ఆయన పీడకలలతో బాధపడ్డాడు. ఆయన తనకు అనియత సాక్ష్యమిచ్చిన తన సెక్రటరీ నుండి బైబిలు సత్యం నేర్చుకున్నాడు.

ఆ తర్వాత 1968లో, గ్లెన్‌ బ్రూక్లిన్‌లో అగ్నిమాపక దళం సభ్యునిగా బెతెల్‌ సేవకు ఆహ్వానించబడ్డాడు. ఆ పిమ్మట వాచ్‌టవర్‌ వ్యవసాయ క్షేత్రాల కోసం అగ్నిమాపక వాహనం ఒకటి కొన్నప్పుడు ఆయనను 1975లో అక్కడకు బదిలీ చేశారు. కొంతకాలానికి, ఆయనకు అల్జెమీర్‌ వ్యాధిసోకింది. మా పది సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత గ్లెన్‌ మరణించాడు.

నేను ఇదంతా ఎలా తట్టుకోగలను? తానిక చనిపోతానని తెలిసినప్పుడు నేథన్‌ నాకిచ్చిన జ్ఞానోపదేశం మళ్లీ నన్ను ఓదార్చింది. భర్త వియోగాన్ని తట్టుకోవడం గురించి ఆయన నాకు వ్రాసిన మాటలను నేను పదేపదే చదువుతూ వచ్చాను. తమ జతను పోగొట్టుకున్న వారితో నేనింకా ఆ వ్యాఖ్యలు పంచుకుంటూనే ఉన్నాను, వాళ్లు కూడా నేథన్‌ సలహానుబట్టి ఓదార్పు పొందుతూ ఉన్నారు. అవును, ఆయన నన్ను ప్రోత్సహించినట్లుగా ముందుకు చూడడమే మేలు.

ప్రశస్తమైన సహోదరత్వం

నా సంతోషభరితమైన, సంతృప్తికరమైన జీవితానికి ముఖ్యంగా బెతెల్‌ కుటుంబంలోని నా ప్రియ స్నేహితులే తోడ్పడ్డారు. ప్రత్యేకంగా ఎస్టెర్‌ లోపెజ్‌, ఈ సహోదరి 1944లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ మూడవ తరగతి పట్టభద్రురాలు. మన బైబిలు సాహిత్యాలను స్పానిష్‌లోకి అనువదించే అనువాదకురాలిగా సేవచేయడానికి ఆమె 1950 ఫిబ్రవరిలో తిరిగి బ్రూక్లిన్‌కు వచ్చింది. నేథన్‌ ప్రయాణమై ఎక్కడికైనా వెళ్లినప్పుడు, తరచూ ఎస్టెర్‌ నాకు తోడుగా ఉండేది. ఆమె కూడా వాచ్‌టవర్‌ వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటోంది. ఇప్పుడామెకు 90 సంవత్సరాల పైనే, ఆరోగ్యం బాగుండడంలేదు, మన ఇన్‌ఫర్మరీలోనే ఆమెను చూసుకుంటున్నారు.

నా కుటుంబ సభ్యుల్లో రస్సెల్‌, క్లారా మాత్రమే ఇంకా బ్రతికున్నారు. 90 ఏళ్లు పైబడిన రస్సెల్‌ బ్రూక్లిన్‌ బెతెల్‌లో నమ్మకంగా సేవచేస్తున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత బెతెల్‌లో ఉండడానికి అనుమతించబడిన మొదటివారిలో ఆయనొకరు. 1952లో ఆయన తోటి బెతెల్‌ సభ్యురాలైన జెన్‌ లార్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు. జెన్‌ తోబుట్టువు మాక్స్‌ 1939లో బెతెల్‌కు వచ్చి 1942లో నేథన్‌ తర్వాత ప్రింటరీ పైవిచారణకర్తగా బాధ్యతలు చేపట్టాడు. మల్టిపుల్‌ క్లెరోసిస్‌తో బాధపడుతున్న తన ప్రియ సతీమణి హెలెన్‌పట్ల శ్రద్ధ తీసుకొనేందుకు ఒక ప్రక్క సహాయం చేస్తూనే, మాక్స్‌ బెతెల్‌లో బాధ్యతలు కూడా మోస్తూ ఉన్నాడు.

యెహోవా సేవలో గడిపిన 63 సంవత్సరాల పూర్తికాల సేవను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను నిజంగా సంతృప్తికరమైన జీవితమే గడిపానని చెప్పగలను. బెతెల్‌ నా స్వగృహమయ్యింది, హృదయానందంతో నేనింకా నా సేవలో కొనసాగుతున్నాను. పని అలవాట్ల ప్రాముఖ్యతను, యెహోవాను సేవించాలనే కోరికను మా మనసుల్లో నాటిన ఘనత మా తల్లిదండ్రులకే దక్కుతుంది. అయితే మన సహోదరత్వం మరియు అద్వితీయ సత్యదేవుడు మన మహాగొప్ప సృష్టికర్త అయిన యెహోవాను శాశ్వతంగా సేవిస్తూ పరదైసు భూమిలో మన సహోదర సహోదరీలతో జీవిస్తామనే మన నిరీక్షణ మన జీవితాలను నిజంగా సంతృప్తికరం చేస్తాయి.

[24వ పేజీలోని చిత్రం]

1912 జూన్‌లో తమ పెళ్లిరోజున మా అమ్మానాన్న

[24వ పేజీలోని చిత్రం]

ఎడమ నుండి కుడికి: 1927లో రస్సెల్‌, వేన్‌, క్లారా, ఆర్డిస్‌, నేను, కర్టిస్‌

[25వ పేజీలోని చిత్రం]

1944లో పయినీరు సేవ చేస్తున్నప్పుడు ఫ్రాన్సిస్‌, బార్బరా మెక్‌నాట్‌ మధ్యలో నేను

[25వ పేజీలోని చిత్రం]

1951లో బెతెల్‌లో. ఎడమ నుండి కుడికి: నేను, ఎస్టెర్‌ లోపెజ్‌, మా వదిన జెన్‌

[26వ పేజీలోని చిత్రం]

నేథన్‌, వాళ్ల అమ్మానాన్నలతో

[26వ పేజీలోని చిత్రం]

1955లో నేథన్‌తో

[27వ పేజీలోని చిత్రం]

హవాయిలో నేథన్‌తో

[29వ పేజీలోని చిత్రం]

నా రెండవ భర్త గ్లెన్‌తో