కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

2 కొరింథీయులు 6:14లో పౌలు “అవిశ్వాసులు” అనే మాట ఎవరిని ఉద్దేశించి ఉపయోగించాడు?

2 కొరింథీయులు 6:14లో మనమిలా చదువుతాం: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” మనమా సందర్భాన్ని పరిశీలిస్తే, పౌలు క్రైస్తవ సంఘ సభ్యులుకాని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. “అవిశ్వాసి” లేదా “అవిశ్వాసులు” అని పౌలు వాడిన మాటలున్న ఇతర బైబిలు లేఖనాలు ఈ అవగాహనను బలపరుస్తున్నాయి.

ఉదాహరణకు, న్యాయంకోసం క్రైస్తవులు ‘అవిశ్వాసుల ఎదుటకు’ వెళ్లినందుకు పౌలు వారిని మందలించాడు. (1 కొరింథీయులు 6:⁠6) ఇక్కడ పేర్కొనబడిన అవిశ్వాసులు, కొరింథులోని న్యాయ వ్యవస్థలో న్యాయాధిపతులుగా వ్యవహరిస్తున్నవారు. పౌలు తన రెండవ పత్రికలో, సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము” కలుగజేశాడని చెబుతున్నాడు. అలాంటి అవిశ్వాసుల నేత్రాలకు సువార్త కనిపించకుండా ‘ముసుగు’ కప్పబడింది. ఈ అవిశ్వాసులు యెహోవా సేవ చేయడంపట్ల ఎలాంటి ఆసక్తీ కనబరచలేదు, ఎందుకంటే పౌలు వారి గురించి ముందొకసారి ఇలా వివరించాడు: “వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.”​—⁠2 కొరింథీయులు 3:16; 4:4.

అవిశ్వాసుల్లో కొందరు చట్టవ్యతిరేకులుగా లేదా విగ్రహారాధకులుగా ఉన్నారు. (2 కొరింథీయులు 6:​15, 16) అలాగని వారందరూ యెహోవా సేవకులను వ్యతిరేకించడం లేదు. కొందరు సత్యంపట్ల ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారిలో చాలామందికి క్రైస్తవులైన జీవిత భాగస్వాములున్నారు, వాళ్లతో కలిసి జీవించడం వారికి సంతోషంగానే ఉంది. (1 కొరింథీయులు 7:12-14; 10:27; 14:22-25; 1 పేతురు 3:⁠1) అయితే, పైన పేర్కొన్నట్లుగా, పౌలు “అవిశ్వాసి” అనే మాటను, “విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడి[న]” వారిచే రూపొందిన క్రైస్తవ సంఘ సభ్యులు కాని వ్యక్తులకే అన్వయించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 2:41; 5:14; 8:12, 13.

2 కొరింథీయులు 6:14లో ఉన్న సూత్రం, అన్ని రకాల పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులకు అమూల్యమైన మార్గదర్శకంగా ఉంది, ప్రత్యేకంగా ఇది జీవిత భాగస్వామి కోసం వెదికే క్రైస్తవులకు జ్ఞానవంతమైన సలహాగా ఉన్నట్లు తరచూ ఉదహరించబడుతోంది. (మత్తయి 19:​4-6) అవిశ్వాసుల ప్రమాణాలు, లక్ష్యాలు, నమ్మకాలు నిజ క్రైస్తవుల ప్రమాణాలకు, లక్ష్యాలకు, నమ్మకాలకు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి, సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్న ఒక క్రైస్తవుడు జ్ఞానయుక్తంగా, అవిశ్వాసుల్లో జీవిత భాగస్వామి కోసం వెదకడు.

కానీ బైబిలు అధ్యయనం చేస్తూ క్రైస్తవ సంఘంతో సహవసిస్తున్న వ్యక్తుల విషయమేమిటి? బాప్తిస్మం తీసుకోని ప్రచారకుల విషయమేమిటి? వారు అవిశ్వాసులా? కాదు. సువార్త సత్యాన్ని అంగీకరించి, బాప్తిస్మం తీసుకోవడానికి క్రమంగా చర్యలు గైకొంటున్న వారిని అవిశ్వాసులని అనకూడదు. (రోమీయులు 10:10; 2 కొరింథీయులు 4:​14) ఎందుకంటే, బాప్తిస్మం తీసుకోవడానికి ముందే కొర్నేలీ “దేవుని యందు భయభక్తులు” గలవాడని పిలువబడ్డాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:2.

ఖచ్చితంగా చెప్పాలంటే 2 కొరింథీయులు 6:14లో పౌలు ఇచ్చిన సలహా బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా అంగీకరించబడిన వ్యక్తికి వర్తించదు కాబట్టి, అలాంటి వ్యక్తితో సమర్పిత క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు కోర్ట్‌షిప్‌ చేయడం (ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి కలిసి గడిపే సమయం), ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం జ్ఞానయుక్తంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? క్రైస్తవ విధవరాండ్ర గురించి పౌలు సూటిగా ఇచ్చిన ఉపదేశమే దానికి జవాబు. ఆయన ఇలా వ్రాశాడు: ‘ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.’ (1 కొరింథీయులు 7:​39) ఆ ఉపదేశానికి అనుగుణంగా సమర్పిత క్రైస్తవులు “ప్రభువునందు” ఉన్న వారిలోనే జీవిత భాగస్వామి కోసం వెదకాలని ఉద్బోధించబడ్డారు.

“ప్రభువునందు” మరియు తత్సంబంధిత “క్రీస్తునందు” అనే మాటకు అర్థమేమిటి? రోమీయులు 16:​8-10 మరియు కొలొస్సయులు 4:7లో పౌలు “ప్రభువునందు” లేదా “క్రీస్తునందు” ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆ వచనాలు చదివితే, అలాంటివారు ‘జతపనివారిగా,’ ‘యోగ్యులుగా,’ ‘ప్రియ సహోదరులుగా,’ ‘నమ్మకమైన పరిచారకులుగా,’ ‘తోడి సేవకులుగా’ ఉన్నట్లు మీరు చూస్తారు.

ఒక వ్యక్తి ఎప్పుడు ‘ప్రభువునందు సేవకునిగా’ తయారవుతాడు? దాసుడు చేసే పనిని ఇష్టపూర్వకంగా చేయడానికి తననుతాను ఉపేక్షించుకున్నప్పుడే అలా తయారవుతాడు. యేసు ఇలా అన్నాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:​24) ఒక వ్యక్తి తనను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు క్రీస్తును అనుసరించడం ఆరంభించి, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడతాడు. ఆ తర్వాత, ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకొచ్చి యెహోవా దేవుని ఎదుట ఆమోదిత స్థానంలో నియమిత పరిచారకుడవుతాడు. * కాబట్టి, ‘ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవడమంటే,’ నిజమైన విశ్వాసియనీ, ‘దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసునిగా’ సమర్పించుకున్నాననీ నిరూపించుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అర్థం.​—⁠యాకోబు 1:1.

యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనంచేస్తూ, చక్కని ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తున్న వ్యక్తి ప్రశంసార్హుడు. అయితే ఆయన యెహోవాకు సమర్పించుకొని, సేవాపూరితమైన, త్యాగపూరితమైన జీవితానికి ఇంకా కట్టుబడలేదు. ఆయన తగిన మార్పులు చేసుకుంటున్నాడు. జీవితంలో వివాహం వంటి మరో పెద్ద మార్పు గురించి ఆలోచించడానికి ముందు ఆయన సమర్పిత, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవునిగా మారడంలోవున్న పెద్ద మార్పుల గురించి మొదట ఆలోచించాలి.

బాప్తిస్మం తీసుకున్న తర్వాతే బహుశా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో, బైబిలు అధ్యయనంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నట్లున్న వ్యక్తితో ఒక క్రైస్తవుడు(రాలు) కోర్ట్‌షిప్‌ చేయడం సముచితంగా ఉంటుందా? ఉండదు. ఒక సమర్పిత క్రైస్తవుడు(రాలు) తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నారని, కానీ తాను బాప్తిస్మం తీసుకునేంత వరకు అలా వివాహం చేసుకోరని తెలిసినప్పుడు ఆ బైబిలు విద్యార్థి ఉద్దేశాలు భంగపడే అవకాశం ఎంతైనావుంది.

సాధారణంగా ఒక వ్యక్తి కొద్దికాలం పాటు మాత్రమే, అంటే బాప్తిస్మం తీసుకోవడానికి తగినంతగా అభివృద్ధి సాధించేంత వరకు మాత్రమే బాప్తిస్మం పొందని ప్రచారకునిగా కొనసాగుతాడు. అందువల్ల ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవాలని పైన ఇవ్వబడిన సలహా అసమంజసమైనదేమీ కాదు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పెరిగి అనేక సంవత్సరాలు సంఘంలో చురుకుగా పనిచేస్తూ బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగావుండి, వివాహం చేసుకోదగిన వయస్సులోవున్న వ్యక్తితో కోర్ట్‌షిప్‌ చేసే మాటేమిటి? పరిస్థితి అదే అయితే, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడానికి ఆ వ్యక్తిని ఏది అడ్డగిస్తోంది? ఆయనెందుకు సంశయిస్తున్నాడు? ఆయనకు సందేహాలేమైనా ఉన్నాయా? అలాంటి వ్యక్తి అవిశ్వాసి కాకపోయినా, ఆయన “ప్రభువునందు” ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు.

పెళ్లి విషయంలో పౌలు ఇచ్చిన సలహా మన ప్రయోజనార్థమే. (యెషయా 48:​17) వివాహం చేసుకొనే ఆ ఇద్దరూ యెహోవాకు సమర్పించుకున్న వారైతే వారి వైవాహిక జీవితంలో పరస్పర అంకితభావానికి స్థిరమైన, ఆధ్యాత్మికమైన పునాది ఉంటుంది. వారిద్దరికీ ఒకే విధమైన ప్రమాణాలు, లక్ష్యాలు ఉంటాయి. సంతోషభరితమైన వివాహానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా, ‘ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవడం’ ద్వారా ఒక వ్యక్తి యెహోవాపట్ల యథార్థత చూపించిన వాడవుతాడు, ఇది శాశ్వత ప్రయోజనాలకు దారితీస్తుంది ఎందుకంటే ‘యథార్థవంతులపట్ల [యెహోవా] యథార్థవంతునిగా ఉంటాడు.’​—⁠కీర్తన 18:25.

[అధస్సూచి]

^ పేరా 10 పౌలు ప్రధానంగా ఎవరికైతే వ్రాశాడో ఆ అభిషిక్త క్రైస్తవులు ‘ప్రభువునందు సేవకులుగా’ ఉండడంలో వారు దేవుని కుమారులుగా, క్రీస్తు సహోదరులుగా అభిషేకించబడడం కూడా ఇమిడివుంది.

[31వ పేజీలోని చిత్రం]

‘యథార్థవంతులపట్ల [యెహోవా] యథార్థవంతునిగా ఉంటాడు’