కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా కట్టడ’ విఫలం కానేరదు

‘యెహోవా కట్టడ’ విఫలం కానేరదు

‘యెహోవా కట్టడ’ విఫలం కానేరదు

‘యెహోవా కట్టడను నేను వివరించెదను; ఆయన నాకీలాగు సెలవిచ్చెను​—⁠నీవు నా కుమారుడవు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను.’​—⁠కీర్తన 2:7-8.

మానవాళిపట్ల, ఈ భూమిపట్ల యెహోవా దేవునికి ఒక సంకల్పం ఉంది. జనాంగాలకు కూడా ఒక సంకల్పం ఉంది. అయితే ఈ సంకల్పాలు ఎంత భిన్నమో కదా! అలా భిన్నంగా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు, ఎందుకంటే దేవుడిలా చెబుతున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” అయితే దేవుని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”​—⁠యెషయా 55:9-11.

2 మెస్సీయా రాజును గురించిన దేవుని సంకల్పం నెరవేరుతుందని రెండవ కీర్తనలో స్పష్టం చేయబడింది. కీర్తనకర్త మరియు ప్రాచీన ఇశ్రాయేలు రాజు అయిన దావీదు, జనాంగాలు అల్లరిరేపే విశేషమైన సమయమొకటి ఉంటుందని ముందే సూచించడానికి దేవునిచే ప్రేరేపించబడ్డాడు. జనాంగాల పరిపాలకులు యెహోవా దేవునికి, ఆయన అభిషిక్తునికి విరుద్ధంగా నిలబడతారు. అయితే కీర్తనకర్త ఇలా కూడా ఆలపించాడు: ‘యెహోవా కట్టడను నేను వివరించెదను; ఆయన నాకీలాగు సెలవిచ్చెను​—⁠నీవు నా కుమారుడవు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.’​—⁠కీర్తన 2:7, 8.

3 ‘యెహోవా కట్టడ’ జనాంగాలపట్ల ఏమి సూచిస్తోంది? అది మానవులందరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిజానికి, రెండవ కీర్తన చదివే దైవభయంగల ప్రజలందరికీ ఆ కట్టడ భావమేమిటి?

అల్లరిరేపిన జనాంగాలు

4 జనాంగాల, వాటి పరిపాలకుల క్రియలను సూచిస్తూ కీర్తనకర్త తన కీర్తనను ఇలా ఆరంభిస్తున్నాడు: “అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.”​—⁠కీర్తన 2:1, 3. a

5 ఏ “వ్యర్థమైనదానిని” నేటి జనములు “తలంచుచున్నవి?” దేవుని అభిషిక్తుడైన మెస్సీయాను లేదా క్రీస్తును అంగీకరించడానికి బదులుగా జనాంగాలు తమ సొంత అధికారాన్ని కాపాడుకోవాలని “తలంచుచున్నవి” లేదా ఆలోచిస్తున్నాయి. రెండవ కీర్తనలోని ఈ మాటలు సా.శ. మొదటి శతాబ్దంలో అంటే దేవుని నియమిత రాజైన యేసుక్రీస్తును చంపడానికి యూదులు, రోమా అధికారులు చేతులు కలిపినప్పుడు కూడా నెరవేరాయి. అయితే 1914లో యేసు పరలోకంలో రాజుగా నియమించబడినప్పుడు అవి మరిగొప్పగా నెరవేరడం ప్రారంభించాయి. అప్పటి నుండి, ఈ భూమ్మీది ప్రభుత్వాల్లో ఏ ఒక్కటీ దేవుని సింహాసనాసీనుడైన రాజును అంగీకరించలేదు.

6 ‘జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నారు’ అని అడిగినప్పుడు కీర్తనకర్త దేనిని సూచిస్తున్నాడు? వారి వ్యర్థమైన సంకల్పాన్నే; ఆ సంకల్పం నిరర్థకమైనది, పైగా అది విఫలంకాక తప్పదు. జనములు ఈ భూమిపైకి శాంతి సామరస్యాలను తీసుకురాలేవు. అయినప్పటికీ, ఆ జనములు దేవుని పరిపాలనను వ్యతిరేకించేంతగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయి. నిజానికి అవి సర్వోన్నతునికి, ఆయన అభిషిక్తునికి విరుద్ధంగా నిలబడి, ఏకీభవించి ఆలోచన చేస్తున్నాయి. ఎంత మూర్ఖత్వమో కదా!

యెహోవా విజయోత్సాహపు రాజు

7కీర్తన 2:1, 2లోని మాటల్ని యేసు అనుచరులు ఆయనకే అన్వయించారు. తమ విశ్వాసం కారణంగా హింసించబడిన ఆ శిష్యులు ఇలా ప్రార్థించారు: “నాథా, [యెహోవా] నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. . . . నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును [అంతిప] పొంతిపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.” (అపొస్తలుల కార్యములు 4:24-27; లూకా 23:​1-12) b అవును, మొదటి శతాబ్దంలో దేవుని అభిషిక్త సేవకుడైన యేసుకు విరుద్ధంగా కుట్ర జరిగింది. అయితే శతాబ్దాల తర్వాత ఈ కీర్తనకు మరో నెరవేర్పు ఉంటుంది.

8 ప్రాచీన ఇశ్రాయేలీయులకు దావీదులాంటి మానవ రాజు ఉన్న కాలంలో, అన్యజనులు, పరిపాలకులు దేవునికి ఆయన అభిషిక్త సింహాసనాసీనునికి విరుద్ధంగా సమకూడారు. అయితే మన కాలాల విషయమేమిటి? ప్రస్తుతకాల జనాంగాలు యెహోవా మరియు మెస్సీయా నియమాలకు అనుగుణంగా ప్రవర్తించాలని కోరుకోవడం లేదు. కాబట్టి, వారు “మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని” చెప్పుకొంటున్నట్లు చిత్రీకరించబడ్డారు. (కీర్తన 2:​2) దేవుడు, ఆయన అభిషిక్తుడు విధించే ఎలాంటి హద్దులనైనా ఆ పాలకులు, జనాంగాలు వ్యతిరేకిస్తారు. అయితే, అలాంటి కట్లను, పాశములను తెంపడానికి చేసే ఎలాంటి ప్రయత్నాలైనా కేవలం వ్యర్థమవుతాయి.

యెహోవా వారిని అపహసిస్తాడు

9 జనాంగాల పాలకులు తమ సొంత సార్వభౌమాధిపత్యాన్ని స్థిరపరచుకోవడానికి చేసే ఎలాంటి ప్రయత్నాలూ యెహోవాపై ప్రభావం చూపవు. రెండవ కీర్తన ఇంకా ఇలా చెబుతోంది: “ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు; ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు.” (కీర్తన 2:⁠4) ఈ పరిపాలకులు పూర్తిగా అప్రాముఖ్యమన్నట్లు దేవుడు తన సంకల్పంతో ముందుకెళతాడు. వారి అవివేకాన్ని చూసి ఆయన నవ్వుతున్నాడు, వారిని అపహసిస్తున్నాడు. తమ సంకల్పం విషయంలో వారు అతిశయించవచ్చు. అయితే యెహోవాకు వారు హాస్యాస్పదంగా ఉన్నారు. వారి నిరర్థక వ్యతిరేకతను చూసి ఆయన నవ్వుతున్నాడు.

10 కీర్తనల్లో మరోచోట దావీదు శత్రువులను, జనాంగాలను సూచిస్తూ ఇలా పాడుతున్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము, అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు; కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు; అన్యజనులందరిని నీవు అపహసించుదువు.” (కీర్తన 59:​5-8) తనకు వ్యతిరేకంగా జనాంగాలు తమ మూర్ఖపు విధానంతో గొప్పలు పోవడాన్ని, వారి గందరగోళాన్ని చూసి యెహోవా నవ్వుతున్నాడు.

11 దేవుడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలడనే మన విశ్వాసాన్ని కీర్తన 2లోని మాటలు బలపరుస్తున్నాయి. ఆయన ఎల్లప్పుడూ తన సంకల్పం నెరవేరుస్తాడనీ, తన విశ్వసనీయ సేవకులను ఎన్నడూ ఎడబాయడనీ మనం గట్టి నమ్మకంతో ఉండవచ్చు. (కీర్తన 94:​14) కానీ జనాంగాలు యెహోవా సంకల్పానికి విరుద్ధంగా పని చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది? ఈ కీర్తన ప్రకారం భీకర శబ్దంతో ఉరిమినట్లు దేవుడు “ఉగ్రుడై వారితో పలుకును.” అంతేకాకుండా, మెరుపువలె ఆయన “ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును.”​—⁠కీర్తన 2:5.

దేవుని రాజుగా ఆసీనుడయ్యాడు

12 యెహోవా కీర్తనకర్త ద్వారా ఆ తర్వాత చెప్పేది నిస్సంకోచంగా జనాంగాలను కలవరపరుస్తుంది. దేవుడిలా ప్రకటిస్తున్నాడు: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.” (కీర్తన 2:⁠6) సీయోను పర్వతం యెరూషలేములోవున్న ఒక కొండ, అక్కడే దావీదు ఇశ్రాయేలంతటిపై రాజుగా నియమించబడ్డాడు. అయితే మెస్సీయా రాజు ఆ పట్టణంలో లేదా భూమ్మీద మరోచోటనో సింహాసనాసీనునిగా చేయబడడు. నిజానికి, యెహోవా ఇప్పటికే పరలోక సీయోను పర్వతంపై యేసుక్రీస్తును తన మెస్సీయా రాజుగా ఆసీనుణ్ణి చేశాడు.​—⁠ప్రకటన 14:1.

13 రాజైన మెస్సీయా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “[తన కుమారునితో రాజ్య నిబంధన చేసిన యెహోవా] కట్టడను నేను వివరించెదను; యెహోవా నాకీలాగు సెలవిచ్చెను​—⁠నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.” (కీర్తన 2:⁠7) క్రీస్తు తన అపొస్తలులతో “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను” అని చెప్పినప్పుడు రాజ్య నిబంధనను సూచించాడు.​—⁠లూకా 22:28, 29.

14కీర్తన 2:7లో ముందే చెప్పబడినట్లుగా, యేసు బాప్తిస్మమప్పుడు, ఆయనను ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానం చేసినప్పుడు యెహోవా ఆయనను తన కుమారునిగా గుర్తించాడు. (మార్కు 1:9-11; రోమీయులు 1:​1-7; హెబ్రీయులు 1:⁠5; 5:⁠5) అవును, దేవుని పరలోక రాజ్యానికి రాజు ఆయన జనితైక కుమారుడే. (యోహాను 3:​16) రాజైన దావీదు రాజవంశం నుండి వచ్చాడు కాబట్టి, యేసుకు తిరుగులేని రాజ్యాధికార హక్కు సంక్రమించింది. (2 సమూయేలు 7:4-17; మత్తయి 1:​6, 16) ఈ కీర్తన ప్రకారం, దేవుడు తన కుమారునికి ఇలా చెబుతున్నాడు: “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.”​—⁠కీర్తన 2:⁠8.

15 ఆ రాజు అంటే దేవుని సొంత కుమారుడు యెహోవా తర్వాత అతిగొప్ప స్థానంలో ఉన్నాడు. యేసు పరీక్షించబడిన, విశ్వసనీయుడైన, నమ్మకమైన యెహోవా సేవకుడు. అంతేకాక, దేవుని జ్యేష్ఠ పుత్రునిగా యేసుకు వారసత్వ అధికారముంది. అవును, యేసుక్రీస్తు “అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.” (కొలొస్సయులు 1:​15) ఆయన చేయవలసిందల్లా కేవలం అడగడమే, అలా అడిగిన వెంటనే దేవుడాయనకు ‘జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇస్తాడు.’ ‘నరులను చూసి ఆనందించిన వ్యక్తిగానే’ కాక, ఈ భూమిపట్ల, మానవాళిపట్ల తన పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలన్న ప్రగాఢమైన కోరికవల్ల కూడా యేసు ఈ విన్నపం చేస్తాడు.​—⁠సామెతలు 8:30, 31.

జనాంగాలకు విరుద్ధంగా యెహోవా కట్టడ

16 రెండవ కీర్తన ఇప్పుడు అంటే యేసుక్రీస్తు అదృశ్య ప్రత్యక్షతా కాలంలో నెరవేరుతోంది కాబట్టి జనాంగాలకు ఏమి వేచివుంది? ఆ రాజు త్వరలోనే దేవుని ఈ ప్రకటనను నెరవేరుస్తాడు: “ఇనుపదండముతో నీవు వారిని [జనాంగములను] నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.”​—⁠కీర్తన 2:⁠9.

17 ప్రాచీన కాలాల్లో రాజుల చేతిలోవుండే రాజదండము వారి రాజ్యాధికారానికి సూచనగా ఉండేది. కొన్ని రాజదండాలు ఈ కీర్తనలో చెప్పబడినట్లు ఇనుముతో చేయబడేవి. ఇక్కడ ఉపయోగించబడిన అలంకారార్థ భాష రాజైన క్రీస్తు జనాంగాలను ఎంత సులభంగా నాశనం చేస్తాడో సూచిస్తోంది. ఇనుపదండముతో గట్టిగా కుండను కొట్టడం దానిని తిరిగి అతికించలేనంతగా ముక్కలుచెక్కలుగా చేస్తుంది.

18 అలా ముక్కలుచెక్కలు చేయబడడాన్ని జనాంగాల పాలకులు అనుభవించాల్సిందేనా? అలా కానవసరం లేదు, ఎందుకంటే కీర్తనకర్త వారినిలా కోరుతున్నాడు: “రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.” (కీర్తన 2:​10) రాజులు ఈ విషయాన్ని లక్ష్యపెట్టాలనీ, గంభీరంగా ఆలోచించాలనీ కోరబడ్డారు. మానవాళి ప్రయోజనార్థమై దేవుని రాజ్యం చేసే దానికి భిన్నంగావున్న తమ పథకాల వ్యర్థతను వారు గ్రహించాలి.

19 దేవుని ఆమోదం పొందడానికి, భూ రాజులు తమ విధానం మార్చుకోవాలి. “భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి” అని వారు ఆదేశించబడ్డారు. (కీర్తన 2:​11) వారలా చేస్తే వచ్చే ఫలితమేమిటి? అల్లరితో లేదా సంక్షోభంతో ఉండడానికి బదులు వారు మెస్సీయా రాజ్యం వారి ముందుంచే ఉత్తరాపేక్షనుబట్టి ఆనందించగలుగుతారు. భూ పాలకులు తమ పరిపాలనలో తాము ప్రదర్శించే అహంభావాన్ని, గర్వాన్ని విడిచిపెట్టాలి. అంతేకాకుండా, వారిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మారి, యెహోవా సాటిలేని సర్వాధిపత్యం విషయంలో యెహోవా దేవునికి, మెస్సీయా రాజుకు ఉన్న తిరుగులేని అధికారం విషయంలో అంతర్దృష్టిని ప్రదర్శించాలి.

“కుమారుని ముద్దుపెట్టుకొనుడి”

20 రెండవ కీర్తన ఇప్పుడు జనాంగాల పాలకులకు దయాపూర్వక ఆహ్వానం అందిస్తోంది. ఏకభావంతో విరోధంగా ఆలోచించడానికి బదులు, ఈ విధంగా చేయమని వారికి సలహా ఇవ్వబడింది: “ఆయన [యెహోవా దేవుని] కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.” (కీర్తన 2:12ఎ) సర్వాధిపతియైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానికి లోబడాలి. దేవుడు తన కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు, భూ పాలకులు ‘వ్యర్థమైనదానిని తలంచకుండా’ ఉండాల్సింది. రాజును వారు వెంటనే గుర్తించి ఆయనకు పూర్తిగా లోబడి ఉండాల్సింది.

21 వారెందుకు ‘కుమారుని ముద్దుపెట్టుకోవాలి’? ఈ కీర్తన కూర్చబడినప్పుడు ముద్దుపెట్టుకోవడం, స్నేహానికీ అలాగే అతిథులు ఆతిథ్యం ఆస్వాదించేలా వారిని ఇంటిలోకి ఆహ్వానించడానికీ గుర్తుగా ఉండేది. ముద్దుపెట్టుకోవడం విశ్వసనీయతను లేదా నమ్మకత్వాన్ని కూడా సూచించగలదు. (1 సమూయేలు 10:⁠1) రెండవ కీర్తనలోని ఈ వచనంలో దేవుడు అభిషిక్త రాజుగా తన కుమారుణ్ణి ముద్దుపెట్టుకోవాలని లేదా ఆహ్వానించాలని జనాంగాలను ఆజ్ఞాపిస్తున్నాడు.

22 యెహోవా దేవుడు ఎంచుకున్న రాజు అధికారాన్ని గుర్తించనివాళ్లు ఆయనను అవమానించిన వాళ్లవుతారు. యెహోవా దేవుని సర్వాధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని, మానవాళి కోసం శ్రేష్ఠమైన పరిపాలకునిగా ఉండగల రాజును ఎన్నుకునేందుకు ఆయనకున్న సామర్థ్యాన్ని వాళ్లు ఒప్పుకోరు. అందువల్ల, వారు తమ సొంత పథకాలను అమలుపరచడానికి ప్రయత్నిస్తుండగా దేవుని కోపం అకస్మాత్తుగా వారిని కబళిస్తుంది. ‘ఆయన కోపిస్తాడు’ లేదా ఆయన కోపం త్వరగా రగులుకొంటుంది, దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. జనాంగాల పాలకులు ఈ హెచ్చరికను కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించి దీనికి అనుగుణంగా ప్రవర్తించాలి. వారలా చేస్తే జీవాన్ని పొందుతారు.

23 ఈ నాటకీయ కీర్తన ఇలా ముగుస్తుంది: “ఆయనను [యెహోవాను] ఆశ్రయించువారందరు ధన్యులు.” (కీర్తన 2:12బి) భద్రతను పొందడానికి ఆయా వ్యక్తులకు ఇంకా సమయముంది. జనాంగాల పథకాలను బలపరుస్తున్న ఆయా పాలకుల విషయంలో కూడా అది నిజం. రాజ్యపాలన క్రింద రక్షణ కల్పించే యెహోవాను వారు ఆశ్రయించవచ్చు. అయితే మెస్సీయా రాజ్యం వ్యతిరేకించే జనాంగాలను ముక్కలుచెక్కలుగా చేయకముందే వాళ్లు చర్య తీసుకోవాలి.

24 మనం లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వాటి ఉపదేశాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే, ఈ కల్లోలభరిత లోకంలో కూడా మనం సంతృప్తికరమైన జీవితాలు జీవించవచ్చు. లేఖనాధార ఉపదేశాన్ని అన్వయించుకోవడం సంతోషభరితమైన కుటుంబ బాంధవ్యాలకు దోహదపడుతుంది, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న అనేక బాధలు, భయాల నుండి విముక్తుల్ని చేస్తుంది. బైబిలు మార్గనిర్దేశాలను అనుసరించడం మనం సృష్టికర్తను సంతోషపరుస్తున్నామనే నమ్మకాన్నిస్తుంది. ఒక్క విశ్వసర్వాధిపతి తప్ప ఇంకెవ్వరూ “యిప్పటి జీవము విషయములోను,” రాజ్యపాలనను తిరస్కరించడం ద్వారా సరైన దానిని వ్యతిరేకించే వారిని భూమిపై నుండి నిర్మూలించిన తర్వాత “రాబోవు జీవము విషయములోను” హామీ ఇవ్వలేరు.​—⁠1 తిమోతి 4:8.

25 ‘యెహోవా కట్టడ’ విఫలం కానేరదు. మన సృష్టికర్తగా, మానవాళికి అత్యంత ప్రయోజనకరమైనదేదో దేవునికి తెలుసు, మరియు ఆయన తన ప్రియకుమారుని రాజ్యపాలన క్రింద విధేయతచూపే మానవులను సమాధానం, సంతృప్తి, శాశ్వత భద్రతతో ఆశీర్వదించాలనే తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. మన కాలం గురించి దానియేలు ప్రవక్త ఇలా వ్రాశాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:​44) కాబట్టి ‘కుమారుని ముద్దుపెట్టుకొని’ సర్వాధిపతియైన యెహోవాను సేవించడం ఇప్పుడు అత్యవసరం!

[అధస్సూచీలు]

a తొలుత దావీదు రాజు ‘అభిషిక్తునిగాను,’ ఆయనకు విరుద్ధంగా సైన్యాలను కూడగట్టిన ఫిలిష్తీయ పాలకులు ‘భూరాజులుగాను’ ఉన్నారు.

b రెండవ కీర్తనలో సూచించబడిన దేవుని అభిషిక్తుడు యేసు అని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ఇతర వచనాలు కూడా చూపిస్తున్నాయి. కీర్తన 2:7ను అపొస్తలుల కార్యములు 13:32, 33తో మరియు హెబ్రీయులు 1:5; 5:5తో పోల్చినప్పుడు ఇది స్పష్టమవుతుంది. కీర్తన 2:​9, ప్రకటన 2:⁠27 కూడా చూడండి.

మీరెలా సమాధానమిస్తారు?

జనములు ఏ ‘వ్యర్థమైన దానిని ఆలోచిస్తున్నారు’?

యెహోవా ఎందుకు జనాంగములను అపహసిస్తాడు?

జనాంగములకు విరుద్ధంగా దేవుని కట్టడ ఏమిటి?

“కుమారుని ముద్దుపెట్టుకొనుడి” అంటే అర్థమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1.దేవుని సంకల్పానికీ, జనాంగాల సంకల్పానికీ ఎలాంటి భేదముంది?

2,3.రెండవ కీర్తనలో ఏ విషయం స్పష్టం చేయబడింది, అయితే ఏ ప్రశ్నలు లేవదీయబడ్డాయి?

4.కీర్తన 2:1, 3లోని మాటల సారాంశాన్ని మీరెలా చెబుతారు?

5,6.జనములు ఏ “వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?”

7.యేసు తొలి శిష్యులు తమ ప్రార్థనలో కీర్తన 2:1, 2ను ఎలా అన్వయించారు?

8.కీర్తన 2:2 ప్రస్తుతకాల జనాంగాలకు ఎలా అన్వయిస్తుంది?

9,10.యెహోవా ఎందుకు జనాంగాలను అపహసిస్తున్నాడు?

11.జనాంగాలు దేవుని సంకల్పానికి విరుద్ధంగా పని చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది?

12.కీర్తన 2:6 ఏ సింహాసనాధీష్ఠాపనకు అన్వయిస్తుంది?

13.యెహోవా తన కుమారునితో ఏ నిబంధన చేశాడు?

14.యేసుకు తిరుగులేని రాజ్యాధికార హక్కు సంక్రమించిందని ఎందుకు చెప్పవచ్చు?

15.యేసు జనములను తనకు స్వాస్థ్యముగా ఇమ్మని ఎందుకు అడుగుతాడు?

16,17.కీర్తన 2:9 ప్రకారం జనాంగాలకు ఏమి వేచివుంది?

18,19.దేవుని ఆమోదం పొందడానికి, భూ పాలకులు ఏమిచేయాలి?

20,21.“కుమారుని ముద్దుపెట్టుకొనుడి” అంటే అర్థమేమిటి?

22.జనాంగాల పాలకులు ఏ హెచ్చరికను లక్ష్యపెట్టాలి?

23.ఏమి చేయడానికి ఆయా వ్యక్తులకు ఇంకా సమయముంది?

24.ఈ కలవరభరిత లోకంలో సైతం మనం మరింత సంతృప్తికరమైన జీవితమెలా జీవించవచ్చు?

25.‘యెహోవా కట్టడ’ విఫలం కానేరదు కాబట్టి మనకాలంలో ఏమి జరుగుతుందని మనం ఎదురుచూడవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

విజయోత్సాహుడైన మెస్సీయా రాజు గురించి దావీదు పాడాడు

[17వ పేజీలోని చిత్రం]

పాలకులు, ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుకు విరుద్ధంగా కుట్ర పన్నారు

[18వ పేజీలోని చిత్రం]

పరలోక సీయోను పర్వతంపై క్రీస్తు రాజుగా ఆసీనుడయ్యాడు