కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి

ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి

ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి

“ఒక వ్యక్తికి తాను ఏ తీరానికి వెళ్తున్నాడో తెలియనప్పుడు, ఏ దిశలో గాలి వీచినా ఒకటే.” మొదటి శతాబ్దపు రోమా తత్త్వవేత్తకు ఆపాదించబడే ఆ మాటలు, జీవిత దిశను నిర్దేశించడానికి లక్ష్యాలు ఆవశ్యకమనే వాస్తవాన్ని చెబుతున్నాయి.

లక్ష్యాలు పెట్టుకోవడాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచిన వ్యక్తుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. నోవహు దాదాపు 50 సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసి ‘తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేశాడు.’ మోషే ప్రవక్త ‘ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచాడు.’ (హెబ్రీయులు 11:​7, 24) మోషే తర్వాతివాడైన యెహోషువ కనాను దేశాన్ని ఆక్రమించుకోవాలని దేవుడు పెట్టిన లక్ష్యాన్ని స్వీకరించాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 3:21, 22, 28; యెహోషువ 12:7-24.

సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు పెట్టుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాలను, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని యేసు చెప్పిన మాటలు ఎంతో ప్రభావితం చేశాయనడంలో సందేహం లేదు. (మత్తయి 24:​14) ‘అన్యజనుల యెదుట [యేసు] నామము భరించుము’ అనే నియామకంతోపాటు ప్రభువైన యేసునుండి వ్యక్తిగతంగా పొందిన సందేశాలతో, దర్శనాలతో ప్రోత్సహించబడిన పౌలు ఆసియా మైనర్‌ అంతటిలోను, యూరప్‌లోను ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించడంలో కీలకమైన పాత్ర పోషించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:15; కొలొస్సయులు 1:23.

అవును చరిత్రంతటిలోను యెహోవా సేవకులు ఉదాత్తమైన లక్ష్యాలను ఏర్పరచుకొని, ఆ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా దేవునికి ఘనతను తెచ్చారు. నేడు మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవచ్చు? మనం ఏ లక్ష్యాల కోసం శ్రమించవచ్చు, వాటిని చేరుకోవడానికి ఎలాంటి ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవచ్చు?

సరైన ఉద్దేశాలు అత్యావశ్యకం

జీవితంలోని ఏ రంగానికి సంబంధించైనా సరే లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు, ఈ లోకంలో కూడా లక్ష్యాలు పెట్టుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చే ప్రజలు ఉన్నారు. అయితే దైవపరిపాలనా లక్ష్యాలకూ లోక సంబంధమైన లక్ష్యాలకూ తేడా ఉంది. లోక సంబంధమైన అనేక లక్ష్యాల వెనుకవున్న ప్రాథమిక ఉద్దేశాలు, వస్తుసంపదలపట్ల తీవ్ర వాంఛ, పదవుల కోసం, అధికారం కోసం తీరని దాహంతో ఉండడమే. అధికారాన్ని, ప్రతిష్ఠను స్వంతం చేసుకోవాలనే లక్ష్యం కోసం శ్రమించడం ఎంత ఘోరమైన తప్పో కదా! యెహోవాను మనం ఆరాధించడంతోనూ రాజ్యానికి మద్దతుగా మనం చేసే కార్యాలతోనూ సూటిగా సంబంధమున్న లక్ష్యాలు యెహోవా దేవునికి ఘనతను తెస్తాయి. (మత్తయి 6:​33) అలాంటి లక్ష్యాలు దేవునిపట్ల పొరుగువారిపట్ల మనకున్న ప్రేమనుండి పుట్టుకొస్తాయి, దైవభక్తిని ప్రదర్శించాలనేదే ఆ లక్ష్యాల వెనుకవున్న ఉద్దేశం.​—⁠మత్తయి 22:37-39; 1 తిమోతి 4:⁠7.

అదనపు సేవాధిక్యతల కోసం లేదా వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం కోసం మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా మన ఉద్దేశాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొన్నిసార్లు సరైన ఉద్దేశాలతో ఏర్పరచుకునే లక్ష్యాలు కూడా నెరవేరవు. మనం లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకునే అవకాశాలను ఎలా పెంచుకోవచ్చు?

బలమైన కోరిక ఉండాలి

యెహోవా ఈ విశ్వాన్ని సృష్టించే పనిని ఎలా చేశాడో పరిశీలించండి. “అస్తమయమును ఉదయమును కలుగగా” అనే మాటలతో యెహోవా సృష్టి చేసే సమయాలను స్పష్టంగా నిర్వచించాడు. (ఆదికాండము 1:5, 8, 13, 19, 23, 31) సృష్టి చేసే ప్రతి సమయం ఆరంభమైనప్పుడు ఆయనకు ఆ రోజు కోసమైన లక్ష్యం లేదా ఉద్దేశం బాగా తెలుసు. అలా దేవుడు సృష్టించాలనే తన సంకల్పాన్ని నెరవేర్చాడు. (ప్రకటన 4:​10) “[యెహోవా] తనకిష్టమైనది ఏదో అదే చేయును” అని పితరుడైన యోబు చెప్పాడు. (యోబు 23:​13) యెహోవాకు ‘తాను చేసినది యావత్తును చూడడం,’ అలాగే ‘అది చాలామంచిదిగ ఉంది’ అని ప్రకటించడం ఎంత సంతృప్తికరంగా ఉండివుంటుందో కదా!​—⁠ఆదికాండము 1:31.

మన లక్ష్యాలు వాస్తవరూపం దాల్చాలంటే మనకు కూడా వాటిని చేరుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. అలాంటి బలమైన కోరికను పెంపొందించుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? భూమి నిరాకారముగా, శూన్యముగా ఉన్నప్పుడు కూడా, యెహోవా తాను సృష్టించడం పూర్తిచేసిన తర్వాత భూమి తనకు మహిమను, ఘనతను తీసుకువచ్చే విధంగా విశ్వంలో ఒక అందమైన వజ్రంలా ఉంటుందని ముందే చూడగలిగాడు. అదేవిధంగా మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంవల్ల కలిగే ప్రతిఫలాల గురించి ప్రయోజనాల గురించి ధ్యానించడం ద్వారా మనం అనుకున్నదానిని సాధించాలనే కోరికను పెంపొందించుకోవచ్చు. 19 సంవత్సరాల టోనీకి అలాంటి అనుభవమే కలిగింది. తూర్పు యూరప్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన మనస్సుపై పడిన తొలిముద్రను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. అప్పటినుండి టోనీ మనస్సులో ఒకటే ప్రశ్న మెదిలేది: ‘అలాంటి స్థలంలో నివసించడం, సేవ చేయడం ఎలా ఉంటుంది?’ టోనీ దాని గురించి ఆలోచించడం ఎన్నడూ మానుకోలేదు, ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కృషి చేస్తూనే వచ్చాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత బెతెల్‌లో సేవ చేయడం కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తు అంగీకరించబడినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు!

ఇప్పటికే ఒకానొక లక్ష్యాన్ని చేరుకున్నవారితో సహవసించడం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే కోరికను మనలో పెంపొందింపజేయవచ్చు. 30 సంవత్సరాల జేసన్‌ యౌవనస్థుడిగా ఉన్నప్పుడు క్షేత్ర పరిచర్యలో పాల్గొనడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఆయన తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసిన తర్వాత ఎంతో ఆసక్తితో పయినీరు సేవను ప్రారంభించి పూర్తికాల రాజ్య ప్రచారకుడయ్యాడు. పయినీరు సేవ చేయాలనే కోరికను పెంపొందించుకోవడానికి జేసన్‌కు సహాయం చేసినదేమిటి? ఆయనిలా చెబుతున్నాడు: “పయినీరు సేవ చేసిన ఇతరులతో మాట్లాడడం, వాళ్ళతో కలిసి పరిచర్యకు వెళ్ళడం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి.”

మన లక్ష్యాలను వ్రాసిపెట్టుకోవడం సహాయకరంగా ఉంటుంది

ఒక అస్పష్టమైన తలంపును మనం పదాల్లో వ్యక్తం చేసినప్పుడు స్పష్టంగా తయారై ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. సరైన పదాలు శక్తిమంతమైన ములుకోలలవలె ఉండి జీవితాన్ని సరైన దిశలో నడిపించగలవు అని సొలొమోను చెప్పాడు. (ప్రసంగి 12:​11) అలాంటి పదాలను వ్రాసిపెట్టుకుంటే అవి మనస్సుపై హృదయంపై చెరగని ముద్ర వేయగలవు. యెహోవా ఇశ్రాయేలు రాజులను వ్యక్తిగతంగా ధర్మశాస్త్రపు ప్రతిని వ్రాసుకొమ్మని చెప్పింది ఎందుకనుకుంటున్నారు? (ద్వితీయోపదేశకాండము 17:​18) కాబట్టి మనం కూడా మన లక్ష్యాలను, వాటిని చేరుకోవడానికి వేసుకునే ప్రణాళికలను, ఎదురుకాగల అడ్డంకులను, వాటిని అధిగమించగల మార్గాలను వ్రాసిపెట్టుకోవాలని కోరుకోవచ్చు. అలా చేయడంవల్ల మనం మన లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి విషయాలపై జ్ఞానం పెంచుకోవాలి, ఎలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మనకు సహాయం చేయగల మద్దతివ్వగల వ్యక్తులు ఎవరు అనేవి గుర్తించడానికి సహాయం లభిస్తుంది.

ఆసియాలోని ఒక దేశంలో మారుమూల క్షేత్రంలో ఎంతోకాలంగా ప్రత్యేక పయినీరు సేవ చేస్తున్న జెఫ్రీ ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు అవి ఆయనకు మనోస్థైర్యాన్ని ఇచ్చాయి. అనుకోకుండా ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయనను విషాదం కమ్ముకుంది. జెఫ్రీ ఆ పరిస్థితికి అలవాటుపడడానికి కొంతకాలం పట్టింది, ఆ తర్వాత ఆయన కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా తన పయినీరు సేవలో పూర్తిగా నిమగ్నమైపోవాలని నిశ్చయించుకున్నాడు. తన పథకాలను పేపరుపై వ్రాసుకున్న తర్వాత ఆయన ప్రార్థనాపూర్వకంగా, ఆ నెలాఖరుకల్లా మూడు కొత్త బైబిలు అధ్యయనాలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రతీరోజు ఆయన తన పరిచర్యను సమీక్షించుకునేవాడు, ప్రతి పది రోజులకు ఆయన తన అభివృద్ధి ఎలా ఉందో చూసుకునేవాడు. ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? నాలుగు కొత్త బైబిలు అధ్యయనాలను రిపోర్టు చేసిన ఆయన, తాను తన లక్ష్యాన్ని చేరుకున్నానని ఆనందంగా చెబుతున్నాడు!

స్వల్పకాల లక్ష్యాలను మైలురాళ్ళుగా చేసుకోండి

కొన్ని లక్ష్యాలు మొదట్లో సాధించడానికి చాలా కష్టమైనవిగా అనిపించవచ్చు. ముందు ప్రస్తావించబడిన టోనీకి యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడం ఒక కలలా అనిపించింది. ఎందుకంటే ఆయన జీవిత విధానం బాధ్యతారహితంగా ఉండడమే కాక అప్పటికి ఆయన ఇంకా దేవునికి సమర్పించుకోలేదు. అయితే టోనీ తన జీవితాన్ని యెహోవా మార్గాలకు అనుగుణంగా మార్చుకోవాలని నిశ్చయించుకొని బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సంపాదించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఆయన సహాయ పయినీరు సేవ ప్రారంభించాలని ఆ తర్వాత క్రమ పయినీరు సేవ ప్రారంభించాలని లక్ష్యాలు పెట్టుకొని ఆ తేదీలను క్యాలెండర్‌పై గుర్తుపెట్టుకున్నాడు. కొంతకాలంపాటు పయినీరు సేవ చేసిన తర్వాత ఆయనకు బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడం సాధించలేని లక్ష్యంగా కనిపించలేదు.

మనం కూడా మన దీర్ఘకాల లక్ష్యాలను కొన్ని స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకోవడం మంచిది. దీర్ఘకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేసేటప్పుడు ఈ స్వల్పకాల లక్ష్యాలు చేరుకోదగిన మైలురాళ్ళుగా పనిచేస్తాయి. ఇలాంటి మైలురాళ్ళ సహాయంతో మన అభివృద్ధిని క్రమంగా సమీక్షించుకోవడం ద్వారా మన మనస్సును లక్ష్యంపై నిలిపివుంచడానికి సహాయం లభిస్తుంది. మన ప్రణాళికల గురించి యెహోవాకు పదేపదే ప్రార్థించడం కూడా మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తూనే ఉండడానికి సహాయం చేస్తుంది. “యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు.​—⁠1 థెస్సలొనీకయులు 5:17.

కృతనిశ్చయం, పట్టుదల అవసరం

మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికలు వేసుకొని వాటి ప్రకారం కృషి చేయాలనే బలమైన కోరిక మనకు ఉన్నా కొన్ని లక్ష్యాలు అందనంత దూరంలోనే ఉంటాయి. అపొస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో తనను తీసుకొని వెళ్ళనందుకు శిష్యుడైన యోహాను మార్కు ఎంత నిరుత్సాహపడివుంటాడో కదా! (అపొస్తలుల కార్యములు 15:​37-40) మార్కు ఆ నిరుత్సాహం నుండి ఒక పాఠం నేర్చుకొని తన సేవను అధికం చేసుకోవడానికి తన లక్ష్యాన్ని సరిచేసుకోవాల్సి వచ్చింది. ఆయన అలా చేశాడని స్పష్టమవుతోంది. ఆ తర్వాత మార్కు గురించి పౌలు ప్రశంసాత్మకంగా వ్రాశాడు, అంతేకాక బబులోనులో మార్కు అపొస్తలుడైన పేతురుతో సన్నిహిత సహవాసాన్ని కూడా ఆనందించాడు. (2 తిమోతి 4:11; 1 పేతురు 5:​13) అయితే యేసు జీవితం గురించి, పరిచర్య గురించి ప్రేరేపిత నివేదిక వ్రాయడమనేది ఆయనకు లభించిన అత్యంత గొప్ప ఆధిక్యత కావచ్చు.

మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా మనకు కూడా ఆశాభంగాలు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు మనం వెనుకంజ వేయకుండా మనం అప్పటివరకూ సాధించిన అభివృద్ధిని సమీక్షించుకొని, మన లక్ష్యం ఇంకా సహేతుకమైనదేనని దానిని సాధించడం సాధ్యమేనని ధృవపరచుకొని, అవసరమైతే మన లక్ష్యాన్ని మార్చుకొని ముందుకు సాగాలి. అడ్డంకులు తలెత్తినప్పుడు మనం కృతనిశ్చయంతో, పట్టుదలతో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. “నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును” అని జ్ఞానియైన సొలొమోను రాజు మనకు హామీ ఇస్తున్నాడు.​—⁠సామెతలు 16:⁠3.

అయినప్పటికీ కొన్నిసార్లు మన పరిస్థితులవల్ల కొన్ని లక్ష్యాలను సాధించడం మనకు అసాధ్యం కావచ్చు. ఉదాహరణకు అనారోగ్యంవల్ల లేదా కుటుంబ బాధ్యతలవల్ల కొన్ని లక్ష్యాలు మనకు అందనంత దూరంలో ఉండవచ్చు. అలాంటప్పుడు మనం మనకు లభించే చివరి ప్రతిఫలం పరలోకంలో గానీ పరదైసు భూమిపై గానీ నిత్యం జీవించడమే అనే వాస్తవాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. (లూకా 23:43; ఫిలిప్పీయులు 3:​13, 14) ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందవచ్చు? “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 2:​17) మన పరిస్థితుల కారణంగా మనం ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా మనం “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి” నడుచుకోవచ్చు. (ప్రసంగి 12:​13) దేవుని చిత్తం చేయడంపై అవధానం నిలపడానికి ఆధ్యాత్మిక లక్ష్యాలు మనకు సహాయం చేస్తాయి. కాబట్టి మనం మన ఆధ్యాత్మిక లక్ష్యాలతో మన సృష్టికర్తను మహిమపరుద్దాం.

[22వ పేజీలోని బాక్సు]

పరిగణించవలసిన ఆధ్యాత్మిక లక్ష్యాలు

○ ప్రతిరోజు బైబిలు చదవడం

కావలికోట, తేజరిల్లు! పత్రికల ప్రతి సంచికను చదవడం

○ మన ప్రార్థనల నాణ్యతను మెరుగుపరచుకోవడం

○ ఆత్మఫలాలను ప్రదర్శించడం

○ సేవను అధికం చేసుకోవడానికి కృషి చేయడం

○ ప్రకటించడంలోను బోధించడంలోను మరింత ఫలవంతంగా తయారవడం

○ టెలిఫోను సాక్ష్యం, అనియత సాక్ష్యం, వ్యాపార క్షేత్రంలో సాక్ష్యమివ్వడం వంటి నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం