కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

లేవీయకాండము 25వ అధ్యాయములో ప్రస్తావించబడిన సునాదకాలపు ఏర్పాటు దేనికి ముంగుర్తుగా ఉంది?

“ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలముగా ఉండవలెను” అని మోషే ధర్మశాస్త్రము ఒక షరతు విధించింది. ఆ సంవత్సరము గురించి ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు. నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.” (లేవీయకాండము 25:​4, 5) ఆ కారణంగా ప్రతి ఏడవ సంవత్సరం భూమికి విశ్రాంతి సంవత్సరముగా ఉండేది. అలాగే ప్రతి 50వ సంవత్సరం అంటే ఏడవ విశ్రాంతి సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం సునాదకాలముగా ఉండేది. ఆ సంవత్సరములో ఏమి జరిగేది?

యెహోవా, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.” (లేవీయకాండము 25:​10, 11) సునాదకాలము అంటే ఆ దేశపు భూమికి విశ్రాంతి సంవత్సరము తర్వాత వచ్చే సంవత్సరము. కానీ అది దానిలోని నివాసులకు విడుదలను తెస్తుంది. యూదులు ఎవరైనా దాసులుగా అమ్ముడుపోతే వారు విడుదల చేయబడాలి. ఒక వ్యక్తి నిర్బంధ పరిస్థితుల్లో తన స్వాస్థ్యమును అమ్ముకుంటే అది అతని కుటుంబానికి తిరిగి ఇవ్వబడాలి. సునాదకాలము ప్రాచీన ఇశ్రాయేలీయులకు పునరుద్ధరణ, విడుదల సంవత్సరముగా ఉండేది. అది క్రైస్తవులకు దేనికి ముంగుర్తుగా ఉంది?

మొదటి మానవుడైన ఆదాము చేసిన తిరుగుబాటు, మానవాళిని పాపానికి దాసులుగా చేసింది. ఆ పాపము యొక్క దాస్యం నుండి మానవాళిని విడుదల చేసేందుకు దేవుడు, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిని ఏర్పాటు చేశాడు. a (మత్తయి 20:​28; యోహాను 3:​16; 1 యోహాను 2:​1, 2) క్రైస్తవులు పాపము యొక్క నియమము నుండి ఎప్పుడు విడుదల పొందుతారు? అభిషిక్త క్రైస్తవులను సంబోధిస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను [“మిమ్మల్ని,” NW] విడిపించెను.” (రోమీయులు 8:⁠2) పరలోక నిరీక్షణగలవారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు ఈ విడుదలను పొందుతారు. వారి శరీరాలు రక్తమాంసాలతో నిండినవి, అపరిపూర్ణమైనవే అయినప్పటికీ, దేవుడు వారిని నీతిమంతులుగా ప్రకటించి వారిని ఆధ్యాత్మిక పుత్రులుగా దత్తత తీసుకుంటాడు. (రోమీయులు 3:​24; 8:​16, 17) అభిషిక్తులకు ఒక గుంపుగా, క్రైస్తవ సునాదకాలము సా.శ. 33 పెంతెకొస్తునాడు మొదలైంది.

భూమిపై నిత్యం జీవించే అపేక్షగల “వేరే గొఱ్ఱెల” విషయం ఏమిటి? (యోహాను 10:​16) వేరే గొఱ్ఱెలకు, వెయ్యి సంవత్సరాల క్రీస్తు పాలన పునరుద్ధరణ, విడుదల కాలంగా ఉంటుంది. వెయ్యి సంవత్సరాల ఈ సునాదకాలములో, యేసు తన విమోచన క్రయధన బలి యొక్క ప్రయోజనాలను విశ్వాసులైన మానవాళికి వర్తింపజేసి, వారిపైనుండి పాపపు ప్రభావాన్ని తొలగిస్తాడు. (ప్రకటన 21:​3, 4) వెయ్యి సంవత్సరాల క్రీస్తు పాలన ముగింపుకల్లా, మానవాళి పరిపూర్ణతకు చేరుకొని వారసత్వంగా వచ్చిన పాపమరణాల నుండి పూర్తిగా విడుదల పొందుతుంది. (రోమీయులు 8:​20, 21) ఆ నెరవేర్పుతో క్రైస్తవ సునాదకాలము ముగుస్తుంది.

[అధస్సూచి]

a వాస్తవానికి, ‘చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు’ యేసు పంపించబడ్డాడు. (యెషయా 61:​1-7; లూకా 4:​16-21) ఆయన ఆధ్యాత్మిక విడుదలను ప్రకటించాడు.

[26వ పేజీలోని చిత్రం]

వెయ్యి సంవత్సరాల సునాదకాలము​—⁠‘వేరే గొఱ్ఱెలకు’ పునరుద్ధరణ, విడుదల కాలము