కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బలై మరువబడినవారు” జ్ఞాపకం చేసుకోబడ్డారు

“బలై మరువబడినవారు” జ్ఞాపకం చేసుకోబడ్డారు

రాజ్య ప్రచారకుల నివేదిక

“బలై మరువబడినవారు” జ్ఞాపకం చేసుకోబడ్డారు

హైకాస్‌ అనే 15 ఏండ్ల యెహోవాసాక్షి, 2001 ప్రథమార్థంలో స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో జరిగిన, “బలై మరువబడినవారు” అనే ప్రదర్శనకు వెళ్ళాడు. అది నాజీలు యెహోవాసాక్షులపై చేసిన హింసకు సంబంధించిన ప్రదర్శన. హైకాస్‌ తన సందర్శన ముగింపులో ఇలా అన్నాడు: “నాజీ పాలనలో యెహోవాసాక్షులు అనుభవించిన అమానుషత్వం గురించి, బాధల గురించి నేను విన్నాను, కానీ ఆ కాలానికి చెందిన అధికారిక పత్రాలను, ఫోటోలను చూడడం ఇదే మొదటిసారి. ఆ ప్రదర్శనలోని ఫోటోలు, వీక్షకుల నివేదికలు, చరిత్రకారుల వ్యాఖ్యానాలు నా మనసుపై, హృదయంపై చెరగని ముద్ర వేశాయి.”

కొంతకాలం తర్వాత, కళాశాలలోని తన తోటి విద్యార్థుల కోసం ఒక నివేదిక వ్రాయడానికి హైకాస్‌ నియమించబడినప్పుడు ఆయన, “యెహోవాసాక్షులు​—⁠నాజీ పాలనకు బలై మరువబడిన బాధితులు” అన్న విషయాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని ఆమోదించాడు, కానీ దానికి మూలాధారంగా లౌకిక సాహిత్యాలను చేర్చాల్సిన అవసరముంటుందని హైకాస్‌తో చెప్పాడు. అందుకు హైకాస్‌ సంతోషంగా ఒప్పుకున్నాడు. “నేను నాజీ కాలంలోని యెహోవాసాక్షుల గురించిన కొన్ని పుస్తకాలను సమీక్షించి వాటి మీద ఒక సమగ్ర వ్యాసం వ్రాశాను. ‘బలై మరువబడినవారు’ అనే ప్రదర్శన చూశాక నాలో కలిగిన నా మనోభావాలను కూడా అందులో చేర్చాను. 43 పేజీల ఆ నివేదికలో చిత్రాలు, ఫోటోలు ఉన్నాయి.”

2002 నవంబరులో హైకాస్‌ తన నివేదికను తన తోటి విద్యార్థులకు, టీచర్లకు, కుటుంబానికి, స్నేహితులకు సమర్పించాడు. ఆ తర్వాత, ప్రశ్నా జవాబుల కార్యక్రమం ఏర్పాటైంది, అది ఆయనకు తన బైబిలు ఆధారిత నమ్మకాలను వివరించే అవకాశాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల్లో నుండి ఒక అమ్మాయి ఆ అంశాన్నే ఎందుకు ఎంచుకున్నావని ఆయనను ప్రశ్నించినప్పుడు, అనేక చరిత్ర పుస్తకాలు యెహోవాసాక్షుల గురించి ప్రస్తావించవని, సాక్షులు తమ క్రైస్తవ విశ్వాసాన్ని ఎంత ధైర్యంగా కాపాడుకున్నారో ప్రజలు తెలుసుకోవాలని తాను కోరుకున్నానని హైకాస్‌ వివరించాడు. ఆయన సమర్పించిన దాని ఫలితం?

“నా తోటి విద్యార్థులు ఎంతో ఆశ్చర్యపోయారు, యెహోవాసాక్షులు ఒక గుంపుగా అంత క్రూరంగా హింసించబడ్డారని వారికి తెలియదు. నాజీ నిర్బంధ శిబిరాల్లో సాక్షులు ఒక ప్రత్యేక గుర్తింపు చిహ్నాన్ని అంటే ఊదారంగు త్రికోణాన్ని ధరించేవారని కూడా చాలామందికి తెలియదు.”

తన నివేదిక సమర్పించడం పూర్తయిన తర్వాత హైకాస్‌కు తన తోటి విద్యార్థులతో మాట్లాడేందుకు, రక్తమార్పిడి, మద్యం, నైతికతల విషయంలో సాక్షుల బైబిలు ఆధారిత స్థానం గురించి చర్చించేందుకు మరిన్ని అవకాశాలు లభించాయి. “నా స్నేహితుల్లో ఎవ్వరూ నన్ను పరిహాసం గానీ ఎగతాళి గానీ చేయలేదు” అని హైకాస్‌ చెప్పాడు. అంతేకాకుండా, ఆయన నివేదిక ఇప్పుడు ఆ కళాశాల గ్రంథాలయంలో ఉంచబడింది. అది యెహోవాసాక్షులు ధైర్యంగా వహించిన స్థానాన్ని మరచిపోకుండా ఉండేందుకు దోహదపడుతుంది.