కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి

దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి

దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి

‘పోయి, నా జనులకు ప్రవచనము చెప్పుము.’​—⁠ఆమోసు 7:​15.

ఒక యెహోవాసాక్షి పరిచర్యలో ఉండగా ఆయనకు ఒక యాజకుడు ఎదురై ‘నీ ప్రచారమిక ఆపు! ఈ స్థలం విడిచి వెళ్లిపో!’ అని గట్టిగా అరిచాడు. అప్పుడా సాక్షి ఏమి చేశాడు? ఆ యాజకుడు వెళ్లిపొమ్మన్నాడని ఆయన వెళ్లిపోయాడా లేక ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించడంలో కొనసాగాడా? ఆ తర్వాత ఏమి జరిగిందో మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆ సాక్షి తన పేరుతో ఉన్న పుస్తకంలో తన అనుభవాలు వ్రాశాడు. అది బైబిలు పుస్తకమైన ఆమోసు. ఆమోసు ఆ యాజకుణ్ణి ఎదుర్కొన్న తీరు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ముందు, ఆమోసు నేపథ్య సమాచారం గురించి మనం కొంత పరిశీలిద్దాం.

2 ఆమోసు ఎవరు? ఆయన ఎక్కడ, ఎప్పుడు జీవించాడు? ఈ ప్రశ్నలకు జవాబులను మనం ఆమోసు 1:1లో చూస్తాము. అక్కడ మనమిలా చదువుతాం: “యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, . . . తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.” ఆమోసు యూదా నివాసి. ఆయన స్వస్థలం తెకోవ, ఇది యెరూషలేముకు దక్షిణాన పదహారు కిలోమీటర్ల దూరంలోవుంది. ఆయన సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దాంతంలో జీవించాడు, ఆ కాలంలో యూదా రాజ్యాన్ని రాజైన ఉజ్జియా, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని రాజైన యరొబాము II పరిపాలిస్తున్నారు. ఆమోసు పసుల కాపరి. నిజానికి, ఆయన “పసుల కాపరి” మాత్రమే కాక ‘మేడికాయలకు కాటుపెట్టేవాడు’ కూడా అని ఆమోసు 7:⁠14, NW చెబుతోంది. కాబట్టి, ఆయన సంవత్సరంలో కొన్నిరోజులు కోతపని కూడా చేసేవాడు. ఆయన మేడికాయలకు కాటుపెట్టేవాడు. మేడికాయలు త్వరగా ముగ్గడానికి అలా చేసేవారు. అది శ్రమతో కూడిన పని.

“ప్రవచనము చెప్పుము”

3 ఆమోసు నిష్కపటంగా ఇలా చెప్పాడు: ‘నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడను కాను.’ (ఆమోసు 7:​14) నిజంగానే ఆయన ప్రవక్త కుమారుడు కాడు లేక ప్రవక్త దగ్గర శిక్షణపొందిన వాడూ కాదు. అయినప్పటికీ, యెహోవా తన పని చేయడానికి యూదాలోని ప్రజలందరిలో నుండి ఆమోసును ఎన్నుకున్నాడు. దేవుడు, ఆ కాలంలోవున్న బలాఢ్యుడైన రాజునో, విద్యాధికుడైన యాజకుడినో, సంపన్న అధిపతినో ఎంచుకోలేదు. ఇది మనకు హామీతోకూడిన ఒక పాఠాన్ని అందిస్తోంది. ఆమోసులాగే మనకు కూడా లోకరీత్యా గొప్ప హోదా లేకపోవచ్చు లేదా మనం విద్యాధికులం కాకపోవచ్చు. అంతమాత్రాన, అది మనం దేవుని వాక్యం ప్రకటించడానికి మనకు అర్హతలేదని భావించేలా చేయాలా? అక్కర్లేదు! సవాలుతోకూడిన ప్రాంతాల్లో సైతం తన సందేశం ప్రకటించడానికి యెహోవా మనలను సంసిద్ధులను చేయగలడు. ఆమోసు విషయంలో యెహోవా ఖచ్చితంగా అలాగే చేశాడు కాబట్టి, ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించాలని కోరుకునే వారందరికి, ధైర్యశాలియైన ఆ ప్రవక్త ఉంచిన ఆదర్శాన్ని పరిశీలించడం ఉపదేశాత్మకంగా ఉంటుంది.

4 యెహోవా ఆమోసుకు ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుము.” (ఆమోసు 7:​15) ఆ నియామకం సవాలుదాయకమైనదే. ఎందుకంటే, ఆ సమయంలో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం శాంతిభద్రతలతో, సుభిక్షంగా ఉంది. చాలామందికి, మామూలు మట్టి ఇటుకలతో కాదు ఖరీదైన ‘మలుపురాళ్లతో’ కట్టబడిన ‘చలికాలపు నగరులు’ ‘వేసవికాలపు నగరులు’ ఉన్నాయి. కొందరికి ఏనుగు దంతాలు పొదిగిన అందమైన ఫర్నీచరుంది, వారు ‘శృంగారమైన ద్రాక్షతోటల్లో’ తయారైన ద్రాక్షారసం త్రాగుతున్నారు. (ఆమోసు 3:⁠15; 5:​12) అలా అనేకులు ఉదాసీనంగా ఉన్నారు. నిజానికి, ఆమోసుకు నియమించబడిన క్షేత్రం నేడు మనలో కొందరు పరిచర్య చేస్తున్న ప్రాంతంలాగే ఉంది.

5 ఇశ్రాయేలీయులకు వస్తుసంపదలు ఉండడంలో తప్పేమీలేదు. అయితే, కొందరు ఇశ్రాయేలీయులు దుర్లాభంతో సంపద కూడబెట్టుకుంటున్నారు. ధనవంతులు ‘దరిద్రులను బాధపెడుతూ బీదలను నలుగగొడుతున్నారు.’ (ఆమోసు 4:⁠1) పలుకుబడిగల వ్యాపారులు, న్యాయమూర్తులు, యాజకులు బీదలను దోచుకోవడానికి కుట్రలు పన్నారు. మనం ఆ కాలానికి వెళ్లి ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో గమనిద్దాం.

దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘించబడింది

6 మనం మొదట సంతవీధికి వెళ్దాం. అక్కడ, నిజాయితీ లేని వ్యాపారులు ‘తూము చిన్నదిచేసి రూపాయి ఎక్కువ’ చేయడమే కాక, ‘చచ్చు ధాన్యం’ కూడా అమ్ముతున్నారు. (ఆమోసు 8:​5, 6) ఆ వ్యాపారులు కొనేవారికి తక్కువ కొలుస్తూ, ధరలు ఎక్కువచేసి నాసిరకం సరుకు అమ్ముతున్నారు. వ్యాపారుల చేతిలో పూర్తిగా మోసపోయిన ఆ బీదలు ఆ తర్వాత, తమనుతామే బానిసలుగా అమ్ముకొనే పరిస్థితి వచ్చింది. దానితో వ్యాపారులు వారిని కేవలం ‘పాదరక్షల’ ఖరీదుకు కొంటున్నారు. (ఆమోసు 8:6) ఒక్కసారి ఊహించండి! దురాశపరులైన ఆ వ్యాపారులు తమ తోటి ఇశ్రాయేలీయులను చెప్పుల ఖరీదుకు సమానమైనవారిగా లెక్కిస్తున్నారు! అది బీదలను హీనాతిహీనంగా అణగద్రొక్కడమే కాక, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత ఘోరంగా ఉల్లంఘించడమో గదా! అయినా, ఆ వ్యాపారులు ‘విశ్రాంతిదినాన్ని’ పాటిస్తున్నారు. (ఆమోసు 8:5) అవును, వారు పైకిమాత్రమే మతాసక్తిగలవారు.

7 అయితే, ‘నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను’ అని ఆజ్ఞాపిస్తున్న దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూనే ఆ వ్యాపారులు శిక్షను ఎలా తప్పించుకుంటున్నారు? (లేవీయకాండము 19:​18) ధర్మశాస్త్రాన్ని అమలు చేయవలసిన న్యాయాధిపతులు కూడా ఆ నేరంలో భాగస్థులుగా ఉన్నారు కాబట్టే ఆ వ్యాపారులు శిక్ష తప్పించుకుంటున్నారు. న్యాయ విచారణ జరిగే పట్టణపు గుమ్మం దగ్గర న్యాయాధిపతులు ‘దోషనివృత్తికి రూకలు పుచ్చుకొనుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేస్తున్నారు.’ బీదలను కాపాడవలసిందిపోయి, ఆ న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటూ వారికి అన్యాయం చేస్తున్నారు. (ఆమోసు 5:​10, 11) కాబట్టి న్యాయాధిపతులు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారు.

8 మరి ఇశ్రాయేలు యాజకులు ఏమి చేస్తున్నారు? దాన్ని తెలుసుకోవడానికి మనం మరో స్థలంవైపుకు మన అవధానాన్ని మళ్లించాలి. “తమ దేవుని మందిరంలోనే” ఎలాంటి పాపాలను యాజకులు అనుమతించారో గమనించండి. ఆమోసు ద్వారా దేవుడు ఇలా అన్నాడు: “తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు.” (ఆమోసు 2:​7, 8) ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి! ఒక ఇశ్రాయేలు తండ్రి, అతని కుమారుడు కూడా ఒకే దేవదాసితో లైంగిక దుర్నీతికి పాల్పడుతున్నారు. ఆ దుష్ట యాజకులు అలాంటి లైంగిక దుర్నీతిని చూసినా చూడనట్లే ఊరుకున్నారు.​—⁠లేవీయకాండము 19:⁠29; ద్వితీయోపదేశకాండము 5:⁠18; 23:⁠17.

9 మరో పాపభరితమైన ప్రవర్తనను సూచిస్తూ యెహోవా ఇలా అన్నాడు: “తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.” (ఆమోసు 2:⁠8) అవును, కుదవగా తీసుకొన్న వస్త్రాన్ని చీకటిపడక ముందే తిరిగి ఇచ్చివేయాలని నిర్గమకాండము 22:​26, 27లో వ్రాయబడివున్న నియమాన్ని యాజకులు, ప్రజలు కూడా పెడచెవినబెట్టారు. బదులుగా వారు దానిని అబద్ధ దేవతలకు పండుగ చేసుకోవడానికి, పానం చేయడానికి తాము పడుకునేందుకు దుప్పటిగా వాడుతున్నారు. అబద్ధమత పండుగల్లో త్రాగడానికి బీదల నుండి వసూలు చేసిన జుల్మానా సొమ్ముతో వారు ద్రాక్షారసం కొంటున్నారు. స్వచ్ఛారాధన మార్గం నుండి వారెంతగా తొలగిపోయారో గదా!

10 ఇశ్రాయేలీయులు అవమానకరంగా ధర్మశాస్త్రంలోని రెండు ప్రధాన ఆజ్ఞలను అంటే యెహోవాను, తోటి మానవులను ప్రేమించాలనే ఆజ్ఞలను ఉల్లంఘించారు. కాబట్టి దేవుడు వారి అవిశ్వాస్యతను ఖండించడానికి ఆమోసును పంపించాడు. నేడు, క్రైస్తవమత సామ్రాజ్య దేశాలతోపాటు ప్రపంచ దేశాలు, ప్రాచీన ఇశ్రాయేలు భ్రష్ట స్థితినే ప్రతిబింబిస్తున్నాయి. కొందరు వర్ధిల్లుతున్నా, ఇతరులు చాలామంది పెద్ద వ్యాపారుల, రాజకీయ, అబద్ధమత నాయకుల లైంగిక దుర్నీతివల్ల ఆర్థికంగా పతనమై, మానసిక హానిని అనుభవిస్తున్నారు. అయితే, కష్టాలు అనుభవిస్తున్న, తనను వెదకడానికి ప్రేరేపించబడిన వారి విషయంలో యెహోవాకు శ్రద్ధ ఉంది. అందుకే, ఆమోసు చేసినలాంటి సేవే చేయడానికి, అంటే తన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి ఆయన తన ప్రస్తుత దిన సేవకులను నియమించాడు.

11 ఆమోసు చేసిన సేవకు, మనం చేసే సేవకు పోలికలు ఉన్నాయి కాబట్టి, ఆయన ఆదర్శాన్ని పరిశీలించడం నుండి మనమెంతో ప్రయోజనం పొందుతాము. నిజానికి, (1) మనమేమి ప్రకటించాలి, (2) ఎలా ప్రకటించాలి, (3) మన ప్రకటనా పనిని వ్యతిరేకులు ఎందుకు ఆపలేరు అనేవి ఆమోసు మనకు చూపిస్తున్నాడు. ఈ అంశాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

ఆమోసును మనమెలా అనుకరించవచ్చు?

12 యెహోవాసాక్షులుగా మనం మన క్రైస్తవ పరిచర్యలో రాజ్య ప్రకటనా పనిపై, శిష్యులను చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తాం. (మత్తయి 28:​19, 20; మార్కు 13:​10) అయినప్పటికీ, దుష్టుల మీదికి యెహోవా తీవ్రమైన తీర్పు తెస్తాడని ఆమోసు ప్రకటించినట్లే, మనం కూడా దేవుని హెచ్చరికలపై దృష్టి నిలుపుతాం. ఉదాహరణకు, ఇశ్రాయేలీయుల విషయంలో యెహోవా తన అయిష్టతను పదే పదే స్పష్టం చేశాడని ఆమోసు 4:​6-11 చూపిస్తోంది. ఆయన వారికి ‘ఆహారం లేకుండా చేసి,’ ‘వానలేకుండా చేసి’ ‘ఎండు తెగులు, కాటుక తెగులు కలుగజేసి’ ‘తెగుళ్లు పుట్టించాడు.’ ఇశ్రాయేలీయులు మారడానికి, పశ్చాత్తాపపడానికి ఈ సంఘటనలు వారిని పురికొల్పాయా? “మీరు నాతట్టు తిరిగినవారు కారు” అని దేవుడు అన్నాడు. నిజానికి, ఇశ్రాయేలీయులు యెహోవాను పదే పదే తిరస్కరించారు.

13 యెహోవా పశ్చాత్తాపం చూపించని ఆ ఇశ్రాయేలీయులను శిక్షించాడు. అయితే వారికి మొదట ప్రవచనార్థక హెచ్చరిక ఇవ్వబడింది. దీనికి అనుగుణంగా దేవుడు ఇలా ప్రకటించాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” (ఆమోసు 3:⁠7) జలప్రళయం వస్తుందని దేవుడు నోవహుకు ముందేచెప్పి, దాని గురించి హెచ్చరించమని ఆయనను ఆదేశించాడు. అదే ప్రకారంగా, యెహోవా చివరి హెచ్చరిక చేయమని ఆమోసుకు చెప్పాడు. విషాదకరంగా, ఇశ్రాయేలీయులు ఆయనిచ్చిన దైవిక సందేశాన్ని నిర్లక్ష్యం చేసి, సరైన చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు.

14 ఆమోసు కాలానికి, మన కాలానికి కొన్ని గమనార్హమైన పోలికలున్నట్లు మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు. యుగాంతంలో అనేక విపత్తులు సంభవిస్తాయని యేసుక్రీస్తు ప్రవచించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రకచనాపని జరుగుతుందని కూడా ఆయన ముందే చెప్పాడు. (మత్తయి 24:3-14) అయితే, ఆమోసు కాలంలోలాగే నేడు కూడా అనేకులు కాలాల సూచనలను, రాజ్య సందేశాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటి వ్యక్తులు పశ్చాత్తాపం చూపించని ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న పర్యవసానాలే ఎదుర్కొంటారు. యెహోవా వారిని ఇలా హెచ్చరించాడు: “మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.” (ఆమోసు 4:⁠12) అష్షూరీయుల సైన్యం ఇశ్రాయేలీయులను జయించినప్పుడు దేవుని కఠిన తీర్పును పొందడం ద్వారా వారు ఆయన సన్నిధిని కనబడ్డారు. నేడు, ఈ భక్తిహీన ప్రపంచం అర్మగిద్దోనులో ‘దేవుని సన్నిధిని కనబడుతుంది.’ (ప్రకటన 16:​14-16) అయితే, యెహోవా సహనం నిలిచివున్నంతవరకు, “యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు” అని మనం సాధ్యమైనంత మందిని ప్రోత్సహిస్తాం.​—⁠ఆమోసు 5:⁠6.

ఆమోసులాగే వ్యతిరేకతను ఎదుర్కోవడం

15 మనం ప్రకటించేదాని విషయంలోనేకాక ప్రకటించే విధానంలో కూడా మనం ఆమోసును అనుకరించవచ్చు. ఆ వాస్తవం 7వ అధ్యాయంలో నొక్కి చెప్పబడింది. అక్కడ మన చర్చారంభంలో ప్రస్తావించుకున్న యాజకుడు ఎదురైన సంఘటన ఉంది. అతడు “బేతేలులోని యాజకుడైన అమజ్యా.” (ఆమోసు 7:​10) ఇశ్రాయేలీయుల దూడ ఆరాధన చేరివున్న భ్రష్ట మతానికి ఆ బేతేలు పట్టణం కేంద్రస్థానం. కాబట్టి, అమజ్యా ఆ జనాంగపు అధికార మతానికి యాజకుడు. ఆమోసు ధైర్యంగా ప్రకటించడం చూసి అతడెలా స్పందించాడు?

16 అమజ్యా ఆమోసుతో ఇలా అన్నాడు: “దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము, రాజధాని పట్టణమైయున్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు.” (ఆమోసు 7:​12, 13) మరో విధంగా చెప్పాలంటే, అమజ్యా గట్టిగా ఇలా అరిచాడు: ‘నీ ఇంటికి వెళ్లిపో! మా మతం మాకుంది.’ “ఇశ్రాయేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు” అని రాజైన యరొబాము IIకు చెబుతూ, ప్రభుత్వం ఆమోసు కార్యకలాపాలను నిషేధించేలా చేయడానికి కూడా అమజ్యా ప్రయత్నించాడు. (ఆమోసు 7:​10) అవును, ఆమోసు రాజద్రోహం చేస్తున్నాడని అమజ్యా ఆరోపించాడు. అతను రాజుకు ఇలా చెప్పాడు: ‘యరొబాము ఖడ్గముచేత చచ్చునని, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ఆమోసు ప్రకటిస్తున్నాడు.’​—⁠ఆమోసు 7:​11.

17 అమజ్యా తన మాటల్లో తప్పుదారి పట్టించే మూడు వ్యాఖ్యానాలు చేర్చాడు. అతడు ‘ఆమోసు ప్రకటిస్తున్నాడు’ అని అన్నాడు. కానీ, ప్రవచనానికి తానే మూలమని ఆమోసు ఎప్పుడూ చెప్పుకోలేదు. బదులుగా, ఆయన అన్ని సందర్భాల్లో “యెహోవా సెలవిచ్చునదేమనగా” అని ప్రకటించాడు. (ఆమోసు 1:⁠3) ఆమోసు ‘యరొబాము ఖడ్గముచేత చచ్చును’ అన్నట్లు కూడా నిందించబడ్డాడు. కానీ ఆమోసు 7:9లో ఉన్నట్లుగా, ఆమోసు ఇలా ప్రవచించాడు: ‘నేను [యెహోవా] ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.’ యెహోవా అలాంటి విపత్తు యరొబాము “ఇంటివారి” పైకి అంటే, యరొబాము వారసులపైకి వస్తుందని ప్రవచించాడు. ఆమోసు ఇంకా, ‘ఇశ్రాయేలీయులు నిశ్చయంగా చెరలోనికి పోవుదురని’ చెప్పాడని కూడా అమజ్యా ఆరోపించాడు. అయితే, దేవునివైపు తిరిగే ప్రతీ ఇశ్రాయేలీయుడు ఆశీర్వదింపబడతాడని కూడా ఆమోసు ప్రవచించాడు. ఆమోసు చేస్తున్న ప్రకటనా పనిపై అధికార నిషేధం తెచ్చే ప్రయత్నంలో అమజ్యా తప్పుదోవ పట్టించే అర్థసత్యాలు ప్రయోగించాడని స్పష్టమౌతోంది.

18 అమజ్యా ఉపయోగించిన పద్ధతులకు, నేడు యెహోవా ప్రజలను వ్యతిరేకించే వారు ప్రయోగించే పద్ధతులకు స్పష్టమైన పోలికలు ఉన్నట్లు మీరు గమనించారా? ఆమోసు నోరు కట్టివేయడానికి అమజ్యా ప్రయత్నించినట్లే, మన కాలంలో కొంతమంది ప్రీస్టులు, పీఠాధిపతులు, బిషప్పులు దేవుని సేవకుల ప్రకటనా పనిని ఆపుజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమోసు రాజద్రోహం చేస్తున్నాడని అమజ్యా అబద్ధ ఆరోపణచేశాడు. నేడు అదే విధంగా, యెహోవాసాక్షులు దేశ భద్రతకు ప్రమాదమని కొందరు మతనాయకులు అబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ఆమోసును ఎదిరించేందుకు అమజ్యా రాజు సహాయం కోరినట్లే, యెహోవాసాక్షులను హింసించేందుకు మతనాయకులు ఎక్కువగా రాజకీయ మిత్రుల మద్దతు కూడగట్టుకుంటారు.

వ్యతిరేకులు మన ప్రకటనా పనిని ఆపుజేయలేరు

19 అమజ్యా నుండి వచ్చిన వ్యతిరేకతకు ఆమోసు ఎలా స్పందించాడు? మొదట, ఆమోసు ఆ యాజకుణ్ణి ఇలా అడిగాడు: ‘ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదని నీవు ఆజ్ఞాపిస్తున్నావా?’ ఆ తర్వాత, ధైర్యశాలియైన ఆ దేవుని ప్రవక్త, ఏ మాత్రం సంకోచించకుండా, అమజ్యా వినడానికి నిశ్చయంగా ఇష్టపడని మాటలే పలికాడు. (ఆమోసు 7:​16, 17) ఆమోసు భయపడలేదు. మనకెంత అద్భుతమైన ఆదర్శమో కదా! ఆధునిక అమజ్యాలు క్రూర హింసలకు ఆజ్యం పోస్తున్న దేశాల్లో సహితం దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మనం మన దేవునికి అవిధేయత చూపం. ఆమోసులాగే, మనమూ అవిశ్రాంతంగా ‘యెహోవా సెలవిచ్చునదేమనగా’ అని ప్రకటిస్తూనే ఉంటాం. మనకు యెహోవా ‘హస్తము తోడైయున్నందున’ మన ప్రకటనా పనిని వ్యతిరేకులు ఎన్నటికీ ఆపుజేయలేరు.​—⁠అపొస్తలుల కార్యములు 11:​19-21.

20 నిజానికి, తన బెదిరింపులు వ్యర్థమౌతాయని అమజ్యా తెలుసుకొని ఉండాల్సింది. అప్పటికే ఆమోసు ఈ భూమ్మీద తన నోరు మూయించడం ఎవ్వరితరం కాదని వివరించాడు, అదే మన పరిశీలనలోని మూడవ అంశం. ఆమోసు 3:3-8 ప్రకారం, కారణం లేకుండా ఏదీ సంభవించదని చూపేందుకు ఆమోసు వరుసగా ప్రశ్నలు, దృష్టాంతాలు ఉపయోగించి, ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు: “సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?” మరో విధంగా చెప్పాలంటే, ఆమోసు తన శ్రోతలకు ఇలా చెప్పాడు: ‘సింహం గర్జించినప్పుడు, మీరెలా భయపడకుండా ఉండలేరో, అలాగే ప్రకటించమని యెహోవా సెలవిచ్చినప్పుడు నేను విన్నాను కాబట్టి, నేనుకూడా ఆ పని చేయకుండా ఉండలేను.’ దైవభక్తి లేదా యెహోవా మీదున్న ప్రగాఢ భక్తిభావం ఆమోసు ధైర్యంగా మాట్లాడేలా చేసింది.

21 మనం కూడా ప్రకటించమనే యెహోవా ఆదేశాన్ని వింటున్నాం. మనమెలా స్పందిస్తాం? మనం కూడా ఆమోసు మరియు యేసు తొలి శిష్యుల్లాగే యెహోవా సహాయంతో ఆయన వాక్యం ధైర్యంగా ప్రకటిస్తాం. (అపొస్తలుల కార్యములు 4:​23-31) వ్యతిరేకులు పురికొల్పే హింస లేదా మనం ప్రకటించే ప్రజల ఉదాసీనత మనలను మాట్లాడకుండా ఆపుజేయలేవు. భూవ్యాప్తంగా యెహోవాసాక్షులు ఆమోసు కనబరిచినటువంటి ఆసక్తినే కనబరుస్తూ, ధైర్యంగా సువార్త ప్రకటించడంలో కొనసాగడానికి పురికొల్పబడుతున్నారు. రానున్న యెహోవా తీర్పు గురించి ప్రజలను హెచ్చరించే బాధ్యత మనపై ఉంది. ఆ తీర్పులో ఏమి ఇమిడి ఉంది? తర్వాతి ఆర్టికల్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వబడుతుంది.

మీరెలా జవాబిస్తారు?

ఎలాంటి పరిస్థితుల్లో ఆమోసు దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చాడు?

ఆమోసులాగే మనమేమి ప్రకటించాలి?

ఎలాంటి దృక్పథంతో మనం మన ప్రకటనా పనిని నిర్వర్తించాలి?

మన సాక్ష్యపు పనిని వ్యతిరేకులు ఎందుకు ఆపలేరు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఆమోసు ఎవరు, ఆయన గురించి బైబిలు ఏమి వెల్లడి చేస్తోంది?

3. ప్రకటించడానికి అర్హతలేదని మనం భావిస్తే, ఆమోసు ఆదర్శాన్ని పరిశీలించడం మనకు ఎలా సహాయం చేస్తుంది?

4. ఇశ్రాయేలులో ప్రవచించడం ఆమోసుకు ఎందుకు సవాలుదాయకంగా ఉంది?

5. కొందరు ఇశ్రాయేలీయులు ఎలాంటి అన్యాయపు క్రియలు చేస్తున్నారు?

6. ఇశ్రాయేలు వ్యాపారులు ఇతరులను ఎలా దోచుకుంటున్నారు?

7. ఇశ్రాయేలు వ్యాపారులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూనే శిక్షను ఎలా తప్పించుకుంటున్నారు?

8. దుష్ట యాజకులు ఎలాంటి ప్రవర్తనను చూడనట్లే ఊరుకున్నారు?

9, 10. దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన ఏ నియమాల ఉల్లంఘనా దోషం ఇశ్రాయేలీయుల మీద ఉంది, దానికి, మన కాలానికి ఎలాంటి పోలికను చూడవచ్చు?

11. ఆమోసు ఆదర్శం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

12, 13. ఇశ్రాయేలీయుల విషయంలో యెహోవా తన అయిష్టతను ఎలా చూపించాడు, వారి ప్రతిస్పందన ఎలా ఉంది?

14. ఆమోసు కాలానికి, మన కాలానికి ఎలాంటి పోలికలు ఉన్నాయి?

15-17. (ఎ) అమజ్యా ఎవరు, ఆమోసు ప్రకటనా పనికి అతడెలా స్పందించాడు? (బి) అమజ్యా ఆమోసుపై ఎలాంటి ఆరోపణలు గుప్పించాడు?

18. అమజ్యా ఉపయోగించిన పద్ధతులకు, నేటి మత నాయకులు ప్రయోగించే విధానాలకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?

19, 20. అమజ్యా నుండి వచ్చిన వ్యతిరేకతకు ఆమోసు ఎలా స్పందించాడు?

21. సువార్త ప్రకటించమని దేవుడిచ్చిన ఆదేశానికి మనమెలా స్పందిస్తాం?

[10వ పేజీలోని చిత్రం]

మేడికాయలకు కాటుపెట్టే ఆమోసును దేవుడు తన పని చేయడానికి ఎన్నుకున్నాడు

[13వ పేజీలోని చిత్రాలు]

ఆమోసులాగే మీరూ యెహోవా సందేశాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నారా?