కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తును ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?

యేసుక్రీస్తును ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?

యేసుక్రీస్తును ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?

యేసుక్రీస్తు “జీవించిన వారిలోకెల్లా నిశ్చయంగా అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి.”​—⁠“ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా.”

సాధారణంగా మహా పురుషులు తమ కార్యాలనుబట్టి జ్ఞాపకం చేసుకోబడతారు. కానీ చాలామంది యేసును ఆయన కార్యాలనుబట్టి కాక, ఆయన జననాన్నిబట్టి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? క్రైస్తవమత సామ్రాజ్యంలో చాలామంది, యేసు జననానికి సంబంధించిన సంఘటనల గురించి వివరంగా చెప్పగలుగుతారు. అయితే వారిలో ఎంతమంది ఆయనిచ్చిన కొండమీది ప్రసంగంలోని సర్వోత్తమ బోధను గుర్తు చేసుకొని, అన్వయించుకుంటున్నారు?

యేసు జననం గమనార్హమైనదే, అయితే ఆయన తొలి శిష్యులు ఆయన కార్యాలకు, బోధకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. క్రీస్తు పరిణతిగల వ్యక్తిగా గడిపిన జీవితాన్ని ఆయన జననం మరుగుపరచాలని దేవుడు ఉద్దేశించనేలేదు. అయితే క్రిస్మస్‌ పండుగ, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్నే ఆయన జనన సంబంధిత పుక్కిటి పురాణాల మరుగునపడేసింది.

క్రిస్మస్‌ ఆచరణలకు సంబంధించి మరో చిక్కు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ యేసు నేడు భూమికే తిరిగివస్తే, క్రిస్మస్‌ సంబంధిత వాణిజ్య స్ఫూర్తిని గురించి ఆయన ఏమనుకుంటాడు? రెండువేల సంవత్సరాల క్రితం యేసు యెరూషలేములోని దేవాలయాన్ని సందర్శించాడు. ఒక యూదా మత పండుగను ఆసరా చేసుకొని ద్రవ్య మారకం చేస్తున్న వారిపట్ల, వ్యాపారులపట్ల ఆయన ఆగ్రహం ప్రదర్శించాడు. “వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడి” అని ఆయన అన్నాడు. (యోహాను 2:​13-16) వ్యాపారాన్ని, మతాన్ని కలగాపులగం చేయడాన్ని యేసు ఆమోదించలేదని స్పష్టమవుతోంది.

క్రిస్మస్‌ సంబంధిత వాణిజ్య స్ఫూర్తిపట్ల యథార్థవంతులైన స్పానిష్‌ క్యాథలిక్‌లు చాలామంది చింతను వ్యక్తం చేస్తున్నారు. అనేక క్రిస్మస్‌ ఆచార మూలాల దృష్ట్యా వాణిజ్యంపట్ల అలాంటి ప్రవృత్తి బహుశా అనివార్యం కావచ్చు. పత్రికా విలేఖరి క్వాన్‌ ఆర్యాస్‌ ఇలా సూచిస్తున్నాడు: “క్రైస్తవత్వంలోనే ఉండి, క్రిస్మస్‌ ‘అన్యమత సంబంధమైనదిగా’ తయారై మతంకంటే వేడుకకే, వినిమయవాదానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని విమర్శించే వారికి యేసు జన్మదిన పండుగ ఆరంభంలోనే . . . రోమన్ల అన్యమత [సూర్యుని] పండుగకు సంబంధించిన అనేక అంశాలు చేర్చబడ్డాయనే విషయం తెలియదు.”​—⁠ఎల్‌ పియాస్‌, డిసెంబరు 24, 2001.

ఇటీవలి సంవత్సరాల్లో, అనేకమంది స్పానిష్‌ విలేఖరులు, ఆచారబద్ధమైన క్రిస్మస్‌ వేడుకల అన్యమత మూలాలతోపాటు, వాటి వాణిజ్య సంబంధాలపై వ్యాఖ్యానించారు, అనేక సర్వసంగ్రహ నిఘంటువులు కూడా అలాగే వ్యాఖ్యానించాయి. క్రిస్మస్‌ ఆచారాల తేదీ గురించి ఎన్‌సైక్లోపీడియా డి లా రేలీకాన్‌ కాటోలీకా రూఢీగా ఇలా చెబుతోంది: “రోమన్‌ చర్చి క్రిస్మస్‌కు ఈ తేదీని నిర్ణయించడానికి కారణం క్రైస్తవ పండుగల స్థానంలో అన్యమత పండుగలను స్థిరపరచడమే అన్నట్లుగా ఉంది. . . . ఆ కాలంలో రోమ్‌లో అన్యులు డిసెంబరు 25వ తేదీని ‘పవిత్ర సూర్యుని’ పుట్టుకకు సంబంధించిన నాటాలిస్‌ ఇన్‌విక్టిని భక్తిశ్రద్ధలతో ఆచరించేవారని మనకు తెలుసు.”

ఎన్‌సైక్లోపీడియా ఎస్‌పానికా కూడా అదేవిధంగా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “డిసెంబరు 25న జరుపుకునే క్రిస్మస్‌ పండుగ ఖచ్చితమైన కాలాన్ని లెక్కించి నిర్ణయించినది కాదుగాని, రోమ్‌లో జరుపుకునే శీతాకాలపు పండుగలకు క్రైస్తవత్వాన్ని అంటగట్టి నిర్ణయించినదే.” శీతాకాలపు ఆకాశంలో మొదటిసారి సూర్యుడు కనబడడాన్ని రోమన్లు ఎలా ఆచరించేవారు? విందులు వినోదాలతో, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో ఆ పండుగను ఆచరించేవారు. చర్చి అధికారులు ప్రజాదరణ పొందిన ఆ పండుగను రద్దు చేయడం ఇష్టంలేక దానిని సూర్యుని పుట్టుక అనే బదులు యేసు పుట్టుక అంటూ దానికి “క్రైస్తవత్వాన్ని అంటగట్టారు.”

నాలుగైదు శతాబ్దాల్లో సూర్యుని ఆరాధనను, దాని సంబంధిత ఆచారాలను కట్టడి చేయడం మొదట్లో చాలా కష్టంగా ఉండేది. అన్యులు సూర్యుని ఘనపరచిన డిసెంబరు 25ను ఆచరించవద్దని క్యాథలిక్‌ “సెయింట్‌” అగస్టీన్‌ (సా.శ. 354-430) తోటి విశ్వాసులను మందలించడం తన బాధ్యతని భావించాడు. నేటికీ ప్రాచీన రోమన్ల పండుగలే పైచేయిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

వేడుకకు, వాణిజ్యానికి అనుకూలమైన పండుగ

అనేక శతాబ్దాలుగా, క్రిస్మస్‌ను వేడుకకు, వాణిజ్యానికి అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ పండుగగా తీర్చిదిద్దడంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషించాయి. అంతేకాక, ఇతర శీతాకాల పండుగల ఆచారాలు, ప్రత్యేకంగా ఉత్తర ఐరోపాలో ఆచరించబడిన ఆచారాలు క్రమేపీ రోమ్‌లో ఆరంభమైన వాటికి పోలికగా ఏర్పర్చబడ్డాయి. * 20వ శతాబ్దంలో, విక్రయదారులు, వాణిజ్య నిపుణులు అధిక లాభాలు గడించగల ఎలాంటి ఆచారాన్నైనా ఉత్సాహంగా ప్రోత్సహించారు.

దాని ఫలితమేమిటి? క్రీస్తు జనన విశేషతకు బదులుగా ఆ జననాన్ని పండుగగా ఆచరించడమే అత్యంత ప్రాముఖ్యమైనదిగా తయారైంది. అనేక సందర్భాల్లో, సాంప్రదాయ క్రిస్మస్‌ నుండి క్రీస్తు గురించిన ప్రస్తావనే అదృశ్యమైపోయింది. “[క్రిస్మస్‌] అంతర్జాతీయంగా ఒక కుటుంబ పండుగయ్యింది, ప్రతీ ఒక్కరు తమకు తోచిన రీతిలో దానిని ఆచరిస్తున్నారు” అని స్పానిష్‌ ఎల్‌ పియాస్‌ వార్తాపత్రిక పేర్కొంటోంది.

అటు స్పెయిన్‌లో ఇటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాల్లో వ్యాపిస్తున్న స్వభావాన్ని ఆ వ్యాఖ్యానం ప్రతిబింబిస్తోంది. క్రిస్మస్‌ ఆచరణలు మితిమీరుతున్నకొద్దీ, క్రీస్తును గురించిన పరిజ్ఞానం కనుమరుగైపోతోంది. నిజానికి, క్రిస్మస్‌ పండుగలు ముందు రోమన్‌ కాలాల్లో వేటికి ప్రాధాన్యతనిచ్చేవో వాటికే అంటే విందులు వినోదాలు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంలాంటి ఆచారాలకే ప్రాధాన్యతనిచ్చేవిగా తయారయ్యాయి.

మనకు శిశువు పుట్టెను

సాంప్రదాయ క్రిస్మస్‌కు క్రీస్తుకు ఎలాంటి సంబంధంలేనప్పుడు, మరి నిజ క్రైస్తవులు క్రీస్తు జననాన్ని, ఆయన జీవితాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యేసు జననానికి ఏడు శతాబ్దాల పూర్వం యెషయా ఆయన గురించి ఇలా ప్రవచించాడు: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.” (యెషయా 9:⁠6) యేసు జననం, ఆ తర్వాత ఆయన వహించే పాత్ర ఎంతో విశేషమైనవై ఉంటాయని యెషయా ఎందుకు సూచించాడు? ఎందుకంటే యేసు బలమైన రాజుగా తయారవుతాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని పిలవబడతాడు, శాంతికి లేదా ఆయన పరిపాలనకు అంతముండదు. అంతేకాదు, యేసు పరిపాలన “న్యాయమువలనను నీతివలనను” స్థిరపరచబడుతుంది.​—⁠యెషయా 9:7.

యేసు జన్మిస్తాడనే విషయాన్ని గబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు, యెషయా ప్రకటననే ప్రతిధ్వనింపజేశాడు. “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును” అని ఆయన జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. (లూకా 1:​32, 33) కాబట్టి, యేసు జననంలోని విశేషత దేవుని రాజ్య నియమిత రాజుగా క్రీస్తు నెరవేర్చే పనికి సంబంధించినదనేది స్పష్టం. క్రీస్తు పరిపాలన మీకు, మీ ప్రియమైన వారితోపాటు సమస్త ప్రజలకు ప్రయోజనకరమై ఉంటుంది. వాస్తవానికి, ఆయన జననం “[దేవుని] కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము” తీసుకొస్తుందని ఆ దేవదూతలు సూచించారు.​—⁠లూకా 2:14.

న్యాయం, సమాధానంగల ప్రపంచంలో నివసించాలని ఎవరు మాత్రం కోరుకోరు? అయితే క్రీస్తు పరిపాలన తీసుకువచ్చే సమాధానాన్ని అనుభవించడానికి, మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటూ ఆయనతో మంచి సంబంధం కలిగివుండాలి. అలాంటి సంబంధానికి మొదటి మెట్టు దేవుని గురించి క్రీస్తు గురించి తెలుసుకోవడమని యేసు చెప్పాడు. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని ఆయన చెప్పాడు.​—⁠యోహాను 17:⁠3.

యేసును గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు లభించినప్పుడు, ఆయనను మనమెలా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడో మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ప్రాచీన అన్య పండుగనాడే తింటూ, త్రాగుతూ, బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకోవాలనా? అలా కాదనిపిస్తోంది. యేసు చనిపోయే ముందు రాత్రి, తానిష్టపడేదేమిటో తన శిష్యులకు చెప్పాడు. “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమింతును.”​—⁠యోహాను 14:21.

యెహోవాసాక్షులు పరిశుద్ధ లేఖనాలను విస్తృతంగా అధ్యయనం చేశారు, అది దేవుని ఆజ్ఞలేమిటో, యేసు ఆజ్ఞలేమిటో అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేసింది. యేసును సరైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోవడానికి అవసరమైన ప్రముఖ ఆజ్ఞలను అర్థం చేసుకొనేలా సహాయం చేయడానికి వారు ఇష్టపడతారు.

[అధస్సూచి]

^ పేరా 11 ఇందుకు క్రిస్మస్‌ చెట్టు, క్రిస్మస్‌ తాత ప్రముఖ ఉదాహరణలు.

[6, 7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

విందులను, బహుమతులు ఇవ్వడాన్ని బైబిలు నిరుత్సాహపరుస్తోందా?

బహుమతులు ఇవ్వడం

బహుమతులు ఇవ్వడాన్ని బైబిలు ఆమోదిస్తోంది, యెహోవాయే “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చువాడని పిలువబడ్డాడు. (యాకోబు 1:​17) మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు యీవులు లేదా బహుమతులు ఇస్తారని యేసు సూచించాడు. (లూకా 11:​11-13) యోబు తిరిగి ఆరోగ్యవంతుడైనప్పుడు ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయనకు బహుమతులు ఇచ్చారు. (యోబు 42:​11) అయితే, ఆ బహుమతులు ఏవీ ప్రత్యేక పండుగలప్పుడు ఇవ్వబడలేదు. అలా బహుమతులు ఇవ్వడం హృదయంలో నుండి పుట్టింది.​—⁠2 కొరింథీయులు 9:7.

కుటుంబ సమావేశాలు

కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నప్పుడు, కుటుంబ సమావేశాలు వారిని ఐక్యపరచడానికి ఎంతగానో దోహదపడతాయి. యేసు ఆయన శిష్యులు కానాలో జరిగిన వివాహ విందుకు హాజరయ్యారు, అది కుటుంబ సభ్యుల, స్నేహితుల పెద్ద సమావేశం అనడంలో సందేహం లేదు. (యోహాను 2:​1-10) తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో, కుమారుడు తిరిగివచ్చినప్పుడు తండ్రి ఏర్పాటుచేసిన కుటుంబ విందులో సంగీతం, నాట్యం కూడా ఉన్నాయి.​—⁠లూకా 15:21-25.

ఆహ్లాదకరంగా కలిసి భోజనం చేయడం

దేవుని సేవకులు కుటుంబంతో, స్నేహితులతో లేదా తోటి ఆరాధకులతో ఆహ్లాదకరంగా కలిసి భోజనం చేయడం గురించి బైబిలు తరచూ మాట్లాడుతోంది. ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించినప్పుడు ఆయన మాంసం, పాలు, వెన్న, రొట్టెలతో విందు భోజనం ఏర్పాటుచేశాడు. (ఆదికాండము 18:​6-8) ‘అన్నపానములు పుచ్చుకొనుచు సంతోషించడాన్ని’ దేవుడిచ్చిన బహుమానమని సొలొమోను వర్ణించాడు.​—⁠ప్రసంగి 3:13; 8:15.

కాబట్టి, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి మనం ఆహ్లాదకరంగా భోజనం చేయాలని దేవుడు కోరడమే కాక, బహుమతులు ఇవ్వడాన్ని కూడా ఆయన ఆమోదిస్తున్నాడు. అలా మనం బహుమతులు సంవత్సరమంతటిలో ఏ సమయంలోనైనా ఇవ్వవచ్చు.