కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన, అన్యారాధన ఢీకొన్న స్థలం

సత్యారాధన, అన్యారాధన ఢీకొన్న స్థలం

సత్యారాధన, అన్యారాధన ఢీకొన్న స్థలం

టర్కీకి పశ్చిమ తీరాన ఉన్న ప్రాచీన ఎఫెసు శిథిలాలు, ఒక శతాబ్దంకంటే ఎక్కువకాలంగా పురావస్తుశాస్త్ర తీవ్ర పరిశోధనకు స్థానంగా ఉన్నాయి. అనేక భవనాలు పునర్నిర్మించబడ్డాయి, లభించిన అనేకానేకమైనవాటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి విశ్లేషించారు. ఫలితంగా, ఎఫెసు టర్కీలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలాల్లో ఒకటిగా ఉంది.

ఎఫెసుకు సంబంధించి ఏ విషయాలు కనిపెట్టబడ్డాయి? ఆకర్షణీయమైన ఆ ప్రాచీన నగరం నేడు ఏ విధంగా ఉంది? ఎఫెసు శిథిలాలను, ఆస్ట్రియాలోని వియన్నాలోవున్న ఎఫెసు వస్తుప్రదర్శనశాలను సందర్శించడం, ఎఫెసులో సత్యారాధన అన్యారాధన ఎలా ఢీకొన్నాయో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ముందుగా, కొంతమేర పూర్వరంగాన్ని చూద్దాం.

అనేకులు ఆకాంక్షించిన స్థలం

సా.శ.పూ. 11వ శతాబ్దంలో యురేషియాలో సంక్షోభాలు, వలసవెళ్ళడం నిత్యం జరిగే ఘటనలైపోయాయి. ఆ సమయంలోనే అయోనియన్‌ గ్రీకులు ఆసియా మైనర్‌ పశ్చిమ తీరాన స్థిరపడ్డం ఆరంభించారు. అలా వలసవచ్చిన తొలి ప్రజలు, మాతృదేవతను ఆరాధించేవారిగా పేరుపొందిన ప్రజలను కలిశారు, ఆ దేవతే ఆ తర్వాత ఎఫెసీయుల అర్తెమిదేవిగా తెలియబడుతుంది.

సా.శ.పూ. ఏడవ శతాబ్దపు మధ్యభాగంలో, ఉత్తర దిశలోని నల్ల సముద్రం నుండి సంచారజాతీయులైన సిమ్మేరియన్లు ఆసియా మైనర్‌ను దోచుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత, దాదాపు సా.శ.పూ. 550లో లిడియాకు చెందిన క్రీసస్‌ రాజు అధికారానికి వచ్చాడు, ఆయన తన అంతులేని సంపదకు పేరుపొందిన శక్తిమంతుడైన పరిపాలకుడు. పర్షియా సామ్రాజ్య విస్తరణతో కోరెషు రాజు ఎఫెసుతో సహా అయోనియన్‌ నగరాలను స్వాధీనపరచుకున్నాడు.

సా.శ.పూ. 334లో మాసిదోనియాకు చెందిన అలెగ్జాండర్‌ పర్షియాపై తన దాడిని ప్రారంభించి, ఎఫెసుకు క్రొత్త పరిపాలకుడయ్యాడు. సా.శ.పూ. 323లో అలెగ్జాండర్‌ అకాల మరణం తర్వాత, ఆయన సేనాధిపతులు అధికారం కోసం చేసిన పోరాటంలో ఎఫెసు ఒక భాగమైంది. సా.శ.పూ. 133లో పిల్లలులేని, పెర్గమము రాజైన అట్టాలస్‌ III ఎఫెసును రోమన్లకు అప్పగించి, దాన్ని ఆసియాలోని రోమన్‌ రాష్ట్రంలో ఒక భాగంగా చేశాడు.

సత్యారాధన అన్యారాధనను ఢీకొనడం

సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు తన రెండవ ప్రచార యాత్ర ముగింపులో ఎఫెసుకు వచ్చినప్పుడు, ఆ నగరంలో దాదాపు 3,00,000 మంది నివాసులున్నారు. (అపొస్తలుల కార్యములు 18:​19-21) పౌలు తన మూడవ ప్రచార యాత్రలో ఎఫెసుకు తిరిగి వచ్చి, సమాజమందిరంలో దేవుని రాజ్యం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. అయితే, మూడు నెలల తర్వాత, యూదుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది, దానితో ఆయన తాను రోజూ ఇచ్చే ప్రసంగాలను తురన్ను అనే పాఠశాలలో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 19:​1, 8, 9) ఆయన ప్రకటనా కార్యక్రమం రెండు సంవత్సరాలపాటు కొనసాగింది, దానితోపాటు ఆయన అద్భుతరీతిలో స్వస్థపరచడం, దయ్యాలను వెళ్ళగొట్టడం వంటి అసాధారణమైన పనులు కూడా చేశాడు. (అపొస్తలుల కార్యములు 19:​10-17) చాలామంది విశ్వాసులయ్యారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు! అవును, యెహోవా వాక్యం ప్రబలి వ్యాపించడంతో అంతకు ముందు మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ విలువైన పుస్తకాలను ఇష్టపూర్వకంగా కాల్చివేశారు.​—⁠అపొస్తలుల కార్యములు 19:​19, 20.

పౌలు విజయవంతంగా ప్రకటించడం, అనేకులు అర్తెమిదేవిని ఆరాధించడం మానుకునేలా ప్రేరేపించడమే కాక అలాంటి అన్య ఆరాధనను ప్రోత్సహిస్తున్నవారికి ఆగ్రహం తెప్పించింది కూడా. వెండితో అర్తెమిదేవి గుళ్లుచేయడం లాభసాటి వ్యాపారం. అందువల్ల, వాళ్ళ వ్యాపారానికి ముప్పు రావడంతో, దేమేత్రి అనేవాడు కంసాలులను రెచ్చగొట్టి అల్లరి రేపాడు.​—⁠అపొస్తలుల కార్యములు 19:​23-32.

వివాదం ముదరడంతో ఆ జన సమూహాలు వెర్రిగా “ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి” అని పెద్దపెట్టున రెండు గంటలపాటు కేకలు వేశారు. (అపొస్తలుల కార్యములు 19:​34) అల్లరి సద్దుమణిగిన తర్వాత, పౌలు తన తోటి క్రైస్తవులను మరోసారి ప్రోత్సహించి, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. (అపొస్తలుల కార్యములు 20:1) అయితే ఆయన మాసిదోనియకు వెళ్ళిపోయినంత మాత్రాన అర్తెమిదేవి మతారాధనా వ్యవస్థ పతనమవడం ఆగలేదు.

అర్తెమిదేవి ఆలయ పునాదులు కదలడం

ఎఫెసులో అర్తెమిదేవి మతారాధనా వ్యవస్థ లోతుగా పాతుకుపోయి ఉంది. క్రీసస్‌ రాజు కాలానికి ముందే, సైబల్‌ అనే మాతృదేవత ఆ ప్రాంత మత జీవితంలో ప్రముఖ పాత్ర వహించింది. సైబల్‌కు గ్రీకు దేవతలకు కల్పిత వంశపారంపర్య సంబంధాన్ని సృష్టించడం ద్వారా క్రీసస్‌ అటు గ్రీకులకు ఇటు గ్రీకులు కానివారికి ఆమోదయోగ్యమైన దేవతను నెలకొల్పాలని ఆశించాడు. ఆయన మద్దతుతో సా.శ.పూ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో, సైబల్‌ వారసురాలైన అర్తెమిదేవికి ఆలయం నిర్మించే పని ప్రారంభమైంది.

ఆ ఆలయం గ్రీకు భవన నిర్మాణ రంగంలో ఒక మైలురాయి అయింది. ఈ రకమైన, ఇంత పెద్ద పరిమాణంలో భవనాన్ని నిర్మించడానికి అంతంత పెద్ద చలువరాళ్ళు అంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించబడలేదు. సా.శ.పూ. 356లో ఆ ఆలయం అగ్నికి ఆహుతయ్యింది. అంతే అద్భుతంగా తిరిగి నిర్మించబడిన ఆలయం అనేకులకు ఉద్యోగం దొరకడానికి ముఖ్య ఆధారమవడమే కాక, యాత్రికులకూ ప్రత్యేక ఆకర్షణగా తయారైంది. పునర్నిర్మింపబడిన ఆలయం 73 మీటర్ల వెడల్పు, 127 మీటర్ల పొడవు ఉన్న వేదికపై నిర్మించబడి, దాదాపు 50 మీటర్ల వెడల్పు 105 మీటర్ల పొడవు ఉండేది. అది ఏడు ప్రపంచ వింతల్లో ఒకటిగా పరిగణించబడింది. అయితే దాన్ని బట్టి అందరూ సంతోషించలేదు. ఎఫెసుకు చెందిన హెరాక్లీటస్‌ అనే తత్త్వవేత్త, బలిపీఠంవైపు వెళ్ళే అంధకారమయమైన మార్గాన్ని దుష్టత్వపు అంధకారానికి పోల్చి, ఆలయ నైతికత పశు నైతికత కంటే హీనంగా ఉన్నట్లు పరిగణించాడు. అయితే, చాలామందికి ఎఫెసులోని అర్తెమిదేవి ఆలయం ఎన్నడూ నాశనం కాదన్నట్లు అనిపించేది. కానీ చరిత్ర మరోలా రుజువుచేసింది. ఎఫెసోస్‌​—⁠డెర్‌ నూయి ఫ్యూరర్‌ (ఎఫెసు​—⁠క్రొత్త నిర్దేశం) అనే పుస్తకం ఇలా పేర్కొంది: “రెండవ శతాబ్దానికల్లా, అర్తెమిదేవి ఆరాధనతోపాటు, సర్వదేవతాగణంలోని సుస్థాపిత ఇతర దేవతల ఆరాధన కూడా హఠాత్తుగా ఆగిపోయింది.”

సా.శ. మూడవ శతాబ్దంలో, ఎఫెసులో తీవ్రమైన భూకంపం సంభవించింది. అంతేగాక, నల్లసముద్రం గుండా వచ్చిన సముద్ర ప్రయాణికులైన గోత్‌లు అర్తెమిదేవి ఆలయంలోని విశేషమైన సంపదలన్నీ దోచుకుని ఆలయానికి నిప్పంటించారు. పైన పేర్కొన్న పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “ఓడిపోయి తన నివాస స్థానాన్నే కాపాడుకోలేకపోయిన అర్తెమిదేవి అంత కాలంపాటు నగరాన్ని కాపాడే దేవతగా ఎలా పరిగణించబడింది?”​—⁠కీర్తన 135:​15-18.

చివరకు, సా.శ. నాలుగవ శతాబ్దం చివర్లో చక్రవర్తి తియోడోసస్‌ I “క్రైస్తవత్వాన్ని” రాష్ట్రీయ మతంగా ధృవీకరించాడు. ఒకప్పుడు అర్తెమిదేవి ప్రతిష్టాకరమైన ఆలయంగా ఉంది, అనతి కాలంలోనే భవన నిర్మాణ రాళ్లు తయారుచేసే స్థలంగా మారింది. అర్తెమిదేవి ఆరాధన పూర్తిగా అంతరించిపోయింది. ఆ ఆలయాన్ని ప్రాచీన ప్రపంచ వింతగా ప్రస్తుతించే గేయం గురించి పేరు ప్రస్తావించబడని ఒక ప్రేక్షకుడు ఇలా వ్యాఖ్యానించాడు: “అదిప్పుడు అతి నిర్మానుష్యమైన, హేయమైన స్థలం.”

అర్తెమిదేవి నుండి “దేవుని తల్లి” వరకు

పౌలు తాను వెళ్ళిపోయిన తర్వాత “క్రూరమైన తోడేళ్లు” వస్తాయని, “వంకర మాటలు పలుకు” మనుష్యులు వారిలో నుండే బయలుదేరతారని ఎఫెసులోని సంఘ పెద్దలను హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:​17, 29, 30) సరిగ్గా అలాగే జరిగింది. ఎఫెసులో మతభ్రష్ట క్రైస్తవత్వం రూపంలో అబద్ధ ఆరాధన వర్ధిల్లిందని సంఘటనలు వెల్లడి చేస్తున్నాయి.

సా.శ. 431లో, మూడవ అఖిల చర్చి సభ ఎఫెసులో జరిగింది, అక్కడ క్రీస్తు స్వభావం గురించిన అంశం చర్చించబడింది. ఎఫెసోస్‌​—⁠డెర్‌ నూయి ఫ్యూరర్‌ ఇలా వివరిస్తోంది: “క్రీస్తు కేవలం ఒకే స్వభావం అంటే దేవస్వభావం గలవాడని నమ్మిన అలెగ్జాండ్రియన్లే పూర్తిగా . . . తమ మాట నెగ్గించుకున్నారు.” దాని పర్యవసానాలు చాలాదూరం వెళ్ళాయి. “ఎఫెసులో తీసుకోబడిన నిర్ణయం ద్వారా మరియ క్రీస్తుతల్లి స్థానం నుండి దేవునితల్లి స్థానానికి ఎత్తబడింది. అంతేకాక, అది మరియ మతారాధనా వ్యవస్థకు ఆధారాన్ని ఇవ్వడమేగాక చర్చిలో మొట్ట మొదటిసారిగా గొప్ప చీలికకు కారణమైంది. . . . ఆ వివాదం నేటికీ కొనసాగుతోంది.”

అలా, సైబెల్‌ మరియు అర్తెమిదేవిల ఆరాధన స్థానంలోకి, “దేవుని తల్లి” అని పరిగణించబడుతున్న మరియ ఆరాధన వచ్చింది. ఆ పుస్తకం చెబుతున్నట్లుగా, “ఎఫెసులో మరియ మతారాధనా వ్యవస్థ . . . నేటికీ సజీవ సాంప్రదాయంగా ఉంది, అర్తెమిదేవి మతారాధనా వ్యవస్థ ప్రస్తావన లేకుండా దాన్ని వివరించడం అసాధ్యం.”

చరిత్రలో అది బుట్ట దాఖలైంది

అర్తెమిదేవి ఆరాధన తిరోగమనం తర్వాత ఎఫెసు పతనం ప్రారంభమైంది. భూకంపాలు, మలేరియా, ఓడరేవులో ఒండ్రుమట్టి క్రమంగా పేరుకుపోవడం వంటివన్నీ ఆ నగరంలో నివసించడాన్ని కష్టతరం చేశాయి.

సా.శ. ఏడవ శతాబ్దానికల్లా, ఇస్లామ్‌ మతం విస్తృతంగా వ్యాపించనారంభించింది. ఇస్లామ్‌ మతం తన సిద్ధాంతాలతో కేవలం అరబ్బు తెగలను మాత్రమే ఐక్యపరచడానికి పరిమితం కాలేదు. అరబ్బు తెగలు సా.శ. ఏడవ, ఎనిమిదవ శతాబ్దాలంతటిలో ఎఫెసును దోచుకున్నాయి. ఓడరేవులో ఒండ్రుమట్టి పూర్తిగా పేరుకుపోయి, నగరం శిథిలాల కుప్పగా మారడంతో ఎఫెసు కథ ముగింపుకొచ్చింది. ఒకప్పటి ఆ మహిమాన్విత నగరంలో, ఆయాసోలూక్‌ (ఇప్పుడు సెల్‌చూక్‌) అనే ఒక చిన్న గ్రామం మాత్రమే మిగిలివుంది.

ఎఫెసు శిథిలాల్లో పర్యటించడం

ఎఫెసు ప్రాచీన వైభవాన్ని తెలుసుకోవాలంటే దాని శిథిలాలను సందర్శించవచ్చు. మీరు పైనున్న ప్రవేశ ద్వారం నుండి పర్యటన ప్రారంభిస్తే, కూరటస్‌ వీధి నుండి సెల్‌సస్‌ గ్రంథాలయం వరకున్న సుందరమైన దృశ్యాన్ని చూడగలుగుతారు. ఆ వీధికి కుడివైపునున్న ఓడియమ్‌ మీ దృష్టిని ఆకర్షిస్తుంది, అది సా.శ. రెండవ శతాబ్దంలో నిర్మించబడిన చిన్న నాటకశాల. దానిలో దాదాపు 1,500 మంది కూర్చోవచ్చు, అది కౌన్సిల్‌ ఛాంబర్‌గానే కాక ప్రజా వినోదం కోసం కూడా ఉపయోగించబడి ఉండవచ్చు. కూరటస్‌ వీధికి ఇరువైపులా, రాష్ట్రీయ విషయాలు చర్చించబడే ప్రభుత్వ సమావేశ భవనాల్లాంటివి, హేడ్రేయన్‌ ఆలయం, కొన్ని ప్రజా నీటి కొలనులు, గుట్టలపై ఇళ్లు ఉండేవి, ఇవి ప్రముఖులైన ఎఫెసీయుల నివాసాలు.

సా.శ. రెండవ శతాబ్దంలో నిర్మించబడిన వైభవోపేతమైన సెల్‌సస్‌ గ్రంథాలయ సౌందర్యం మిమ్మల్ని ముగ్ధులను చేస్తుంది. దానిలోని ఎన్నో గ్రంథపు చుట్టలు పెద్ద పఠన గదిలోని గూళ్లలో ఉంచబడ్డాయి. అద్భుతమైన ముందు భాగంలోవున్న నాలుగు విగ్రహాలు సెల్‌సస్‌ వంటి ఉన్నత స్థానంలోవున్న రోమన్‌ ప్రభుత్వోద్యోగికి ఉండవలసిన విలక్షణమైన లక్షణాలను సూచిస్తాయి, అవేమిటంటే: సోఫియా (జ్ఞానం), ఆర్టీ (సుగుణం), అనీయ (భక్తి), ఎపీస్టీమీ (పరిజ్ఞానం లేదా అవగాహన). అసలు విగ్రహాలను వియన్నాలోవున్న ఎఫెసస్‌ ప్రదర్శనశాలలో చూడవచ్చు. గ్రంథాలయం ముందు భాగానికి ప్రక్కనున్న అతి పెద్ద ద్వారం మిమ్మల్ని టెట్రాగోనస్‌ అగోరాకి అంటే అమ్మకం, కొనుగోలు జరిగే స్థలానికి తీసుకువెళ్తుంది. చతురస్రాకారంలో ఉండే ఈ సువిశాలమైన స్థలానికి నాలుగు వైపులా రాళ్లు పరచిన బహిరంగ మార్గాలు ఉండేవి, ఆ స్థలంలోనే ప్రజలు తమ వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు.

ఆ తర్వాత, మీరు చలువరాతి రోడ్డుమీదికి వస్తారు, అది పెద్ద నాటకశాల దగ్గరికి తీసుకువెళ్తుంది. రోమా సామ్రాజ్య కాలంలో చేయబడిన చివరి విస్తరణలతో, ఆ నాటకశాలలో దాదాపు 25,000 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. దాని ముందు భాగం స్తంభాలు, ఉబ్బెత్తు శిల్పాలు, విగ్రహాలతో అమితంగా అలంకరించబడి ఉండేది. అక్కడ సమకూడిన జనసమూహాల్లో దేమేత్రి అనే కంసాలి రేకెత్తించిన గొప్ప అలజడిని మీరు ఊహించుకోవచ్చు.

పెద్ద నాటకశాల నుండి నగర ఓడరేవు వరకున్న వీధి చాలా అద్భుతంగా ఉంటుంది. అది దాదాపు 500 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు కలిగి, ఇరువైపులా స్తంభాలతో ఉంటుంది. నాటకశాలకు సంబంధించిన వ్యాయామశాల, ఓడరేవుకు సంబంధించిన వ్యాయామశాల, రెండూ శారీరక శిక్షణ కోసం ఉపయోగించబడేవి, ఇవి కూడా ఈ మార్గం వెంబడే నిర్మించబడ్డాయి. వీధి చివరన ఉన్న అందమైన ఓడరేవు ద్వారం ప్రపంచానికి ముఖద్వారంగా ఉండేది, ప్రపంచంలోకెల్లా అత్యంత అద్భుతమైన శిథిలాల్లో కొన్నింటి గుండా మనం చేసిన స్వల్ప పర్యటన ఇక్కడితో ముగింపుకు వస్తుంది. వియన్నాలోవున్న ఎఫెసస్‌ ప్రదర్శనశాలలో ఈ చారిత్రక నగరపు కొయ్య నమూనా, అనేకానేక స్మారక చిహ్నాలు ఉన్నాయి.

ఎవరైనా ప్రదర్శనశాలను సందర్శిస్తూ ఎఫెసీయుల అర్తెమిదేవి విగ్రహాన్ని చూసి, ఎఫెసులోని తొలి క్రైస్తవుల సహనం గురించి ఆలోచించకుండా ఉండలేరు. వాళ్ళు అభిచారంలో కూరుకుపోయిన, మతసంబంధ దురభిమానంతో కళ్ళుమూసుకు పోయిన నగరంలో జీవించవలసి వచ్చింది. రాజ్య సందేశానికి అర్తెమిదేవి ఆరాధకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. (అపొస్తలుల కార్యములు 19:19; ఎఫెసీయులు 6:12; ప్రకటన 2:​1-3) అలాంటి ప్రతికూల వాతావరణంలో సత్యారాధన వేళ్ళూనింది. ప్రాచీన అర్తెమిదేవి ఆరాధన అంతమైనప్పుడు సత్యదేవుని ఆరాధన వర్ధిల్లినట్లే, మన కాలంనాటి అబద్ధమతం అంతమైనప్పుడు సత్యదేవునికి చేసే ఆరాధన వర్ధిల్లుతుంది.​—⁠ప్రకటన 18:​4-8.

[26వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మాసిదోనియ

నల్ల సముద్రం

ఆసియా మైనరు

ఎఫెసు

మధ్యధరా సముద్రం

ఐగుప్తు

[27వ పేజీలోని చిత్రం]

అర్తెమిదేవి ఆలయ శిథిలాలు

[28, 29వ పేజీలోని చిత్రాలు]

1. సెల్‌సస్‌ గ్రంథాలయం

2. ఆర్టీ, దగ్గరి దృశ్యం

3. గొప్ప నాటకశాలకు వెళ్ళే చలువరాతి రోడ్డు