కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా నన్ను రక్షిస్తాడు’

‘యెహోవా నన్ను రక్షిస్తాడు’

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

‘యెహోవా నన్ను రక్షిస్తాడు’

యెహోవా ప్రజలు ఒక నిర్ణాయక పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారు ప్రాచీన ఐగుప్తు దుష్ట పరిపాలకునికి విధేయులుగా ఉంటారా? లేక యెహోవా దేవునికి విధేయులై తాము దాసత్వంలో ఉన్న ఆ ప్రాంతాన్ని విడిచి వాగ్దానదేశంలో నివాసమేర్పరచుకుంటారా?

తిరుగుబాటుదారుడైన ఐగుప్తు ఫరో యెహోవా ప్రజలను విడుదల చేయడానికి నిరాకరించాడు కాబట్టి, దేవుడు ఆ దేశం మీదికి పది తెగుళ్ళు రప్పించాడు. ఆ తెగుళ్ళు ఆయన శక్తిని ఎంత గొప్పగా ప్రదర్శించాయో కదా! ఆ తెగుళ్ళను నివారించేందుకు ఐగుప్తు దేవతలు ఏమీ చేయలేకపోయారు.

దేవుని ప్రజలను వెళ్ళనివ్వాల్సిందిగా ఫరోకు చెప్పబడినప్పుడు, అతడు అపహాస్యంగా ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను.” (నిర్గమకాండము 5:⁠2) తత్ఫలితంగా ఐగుప్తు మీదికి ఈ తెగుళ్ళు వచ్చాయి: (1) నీళ్ళు రక్తంగా మారడం (2) కప్పలు, (3) పేలు, (4) జోరీగలు, (5) పశువులకు తెగులు (6) మనుష్యులకు జంతువులకు దద్దుర్లు, (7) వడగండ్ల వాన, (8) మిడతలు, (9) చీకటి, (10) ఐగుప్తీయుల ప్రథమ సంతానమే కాక ఫరో కుమారుడు కూడా మరణించడం. చివరకు, ఫరో హెబ్రీయులను వెళ్ళనిచ్చాడు. అంతేకాదు, ఆ దేశాన్ని విడిచివెళ్ళాల్సిందిగా అతడు వారిని తొందరపెట్టాడు!​—⁠నిర్గమకాండము 12:​31, 32.

దాదాపు 30 లక్షలమంది ఇశ్రాయేలు స్త్రీ పురుషులు, పిల్లలు మాత్రమే కాక అనేకులైన అన్యజనుల సమూహం కూడా వెంటనే ఆ దేశం నుండి బయలుదేరింది. (నిర్గమకాండము 12:​37, 38) అయితే త్వరలోనే ఫరో తన బలమైన సైన్యంతో వారిని వెంబడించాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రానికి, జాలిలేని ఎడారికి, ఫరో సైన్యాలకు మధ్య చిక్కుకుపోయినట్లు కనిపించారు. అయినా మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి.”​—⁠నిర్గమకాండము 14:​8-14.

యెహోవా, ఇశ్రాయేలీయులు తప్పించుకునే విధంగా ఎర్ర సముద్రపు నీటిని అద్భుతంగా పాయలుగా విడదీశాడు. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెంబడించినప్పుడు దేవుడు నీళ్ళు మళ్లీ వెనక్కి వచ్చేలా చేశాడు. “[యెహోవా] ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను.” (నిర్గమకాండము 14:26-28; 15:⁠4) గర్విష్ఠియైన ఫరో, యెహోవాను ఘనపరచడానికి తిరస్కరించిన కారణంగా దుర్మరణం పాలయ్యాడు.

యెహోవా ఎర్ర సముద్రం దగ్గర తాను “యుద్ధశూరుడ్ని” అని నిరూపించుకున్నాడు. (నిర్గమకాండము 15:⁠3) “యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు . . . నమ్మకముంచిరి” అని ప్రేరేపిత వృత్తాంతం చెబుతోంది. (నిర్గమకాండము 14:31; కీర్తన 136:​10-15) పురుషులు మోషేతోపాటు విజయగీతాన్ని పాడడం ద్వారా, స్త్రీలు ఆయన సహోదరియైన మిర్యాము నాయకత్వం క్రింద నాట్యమాడడం ద్వారా తమ హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తం చేశారు. *

యెహోవా ఇప్పటికీ విమోచకునిగానే ఉన్నాడు

యెహోవా ఆధునిక దిన సేవకులు, దైవిక విడుదలకు సంబంధించిన ఆ అసాధారణ చర్య నుండి విశ్వాసాన్ని బలపరచే పాఠాలను నేర్చుకోవచ్చు. ఒక పాఠం ఏమిటంటే, యెహోవాకు అపరిమితమైన శక్తి ఉంది, ఆయన తన ప్రజలకు పూర్తి మద్దతునివ్వగలడు. మోషే, ఇశ్రాయేలీయులు తమ విజయగీతంలో విజయోత్సాహంతో ఇలా పాడారు: “యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును.”​—⁠నిర్గమకాండము 15:⁠6.

మరో పాఠం ఏమిటంటే, సర్వశక్తిమంతుడు తన ప్రజలను రక్షించాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఇలా పాడారు: “యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను.” మనం నేర్చుకోగల మరో పాఠం ఏమిటంటే, యెహోవా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడంలో ఎవరూ విజయం సాధించలేరు. దేవుడు విడుదల చేసిన ఆయన ప్రజలు తమ విజయోత్సాహపు పాటలో ఇలా పాడారు: “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు? పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు. స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీవంటివాడెవడు?”​—⁠నిర్గమకాండము 15:2, 11.

ప్రాచీన ఐగుప్తు ఫరోలాగే నేటి లోక పరిపాలకులు యెహోవా ప్రజలను హింసిస్తున్నారు. గర్విష్ఠులైన నాయకులు ‘మహోన్నతునికి విరోధముగా కూడా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలుగగొట్టవచ్చు.’ (దానియేలు 7:25; 11:​36) అయితే యెహోవా తన ప్రజలకు ఇలా హామీ ఇస్తున్నాడు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు, న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు . . . ఇది వారి స్వాస్థ్యము.”​—⁠యెషయా 54:​17.

ఫరో, అతని సైన్యం విఫలమైనట్లు దేవుని వ్యతిరేకులు విఫలమవుతారు. ఐగుప్తు నుండి విడుదల వంటి యెహోవా విడుదల కార్యాలు, యేసు అపొస్తలులు చెప్పిన సూత్రాన్ని అనుసరించడం సరైనదని నిరూపిస్తాయి, వారు ఇలా చెప్పారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.”​—⁠అపొస్తలుల కార్యములు 5:​29.

[అధస్సూచి]

^ పేరా 8 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2006 (ఆంగ్లం)లో జనవరి/ఫిబ్రవరి చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీకు తెలుసా?

ఇశ్రాయేలీయలు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద దాటగలిగేందుకు యెహోవా రాత్రంతా బలమైన గాలి వీచేలా చేశాడు.​—⁠నిర్గమకాండము 14:​21, 22.

లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని అంత తక్కువ కాలవ్యవధిలో దాటడానికి 1.5 కిలోమీటర్లు లేక అంతకన్నా వెడల్పైన దారి అవసరమై ఉండవచ్చు.

[9వ పేజీలోని చిత్రాలు]

ఐగుప్తు అబద్ధ దేవతలు యెహోవా రప్పించిన పది తెగుళ్ళను ఆపలేకపోయారు

[చిత్రసౌజన్యం]

మూడు చిత్రాలు: Photograph taken by courtesy of the British Museum