కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎస్తేరు పుస్తకంలోని ముఖ్యాంశాలు

ఎస్తేరు పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

ఎస్తేరు పుస్తకంలోని ముఖ్యాంశాలు

పథకం విఫలమయ్యే అవకాశమే లేదు. యూదుల సామూహిక సంహారం సమగ్రంగా, సమర్థంగా జరుగనుంది. ముందుగా నిర్ణయించబడిన రోజున, భారతదేశం నుండి ఇతియోపియా వరకు విస్తరించివున్న సామ్రాజ్యంలో నివసిస్తున్న యూదులందరూ పూర్తిగా నాశనం చేయబడతారు. పథకం పన్నిన వ్యక్తి అలా అనుకుంటున్నాడు. అయితే, ప్రాముఖ్యమైన ఒక విషయం మాత్రం ఆయన దృష్టికి రాలేదు. అదేమిటంటే, పరలోకంలో ఉన్న దేవుడు తాను ఎంపిక చేసుకున్న ప్రజలను ఎలాంటి ప్రాణాంతక స్థితి నుండైనా విడిపించగలడు. ఆ విడుదల గురించి బైబిలు పుస్తకమైన ఎస్తేరులో నమోదుచేయబడింది.

మొర్దెకై అనే వృద్ధుడైన యూదుడు వ్రాసిన ఎస్తేరు పుస్తకంలో పారసీక రాజైన అహష్వేరోషు లేక క్సెర్‌క్సెస్‌ I పరిపాలనకు సంబంధించిన దాదాపు 18 సంవత్సరాల చరిత్ర గురించిన వివరాలు ఉన్నాయి. నాటకీయమైన రీతిలో వర్ణించబడిన ఈ కథ, తన సేవకులు ఒక పెద్ద సామ్రాజ్యమంతటా చెల్లాచెదురైవున్నా యెహోవా తన ప్రజలను తమ శత్రువుల దుష్టపన్నాగాల నుండి ఎలా కాపాడతాడో చూపిస్తుంది. నేడు ఆ విషయాలు తెలుసుకోవడం, 235 దేశాల్లో యెహోవాకు పవిత్ర సేవ చేస్తున్న ఆయన ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంతేకాక, ఎస్తేరు పుస్తకంలో చిత్రీకరించబడిన పాత్రలు మనం అనుకరించాల్సిన ఉదాహరణలను, అనుకరించకూడని ఉదాహరణలను అందజేస్తున్నాయి. నిజంగా, “దేవుని వాక్యము సజీవమై[నది], బలముగలది.”​—⁠హెబ్రీయులు 4:​12.

రాణి జోక్యం చేసుకోవాలి

(ఎస్తేరు 1:1-5:​14)

అహష్వేరోషు రాజు తన పరిపాలనలోని మూడవ సంవత్సరంలో (సా.శ.పూ. 493) రాచరిక విందు ఏర్పాటు చేస్తాడు. సౌందర్యానికి పేరుగాంచిన రాణియైన వష్తి, రాజు తీవ్ర ఆగ్రహానికి గురై తన స్థానాన్ని కోల్పోతుంది. ఆ దేశంలో ఉన్న అందమైన కన్యకలందరిలో నుండి హదస్సా అనే యూదురాలు వష్తి స్థానంలో రాణిగా ఎన్నుకోబడుతుంది. ఆమె తన సహోదరుడైన మొర్దెకై నిర్దేశం ప్రకారం తాను యూదురాలు అని చెప్పుకోకుండా తన పర్షియా పేరైన ఎస్తేరును ఉపయోగిస్తుంది.

కొద్దికాలానికి, హామాను అనే గర్విష్ఠి ప్రధానమంత్రి స్థానానికి పదోన్నతి పొందుతాడు. మొర్దెకై ‘వంగడానికి, నమస్కారం చేయడానికి’ తిరస్కరించడం హామానుకు కోపం తెప్పిస్తుంది, కాబట్టి ఆయన పారసీక సామ్రాజ్యంలోని యూదులనందరినీ నాశనం చేయడానికి పన్నాగం పన్నుతాడు. (ఎస్తేరు 3:⁠2) తన పథకాన్ని అహష్వేరోషు ఆమోదించేలా ఆయనను ఒప్పించి ఈ సామూహిక సంహారం చేపట్టేందుకు రాజుచేత ఆజ్ఞ జారీచేయించడంలో సఫలుడవుతాడు. అది విని, మొర్దెకై ‘గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొంటాడు.’ (ఎస్తేరు 4:⁠1) ఎస్తేరు ఇప్పుడు జోక్యం చేసుకోవాలి. ఆమె రాజును, ఆయన ప్రధానమంత్రిని ఒక విందుకు ఆహ్వానిస్తుంది. వారు సంతోషంగా ఆ విందుకు వచ్చినప్పుడు, మరుసటిరోజు మరో విందుకు రమ్మని వారిని విన్నవించుకుంటుంది. హామాను దానికి సంతోషిస్తాడు. అయితే మొర్దెకై తనను ఘనపర్చడానికి తిరస్కరించడం అతనికి కోపంతెప్పిస్తుంది. మరుసటిరోజు ఏర్పాటుచేయబడిన విందు కన్నా ముందే మొర్దెకైను చంపడానికి హామాను పన్నాగం పన్నుతాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​3-5​—⁠విందు 180 దినాలవరకు కొనసాగిందా? విందు అంతకాలంవరకు కొనసాగిందని ఆ వచనం పేర్కొనడంలేదు, అయితే రాజు తన మహిమగల రాజ్య ఐశ్వర్యాన్ని, అందాన్ని అధికారులకు 180 దినాలు చూపించాడు అని పేర్కొంటోంది. శ్రీమంతులను ప్రభావితం చేసి తన పథకాలను చేపట్టడంలో తనకున్న సామర్థ్యం మీద వారికి నమ్మకం కలిగించేందుకు తన రాజ్య మహిమను గర్వంగా ప్రదర్శించడానికి రాజు ఎంతోకాలం సాగిన ఈ సందర్భాన్ని ఉపయోగించుకొనివుండవచ్చు. అదే నిజమైతే, 3, 5 వచనాలు, 180 దినాల సమావేశం చివర్లో ఏర్పాటు చేయబడిన 7 దినాల విందును సూచిస్తుండవచ్చు.

1:​8​—⁠ఏ విధంగా ‘విందు పానం విషయంలో ఆజ్ఞానుసారముగా ఎవరునూ బలవంతము’ చేయలేదు? అలాంటి విందుల్లో ఒక నిర్దిష్ట పరిమాణం త్రాగమని ఒకరినొకరు బలవంతం చేసుకోవడం పారసీక ఆచారంగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో అహష్వేరోషు రాజు ఆ ఆచారానికి మినహాయింపు కలిగించాడు. “వారు కోరుకున్నట్లు ఎక్కువగా లేక తక్కువగా త్రాగవచ్చు” అని ఒక గ్రంథం చెబుతోంది.

1:​10-12​—⁠వష్తి రాణి, రాజు సన్నిధికి రావడానికి ఎందుకు పదేపదే తిరస్కరించింది? త్రాగిన మత్తులో ఉన్న రాజు అతిథుల ముందు తనను తాను కించపరచుకోవడం అమె ఇష్టపడలేదు కాబట్టి రాణి విధేయత చూపించడానికి తిరస్కరించిందని కొందరు విద్వాంసులు సూచిస్తున్నారు. లేక బాహ్య సౌందర్యంగల ఈ రాణికి నిజంగానే విధేయత లేకపోవచ్చు. బైబిలు ఆమె ఉద్దేశం గురించి పేర్కొనకపోయినా, ఆమె తన భర్తకు లోబడడానికి తిరస్కరించినందుకు ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకోవాలని, వష్తి చెడ్డ ఉదాహరణ పారసీక ప్రాంతాల్లో ఉన్న భార్యలనందరినీ ప్రభావితం చేస్తుందని ఆ కాలానికి చెందిన జ్ఞానులు భావించారు.

2:​14-17​—⁠ఎస్తేరు, రాజుతో అనైతిక లైంగిక సంబంధాలు పెట్టుకుందా? లేదు అనేది దాని జవాబు. రాజు ఇంట్లోకి తీసుకువెళ్ళబడిన ఇతర స్త్రీలు మరుసటిరోజు “ఉపపత్నులను కాయు” రాజుయొక్క షండుని వశములో ఉన్న రెండవ అంతఃపురంలోకి పంపబడేవారని ఆ వృత్తాంతం చెబుతోంది. అలా రాజుతో రాత్రి గడిపిన స్త్రీలు అతని ఉపపత్నులుగా లేక ఉంపుడుకత్తెలుగా మారేవారు. అయితే, ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఉపపత్నుల గృహానికి తీసుకువెళ్ళబడలేదు. ఎస్తేరు అహష్వేరోషు ఎదుటికి తీసుకువెళ్ళబడినప్పుడు, “స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను.” (ఎస్తేరు 2:​17) ఆమె అహష్వేరోషు “దయాదాక్షిణ్యములు” ఎలా సంపాదించుకుంది? ఆమె ఇతరుల దయపొందినట్లే రాజు దయ కూడా పొందింది. ‘ఆ చిన్నది [హేగే] దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను.’ (ఎస్తేరు 2:​8, 9) హేగే ఆమెలో గమనించిన విషయాల ఆధారంగానే అంటే ఆమె రూపం, మంచి లక్షణాల ఆధారంగానే ఆమెమీద దయచూపించాడు. వాస్తవానికి, “ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.” (ఎస్తేరు 2:​15) అదేవిధంగా, ఎస్తేరు లక్షణాలు రాజును కూడా ఆకట్టుకున్నాయి, కాబట్టి ఆయన కూడా ఆమెను ప్రేమించాడు.

3:⁠2; 5:​9​—⁠మొర్దెకై హామానుకు మోకరిల్లి నమస్కరించడానికి ఎందుకు తిరస్కరించాడు? ఇశ్రాయేలీయులు ఉన్నత హోదాలో ఉన్నవారికి మోకరిల్లి నమస్కారం చేయడం ద్వారా వారి ఉన్నతస్థానాన్ని గుర్తించడం యెహోవా ధర్మశాస్త్రం ప్రకారంగా తప్పుకాదు. అయితే, హామాను విషయంలో ఇంకా ఎక్కువే ఇమిడివుంది. హామాను అగాగీయుడు, బహుశా ఆయన అమాలేకీయుడు కావచ్చు. యెహోవా అమాలేకీయులను పూర్తిగా నిర్మూలం చేయాలని నిర్ణయించాడు. (ద్వితీయోపదేశకాండము 25:​19) మొర్దెకై హామానుకు మోకరిల్లి నమస్కరించడం యెహోవాపట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడడంతో సమానం. కాబట్టి ఆయన యూదుణ్ణని పేర్కొంటూ అలాంటి చర్యకు పాల్పడడానికి స్పష్టంగా తిరస్కరించాడు.​—⁠ఎస్తేరు 3:​3, 4.

మనకు పాఠాలు:

2:​10, 20; 4:​12-16. ఎస్తేరు పరిణతి చెందిన యెహోవా ఆరాధకుని నుండి నిర్దేశాన్ని, సలహాను అంగీకరించింది. మనం ‘మనపైన నాయకులుగా ఉన్నవారి మాట విని వారికి లోబడివుండడం’ జ్ఞానయుక్తం.​—⁠హెబ్రీయులు 13:​17.

2:​11; 4:⁠5. మనం ‘మన సొంతకార్యాలనే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి.’​—⁠ఫిలిప్పీయులు 2:⁠4.

2:​15. ఎస్తేరు తనకు హేగే ఇచ్చిన అలంకారం కాక మరే ఇతర ఆభరణాలు, ప్రశస్త వస్త్రాలు కోరుకోకపోవడం ద్వారా వినయాన్ని, ఆశానిగ్రహాన్ని ప్రదర్శించింది. ఎస్తేరు ప్రదర్శించిన ‘సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల హృదయపు అంతరంగ స్వభావము’ ఆమె రాజు దయను పొందేలా చేసింది.​—⁠1 పేతురు 3:⁠4.

2:​21-23. ‘పై అధికారులకు లోబడడం’ విషయంలో ఎస్తేరు, మొర్దెకైలు మంచి ఉదాహరణలు.​—⁠రోమీయులు 13:⁠1.

3:⁠4. ఎస్తేరు తన గుర్తింపు గురించి చెప్పనట్లే మనం మన గుర్తింపు గురించి కొన్ని సందర్భాల్లో చెప్పకుండా ఉండడం జ్ఞానయుక్తం కావచ్చు. అయితే, యెహోవా సర్వాధిపత్యం, మన యథార్థత వంటి ప్రాముఖ్యమైన అంశాల విషయంలో మన వైఖరి గురించి చెప్పాల్సివచ్చినప్పుడు, మనం యెహోవాసాక్షులమని వెల్లడిచేయడానికి భయపడకూడదు.

4:⁠3. మనకు శ్రమలు ఎదురైనప్పుడు బలం, జ్ఞానం కోసం ప్రార్థనాపూర్వకంగా యెహోవా వైపుకు తిరగాలి.

4:​6-8. మొర్దెకై హామాను కుట్రవల్ల ఏర్పడిన ముప్పును ఎదుర్కోవడానికి చట్టబద్ధ పరిష్కారం కోసం ప్రయత్నించాడు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠7.

4:​14. మొర్దెకైకు యెహోవాపట్ల ఉన్న నమ్మకం ఆదర్శప్రాయంగా ఉంది.

4:​16. ఎస్తేరు యెహోవా మీద పూర్తి నమ్మకముంచి, తన మరణానికి దారితీయగల పరిస్థితిని నమ్మకంగా ధైర్యంగా ఎదుర్కొంది. మన స్వశక్తి మీద కాక యెహోవా మీద నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం.

5:​6-8. ఎస్తేరు అహష్వేరోషు దయను సంపాదించుకోవడానికి ఆయనను రెండవ విందుకు ఆహ్వానించింది. ఆమెలాగే మనం కూడా వివేకయుక్తంగా ప్రవర్తించాలి.​—⁠సామెతలు 14:​15.

పరిస్థితులు తారుమారవడం

(ఎస్తేరు 6:1-10:⁠3)

సంఘటనలు అంచెలంచెలుగా సంభవిస్తుండగా, పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. హామాను మొర్దెకై కోసం సిద్ధంచేసిన ఉరికొయ్యమీద ఉరితీయబడతాడు, అతడు చంపాలనుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు! యూదులను సామూహిక సంహారం చేయాలని పన్నిన పథకం ఏమైంది? అది కూడా నాటకీయమైన రీతిలో తారుమారవుతుంది.

నమ్మకస్థురాలైన ఎస్తేరు మళ్ళీ వారి పక్షాన మాట్లాడుతుంది. హామాను పన్నిన పథకాన్ని ఏదో విధంగా పాడుచేయడానికి ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజు సన్నిధికి ఒక విన్నపంతో వెళ్తుంది. ఏమి చేయడం అవసరమో అహష్వేరోషుకు తెలుసు. కాబట్టి చివరికి సామూహిక సంహారం జరగాల్సిన రోజు వచ్చినప్పుడు యూదులు కాదుగానీ వారికి హాని తలపెట్టాలనుకున్నవారు సంహరించబడతారు. ఈ గొప్ప విడుదలను గుర్తుచేసుకోవడానికి ప్రతీసంవత్సరం పూరీము పండుగ ఆచరించబడాలని మొర్దెకై ఆజ్ఞ జారీచేస్తాడు. అహష్వేరోషు రాజు తర్వాతి స్థానంలో ఉన్న మొర్దెకై ‘సమాధానముగా మాటలాడుతూ, తన జనుల క్షేమం కోసం’ పనిచేశాడు.​—⁠ఎస్తేరు 10:⁠3.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

7:​4​—⁠యూదులు సర్వనాశనమవడం ‘రాజుకు శ్రమ’ ఎలా కలిగిస్తుంది? ఎస్తేరు యూదులను దాసులుగా అమ్మే అవకాశం గురించి నేర్పుగా పేర్కొనడం ద్వారా వారు నాశనంకావడంవల్ల రాజుకు వాటిల్లే నష్టం గురించి నొక్కిచెప్పింది. హామాను 10,000 వెండి నాణాలను ఖజానాలో నింపుతానని వాగ్దానం చేశాడు, హామాను యూదులను దాసులుగా అమ్మివేయడానికి పథకం వేసివుంటే రాజు ఖజానాకు దానికన్నా అధిక లాభం లభించివుండేది. హామాను పన్నిన పథకం అమలుచేయబడివుంటే రాజు తన రాణిని కోల్పోవాల్సివచ్చేది.

7:​8​—⁠బంటులు హామాను ముఖానికి ముసుగు ఎందుకు వేశారు? ఆయనకు జరగబోయే అవమానాన్ని లేక ఆయనపైకి రానున్న తీర్పును సూచించడానికి అలా చేసివుండవచ్చు. ఒక గ్రంథం ప్రకారం, “ప్రాచీనులు కొన్నిసార్లు, ఉరితీయబడనున్న వారి తలలకు ముసుగు వేసేవారు.”

8:​17​—⁠ఏ విధంగా ‘అనేకులు యూదుల మతాన్ని అవలంబించారు?’ మొదట జారీ చేయబడిన తాకీదును రద్దు చేసి దానికి విరుద్ధంగా మరో ఆజ్ఞను జారీచేయడం యూదులమీద దేవుని అనుగ్రహాన్ని సూచిస్తుందని భావించి చాలామంది పర్షియన్లు యూదా మతప్రవిష్టులుగా మారారని స్పష్టమవుతోంది. జెకర్యా పుస్తకంలో కనిపించే ఒక ప్రవచన నెరవేర్పులో కూడా ఆ సూత్రమే వర్తిస్తుంది. ఆ ప్రవచనం ఇలా పేర్కొంటోంది: “ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.”​—⁠జెకర్యా 8:​23.

9:​10, 15, 16​—⁠సొమ్ము కొల్లగొట్టేందుకు శాసనం అధికారమిచ్చినా యూదులు ఎందుకలా చేయలేదు? వారు సొమ్ముకొల్లగొట్టేందుకు నిరాకరించడం, వారి ఉద్దేశం తమ ప్రజలను కాపాడడమే గానీ ఐశ్వర్య సంపాదన కాదని స్పష్టంగా సూచించింది.

మనకు పాఠాలు:

6:​6-10. “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”​—⁠సామెతలు 16:​18.

7:​3, 4. మనం యెహోవాసాక్షులమని చెప్పుకోవడం ద్వారా హింసలను ఎదుర్కోవాల్సివచ్చినా మనం అలా ధైర్యంగా చెప్పుకుంటున్నామా?

8:​3-6. మనం శత్రువుల నుండి రక్షణ కోసం ప్రభుత్వ అధికారులకు, కోర్టులకు ఫిర్యాదు చేసుకోవచ్చు, అలా ఫిర్యాదు చేయాలి కూడా.

8:⁠5. ఎస్తేరు యుక్తిగా, తన ప్రజలను సర్వనాశనం చేయడానికి శాసనాన్ని రూపొందించడంలో రాజు ప్రమేయాన్ని పేర్కొనలేదు. అలాగే ఉన్నతాధికారులకు సాక్ష్యమిస్తున్నప్పుడు మనం యుక్తిని ప్రదర్శించాలి.

9:​22. మన మధ్యనున్న పేదవారిని మనం మరచిపోకూడదు.​—⁠గలతీయులు 2:⁠10.

యెహోవా ‘సహాయాన్ని, విడుదలను’ అనుగ్రహిస్తాడు

దేవుడు సంకల్పించాడు కాబట్టే ఎస్తేరు, రాజు గౌరవాన్ని సంపాదించుకుందని మొర్దెకై పేర్కొంటాడు. యూదులు తమ ప్రాణాలకు ముప్పువాటిల్లినప్పుడు, ఉపవాసముండి సహాయం కోసం ప్రార్థిస్తారు. రాణి ఎలాంటి ఆహ్వానం లేకుండా రాజు సన్నిధిలోకి ప్రవేశించి, అలా ప్రవేశించిన ప్రతీసారి రాజు అనుగ్రహాన్ని పొందుతుంది. ఖచ్చితంగా నిర్ణాయకమైన ఆ రాత్రి రాజుకు నిద్రపట్టదు. నిజమే, యెహోవా తన ప్రజల ప్రయోజనార్థం పరిస్థితులను ఎలా మలుస్తాడనేది ఎస్తేరు పుస్తకం వివరిస్తోంది.

ఎస్తేరు పుస్తకంలోని ఉత్తేజకరమైన వృత్తాంతం, ప్రత్యేకంగా “అంత్యకాలము”లో జీవిస్తున్న మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. (దానియేలు 12:⁠4) “అంత్యదినములందు,” లేక అంత్యకాలంలోని చివరిభాగంలో, మాగోగు దేశపువాడైన గోగు అయిన అపవాదియగు సాతాను యెహోవా ప్రజలను నిర్మూలించడానికి దాడిచేస్తాడు. సత్యారాధకులను సమూలంగా నాశనం చేయడమే అతని లక్ష్యం. అయితే, ఎస్తేరు కాలంలో సంభవించినట్లు యెహోవా తన ఆరాధకులకు ‘సహాయాన్ని, విడుదలను’ అనుగ్రహిస్తాడు.​—⁠యెహెజ్కేలు 38:16-23; ఎస్తేరు 4:​14.

[10వ పేజీలోని చిత్రం]

అహష్వేరోషు సమక్షంలో ఎస్తేరు, మొర్దెకై