కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరణం ఒక భయంకరమైన వాస్తవం!

మరణం ఒక భయంకరమైన వాస్తవం!

మరణం ఒక భయంకరమైన వాస్తవం!

“మానవుడు జన్మించిన తర్వాత ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉంది” అని బ్రిటీష్‌ చరిత్రకారుడు ఆర్నాల్డ్‌ టోన్బీ వ్రాశాడు. ఆయన ఇంకా ఇలా వ్రాశాడు: “ప్రతీ వ్యక్తి చివరికి మరణిస్తాడనేది వాస్తవం.” ప్రియమైన కుటుంబ సభ్యుడు గానీ సన్నిహిత స్నేహితుడు గానీ మరణించినప్పుడు అది మనకు ఎంతటి దుఃఖాన్ని కలిగిస్తుందో కదా!

వేలాది సంవత్సరాలుగా మానవజాతికి మరణం ఒక భయంకరమైన వాస్తవంగా ఉంది. మన ప్రియమైనవారు మరణించినప్పుడు, నిస్సహాయ భావం మనల్ని ఆవరిస్తుంది. మరణానికి ఎవరూ అతీతులుకారు. అది ఎవరినీ విడిచిపెట్టదు. మనం చిన్నపిల్లల్లా నిస్సహాయంగా, పరిస్థితిని మార్చలేని విధంగా తయారవుతాం. ఐశ్వర్యంగానీ అధికారంగానీ మనకు జరిగిన నష్టాన్ని తీర్చలేవు. జ్ఞానులు, మేధావుల దగ్గర దానికి జవాబు లేదు. బలహీనుల్లాగే బలవంతులు కూడా కన్నీరు విడుస్తారు.

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు తన కుమారుడు అబ్షాలోము మరణించినప్పుడు అలాంటి దుఃఖాన్నే అనుభవించాడు. అతని మరణవార్త విన్నప్పుడు రాజు ఇలా భోరున విలపించాడు: “నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా . . . అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా!” (2 సమూయేలు 18:​33) శక్తిమంతమైన శత్రువులను మట్టికరిపించిన బలవంతుడైన రాజు, తన కుమారునికి బదులు తాను ‘కడపటి శత్రువైన మరణం’ చేతిలో మరణించివుంటే బాగుండేదని నిస్సహాయంగా కోరుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు.​—⁠1 కొరింథీయులు 15:​26.

మరణానికి పరిష్కారమేదైనా ఉందా? ఉంటే, మరణించినవారికి ఎలాంటి నిరీక్షణ ఉంది? మనం మన ప్రియమైనవారిని మళ్ళీ ఎప్పటికైనా చూస్తామా? తర్వాతి ఆర్టికల్‌ ఆ ప్రశ్నలకు లేఖనాధార సమాధానాలు ఇస్తుంది.