కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం

యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం

జీవిత కథ

యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం

రైమో క్యూకనెన్‌ చెప్పినది

యూరప్‌లో, 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో మా స్వదేశమైన ఫిన్‌లాండ్‌పై సోవియట్‌ యూనియన్‌ దాడిచేసింది. యుద్ధం చేసేందుకు మా నాన్న వెళ్లి ఫిన్నిష్‌ సైన్యంలో చేరాడు. త్వరలోనే, మేమున్న నగరంపై రష్యా యుద్ధవిమానాలు బాంబులు కురిపించడం మొదలుపెట్టాయి, దాంతో మా అమ్మ నన్ను సురక్షిత ప్రాంతంలో ఉంటున్న మా అమ్మమ్మతో ఉండడానికి పంపించింది.

నేను 1971లో తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో మిషనరీగా సేవచేస్తున్నాను. ఒకరోజు నేను ఇంటింటా ప్రకటిస్తున్నప్పుడు, చాలామంది భయంతో నా పక్కనుండి పరుగెత్తుకుంటూ వెళ్ళారు. తుపాకీ కాల్పుల శబ్దం వినగానే నేనూ ఇంటివైపు పరుగెత్తడం మొదలుపెట్టాను. కాల్పుల చప్పుడు దగ్గరగా వినిపించినప్పుడు, నేను రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూకాను. నా తలపైనుండి బులెట్లు రివ్వున దూసుకువెళ్తుండగా నేను మెల్లగా పాక్కుంటూ ఇల్లు చేరుకున్నాను.

రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావాలను తప్పించుకోవడానికి నేను చేయగలిగింది ఏమీలేకపోయినా, నేను, నా భార్య తూర్పు ఆఫ్రికాలో అంతటి సంక్షోభమున్నా, అక్కడే ఎందుకు ఉండాలనుకున్నాం? దానికి జవాబు యెహోవాను సేవించాలనే మా తీర్మానంతో ముడిపడి ఉంది.

తీర్మానపు బీజం నాటబడింది

నేను 1934లో, ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో జన్మించాను. మా నాన్న పెయింటర్‌. ఒకసారి, ఆయన తన పనిమీద ఫిన్‌లాండ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడి సాక్షులు వారి సంఘకూటాల గురించి ఆయనకు చెప్పారు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మతో ఆ కూటాల గురించి చెప్పాడు. ఆమె వెంటనే వాటికి హాజరవలేదు కానీ, కొంతకాలం తర్వాత తన తోటి ఉద్యోగిని అయిన ఒక సాక్షితో బైబిలు విషయాలు చర్చించడం ఆరంభించింది. అమ్మ త్వరలోనే తాను నేర్చుకున్నవాటిని అమలులోపెట్టి 1940లో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుంది.

అలా బాప్తిస్మం తీసుకోవడానికి కొంతకాలం ముందే, అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మా అమ్మమ్మ నన్ను ఆమె గ్రామంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళింది. హెల్సింకి నుండి మా అమ్మ వాళ్ళ అమ్మకూ, చెల్లికీ యెహోవాసాక్షుల నమ్మకాల గురించి ఉత్తరాలు వ్రాయడం ఆరంభించింది. వారిరువురూ ఆసక్తి కనబరచి, నేర్చుకున్న విషయాల్ని నాతో కూడా పంచుకునేవారు. యెహోవాసాక్షుల ప్రయాణ ప్రతినిధులు మా అమ్మమ్మ ఇంటిని సందర్శించి మమ్మల్ని ప్రోత్సహించేవారు, కానీ అప్పటికింకా నేను దేవుణ్ణి సేవించాలని తీర్మానించుకోలేదు.

దైవపరిపాలనా శిక్షణ మొదలవడం

రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసినప్పుడు, నేను హెల్సింకికి తిరిగి వచ్చాను, దానితో మా అమ్మ నన్ను యెహోవాసాక్షుల కూటాలకు తీసుకువెళ్ళేది. కొన్నిసార్లు నేను కూటాలకు వెళ్ళే బదులు సినిమాలకు వెళ్ళేవాడిని. కానీ, మా అమ్మ కూటంలో విన్న ప్రసంగం గురించి చెప్పేది, అయితే అర్మగిద్దోను సమీపించిందనే విషయాన్ని మాత్రం పదేపదే నాకు నొక్కి చెప్పేది. నాకు దానిపై నమ్మకం కలిగి, కూటాలన్నింటికీ హాజరవడం మొదలుపెట్టాను. బైబిలు సత్యం గురించిన అవగాహన నాలో పెరిగేకొద్దీ సంఘ కార్యకలాపాలన్నింటిలో భాగం వహించాలన్న కోరిక కూడా అధికమైంది.

ప్రత్యేకంగా సమావేశాలకు వెళ్ళడాన్ని నేనెంతో ఆనందించేవాణ్ణి. నేను 1948లో వేసవి సెలవులు గడపడానికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడికి దగ్గర్లో జరుగుతున్న జిల్లా సమావేశానికి హాజరయ్యాను. ఆ సమావేశంలో బాప్తిస్మం తీసుకోబోతున్న నా స్నేహితుడు నన్ను కూడా బాప్తిస్మం తీసుకొమ్మని ప్రోత్సహించాడు. నేను నా స్నానపు దుస్తులు తెచ్చుకోలేదని ఆయనతో చెప్పాను, అయితే తాను బాప్తిస్మం తీసుకున్న తర్వాత తన దుస్తులు ఉపయోగించుకోమని నాకు సలహా ఇచ్చాడు. నేను దానికి ఒప్పుకొని, నా 13వ ఏట, 1948 జూన్‌ 27న బాప్తిస్మం తీసుకున్నాను.

సమావేశం తర్వాత, మా అమ్మ స్నేహితురాళ్ళు కొందరు నేను బాప్తిస్మం తీసుకున్నానని ఆమెకు చెప్పారు. అమ్మ నన్ను తిరిగి కలిసినప్పుడు, తనను అడగకుండా నేను అంత ప్రాముఖ్యమైన చర్య ఎందుకు తీసుకున్నానని అడిగింది. బైబిల్లోని ప్రాథమిక బోధలను అర్థం చేసుకున్నాననీ, యెహోవాముందు నా నడతకు నేనే బాధ్యుడను అని గ్రహించాననీ వివరించాను.

నా తీర్మానం బలపడింది

యెహోవాను సేవించాలన్న నా తీర్మానాన్ని బలపరచుకోవడానికి సంఘంలోని సహోదరులు నాకు సహాయం చేశారు. వారు నాతోపాటు ఇంటింటి పరిచర్యకు రావడమేకాక దాదాపు ప్రతీవారం కూటాల్లో భాగాలు ఇచ్చేవారు. (అపొస్తలుల కార్యములు 20:20) నా 16వ ఏట నేను నా మొదటి బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చాను. ఆ తర్వాత కొంతకాలానికే నేను సంఘంలో బైబిలు అధ్యయన సేవకునిగా నియమించబడ్డాను. అటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నీ నేను పరిణతి చెందడానికి సహాయం చేశాయి, కానీ నేనింకా మనుష్యుల భయాన్ని అధిగమించాల్సి ఉంది.

ఆ రోజుల్లో మేము జిల్లా సమావేశాల్లో ఇవ్వబడే బహిరంగ ప్రసంగం గురించి పెద్ద అట్టలమీద వ్రాసి ప్రచారం చేసేవాళ్ళం. అలాంటి రెండు అట్టలు ఒకవ్యక్తి తనకు ముందువెనుకల తగిలించుకునేందుకు వీలుగా పట్టీలతో కట్టబడి ఉంటుంది. ఆ కారణంగానే కొందరు మమ్మల్ని శాండ్‌విచ్‌ మనుషులు అని పిలిచేవారు.

ఒకసారి నేను ఆ అట్టలు తగిలించుకొని ప్రశాంతంగావున్న వీధి మలుపులో నిలబడి ఉండగా, నా తోటి విద్యార్థుల గుంపొకటి నా వైపే రావడం చూశాను. వాళ్లలా నా పక్కనుండి నడుచుకుంటూ వెళ్తూ చూసిన చూపు నన్ను భయపెట్టింది. నేను ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించి ఆ అట్టలతో అలాగే నిలబడ్డాను. అప్పట్లో మనుష్యుల భయాన్ని అధిగమించడం, క్రైస్తవ తటస్థత విషయంలో రాబోయే గొప్ప పరీక్ష కోసం నన్ను సన్నద్ధుణ్ణి చేసింది.

ఆ తర్వాత ప్రభుత్వం నన్నూ, అనేకమంది ఇతర యౌవన సాక్షులనూ సైనిక సేవలో చేరమని ఆజ్ఞ జారీ చేసింది. ఆజ్ఞాపించబడినట్టుగా మేము సైనిక కేంద్రానికి వెళ్ళాం కానీ, యూనిఫారం ధరించడానికి మాత్రం మర్యాదపూర్వకంగా నిరాకరించాం. అధికారులు మమ్మల్ని బంధించారు, ఆ వెంటనే కోర్టు మాకు ఆరు నెలల చెరసాల శిక్ష విధించింది. అంతేగాక, సైన్యంలో పని చేయాల్సివచ్చే ఎనిమిది నెలలను కూడా జైల్లోనే గడిపాం. కాబట్టి మా క్రైస్తవ తటస్థత మూలంగా మేము మొత్తం 14 నెలలు చెరసాలలో గడిపాం.

చెరసాల బారకాసుల్లో మేము బైబిలును పరిశీలించడానికి ప్రతీదినం కూడుకొనేవాళ్ళం. ఆ నెలల్లో మాలో అనేకమంది బైబిలును రెండుసార్లు పూర్తిగా చదివాం. మా శిక్షాకాలం పూర్తయ్యేసరికి మాలో చాలామందిమి, యెహోవాను సేవించాలన్న మరింత దృఢనిశ్చయంతో చెరసాలనుండి బయటికి వచ్చాం. ఆ యౌవన సాక్షుల గుంపులో చాలామంది నేటికీ యెహోవాను యథార్థంగా సేవిస్తున్నారు.

చెరసాలనుండి విడుదలైన తర్వాత, నేను మా తల్లిదండ్రులతో ఉండడానికి ఇంటికి వెళ్ళాను. కొంతకాలం తర్వాత నాకు వెరా పరిచయమైంది, ఆమె కొత్తగా బాప్తిస్మం తీసుకుని చురుకుగా సేవచేస్తున్న సాక్షి. మేము 1957లో వివాహం చేసుకున్నాం.

మా జీవితాలను మార్చేసిన ఒక సాయంత్రం

ఒక సాయంత్రం బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన కొందరు బాధ్యతగల సహోదరులను మేము చూడడానికి వెళ్లినప్పుడు, వారిలో ఒకరు మేము సర్య్కూట్‌ సేవ చేయడానికి ఇష్టపడతామో లేదో చెప్పమని అడిగారు. ఆ రాత్రంతా ప్రార్థించిన తర్వాత నేను బ్రాంచికి ఫోన్‌ చేసి మా సమ్మతిని తెలిపాను. పూర్తికాల సేవలోకి ప్రవేశించడమంటే, మంచి జీతం దొరుకుతున్న నా ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది, కానీ మా జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమివ్వాలని మేము తీర్మానించుకున్నాము. మేము 1957 డిసెంబరులో సర్క్యూట్‌ సేవ ఆరంభించే సమయానికి నాకు 23 ఏళ్ళు, వెరాకు 19 ఏళ్ళు. మేము మూడు సంవత్సరాలపాటు ఫిన్‌లాండ్‌లో యెహోవా ప్రజల సంఘాలను సందర్శిస్తూ, వారిని ప్రోత్సహించడంలో ఆనందించాము.

నేను 1960వ సంవత్సరం చివర్లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరవ్వమనే ఆహ్వానం అందుకున్నాను. బ్రాంచి కార్యనిర్వాహణలో తర్ఫీదునిచ్చే పది నెలల ప్రత్యేక శిక్షణాకార్యక్రమానికి హాజరవ్వడానికి ఫిన్‌లాండ్‌నుండి ముగ్గురం వెళ్ళాం. మా భార్యలు మాత్రం ఫిన్‌లాండ్‌లోనే ఉండి, బ్రాంచి కార్యాలయంలో పనిచేశారు.

ఆ శిక్షణాకార్యక్రమం పూర్తవుతుందనగా, అప్పట్లో ప్రపంచంలోని యెహోవాసాక్షుల సేవను పర్యవేక్షిస్తున్న నేథన్‌ హెచ్‌. నార్‌ ఆఫీసుకు వెళ్ళాల్సిందిగా నాకు కబురు అందింది. ఇప్పుడు మడగాస్కర్‌ అని పిలువబడుతున్న మలగాసీ రిపబ్లిక్‌లో మిషనరీ సేవచేసే నియామకాన్ని మేము అంగీకరిస్తామా అని సహోదరుడు నార్‌ నన్ను అడిగాడు. నేను వెరాకు ఉత్తరం వ్రాసి, ఆ నియామకం గురించి తాను ఏమనుకుంటోందో చెప్పమని అడిగాను, దానికి ఆమె వెంటనే “సరే” అనే సమాధానం పంపింది. నేను ఫిన్‌లాండ్‌నుండి తిరిగి రాగానే మేము మడగాస్కర్‌లో జీవితానికి సిద్ధపడేందుకు త్వరపడ్డాము.

సంతోషం, నిరాశ

జనవరి 1962లో మేము విమానంలో, ఆ దేశ రాజధానియైన అంటనానారివోకు చేరుకున్నాము. ఫిన్‌లాండ్‌నుండి శీతాకాలంలో బయలుదేరాం కాబట్టి మేము బొచ్చు టోపీలతో, మందమైన కోట్లతో అక్కడికి చేరుకున్నాం. అక్కడుండే ఉష్ణమండల వేడివల్ల మేము త్వరలోనే మా దుస్తుల శైలిని మార్చుకున్నాం. మా మొదటి మిషనరీ గృహం ఒకే పడకగది ఉన్న చిన్న ఇల్లు. అప్పటికే అక్కడ మరో మిషనరీ జంట ఉండడంతో వెరా, నేనూ వసారాలో పడుకునేవాళ్ళం.

మేము మడగాస్కర్‌ అధికారిక భాషైన ఫ్రెంచ్‌ నేర్చుకోవడం ప్రారంభించాము. మాకు ఉపదేశించే సహోదరి కార్బోనియోతో మేమిద్దరం ఒకే భాషలో సంభాషించలేకపోవడంవల్ల ఆ భాష నేర్చుకోవడం కొంత కష్టంగా ఉండేది. మాకు ఫ్రెంచ్‌ నేర్పించడానికి ఆమె ఇంగ్లీషులో బోధించేది, కానీ వెరాకు ఇంగ్లీషు రాదు. అందుకే సహోదరి కార్బోనియో బోధించేదాన్ని నేను వెరా కోసం ఫిన్నిష్‌లోకి తర్జుమా చేసేవాడిని. కానీ వెరాకు పారిభాషిక పదాలు స్వీడిష్‌ భాషలో చెబితే ఇంకా బాగా అర్థంమౌతున్నట్టు గ్రహించిన తర్వాత నేను ఫ్రెంచ్‌ వ్యాకరణాన్ని స్వీడిష్‌ భాషలో వివరించేవాడిని. త్వరలోనే మేము ఫ్రెంచ్‌ నేర్చుకోవడంలో ప్రగతి సాధించడంతో, స్థానిక భాషైన మలగాసీని నేర్చుకోవడం ప్రారంభించాం.

మడగాస్కర్‌లో నా మొదటి బైబిలు అధ్యయనాన్ని మలగాసీ మాట్లాడే వ్యక్తితో ప్రారంభించాను. నేను ముందు బైబిలు వచనాలను నా ఫిన్నిష్‌ బైబిల్లో చూసుకొనేవాడిని, ఆ తర్వాత మేమిద్దరం కలిసి వాటిని మలగాసీ బైబిలులో వెతికేవాళ్ళం. వచనాలను నేను ఆయనకు అంత ఎక్కువగా వివరించలేకపోయినా, త్వరలోనే బైబిలు సత్యం ఆయన హృదయంలో వేళ్ళూనుకొని, ఆయన బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధించాడు.

యెహోవాసాక్షుల బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయంనుంచి మిల్టన్‌ హెన్షెల్‌ 1963లో మడగాస్కర్‌ను సందర్శించారు. ఆ తర్వాత కొంతకాలానికే మడగాస్కర్‌లో ఒక కొత్త బ్రాంచి కార్యాలయం స్థాపించబడింది. అప్పటికే ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్తగా పనిచేస్తున్న నేను అదనంగా బ్రాంచి పైవిచారణకర్తగా నియమించబడ్డాను. ఆ సమయమంతట్లోనూ యెహోవా మమ్మల్ని మెండుగా ఆశీర్వదించాడు. మడగాస్కర్‌లో 1962 నుండి 1970 మధ్యకాలంలో రాజ్య ప్రచారకుల సంఖ్య 85 నుండి 469కి పెరిగింది.

ఒకరోజు మేము మా పరిచర్య నుండి తిరిగి వచ్చేసరికి, యెహోవాసాక్షుల మిషనరీలందరూ ఆంతరంగిక వ్యవహారాల శాఖామంత్రిని కలవాలనే ఆదేశం వ్రాసివున్న ఒక కాగితం మా తలుపు దగ్గర కనబడింది. మేమక్కడికి వెళ్ళినప్పుడు, ప్రభుత్వం మమ్మల్ని వెంటనే దేశం విడిచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించిందని ఓ అధికారి మాకు చెప్పాడు. ఏ అపరాధం చేసినందుకు మమ్మల్ని బహిష్కరిస్తున్నారని నేను అడిగినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: “క్యూకనెన్‌గారు, మీరు ఏ తప్పూ చేయలేదు.”

“మేము ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాం, ఇప్పుడు ఇది మా దేశం. మేము అకారణంగా ఎలా వదిలివెళ్ళగలం,” అని నేను అడిగాను. మేమెంత ప్రయత్నించినా, చివరికి మిషనరీలందరు ఒక వారంలోపే వెళ్ళిపోవాలన్నారు. బ్రాంచి మూసివేయబడింది, స్థానిక సహోదరులు అక్కడి పనిని పర్యవేక్షించడం మొదలుపెట్టారు. మడగాస్కర్‌లో మా ప్రియ సహోదరులను విడిచివెళ్ళేముందే మాకు ఉగాండాలో కొత్త నియామకం లభించింది.

కొత్త ఆరంభం

మడగాస్కర్‌ను వదిలిపెట్టి వెళ్ళిన కొన్ని రోజులకే మేము ఉగాండా రాజధానియైన కంపాలాకు చేరుకున్నాం. మేము వెంటనే స్థానిక భాషైన లుగాండా నేర్చుకోవడం ప్రారంభించాం, అదొక మధురమైన భాషే కానీ నేర్చుకోవడమే మాత్రం చాలా కష్టం. ముందు ఇంగ్లీషు నేర్చుకోవడానికి వెరాకు ఇతర మిషనరీలు సహాయం చేశారు, ఆ భాషలో మేము సమర్థవంతంగా ప్రకటించగలిగాం.

కంపాలాలో వేడిగా, ఉక్కపోతగా ఉండే వాతావరణం వెరా ఆరోగ్యంపై ప్రభావం చూపింది. అందువల్ల సమశీతోష్ణ వాతావరణం ఉండే ఉగాండాలోని ఎంబారారా పట్టణంలో మాకు నియామకం ఇవ్వబడింది. ఆ ప్రాంతంలో మొట్టమొదటి యెహోవాసాక్షులం మేమే, మేము పరిచర్యకు వెళ్ళిన మొదటి రోజునే ఒక మంచి అనుభవంతో ఆశీర్వదించబడ్డాము. నేను ఒక వ్యక్తితో ఆయన ఇంట్లో మాట్లాడుతుండగా ఆయన భార్య వంటగదిలోనుండి బయటికి వచ్చింది. ఆమె పేరు మార్గరేట్‌, ఆమె నేను మాట్లాడినదంతా విన్నది. మార్గరేట్‌తో వెరా బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించింది, ఆ తర్వాత మార్గరేట్‌ ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించింది. ఆమె బాప్తిస్మం తీసుకొని రాజ్య సువార్తను అత్యంత ఆసక్తితో ప్రకటించే ప్రచారకురాలయ్యింది.

వీధుల్లో పోరాటం

ఉగాండాలో 1971లో ప్రబలిన పౌర యుద్ధంవల్ల అక్కడి శాంతికి భంగం వాటిల్లింది. ఒకరోజు ఎంబరారాలో మా మిషనరీ నివాసానికి దగ్గర్లోనే యుద్ధం జరిగింది. నేను ఈ కథనం ప్రారంభంలో పేర్కొన్న అనుభవం ఆ సమయంలోనే ఎదుర్కొన్నాను.

సైనికులకు కనిపించకుండా, చాలాదూరంవరకు ఆ కందకంలో పాకుతూ నేను మిషనరీ నివాసానికి చేరుకునేసరికి వెరా అప్పటికే అక్కడ ఉంది. ఇంట్లో ఒక మూల మేము పరుపులతో, చెక్కసామానుతో చిన్న “రక్షితస్థలం” నిర్మించుకున్నాం. ఒక వారమంతా రేడియోలో వార్తలు వింటూ మేము ఇంట్లోనే గడిపాం. మేము మా రక్షిత స్థలంలో దాక్కుని ఉండగా కొన్నిసార్లు బుల్లెట్లు గోడలకు తగిలి క్రిందపడేవి. మేము ఇంట్లోనే ఉన్నామన్న విషయం ఎవరికీ తెలియకూడదని రాత్రుల్లో లైట్లు వేసేవాళ్ళం కాదు. ఒకసారి కొందరు సైనికులు మా ఇంటి ముందు గుమ్మం దగ్గరికి వచ్చి కేకలువేశారు. మేము అలానే నిశ్శబ్దంగా ఉండి, యెహోవాకు ప్రార్థించాం. పోరాటం ముగిసిన తర్వాత మా పొరుగువారు, తాము సురక్షితంగా ఉన్నందుకు మాకు కృతజ్ఞతలు చెప్పారు. యెహోవాయే మా అందరినీ రక్షించాడని వారు నమ్మారు, మేమూ వారితో ఏకీభవించాం.

ఒకరోజు ఉదయం రేడియోలో ఉగాండా ప్రభుత్వం యెహోవాసాక్షులను నిషేధించిందనే వార్త వినేవరకు పరిస్థితులు ప్రశాంతంగానే కొనసాగాయి. యెహోవాసాక్షులందరూ, తమ పూర్వమతాన్నే తిరిగి అవలంబించాలని ప్రకటనలు చదువుతున్న వ్యక్తి చెప్పాడు. ప్రభుత్వాధికారుల ముందు నేను మా గురించి వాదించి, విఫలమయ్యాను. దానితో నేను అధ్యక్షుడైన ఈదీ ఆమీన్‌ కార్యాలయానికి వెళ్ళి ఆయనను కలవడానికి సమయం కోసం అడిగాను. అక్కడి రిసెప్షనిస్టు ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పింది. నేను చాలాసార్లు తిరిగివెళ్ళినా అధ్యక్షుణ్ణి కలుసుకోలేకపోయాను. చివరికి, 1973 జూలైలో మేము ఉగాండాను వదిలివెళ్ళాల్సివచ్చింది.

ఒక సంవత్సరం పది సంవత్సరాలయింది

మేము ఉగాండాలోని సహోదరులను విడిచి వెళ్తున్నప్పుడు కూడా మడగాస్కర్‌నుంచి బహిష్కరించబడినప్పుడు కలిగిన దుఃఖమే మళ్ళీ కలిగింది. మేము మా కొత్త నియామక ప్రాంతమైన సెనెగల్‌కు వెళ్ళేముందు ఫిన్‌లాండ్‌కు వెళ్ళాం. అక్కడ, ఆఫ్రికాకు వెళ్ళొద్దని నిర్దేశించి, మమ్మల్ని ఫిన్‌లాండ్‌లోనే ఉండిపొమ్మన్నారు. మిషనరీలుగా మా పని అంతటితో ముగిసిందని అనుకున్నాం. ఫిన్‌లాండ్‌లో ముందు మేము ప్రత్యేక పయినీర్లుగా, ఆ తర్వాత మళ్ళీ సర్క్యూట్‌ సేవచేశాము.

మడగాస్కర్‌లో రాజ్యపనికి ఉన్న వ్యతిరేకత 1990లో తగ్గడంతో, ఒక సంవత్సర నియామకం కోసం మడగాస్కర్‌కు తిరిగి వెళ్ళడానికి మేము ఇష్టపడతామేమో తెలియజేయమని కోరుతూ బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయం మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాకు వెళ్ళాలనే ఉంది కానీ మా ముందు రెండు గొప్ప సవాళ్ళు ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న మా నాన్నగారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, వెరాకు ఆరోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి. నవంబరు 1990లో మా నాన్నగారు మరణించడంతో నాకెంతో దుఃఖం కలిగింది, కానీ వెరా ఆరోగ్యం కుదుటపడడంతో మేము మిషనరీ సేవకు తిరిగివెళ్ళే అవకాశముందనే ఆశ మళ్లీ కలిగింది. దానితో మేము 1991 సెప్టెంబరులో తిరిగి మడగాస్కర్‌కు వెళ్ళాం.

మడగాస్కర్‌లో మా నియామకం ఒక సంవత్సరం మాత్రమే, కానీ అది పది సంవత్సరాల వరకు కొనసాగింది. ఆ సంవత్సరాల్లో, ప్రచారకుల సంఖ్య 4,000 నుండి 11,600కు పెరిగింది. మిషనరీగా సేవచేయడంలో నేనెంతో ఆనందించాను. కానీ నేను నా ప్రియమైన భార్యకున్న శారీరక, భావోద్రేక అవసరాలను అశ్రద్ధ చేస్తున్నానేమో అనే ఆలోచన కొన్నిసార్లు నన్ను నిరుత్సాహపరిచేది. యెహోవా మా ఇద్దరికీ కొనసాగేందుకు శక్తినిచ్చాడు. చివరికి 2001లో మేము ఫిన్‌లాండ్‌కు తిరిగివచ్చాం, ఇప్పటికీ అక్కడే బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్నాం. రాజ్యంపట్ల మాకున్న ఆసక్తి ఇంకా అలాగే ఉంది, మేము ఇప్పటికీ ఆఫ్రికా గురించి కలలు కంటూనే ఉన్నాం. యెహోవా మమ్మల్ని ఎక్కడ నియమించినా, ఆయన చిత్తం చేయాలనే దృఢ తీర్మానంతో ఉన్నాం.​—⁠యెషయా 6:⁠8.

[12వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఫిన్‌లాండ్‌

యూరప్‌

[14వ పేజీలోని మ్యాపు]

ఆఫ్రికా

మడగాస్కర్‌

[15వ పేజీలోని మ్యాపు]

ఆఫ్రికా

ఉగాండా

[14వ పేజీలోని చిత్రం]

మా పెళ్ళి రోజున

[14, 15వ పేజీలోని చిత్రాలు]

1960లో ఫిన్‌లాండ్‌లో సర్క్యూట్‌ సేవనుంచి . . .

. . . 1962లో మడగాస్కర్‌లో మిషనరీ సేవకు వెళ్తూ

[16వ పేజీలోని చిత్రం]

వెరాతో నేడు