కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం అన్ని విధాలుగా శ్రేష్ఠమైనది

దేవుని రాజ్యం అన్ని విధాలుగా శ్రేష్ఠమైనది

దేవుని రాజ్యం అన్ని విధాలుగా శ్రేష్ఠమైనది

యేసుక్రీస్తు తన అనుచరులకు ఇలా బోధించాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి,​—⁠‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.’” (మత్తయి 6:⁠9-10) ప్రభువు ప్రార్థనగా చాలామందికి పరిచయమున్న ఆ ప్రార్థన దేవుని రాజ్యానికున్న సంకల్పాన్ని వివరిస్తోంది.

ఆ రాజ్యం ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది. సాతాను, మానవుని తిరుగుబాటు కారణంగా దానిపై వచ్చిన అవమానాలన్నీ తొలగించబడతాయి. అలా తొలగించబడడం చాలా ప్రాముఖ్యం. దేవుని నామాన్ని పరిశుద్ధంగా దృష్టించి, పరిపాలించడానికి ఆయనకున్న హక్కును ఇష్టపూర్వకంగా అంగీకరించడంమీదే సూక్ష్మబుద్ధిగల ప్రాణులందరి సంతోషం ఆధారపడివుంది.​—⁠ప్రకటన 4:​10.

‘దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద కూడా నెరవేర్చడానికి’ కూడా ఆ రాజ్యం స్థాపించబడింది. ఆ చిత్తం ఏమిటి? ఆదాము దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మానవజాతికీ దేవునికీ మధ్య నెలకొల్పడమే ఆ చిత్తం. మంచివారు నిరంతరం జీవించే పరదైసును భూమ్మీద స్థాపించాలనే విశ్వసర్వాధిపతియైన యెహోవా సంకల్పాన్ని కూడా ఆ రాజ్యం నెరవేరుస్తుంది. అవును, దేవుని రాజ్యం మొదటి పాపంవల్ల కలిగిన నష్టాలన్నిటినీ తొలగించి, భూమి విషయంలో దేవుని ప్రేమపూర్వక సంకల్పం నిజరూపందాల్చేలా చేస్తుంది. (1 యోహాను 3:⁠8) వాస్తవానికి, ఆ రాజ్యం, అది నెరవేర్చే అంశాలే బైబిల్లోని ముఖ్య సందేశంగా ఉన్నాయి.

ఏయే విధాలుగా శ్రేష్ఠమైనది?

దేవుని రాజ్యం మహా శక్తివంతమైన ఒక వాస్తవమైన ప్రభుత్వం. అది ఎంత శక్తివంతమైందో చూపించేందుకు దానియేలు ప్రవక్త మనకు పూర్వచ్ఛాయను ఇచ్చాడు. ఎంతోకాలం క్రితమే ఆయన ఇలా ప్రవచించాడు: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును . . . అది [మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును.” అంతేకాక, చరిత్ర గమనంలో ఆవిర్భవించి, పతనమైపోయే మానవ ప్రభుత్వాలకు భిన్నంగా దేవుని రాజ్యానికి “ఎన్నటికిని నాశనము కలుగదు.” (దానియేలు 2:​44) అంతేకాదు, ఆ రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటికన్నా అన్ని విధాలుగా ఎంతో శ్రేష్ఠమైనది.

దేవుని రాజ్యానికి శ్రేష్ఠమైన రాజున్నాడు. ఆ రాజు ఎవరో గమనించండి. దానియేలు తనకు అనుగ్రహించబడిన ‘కలలో దర్శనములలో’ “మనుష్యకుమారుని పోలిన యొకని”లా ఉన్న దేవుని రాజ్య పరిపాలకుడు, సర్వశక్తిగల దేవుని సముఖానికి తేబడగా, ఆయనకు శాశ్వత “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” అప్పగించబడడాన్ని చూశాడు. (దానియేలు 7:​1, 13, 14) మెస్సీయ అయిన యేసుక్రీస్తే ఆ మనుష్యకుమారుడు. (మత్తయి 16:​13-17) యెహోవా దేవుడు తన సొంత కుమారుడైన యేసును తన రాజ్యానికి రాజుగా నియమించాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” అని దుష్టులైన పరిసయ్యులతో చెప్పాడు, అలా చెప్పినప్పుడు ఆయన ఆ రాజ్యానికి భవిష్యత్‌ రాజైన తాను వారిమధ్యనే ఉన్నాడని సూచించాడు.​—⁠లూకా 17:⁠21.

పరిపాలకునిగా యేసుకున్న అర్హతలు మానవజాతిలో ఎవరికి ఉండగలవు? యేసు తాను పూర్తిగా నీతిగల, నమ్మదగిన, కనికరంగల నాయకుణ్ణని ఇప్పటికే నిరూపించుకున్నాడు. సువార్తలు ఆయనను కార్యశీలునిగా, ప్రేమ, ఆప్యాయతగల, ప్రగాఢ భావాలున్న వ్యక్తిగా వర్ణిస్తున్నాయి. (మత్తయి 4:⁠23; మార్కు 1:⁠40, 41; 6:​31-​34; లూకా 7:​11-​17) అంతేకాక, పునరుత్థానం చేయబడిన యేసు మరణించడు లేదా ఆయనకు ఇతర మానవ పరిమితులు ఉండవు.​—⁠యెషయా 9:​6, 7.

యేసు, ఆయన సహవాసులు ఉన్నత స్థానం నుండి పరిపాలిస్తారు. దానియేలు తనకు కలగావచ్చిన దర్శనంలో “రాజ్యమును అధికారమును . . . పరిశుద్ధులకు చెందడం” కూడా చూశాడు. (దానియేలు 7:​27) యేసు ఒంటరిగా పరిపాలించడు. ఆయనతోపాటు రాజులుగా పరిపాలించే, యాజకులుగా సేవచేసే ఇతరులు కూడా ఉన్నారు. (ప్రకటన 5:​9, 10; 20:⁠6) వారి గురించి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. . . . నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి. . . . వారు . . . భూలోకములోనుండి కొనబడ్డారు.”​—⁠ప్రకటన 14:​1-3.

ఆ గొర్రెపిల్ల రాజ్యాధికారంలో ఉన్న యేసుక్రీస్తు. (యోహాను 1:⁠29; ప్రకటన 22:⁠3) ఆ సీయోను పర్వతం పరలోకాన్ని సూచిస్తోంది. * (హెబ్రీయులు 12:​22) యేసు, ఆయన 1,44,000 మంది సహవాసులు పరలోకం నుండి పరిపాలిస్తున్నారు. పరిపాలించేందుకు అదెంతటి ఉన్నత స్థానమో కదా! పరలోకంలో ఉన్నందున, వారికి విశాలమైన దృష్టి ఉంటుంది. “దేవుని రాజ్యం” పరలోకంలో ఉంటుంది కాబట్టి, అది “పరలోకరాజ్యం” అని కూడా పిలవబడుతోంది. (లూకా 8:⁠10; మత్తయి 13:​11) ఏ ఆయుధాలు, ఎలాంటి అణ్వాయుధ దాడులు ఆ పరలోక ప్రభుత్వానికి హానితలపెట్టి, పడద్రోయలేవు. అది అజేయమైనదే కాక, దాని విషయంలో యెహోవా సంకల్పించిన దానిని అది నెరవేరుస్తుంది.​—⁠హెబ్రీయులు 12:​28.

దేవుని రాజ్యానికి భూమ్మీద నమ్మదగిన ప్రతినిధులు ఉంటారు. అది మనకెలా తెలుసు? కీర్తన 45:​16 ఇలా పేర్కొంటోంది: ‘భూమియందంతట నీవు అధికారులను నియమించెదవు.’ ఈ ప్రవచనంలో పేర్కొనబడిన “నీవు” దేవుని కుమారుణ్ణి సూచిస్తుంది. (కీర్తన 45:6, 7; హెబ్రీయులు 1:​7, 8) కాబట్టి, యేసుక్రీస్తే స్వయంగా అధికార ప్రతినిధులను నియమిస్తాడు. వారు ఆయన నిర్దేశాన్ని విధేయతతో అమలుచేస్తారని మనం నమ్మవచ్చు. నేడు కూడా, క్రైస్తవ సంఘంలో పెద్దలుగా సేవచేస్తున్న అర్హులైన వ్యక్తులు తమ తోటి విశ్వాసులమీద ‘ప్రభువులుగా’ ఉండే బదులు వారిని రక్షించి, ఉత్తేజపరచి, ఓదార్చాలని బోధించబడుతున్నారు.​—⁠మత్తయి 20:25-​28; యెషయా 32:⁠2.

ఆ రాజ్యంలో నీతిమంతులైన ప్రజలుంటారు. వారు దేవుని దృష్టిలో నిందారహితులుగా, యథార్థవంతులుగా ఉంటారు. (సామెతలు 2:​21, 22) “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 37:​11) ఆ రాజ్య ప్రజలు దీనులు, అంటే బోధింపదగినవారు, వినయం, మృదుస్వభావం, శాంత స్వభావంగలవారు. వారు ఆధ్యాత్మిక విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. (మత్తయి 5:​3) వారు సరైనది చేయాలనుకుంటారు, వారు దైవిక నిర్దేశానికి స్పందిస్తారు.

దేవుని రాజ్యం శ్రేష్ఠమైన నియమాల ద్వారా నియంత్రించబడుతుంది. ఆ రాజ్యాన్ని నిర్దేశించే నియమాలు, సూత్రాలు యెహోవా నుండే వస్తాయి. అవి మనల్ని అన్యాయంగా నియంత్రించే బదులు మనకు ప్రయోజనం చేకూరుస్తాయి. (కీర్తన 19:​7-11) యెహోవా నీతియుక్త నియమాలకు అనుగుణంగా జీవించడం ద్వారా చాలామంది ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారు. ఉదాహరణకు, భర్తలకు, భార్యలకు, పిల్లలకు బైబిల్లో ఇవ్వబడిన సలహాను లక్ష్యపెట్టడం మన కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. (ఎఫెసీయులు 5:⁠33-6:⁠3) ‘ప్రేమను ధరించుకోవాలనే’ ఆజ్ఞకు మనం లోబడినప్పుడు ఇతరులతో మన సంబంధం మెరుగవుతుంది. (కొలొస్సయులు 3:​13, 14) మనం లేఖనాధార సూత్రాలకు అనుగుణంగా జీవించినప్పుడు మనం మంచి పని అలవాట్లను, డబ్బు విషయంలో సమతూకమైన దృక్పథాన్ని కూడా వృద్ధిచేసుకుంటాం. (సామెతలు 13:4; 1 తిమోతి 6:​9, 10) త్రాగుబోతుతనం, లైంగిక దుర్నీతి, పొగాకు, వ్యసనపూరితమైన మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.​—⁠సామెతలు 7:21-23; 23:29, 30; 2 కొరింథీయులు 7:⁠1.

దేవుడు నియమించిన ప్రభుత్వమే దేవుని రాజ్యం. దాని రాజు, మెస్సీయ అయిన యేసుక్రీస్తు, ఆయన తోటి పరిపాలకులందరూ దేవుని న్యాయమైన నియమాలను, ప్రేమపూర్వక సూత్రాలను కట్టుబడివుండే విషయంలో దేవునికి జవాబుదారులుగా ఉన్నారు. దాని భూసంబంధ ప్రతినిధులతోపాటు ఆ రాజ్య ప్రజలు దేవుని నియమాలకు అనుగుణంగా జీవించడానికి సంతోషిస్తారు. కాబట్టి రాజ్య పరిపాలకుల, ప్రజల జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఉంటుంది. అందువల్ల, ఆ రాజ్యం నిజంగా దైవపరిపాలనా సంబంధమైనది లేక దేవునిచేత పరిపాలించబడుతుంది. అది స్థాపించబడడానికున్న సంకల్పాన్ని నెరవేర్చడంలో అది తప్పక విజయవంతమవుతుంది. అయితే, మెస్సీయ రాజ్యమని కూడా పిలవబడే దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది?

రాజ్య పరిపాలన ప్రారంభమవడం

రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం చేసుకునే కీలకం యేసు మాటల్లో కనిపిస్తుంది. “అన్యజనముల [‘నియమిత,’ NW] కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును” అని ఆయన అన్నాడు. (లూకా 21:​24) ఈ భూమ్మీద, యెరూషలేము నగరం మాత్రమే దేవుని నామంతో నేరుగా జతచేయబడింది. (1 రాజులు 11:36; మత్తయి 5:​35) దేవుడు ఆమోదించిన భూసంబంధ రాజ్యానికి అది రాజధానిగా ఉంది. దేవుడు తన ప్రజలమీద చేసే పరిపాలనకు లోక ప్రభుత్వాలు అంతరాయం కలిగించేందుకు ఆ నగరం అన్యజనములచేత త్రొక్కబడుతుంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది?

యెరూషలేములోని యెహోవా సింహాసనంమీద ఆసీనుడైన చివరి రాజుకు ఇలా చెప్పబడింది: “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు.  . . దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.” (యెహెజ్కేలు 21:​25-27) ఆ రాజు తలపై నుండి కిరీటము తీసివేయబడినప్పుడు, తన ప్రజలమీద దేవుని పరిపాలనకు అంతరాయం కలుగుతుంది. సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు అది సంభవించింది. ఆ తర్వాత ప్రారంభమయ్యే ‘నియమిత కాలాల్లో’ దేవునికి తన పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం భూమ్మీద ఉండదు. ఆ కాలములు ముగిసిన తర్వాతే యెహోవా “దాని స్వాస్థ్యకర్త” అయిన యేసుక్రీస్తుకు పరిపాలించే అధికారాన్ని ఇస్తాడు. ఆ కాలవ్యవధి ఎంత ఉంటుంది?

బైబిలు పుస్తకమైన దానియేలులోని ఒక ప్రవచనం ఇలా చెబుతోంది: ‘చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము, ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు దానిని ఉండనిమ్ము.’ (దానియేలు 4:​23) మనం చూడనున్నట్లుగా, ఇక్కడ పేర్కొనబడిన “ఏడు కాలములు” ‘అన్యజనముల నియమిత కాలములకు’ సమానం.

బైబిల్లో, కొన్నిసార్లు చెట్లు వ్యక్తులకు, పరిపాలకులకు, రాజ్యాలకు ప్రతీకగా ఉన్నాయి. (కీర్తన 1:3; యిర్మీయా 17:​7, 8; యెహెజ్కేలు 31వ అధ్యాయం) ఆ సూచనార్థక చెట్టు ‘ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను’ అంటే భూమ్మీద ఎక్కడినుండైనా దానిని చూడవచ్చు. (దానియేలు 4:​11) కాబట్టి, నరకబడి, కట్టువేయబడాల్సిన ఆ చెట్టు సూచించిన పరిపాలన ‘లోకమంతట వ్యాపించింది,’ దానిలో మానవ రాజ్యాలన్నీ ఇమిడివున్నాయి. (దానియేలు 4:​17, 20, 22) కాబట్టి, ఆ చెట్టు దేవుని సర్వోన్నత పరిపాలనకు, ప్రత్యేకంగా భూమిపై ఆయన పరిపాలనకు ప్రతీకగా ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి తాను స్థాపించిన రాజ్యం ద్వారా దేవుడు కొంతకాలంవరకు భూమ్మీద తన పరిపాలనను కొనసాగించాడు. ఆ సూచనార్థక చెట్టు పెరగకుండా ఉండేందుకు అది నరకబడి దాని మొద్దుకు ఇనుము ఇత్తడితో కలిసిన కట్టు వేయబడింది. సా.శ.పూ. 607లో సంభవించినట్లుగా, భూమ్మీద పరిపాలించేందుకు దేవుడు ఉపయోగించిన రాజ్య పరిపాలన శాశ్వతంగా నిలిచిపోలేదుగానీ తాత్కాలికంగా నిలిచిపోయిందని అది సూచిస్తుంది. ఆ చెట్టు “ఏడు కాలములు” గడిచేంతవరకు కట్టువేయబడివుంటుంది. ఆ కాలాలు ముగిసిన తర్వాత యెహోవా ఆ రాజ్య పరిపాలనను దాని చట్టబద్ధ వారసుడైన యేసుక్రీస్తుకు అప్పగిస్తాడు. కాబట్టి, “ఏడు కాలములు,” ‘అన్యజనముల నియమిత కాలములు’ ఒకే కాలవ్యవధిని సూచిస్తున్నాయనేది స్పష్టం.

“ఏడు కాలములు” ఎంత కాలాన్ని సూచిస్తోందో తెలుసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. “కాలము [ఒక కాలము] కాలములు [రెండు కాలములు, బహువచనం] అర్ధకాలము”లు, అంటే మొత్తం కలిసి మూడున్నర “కాలములు” ఇవి “వెయ్యిన్ని రెండువందల అరువది దినములకు” సమానమని అది చెబుతోంది. (ప్రకటన 12:​6, 14) దానర్థం, ఆ సంఖ్యకు రెండింతలు లేదా ఏడు కాలములు 2,520 దినాలకు సమానం.

మనం ఈ 2,520 దినాలను సా.శ.పూ. 607 నుండి అక్షరార్థంగా లెక్కిస్తే మనం సా.శ.పూ. 600కు వస్తాం. అయితే, ఏడు కాలములు పూర్తికావడానికి దానికన్నా ఎక్కువ సమయమే పట్టింది. యేసు ‘అన్యజనముల నియమిత కాలముల’ గురించి మాట్లాడినప్పుడు ఆ కాలములు ఇంకా కొనసాగుతూనేవున్నాయి. కాబట్టి, ఆ ఏడు కాలములు ప్రవచనార్థకమైనవి. కాబట్టి, మనం ఈ సందర్భంలో “దినమునకు ఒక సంవత్సరము” అనే లేఖనాధార నియమాన్ని అన్వయించాలి. (సంఖ్యాకాండము 14:34; యెహెజ్కేలు 4:⁠6) అలాగైతే, దైవిక ప్రమేయం లేకుండా ప్రపంచ ఆధిపత్యాలు భూమ్మీద అధికారం చెలాయించిన ఏడు కాలములు 2,520 సంవత్సరాలకు సమానమవుతాయి. సా.శ.పూ. 607 నుండి ఈ 2,520 సంవత్సరాలను లెక్కిస్తే మనం సా.శ. 1914కు చేరుకుంటాం. ఆ సంవత్సరంలో ‘అన్యజనముల నియమిత కాలములు’ లేక ఏడు కాలములు ముగిశాయి. దానర్థం 1914 నుండి యేసుక్రీస్తు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు.

“నీ రాజ్యము వచ్చుగాక”

మెస్సీయ రాజ్యం పరలోకంలో ఇప్పటికే స్థాపించబడింది కాబట్టి, యేసు మాదిరి ప్రార్థనలో బోధించినట్లుగా మనం దాని కోసం ఇంకా ప్రార్థిస్తూనే ఉండాలా? (మత్తయి 6:⁠9) అవును. ఆ ప్రార్థన సరైంది, దానికి ఇప్పటికీ పూర్తి భావం ఉంది. దేవుని రాజ్యం భవిష్యత్తులో ఈ భూమ్మీద పూర్తి అధికారాన్ని చేపడుతుంది.

అలా జరిగినప్పుడు నమ్మకస్థులైన మానవులు ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తారో కదా! “దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది . . . ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను” అని బెబిలు చెబుతోంది. (ప్రకటన 21:​3, 4) ఆ కాలంలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:​24) దేవుణ్ణి సంతోషపెట్టేవారు నిత్యజీవాన్ని ఆనందిస్తారు. (యోహాను 17:⁠3) ఈ బైబిలు ప్రవచనాలతోపాటు ఇతర అద్భుతమైన బైబిలు ప్రవచనాల నెరవేర్పు కోసం మనం వేచిచూస్తుండగా, ‘రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదకుతూ’ ఉందాం.​—⁠మత్తయి 6:​33.

[అధస్సూచి]

^ పేరా 10 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు భూసంబంధ సీయోను పర్వత కోటను యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకొని దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. (2 సమూయేలు 5:​6, 7, 9) ఆయన పరిశుద్ధ మందసాన్ని కూడా ఆ ప్రదేశానికి మార్చాడు. (2 సమూయేలు 6:​17) మందసం యెహోవా ప్రత్యక్షతతో జతచేయబడింది కాబట్టి, సీయోను పర్వతం దేవుని నివాసస్థలంగా పేర్కొనబడింది, అలా అది పరలోకానికి సరైన చిహ్నంగా ఉంది.​—⁠నిర్గమకాండము 25:⁠22; లేవీయకాండము 16:2; కీర్తన 9:⁠11; ప్రకటన 11:​19.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా యేసుక్రీస్తును తన రాజ్యానికి రాజుగా నియమించాడు

[6వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రాలు]

2,520 సంవత్సరాలు

607 అక్టోబరు ◀ సా.శ.పూ. సా.శ.▸ 1914 అక్టోబరు

606 1/4 సంవత్సరాలు 1,913 3/4 సంవత్సరాలు

‘అన్యజనముల నియమిత కాలములు’ సా.శ.పూ. 607లో ప్రారంభమై సా.శ. 1914లో ముగిశాయి

[7వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యానికి చెందిన భూసంబంధ ప్రజలు అనేక ఆశీర్వాదాలను అనుభవిస్తారు