కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీర్తనల తృతీయ, చతుర్థ స్కంధములలోని ముఖ్యాంశాలు

కీర్తనల తృతీయ, చతుర్థ స్కంధములలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

కీర్తనల తృతీయ, చతుర్థ స్కంధములలోని ముఖ్యాంశాలు

దేవునికి ప్రార్థిస్తూ కీర్తనకర్త ఇలా అడుగుతున్నాడు: “సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పుకొందురా?” (కీర్తన 88:​11) లేదు అన్నదే దానికి జవాబు. జీవం లేకుండా మనం యెహోవాను స్తుతించలేము. యెహోవాను స్తుతించడం మనం సజీవంగా ఉండడానికి ఒక మంచి కారణం, అలాగే సజీవంగా ఉండడం ఆయనను స్తుతించడానికి మంచి కారణం.

కీర్తనల్లోని తృతీయ, చతుర్థ స్కంధములు, అంటే 73 నుండి 106 వరకున్న కీర్తనలు, సృష్టికర్తను స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మనకు ఎన్నో కారణాలనిస్తాయి. ఈ కీర్తనలను ధ్యానించడం, “దేవుని వాక్యము” పట్ల మన కృతజ్ఞతను అధికం చేసి, ఆయనను మరింత ఎక్కువగా, మరింత బాగా స్తుతించేలా మనల్ని పురికొల్పాలి. (హెబ్రీయులు 4:​12) మొదటగా మనం కీర్తనల తృతీయ స్కంధమును అత్యంతాసక్తితో పరిశీలిద్దాం.

“నాకైతే దేవుని పొందు ధన్యకరము”

(కీర్తన 73:1-89:⁠52)

మూడవ స్కంధములోని మొదటి 11 కీర్తనలను ఆసాపు లేదా ఆసాపు కుటుంబ సభ్యులు కూర్చారు. తప్పు ఆలోచనా విధానంచే ప్రక్కదారి పట్టకుండా ఆసాపును ఏది కాపాడిందో అందులోని మొదటి కీర్తన వివరిస్తుంది. ఆయన సరైన ముగింపుకు చేరుకున్నాడు. “నాకైతే దేవుని పొందు ధన్యకరము” అని ఆయన పాడుతున్నాడు. (కీర్తన 73:​28) దాని తర్వాత, 74వ కీర్తనలో, యెరూషలేము నాశనం గురించిన విలాపం ఉంది. 75, 76, 77 కీర్తనలు యెహోవాను నీతిమంతుడైన న్యాయాధిపతిగా, నమ్రతగలవారి రక్షకునిగా, ప్రార్థన ఆలకించువానిగా వర్ణిస్తున్నాయి. 78వ కీర్తన మోషే కాలం నుండి దావీదు కాలం వరకు ఇశ్రాయేలు గతాన్ని సమీక్షిస్తుంది. 79వ కీర్తన ఆలయ నాశనం గురించి విలపిస్తుంది. ఆ తర్వాతి కీర్తన దేవుని ప్రజల పునరుద్ధరణ గురించినది. 81వ కీర్తన యెహోవాకు విధేయత చూపించమని ఉద్బోధిస్తోంది. 82, 83 కీర్తనలు దుష్ట న్యాయాధిపతులపై, దేవుని శత్రువులపై దైవిక తీర్పును అమలుచేయమని వేడుకుంటూ చేయబడిన ప్రార్థనలు.

“యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది” అని కోరహు కుమారుల కీర్తన చెబుతోంది. (కీర్తన 84:⁠2) 85వ కీర్తన, చెర నుండి తిరిగివచ్చిన వారిపై దేవుని ఆశీర్వాదం కోసం చేయబడిన విన్నపం. ఈ కీర్తన భౌతికాశీర్వాదాల కంటే ఆధ్యాత్మికాశీర్వాదాలు ఎంతో విలువైనవని నొక్కిచెబుతోంది. 86వ కీర్తనలో, దావీదు తనను కాపాడమని, తనకు ఉపదేశించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. 87వ కీర్తన సీయోను గురించిన, అక్కడ జన్మించిన వారి గురించిన గీతం, 88వ కీర్తన యెహోవాకు చేయబడిన ప్రార్థన. దావీదు నిబంధనలో వ్యక్తం చేయబడిన యెహోవా కృప 89వ కీర్తనలో నొక్కిచెప్పబడింది, ఈ కీర్తనను ఏతాను కూర్చాడు, ఈయన సొలొమోను కాలంలోవున్న నలుగురు జ్ఞానవుంతులలో ఒకరై ఉండవచ్చు.​—⁠1 రాజులు 4:​31.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

73:9​—⁠దుష్టులు ఏ విధంగా పరలోకముతట్టు లేదా ‘ఆకాశముతట్టు ముఖము ఎత్తుదురు’? “వారి నాలుక” ఏ విధంగా “భూసంచారము చేయును”? దుష్టులు పరలోకంలో ఉన్నవారినిగానీ భూమ్మీద ఉన్నవారినిగానీ లక్ష్యపెట్టరు కాబట్టి, వారు తమ నోటితో దేవుణ్ణి దూషించడానికి ఏమాత్రం వెనుకాడరు. వారు తమ నాలుకతో మానవుల మీద కూడా అపనిందలు వేస్తారు.

74:13, 14​—⁠యెహోవా ఎప్పుడు ‘జలములలో భుజంగముల శిరస్సులను పగులగొట్టాడు, మకరముయొక్క శిరస్సును ముక్కలుగా గొట్టాడు’? “ఐగుప్తు రాజైన ఫరో,” “నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలి” అని పిలువబడుతున్నాడు. (యెహెజ్కేలు 29:⁠3) మకరము “ఫరో యొక్క బలాఢ్యులను” సూచిస్తుండవచ్చు. (కీర్తన 74:​14, NW, అధస్సూచి) వారి శిరస్సులను పగులగొట్టడం, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విమోచించినప్పుడు ఫరోకు, ఆయన సైన్యానికి ఎదురైన ఘోర పరాజయాన్ని సూచిస్తుండవచ్చు.

75:​4, 5, 10​—⁠“కొమ్ము” అనే పదం దేన్ని సూచిస్తుంది? జంతువుల కొమ్ములు బలమైన ఆయుధాలు. కాబట్టి “కొమ్ము” అనే పదం సూచనార్థకంగా శక్తిని లేక బలాన్ని సూచిస్తుంది. యెహోవా తన ప్రజలను ఉన్నతపరిచి వారి కొమ్ములను ఎత్తుతాడు, అయితే ఆయన ‘భక్తిహీనుల కొమ్ములను విరగ్గొడతాడు.’ మనం ‘మన కొమ్మును ఎత్తుగా ఎత్తకూడదని’ అంటే, గర్వం లేక అహంకారపూరిత దృక్పథం అలవర్చుకోకూడదని హెచ్చరించబడ్డాం. ఉన్నతపరిచేది యెహోవా కాబట్టి, సంఘంలో ఇవ్వబడే బాధ్యతలు ఆయన నుండి వస్తున్నట్లుగా దృష్టించాలి.​—⁠కీర్తన 75:⁠7.

76:10​—⁠“నరుల ఆగ్రహము” యెహోవాను ఎలా స్తుతించగలదు? మనం దేవుని సేవకులమైనందుకు మానవులు మనపై తమ కోపాన్ని వ్రెళ్ళగ్రక్కడానికి ఆయన అనుమతించినప్పుడు, అనుకూల ఫలితం రావచ్చు. మనకు ఎదురుకాగల ఎటువంటి కష్టమైనా మనకు ఏదోక రీతిలో శిక్షణ ఇవ్వగలదు. మనకు అలాంటి శిక్షణనిచ్చేంత వరకే యెహోవా ఆ శ్రమను అనుమతిస్తాడు. (1 పేతురు 5:​10) ‘నరుని ఆగ్రహశేషమును దేవుడు ధరించుకొంటాడు.’ మనం చనిపోయేంతగా శ్రమ అనుభవించవలసి వస్తే అప్పుడేమిటి? ఇది కూడా యెహోవాకు స్తుతిని తీసుకురాగలదు ఎందుకంటే, మనం నమ్మకంగా సహించడాన్ని చూసినవారు కూడా దేవుణ్ణి మహిమపర్చడం ఆరంభించవచ్చు.

78:​24, 25​—⁠మన్నా “ఆకాశధాన్యము,” “దేవదూతల ఆహారము” అని ఎందుకు పిలువబడింది? ఈ రెండు పదాల భావం, మన్నా దేవదూతల ఆహారమని కాదు. అది ఆకాశం నుండి లేక పరలోకం నుండి వస్తోంది కాబట్టి, అది “ఆకాశధాన్యము.” (కీర్తన 105:​40) “దేవదూతలు” పరలోకంలో ఉంటారు గనుక, “దేవదూతల ఆహారము” అనే పదబంధం, ఆకాశంలో లేక పరలోకంలో వసించే దేవుడు అనుగ్రహించినదనే భావాన్నిస్తుంది. (కీర్తన 11:⁠4) అంతేగాక, ఇశ్రాయేలీయులకు మన్నాను అనుగ్రహించడానికి యెహోవా దేవదూతలను ఉపయోగించుకుని ఉండవచ్చు.

82:1, 6​—⁠“దైవములని,” “సర్నోన్నతుని కుమారులని” పిలువబడుతున్నది ఎవరు? ఈ రెండు పదాలు ఇశ్రాయేలులోని మానవ న్యాయాధిపతులను సూచిస్తున్నాయి. ఇది సముచితమే ఎందుకంటే వారు దేవుని సందేశకులుగా, ప్రతినిధులుగా పనిచేయాలి.​—⁠యోహాను 10:​33-36.

83:2​—⁠ఒకరు ‘తల ఎత్తడం’ దేన్ని సూచిస్తుంది? ఈ చర్య సాధారణంగా వ్యతిరేకించడానికి, పోరాడడానికి లేక అణచివేయడానికి అధికారాన్ని ఉపయోగించేందుకు లేక చర్య తీసుకునేందుకు ఒకరికున్న సంసిద్ధతను సూచిస్తుంది.

మనకు పాఠాలు:

73:2-5, 18-20, 25, 28. మనం దుష్టులు వర్ధిల్లడం చూసి అసూయపడి వారి భక్తిహీన మార్గాలను అనుసరించకూడదు. దుష్టులు కాలుజారే స్థలంలో ఉన్నారు. వారు తప్పకుండా ‘నశిస్తారు.’ అంతేగాక, అపరిపూర్ణ మానవ పరిపాలన క్రింద దుష్టత్వాన్ని నిర్మూలించడం సాధ్యంకాదు కాబట్టి, దాన్ని నిర్మూలించడానికి మనం చేసే కృషి వ్యర్థమవుతుంది. ఆసాపులాగే ‘దేవునికి’ సన్నిహితం కావడం ద్వారా, అలాంటి సన్నిహిత సంబంధాన్ని ఆనందించడం ద్వారా దుష్టత్వాన్ని సహిస్తే మనం కూడా జ్ఞానవంతులముగా ఉంటాం.

73:3, 6, 8, 27. గర్వించడం, బలాత్కారం చేయడం, ఎగతాళి చేయడం, బలాత్కారంచేత కీడు జరిగించడం వంటివాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి లక్షణాలు అలవర్చుకోవడం ప్రయోజనకరమైనవిగా అనిపించినా మనం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

73:​15-17. మన ఆలోచనా విధానం గందరగోళంగా ఉన్నప్పుడు, మనల్ని కలవరపరిచే ఆ తలంపులను బహిరంగంగా వ్యక్తం చేయకుండా ఉండాలి. ‘అలా ముచ్చటించడం’ ఇతరులను నిరుత్సాహపర్చవచ్చు. మనం మన చింతల గురించి ప్రశాంతంగా ధ్యానించి, తోటి విశ్వాసులతో సహవసించడం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి.​—⁠సామెతలు 18:⁠1.

73:​21-24. దుష్టులు క్షేమంగా ఉన్నట్లుండడం చూసి ‘మత్సరపడడం’ తెలివిలేని జంతువుల్లా ప్రతిస్పందించడంతో పోల్చబడింది. అది పూర్తిగా భావోద్వేగాలపై ఆధారపడిన ప్రతిస్పందన. బదులుగా, యెహోవా ‘మన కుడిచెయ్యి పట్టుకొని’ మనకు మద్దతిస్తాడనే పూర్తి నమ్మకంతో ఆయన ఆలోచనచేత మనం నడిపించబడాలి. అంతేగాక, యెహోవా ‘మనల్ని మహిమలో చేర్చుకుంటాడు’ అంటే ఆయనతో సన్నిహిత సంబంధంలోకి తీసుకుంటాడు.

77:⁠6. లేఖనాధారిత సత్యాలపట్ల హృదయపూర్వక శ్రద్ధ చూపిస్తూ, వాటికోసం జాగ్రత్తగా వెతకాలంటే అధ్యయనం కోసం, ధ్యానం కోసం సమయం వెచ్చించడం అవసరం. మనం మన జీవితాల్లో కొంత ఏకాంత సమయాన్ని సంపాదించుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

79:⁠9. యెహోవా మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ప్రాముఖ్యంగా అవి తన నామ ఘనతకు సంబంధించినవైతే తప్పక వింటాడు.

81:​13, 16. యెహోవా మాట వినడం, ఆయన మార్గములను అనుసరించడం గొప్ప ఆశీర్వాదాలకు నడిపిస్తాయి.​—⁠సామెతలు 10:​22.

82:​2, 5. అన్యాయాలు ‘దేశమునకున్న ఆధారములన్నియు కదిలేలా’ చేస్తాయి. అన్యాయ కార్యాలు మానవ సమాజ స్థిరత్వాన్ని పాడుచేస్తాయి.

84:​1-4, 10-12. యెహోవా ఆరాధనా స్థలంపట్ల కీర్తనకర్తలకున్న గౌరవం, తమ సేవాధిక్యతల విషయంలో వారికున్న సంతృప్తి, మనకు మాదిరికరంగా ఉన్నాయి.

86:⁠5. యెహోవా “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివున్నందుకు మనమెంత కృతజ్ఞతతో ఉండవచ్చో కదా! పశ్చాత్తప్త తప్పిదస్థునిపట్ల దయ చూపించడానికి తనకు ఆధారాన్నిచ్చే సాక్ష్యాధారం కోసం ఆయన వెదుకుతూ ఉంటాడు.

87:​5, 6. భూపరదైసులో జీవం పొందేవారికి, పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడినవారి పేర్లు ఎప్పటికైనా తెలుస్తాయా? బహుశా ఇది సాధ్యం కావచ్చని ఈ వచనాలు సూచిస్తున్నాయి.

88:​13, 14. ఏదైనా ఒక నిర్దిష్ట సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు దానికి సమాధానం రావడం ఆలస్యమైతే, తనపట్ల మనకున్న భక్తి ఎంత యథార్థమైనదో మనం చూపించాలని ఆయన కోరుకుంటున్నాడని దాని భావం కావచ్చు.

“ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి”

(కీర్తన 90:1-106:48)

కీర్తనల చతుర్థ స్కంధములో ప్రస్తావించబడిన, యెహోవాను స్తుతించడానికిగల వివిధ కారణాలను పరిశీలించండి. 90వ కీర్తనలో మోషే, “సకల యుగములలో రాజు” ఉనికికి, మానవుని అల్ప జీవితానికి ఉన్న తేడాను చూపిస్తున్నాడు. (1 తిమోతి 1:​17) కీర్తన 91:2 ప్రకారం, యెహోవా ‘తన ఆశ్రయము, కోట’ అంటే తన భద్రతకు మూలం అని మోషే చెబుతున్నాడు. తర్వాతి కొన్ని కీర్తనలు దేవుని ఆకర్షణీయమైన లక్షణాల గురించి, ఉన్నతమైన తలంపుల గురించి, అద్భుతమైన కార్యాల గురించి మాట్లాడుతున్నాయి. మూడు కీర్తనలు “యెహోవా రాజ్యము చేయుచున్నాడు” అనే పదబంధంతో ఆరంభమవుతున్నాయి. (కీర్తన 93:1; 97:1; 99:⁠1) యెహోవా మనల్ని రూపించినవాడని చెబుతూ కీర్తనకర్త “ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి” అని మనల్ని ఆహ్వానిస్తున్నాడు.​—⁠కీర్తన 100:⁠4.

యెహోవాకు భయపడే పరిపాలకుడు తన వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలి? దావీదు రాజు కూర్చిన 101వ కీర్తన దానికి సమాధానమిస్తోంది. యెహోవా ‘దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరుగుతాడు’ అని తర్వాతి కీర్తన మనకు చెబుతోంది. (కీర్తన 102:​17) 103వ కీర్తన యెహోవా కరుణాకటాక్షముల వైపుకు మన అవధానాన్ని మళ్ళిస్తుంది. భూమిపై దేవుడు కలుగజేసిన అనేకమైన వాటి గురించి మాట్లాడుతూ కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి.” (కీర్తన 104:​24) చతుర్థ స్కంధములోని చివరి రెండు కీర్తనలు యెహోవా అద్భుత కార్యాలనుబట్టి ఆయనను స్తుతిస్తున్నాయి.​—⁠కీర్తన 105:2, 5; 106:​7, 22.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

91:1, 2​—⁠“మహోన్నతుని చాటు” అంటే ఏమిటి, అందులో మనం ఎలా ‘నివసించవచ్చు’? ఇది ఆధ్యాత్మిక భద్రత గల ఒక సూచనార్థక స్థలం అంటే ఆధ్యాత్మికంగా హాని జరుగకుండా కాపాడబడే పరిస్థితి. దేవుని మీద నమ్మకం ఉంచనివారికి ఆ స్థలం తెలియదు కాబట్టి అది చాటైన స్థలం. యెహోవాను మన ఆశ్రయంగా, కోటగా దృష్టించడం ద్వారా, విశ్వ సర్వోన్నత పరిపాలకునిగా ఆయనను స్తుతించడం ద్వారా, రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా ఆయనను మన నివాసంగా చేసుకుంటాము. యెహోవా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మనకు తెలుసు కాబట్టి మనం ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం.​—⁠కీర్తన 90:⁠1.

92:12​—⁠ఏ విధంగా నీతిమంతులు “ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు”? ఖర్జూరవృక్షము దాని ఫల దిగుబడికి పేరుగాంచింది. నీతిమంతుడు ఖర్జూరవృక్షములా ఉంటాడు, ఎలాగంటే ఆయన యెహోవా దృష్టిలో యథార్థవంతునిగా ఉండి, మంచి కార్యాలతో సహా “మంచి ఫలములు” ఫలిస్తూనే ఉంటాడు.​—⁠మత్తయి 7:​17-20.

మనకు పాఠాలు:

90:​7, 8, 13, 14. మనం చేసే తప్పులు ఎల్లప్పుడూ సత్యదేవునితో మన సంబంధాన్ని పాడుచేస్తాయి. రహస్యపాపములను ఆయన ఎదుట దాచలేము. అయితే, మనం నిజంగా పశ్చాత్తాపపడి మన తప్పు మార్గాన్ని విడిచిపెడితే, యెహోవా ‘తన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ’ మనం ఆయన అనుగ్రహాన్ని పొందేలా చేస్తాడు.

90:​10, 12. జీవితం అల్పకాలికమైనది కాబట్టి ‘మనం మన దినములు లెక్కించుకోవాలి.’ ఎలా? “జ్ఞానహృదయము” సంపాదించుకోవడం ద్వారా లేక మనకు మిగిలివున్న దినములు వ్యర్థంకాకుండా యెహోవాకు సంతోషం కలిగించే విధంగా గడపగలిగేలా మనం జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా లెక్కించుకోవాలి. దీనికి మనం ఆధ్యాత్మిక ప్రాథమ్యాలు ఏర్పరచుకుని, మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం అవసరం.​—⁠ఎఫెసీయులు 5:15, 16; ఫిలిప్పీయులు 1:​10.

90:​17. యెహోవా ‘మన చేతిపనిని స్థిరపరచాలని,’ పరిచర్యలో మన ప్రయత్నాలను ఆశీర్వదించాలని ప్రార్థించడం సరైనది.

92:​14, 15. శ్రద్ధగల దేవునివాక్య విద్యార్థులుగా ఉండడం ద్వారా, యెహోవా ప్రజలతో క్రమంగా సహవసించడం ద్వారా, వృద్ధులు ‘సారము కలిగి పచ్చగా ఉంటారు’ అంటే ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉండి, సంఘానికి విలువైనవారిగా నిరూపించబడతారు.

94:​19. మన ‘విచారములకు’ కారణం ఏదైనప్పటికీ, బైబిలులో ఉన్న “ఆదరణ” గురించి చదవడం, ధ్యానించడం మనకు ఓదార్పునిస్తుంది

95:​7, 8. లేఖనాధారిత ఉపదేశాన్ని వినడం, దానికి అవధానమివ్వడం, దానికి వెంటనే విధేయత చూపించడం మనం కఠిన హృదయులము కాకుండా నివారిస్తుంది.​—⁠హెబ్రీయులు 3:7, 8.

106: 36, 37. ఈ వచనాలు విగ్రహారాధనను దెయ్యములకు అర్పించే బలులతో ముడిపెడుతున్నాయి. విగ్రహాలను ఉపయోగించే వ్యక్తి దెయ్యాల ప్రభావం క్రిందకు రావచ్చని ఇది సూచిస్తోంది. బైబిలు మనకిలా ఉద్బోధిస్తోంది: “విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.”​—⁠1 యోహాను 5:​21.

“యెహోవాను స్తుతించుడి!”

కీర్తనల చతుర్థ స్కంధములోని చివరి మూడు గీతాలు, “యెహోవాను స్తుతించుడి” అనే ఉద్బోధతో ముగుస్తున్నాయి. చివరి కీర్తన కూడా దానితోనే ప్రారంభమవుతోంది. (కీర్తన 104:35; 105:45; 106:​1, 48) వాస్తవానికి, “యెహోవాను స్తుతించుడి!” అనే పదబంధం కీర్తనల చతుర్థ స్కంధములో తరచూ కనిపిస్తుంది.

యెహోవాను స్తుతించడానికి మనకు ఖచ్చితంగా అనేక కారణాలున్నాయి. 73 నుండి 106 వరకున్న కీర్తనలు మనం ధ్యానించడానికి ఎంతో సమాచారాన్నిస్తూ, మన పరలోక తండ్రిపట్ల మన హృదయాల్లో కృతజ్ఞతను నింపుతున్నాయి. ఆయన ఇప్పటికే మనకోసం చేసినదానంతటి గురించి, భవిష్యత్తులో చేయబోయేదాని గురించి ఆలోచిస్తే, మనం మన పూర్ణబలంతో ‘యెహోవాను స్తుతించాలి’ అని పురికొల్పబడడం లేదా?

[10వ పేజీలోని చిత్రం]

ఆసాపులాగే మనం ‘దేవునికి’ సన్నిహితం కావడం ద్వారా దుష్టత్వాన్ని తాళుకోవచ్చు

[11వ పేజీలోని చిత్రం]

ఫరో ఎర్రసముద్రం వద్ద పరాజయం పొందాడు

[11వ పేజీలోని చిత్రం]

మన్నా “దేవదూతల ఆహారము” అని ఎందుకు పిలువబడిందో మీకు తెలుసా?

[13వ పేజీలోని చిత్రం]

మన ‘విచారములను’ పోగొట్టుకోవడానికి ఏమి సహాయం చేస్తుంది?