కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజంగానే మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామా?

నిజంగానే మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామా?

నిజంగానే మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామా?

బైబిలు అంత్యదినాలు అని పిలిచే రోజుల్ని గుర్తించేందుకు రెండు విధాలుగా సంభవించే మార్పులు మనకు సహాయం చేస్తాయి. “ఈ యుగసమాప్తి” సమయంలో సంభవించే సంఘటనల గురించి లేఖనాలు ముందే తెలియజేస్తున్నాయి. (మత్తయి 24:⁠3) ‘అంత్యదినాల్లో’ జీవించే ప్రజల వైఖరుల్లో, క్రియల్లో వచ్చే మార్పుల గురించి కూడా బైబిలు చెబుతోంది.​—⁠2 తిమోతి 3:⁠1.

ప్రపంచ సంఘటనలతోపాటు ప్రజల వైఖరి, వ్యక్తిత్వం మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని, దేవుణ్ణి ప్రేమించేవారికోసం దేవుని రాజ్యం త్వరలోనే నిత్యాశీర్వాదాలను తీసుకొస్తుందని నిరూపిస్తున్నాయి. అంత్యదినాలను సూచిస్తాయని యేసు చెప్పిన మూడు విషయాలను మనం ముందుగా పరిశీలిద్దాం.

“వేదనలకు ప్రారంభము”

యేసు ఇలా చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.” (మత్తయి 24:​7, 8) మనం ‘వీటన్నింటిని’ ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

యుద్ధాల్లో, జాతి విభేదాల తగాదాల్లో కోట్లాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రచురించిన విద్వాంసుల నివేదికల ప్రకారం, “కీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుండి 1899 వరకు జరిగిన యుద్ధాల్లోకన్నా, ఈ [20వ] శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లోనే మూడింతలు ఎక్కువమంది బలయ్యారు.” తన పుస్తకమైన హ్యూమానిటీ​—⁠ఎ మోరల్‌ హిస్టరీ ఆఫ్‌ ద ట్వంటీయత్‌ సెంచరీలో జోనతన్‌ గ్లెవెర్‌ ఇలా వ్రాశాడు: “అంచనా ప్రకారం, 1900 నుండి 1989 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన యుద్ధాలు 8 కోట్ల 60 లక్షలమంది ప్రాణాల్ని బలిగొన్నాయి . . . ఇరవయ్యవ శతాబ్దంలోని యుద్ధాల్లో ఊహకందని సంఖ్యలో ప్రజలు మరణించారు. ఆ సంవత్సరాలన్నింటిలో ఏడాదికి సగటున ఇంతమంది మరణించారని అంచనా వేయలేం, ఎందుకంటే కేవలం రెండు ప్రపంచ యుద్ధాల్లోనే దాదాపు మూడింట రెండువంతుల (5 కోట్ల 80 లక్షల) మంది హతమార్చబడ్డారు. కానీ, 20వ శతాబ్దమంతటిలో ప్రజలు ఒక్కసారిగా కాక, రోజువారీగా మరణించివుంటే, యుద్ధాల్లో రోజుకి 2,500 మంది అంటే, గంటకు 100 కన్నా ఎక్కవమంది చొప్పున తొంభై సంవత్సరాలు ఒకేపోతగా మరణించి ఉండేవారు.” మరణించినవారి కుటుంబీకుల్లో, స్నేహితుల్లో కోట్లాదిమంది ఎంతటి వ్యధకు, బాధకు గురైవుంటారో మీరు ఊహించగలరా?

ప్రపంచం సమృద్ధిగా ఆహారాన్ని ఉత్పత్తిచేస్తున్నా అంత్యదినాల సూచనలో కరువులు భాగంగా ఉంటాయి. గత 30 సంవత్సరాల్లో జనాభా పెరుగుదలకన్నా ఆహారోత్పత్తి మరెంతో వేగంగా పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. అయినా, అనేకమందికి సాగుచేయడానికి సరిపడా భూమి లేకపోవడంవల్లనో లేక ఆహారం కొనుక్కునేందుకు సరిపడా డబ్బు లేనందువల్లనో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆహారకొరత అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, దాదాపు 120 కోట్లమంది రోజుకి కేవలం 45 రూపాయిలు లేక అంతకన్నా తక్కువ ఆదాయంతోనే గడుపుతున్నారు. వారిలో 78 కోట్లమంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతీ ఏడాది 50 లక్షలకన్నా ఎక్కువమంది పిల్లలు కుపోషణతో మరణిస్తున్నారు.

ప్రవచించబడిన భూకంపాల గురించి ఏమి చెప్పవచ్చు? యు. ఎస్‌. జియోలాజికల్‌ సర్వేక్షణ ప్రకారం, 1990 నుండి సంవత్సరానికి సగటున 17 చొప్పున భవంతులను కూల్చగలిగేంత శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. భవంతుల్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేసేంత శక్తివంతమైన భూకంపాలు సంవత్సరానికి సగటున ఒకటి చొప్పున సంభవించింది. “గత 100 సంవత్సరాల్లో భూకంపాలు లక్షల సంఖ్యలో ప్రాణనష్టాన్ని కలిగించాయి” అని మరో గ్రంథం చెబుతోంది. అంతటి ప్రాణనష్టం జరగడానికి ఒక కారణమేమిటంటే, 1914 నుండి భూకంపం సంభవించగల ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలు వృద్ధి చెందాయి.

మరితర గమనార్హమైన సంఘటనలు

“అక్కడక్కడ . . . తెగుళ్లు” సంభవిస్తాయని యేసు చెప్పాడు. (లూకా 21:​11) వైద్యశాస్త్రం ముందెన్నటికన్నా నేడు ఎంతో అభివృద్ధి చెందింది. అయినా, ముందున్న రోగాలు, కొత్త వ్యాధులు మానవుల్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. యు. ఎస్‌. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌వారి నివేదిక ఇలా చెబుతోంది: “అందరికీ తెలిసిన టీబీ, మలేరియా, కలరావంటి ఇరవై రోగాలు 1973 నుండి భౌగోళికంగా వ్యాపిస్తున్నాయి, అవి మరింత హానికరమైనవిగా, మందులతో నివారించలేనివిగా తయారవుతున్నాయి. ముందెన్నడూ తెలియని, నివారణ లేని హెచ్‌ఐవి, ఎబోలా, హెపటైటిస్‌ సి, నిపాహ్‌ వైరస్‌వంటి కనీసం 30 రోగ కారకాలను 1973 నుండి కనుగొన్నారు.” రెడ్‌ క్రాస్‌ సంస్థ జూన్‌ 28, 2000లో ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆ ముందరి సంవత్సరంలో ప్రకృతి విపత్తుల కారణంగా మరణించినవారి సంఖ్యకన్నా అంటువ్యాధుల కారణంగా మరణించినవారి సంఖ్య 160 రెట్లు ఎక్కువగా ఉంది.

“అక్రమము విస్తరించుట” అనేది ఈ అంత్యదినాలకు సంబంధించిన మరో గమనార్హమైన సూచన. (మత్తయి 24:​12) నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ప్రజలు తమ ఇళ్ళకు తాళాలు వేయకుండా బయటకు వెళ్ళలేరు, లేదా రాత్రివేళ వీధిలో నిర్భయంగా నడవలేరు. అంతేకాదు, తరచూ చట్టవిరుద్ధమైన పనుల కారణంగా గాలిలో, నీటిలో, భూమిపై అధికమౌతున్న కాలుష్యం మాటేమిటి? అది కూడా బైబిలు ముందే చెప్పిన సూచనల నెరవేర్పులో భాగంగా ఉంది. “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” దేవుని నిర్ణయకాలం గురించి ప్రకటన పుస్తకం చెబుతోంది.​—⁠ప్రకటన 11:​18.

అంత్యదినాల్లో ప్రజలు ఎలా ఉంటారు

దయచేసి మీ బైబిలును 2 తిమోతి 3:1-5కు తెరిచి, దాన్ని చదవండి. అక్కడ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును.” ఆ తర్వాత, దైవభక్తిలేని ప్రజల్లో కనిపించే 20 లక్షణాల గురించి ఆయన వ్రాశాడు. మీ సమాజంలో నివసించేవారిలో అలాంటి లక్షణాల్లో కొన్ని మీకు కనిపించాయా? నేటి ప్రజల గురించి ఇటీవలి కాలాల్లో ఏమి చెప్పబడిందో గమనించండి.

“స్వార్థప్రియులు.” (2 తిమోతి 3:⁠2) “ముందెన్నటికన్నా నేడు [ప్రజలు] తమ తమకిష్టమైన దానిని చేయడానికే పట్టుబడుతున్నారు. [వారు] దేవుళ్ళుగా తయారౌతూ, ఇతరులు తమను దేవుళ్ళుగా చూడాలని కోరుకుంటున్నారు.”​—⁠ఫైనాన్షియల్‌ టైమ్స్‌, వార్తాపత్రిక, ఇంగ్లాండ్‌.

“ధనాపేక్షులు.” (2 తిమోతి 3:⁠2) “నేడు ప్రజల్లో ధనంపట్ల ఉన్న స్వార్థపూరిత స్వభావం వారి నమ్రతను అణచివేస్తోంది. మీరు సమాజంలో సంపన్నులు కాకపోతే మీ జీవితానికి విలువే లేదు.”​—⁠జకార్తా పోస్ట్‌, వార్తాపత్రిక, ఇండోనేషియా.

“తలిదండ్రులకు అవిధేయులు.” (2 తిమోతి 3:⁠2) “తమ 4 ఏళ్ళ పిల్లవాడు [ఫ్రెంచి రాజైన] లూయిస్‌ XIVలా తమకు ఆదేశాలివ్వడాన్ని, లేదా తమ 8 ఏళ్ళ అబ్బాయి ‘మీరంటే నాకిష్టం లేదు!’ అని అరవడాన్ని వింటున్న తల్లిదండ్రులు నివ్వెరపోతున్నారు.”​—⁠అమెరికన్‌ ఈక్వేటర్‌, పత్రిక, అమెరికా.

“అపవిత్రులు [‘విశ్వాసఘాతకులు,’ NW]. (2 తిమోతి 3:⁠2) “మగవారు తమ జతను, పిల్లలను విడిచిపెట్టడానికి మరింత సుముఖంగా ఉండడమనేది [గత 40 సంవత్సరాల్లో] నైతిక విలువలకు బహుశా అతిపెద్ద సవాలుగా తయారైంది.”​—⁠విల్సన్‌ క్వార్టర్లీ, పత్రిక, అమెరికా.

“అనురాగరహితులు.” (2 తిమోతి 3:⁠3) “ప్రపంచ సమాజాల్లోని ప్రజల దైనందిన జీవితాల్లో గృహసంబంధ దౌర్జన్యం ప్రబలంగా ఉంది.”​—⁠జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ అసోసియేషన్‌, పత్రిక, అమెరికా.

“అజితేంద్రియులు.” (2 తిమోతి 3:⁠3) “ప్రతీరోజు ఉదయం వార్తాపత్రిక ముందు పేజీలో కనిపించే అనేక కథలు ప్రజల్లో అజితేంద్రియత్వం అధికమైందని అంటే స్వనియంత్రణ, నైతిక సూత్రాల ప్రకారం జీవించాలనే నిశ్చయత, తోటి మానవులపట్ల, చివరకు తమపట్ల కూడా దయ కొరవడ్డాయని చూపిస్తున్నాయి . . . ఇప్పుడు సమర్థిస్తున్నట్లే క్రోధాన్ని సమర్థిస్తూపోతే, మన సమాజం త్వరలోనే నైతికంగా పతనమయ్యే స్థితికి చేరుకుంటుంది.”​—⁠బాంకాక్‌ పోస్ట్‌, వార్తాపత్రిక, థాయ్‌లాండ్‌.

“క్రూరులు.” (2 తిమోతి 3:⁠3) “రోడ్లపైన, కుటుంబీకులపై దౌర్జన్యం చేస్తూ మితిమీరిన, వివేచనారహితమైన కోపాన్ని ప్రజలు ప్రదర్శిస్తున్నారు . . . సాధారణంగా అలా అన్యాయంగా, అనవసరంగా చేసే దౌర్జన్యంతోపాటు నేరం కూడా జరుగుతుంది. దౌర్జన్యం వివిధ రీతుల్లో, ఊహించని విధంగా ఎదురౌతోంది, ప్రజలు తాము మానసికంగా ఇతరులకు దూరంగా ఉన్నట్లు, అభద్రతతో ఉన్నట్లు భావిస్తున్నారు.”​—⁠బిజినెస్‌ డే, వార్తాపత్రిక, దక్షిణాఫ్రికా.

“దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.” (2 తిమోతి 3:⁠4) “లైంగిక స్వేచ్ఛ కోసం పోరాడడమనేది నైతిక ఉద్యమంగా తయారైంది, దానిలో క్రైస్తవ నైతికత శత్రువుగా ఉంది.”​—⁠బౌండ్‌లెస్‌, ఇంటర్నెట్‌ పత్రిక.

“పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” (2 తిమోతి 3:⁠5) “[వేశ్యా వృత్తిని] చట్టబద్ధం చేయడాన్ని ఎక్కువగా మతవర్గాలవారే వ్యతిరేకిస్తున్నారని [నెదర్‌లాండ్స్‌లో ముందు వేశ్యగా ఉన్న స్త్రీ] ఒప్పుకుంది. ఒక క్షణమాగి, తాను వేశ్యగా ఉన్నప్పుడు చాలామంది [మత] బోధకులే తన దగ్గరకి తరచూ వచ్చేవారని వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పింది. ‘మత సమాజానికి చెందినవారే తమ దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు అని వేశ్యలు ఎప్పుడూ చెబుతారు’ అంటూ ఆమె ఫక్కున నవ్వింది.”​—⁠నేషనల్‌ క్యాథలిక్‌ రిపోర్టర్‌, వార్తాపత్రిక, అమెరికా.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

బైబిలు ప్రవచించినట్లుగానే నేడు లోకం సమస్యలతో నిండివుంది. అయితే, “[క్రీస్తు] రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనకు” సంబంధించిన ప్రవచనంలో ఒక సంతోషకరమైన అంశం కూడా ఉంది. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:​3, 14) దేవుని రాజ్యానికి సంబంధించిన ఈ సువార్త 230కన్నా ఎక్కువ దేశాల్లో ప్రకటించబడుతోంది. “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండి” వచ్చిన దాదాపు అరవై లక్షలమంది రాజ్య ప్రకటనా పనిలో చురుకుగా పాల్గొంటున్నారు. (ప్రకటన 7:⁠9) వారి చురుకైన కార్యశీలత ఏమి సాధించింది? ఏమి సాధించిందంటే: రాజ్యం అంటే ఏమిటి, అది ఏమి చేస్తుంది, దానినుండి ఆశీర్వాదాలు ఎలా పొందవచ్చనే సందేశం భూమిపై దాదాపు ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంది. అవును, ‘అంత్యకాలములలో తెలివి [“నిజమైన జ్ఞానం,” NW] అధికమయ్యింది.’​—⁠దానియేలు 12:⁠4.

ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీకు సరైన కారణమే ఉంది. యెహోవా సంతృప్తి మేరకు సువార్త ప్రకటించబడిన తర్వాత ఏమి జరుగుతుందో ఆలోచించండి. యేసు ఇలా చెప్పాడు: “అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:​14) భూమిపై సమస్త దుష్టత్వాన్ని తొలగించడానికి అది దేవుని సమయంగా ఉంటుంది. సామెతలు 2:⁠22 ఇలా చెబుతోంది: “భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.” సాతాను, అతని దయ్యాల మాటేమిటి? జనాంగాలను మోసపుచ్చడానికి వీల్లేకుండా వారు అగాధములో పడవేయబడతారు. (ప్రకటన 20:​1-3) భూమిపై కేవలం ‘యథార్థవంతులు . . . లోపములేనివారు నిలిచియుంటారు.’ వారు ఆద్భుతమైన రాజ్యాశీర్వాదాలను అనుభవిస్తారు.​—⁠సామెతలు 2:​21; ప్రకటన 21:​3-5.

మీరు ఏమి చేయవచ్చు?

సాతాను విధానాంతం సమీపించిందనే విషయంలో సందేహమే లేదు. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే రుజువులను నిర్లక్ష్యం చేసేవారు అంతం వచ్చేసరికి సిద్ధంగా ఉండరు. (మత్తయి 24:​37-39; 1 థెస్సలొనీకయులు 5:⁠2) కాబట్టి, యేసు తన శ్రోతలకు ఇలా చెప్పాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.”​—⁠లూకా 21:​34-36.

మనుష్యకుమారుడైన యేసు ఎదుట ఆమోదించబడిన స్థానంలో ఉన్నవారికే ఈ విధానాంతం నుండి తప్పించుకొనే భావినిరీక్షణ ఉంటుంది. మిగిలివున్న సమయాన్ని మనం యెహోవా దేవుని ఆమోదాన్ని, యేసుక్రీస్తు ఆమోదాన్ని పొందడానికి ప్రయత్నించడంలో సద్వినియోగం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! దేవునికి ప్రార్థిస్తూ యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) కాబట్టి, మీరు యెహోవా దేవుని గురించి, ఆయన కోరుతున్నదానిని గురించి మరింత తెలుసుకోవడమే జ్ఞానయుక్తం. బైబిలు ఏమి బోధిస్తోందో అర్థం చేసుకోవడానికి సహాయం చేయడానికి మీ సమాజంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు. మీరు వారిని సంప్రదించాలని, లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయాలని మేము మిమ్మల్ని స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అంత్యదినాల సూచనలు

గమనార్హమైన సంఘటనలు:

◼ యుద్ధాలు.​—⁠మత్తయి 24:​6, 7.

◼ కరవులు.​—⁠మత్తయి 24:⁠8.

◼ భూకంపాలు.​—⁠మత్తయి 24:⁠8.

◼ తెగుళ్లు.​—⁠లూకా 21:​11.

◼ అక్రమము విస్తరించడం.​—⁠మత్తయి 24:​12.

◼ భూమిని నాశనం చేయడం.​—⁠ప్రకటన 11:​18.

ప్రజలు:

◼ స్వార్థప్రియులు.​—⁠2 తిమోతి 3:⁠2.

◼ ధనాపేక్షులు.​—⁠2 తిమోతి 3:⁠2.

◼ అహంకారులు.​—⁠2 తిమోతి 3:⁠2.

◼ తలిదండ్రులకు అవిధేయులు. ​—⁠2 తిమోతి 3:⁠2.

◼ కృతజ్ఞతలేనివారు.​—⁠2 తిమోతి 3:⁠2.

◼ విశ్వాసఘాతకులు. ​—⁠2 తిమోతి 3:⁠2, NW.

◼ అనురాగరహితులు. ​—⁠2 తిమోతి 3:⁠3.

◼ అజితేంద్రియులు.​—⁠2 తిమోతి 3:⁠3.

◼ క్రూరులు.​—⁠2 తిమోతి 3:⁠3.

◼ సుఖానుభవము ప్రేమించువారు.​—⁠2 తిమోతి 3:⁠4.

◼ మత వేషధారులు.​—⁠2 తిమోతి 3:⁠5.

సత్యారాధకులు:

◼ జ్ఞానం అధికంగా ఉంటుంది. ​—⁠దానియేలు 12:⁠4, NW.

◼ ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తారు.​—⁠మత్తయి 24:​14.

[చిత్రసౌజన్యం]

UNITED NATIONS/Photo by F. GRIFFING