కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మహా సభవారిని పిలువనంపించారు’

‘మహా సభవారిని పిలువనంపించారు’

‘మహా సభవారిని పిలువనంపించారు’

ప్ర ధానయాజకుడు, యూదుల అధికారులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు గురించి పుట్టిన కోలాహలాన్ని శాంతింపజేయడానికి వారేమి చేయగలరు? వారు ఆయనను చంపించడంలో సఫలులయ్యారు, కానీ ఇప్పుడు యేసు శిష్యులు, ఆయన పునరుత్థానం గురించి యెరూషలేము పట్టణమంతా చెబుతున్నారు. వారిని ఆపడమెలా? అది నిర్ణయించడానికే, ప్రధానయాజకుడు ఆయన సహాయకులు యూదుల అత్యున్నత న్యాయస్థానమైన ‘మహా సభవారిని పిలువనంపించారు.’​—⁠అపొస్తలుల కార్యములు 5:​21.

ఆ సంఘటన జరిగే సమయానికి మొదటి శతాబ్దపు ఇశ్రాయేలుపై రోమా అధిపతియైన పొంతి పిలాతుకు సర్వాధికారం ఉంది. కానీ ఆ మహాసభ పిలాతుతో ఎలా సంప్రదింపులు జరిపింది? వారి అధికారం క్రిందకు వచ్చే ప్రాంతాలేవి? మహాసభలో ఎవరెవరు సభ్యులుగా ఉండవచ్చు? అది ఎలా పనిచేస్తుంది?

మహాసభ వృద్ధి చెందడం

‘మహాసభ’ లేక ‘సెన్హెడ్రిన్‌’ అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “కలిసి కూర్చోవడం” అని అర్థం. సాధారణంగా అది సభను లేదా కూటాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది. యూదుల సంప్రదాయంలో ఆ పదం సాధారణంగా మత సంబంధమైన న్యాయవిచారణా గుంపును లేదా న్యాయస్థానాన్ని సూచిస్తుంది.

సా.శ. 70లో యెరూషలేము నాశనమైన తర్వాతి శతాబ్దాల్లో కూర్చబడిన యూదుల ఉపదేశ గ్రంథమైన టాల్ముడ్‌ను వ్రాసినవారు ఆ మహాసభను ఒక ప్రాచీన కూటమిగా చిత్రీకరించారు. యూదా ధర్మశాస్త్రపు విషయాల్ని చర్చించడానికి విద్వాంసులు ఆ సభలో కూడుకొనేవారని, ఆ ఏర్పాటు మోషే ఇశ్రాయేలీయుల సమస్యలను విచారించేందుకు 70 మంది పెద్దలను సమకూర్చినప్పటిదని వారు ఊహించారు. (సంఖ్యాకాండము 11:​16, 17) ఆ ఊహ తప్పని చరిత్రకారులు చెబుతున్నారు. ఇశ్రాయేలు పర్షియా అధీనంలోకి వచ్చిన తర్వాతే మొదటి శతాబ్దంలోని మహాసభను పోలిన కూటమి రూపుదిద్దుకుందని వారు అంటున్నారు. టాల్ముడ్‌ను వ్రాసిన విద్యావేత్తల వర్ణన యూదుల మహాసభను కాదుకానీ రెండవ, మూడవ శతాబ్దాల్లోని యూదుల ముఖ్యాధిపతుల సభలను సూచిస్తోందని కూడా చరిత్రకారులు అంటున్నారు. అయితే మహాసభ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?

సా.శ.పూ. 537లో బబులోను నుండి యూదాకు తిరిగి వచ్చినవారు దేశవ్యాప్తంగా పనిచేసే పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారని బైబిలు వెల్లడి చేస్తోంది. బహుశా మున్ముందు రూపొందే మహాసభ సభ్యులుగా ఉండబోయే అధిపతుల, పెద్దల, ప్రధానుల, అధికారుల గురించి నెహెమ్యా, ఎజ్రాలు ప్రస్తావించారు.​—⁠ఎజ్రా 10:8; నెహెమ్యా 5:⁠7.

హెబ్రీ లేఖనాలు పూర్తి చేయబడినప్పటినుండి మత్తయి సువార్త వ్రాయబడేంతవరకు యూదులు సంక్షోభిత సమయాన్ని ఎదుర్కొన్నారు. సా.శ.పూ. 332లో అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ యుదాను స్వాధీనం చేసుకున్నాడు. అలెగ్జాండర్‌ మరణించిన తర్వాత, యూదా రెండు గ్రీకు రాజ్యాల అధికారం క్రిందికి అంటే, ముందు టోలమీల పరిపాలన క్రిందికి, ఆ తర్వాత సెల్యూసిడ్‌ల పరిపాలన క్రిందకు వచ్చింది. సా.శ.పూ. 198లో ఆరంభమైన సెల్యూసిడ్‌ల పరిపాలనా వృత్తాంతాల్లో యూదుల సభ గురించి మొదటిసారిగా ప్రస్తావించబడింది. ఆ సభకు అధికారం బహుశా పరిమితంగా ఉండేది, అయినప్పటికీ ఆ ఏర్పాటు యూదులకు స్వయం పరిపాలనా స్వరూపాన్నిచ్చింది.

సా.శ.పూ. 167లో సెల్యూసిడ్‌ చక్రవర్తియైన ఆంటియోకస్‌ IV (ఎపిఫానెసు) గ్రీకు సంస్కృతిని యూదులపై రుద్దేందుకు ప్రయత్నించాడు. అతను యెరూషలేములోని బలిపీఠముపై జియస్‌కు పందిని అర్పించి ఆ ఆలయాన్ని అపవిత్రపరిచాడు. ఇది మక్కబీయుల తిరుగుబాటుకు నడిపించగా, వారు సెల్యూసిడ్‌ పరిపాలన నుండి స్వతంత్రులై హస్మోనియన్‌ రాజ్యాన్ని ఏర్పర్చుకున్నారు. * అదే సమయంలో, ఆ తిరుగుబాటు చేసినవారికి మద్దతిచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు యాజకుల అధికారాల్ని కాలరాసి ప్రభుత్వ పరిపాలనలో అధికారం సంపాదించుకున్నారు.

గ్రీకు లేఖనాల్లో వర్ణించబడిన మహాసభ రూపుదిద్దుకుంటోంది. అది జాతీయ కార్యనిర్వాహక సభగా, యూదా ధర్మశాస్త్రాన్ని బోధించే అత్యున్నత న్యాయవిచారణా సభగా మారనుంది.

సమతుల్యమైన అధికారం

మొదటి శతాబ్దానికల్లా, యూదా రోమా అధికారం క్రిందికి వచ్చింది. అయినా, యూదులకు కొంతమేరకు స్వేచ్ఛ ఉండేది. ప్రజలు కోరుకునే ప్రభుత్వాన్ని ఏర్పర్చుకోవడానికి వారికి కొంతమేరకు స్వేచ్ఛనివ్వడం రోమా సిద్ధాంతం. సంస్కృతులు వేరైనందువల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి రోమా అధికారులు స్థానిక న్యాయస్థానాల కార్యనిర్వహణలో అంతగా జోక్యం చేసుకునేవారు కాదు. వారి ఆచారాలను పాటించుకునేందుకు, వారే స్వంతగా పరిపాలించుకునేందుకు అనుమతించడం ద్వారా శాంతిని నెలకొల్పేందుకు, వివిధ ప్రాంతాల అధికారుల్లో విశ్వసనీయతను పెంపొందించేందుకు రోమన్లు అలా చేశారు. మహాసభలో అత్యున్నత స్థానంలో సేవచేయాల్సిన ప్రధానయాజకుణ్ణి నియమించే విషయంలో, తొలగించే విషయంలో, పన్నులు విధించి మాఫీ చేసే విషయంలో, అలాగే తమ సర్వాధిపత్యానికి, తమ ప్రయోజనార్థమైన విషయాలు మినహా రోమన్లు యూదులకు సంబంధించిన మరే వ్యవహారాల్లోనూ తలదూర్చేవారు కాదు. యేసును న్యాయవిచారణ చేసిన సందర్భంలో తమ నియమాల ప్రకారం మరణశిక్ష విధించే అధికారాన్ని రోమన్లు ఉపయోగించలేదన్నట్లు కనబడుతుంది.​—⁠యోహాను 18:​31.

ఆ విధంగా ఆ మహాసభ యూదుల ఆంతరంగిక వ్యవహారాలను నిర్దేశించేది. నేరస్థులను బంధించేందుకు ఆ సభకు బంట్రౌతులు ఉండేవారు. (యోహాను 7:​32) రోమన్ల ప్రమేయం లేకుండా క్రింది న్యాయస్థానాలు చిన్నచిన్న నేరాలను, పౌర సమస్యలను పరిష్కరించేవి. క్రింది కోర్టు ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు అది మహాసభకు పంపించబడేది, అక్కడే అంతిమ తీర్పు విధించబడేది.

తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ మహాసభలోనివారు శాంతిని కాపాడుతూ రోమా అధికారానికి మద్దతిస్తూ ఉండాలి. అయితే, రాజకీయ నేరాలు జరిగాయని అనుమానం కలిగినప్పుడు రోమన్లు జోక్యం చేసుకుని వాటికి తగిన తీర్పునిచ్చేవారు. అలాంటివాటిలో ఒకటి అపొస్తలుడైన పౌలును బంధించడం.​—⁠అపొస్తలుల కార్యములు 21:​31-40.

న్యాయస్థానంలో సభ్యత్వం

మహాసభలో ప్రధానయాజకుడు, దేశంలోని 70 మంది ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు, అంటే మొత్తం 71 మంది. రోమా కాలంలో, మహాసభలో యాజకుల వంశానికి చెందిన ప్రధానులు (ముఖ్యంగా సద్దూకయ్యులు), ప్రజానీకంలోని ప్రముఖులు, పరిసయ్యుల పక్షానవున్న విద్వాంసులైన శాస్త్రులు ఉండేవారు. యాజకుల వంశానికి చెందిన ప్రధానులకు, ప్రజానీకంలోని ప్రముఖులకే న్యాయస్థానంలో పూర్తి అధికారం ఉండేది. * సద్దూకయ్యుల సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలనుకుంటే సామాన్యులైన పరిసయ్యులు విశాల దృక్పథంతో ఆలోచించేవారిగా ఉండేవారు. పరిసయ్యులకు ప్రజల్లో బాగా పలుకుబడి ఉండేది. చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారం, పరిసయ్యులు అడిగేవాటిని సద్దూకయ్యులు అయిష్టంగానే ఒప్పుకునేవారు. వారిమధ్య ఉన్న స్పర్థను, ఈ రెండు గుంపుల నమ్మకాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆధారం చేసుకుని మహాసభ ఎదుట పౌలు తనను తాను సమర్థించుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 23:​6-9.

మహాసభలో ఉన్నత వంశీయులే ఉండడంవల్ల వారి సభ్యత్వం స్థిరమైంది, ఖాళీ అయిన స్థానాల్లో సభ్యులుగా ఉన్నవారే వేరే వ్యక్తులను నియమించేవారు. మిష్నా ప్రకారం, కొత్త సభ్యులయ్యే వ్యక్తులు “యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులై ఉండి, వారి కుమార్తెలు యాజకుల్ని వివాహం చేసుకోవాలి” అంటే తమ వంశక్రమాన్ని రుజువుచేసుకోవడానికి వంశావళికి సంబంధించిన వివరాలు ఇవ్వగలిగేవారిగా ఉండాలి. ఉన్నత న్యాయస్థానం దేశమంతటా ఉన్న న్యాయస్థానాల్ని నియంత్రించేది కాబట్టి, క్రింది న్యాయస్థానాల్లో ఉన్న ప్రముఖుల్లోనుండి కొందరు మహాసభలోని స్థానానికి హెచ్చించబడడం న్యాయసమ్మతంగా ఉండేది.

అధికారం క్రింద ఉన్న ప్రాంతం, అధికారం

యూదులు మహాసభను ఎంతో గౌరవించేవారు, క్రింది న్యాయస్థానాల్లోని న్యాయాధిపతులు అది చేసే నిర్ణయాలకు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సివచ్చేది, లేకపోతే వారికి మరణశిక్ష విధించబడేది. ఆ మహాసభ యాజకుల అర్హతల విషయాల్లో, యెరూషలేము వ్యవహారాల్లో, ఆలయం, ఆలయంలోని ఆరాధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. ఖచ్చితంగా చెప్పాలంటే, మహాసభ అధికారం క్రిందికి వచ్చే ప్రాంతం యూదా మాత్రమే. కానీ, ధర్మశాస్త్రాన్ని బోధించే అత్యున్నత అధికారం ఆ మహాసభకే ఉండేది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల సమాజాలకు సంబంధించిన నైతిక వ్యవహారాల్లో దానికి అధికారం ఉండేది. ఉదాహరణకు, క్రీస్తు అనుచరుల్ని బంధించడంలో సహకరించమని ప్రధానయాజకుడు, అతని సమాలోచక సభ దమస్కులోని సమాజమందిరాల్లోని నాయకుల్ని ఆదేశించారు. (అపొస్తలుల కార్యములు 9:​1, 2; 22:​4, 5; 26:​12) అలాగే, పండుగలకోసం యెరూషలేముకు వచ్చే యూదులు మహాసభ చేసిన నిర్ణయాలను బహుశా తమ స్వదేశాలకు తీసుకుని వెళ్ళేవారు.

మిష్నా ప్రకారం, దేశంలోని ప్రాముఖ్యమైన వ్యవహారాల విషయంలో, దాని నిర్ణయాలను తృణీకరించే న్యాయమూర్తుల విషయంలో, అబద్ధ ప్రవక్తలను శిక్షించే విషయంలో ఆ మహాసభకే అధికారం ఉండేది. యేసు, స్తెఫనులు దైవదూషకులుగా ఆరోపించబడి న్యాయస్థానం ముందుకు తేబడ్డారు, పేతురు యోహానులు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నవారిగా ఆరోపించబడ్డారు, పౌలు ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని ఆరోపించబడ్డాడు.​—⁠మార్కు 14:64; అపొస్తలుల కార్యములు 4:​15-​17; 6:⁠11; 23:1; 24:⁠6.

యేసు, ఆయన శిష్యులపై విధించబడిన తీర్పు

సబ్బాతు దినాలు, పవిత్ర దినాల్లో తప్ప మహాసభ ఉదయకాల హోమం నుండి సాయంత్రపు అర్పణలు జరిగేవరకు ప్రతీరోజు సమావేశమై నిర్ణయాలు తీసుకునేది. కేవలం పగటి వేళలోనే న్యాయవిచారణ చేయబడేది. మరణశిక్షకు సంబంధించిన తీర్పులను న్యాయవిచారణ చేసిన మరుసటి రోజునే ప్రకటించాలి కాబట్టి అలాంటి కేసులను సబ్బాతుకు లేదా పండుగ ముందురోజు సాయంత్రం విచారణ చేసేవారు కాదు. సాక్ష్యం చెప్పేవారికి నిర్దోషుల రక్తం చిందించడంలోని గంభీరతను గురించి గట్టిగా హెచ్చరించేవారు. కాబట్టి, పండుగ ముందురోజు సాయంత్రం కయప ఇంట్లో యేసును న్యాయవిచారణ చేసి, ఆయనకు శిక్ష విధించడం చట్టవిరుద్ధం. ఇంకా ఘోరమైన విషయమేమిటంటే, ఆ న్యాయాధిపతులే అబద్ధ సాక్షులను వెతికి తీసుకొచ్చి, యేసుకు మరణశిక్ష విధించేలా పిలాతును ఒప్పించారు.​—⁠మత్తయి 26:57-59; యోహాను 11:47-53; 19:​31.

టాల్ముడ్‌ చెబుతున్నదాని ప్రకారం, మరణశిక్షార్థమైన నేరాలను విచారణ చేసే న్యాయాధిపతులు ప్రతివాదిని రక్షించే ప్రయత్నంలో సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. అయినప్పటికీ, యేసు విషయంలోలాగే స్తెఫను విషయంలో కూడా అలాంటి న్యాయవిచారణ జరగలేదు. ఆయన మహాసభ ఎదుట చేసిన ప్రతివాదన ఫలితంగా ఆయనను మూకుమ్మడిగా రాళ్ళతో కొట్టి చంపారు. రోమన్లు జోక్యం చేసుకుని ఉండకపోతే, పౌలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే చంపబడేవాడు. నిజానికి, మహాసభలోని న్యాయాధిపతులు ఆయనను చంపడానికి రహస్యంగా పన్నాగాలు పన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 6:⁠12; 7:⁠58; 23:​6-15.

న్యాయస్థానంలో కనీసం కొందరైనా నైతిక సూత్రాలను అనుకరించే వ్యక్తులు ఉన్నారనిపిస్తోంది. యేసుతో మాట్లాడిన యౌవనస్థుడైన యూదా పరిపాలకుడు బహుశా మహాసభలో సభ్యుడై ఉండవచ్చు. ఆయనకు తన సంపద ఆటంకంగా ఉన్నా, యేసు ఆయనను తన అనుచరునిగా ఉండమని ఆహ్వానించాడు కాబట్టి, ఆయనలో మంచి లక్షణాలు ఉండి ఉండవచ్చు.​—⁠మత్తయి 19:​16-22; లూకా 18:​18, 22.

తోటి న్యాయాధిపతులు ఏమనుకుంటారో అనే భయంతో “యూదుల అధికారియైన” నీకొదేము యేసును రాత్రివేళ కలవడానికి వచ్చాడు. అయినా, నీకొదేము మహాసభ ముందు యేసును సమర్థిస్తూ వారిని ఇలా అడిగాడు: “ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా?” యేసు దేహాన్ని సమాధి చేసేందుకు సిద్ధం చేయడానికి నీకొదేము “బోళముతో కలిపిన అగరు” ఇచ్చాడు.​—⁠యోహాను 3:​1, 2; 7:⁠51, 52; 19:​39.

మహాసభలో మరో సభ్యుడైన అరిమతయియ యోసేపు, యేసు శవాన్ని తనకిమ్మని ధైర్యంగా పిలాతును అడిగి, దాన్ని తాను తొలిపించుకున్న కొత్త సమాధిలో పెట్టించాడు. యోసేపు “దేవుని రాజ్యముకొరకు ఎదురు చూ[శా]డు,” కానీ యూదులకు భయపడడంవల్ల తాను యేసు శిష్యుడనని బహిరంగంగా చెప్పుకోలేకపోయాడు. అయినా, యోసేపు ప్రశంసార్హుడే, ఎందుకంటే మహాసభ యేసును చంపించడానికి పన్నిన పథకాన్ని ఆయన ఆమోదించలేదు.​—⁠మార్కు 15:​43-46; మత్తయి 27:​57-60; లూకా 23:​50-53; యోహాను 19:​38.

యేసు శిష్యుల్ని వదిలిపెట్టేయమని మహాసభ సభ్యుడైన గమలీయేలు తన తోటి న్యాయాధిపతులకు జ్ఞానవంతంగా ఉపదేశించాడు. “మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ” అని ఆయన వారితో అన్నాడు. (అపొస్తలుల కార్యములు 5:​34-39) యేసుకు, ఆయన శిష్యులకు దేవుని సహాయం ఉందని ఆ ఉన్నత న్యాయస్థానం ఎందుకు గుర్తించలేకపోయింది? యేసు చేసిన అద్భుతాలను నిజమని అంగీకరించే బదులు ఆ మహాసభ ఇలా తర్కించింది: “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు.” (యోహాను 11:​47, 48) అధికార దాహం ఆ యూదా ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయాన్ని తప్పుదారిపట్టించింది. అదేవిధంగా, యేసు, ఆయన శిష్యులు ప్రజల్ని స్వస్థపరిచినప్పుడు సంతోషించడానికి బదులు, మతనాయకులు “మత్సరముతో నిండుకొ[న్నారు].” (అపొస్తలుల కార్యములు 5:​17) న్యాయాధిపతులు దైవ భయంతో న్యాయంగా ప్రవర్తించాల్సింది, కానీ వారిలో అనేకులు అవినీతిపరులుగా, నిజాయితీలేనివారిగా ఉండేవారు.​—⁠నిర్గమకాండము 18:⁠21; ద్వితీయోపదేశకాండము 16:​18-20.

దైవిక తీర్పు

ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించి, మెస్సీయను నిరాకరించారు కాబట్టి, యెహోవా తాను ఎన్నుకున్న ప్రజలుగా ఉండకుండా ఆ జనాంగాన్ని తిరస్కరించాడు. సా.శ. 70లో రోమన్లు యెరూషలేము పట్టణాన్ని, ఆలయాన్ని నాశనం చేసి, యూదా విధానమే లేకుండా చేశారు, చివరకు మహాసభ కూడా ఉనికిలో లేకుండా పోయింది.

మొదటి శతాబ్దంలోని మహాసభలో ఎవరు పునరుత్థానం చేయబడడానికి అర్హులో, వారిలో ఎవరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశారో యెహోవా నియమించిన న్యాయాధిపతియైన యేసుక్రీస్తు నిర్ణయిస్తాడు. (మార్కు 3:⁠29; యోహాను 5:​22) అలాంటి నిర్ణయాలు చేయడంలో యేసుక్రీస్తు సంపూర్ణ న్యాయంతో వ్యవహరిస్తాడని మనం నమ్మవచ్చు.​—⁠యెషయా 11:​3-5.

[అధస్సూచీలు]

^ పేరా 9 మక్కబీయులు, హస్మోనియన్లకు సంబంధించిన సమాచారం కోసం కావలికోట నవంబరు 15, 1998, 21-4 పేజీలను, జూన్‌ 15, 2001, 27-30 పేజీలను చూడండి.

^ పేరా 16 బైబిలు “ప్రధానయాజకుల” గురించి మాట్లాడినప్పుడు, అది పేర్కొనబడిన కాలంలో లేదా గతంలో ప్రధానయాజకులుగా సేవ చేసినవారిని, భవిష్యత్తులో యాజకుల స్థానాన్ని భర్తీ చేయడానికి అర్హతలున్న యాజకుల కుటుంబ సభ్యుల్ని సూచిస్తుంది.​—⁠మత్తయి 21:​23.