కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టికర్త అనుగ్రహించిన శాశ్వత బహుమానం

సృష్టికర్త అనుగ్రహించిన శాశ్వత బహుమానం

సృష్టికర్త అనుగ్రహించిన శాశ్వత బహుమానం

ఏ గ్రహంలోనైనా జీవం ఉనికిలో ఉండడానికి అత్యావశ్యకమని శాస్త్రజ్ఞులు పరిగణించే అంశాలే బైబిల్లోని మొదటి అధ్యాయంలో వివరించబడడం లేక సూటిగా ప్రస్తావించబడడం మీకు ఆశ్చర్యం కలిగించడంలేదా? ఆ అంశాలేమిటి?

ఒక గ్రహంమీద జీవం వర్ధిల్లాలంటే ఆదికాండము 1:⁠2లో పేర్కొనబడినట్లు, నీరు ఎక్కువ పరిమాణంలో ఉండాలి. గ్రహంమీద ఉన్న నీళ్లు ద్రవరూపంలో ఉండడానికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. దాని కోసం ఆ గ్రహం సూర్యుని నుండి సరైన దూరంలో ఉండాలి. ఆదికాండము వృత్తాంతం సూర్యుని గురించి, భూమ్మీద అది చూపించే ప్రభావం గురించి పదేపదే వివరిస్తోంది.

ఒక గ్రహంమీద మానవులు నివసించాలంటే దానిలో నిర్దిష్ట వాయువుల మిశ్రమం ఉన్న వాతావరణం ఉండాలి. ఆ ప్రాముఖ్యమైన అంశం ఆదికాండము 1:​6-8లో వివరించబడింది. ఆదికాండము 1:​11, 12లో వర్ణించబడినట్లుగా మొక్కలు మొలకెత్తడంవల్ల ఆమ్లజని సమృద్ధిగా ఉంటుంది. అనేక రకాల జంతుజాతులు ఒక గ్రహంమీద వర్ధిల్లాలంటే ఆదికాండము 1:​9-12లో వర్ణించబడినట్లు ఆరిన, సారవంతమైన నేల ఉన్న ఖండాలు ఉండాలి. చివరకు ఒక గ్రహమ్మీద సరైన వాతావరణం ఉండాలంటే అది సరైన కోణంలో స్థిరంగా ఒరిగివుండాలి, భూమి విషయానికొస్తే అది అలా స్థిరంగా ఉండేందుకు మన చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కొంతవరకు దోహదపడుతుంది. ఈ ఉపగ్రహం ఉనికి గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆదికాండము 1:​14, 16 వచనాలు వివరిస్తున్నాయి.

ప్రాచీన రచయితయైన మోషేకు ఆధునిక విజ్ఞానశాస్త్రం గురించి తెలియకపోయినా పై అంశాలను ఎలా వివరించగలిగాడు? తన సమకాలీనులకు భిన్నంగా వాటి ప్రాముఖ్యతను గుర్తించే అసాధారణ సామర్థ్యం మోషేకు ఉందా? పరలోకాన్ని, భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయనను ప్రేరేపించాడు కాబట్టే ఆయన అలా వివరించగలిగాడు. ఆదికాండము వృత్తాంతం విజ్ఞానశాస్త్రపరంగా ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఆయన అలా ప్రేరేపించబడ్డాడన్నది గమనార్హమైన విషయం.

మన చుట్టూ ఉన్న విశ్వంలో మనం చూసే అద్భుతాలు సృష్టించబడడానికి ఒక సంకల్పముందని బైబిలు నొక్కిచెబుతోంది. “ఆకాశములు యెహోవావశము, భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు” అని కీర్తన 115:​16 పేర్కొంటోంది. మరో కీర్తన ఇలా పేర్కొంటోంది: “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.” (కీర్తన 104:5) ఒక సృష్టికర్త ఈ విశ్వంతోపాటు, మన అందమైన గ్రహాన్ని రూపొందించి సృష్టించాడంటే, వాటిని కాపాడే సామర్థ్యం కూడా ఆయనకుందని నమ్మడం సముచితమే. అందుకే మీరు ఈ అద్భుతమైన వాగ్దాన నెరవేర్పు కోసం నమ్మకంతో ఎదురుచూడవచ్చు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) నిజమే, దేవుడు “[భూమిని] నిరాకారముగానుండునట్లు . . . సృజింపలేదు” గానీ ఆయన కార్యాలను గుర్తించే కృతజ్ఞతగల మానవులకు “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.”​—⁠యెషయా 45:​18.

దేవుని గురించి, విధేయులైన మానవజాతికి నిత్యజీవం అనుగ్రహించాలనే ఆయన సంకల్పం గురించి మనకు బోధించడానికి యేసు భూమ్మీదకు వచ్చాడని లేఖనాలు చెబుతున్నాయి. (యోహాను 3:​16) త్వరలో దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేస్తాడు,” కానీ రక్షణ కోసం తాను చేసిన ఏర్పాటును అంగీకరించే అన్ని జనాంగాలకు చెందిన శాంతికాముకులైన మానవులను ఆయన రక్షిస్తాడు అనే హామీ మనకివ్వబడింది. (ప్రకటన 7:​9, 14; 11:​18) దేవుని సృష్టిలోని అద్భుతాలను మానవులు నిరంతరం అన్వేషిస్తూ వాటిని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా!​—⁠ప్రసంగి 3:​11; రోమీయులు 8:​20.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

NASA photo