కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు జతపరచినవారిని వేరుచేయకూడదు

దేవుడు జతపరచినవారిని వేరుచేయకూడదు

దేవుడు జతపరచినవారిని వేరుచేయకూడదు

“వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”​—⁠మత్తయి 19:⁠6.

మీరు కారులో సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమౌతున్నట్లు ఊహించుకోండి. దారిలో మీకు సమస్యలు ఎదురౌతాయా? ఎదురుకావని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది! ఉదాహరణకు, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురుకావచ్చు, దానితో మీరు వేగం తగ్గించి, జాగ్రత్తగా వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఏదైనా ఒకచోట, మీకైమీరు బాగుచేసుకోలేని యాంత్రిక సమస్య ఏర్పడి, కారును రోడ్డు ప్రక్కకు నెట్టి సహాయం కోసం చూసే పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితులు, అసలు ప్రయాణం పెట్టుకోవడమే తప్పని, ఆ కారును వదిలించుకుంటే మంచిదని మీరు భావించేలా చేస్తాయా? లేదు. దూర ప్రయాణాలప్పుడు సమస్యలు వస్తాయని ఎదురుచూస్తూనే, వాటితో వ్యవహరించే మార్గాల కోసం మీరు జ్ఞానయుక్తంగా ప్రయత్నిస్తారు.

2 వివాహం విషయంలో కూడా అంతే. సమస్యలు వస్తాయి, వివాహం చేసుకోవాలని తలంచే జంట, జీవితం పూలపాన్పులా ఉంటుందని ఎదురుచూడడం మూర్ఖత్వమే అవుతుంది. భార్యాభర్తలకు “శరీరసంబంధమైన శ్రమలు కలుగును” అని 1 కొరింథీయులు 7:⁠28లో బైబిలు స్పష్టంగా చెబుతోంది. ఎందుకు? ఎందుకో క్లుప్తంగా చెప్పాలంటే, భార్యాభర్తలిద్దరూ అపరిపూర్ణులు, పైగా మనం “అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నాం. (2 తిమోతి 3:⁠1; రోమీయులు 3:​23) కాబట్టి, అన్యోన్యంగా జీవించే సామర్థ్యమున్న, ఆధ్యాత్మిక దృక్కోణమున్న దంపతులు సహితం అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.

3 ఆధునిక ప్రపంచంలో దంపతులు కొందరు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, వారి మొదటి ప్రతిక్రియ వివాహ బంధాన్ని తెంచుకోవాలన్నదే. చాలా దేశాల్లో, విడాకులు తీసుకునేవారి సంఖ్య అంతకంతకు అధికమౌతోంది. అయితే నిజ క్రైస్తవులు తొందరపడి విడాకులకు ప్రయత్నించే బదులు సమస్యలను పరిష్కరించుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వారు వివాహాన్ని యెహోవా తమకిచ్చిన పవిత్ర బహుమానంగా పరిగణిస్తారు. దంపతుల గురించి యేసు ఇలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్తయి 19:⁠6) నిజమే, ఆ ప్రమాణం ప్రకారం జీవించడం అన్ని సందర్భాల్లోనూ సులభం కాదు. ఉదాహరణకు, బైబిలు సూత్రాలు తెలియని వివాహ సలహాదారులతోపాటు బంధువులు, ఇతరులు లేఖన విరుద్ధంగా విడిపొమ్మనో లేదా విడాకులు తీసుకొమ్మనో తరచూ దంపతులను ప్రోత్సహిస్తారు. * అయితే తొందరపడి వివాహ బంధాన్ని తెంచుకునే బదులు దానిని బాగుచేసుకొని, కాపాడుకోవడమే ఉత్తమమని క్రైస్తవులకు తెలుసు. అవును, మొదట మనం ఇతరుల ఉపదేశం ప్రకారం కాదుగానీ యెహోవా పద్ధతిలో పనులు చేసేందుకు తీర్మానించుకోవడం ప్రాముఖ్యం.​—⁠సామెతలు 14:​12.

ఇబ్బందులను అధిగమించడం

4 వాస్తవానికి అన్ని వివాహాల్లో సమస్యా పరిష్కారానికి అప్పుడప్పుడు ప్రత్యేక శ్రద్ధనివ్వడం అవసరం. అలా చేయడంలో, చాలా సందర్భాల్లో చిన్న చిన్న అభిప్రాయభేదాలను పరిష్కరించడం ఇమిడివుంటుంది. అయితే కొన్ని వివాహాల్లో, ఆ బంధపు పునాదినే ప్రమాదంలో పడేసే మరింత తీవ్రమైన సవాళ్లు ఎదురుకావచ్చు. ఆయా సమయాల్లో, మీరు అనుభవజ్ఞుడైన వివాహిత క్రైస్తవ పెద్దనుండి సహాయం కోరవలసి ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల అర్థం మీ వివాహం విఫలమైందని కాదు. అవి కేవలం సమస్యా పరిష్కారంలో బైబిలు సూత్రాలను ఖచ్చితంగా పాటించవలసిన ప్రాముఖ్యతను నొక్కిచెబుతాయి.

5 మానవజాతి సృష్టికర్తగా, వివాహ ఏర్పాటుకు మూలకర్తగా యెహోవాకు, విజయవంతమైన వైవాహిక బంధానికి మనకేమి అవసరమో వేరెవరికన్నా ఎక్కువ తెలుసు. ప్రశ్నేమిటంటే, ఆయన వాక్యోపదేశాన్ని విని దానికి లోబడతామా? అలా చేస్తే మనం నిశ్చయంగా ప్రయోజనం పొందుతాం. యెహోవా తన పూర్వకాల ప్రజలతో ఇలా అన్నాడు: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:​18) బైబిల్లోని మార్గనిర్దేశకాలకు హత్తుకొని ఉండడం వివాహ బంధాన్ని విజయవంతం చేయగలదు. భర్తలకు బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని మనం మొదట పరిశీలిద్దాం.

‘మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి’

6 అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో భర్తలకు స్పష్టమైన మార్గనిర్దేశాలు ఉన్నాయి. పౌలు ఇలా వ్రాశాడు: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి [‘ప్రేమిస్తూ ఉండండి’ NW] అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను.”​—⁠ఎఫెసీయులు 5:​25, 28, 29, 33.

7 భార్యాభర్తల మధ్య ఉత్పన్నమవగల ప్రతీ సమస్యను పౌలు చర్చించడం లేదు. బదులుగా, ఆయన ప్రతీ క్రైస్తవ వివాహ పునాదిలో ప్రముఖ భాగమైన ప్రేమను ప్రత్యేకంగా సూచించడం ద్వారా ఆయన ప్రాథమిక పరిష్కార మార్గాన్ని ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి పై వచనాల్లో ప్రేమ ఆరుసార్లు ప్రస్తావించబడింది. పౌలు భర్తలకు, ‘మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి’ అని చెప్పడాన్ని కూడా గమనించండి. ప్రేమలో నిలిచి ఉండడంకన్నా ప్రేమలో పడడం బహుశా చాలా సులభమని పౌలు నిస్సందేహంగా గుర్తించాడు. చాలామంది “స్వార్థప్రియులుగా,” “అతిద్వేషులుగా” ఉన్న ఈ “అంత్యదినములలో” ఇది ప్రత్యేకంగా వాస్తవం. (2 తిమోతి 3:​1-3) అలాంటి అనుచిత లక్షణాలు నేడు అనేక వివాహాలను నాశనం చేస్తున్నాయి, అయితే ప్రేమగల భర్త ప్రాపంచిక స్వార్థపూరిత లక్షణాలు తన ఆలోచనను, క్రియలను ప్రభావితం చేసేందుకు అనుమతించడు.​—⁠రోమీయులు 12:⁠2.

మీ భార్యను మీరెలా పోషించవచ్చు?

8 మీరు క్రైస్తవ భర్త అయితే, స్వార్థపూరిత స్వభావాన్ని విడిచిపెట్టి మీ భార్యపట్ల యథార్థమైన ప్రేమను ఎలా కనబర్చవచ్చు? ఎఫెసీయులను ఉద్దేశించి, ముందు ఉదాహరించబడిన తన మాటల్లో మీరు చేయవలసిన రెండు విషయాలను అంటే మీ భార్యను పోషించడమే కాక, మీ సొంత శరీరంలాగే ఆమెను సంరక్షించాలని కూడా పౌలు సూచించాడు. మీ భార్యను మీరెలా పోషించవచ్చు? మీ భార్యకు అవసరమైనవాటిపట్ల శ్రద్ధ చూపించడం ద్వారా అలా చేయవచ్చు. పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాసత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేనివాడికంటే చెడ్డవాడు.”​—⁠1 తిమోతి 5:⁠8, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

9 అయితే దీనిలో కేవలం ఆహారం, వస్త్రాలు, నివాసం సమకూర్చడంకన్నా ఎక్కువే చేరివుంది. ఎందుకు? ఎందుకంటే, ఓ భర్త తన భార్య భౌతికావసరాలు చక్కగా తీర్చినా ఆమె భావోద్రేక, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చలేకపోతుండవచ్చు. ఈ చివరి రెండు అవసరాలు తీర్చడం ఆవశ్యకం. నిజమే, చాలామంది క్రైస్తవ పురుషులు సంఘ సంబంధ విషయాలపట్ల శ్రద్ధ చూపించడంలో నిమగ్నమై ఉన్నారు. కానీ బరువైన సంఘ బాధ్యతలను కలిగివుండడమంటే కుటుంబ శిరస్సుగా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను భర్త నిర్లక్ష్యం చేయాలని కాదు. (1 తిమోతి 3:​5, 12) ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ఈ పత్రికే కొన్ని సంవత్సరాల క్రితం ఈ క్రింది విధంగా చెప్పింది: “బైబిలు అవసరతల ప్రకారము, ‘కాపరిపని ఇంటియొద్దనే ఆరంభమగునని’ చెప్పవచ్చును. ఒకపెద్ద తన కుటుంబమును నిర్లక్ష్యము చేసినట్లయిన, తన నియామకమునే ప్రమాదములో పడవేసుకొనగలడు.” * కాబట్టి, మీ భార్య భౌతిక, భావోద్రేక, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపించడం అత్యావశ్యకం.

మీ భార్యను సంరక్షించడమంటే అర్థమేమిటి?

10 మీ భార్యను మీరు సంరక్షిస్తుంటే, మీరు ఆమెను ప్రేమిస్తున్నారు కాబట్టే ఆమెపట్ల చక్కగా శ్రద్ధ చూపిస్తారు. మీరు ఈ విధంగా సంరక్షించగల విధానాలు చాలా ఉన్నాయి. మొదటిది, మీ జతతో తగినంత సమయం గడపండి. ఈ విషయంలో మీరు మీ భార్యను నిర్లక్ష్యంచేస్తే, మీ పట్ల ఆమెకున్న ప్రేమ సన్నగిల్లిపోవచ్చు. అలాగే, ఆమెకు అవసరమని మీరు తలంచే సమయం, శ్రద్ధ తన అవసరాలుగా ఆమె భావించకపోవచ్చనే విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. భార్యను సంరక్షిస్తున్నానని చెప్పడం మాత్రమే సరిపోదు. తాను సంరక్షించబడుతున్నట్లు మీ భార్య భావించాలి. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:​24) ప్రేమించే భర్తగా మీరు, మీ భార్య అసలు అవసరాలేమిటో అర్థం చేసుకోవాలని కోరుకుంటారు.​—⁠ఫిలిప్పీయులు 2:⁠4.

11 మీ భార్యను సంరక్షిస్తున్నారని చూపించే మరో విధానం, మీ మాటల్లో చేతల్లో ఆమెపట్ల ఆప్యాయతను వ్యక్తం చేయడం. (సామెతలు 12:​18) పౌలు కొలొస్సయులకు ఇలా వ్రాశాడు: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.” (కొలొస్సయులు 3:​19) ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం పౌలు పలికిన చివరి మాటల్ని సహజవాడుకలో “ఆమెను పనిమనిషిగా చూడొద్దు” లేదా “ఆమెను బానిసను చేయొద్దు” అని అనువదించవచ్చు. ఏకాంతంలో లేదా అందరిలో నిరంకుశునిగా ప్రవర్తించే భర్త నిశ్చయంగా తన భార్యను సంరక్షిస్తున్నట్లు చూపించలేడు. భార్యను కఠినంగా చూడడం ద్వారా ఆయన దేవునితో తన సంబంధాన్ని ప్రమాదంలో పడేసుకుంటాడు. అపొస్తలుడైన పేతురు భర్తలకిలా వ్రాశాడు: “జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” *​—⁠1 పేతురు 3:⁠7.

12 మీ భార్య ప్రేమను ఎన్నటికీ తేలికగా తీసుకోకండి. ఆమెను మీరు ప్రేమిస్తూ ఉంటారనే హామీ ఇవ్వండి. క్రైస్తవ సంఘంతో వ్యవహరించిన తీరులో, క్రైస్తవ భర్తలకు యేసు ఒక మాదిరినుంచాడు. ఆయన అనుచరులు పదేపదే అనుచిత లక్షణాలను కనబర్చినప్పుడు కూడా ఆయన మృదువుగా, దయపూర్వకంగా క్షమాగుణంతో వ్యవహరించాడు. అందుకే యేసు ఇతరులకు ఇలా చెప్పగలిగాడు: “నా యొద్దకు రండి . . . నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను . . . మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్తయి 11:​28, 29) యేసు సంఘంతో ఎలా వ్యవహరించాడో, అలాగే యేసును అనుకరించే క్రైస్తవ భర్త తన భార్యతో వ్యవహరిస్తాడు. తన భార్యను నిజంగా సంరక్షిస్తూ, దానిని తన మాటల్లో, క్రియల్లో చూపించే భర్త ఆమెకు నిజమైన సేదదీర్పునిచ్చే మూలాధారంగా ఉంటాడు.

బైబిలు సూత్రాల ప్రకారం జీవించే భార్యలు

13 భార్యలకు సహాయం చేయగల సూత్రాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఎఫెసీయులు 5:​22-24, 33 ఇలా చెబుతోంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. . . . భార్యయైతే తన భర్తయందు భయము [‘ప్రగాఢ గౌరవము,’ NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.”

14 పౌలు విధేయతను, గౌరవాన్ని నొక్కిచెప్పడాన్ని గమనించండి. భర్తకు విధేయత చూపించాలని భార్యకు గుర్తుచేయబడింది. ఇది దేవుని ఏర్పాటుకు అనుగుణంగా ఉంది. భూమ్యాకాశాల్లోని జీవరాశులన్నీ ఎవరో ఒకరికి లోబర్చబడ్డాయి. యేసు సహితం యెహోవా దేవునికి లోబడ్డాడు. (1 కొరింథీయులు 11:⁠3) సరైన రీతిలో తన శిరస్సత్వం నిర్వహించే భర్త, భార్య తనకు విధేయత చూపించడాన్ని సులభతరం చేస్తాడు.

15 భార్య ‘తన భర్తపట్ల ప్రగాఢ గౌరవం చూపించాలని’ కూడా పౌలు చెప్పాడు. క్రైస్తవ భార్య ‘సాధువైన, మృదువైన గుణాన్ని’ కనబర్చాలే తప్ప, తన భర్త అధికారాన్ని అహంకారంతో ధిక్కరించకూడదు లేదా స్వేచ్ఛా విధానాన్ని అవలంబించకూడదు. (1 పేతురు 3:⁠4) దైవభక్తిగల భార్య తన కుటుంబ మేలుకోసం కష్టపడి పనిచేస్తూ తన భర్తకు గౌరవం తెస్తుంది. (తీతు 2:​3-5) ఆమె తన భర్త గురించి సానుకూలంగా మాట్లాడేందుకు కృషిచేస్తూ, ఇతరులు ఆయనను అవమానపర్చేలా చేసే పనేదీ ఆమె చేయదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయవంతమయ్యేందుకు కూడా ఆమె కృషిచేస్తుంది.​—⁠సామెతలు 14:⁠1.

16 క్రైస్తవ స్త్రీ సాధువైన, మృదువైన గుణం కలిగివుండాలంటే దానర్థం, ఆమె అభిప్రాయాలు లేదా ఆమె ఆలోచన అప్రాముఖ్యమని కాదు. శారా, రిబ్కాలాంటి దైవభక్తిగల ప్రాచీనకాల స్త్రీలు తమకు చింత కలిగించిన విషయాల గురించి మాట్లాడేందుకు చొరవ తీసుకున్నారు, వారి చర్యలను యెహోవా ఆమోదించినట్లు బైబిలు నివేదిక చూపిస్తోంది. (ఆదికాండము 21:​8-12; 27:46-28:⁠4) క్రైస్తవ భార్యలు కూడా తమ భావాలను వ్యక్తపర్చవచ్చు. అయితే వారు అవమానపరిచే స్వరంతో కాదుగానీ జాగ్రత్తగా ఆలోచించి వాటిని వ్యకపర్చాలి. అలాంటి సంభాషణకు తమ భర్తలు మరింత సంతోషంగా, సానుకూలంగా స్పందించడాన్ని బహుశా వారు చూడవచ్చు.

నిబద్ధత పోషించే పాత్ర

17 వివాహమనేది జీవితపర్యంతం సాగే నిబద్ధత. కాబట్టి, వివాహాన్ని విజయవంతం చేసుకోవాలనే నిజమైన కోరిక భార్యాభర్తలిరువురికీ ఉండాలి. అరమరికల్లేకుండా సంభాషించకపోవడం సమస్యలు పెరిగేందుకు, అవి తీవ్రమయ్యేందుకు కారణమౌతుంది. సమస్యలొచ్చినప్పుడు తరచూ దంపతులు మాట్లాడుకోవడం మానేస్తారు, దానితో ద్వేషం పెరుగుతుంది. కొందరు భాగస్వాములు బహుశా వివాహేతర ప్రణయాసక్తిని పెంచుకుంటూ, తమ వివాహ బంధాన్ని తెంచుకునే మార్గాలను సహితం అన్వేషిస్తారు. యేసు ఇలా హెచ్చరించాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”​—⁠మత్తయి 5:​28.

18 అపొస్తలుడైన పౌలు వివాహిత క్రైస్తవులతోపాటు క్రైస్తవులందరికీ ఇలా హితవు చెప్పాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫెసీయులు 4:​26, 27) మన ముఖ్య శత్రువైన సాతాను, క్రైస్తవుల మధ్య పొడచూపగల అభిప్రాయభేదాలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. విజయం సాధించేందుకు అతనికి అవకాశమివ్వకండి! సమస్యలు వచ్చినప్పుడు, బైబిలు ఆధారిత ప్రచురణలు ఉపయోగిస్తూ ఆ విషయంపై యెహోవా దృష్టికోణం గురించి బైబిలు ఏమి చెబుతోందో పరిశీలించండి. అభిప్రాయభేదాల్ని ప్రశాంతంగా, నిజాయితీగా చర్చించుకోండి. యెహోవా ప్రమాణాల గురించి మీకు తెలిసిన దానికి, మీ క్రియలకు మధ్య ఏదైనా అంతరం ఉంటే దాన్ని తొలగించుకోండి. (యాకోబు 1:​22-25) మీ వివాహానికి సంబంధించి, దంపతులుగా దేవునితో నడవాలని తీర్మానించుకొని, దేవుడు జతపరచిన మిమ్మల్ని ఏదీ లేక ఎవరూ వేరుచేసేందుకు అనుమతించకండి!​—⁠మీకా 6:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 2002 సంచిక 10వ పేజీలోని “విడాకులు, విడిపోవడం” అనే బాక్సు చూడండి.

^ పేరా 14 కావలికోట ఫిబ్రవరి 1, 1990 సంచిక 23వ పేజీ చూడండి.

^ పేరా 17 క్రైస్తవ సంఘంలోని ఆధిక్యతలకు అర్హుడయ్యేందుకు, ఒక పురుషుడు ‘కొట్టేవాడై ఉండకూడదు’ అంటే ఇతరులపై భౌతికంగా దాడిచేసే వ్యక్తిగా లేదా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. కావలికోట, మే 1, 1991 సంచిక, 17వ పేజీలో ఇలా చెబుతోంది: ‘ఇంటి వద్ద క్రూరుడుగాను మరోచోట దైవభక్తి ఉన్నట్లుగాను ప్రవర్తిస్తుంటే అతడు అనర్హుడు.’​—⁠1 తిమోతి 3:​2-5, 12.

మీరు గుర్తు తెచ్చుకోగలరా?

క్రైస్తవ వివాహాల్లో కూడా ఎందుకు సమస్యలు రావచ్చు?

భర్త తన భార్యను ఎలా పోషించవచ్చు, ఆమెను సంరక్షిస్తున్నానని ఎలా చూపించవచ్చు?

భార్య తన భర్తను ప్రగాఢంగా గౌరవిస్తున్నానని చూపించేందుకు ఏమిచేయవచ్చు?

భార్యాభర్తలు తమ ప్రమాణాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. అప్పుడప్పుడు సమస్యలొస్తాయని దంపతులు ఎదురుచూడడం ఎందుకు లేఖనాధారితం మరియు వాస్తవికం?

3. (ఎ) ప్రపంచంలో చాలామంది వివాహాన్ని ఎలా దృష్టిస్తున్నారు? (బి) తమ వివాహాన్ని కాపాడుకునేందుకు క్రైస్తవులు ఎందుకు కృషిచేస్తారు?

4, 5. (ఎ) వివాహంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది? (బి) వివాహంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యంలోని సూత్రాలు ఎందుకు నిజంగా పనిచేస్తాయి?

6. భర్తలకు లేఖనాధార ఉపదేశమేమిటి?

7. (ఎ) క్రైస్తవ వివాహ పునాదిలో ఏది ప్రముఖ భాగమై ఉండాలి? (బి) భర్తలు ఎలా తమ భార్యలను ఎడతెగక ప్రేమిస్తూ ఉంటారు?

8, 9. క్రైస్తవ భర్త ఏయే విధాలుగా తన భార్య అవసరాలపట్ల శ్రద్ధ చూపించవచ్చు?

10. భర్త తన భార్యను ఎలా సంరక్షించవచ్చు?

11. భర్త తన భార్యతో వ్యవహరించే విధానాన్నిబట్టి దేవునితో, సంఘంతో ఆయన సంబంధమెలా ప్రమాదంలో పడుతుంది?

12. క్రైస్తవ సంఘంతో యేసు వ్యవహరించిన విధానం నుండి క్రైస్తవ భర్త ఏమి నేర్చుకోవచ్చు?

13. భార్యలకు సహాయం చేయగల ఏ సూత్రాలు బైబిల్లో ఉన్నాయి?

14. విధేయతకు సంబంధించిన లేఖనాధార సూత్రం స్త్రీలకు ఎందుకు అవమానకరం కాదు?

15. భార్యల కోసం బైబిల్లో ఇంకా ఎలాంటి ఉపదేశం ఉంది?

16. శారా, రిబ్కాల ఉదాహరణల నుండి క్రైస్తవ భార్యలు ఏమి నేర్చుకోవచ్చు?

17, 18. వివాహ బంధాన్ని నాశనం చేసేందుకు సాతానుచేసే ప్రయత్నాలను భార్యాభర్తలు ఎదిరించగల కొన్ని మార్గాలేమిటి?

[20వ పేజీలోని చిత్రం]

భర్త తన భార్య భౌతిక విషయాలపట్ల మాత్రమేకాక, ఆధ్యాత్మిక విషయాలపట్ల కూడా మంచి శ్రద్ధ తీసుకోవాలి

[21వ పేజీలోని చిత్రం]

తన భార్యను సంరక్షించే పురుషుడు ఆమెకు సేదదీర్పునిచ్చే మూలాధారంగా ఉంటాడు

[23వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ భార్యలు గౌరవపూర్వకంగా తమ భావాలను తెలియజేస్తారు