కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మికత కోసం అన్వేషణ

ఆధ్యాత్మికత కోసం అన్వేషణ

ఆధ్యాత్మికత కోసం అన్వేషణ

ప్రసిద్ధిగాంచిన కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:3, NW ) బహుశా మీరు ఆ మాటలతో ఏకీభవిస్తుండవచ్చు. అన్నిచోట్లా ఉన్న ప్రజలు తమ జీవితంలో ఆధ్యాత్మికత కలిగివుండాల్సిన అవసరాన్ని గుర్తించి, దాన్ని సంపాదించుకున్నప్పుడు తాము సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే “ఆధ్యాత్మికత” అంటే ఏమిటి?

ఆధ్యాత్మికతను ఒక నిఘంటువు “మతసంబంధ విలువల అవసరాన్ని గుర్తించడం లేదా వాటిని ఇష్టపడడం” లేక “ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కలిగివుండడం” అని నిర్వచిస్తోంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటో మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ పోలిక గురించి ఒకసారి ఆలోచించండి: వాణిజ్యపరమైన విషయాల్లో నేర్పుగల వ్యక్తిని వ్యాపారవేత్త అంటాము. అలాగే, ఆధ్యాత్మిక లేక మతసంబంధ విషయాలను ఎంతో విలువైనవిగా పరిగణించే వ్యక్తిని ఆధ్యాత్మిక వ్యక్తి అంటాం.

మరైతే, నిజమైన ఆధ్యాత్మికతను ఎలా సంపాదించుకోవచ్చు? ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక అవసరాన్ని ఎలా తీర్చుకోవచ్చో తమకు తెలుసని అన్ని మతాలవారు చెప్పుకుంటున్నా, వారిచ్చే నిర్దేశాలు వారి మతాల్లాగే అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒక ప్రొటస్టెంటు ఉజ్జీవ కూటాల్లో తాను రక్షణ పొందానని చెప్పుకుంటాడు. ఒక క్యాథలిక్‌ మాస్‌లో దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటాడు. ఒక భౌద్ధమతస్థుడు ధ్యానం ద్వారా జ్ఞానోదయం పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఒక హిందువు స్వీయ పరిత్యాగం ద్వారా పునర్జన్మల చక్రం నుండి తప్పించుకునేందుకు కృషి చేస్తాడు. ఇవన్నీ నిజమైన ఆధ్యాత్మికతను సంపాదించుకోవడానికి నడిపిస్తాయా? లేక వీటిలో ఏదైనా ఒకటి మాత్రమే నడిపిస్తుందా?

ఆ ప్రశ్నలకు నడిపించవు అనేదే సమాధానమని చాలామంది భావిస్తారు. వారు ఆధ్యాత్మికత అంటే, “ఏ మతాన్నీ అనుసరించకుండా విశ్వసించడం” అంటే ఏ చర్చీలోనూ సభ్యులుగా ఉండకుండా దేవుణ్ణి విశ్వసించడమే అని వాదిస్తారు. ఇతరులు, ఆధ్యాత్మికత మతసంబంధమైన విషయాలకు సంబంధించింది కాదు గానీ అది మనశ్శాంతిని పొందాలనే, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే కోరికకు సంబంధించిందని భావిస్తారు. ఆధ్యాత్మికత కోసం అన్వేషించేవారు అసలు మతంవైపు చూసే అవసరమే లేదని వారు వాదిస్తారు. బదులుగా, వారు తమ అంతరంగంలోకి, తమ అంతర్గత భావాల్లోకి మాత్రమే తొంగిచూడాలని చెబుతారు. ఒక రచయిత ఇలా అంటున్నాడు: “నిజమైన ఆధ్యాత్మికత ఒక వ్యక్తి అంతరంగంలో ఉంటుంది. అది మీరు లోకాన్ని, మీ చుట్టూ ఉన్న ప్రజలను ఎలా ప్రేమిస్తారు, ఎలా స్వీకరిస్తారు, వారితో ఎలా వ్యవహరిస్తారు అనే వాటికి సంబంధించింది. దాన్ని ఏదో ఒక మతగుంపులో చేరడం ద్వారానో, ఏవో మతబోధలను విశ్వసించడం ద్వారానో సంపాదించుకోలేం.”

ఆధ్యాత్మికత విషయంలో ప్రజలకు ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. వేలాది పుస్తకాలు ఆధ్యాత్మికతకు మార్గాన్ని చూపిస్తున్నట్లు చెప్పుకుంటున్నా, పాఠకులు తరచూ అసంతృప్తి చెందుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. అయితే, ఒక పుస్తకం ఆధ్యాత్మిక విషయాలపై నమ్మదగిన నిర్దేశాన్నిస్తుంది. అది దేవుని ప్రేరేపణతో వ్రాయబడిందనే రుజువునిస్తున్న పుస్తకం. (2 తిమోతి 3:16) ఆ పుస్తకమైన బైబిలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, దానికున్న విలువేమిటి అనే విషయాల గురించి ఏమి చెబుతోందో మనం చూద్దాం.