కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధను సహించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు

బాధను సహించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు

బాధను సహించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు

“సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము.”—యాకోబు 5:11.

సాధారణంగా ఏ వ్యక్తీ బాధననుభవించాలని కోరుకోడు; మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు కూడా మానవులు బాధననుభవించాలని కోరుకోవడంలేదు. ఆయన ప్రేరేపిత వాక్యాన్ని పరిశీలించి, ఆయన స్త్రీపురుషులను సృష్టించిన తర్వాత జరిగిన దానిని గమనించినప్పుడు మనమీ విషయాన్ని చూడవచ్చు. దేవుడు, మొదట పురుషుణ్ణి చేశాడు. “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” (ఆదికాండము 2:7) ఆదాము శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడు, ఆయన వ్యాధిగ్రస్థుడు కావాల్సిన లేక మరణించాల్సిన అవసరం లేదు.

2 ఆదాము జీవన పరిస్థితుల మాటేమిటి? “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును . . . మొలిపించెను.” (ఆదికాండము 2:8, 9) అవును, ఆదాముకు అద్భుతమైన నివాసస్థలం ఉంది. ఏదెనులో ఎలాంటి బాధకూ తావులేదు.

3ఆదికాండము 2:18 మనకిలా తెలియజేస్తోంది: “దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.” యెహోవా ఆదాముకోసం పరిపూర్ణురాలిగావున్న భార్యను సృష్టించాడు, అలా సంతోషభరిత కుటుంబ జీవితం సాధ్యమైంది. (ఆదికాండము 2:21-23) బైబిలు మనకింకా ఇలా తెలియజేస్తోంది: “దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా—మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28) కాబట్టి ఏదెనులోని పరదైసు భూవ్యాప్తంగా విస్తరించేలా దానిని వ్యాపింపజేసి భూపరదైసుగా చేసే అద్భుతమైన అవకాశం ఆ మొదటి దంపతులకు ఉంది. వారు ఎలాంటి బాధలూ లేకుండా సంతోషంగా జీవించే పిల్లల్ని కంటారు. ఎంత అద్భుతమైన ఆరంభమో కదా!—ఆదికాండము 1:31.

బాధ మొదలవడం

4 అయితే చరిత్రంతటిలో మనం మానవ కుటుంబ పరిస్థితిని గమనించినప్పుడు, ఏదో ఘోరమైన తప్పు జరిగిందనే విషయం స్పష్టమౌతుంది. చెడు జరిగి మానవ కుటుంబం ఎంతో బాధననుభవించింది. శతాబ్దాల కాలంలో ఆదాముహవ్వల సంతానమంతా వ్యాధిగ్రస్తులై, వృద్ధులై చివరకు మరణిస్తున్నారు. భూమి సంతోషభరిత ప్రజలతో నిండివున్న పరదైసుగా ఏ మాత్రం లేదు. పరిస్థితి రోమీయులు 8:22లో ఖచ్చితంగా ఇలా వర్ణించబడింది: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.”

5 ఇంతకాలంగా ఉనికిలోవున్న అంతులేని బాధకు యెహోవా బాధ్యుడు కాదు. (2 సమూయేలు 22:31) దానికి మానవులే కొంతమేర బాధ్యులు. ‘వారు నాశనకరంగా ప్రవర్తించారు, వారు తమ వ్యవహారాల్లో అసహ్యంగా ప్రవర్తించారు.’ (కీర్తన 14:1, NW) మన మొదటి తల్లిదండ్రులకు ఆరంభంలో మేలైన ప్రతీదీ అనుగ్రహించబడింది. అదంతా కొనసాగేందుకు కావల్సిందల్లా దేవునికి విధేయత చూపించడమే, కానీ ఆదాముహవ్వలు యెహోవానుండి స్వతంత్రంగా ఉండేందుకు కోరుకున్నారు. మన మొదటి తల్లిదండ్రులు యెహోవాను నిరాకరించారు కాబట్టి, వారిక ఏ మాత్రం పరిపూర్ణులుగా ఉండలేరు. వారు కృశించి చివరకు మరణిస్తారు. అలా వారసత్వంగా అపరిపూర్ణత మనకు సంక్రమించింది.—ఆదికాండము 3:17-19; రోమీయులు 5:12.

6 బాధ మొదలవడంలో, అపవాదియగు సాతానుగా మారిన ఆత్మప్రాణి కూడా ఇమిడివున్నాడు. అతనికి స్వేచ్ఛాచిత్తం అనుగ్రహించబడింది. అయితే అతడు ఆరాధన పొందాలని చేసిన ప్రయత్నంలో ఆ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేశాడు. అయితే యెహోవా మాత్రమే ఆరాధించబడాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు. ఆదాముహవ్వలు “మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె” ఉండవచ్చు అన్నట్లుగా, వారు యెహోవానుండి స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించేలా సాతానే వారిని పురికొల్పాడు.—ఆదికాండము 3:5.

యెహోవాకే పరిపాలించే హక్కువుంది

7 ఆ తిరుగుబాటు చెడు పర్యవసానాలు, విశ్వసర్వాధిపతియైన యెహోవాకు మాత్రమే పరిపాలనా హక్కువుందనీ, ఆయన పరిపాలన మాత్రమే నీతియుక్తంగా ఉండగలదనీ చూపించాయి. గతించిన వేలాది సంవత్సరాలు, “ఈ లోకాధికారి[గా]” మారిన సాతాను పూర్తిగా అసంతుష్టికరమైన, దుష్టమైన, అవినీతికరమైన, దౌర్జన్యపూరితమైన పరిపాలనను వృద్ధిచేశాడని నిరూపించాయి. (యోహాను 12:31) సాతాను ఆధ్వర్యంలోని మానవుల దీర్ఘకాల, హీన పరిపాలన కూడా వారికి నీతియుక్తంగా పరిపాలించే సామర్థ్యం లేదని చూపించింది. (యిర్మీయా 10:23) ఆ విధంగా, యెహోవా పరిపాలన తప్ప మానవులు ఆలోచించగల ఏ విధమైన పరిపాలనైనా నిశ్చయంగా విఫలమౌతుంది. చరిత్ర ఈ వాస్తవాన్ని తిరుగులేనంత స్పష్టంగా నిరూపించింది.

8 తన నుండి స్వతంత్రంగా పరిపాలనాపరమైన ప్రయోగాలు చేసేందుకు యెహోవా మానవులను వేలాది సంవత్సరాలు అనుమతించాడు కాబట్టి, భూమ్మీదనుండి అలాంటి అన్ని విధాలైన పరిపాలనలనూ తొలగించి వాటి స్థానంలో తన ప్రభుత్వాన్ని నెలకొల్పడం న్యాయమైనదే. దీని గురించిన ఒక ప్రవచనమిలా చెబుతోంది: “ఆ రాజుల [మానవుల పరిపాలనా] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము [క్రీస్తు ఆధ్వర్యంలో తన పరలోక ప్రభుత్వాన్ని] స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) దయ్యాల, మానవుల పరిపాలన అంతమై, దేవుని పరలోక రాజ్యం మాత్రమే ఉనికిలోవుండి భూమిని పరిపాలిస్తుంది. క్రీస్తు రాజుగా ఉండడమే కాక, ఆయనకు భూమిపైనుండి తీసుకోబడిన 1,44,000 మంది నమ్మకస్థులైన మానవులు సహపాలకులుగా ఉంటారు.—ప్రకటన 14:1.

బాధ అనుభవించడం ద్వారా ప్రయోజనం పొందడం

9 పరలోక రాజ్యంలో పరిపాలించేవారి అర్హతలను పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట, రాజుగా తన పాత్ర పోషించేందుకు తానెలా అర్హుడో క్రీస్తుయేసు చూపించాడు. ఆయన తన తండ్రియైన యెహోవా దగ్గర ‘ప్రధానశిల్పిగా’ ఉండి, ఆయన చిత్తంచేస్తూ ఆయనతో అసంఖ్యాక యుగాలు గడిపాడు. (సామెతలు 8:22-31) యెహోవా ఆయనను భూమికి పంపించే ఏర్పాటు చేసినప్పుడు, యేసు ఇష్టపూర్వకంగా దానికి లోబడ్డాడు. భూమ్మీద ఆయన యెహోవా సర్వాధిపత్యం గురించి, రాజ్యం గురించి ఇతరులకు చెప్పడంపై దృష్టి నిలిపాడు. ఆ సర్వాధిపత్యానికి పూర్తిగా లోబడివుండడం ద్వారా యేసు మనందరికి అద్భుతమైన మాదిరివుంచాడు.—మత్తయి 4:17; 6:9.

10 యేసు హింస అనుభవించి, చివరకు చంపబడ్డాడు. ఆయన తన పరిచర్యలో అన్నిచోట్లా మానవాళి దీనస్థితిని గమనించగలిగాడు. అదంతా గమనించడం, వ్యక్తిగతంగా బాధననుభవించడంవల్ల ఆయనకేమైనా ప్రయోజనం కలిగిందా? కలిగింది. హెబ్రీయులు 5:8 ఇలా చెబుతోంది: “ఆయన, [దేవుని] కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.” యేసు ఈ భూమ్మీద అనుభవించినవి ఆయనను మరింత అర్థం చేసుకునే వ్యక్తిగా, కనికరం చూపించే వ్యక్తిగా చేశాయి. ఆయన మానవ కుటుంబ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించాడు. బాధననుభవిస్తున్న వారిపట్ల ఆయన సానుభూతి చూపించడమే కాక, వారికి సహాయం చేయడంలో తన పాత్రను మరింత చక్కగా అర్థం చేసుకోగలిగాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఎలా నొక్కిచెబుతున్నాడో గమనించండి: “ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.” “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.”—హెబ్రీయులు 2:17, 18; 4:14-16; మత్తయి 9:36; 11:28-30.

11 పరలోక రాజ్యంలో క్రీస్తుయేసు సహపాలకులుగా ఉండేందుకు భూమినుండి “కొనబడిన” 1,44,000 మంది గురించి కూడా అలాగే చెప్పవచ్చు. (ప్రకటన 14:4) వారంతా భూమిపై మానవులుగా జన్మించి, బాధలు చుట్టిముట్టిన లోకంలో పెరిగి తాము కూడా బాధలనుభవించారు. వారిలో చాలామంది హింసించబడడమే కాక, యెహోవాపట్ల యథార్థంగావుండి, యేసును అనుసరించేందుకు ఇష్టపడినందుకు కొందరు చంపబడ్డారు కూడా. అయితే వారు ‘తమ ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చి, సువార్త నిమిత్తం శ్రమానుభవంలో పాలివారై ఉండేందుకు సిగ్గపడలేదు.’ (2 తిమోతి 1:8) పరలోకం నుండి మానవ కుటుంబానికి తీర్పు తీర్చేందుకు ప్రత్యేకంగా భూమ్మీది వారి అనుభవం వారిని అర్హులను చేస్తుంది. వారు మరింత సానుభూతిని, దయను చూపించడాన్ని నేర్చుకోవడమే కాక, ప్రజలకు సహాయం చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు.—ప్రకటన 5:9-10; 14:2-5; 20:6.

భూ నిరీక్షణగలవారి సంతోషం

12 వ్యాధి, దుఃఖం, మరణంలేని పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణగలవారికి ప్రస్తుత బాధ ఏమైనా ప్రయోజనమిస్తుందా? బాధ తీసుకొచ్చే నొప్పి, దుఃఖం కోరుకోదగిన విషయాలేమీ కాదు. అయితే మనం అలాంటి బాధను సహించినప్పుడు, అది చక్కని వ్యక్తిగత లక్షణాలను వృద్ధిచేసి, సంతోషాన్ని తీసుకురాగలదు.

13 దీని గురించి దేవుని ప్రేరేపిత వాక్యమేమి చెబుతోందో గమనించండి: “మీరొకవేళ నీతినిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే.” “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల . . . మీరు ధన్యులు.” (1 పేతురు 3:14; 4:14) “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:11, 12) “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై . . . జీవకిరీటము పొందును.”—యాకోబు 1:12.

14 మనం అక్షరార్థంగా అనుభవించే బాధ నిశ్చయంగా మనల్ని సంతోషపర్చదు. ఆ సంతోషం, సంతృప్తి మనం యెహోవా చిత్తం చేస్తున్న, యేసు మాదిరిని అనుసరిస్తున్న కారణంగా బాధననుభవిస్తున్నామని తెలుసుకోవడం నుండి లభిస్తాయి. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలో కొందరు అపొస్తలులు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నందుకు, జైల్లో వేయబడి ఆ తర్వాత యూదా న్యాయస్థానానికి తీసుకురాబడి, బహిరంగంగా నిందించబడ్డారు. వారు కొరడాలతో కొట్టబడి ఆ తర్వాత విడుదల చేయబడ్డారు. వారి మనోభావమెలా ఉంది? వారు “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయి[రి]” అని బైబిలు వృత్తాంతం చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 5:17-41) కొరడా దెబ్బలనుబట్టి, తత్ఫలితంగా కలిగిన శారీరక నొప్పినిబట్టి కాదుగానీ, తాము యెహోవాపట్ల యథార్థంగా ఉన్నందుకు, యేసు అడుగుజాడల్లో నడిచినందుకు తమకలా సంభవించిందని అర్థం చేసుకున్నారు కాబట్టి వారు సంతోషించారు.—అపొస్తలుల కార్యములు 16:25; 2 కొరింథీయులు 12:10; 1 పేతురు 4:13.

15 సరైన దృక్పథంతో మనం వ్యతిరేకతను, హింసను సహించినప్పుడు, అది మనలో సహనాన్ని వృద్ధి చేస్తుంది. ఇది భవిష్యత్తు బాధలను సహించేందుకు మనకు సహాయం చేస్తుంది. మనమిలా చదువుతాం: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకోబు 1:2-3) అదే విధంగా రోమీయులు 5:3-5 మనకిలా తెలియజేస్తోంది: “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.” కాబట్టి మన క్రైస్తవ విధానాన్నిబట్టి మనమిప్పుడు పరీక్షలను ఎంతగా సహిస్తామో, అంతగా మనమీ దుష్టవిధానంలో రాబోయే పరీక్షలను సహించేందుకు సన్నద్ధులమౌతాం.

యెహోవా ప్రతిఫలమిస్తాడు

16 వ్యతిరేకతవల్ల ఆస్తి నష్టం కలిగినప్పుడు లేదా క్రైస్తవ విధానానికి హత్తుకొని ఉన్నందువల్ల మనం బాధననుభవించినప్పుడు కూడా యెహోవా మనకు పూర్ణ ప్రతిఫలమిస్తాడనే తృప్తితో ఉండవచ్చు. ఉదాహరణకు, పరలోక నిరీక్షణగల కొందరికి అపొస్తలుడైన పౌలు, దేవుని రాజ్యంలో పరిపాలకులుగా “మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి” అని వ్రాశాడు. (హెబ్రీయులు 10:34) యెహోవా, యేసుక్రీస్తు ఈ ఇద్దరి నిర్దేశంలో వారు నూతనలోకంలో భూనివాసులకు అద్భుతమైన ఆశీర్వాదాలు పంచివ్వడంలో వారికి లభించే ఆనందం గురించి ఊహించండి. నమ్మకమైన క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటలు ఎంతో నిజమైవుంటాయి: “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.”—రోమీయులు 8:18.

17 అదే విధంగా, భూనిరీక్షణగలవారు యెహోవాను సేవిస్తున్నందుకు ఇప్పుడేమి పోగొట్టుకున్నా లేదా స్వచ్ఛందంగా వదులుకున్నా, తాను భవిష్యత్తులో చేయబోవు వాటినిబట్టి ఆయన వారికి అత్యంత సమృద్ధిగా ప్రతిఫలమిస్తాడు. ఆయన వారికి భూపరదైసుపై పరిపూర్ణమైన, నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నూతనలోకంలో యెహోవా “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:4) అదెంత అద్భుతమైన వాగ్దానమో కదా! యెహోవా కోసం మనం ప్రస్తుత లోకంలో ఇష్టంగా లేదా అయిష్టంగా వదులుకునేదేదీ, బాధను సహిస్తున్న తన నమ్మకమైన సేవకులకు ఆయన అనుగ్రహించే అద్భుతమైన భావి జీవితానికి సాటిరాలేవు.

18 మనమింకా అనుభవించాల్సిన బాధ ఏదైనా కూడా దేవుని నూతనలోకంలో మనం నిత్యజీవం అనుభవించడాన్ని ఏ మాత్రం అడ్డుపడదు. అలాంటి బాధంతటికీ నూతనలోకంలోని మహిమాన్విత పరిస్థితులు పరిపూర్ణ ప్రతిఫలమిస్తాయి. యెషయా 65:17, 18 మనకిలా చెబుతోంది: “మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.” కాబట్టి యేసు తోబుట్టువైన యాకోబు ఇలా అనడం సముచితమే: “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము.” (యాకోబు 5:11) అవును, ప్రస్తుతకాల బాధను మనం నమ్మకంగా సహించినప్పుడు, మనమిప్పుడూ భవిష్యత్తులోనూ ప్రయోజనం పొందవచ్చు.

మీరెలా జవాబిస్తారు?

• మానవులు బాధననుభవించడం ఎలా మొదలైంది?

• భవిష్యత్‌ భూపాలకులకు, నివాసులకు బాధ ఎలాంటి ప్రయోజనాలు తీసుకురావచ్చు?

• బాధలున్నప్పటికీ మనమిప్పుడు ఎందుకు సంతోషించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మానవుడు బాధననుభవించాలని దేవుడు సంకల్పించలేదని ఏది చూపిస్తోంది?

3. మొదటి మానవ దంపతులకు ఎలాంటి ఉత్తరాపేక్షలున్నాయి?

4. చరిత్రను పరిశీలించినప్పుడు మానవజాతి విషయంలో ఏమి స్పష్టమౌతోంది?

5. మానవ కుటుంబానికి బాధను ప్రవేశపెట్టడంలో మన మొదటి తల్లిదండ్రులెలా ఇమిడివున్నారు?

6. బాధను ఆరంభించడంలో సాతాను ఏ పాత్ర పోషించాడు?

7. యెహోవాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు పర్యవసానాలు ఏమి నిరూపిస్తున్నాయి?

8. అన్నిరకాల మానవ పరిపాలనల విషయంలో యెహోవా సంకల్పమేమిటి, ఆ సంకల్పాన్ని ఆయనెలా నెరవేరుస్తాడు?

9, 10. యేసు తాను అనుభవించిన బాధలవల్ల ఎలా ప్రయోజనం పొందాడు?

11. భావి రాజుల, యాజకుల భూమ్మీది అనుభవం పరిపాలకులుగా వారికెలా ప్రయోజనమిస్తుంది?

12, 13. భూనిరీక్షణగలవారు బాధ అనుభవించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చు?

14. బాధ ఏ భావంలో యెహోవా ఆరాధకులను సంతోషపరుస్తుంది?

15. ఇప్పుడు బాధను సహించడం భవిష్యత్తులో మనకెలా ప్రయోజనమివ్వగలదు?

16. భవిష్యత్‌ రాజులు, యాజకులు అనుభవిస్తున్న బాధకు ప్రతిఫలమిచ్చేలా యెహోవా ఏమిచేస్తాడు?

17. ఇప్పుడు యథార్థంగా తన సేవచేస్తున్న భూనిరీక్షణగలవారికి యెహోవా ఏమిచేస్తాడు?

18. యెహోవా తన వాక్యంలో మనకెలాంటి ఓదార్పుకరమైన వాగ్దానం చేస్తున్నాడు?

[27వ పేజీలోని చిత్రం]

మన మొదటి తల్లిదండ్రుల ఎదుట అద్భుతమైన భవిష్యత్తు ఉండింది

[29వ పేజీలోని చిత్రం]

బాధను గమనించడం యేసును దక్షతగల రాజుగా, యాజకునిగా సిద్ధం చేసింది

[31వ పేజీలోని చిత్రం]

అపొస్తలులు తమ విశ్వాసాన్నిబట్టి ‘అవమానం పొందడానికి పాత్రులుగా ఎంచబడినందుకు సంతోషించారు’