కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పాత నిబంధన” ఇప్పటికీ ఆచరణయోగ్యమైనదేనా?

“పాత నిబంధన” ఇప్పటికీ ఆచరణయోగ్యమైనదేనా?

“పాత నిబంధన” ఇప్పటికీ ఆచరణయోగ్యమైనదేనా?

ఫ్రెంచ్‌ వైద్యుడొకాయన, 1786లో ట్రేటే డానాటమీ ఏ ఫీజ్యోలోజీ (శరీర నిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం గురించిన చర్చ) అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. దానిని ఆ కాలంలో, నాడీవ్యవస్థ నిర్మాణశాస్త్రానికి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన పుస్తకంగా పరిగణించేవారు. అరుదైన ఆ పుస్తకపు ప్రతి ఒకటి ఈమధ్య 27 వేల డాలర్లకంటే ఎక్కువ డబ్బుకు అమ్ముడుపోయింది. అయితే, శతాబ్దాల క్రితం పరిశోధించి వ్రాయబడిన ఆ వైద్య పుస్తకం ఆధారంగా చికిత్సచేసే వైద్యుణ్ణి ఈ రోజుల్లో చాలా కొద్దిమంది రోగులు నమ్ముతారు. ఆ పుస్తకపు చారిత్రాత్మక, సాహిత్యపరమైన విలువ, నేడు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చదు.

అనేకులు, పాత నిబంధన అని పిలవబడుతున్న దాని గురించి కూడా అలాగే భావిస్తారు. వారు దానిలోని ఇశ్రాయేలీయుల చరిత్ర వృత్తాంతపు విలువను గుర్తించి, దానిలోని చక్కటి కవిత్వాన్ని మెచ్చుకుంటారు. కానీ, 2,400 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం క్రితంనాటి నిర్దేశాలను అనుసరించడం సహేతుకమైనది కాదని వారనుకుంటారు. శాస్త్రీయ పరిజ్ఞానం, వాణిజ్యం, చివరికి కుటుంబ జీవితం వంటి విషయాల్లో నేడున్న పరిస్థితికి, బైబిలు వ్రాయబడిన కాలంలో ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. క్రిస్టియానిటీ టుడే అనే పత్రికకు మాజీ సంపాదకుడైన ఫిలిప్‌ యాన్సీ ద బైబిల్‌ జీసస్‌ రెడ్‌ అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “పాత నిబంధనను అన్ని సందర్భాల్లో అర్థంచేసుకోలేము, అర్థమైన భాగాలు నేటి ప్రజలకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ కారణాలవల్ల, మరితర కారణాలవల్ల ప్రజలు బైబిల్లోని నాలుగింట మూడొంతుల భాగాన్ని చదవడం లేదు.” అలాంటి దృక్పథం క్రొత్తేమీ కాదు.

దాదాపు సా.శ. 100లో అపొస్తలుడైన యోహాను మరణించి 50 సంవత్సరాలు గడువక ముందే, మార్సీయొన్‌ అనే యువ ధనికుడు, క్రైస్తవులు పాత నిబంధనను తిరస్కరించాలని బహిరంగంగా ప్రకటించాడు. ఆంగ్లేయ చరిత్రకారుడైన రాబిన్‌ లేన్‌ ఫాక్స్‌ ప్రకారం, మార్సీయొన్‌ వాదన ఏమిటంటే, “పాత నిబంధనలోని ‘దేవుడు’ ‘చాలా క్రూరమైనవాడు,’ ఇశ్రాయేలీయుల రాజైన దావీదులాంటి తీవ్రవాదులను, బందిపోటులను ఆయన ఆమోదించాడు. అయితే క్రీస్తు పాత నిబంధనలోని దేవునికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగివున్న, ఉన్నతమైన, దేవునిగా నిరూపించుకున్నాడు.” ఈ నమ్మకాలు “‘మార్సీయొన్‌వాదం’గా మారి, అనుచరులను, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని సిరియా భాష మాట్లాడే వారిని, నాల్గవ శతాబ్దంలో చాలాకాలం వరకూ ఆకర్షించడం కొనసాగించాయి” అని ఫాక్స్‌ వ్రాశాడు. కొంతమంది వీటినే ఇంకా నమ్ముతూ ఉన్నారు. అందువల్ల, 1,600 సంవత్సరాల తర్వాత, ఫిలిప్‌ యాన్సీ ఇలా వ్రాశాడు: “క్రైస్తవులలో పాత నిబంధన గురించిన జ్ఞానము వేగంగా తగ్గిపోతోంది, ఆధునిక సమాజంలో దాదాపు అది అంతరించిపోయింది.”

పాత నిబంధన స్థానంలో క్రొత్త నిబంధన వచ్చిందా? పాత నిబంధనలోని “సైన్యములకధిపతియగు యెహోవా”ను క్రొత్త నిబంధనలోని ‘ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుని’తో మనమెలా సమన్వయపరచవచ్చు. (యెషయా 13:13; 2 కొరింథీయులు 13:11) పాత నిబంధన నేడు మీకు ప్రయోజనం చేకూర్చగలదా?