కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రశంసించడం ప్రాముఖ్యమని మర్చిపోకండి

ప్రశంసించడం ప్రాముఖ్యమని మర్చిపోకండి

ప్రశంసించడం ప్రాముఖ్యమని మర్చిపోకండి

తన బాస్‌ తనను ప్రశంసించడు అని ఎవరైనా ఫిర్యాదు చేయడాన్ని మీరెప్పుడైనా విన్నారా? బహుశా మీరు కూడా అలాంటి ఫిర్యాదే చేశారా? లేదా మీరు ఒక యౌవనస్థుడైతే మీ తల్లిదండ్రుల గురించి లేదా మీ టీచర్ల గురించి అలాగే ఫిర్యాదు చేశారా?

ఈ ఫిర్యాదుల్లో కొన్ని బహుశా నిజం కావచ్చు. కానీ, ఒక జర్మన్‌ ప్రేరణా శిక్షకుడి ప్రకారం, ఉద్యోగస్థులు ఇలాంటి ఫిర్యాదు చేసినప్పుడు, తమ బాసు తమను ప్రశంసించడంలేదనే విషయం కన్నా ముందు ఆయన తమపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపట్లేదనే విషయమే వారిని ఎక్కువగా బాధిస్తుంది. ఏదేమైనా, మొత్తానికి ఏదో లోపిస్తోంది. సంతృప్తికరమైన సంబంధాలను కలిగివుండాలంటే ప్రశంసించడం, వ్యక్తిగత శ్రద్ధ చూపించడం రెండూ అవసరం.

ఆరాధన విషయంలో కూడా ఇది అంతే నిజం. క్రైస్తవ సంఘం ప్రశంసను, ఆప్యాయతను, వ్యక్తిగత శ్రద్ధను చూపించే వాతావరణాన్ని కలిగివుండాలి. దాని సభ్యులు బైబిలు నిర్దేశాలను పాటించడంద్వారా అలాంటి చక్కటి పరిస్థితిని ఏర్పర్చి, అది అలాగే ఉండేలా చూసుకుంటారు. అయితే, మన సంఘం ఎంతో ప్రేమను చూపించేదే అయినా, పరిస్థితిని మరింత మెరుగుపర్చడం ఎల్లప్పుడూ సాధ్యమే. దీన్ని మనసులో ఉంచుకొని, ప్రశంసించడంలో మూడు చక్కటి మాదిరులను మనం పరిశీలిద్దాం: క్రైస్తవ కాలానికి పూర్వం జీవించిన దేవుని సేవకుడైన ఎలీహు, అపొస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు.

దయగల, గౌరవప్రదమైన ఉపదేశం

అబ్రాహాముకు బహుశా దూరపు బంధువైన ఎలీహు, దేవునితో తనకున్న సంబంధంపట్ల సమతూక దృష్టిని కలిగివుండేందుకు యోబుకు సహాయపడడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఎలీహు దయగలవాడు, మర్యాదస్థుడు. మాట్లాడే అవకాశం తనకు వచ్చేంతవరకు ఓపికగా ఎదురుచూశాడు. యోబు స్నేహితులని చెప్పుకున్నవారు యోబు తప్పులను మాత్రమే ఎత్తిచూపించారు, అయితే ఎలీహు యోబుకు ఉపదేశమివ్వడంతో పాటు ఆయన యథార్థతనుబట్టి ప్రశంసించేందుకు సిద్ధపడ్డాడు. ఎలీహు, యోబు పేరును సంబోధించని యోబు స్నేహితులని చెప్పుకుంటున్నవారిలా కాక, యోబును పేరుతో సంబోధిస్తూ, ఆప్యాయతతో, ఒక స్నేహితుడిగా, వ్యక్తిగత శ్రద్ధతో ఆయన అలా చేశాడు. ఎలీహు మర్యాదగా ఇలా అడిగాడు “యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.” గౌరవప్రదంగా యోబు స్థానంలో తనను తాను ఉంచుకుని, ఆయనిలా ఒప్పుకున్నాడు: “దేవునియెడల నేనును నీవంటివాడను, నేనును జిగటమంటితో చేయబడినవాడనే.” ఆ తర్వాత ఆయన మెచ్చుకోలుగా ఇలా అన్నాడు: “చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము; మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను.”—యోబు 33:1, 6, 32.

ఇతరులతో దయగా, మర్యాదగా వ్యవహరించడం ఒక విధంగా వారిని ప్రశంసించడమే. నిజానికి, వినేవారికి ‘నేను మిమ్మల్ని విలువైనవారిగా ఎంచుతున్నాను, మీరంటే నాకు గౌరవం ఉంది’ అని చెప్తున్నాం. ఆ విధంగా ఆప్యాయతను, ఆయనపట్ల మనకున్న వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తాం.

మర్యాదపూర్వకంగా ఉండడమంటే, మంచి ప్రవర్తనా నియమాలను నామమాత్రంగా పాటించడం మాత్రమే కాదు. ఇతరుల హృదయాలను చేరుకునేందుకు, మనం చూపించే మర్యాద యథార్థంగా ఉండడమేకాక, అది హృదయంలో నుండి రావాలి. దాన్ని నిజమైన శ్రద్ధతో, ప్రేమతో వ్యక్తపర్చాలి.

నేర్పుగా ప్రశంసించడం

ఇతరులను ప్రశంసించడంలో నేర్పు ఎంత ప్రభావవంతంగా ఉండగలదనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఉదాహరణకు, తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఏథెన్సులో ప్రకటిస్తున్నప్పుడు, కొంతమంది గ్రీకు తత్త్వవేత్తల ముందు ఆయన క్రైస్తవత్వాన్ని సమర్థించాడు. ఈ కష్టమైన నియామకాన్ని ఆయన నేర్పుగా ఎలా నిర్వర్తించాడో గమనించండి. “ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు—ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. . . . మరికొందరు—వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.” (అపొస్తలుల కార్యములు 17:18) అలాంటి వ్యాఖ్యానాలు చేసినా, పౌలు తనను తాను తమాయించుకుని, ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారైయున్నట్టు నాకు కనబడుచున్నది.” పౌలు వారి విగ్రహారాధనను ఖండించే బదులు వారు మతనిష్ఠ కలిగి ఉండడాన్నిబట్టి వారిని ప్రశంసించాడు—అపొస్తలుల కార్యములు 17:22.

పౌలు వేషధారణతో అలా చెబుతున్నాడా? ఎంతమాత్రం కాదు. తన శ్రోతలకు తీర్పుతీర్చడం తన పనికాదని పౌలుకు తెలుసు; సత్యం గురించి ఒకప్పుడు తనకు కూడా ఏమీ తెలీదనే విషయం కూడా ఆయనకు బాగా తెలుసు. దేవుని సందేశాన్ని ప్రకటించడమే ఆయన నియామకం, అంతేగానీ ఇతరులకు తీర్పుతీర్చడం ఆయన పని కాదు. నేడు అనేకమంది యెహోవాసాక్షులు కనుగొన్న ఈ విషయాన్ని ఆయన అనుభవంద్వారా తెలుసుకున్నాడు: ఒకప్పుడు అబద్ధమతాన్ని గట్టిగా సమర్థించిన కొందరు యథార్థపరులు చివరకు సత్యమతాన్ని గట్టిగా సమర్థించేవారిగా మారారు.

పౌలు వ్యవహరించిన విధానం సమర్థవంతమైనది, అది చక్కని ఫలితాలను తీసుకొచ్చింది. “అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.” (అపొస్తలుల కార్యములు 17:34) ఏథెన్సు వారి యథార్థమైన నమ్మకాలనుబట్టి అంటే అవి అబద్ధమైనవైనా, సరైన జ్ఞానం కొరవడినందుకు పౌలు వారిని ఖండించే బదులు వారిని ప్రశంసిస్తూ ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడో కదా! తప్పుడు సమాచారంతో మోసగించబడ్డ ప్రజలు తరుచూ మంచి హృదయంగలవారిగా ఉండవచ్చు.

హేరోదు అగ్రిప్ప II ముందు పౌలు తనను తాను సమర్థించుకునేందుకు పిలవబడినప్పుడు, ఆ పరిస్థితితో కూడా తెలివిగా వ్యవహరించాడు. హేరోదు దేవుని వాక్యం స్పష్టంగా ఖండించిన దాన్ని చేశాడని అంటే తన చెల్లెలైన బెర్నీకేతో వావివరుసలు తప్పి సంబంధాలు పెట్టుకున్నాడని అందరికీ తెలుసు. అయితే, పౌలు ఖండిస్తున్నట్లు మాట్లాడలేదు. బదులుగా, హేరోదును ప్రశంసించేందుకు ఆయన సరైన ఆధారాన్ని గుర్తించాడు. “అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను.”—అపొస్తలుల కార్యములు 26:1-3.

మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు అలాంటి నేర్పును ప్రదర్శించడం ఎంత జ్ఞానయుక్తమో కదా! పొరుగువారిని, తోటి విద్యార్థులను లేదా తోటి ఉద్యోగస్థులను ప్రశంసించడం శాంతియుతమైన సంబంధాలను, మంచి ప్రవర్తనను ప్రోత్సహించగలదు. సంపూర్ణార్హమైన ప్రశంసతో హృదయాలను చేరుకోవడంద్వారా, తమ తప్పుడు తర్కం, క్రియల స్థానంలో ఖచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా ఉండేవాటిని అలవర్చుకునేలా మనం యథార్థవంతులైనవారిని కొన్నిసార్లు ప్రోత్సహించగలుగుతాము.

ఇతరులను ప్రశంసించడంలో యేసు పరిపూర్ణ మాదిరి

యేసు ప్రశంసించాడు. ఉదాహరణకు, యేసు తాను పునరుత్థానం చేయబడి, పరలోకానికి ఆరోహణమైన తర్వాత, దేవుని నిర్దేశం క్రింద ఆయన అపొస్తలుడైన యోహాను ద్వారా ఆసియా మైనరులోని ఏడు సంఘాలతో మాట్లాడాడు. ఆయన ప్రశంసకు అర్హులైనవారిని ప్రశంసించకుండా ఉండలేదు. ఎఫెసు, పెర్గమము, తుయతైరలలోని సంఘాలకు ఇలాంటి మాటలను వ్యక్తపర్చాడు: “నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవు,” “నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదు,” “నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.” సార్దీస్‌లోని సంఘానికి గట్టి మందలింపు అవసరమైనా, ప్రశంసకు అర్హులైన వారిని ఆయన గమనించి, ఇలా అన్నాడు: “అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.” (ప్రకటన 2:2, 13, 19; 3:4) యేసు ఎంత చక్కని మాదిరినుంచాడో కదా!

మనం యేసును అనుసరిస్తూ, కొందరు చేసిన తప్పుల్నిబట్టి అందరినీ ఎప్పుడూ మందలించకూడదు లేదా తగిన విధంగా ప్రశంసించకుండా అవసరమైన మందలింపును ఇవ్వకూడదు. మనం మందలించాలని అనుకున్నప్పుడు మాత్రమే ప్రశంసిస్తే, మనం చేసే ప్రశంస కొన్నిసార్లు పెడచెవిన పెట్టే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం మంచిది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రశంసించండి! అప్పుడు, వేరే సందర్భంలో మందలింపు అవసరమైతే, అది వెంటనే అంగీకరించబడుతుంది.

తగినవిధంగా ప్రశంసించే పెద్దలు

యూరప్‌లోని యెహోవాసాక్షుల ఒక బ్రాంచి కార్యాలయంలో ఇప్పుడు సేవచేస్తున్న ఒక క్రైస్తవ స్త్రీ కొర్నేలియా, 1970వ పడి తొలికాలాల్లో సందర్శిస్తున్న ప్రయాణ పైవిచారణకర్త, ‘వ్యక్తిగత అధ్యయనం ఎలా చేస్తున్నావు, పత్రికలు ఎలా చదువుతున్నావు’ అని తనను అడగడాన్ని గుర్తుచేసుకుంటోంది. “నాకు కొంచెం సిగ్గనిపించింది” అని ఆమె చెబుతోంది. అయితే ప్రతీ పత్రికలోని ఆర్టికల్స్‌ అన్నింటినీ చదవలేకపోతున్నానని ఆమె ఒప్పుకుంది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “దానికి ఆయన నన్ను మందలించే బదులు నేనెంత చదవగలిగితే అంత చదవగలుగుతున్నందుకు నన్ను ప్రశంసించాడు. ఆయన ప్రశంసకు నేనెంతగా ప్రోత్సహించబడ్డానంటే, అప్పటినుండి ప్రతీ ఆర్టికల్‌ చదవాలని నిర్ణయించుకున్నాను.”

యూరప్‌లోని ఒక బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న రే, తన పయినీరు సేవ మొదటి రోజును గుర్తుచేసుకుంటున్నాడు. ఉద్యోగస్థుడు, కుటుంబ బాధ్యతలతోపాటు, సంఘంలోని ఎన్నో బాధ్యతలను చూసుకుంటున్న సంఘ పైవిచారణకర్త ఆ రోజు సాయంకాలం రాజ్యమందిరంలోకి వచ్చీ రాగానే రే దగ్గరకెళ్ళి ఆయనను ఇలా అడిగాడు: “పయినీరు సేవలో మీ మొదటిరోజు ఎలా గడిచింది?” దాదాపు 60 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఇప్పటికీ రే ఆ పెద్ద చూపించిన శ్రద్ధను గుర్తుచేసుకుంటాడు.

పై రెండు అనుభవాలు చూపిస్తున్నట్లుగా, ఇతరులు చేసినదానిపట్ల కృతజ్ఞతాపూర్వక ప్రేమను కేవలం అనాలోచితమైన మాటలతో లేదా పొగడ్తలతో కాకుండా యథార్థంగా వ్యక్తపర్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. క్రైస్తవ సంఘంలో మన తోటి విశ్వాసులను ప్రశంసించే ఎన్నో అవకాశాలు మనకుంటాయి. యెహోవాను ఆరాధించాలనే వారి కోరిక, చక్కగా సిద్ధపడ్డ వారి వ్యాఖ్యానాలు, ప్రసంగాలు ఇచ్చేందుకు లేదా కూటాల భాగాల్లో పాల్గొనేందుకు వారు స్టేజీ భయాన్ని అధిగమించడం, ప్రకటించడంలో, బోధించడంలో వారికున్న ఆసక్తి, రాజ్య సంబంధ విషయాలకు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు ప్రాధాన్యతనివ్వడం వంటివాటి గురించి ఒక్కసారి ఆలోచించండి. మనం ఇతరులను ప్రశంసించినప్పుడు, మనం అధికంగా ఆశీర్వదించబడతాం. అది మనల్ని సంతోషపర్చడమేకాక, విషయాలను అనుకూలంగా దృష్టించేందుకు సహాయపడుతుంది.—అపొస్తలుల కార్యములు 20:35.

సంఘ పెద్దలు సంఘంచేసే చక్కటి పనినిబట్టి దాన్ని ప్రశంసించడం మంచిది. మందలింపు అవసరమైతే వారు దాన్ని ప్రేమపూర్వకంగా ఇస్తారు. మరోవైపున వారు, పరిపూర్ణంగా లేనిది ఒక గంభీరమైన బలహీనత అన్నట్లు దృష్టించకుండా, అన్నీ పరిపూర్ణంగా ఉండాలని ఆశించరు.

ఎలీహు చూపించిన గౌరవపూర్వకమైన, ప్రేమపూర్వకమైన మాదిరిని, పౌలు ఉపయోగించిన నేర్పును, యేసు చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధను అనుకరించే క్రైస్తవ పెద్దలు తమ సహోదరులకు నిజమైన ప్రోత్సాహానికి మూలంగా ఉంటారు. ప్రశంస ఇతరులను శ్రేష్ఠమైన క్రైస్తవులుగా ఉండేలా ప్రోత్సహిస్తుంది, దానివల్ల సంతోషకరమైన, సమాధానకరమైన సంబంధాలు ఏర్పడతాయి. యేసు తన బాప్తిస్మమప్పుడు తన పరలోకపు తండ్రి “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” అని చెప్పిన మాటలను విని ఎంతగా ఆనందించివుంటాడో కదా! (మార్కు 1:11) నిజమైన, అర్థవంతమైన మాటలతో మనం ప్రశంసించడం ద్వారా, మన సహోదరుల హృదయాలను ఆనందింపజేద్దాం!

[15వ పేజీలోని చిత్రాలు]

పౌలు నేర్పుగా మాట్లాడడం చక్కని ఫలితాల్ని తీసుకొచ్చింది, మనకు కూడా అలాగే జరగవచ్చు

[16వ పేజీలోని చిత్రం]

ఆప్యాయతతో, నిజాయితీతో కూడిన ప్రశంస మంచి ఫలితాలను తీసుకొస్తుంది