కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దానియేలు గ్రంథములోని ముఖ్యాంశాలు

దానియేలు గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

దానియేలు గ్రంథములోని ముఖ్యాంశాలు

“బైబిల్లోవున్న అత్యంత ఆసక్తికరమైన పుస్తకాల్లో దానియేలు గ్రంథం ఒకటి. అది శాశ్వతకాల సత్యాలతో నిండివుంది” అని హోల్‌మ్యాన్‌ ఇలస్ట్రేటెడ్‌ బైబిల్‌ డిక్షనరీ చెబుతోంది. సా.శ.పూ. 618లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడించి, “ఇశ్రాయేలీయుల . . . కొందరు బాలురను” బబులోనుకు చెరగా తీసుకువెళ్లినప్పటి నుండి జరిగిన సంఘటనలను దానియేలు వృత్తాంతం వివరిస్తోంది. (దానియేలు 1:1-3) వారిలో యౌవనస్థుడైన దానియేలు ఒకడు, బహుశా అప్పుడాయన కౌమారదశలోనే ఉండివుంటాడు. ఈ గ్రంథంలోని వృత్తాంతం దానియేలు ఇంకా బబులోనులోనే ఉన్నాడని వివరిస్తూ ముగుస్తుంది. అప్పటికి దాదాపు 100 ఏళ్లున్న దానియేలు, దేవుని నుండి ఈ వాగ్దానం పొందుతాడు: “నీవు . . . విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.”—దానియేలు 12:13.

దానియేలు గ్రంథంలోని మొదటి భాగం కాలక్రమానుసారంగా ప్రథమ పురుషంలో రాయబడింది, చివరి భాగం ఉత్తమ పురుషంలో రాయబడింది. దానియేలు రాసిన ఆ గ్రంథంలో ప్రపంచాధిపత్యాల ఉత్థాన పతనాలు, మెస్సీయ వచ్చే సమయం, మన కాలంలో జరిగే సంఘటనల వంటి అంశాల గురించిన ప్రవచనాలు ఉన్నాయి. * వృద్ధుడైన ఆ ప్రవక్త తన సుదీర్ఘ జీవితకాలాన్ని గుర్తుచేసుకుంటూ, దేవునిపట్ల యథార్థతను కాపాడుకునే స్త్రీపురుషులుగా ఉండమని మనల్ని ప్రోత్సహించే సంఘటనలను వివరించాడు. దానియేలు సందేశం సజీవమైనది, బలంగలది.—హెబ్రీయులు 4:12.

కాలక్రమానుసారమైన ఈ వృత్తాంతం మనకేమి బోధిస్తోంది?

(దానియేలు 1:1–6:28)

అది సా.శ.పూ. 617వ సంవత్సరం. దానియేలు, యౌవనస్థులైన ఆయన ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బబులోను ఆస్థానంలో ఉన్నారు. ఆ యౌవనస్థులు ఆస్థాన జీవితానికి సంబంధించిన శిక్షణ పొందుతున్న మూడు సంవత్సరాలు దేవునిపట్ల తమ యథార్థతను కాపాడుకుంటారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత, రాజైన నెబుకద్నెజరు తనను కలవరపర్చిన ఒక కల కంటాడు. దానియేలు ఆ కలేమిటో తెలియజేసి, ఆ తర్వాత దాని భావాన్ని వివరిస్తాడు. ఆ రాజు, యెహోవా “దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడు” అని గుర్తిస్తాడు. (దానియేలు 2:47) అయితే, కొంతకాలానికే నెబుకద్నెజరు ఆ పాఠాన్ని మరిచిపోయినట్లు అనిపిస్తుంది. దానియేలు ముగ్గురు స్నేహితులు ఒక పెద్ద ప్రతిమను ఆరాధించడానికి నిరాకరించినప్పుడు ఈ రాజు వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాడు. సత్యదేవుడు ఆ ముగ్గురిని రక్షిస్తాడు, “ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు” అని నెబుకద్నెజరు గుర్తించాల్సివస్తుంది.—దానియేలు 3:29.

నెబుకద్నెజరు మరో గమనార్హమైన కల కంటాడు. నరికివేయబడి, పెరగకుండా కట్టువేయబడ్డ ఒక పెద్ద వృక్షాన్ని ఆయన చూస్తాడు. దానియేలు ఆ కల భావాన్ని తెలియజేస్తాడు. ఈ కలలో కొంతభాగం, నెబుకద్నెజరుకు పిచ్చిపట్టి ఆ తర్వాత బాగైనప్పుడు నెరవేరుతుంది. అనేక దశాబ్దాల తర్వాత, రాజైన బెల్షస్సరు తన అధిపతులకు ఒక పెద్ద విందు ఏర్పాటుచేసి, యెహోవా ఆలయం నుండి తీసుకొచ్చిన పాత్రలను అవమానకరంగా ఉపయోగిస్తాడు. ఆ రాత్రే బెల్షస్సరు హతుడై, మాదీయుడైన దర్యావేషు రాజ్యాన్ని పొందుతాడు. (దానియేలు 5:30, 31) దర్యావేషు పాలనలో, దానియేలుకు 90 ఏళ్లు పైబడినప్పుడు, ఆ వృద్ధ ప్రవక్తను చంపేందుకు అసూయపరులైన అధికారులు పన్నాగం పన్నుతారు. అయితే, యెహోవా ఆయనను “సింహముల నోటనుండి” రక్షిస్తాడు.—దానియేలు 6:27.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:11-15నలుగురు యూదా యౌవనుల ముఖాలు సౌందర్యంగా కనిపించడానికి శాకాహార భోజనమే కారణమా? కాదు. అంతటి మార్పు కేవలం పదిరోజుల్లో ఏ ఆహారం తీసుకురాదు. వారి ముఖాల్లో మార్పు రావడానికి కారణం యెహోవాయే, తనమీద విశ్వాసముంచినందుకు ఆయన వారిని ఆశీర్వదించాడు.—సామెతలు 10:22.

2:1నెబుకద్నెజరు పెద్ద ప్రతిమ గురించిన కల ఎప్పుడు కన్నాడు? “నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సరమున” ఆ కల కన్నాడని ఆ వచనం చెబుతోంది. ఆయన సా.శ.పూ. 624లో రాజయ్యాడు. కాబట్టి, ఆయన సా.శ.పూ. 623లో, అంటే యూదాను ముట్టడించడానికి అనేక సంవత్సరాల ముందే, ఆయన ఏలుబడిలోని రెండవ సంవత్సరం మొదలై ఉండవచ్చు. ఆ సమయంలో దానియేలు ఆ కల భావాన్ని వివరించడానికి బబులోనులో ఉండే అవకాశమేలేదు. ఆ “రెండవ సంవత్సరము,” బబులోను రాజు యెరూషలేమును నాశనం చేసి ప్రపంచ పరిపాలకుడైన సా.శ.పూ. 607 నుండి లెక్కించబడినట్లు స్పష్టమౌతోంది.

2:32, 39వెండి భాగం ద్వారా సూచించబడిన రాజ్యం, బంగారపు శిరస్సు ద్వారా సూచించబడిన రాజ్యంకన్నా ఏ విధంగా అల్పమైనది, ఇత్తడి ద్వారా సూచించబడిన రాజ్యం వెండి ద్వారా సూచించబడిన రాజ్యం కన్నా ఏ విధంగా అల్పమైనది? ప్రతిమలోని వెండి భాగం ద్వారా సూచించబడిన మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి యూదాను పడద్రోసే ఆధిక్యత లభించలేదు కాబట్టి, బంగారు శిరస్సు ద్వారా సూచించబడిన బబులోను కన్నా అది అల్పమైనది. ఆ తర్వాత ఇత్తడి ద్వారా సూచించబడిన గ్రీసు ప్రపంచాధిపత్యం తెరమీదకు వచ్చింది. వెండి కన్నా ఇత్తడి ఎలా అల్పమైనదో, అలాగే మాదీయ పారసీకుల సామ్రాజ్యం కన్నా గ్రీసు సామ్రాజ్యం అల్పమైనది. గ్రీసు సామ్రాజ్యం విస్తారమైన ప్రాంతాన్ని పరిపాలించినా, మాదీయ పారసీకుల రాజ్యంలా దానికి దేవుని ప్రజలను విడిపించే ఆధిక్యత లభించలేదు.

4:8, 9—దానియేలు స్వయంగా శకునాలు చెప్పేవానిగా తయారయ్యాడా? లేదు. “శకునగాండ్ర అధిపతి” అనే మాట “బబులోను జ్ఞానులందరిలో ప్రధాని”గా దానియేలుకున్న స్థానాన్ని మాత్రమే సూచిస్తోంది.—దానియేలు 2:48.

4:10, 11, 20-22నెబుకద్నెజరు కలలోని మహావృక్షం దేనిని సూచిస్తోంది? ఆ వృక్షం మొదటిగా, ప్రపంచాధిపత్యానికి పరిపాలకునిగా నెబుకద్నెజరును సూచించింది. అయితే, ఆ పరిపాలన “లోకమంతట వ్యాపించి[వుంది]” కాబట్టి, ఆ వృక్షం దానికన్నా శ్రేష్ఠమైనదానిని సూచించాలి. దానియేలు 4:17 ఆ కలను మానవజాతి మీద “మహోన్నతుడగు దేవుని” పరిపాలనతో ముడిపెడుతోంది. కాబట్టి ఆ వృక్షం, ప్రాముఖ్యంగా భూమికి సంబంధించి యెహోవా విశ్వసర్వాధిపత్యాన్ని కూడా సూచిస్తోంది. ఆ విధంగా, ఆ కలకు రెండు నెరవేర్పులు ఉన్నాయి, మొదటిది నెబుకద్నెజరు పరిపాలన, రెండవది యెహోవా సర్వాధిపత్యం.

4:16, 23, 25, 32, 33“ఏడు కాలములు” ఎంత కాలాన్ని సూచిస్తున్నాయి? రాజైన నెబుకద్నెజరు రూపంలో అన్ని మార్పులు రావడానికి ఆ “ఏడు కాలములు” అక్షరార్థంగా ఏడు రోజులకన్నా ఎక్కువే అయివుండాలి. ఆయన విషయంలో ఈ కాలములు, 360 దినాలుగల ఏడు సంవత్సరాలు లేదా 2,520 దినాలు. గొప్ప నెరవేర్పు విషయంలో, ఈ “ఏడు కాలములు” 2,520 సంవత్సరాలు. (యెహెజ్కేలు 4:6, 7) అవి సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు ప్రారంభమై, సా.శ. 1914లో యేసు పరలోక రాజుగా సింహాసనాసీనుడైనప్పుడు ముగిశాయి.—లూకా 21:24.

6:6-10ఒక నిర్దిష్ట భంగిమలో యెహోవాకు ప్రార్థించాల్సిన అవసరంలేదు కాబట్టి, దానియేలు 30 రోజులు రహస్యంగా ప్రార్థించడం జ్ఞానయుక్తంగా ఉండేది కాదా? దానియేలు ప్రతీరోజు మూడుసార్లు ప్రార్థిస్తాడనే విషయం అందరికీ తెలుసు. అందుకే కుట్రదారులు ప్రార్థనలమీద ఆంక్షలు విధించే ఒక చట్టాన్ని అమలులోకి తీసుకురావాలనే పన్నాగాన్ని పన్నారు. ప్రార్థనకు సంబంధించి దానియేలు తన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నా తాను పాటిస్తున్న సూత్రాల విషయంలో ఆయన రాజీపడ్డాడని ఇతరులకు అనిపించవచ్చు, అలా చేయడం యెహోవాకు సంపూర్ణ భక్తి కనబర్చడంలో ఆయన తప్పిపోయాడని సూచించవచ్చు.

మనకు పాఠాలు:

1:3-8. దానియేలు, ఆయన సహచరులు యెహోవాకు యథార్థంగా ఉండాలనే దృఢనిశ్చయాన్ని కనబరచడం, తల్లిదండ్రుల నుండి వారు పొందిన శిక్షణ ఎంత విలువైనదో నొక్కిచెబుతోంది. దైవభక్తిగల తల్లిదండ్రులు తమ జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, తమ పిల్లలు కూడా అలాగే చేసేలా వారికి శిక్షణనిస్తే, పాఠశాలలో లేక మరోచోట ఎదురయ్యే ఎలాంటి శోధనలనైనా, ఒత్తిళ్ళనైనా వారి పిల్లలు నిరోధించగలరు.

1:10-12. “నపుంసకుల యధిపతి” రాజుకు ఎందుకు భయపడ్డాడో దానియేలు అర్థం చేసుకొని ఆయనమీద ఒత్తిడి తీసుకురాలేదు. అయితే, ఆ తర్వాత దానియేలు, కొంచెం మెతకగా వ్యవహరించే అవకాశమున్న “నియామకుని” దగ్గరికి వెళ్తాడు. కష్టపరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా అలాంటి అంతర్దృష్టితో, అవగాహనతో, వివేకంతో వ్యవహరించాలి.

2:29, 30. దానియేలులాగే, యెహోవా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడంవల్ల మనం సంపాదించుకున్న ఎలాంటి జ్ఞానం, గుణాలు, సామర్థ్యాల విషయంలోనైనా ఆయనకే పూర్తి ఘనతను చెల్లించాలి.

3:16-18. ఆ ముగ్గురు హెబ్రీయులు గతంలో ఆహారం విషయంలో రాజీపడినట్లయితే వారంత గట్టి నమ్మకంతో మాట్లాడేవారుకాదు. మనం కూడా “అన్ని విషయములలో నమ్మకమైనవారి”గా ఉండడానికి కృషిచేయాలి.—1 తిమోతి 3:11.

4:24-27. నెబుకద్నెజరు చవిచూడబోయే పరిస్థితుల గురించి, ‘తాను ఇకమీదట క్షేమంగా ఉండడానికి’ రాజు ఏమి చేయాలనే విషయం గురించి తెలియజేస్తున్నప్పుడు దానియేలు కనబరిచిన విశ్వాస, ధైర్యాలే దేవుని ప్రతికూల తీర్పులు ఇమిడివున్న రాజ్య సందేశం ప్రకటించడానికి అవసరం.

5:30, 31. “బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము” నెరవేరింది. (యెషయా 14:3, 4, 12-15) బబులోను రాజవంశీయులు కనబర్చినలాంటి గర్వాన్ని కనబరుస్తున్న అపవాదియైన సాతాను కూడా అలాంటి అవమానకరమైన అంతాన్నే చవిచూస్తాడు.—దానియేలు 4:30; 5:2-4, 22.

దానియేలు దర్శనాలు ఏమి తెలియజేస్తున్నాయి?

(దానియేలు 7:1–12:13)

సా.శ.పూ. 553లో, దానియేలు మొదటి దర్శనం పొందినప్పుడు ఆయన తన 70వ పడిలో ఉన్నాడు. ఆయన తన కాలం నుండి మనకాలం వరకున్న ప్రపంచాధిపత్యాల పరంపరను సూచించే నాలుగు మిక్కిలి గొప్ప జంతువులను చూస్తాడు. పరలోక దృశ్యానికి సంబంధించిన దర్శనంలో, ఆయన “మనుష్యకుమారుని పోలిన యొక[నికి],” ‘ఎన్నటికీ తొలగిపోని శాశ్వత ప్రభుత్వం’ ఇవ్వబడడాన్ని చూస్తాడు. (దానియేలు 7:13, 14) రెండేళ్ల తర్వాత, దానియేలు మాదీయ-పారసీక, గ్రీసులతోపాటు, ఉనికిలోకి వచ్చే “క్రూరముఖముగల . . . ఒక రాజుకు” సంబంధించిన దర్శనం కూడా చూస్తాడు.—దానియేలు 8:23.

అది సా.శ.పూ. 539వ సంవత్సరం. బబులోను నాశనమైంది, మాదీయుడైన దర్యావేషు కల్దీయుల రాజ్యంమీద పరిపాలకుడౌతాడు. తన స్వదేశం పునఃస్థాపించబడడం గురించి దానియేలు యెహోవాకు ప్రార్థిస్తాడు. ఆయనింకా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, రాబోయే మెస్సీయ గురించి దానియేలుకు “గ్రహింప శక్తి ఇచ్చుటకు” యెహోవా ఆయన దగ్గరికి గబ్రియేలు దూతను పంపిస్తాడు. (దానియేలు 9:20-25) కాలం ముందుకుసాగి సా.శ.పూ. 536/535వ సంవత్సరం వస్తుంది. ఇశ్రాయేలీయుల చిన్నగుంపు యెరూషలేముకు తిరిగొస్తుంది. అయితే ఆలయ నిర్మాణ పనికి వ్యతిరేకత ఎదురౌతుంది. దానివల్ల దానియేలు ఆందోళనపడతాడు. దాని గురించి దానియేలు పట్టుదలతో ప్రార్థించినప్పుడు యెహోవా ఆయన దగ్గరికి ఉన్నత స్థానంలోవున్న ఒక దేవదూతను పంపిస్తాడు. ఆ దేవదూత దానియేలును బలపర్చి, ప్రోత్సహించిన తర్వాత, ఉత్తర దేశపురాజుకు, దక్షిణ దేశపురాజుకి మధ్య జరిగే ఆధిపత్య పోరును వివరించే ప్రవచనాన్ని ఆయనకు తెలియజేస్తాడు. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ రాజ్యం, నలుగురు సైనికాధికారుల మధ్య విభజించబడినప్పటి నుండి మహా అధిపతియైన మిఖాయేలు “వచ్చు” కాలంవరకు ఆ ఇద్దరు రాజుల మధ్య పోరు కొనసాగుతుంది.—దానియేలు 12:1.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

8:9“ఆనందదేశం” దేనిని సూచిస్తోంది? ఈ సందర్భంలో “ఆనందదేశం,” ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యపు కాలంలో అభిషిక్త క్రైస్తవుల భూ సంబంధ పరిస్థితిని సూచిస్తోంది.

8:25“రాజాధిరాజు” ఎవరు? “రాజు” అని అనువదించబడిన సార్‌ అనే హీబ్రూ పదానికి ప్రాథమికంగా “అధిపతి” లేదా “ప్రధానుడు” అనే అర్థాలున్నాయి. “రాజాధిరాజు” అనే బిరుదు, ‘ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకని’తోసహా ప్రధాన దేవదూతలందరికీ అధిపతియైన యెహోవాకు మాత్రమే అన్వయిస్తుంది.—దానియేలు 10:13.

9:21దానియేలు గబ్రియేలు దేవదూతను “మనుష్యుడు” అని ఎందుకు పేర్కొన్నాడు? గబ్రియేలు, దానియేలుకు అంతకుముందు దర్శనంలో కనిపించినట్లే ఈ దర్శనంలో కూడా మానవ రూపంలో కనిపించాడు కాబట్టి దానియేలు ఆయనను అలా పేర్కొన్నాడు.—దానియేలు 8:15-17.

9:2770వ వారపు సంవత్సరాల లేదా సా.శ. 36 ముగింపు వరకు ఏ నిబంధన ‘అనేకులకు స్థిరపర్చబడింది’ లేదా అమలులో ఉంది? సా.శ. 33లో యేసు మ్రానుమీద వ్రేలాడదీయబడినప్పుడు ధర్మశాస్త్ర నిబంధన తొలగించబడింది. అయితే యూదులు అబ్రాహాము వంశీయులు కాబట్టి, అబ్రాహాము నిబంధనను సహజ ఇశ్రాయేలీయులకు సా.శ. 36 వరకు అమలులో ఉంచడం ద్వారా యెహోవా వారి కోసం ప్రత్యేక అనుగ్రహ కాలాన్ని పొడిగించాడు. “దేవుని ఇశ్రాయేలు” విషయంలో అబ్రాహాము నిబంధన ఇంకా అమలులోనే ఉంది.—గలతీయులు 3:7-9, 14-18, 29; 6:16.

మనకు పాఠాలు:

9:1-23; 10:11. వినయం, దైవభక్తి, శ్రద్ధగా అధ్యయనం చేయడం, పట్టుదలతో ప్రార్థించడం వంటి లక్షణాలను దానియేలు కనబరిచాడు కాబట్టి ఆయన “బహు ప్రియుడ[య్యాడు].” తన మరణంవరకు దేవునికి నమ్మకంగా ఉండడానికి కూడా ఆయనకు ఈ లక్షణాలే దోహదపడ్డాయి. మనం దానియేలు మాదిరిని అనుసరించాలని తీర్మానించుకుందాం.

9:17-19. త్వరలో రానున్న “నీతి నివసించు” దేవుని నూతనలోకం కోసం మనం ప్రార్థించినా, మన బాధలు, కష్టాలు తీరిపోవడంమీద దృష్టినిలిపే బదులు యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడంమీద, ఆయన సర్వాధిపత్యమే సరైందని నిరూపించడంమీద మన దృష్టి నిలపవద్దా?—2 పేతురు 3:13.

10:9-11, 18, 19. దానియేలు దగ్గరకు వచ్చిన దేవదూతను అనుకరిస్తూ, మనం చేయూతనివ్వడం ద్వారా, ఓదార్పుకరమైన మాటల ద్వారా ఒకరినొకరం ప్రోత్సహించుకొని, బలపర్చుకోవాలి.

12:3. అంత్యదినాల్లో, “బుద్ధిమంతులు” అయిన అభిషిక్త క్రైస్తవులు “జ్యోతులవలె” ప్రకాశిస్తూ ‘వేరే గొర్రెలకు’ చెందిన “గొప్పసమూహము”తోపాటు ‘అనేకులను నీతిమార్గములోకి’ తీసుకొచ్చారు. (ఫిలిప్పీయులు 2:16; ప్రకటన 7:9; యోహాను 10:16) అభిషిక్తులు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, భూమ్మీదున్న విధేయులైన మానవులు విమోచన క్రయధనం నుండి పూర్తి ప్రయోజనాలను పొందేలా క్రీస్తుతో కలిసి పనిచేసినప్పుడు సంపూర్ణ భావంలో వారు ‘నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.’ ‘వేరే గొర్రెలు’ అభిషిక్తులపట్ల నమ్మకంగా ఉంటూ వారికి అన్నివిధాలుగా హృదయపూర్వక మద్దతునివ్వాలి.

యెహోవా ‘తనపట్ల భయభక్తులుగలవారిని ఆశీర్వదిస్తాడు’

మనం ఆరాధించే దేవుని గురించి దానియేలు గ్రంథం ఏమి బోధిస్తోంది? ఆ గ్రంథంలో ఇప్పటికే నెరవేరిన ప్రవచనాలను, నెరవేరనున్న ప్రవచనాలను పరిశీలించండి. అవి, యెహోవా తన మాటలను నెరవేర్చే వ్యక్తని ఎంత స్పష్టంగా వర్ణిస్తున్నాయో కదా!—యెషయా 55:11.

దానియేలు గ్రంథంలోని వృత్తాంతం మన దేవుని గురించి ఏమి తెలియజేస్తోంది? బబులోను ఆస్థాన జీవితంలో ఇమిడిపోవడానికి తిరస్కరించిన ఆ నలుగురు హీబ్రూ యువకులు ‘జ్ఞానము, సకల శాస్త్రప్రవీణత, వివేచన’ పొందారు. (దానియేలు 1:17) సత్యదేవుడు తన దేవదూతను పంపించి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించాడు. దానియేలు సింహాల గుహ నుండి విడిపించబడ్డాడు. యెహోవా ‘తనపట్ల నమ్మకమున్నవారికి సహాయం చేసే కేడెముగా’ ఉండడమే కాక ‘తనపట్ల భయభక్తులుగలవారిని ఆశీర్వదిస్తాడు.’—కీర్తన 115:9, 13.

[అధస్సూచి]

^ పేరా 4 దానియేలు గ్రంథంలోని ప్రతీ వచనాన్ని పరిశీలించేందుకు, యెహోవాసాక్షులు ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకం చూడండి.

[18వ పేజీలోని చిత్రం]

దానియేలు ఎందుకు ‘బహుప్రియుడయ్యాడు’?