కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంకల్పవంతమైన జీవితం సాధ్యమే!

సంకల్పవంతమైన జీవితం సాధ్యమే!

సంకల్పవంతమైన జీవితం సాధ్యమే!

చాలామంది డబ్బుకోసం, అదిచ్చే ఆనందాలకోసం జీవిస్తున్నారు. కొందరేమో లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికే జీవిస్తారు. మరికొందరు తమ కళానైపుణ్యాలను పరిపూర్ణం చేసుకునేందుకు జీవిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి జీవించేవారు కూడా ఉన్నారు. కానీ చాలామందికి తాము దేనికోసం జీవిస్తున్నామో, తాము ఈ లోకంలో ఎందుకున్నామో తెలీదు.

మరి మీ విషయమేమిటి? మీరీ లోకంలో ఎందుకున్నారనే దానిగురించి ఎప్పుడైనా తీక్షణంగా ఆలోచించారా? ప్రజలు తమ జీవిత ధ్యేయంగా ఎంచుకున్న పనులు వారికి నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చాయో లేదో తెలుసుకునేందుకు వాటిలో కొన్నింటిని ఎందుకు పరిశీలించకూడదు? నిజానికి సంకల్పవంతమైన జీవితానికి ఏది తోడ్పడుతుంది?

డబ్బు, ఆనందం అవసరమైనవే

బైబిల్లోని ప్రసంగి పుస్తకం 7:12లో ఇలా ఉంది: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” అవును, డబ్బు ఉపయోగపడుతుంది. జీవించేందుకు, మరి ముఖ్యంగా కుటుంబాన్ని పోషించే బాధ్యత మీకుంటే, మీకు డబ్బు అవసరం.—1 తిమోతి 5:8.

డబ్బు తీసుకురాగల కొన్ని ఆనందాలు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. క్రైస్తవమత వ్యవస్థాపకుడైన యేసుక్రీస్తు తనకు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పినా, ఆయన విందు భోజనం ఆరగించి, ద్రాక్షారసం తీసుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు, ఆయన ఖరీదైన వస్త్రం కూడా ధరించాడు.—మత్తయి 8:20; యోహాను 2:1-11; 19:23, 24.

అయితే యేసు సుఖాలను అనుభవించడానికే జీవించలేదు. ఆయన సరైనవాటికే ప్రాధాన్యతనిచ్చాడు. యేసు ఇలా చెప్పాడు: “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” ఆ తర్వాత ఆయన తన పొలంలో విస్తారంగా పంట పండిన ఒక ధనవంతుని ఉపమానాన్ని చెప్పాడు, ఆ ధనవంతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: ‘నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును? నా కొట్లువిప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో—ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును.’ ఆ ధనవంతుని ఆలోచనలోని పొరపాటు ఏమిటి? ఆ ఉపమానం ఇంకా ఇలా కొనసాగింది: “దేవుడు—వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణమునడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని [ధనవంతునితో] చెప్పెను.” ఆ ధనవంతుడు పంటను కొట్లలో కూర్చుకున్నా, ఆయన తాను చనిపోయిన తర్వాత, తాను సమకూర్చుకొన్న పంటను ఏమాత్రం అనుభవించలేడు. ఆ ఉపమానం ముగింపులో యేసు తన శ్రోతలకు ఈ పాఠం చెప్పాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”—లూకా 12:13-21.

నిజమే, జీవితంలో మనకు కొంత డబ్బు, ఆనందం అవసరమే. అయితే, డబ్బు, ఆనందం, ఇవే జీవితంలో అత్యంత ప్రాముఖ్యం కాదు. కానీ నిజంగా అత్యంత ప్రాముఖ్యమైనది దేవునిపట్ల ధనవంతులుగా ఉండడం, అంటే దేవుని అనుగ్రహం పొందేలా జీవించడం.

పేరు సంపాదించుకోవడం ముఖ్యమా?

చాలామంది పేరు సంపాదించుకోవడానికే జీవిస్తారు. పేరు సంపాదించుకోవాలని, ఇతరులు తమను గుర్తుంచుకోవాలని అనుకోవడంలో తప్పేమీలేదు. ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.”—ప్రసంగి 7:1.

నిజానికి ఒక వ్యక్తి చనిపోయిన రోజున, ఆయన జీవితమంతా గ్రంథస్థంచేసి పెట్టినట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తి మెచ్చుకోదగిన పనులు చేసివుంటే, ఆ వ్యక్తి పుట్టిన రోజుకన్నా ఆయన చనిపోయిన రోజే ఎంతో మేలైనదిగా ఉంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి తాను పుట్టిన రోజున ఏమీ సాధించివుండడు.

బైబిల్లోని ప్రసంగి పుస్తకాన్ని సొలొమోను రాజు రాశాడు. సొలొమోను సవతి అన్న అబ్షాలోము తనకొక పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. అయితే, ఆయన ఇంటిపేరు నిలబెట్టే ఆయన ముగ్గురు కుమారులు చిన్నతనంలో చనిపోయారు. అప్పుడు అబ్షాలోము ఏమిచేశాడు? లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము . . . ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను.” (2 సమూయేలు 14:27; 18:18) ఆ స్తంభం శిథిలాలు కనుగొనబడలేదు. బైబిలు చదివేవారికి అబ్షాలోము తన తండ్రియైన దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి తిరుగుబాటు చేసిన వ్యక్తిగానే తెలుసు.

నేడు అనేకులు తాము సాధించిన వాటిద్వారా గుర్తుండిపోవడానికి ప్రయత్నిస్తారు. వారు కాలంతోపాటు అభిరుచులు మారే ప్రజల దృష్టిలో గొప్పవారిగా ఉండాలనుకుంటారు. అయితే అలాంటి కీర్తి ఎప్పటికీ ఉంటుందా? ద కల్చర్‌ ఆఫ్‌ నార్సిసిజమ్‌ అనే పుస్తకంలో క్రిస్ట్‌ఫర్‌ లాష్‌ ఇలా రాస్తున్నాడు: “విజయం ఎక్కువగా యౌవనం, ఆకర్షణ, కొత్తదనం వంటివాటి మీదే ఆధారపడివున్న మనకాలంలో, కీర్తి ముందెన్నడూ లేనంత అశాశ్వతంగా తయారైంది, కాబట్టే ప్రజాదరణ పొందినవారు దాన్ని పోగొట్టుకుంటామేమోనని అనుక్షణం బాధపడతారు.” తత్ఫలితంగా చాలామంది ప్రముఖులు మాదక ద్రవ్యాలను, మద్యపానాన్ని తీసుకుంటూ, తరుచూ చిన్నవయస్సులోనే తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. నిజానికి కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకోవాలనుకోవడమూ వ్యర్థమే.

ఎవరి దృష్టిలో మనం మంచి పేరు సంపాదించుకోవాలి? తన ధర్మశాస్త్రాన్ని పాటించిన కొందరి గురించి మాట్లాడుతూ యెహోవా తన ప్రవక్తయైన యెష్షయా ద్వారా ఇలా చెప్పాడు: “నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను . . . శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను.” (యెషయా 56:4, 5) దేవునికి లోబడినందున ఆయనకిష్టమైనవారు “శ్రేష్ఠమైన పేరు[ను]” పొందుతారు. దేవుడు వారి పేర్లను “నిత్య[ము]” గుర్తుంచుకుంటాడు, అందువల్ల వారు నాశనం చేయబడరు. అలాంటి పేరును అంటే మన సృష్టికర్తయైన యెహోవా దృష్టిలో ఒక మంచి పేరు సంపాదించుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.

నమ్మకస్థులు పరదైసు భూమిపై నిత్యం జీవించే కాలాన్ని గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ఆ పరదైసులోని ‘నిత్యజీవమే’ “వాస్తవమైన జీవము,” అంటే దేవుడు మానవులను సృష్టించినప్పుడు వారికివ్వాలని సంకల్పించిన జీవము. (1 తిమోతి 6:12, 18) క్షణకాలముండే, సంతృప్తినివ్వని జీవితం జీవించేకన్నా, నిత్యజీవం పొందడానికే మనం ప్రయత్నించవద్దా?

కళాభిరుచి, మానవసేవ నిజమైన సంతృప్తిని తీసుకురావు

చాలామంది కళాకారులు కళా పరిపూర్ణత అని తామనుకునే అత్యున్నత స్థాయికి చేరుకునేలా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటారు. అయితే దానికి ఇప్పుడున్న జీవితం సరిపోదు. ముందరి ఆర్టికల్‌లో పేర్కొన్న కళాకారుడు హిడియో, 90 సంవత్సరాల వయసులో తన కళా నైపుణ్యాన్ని వృద్ధిచేసుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమించాడు. ఒక కళాకారుడు తాను సాధించిన వాటినిబట్టి సంతృప్తి చెందినా, యౌవనస్థుడిగా ఉన్నప్పుడు సృష్టించగలిగినన్ని కళాఖండాలను ఇప్పుడు ఆయన ఏ మాత్రం సృష్టించలేడు. ఒకవేళ ఆయన ఎప్పటికీ చనిపోకుండా ఉంటే? ఆయన తన కళలో ఎంతటి నైపుణ్యతను సాధించగలడో ఒక్కసారి ఊహించండి!

మానవసేవనే జీవిత పరమావధిగా చేసుకోవడం సరైనదేనా? ఒక వ్యక్తి బీదలకు సహాయపడేందుకు, అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తన వనరుల్ని ఉపయోగించడం ప్రశంసనీయమే. అయితే బైబిలు ఇలా చెబుతోంది: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించడం ఖచ్చితంగా సంతృప్తినిస్తుంది. ఒక వ్యక్తి ఇలాంటి వాటికి తన జీవితాన్ని ధారపోసినా ఎంత ప్రగతి సాధించగలడు? మానవులమైన మనం ఇతరుల బాధలను కొంతవరకే తీసివేయగలం. అయితే ఒకరికి ఎంత ధనమున్నా అది చాలామంది అలక్ష్యం చేస్తున్న, వారి జీవితంలో తీరకుండావున్న ఒక ప్రాథమిక అవసరాన్ని తీర్చలేదు. ఆ అవసరమేమిటి?

జన్మతాఃవున్న ఒక అవసరాన్ని తీర్చుకోవడం తప్పనిసరి

యేసు కొండమీది తన ప్రసంగంలో జన్మతాఃవున్న ఒక ప్రాథమిక అవసరాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:3, NW) కాబట్టి, నిజమైన సంతోషాన్ని పొందడమనేది సంపద, పేరుప్రఖ్యాతలు, కళా విజయాలను సాధించడం లేదా మానవసేవ చేయడం వంటివాటిపై ఆధారపడి ఉండదని బైబిలు చెబుతోంది. బదులుగా, అది మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడంపై అంటే దేవుణ్ణి ఆరాధించాలనే అవసరాన్ని తీర్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది.

సృష్టికర్త ఎవరో తెలియనివారు ఆయనను వెదకాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. ఆయనిలా ఇలా చెప్పాడు: “యావద్భూమిమీద కాపురముండుటకు [దేవుడు] యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.”—అపొస్తలుల కార్యములు 17:26-28.

సత్యదేవుణ్ణి ఆరాధించడమనే అవసరాన్ని తీర్చుకోవడమే జీవితంలో నిజమైన సంతోషం పొందడానికి కీలకం. మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడం, “వాస్తవమైన జీవమును” పొందే నిరీక్షణను మనకిస్తుంది. థెరీసా ఉదాహరణను పరిశీలించండి. గంటసేపు సాగే స్వీయనిర్మిత ధారావాహికలో ప్రధాన పాత్రను పోషించడానికి మొట్టమొదటి నల్లజాతికి చెందిన అమెరికా పౌరురాలు నటిగా మారినప్పుడు ఆమె తన దేశంలోని టెలివిజన్‌లో ప్రఖ్యాత తారగా పేరు సంపాదించుకుంది. కొద్దికాలానికే ఆమె వాటన్నింటిని విడిచిపెట్టింది. ఎందుకు? ఆమె ఇలా అంది: “దేవుని వాక్యమిచ్చే ఉపదేశాన్ని వినడంవల్లే శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించవచ్చని నేను గట్టిగా నమ్మాను.” లైంగిక సన్నివేశాలు, హింస ఎక్కువగా ఉండే టీవీ ధారావాహికల్లో నటించి దేవునితో తనకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసుకోవడం థెరిస్సాకు ఇష్టంలేదు. ఆమె టీవీలో నటించడం పూర్తిగా మానేసి, నిజంగా సంతృప్తినిచ్చే జీవితంవైపు పయనం సాగించింది. ఆమె దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి ఇతరులకు సహాయపడేందుకు కృషిచేస్తూ దేవుని రాజ్యసువార్తను ప్రకటించే పూర్తికాల ప్రచారకురాలిగా సేవచేసింది కాబట్టే, ఆమె దేవుని జ్ఞాపకంలో ఉండిపోయింది.

థెరిస్సా నటించడం మానుకోవాలని తీసుకున్న నిర్ణయం గురించి, ఆమె ఒకప్పటి పరిచయస్థుడు ఇలా అన్నాడు: “ఆమెకు మంచి కెరియర్‌ ఉందని నాకనిపించింది. దాన్ని వదిలిపెట్టినందుకు నాకు చాలా బాధేసింది. అయితే ఆమె నిజానికి దానికన్నా ఎంతో విలువైనదాన్ని, శ్రేష్ఠమైనదాన్నే కనుగొంది.” ఆ తర్వాత థెరిస్సా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత, ఆ పరిచయస్థుడే ఇలా అన్నాడు: “ఆమె జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపింది, జీవితంలో ఎవరైనా కోరుకునేది అదే కదా. మనలో ఎంతమందిమి అలా చెప్పగలం చెప్పండి?” జీవితంలో దేవునితో మంచి సంబంధం కలిగివుండడానికి ప్రాధాన్యతనిచ్చేవారు, చనిపోయినా రాజ్య పరిపాలనలో పునరుత్థానం చేయబడే అంటే తిరిగి బ్రతికించబడే చక్కటి నిరీక్షణ వారికుంది.—యోహాను 5:28, 29.

సృష్టికర్తకు భూమి విషయంలో, దానిపై నివసిస్తున్న మానవుల విషయంలో ఒక సంకల్పముంది. మీరు ఆ సంకల్పం గురించి తెలుసుకోవాలని, పరదైసు భూమిపై నిత్యం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 37:10, 11, 29) ఆకాశాన్ని, భూమిని సృజించిన యెహోవా గురించి, ఆయన మీ కోసం సంకల్పించినదాని గురించి తెలుసుకునేందుకు ఇదే మంచి సమయం. మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులు దానిని మీకు తెలియజేసేందుకు సుముఖంగా ఉన్నారు. దయచేసి వారిని సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు రాయండి.

[5వ పేజీలోని చిత్రం]

యేసు ఉపమానంలోని ధనవంతుడు తనలోతాను అనుకున్న మాటల్లోని పొరపాటు ఏమిటి?

[7వ పేజీలోని చిత్రం]

పరదైసు భూమిపై నిత్యజీవం అనుభవించాలని మీరు కోరుకుంటున్నారా?