కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నహూము, హబక్కూకు, జెఫన్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

నహూము, హబక్కూకు, జెఫన్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

నహూము, హబక్కూకు, జెఫన్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

ప దిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి రాజధానియైన షోమ్రోనును, ప్రపంచాధిపత్యంగా ఉన్న అష్షూరు అప్పటికే నాశనం చేసింది. యూదాకు కూడా అది ఎప్పటినుండో ఒక ముప్పుగానే ఉంది. అష్షూరు రాజధానియైన నీనెవె కోసం యూదా ప్రవక్తయైన నహూము దగ్గర ఒక సందేశముంది. అది, సా.శ.పూ. 632కు ముందే రాయబడిన బైబిలు పుస్తకమైన నహూములో ఉంది.

ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం ప్రపంచాధిపత్యమైంది, కొన్నిసార్లు కల్దీయ రాజులు కూడా దానిని పరిపాలించారు. యెహోవా తన తీర్పులను అమలు చేయడానికి బబులోనును ఉపకరణంగా ఎలా ఉపయోగించుకుంటాడో, చివరకు దానికి ఏమి జరుగుతుందో హబక్కూకు పుస్తకంలో తెలియజేయబడింది. ఈ పుస్తకం బహుశా సా.శ.పూ. 628లో పూర్తిచేయబడివుండవచ్చు.

నహూము, హబక్కూకుకన్నా ముందే యూదాకు చెందిన జెఫన్యా ప్రవక్తగా సేవచేశాడు. సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడడానికి ముందు 40 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం ప్రవక్తగా సేవచేసిన జెఫన్యా, యూదా నాశనం చేయబడుతుందనే కాక దానికోసం ఒక నిరీక్షణా సందేశాన్ని కూడా ప్రకటించాడు. బైబిల్లోని జెఫన్యా పుస్తకంలో ఇతర జనాంగాలకు సంబంధించిన తీర్పు సందేశాలు కూడా ఉన్నాయి.

“నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ”

(నహూము 1:1-3:19)

‘దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడైన’ యెహోవా దేవుడే “నీనెవెనుగూర్చిన దేవోక్తి” ఇచ్చాడు. రక్షణకై తనపై ఆధారపడేవారికి యెహోవా “శ్రమ దినమందు . . . ఆశ్రయదుర్గముగా” ఉన్నా, నీనెవె మాత్రం నాశనం చేయబడుతుంది.—నహూము 1:1, 3, 7.

‘యెహోవా, యాకోబు సంతతిని మరల అతిశయాస్పదముగా’ చేస్తాడు. అయితే అష్షూరు రాజ్యం ‘చీల్చివేసే సింహములాగ’ దేవుని ప్రజల్ని భయకంపితుల్ని చేసింది. అందుకే యెహోవా ‘నీనెవె రథములను కాల్చివేస్తాడు.’ అంతేకాక, ‘కత్తి దాని కొదమ సింహములను మ్రింగివేస్తుంది.’ (నహూము 2:2, 12, 13) “నరహత్య చేసిన” నీనెవె ‘పట్టణానికి శ్రమ’ ఎదురౌతుంది. ‘దానిగూర్చిన వార్త విను వారందరు దాని విషయమై చప్పట్లు కొడుతూ’ సంతోషిస్తారు.—నహూము 3:1, 19.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:9—నీనెవెను ‘బొత్తిగా నివారణచేయడం’ వల్ల యూదాకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి? దానివల్ల వారికి అష్షూరు నుండి ఇక ఏమాత్రం ప్రమాదం ఉండదు అంటే ‘బాధ రెండవమారు రాదు.’ నీనెవె అప్పటికే నాశనం చేయబడినట్లుగా మాట్లాడుతూ నహూము, “సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము” అని రాశాడు.—నహూము 1:15.

2:6—“నదులదగ్గరనున్న” ఏ “గుమ్మములు తెరువబడుచున్నవి”? ఆ గుమ్మాలు, టైగ్రీస్‌ నది నీరు నీనెవె ప్రాకారాలకు వేసిన కన్నాలను సూచిస్తున్నాయి. సా.శ.పూ. 632లో బబులోనీయుల, మాదీయుల సంకీర్ణ సైన్యాలు నీనెవెపై దండెత్తి వచ్చినప్పుడు అది అంతగా భయపడలేదు. అది దాని ఎత్తైన ప్రాకారాల వెనుక సురక్షితంగా ఉన్నట్లు భావిస్తూ తనను తాను దుర్భేద్యమైన నగరంగా పరిగణించుకుంది. అయితే, భారీ వర్షాల వల్ల టైగ్రీస్‌ నది పొంగిపొర్లింది. ఈ వరదనీరు “పట్టణంలోని కొంత భాగాన్ని ముంచివేసి, ప్రాకారాలను కొంత మేర కూల్చివేసింది” అని చరిత్రకారుడైన డయోడోరస్‌ చెబుతున్నాడు. అలా నదుల దగ్గరున్న గుమ్మాలు తెరవబడడమేకాక ప్రవచించబడినట్లుగా నీనెవె పట్టణం ఎండిన చెత్త కాలినంత త్వరగా నేలమట్టమైంది.—నహూము 1:8-10.

3:4—నీనెవె ఎందుకు ఒక వేశ్యతో పోల్చబడింది? ఇతర దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటాననీ, సహాయం చేస్తాననీ వాగ్దానం చేసిన నీనెవెనే చివరకు వారిని అణచివేసి, వారిని మోసగించింది. ఉదాహరణకు, సిరియా మరియు ఇశ్రాయేలు దేశాల పథకాన్ని వమ్ముచేయడానికి యూదా రాజైన ఆహాజుకు అష్షూరు కొంత సహాయం చేసింది. కానీ చివరకు ‘అష్షూరురాజే అతనిని [ఆహాజును] బాధపరిచాడు.’—2 దినవృత్తాంతములు 28:20.

మనకు పాఠాలు:

1:2-6. తనను మాత్రమే ఆరాధించడానికి నిరాకరించే శత్రువులపై యెహోవా ప్రతీకారం తీర్చుకోవడం, ఆయన తన ఆరాధకుల నుండి సంపూర్ణ భక్తిని కోరుతున్నాడని చూపిస్తోంది.—నిర్గమకాండము 20:4, 5.

1:10. నీనెవె చుట్టూ వందలాది బురుజులతో ఎత్తైన ప్రాకారాలున్నా, అవి యెహోవా మాటల నెరవేర్పును అడ్డుకోలేకపోయాయి. నేడు యెహోవా ప్రజల శత్రువులు దేవుని కఠిన తీర్పులను తప్పించుకోలేరు.—సామెతలు 2:22; దానియేలు 2:44.

‘నీతిమంతుడు బ్రదుకును’

(హబక్కూకు 1:1-3:19)

హబక్కూకు పుస్తకంలోని మొదటి రెండు అధ్యాయాల్లో ప్రవక్తకు, యెహోవా దేవునికి మధ్య జరిగిన సంభాషణ రాయబడింది. యూదాలో జరుగుతున్నవాటిని చూసి కలవరపడిన హబక్కూకు దేవుణ్ణి ఇలా అడిగాడు: “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు?” దానికి యెహోవా, “ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను” అని సమాధానమిచ్చాడు. యూదాను శిక్షించడానికి దేవుడు ఆ “దుర్మార్గులను” ఉపయోగించబోతున్నాడని తెలుసుకుని హబక్కూకు ఆశ్చర్యపోయాడు. (హబక్కూకు 1:3, 6, 13) నీతిమంతులు బ్రతికేవుంటారు గానీ శత్రువులు మాత్రం శిక్ష తప్పించుకోరని దేవుడు ఆయనకు హామీ ఇచ్చాడు. కల్దీయుల శత్రువులపైకి రాబోతున్న ఐదు తెగుళ్ల గురించి కూడా హబక్కూకు రాశాడు.—హబక్కూకు 2:4.

కరుణించమని ప్రార్థిస్తూ “వాద్యములతో పాడదగిన [విలాపగీతంలో]” హబక్కూకు, పూర్వం యెహోవా ఎర్రసముద్రం దగ్గర, అరణ్యంలో, యెరికో దగ్గర తన మహాశక్తిని ప్రదర్శించాడని గుర్తుచేసుకుంటాడు. హార్‌మెగిద్దోనులో తన శత్రువులను నాశనం చేయడానికి యెహోవా మహాకోపంతో తన సైన్యాలను నడిపించడాన్ని గురించి కూడా ఆ ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రార్థనను ఆయన ఈ మాటలతో ముగించాడు: “ప్రభువగు యెహోవాయే నాకు బలము; ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును, ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.”—హబక్కూకు 3:1, 19.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:5, 6—కల్దీయులు యెరూషలేముపై దాడిచేస్తారని యూదులు ఎందుకు నమ్మలేకపోయారు? హబక్కూకు ప్రవచించడం మొదలుపెట్టే సమయానికి యూదా దేశం శక్తిమంతమైన ఐగుప్తు ఆధిపత్యం క్రింద ఉంది. (2 రాజులు 23:29, 30, 34) బబులోనీయులు అప్పుడప్పుడే శక్తిమంతంగా తయారవుతున్నా వారింకా ఫరోనెకోను ఓడించలేదు. (యిర్మీయా 46:2) అంతేకాదు, యెరూషలేములో యెహోవా ఆలయం ఉంది, దావీదు వంశస్థులు అక్కడినుండే పరిపాలించారు. కల్దీయులు యెరూషలేమును నాశనం చేయడానికి దేవుడు అనుమతించే “కార్యము” అప్పట్లో జీవించిన యూదులకు ఊహకందనిది. హబక్కూకు మాటలు వారికి ఎంత నమ్మశక్యం కానివిగా అనిపించినా, బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడం గురించి ఆయనకివ్వబడిన దర్శనం సా.శ.పూ. 607లో ‘నెరవేరింది.’—హబక్కూకు 2:3.

2:5—‘ఆశపెట్టుకొనువాడు’ ఎవరు, అతనెందుకు ‘తృప్తినొందడు’? ఇతర దేశాలను స్వాధీనపర్చుకోవడానికి తమ యుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శించే బబులోనీయులే ఆ ‘ఆశపెట్టుకొనువాడు.’ విజయోత్సాహం వారికి మత్తు కలిగించింది. అయితే వారు సకల జనులను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించలేరు, ఎందుకంటే యోహోవా మాదీయుల, పారసీకుల ద్వారా వారిని మట్టికరిపిస్తాడు. నేడు ఆ ‘ఆశపెట్టుకొనువాడు,’ రాజకీయ శక్తులకు ప్రతీకగా ఉన్నాడు. వాటికి కూడా ఎంతో అధికార దాహం ఉంది. అయితే ఇతను కూడా ‘తృప్తినొందడు’ లేదా ‘సకల జనులను సమకూర్చుకోవాలనే’ కోరికను నెరవేర్చుకోలేడు. కేవలం దేవుని రాజ్యమే మానవజాతినంతటినీ ఐక్యపరుస్తుంది.—మత్తయి 6:9, 10.

మనకు పాఠాలు:

1:1-4; 1:12–2:1. హబక్కూకు నిష్కపటంగా ప్రశ్నలు అడిగాడు, యెహోవా వాటికి సమాధానమిచ్చాడు. సత్యదేవుడు తనకు నమ్మకంగా ఉండే సేవకుల ప్రార్థనలను వింటాడు.

2:1. హబక్కూకులాగే మనం కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ, యెహోవా సేవలో చురుగ్గా ఉండాలి. అంతేకాదు, ఏదైనా విషయంలో మనం సరిదిద్దబడితే దానికి అనుగుణంగా మన ఆలోచనా సరళిని మార్చుకోవడానికి సుముఖంగా ఉండాలి.

2:3; 3:16. యెహోవా దినం కోసం మనం నమ్మకంగా ఎదురుచూస్తూనే అప్రమత్తంగా కూడా ఉండాలి.

2:4. రాబోతున్న యెహోవా తీర్పు దినాన్ని మనం తప్పించుకోవాలంటే మనం విశ్వాసంతో, ఓపికతో జీవించాలి.—హెబ్రీయులు 10:36-38.

2:6, 7, 9, 12, 15, 19. మోసం చేసి సంపాదించిన ధనం కోసం ఆశపడేవారికి, దౌర్జన్యాన్ని ప్రేమించేవారికి, అనైతికంగా జీవించేవారికి లేదా విగ్రహారాధన చేసేవారికి శ్రమలు తప్పవు. ఇలాంటి లక్షణాలను అలవర్చుకోకుండా లేదా ఇలాంటి క్రియలు చేయకుండా మనం జాగ్రత్తపడాలి.

2:11. ఈ లోకంలోని దుష్టత్వాన్ని మనం వెల్లడిచేయలేకపోతే ‘రాళ్లు మొఱ్ఱపెడతాయి.’ మనం రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో ధైర్యంగా కొనసాగడం ప్రాముఖ్యం.

3:6. యెహోవా తన తీర్పును అమలుచేసినప్పుడు ఎవరూ ఆయనను అడ్డుకోలేరు, పర్వతాలు గిరులంత స్థిరంగా కనిపించే మానవ సంస్థలు కూడా అడ్డుకోలేవు.

3:13. హార్‌మెగిద్దోనులో అందరూ నాశనం చేయబడరనే హామీ మనకుంది. యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని రక్షిస్తాడు.

3:17-19. హార్‌మెగిద్దోనుకు ముందు, అది సంభవించినప్పుడు మనకు కష్టాలు ఎదురైనా, మనం సంతోషంగా యెహోవా సేవలో కొనసాగుతుండగా ఆయన మనకు “బలము” అనుగ్రహిస్తాడని మనం నమ్మవచ్చు.

“యెహోవా దినము సమీపమాయెను”

(జెఫన్యా 1:1-3:20)

యూదాలో బయలు ఆరాధన ప్రబలంగా ఉంది. యెహోవా తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఇలా చెప్పాడు: “నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చా[పెదను].” జెఫన్యా ఇలా హెచ్చరించాడు: “యెహోవా దినము సమీపమాయెను.” (జెఫన్యా 1:4, 7, 14) దేవుని ప్రమాణాల ప్రకారం నడుచుకునేవారు మాత్రమే ఆ దినాన ‘దాచబడతారు.’—జెఫన్యా 2:3.

“అన్యాయము చేయు” యెరూషలేము “పట్టణమునకు శ్రమ” తప్పదు. “యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై . . . రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని.” కానీ దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, . . . మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును.”—జెఫన్యా 3:1, 8, 20.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:9—“పవిత్రమైన పెదవులు” లేదా నూతనలోక అనువాదం ప్రకారం ‘స్వచ్ఛమైన భాష’ అంటే ఏమిటి, దానిని మనమెలా మాట్లాడతాం? అది దేవుని వాక్యమైన బైబిల్లోవున్న దేవుని గురించిన సత్యం. బైబిలు బోధలన్నీ అందులో భాగమే. మనం సత్యాన్ని నమ్మడం ద్వారా, దాన్ని సరైనవిధంగా ఇతరులకు బోధించడం ద్వారా, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం ద్వారా దానిని మాట్లాడతాం.

మనకు పాఠాలు:

1:8. జెఫన్యా కాలంలోని కొందరు “అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొని” పొరుగు దేశాల ఆమోదాన్ని పొందడానికి ప్రయత్నించారు. నేడు జీవించే యెహోవా ఆరాధకులు అలా చేయడం ద్వారా లోక మర్యాదను అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నించడం ఎంత మూర్ఖత్వమో కదా!

1:12; 3:5, 16. యెహోవా తన ప్రజలకు తన తీర్పుల గురించి హెచ్చరించడానికి ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు. అనేకమంది యూదులు మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసంలా, జీవితంలో స్థిరపడి ఆ సందేశంపట్ల ఉదాసీనంగా ఉన్నా ఆయన అలా పంపిస్తూనే ఉన్నాడు. యెహోవా మహా దినం సమీపిస్తుండగా ప్రజల ఉదాసీనత వల్ల మనం నీరుగారిపోకుండా ‘ధైర్యంగా’ రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో కొనసాగడం అవసరం.

2:3. యెహోవా ఉగ్రత దినమున ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. మనమెప్పుడూ ఆయనకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే, మనం శ్రద్ధగా ఆయన వాక్యమైన బైబిలు చదవడం ద్వారా, ఆయన నిర్దేశం కోసం ప్రార్థించడం ద్వారా, ఆయనకు సన్నిహితమవడం ద్వారా ‘యెహోవాను వెదకాలి.’ మనం నైతికంగా పవిత్రమైన జీవితాన్ని గడపడం ద్వారా ‘నీతిని అనుసరించాలి.’ అలాగే మనం దీనత్వాన్ని, విధేయతా స్వభావాన్ని అలవర్చుకోవడం ద్వారా ‘వినయము గలవారిగా’ ఉండాలి.

2:4-15; 3:1-5. యెహోవా దేవుడు తన తీర్పును అమలు చేసే రోజున, దేవుని ప్రజల్ని అణగద్రొక్కిన క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందినవారికేకాక ఇతర జనాంగాలకు కూడా ప్రాచీన యెరూషలేముకు, పొరుగు జనాంగాలకు ఎదురైన వినాశనమే ఎదురౌతుంది. (ప్రకటన 16:14, 16; 18:4-8) మనం దేవుని తీర్పులను ధైర్యంగా ప్రకటిస్తూనే ఉండాలి.

3:8, 9. మనం యెహోవా దినం కోసం కనిపెట్టుకునివుంటూ, “పవిత్రమైన పెదవులను,” అంటే నూతనలోక అనువాదము ప్రకారం, ‘స్వచ్ఛమైన భాష’ మాట్లాడడాన్ని నేర్చుకోవడం ద్వారా, అలాగే ‘దేవుని నామమునుబట్టి’ ఆయనకు సమర్పించుకోవడం ద్వారా దానికి సిద్ధపడాలి. అంతేకాక ఆయన ప్రజలతో ‘ఏకమనస్సు’ కలిగి ఉండి ఆయనను సేవిస్తూ ఆయనకు “స్తుతియాగమును” అర్పిద్దాం.—హెబ్రీయులు 13:15.

“అతిశీఘ్రముగా వచ్చుచున్నది”

కీర్తనకర్త ఇలా పాడాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు; వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.” (కీర్తన 37:10) నహూము పుస్తకంలో నీనెవె గురించి చెప్పబడిన ప్రవచనాన్ని, హబక్కూకు పుస్తకంలో బబులోను, మతభ్రష్ట యూదా గురించి చెప్పబడిన ప్రవచనాలను ధ్యానించినప్పుడు, కీర్తనకర్త మాటలు తప్పక నెరవేరతాయని మనకు నమ్మకం కలుగుతుంది. కానీ మనం ఇంకా ఎంత కాలం వేచివుండాలి?

“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది” అని జెఫన్యా 1:14 చెబుతోంది. అంతేకాదు ఆ దినాన మనమెలా రక్షించబడవచ్చో, దాని నుండి తప్పించుకోవడానికి మనం ఇప్పుడేమి చేయాలో కూడా దీనిలో తెలియజేయబడింది. అవును, ‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది.’—హెబ్రీయులు 4:12.

[8వ పేజీలోని చిత్రాలు]

నీనెవె చుట్టూ ఎత్తైన ప్రాకారాలున్నా నహూము ప్రవచనం నెరవేరక మానలేదు

[చిత్రసౌజన్యం]

Randy Olson/National Geographic Image Collection