కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక యెహోవాసాక్షి, సాక్షులు కాని బంధువుల లేదా పరిచయస్థుల పెళ్ళికి వెళ్ళడం సరైనదేనా?

పెళ్ళిళ్ళు ఆనందించదగిన సందర్భాలు, క్రైస్తవులు వాటికి వెళ్లాలనుకోవడం సహేతుకమైనదే. మైనరు పిల్లలు పెళ్ళికి ఆహ్వానించబడితే, వారు ఆ విషయంలో తమ తల్లిదండ్రుల లేదా సంరక్షకుల నిర్ణయానికి లోబడాలి, ఎందుకంటే తుది నిర్ణయం తీసుకునే హక్కు వారికే ఉంది. (ఎఫెసీయులు 6:1-3) ఒకవేళ యెహోవాసాక్షికాని ఒక వ్యక్తి, క్రైస్తవురాలైన తన భార్యను గుడిలో జరిగే పెళ్ళికి తనతోపాటు రమ్మని అడిగితే అప్పుడేమిటి? ఆ సందర్భానికి సంబంధించిన ఎలాంటి మత ఆచారాల్లోనూ పాల్గొనకూడదనే తీర్మానంతో కేవలం చూడడానికే అక్కడికి వెళ్ళేందుకు ఆమె మనస్సాక్షి ఆమెను అనుమతించవచ్చు.

కాబట్టి ఫలాని పెళ్ళికి వెళ్ళాలా వద్దా అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయం. క్రైస్తవులు యెహోవాకు లెక్క అప్పగించవలసిన బాధ్యత తమకుందని గ్రహించడమేకాక సాక్షికాని వ్యక్తి పెళ్ళికి వెళ్ళడం విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని లేఖన సూత్రాలను పరిశీలించాలి.

ఒక క్రైస్తవుడు ప్రాముఖ్యంగా దేవుని ఆమోదం పొందాలని కోరుకోవాలి. యేసు ఇలా చెప్పాడు: “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.” (యోహాను 4:24) కాబట్టి బైబిలు సత్యానికి విరుద్ధమైన ప్రార్థనలు, మతకర్మలు లేక ఆచారాల వంటి ఇతర మతాల కార్యకలాపాల్లో యెహోవాసాక్షులు భాగం వహించరు.—2 కొరింథీయులు 6:14-18.

క్రైస్తవులు తమ నిర్ణయం ఇతరులపై కూడా ప్రభావం చూపించవచ్చని గ్రహిస్తారు. ఒకవేళ పెళ్ళికి వెళ్ళాలని మీరు నిర్ణయించుకుంటే, పెళ్ళి వేడుకల్లో మీరు పూర్తిగా భాగం వహించకపోతే మీ బంధువులు నొచ్చుకునే అవకాశముందా? అంతేకాక, తోటి విశ్వాసులపై అది చూపించగల ప్రభావాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. (రోమీయులు 14:13) సాక్షికాని వ్యక్తి పెళ్ళికి వెళ్ళడం వల్ల ఎలాంటి సమస్య రాదని మీకు, మీ కుటుంబ సభ్యులకు అనిపించినా, మీ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలపై అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముందా? దానివల్ల కొంతమంది మనస్సాక్షికి అభ్యంతరం కలుగవచ్చా?

సాక్షికాని బంధువుల పెళ్ళి వేడుకల్లో సవాలుదాయక పరిస్థితులు తలెత్తవచ్చు. మిమ్మల్ని తోటి పెళ్ళికూతురుగా లేదా తోటి పెళ్ళికొడుకుగా ఉండమని అడిగితే అప్పుడేమిటి? లేక సాక్షికాని మీ భాగస్వామి పెళ్ళిపనుల్లో మిమ్మల్ని పూర్తిగా భాగం వహించమని కోరితే అప్పుడేమిటి? ఆ పెళ్ళి న్యాయమూర్తి లేక ప్రభుత్వోద్యోగి జరిపించే పౌరసంబంధ ఆచరణ అయితే, దానికి హాజరవడం కేవలం న్యాయసంబంధిత వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు మాత్రమే అవుతుంది.

అయితే, పెళ్ళి గుడిలో జరుగుతున్నా లేదా దానిని పాదిరివర్గం జరిపిస్తున్నా మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. బైబిలు శిక్షిత మనస్సాక్షిని అనుసరిస్తూ మీ మత నమ్మకాల విషయంలో రాజీపడకుండా ఉండేందుకు, పెళ్ళివారిని కలవరపర్చేదేదైనా చేయకుండా ఉండేందుకు మీరు ఆ పెళ్ళికి వెళ్ళకూడదని నిర్ణయించుకోవచ్చు. (సామెతలు 22:3) మీరు పెళ్ళి పనుల్లో ఎంతమేరకు పాల్గొనడానికి సుముఖంగా ఉన్నారో లేదా ప్రత్యామ్నాయంగా ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నారో చెబుతూ మీ బైబిలు ఆధారిత నిర్ణయాలను ముందుగానే వివరిస్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఒత్తిడి తప్పుతుంది.

అన్ని విషయాలను జాగ్రత్తగా విశ్లేషించుకున్న తర్వాత, సాక్షికాని వ్యక్తి పెళ్ళిని కేవలం చూడడానికి వెళ్ళడంలో తప్పేమీలేదని కొంతమంది క్రైస్తవులు నిర్ణయించుకోవచ్చు. కానీ, అక్కడకు వెళ్తే దైవిక సూత్రాలతో రాజీపడే పరిస్థితి వస్తుందేమోనని క్రైస్తవులు అనుకుంటే, వెళ్ళడం వల్ల ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ ఉంటుందనే నిర్ధారణకు రావచ్చు. పెళ్ళికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నప్పటికీ తాము ఆహ్వానించబడ్డాము కాబట్టి కనీసం రిసెప్షన్‌కైనా వెళ్దామని అనుకుంటే, “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయాలని నిశ్చయించుకోవాలి. (1 కొరింథీయులు 10:31) అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతీ ఒక్కరూ తన బాధ్యతా “బరువు తానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:5) కాబట్టి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, యెహోవా దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి.