కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

క్రైస్తవులు వేటాడడాన్నీ చేపలుపట్టడాన్నీ ఎలా దృష్టించాలి?

వేటాడడాన్ని లేదా చేపలుపట్టడాన్ని బైబిలు ఖండించడం లేదు. (ద్వితీయోపదేశకాండము 14:4, 5, 9, 20; మత్తయి 17:27; యోహాను 21:6) అయితే అలా చేసే క్రైస్తవులు కొన్ని లేఖనాధారిత సూత్రాలను పరిగణలోకి తీసుకోవాలి.

దేవుడు నోవహుకు, ఆయన సంతానానికి జంతువులను చంపి తినడానికి అనుమతిచ్చాడు, కానీ వాటిని తినే ముందు వారు ఖచ్చితంగా రక్తాన్ని ఒలికించాలి. (ఆదికాండము 9:3, 4) ఈ ఆజ్ఞ, దేవుడు జంతువులను సృష్టించాడు కాబట్టి వాటి జీవాన్ని మనం గౌరవించాలని నొక్కిచెప్పింది. అందుకే, క్రైస్తవులు కేవలం వినోదం కోసమో ఉల్లాసం కోసమో లేదా జీవంపట్ల నిర్దయతో కూడిన నిర్లక్ష్యభావంతోనో జంతువులను చంపరు.—సామెతలు 12:10.

మన దృక్కోణానికి సంబంధించిన మరో అంశం ఉంది. ఒకప్పుడు జాలర్లుగావున్న అపొస్తలులు విస్తారంగా చేపలు పట్టినప్పుడు చాలా సంతృప్తి చెందివుంటారు. అయినప్పటికీ చేపలుపట్టడంలో లేదా వేటాడడంలో తమకున్న నైపుణ్యం గురించి వారు గొప్పలు చెప్పుకున్నట్లు సూచనేమీ లేదు. ఇతరులతో పోటీపడడానికో తమ ధైర్యసాహసాలను నిరూపించుకోవడానికో అలా చేసినట్లు కూడా ఎక్కడా చెప్పబడలేదు. అంతేగాక జంతువులను తరమడంలో, వాటితో పోరాడడంలో, వాటిని చంపడంలో ఉన్న ఆనందాన్ని పొందడం కోసం అలా చేసినట్లు కూడా ఏదీ సూచించడం లేదు.—కీర్తన 11:5; గలతీయులు 5:26.

అందుకే మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘జీవం విషయంలో యెహోవాకున్న దృక్కోణానికి గౌరవం చూపించడంలో నేను మాదిరికరంగా ఉన్నానా? వేటాడడం, చేపలుపట్టడం నా ఆలోచనలను, నా సంభాషణలను నియంత్రిస్తుందా? నా జీవిత విధానం, నేను వేటాడడంలో అత్యంతాసక్తి కలిగివున్నానని చూపిస్తుందా లేక నేను దేవుని పరిచారకుడనని చూపిస్తుందా? వేటాడడం గానీ చేపలుపట్టడం గానీ నన్ను అవిశ్వాసులతో సన్నిహితంగా సహవసించేలా చేసి, నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందా?’—లూకా 6:45.

కొన్ని దేశాల్లో, కొంతమంది వేటాడే, చేపలుపట్టే సీజన్లలో, ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేస్తూ తాము జీవనోపాధి కోసమే అలా వేటాడి చేపలుపడుతున్నామని తమనుతాము సమర్థించుకోవచ్చు. అయితే మనం వేరే విషయాలకంటే దేవునికి సంబంధించిన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆయనపై విశ్వాసం, నమ్మకం ఉన్నట్లు చూపిస్తాం. (మత్తయి 6:33) అంతేకాక, “కైసరు” నియమాలను అధికారులు అమలుపరిచినా అమలుపరచకపోయినా వేటాడే విషయంలో, చేపలుపట్టే విషయంలో క్రైస్తవులు ఆ నియమాలన్నిటికీ విధేయత చూపిస్తారు.—మత్తయి 22:21; రోమీయులు 13:1.

వేటాడడం, చేపలుపట్టడం గురించి యెహోవాకున్న దృక్కోణానికి అనుగుణంగా తమ దృక్కోణాన్ని మలచుకోవడానికి, కొందరు ఆయన ప్రమాణాల విషయంలో తమ ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవాల్సి ఉండవచ్చు. (ఎఫెసీయులు 4:22-24) అంతేకాక, ఇతరులు మనస్సాక్షిపూర్వకంగా తీసుకొనే నిర్ణయాలను మనం గౌరవించాలి. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహా సముచితమైనది: “మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.” (రోమీయులు 14:13) అలాంటి నిస్వార్థ ప్రేమను, గౌరవాన్ని చూపించడం సంఘంలో శాంతిని పెంపొందిస్తుంది, సమస్త జీవానికి మూలమైన మన సృష్టికర్తను ఆనందింపజేస్తుంది.—1 కొరింథీయులు 8:13. *

[అధస్సూచి]

^ పేరా 8 కావలికోట (ఆంగ్లం), మే 15, 1990 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” కూడా చూడండి.