కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రూర ప్రపంచంలో కరుణ

క్రూర ప్రపంచంలో కరుణ

క్రూర ప్రపంచంలో కరుణ

బురుండీలో ఒక వ్యక్తి మలేరియా వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కానీ ఎలా? ఆయనను తీసుకువెళ్ళడానికి కారు అందుబాటులో లేదు. అతని సన్నిహిత స్నేహితుల్లో ఇద్దరు ఆయనకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారు ఆయనను ఒక సైకిల్‌ మీద ఎక్కించుకుని, ఐదు గంటలపాటు ఆ సైకిల్‌ని తోసుకుంటూ కొండప్రాంతం గుండా కష్టపడి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత వారు ఆయనను దగ్గర్లోవున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళే బస్సు ఎక్కించారు. కొన్నిరోజుల తర్వాత ఆయన ఆరోగ్యం చాలా మేరకు కుదుటపడింది.

భూగోళానికి మరోవైపు, 2005 ఆగస్టులో అమెరికాలోని గల్ఫ్‌ రాష్ట్రాలను కత్రీనా తుఫాను విధ్వంసం చేసిన తర్వాత, పడిపోయిన చెట్లక్రింద ఛిన్నాభిన్నమైపోయి ఉన్న ఒక ఇంటిని కొంతమంది స్వచ్ఛంద సేవకులు చూశారు. ఆ ఇంటి యజమానికి పూర్తిగా అపరిచితులైన ఆ స్వచ్ఛంద సేవకులు, శిథిలాలను తీసివేయడానికి, పడిపోయిన చెట్లను పెద్ద పెద్ద రంపాలతో తొలగించడానికి రోజంతా వెచ్చించారు. “ఈ [ప్రజలకు] నేనెంతో రుణపడివున్నాను” అని ఆ ఇంటి యజమానురాలు అంది.

ప్రచారమధ్యమాలిచ్చే సంచలనాత్మక నివేదికల్లో దారుణకృత్యాలు, క్రూరచర్యలు ప్రస్ఫుటంగా చూపించబడతాయి. కరుణతో, దయతో చేసే పనులు తరచూ మరుగునపడిపోతాయి. అయితే, అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రేమ, వాత్సల్యం, జాలివంటి వాటికోసం తపిస్తున్నారన్న వాస్తవాన్ని ఇది మార్చదు. మనం కరుణను ఆకాంక్షిస్తాము. అయితే అలాంటి మనోభావాలు క్రిస్మస్‌ సమయంలో సర్వసాధారణంగా కనిపిస్తుండవచ్చు. ఆ సమయంలో ప్రజలు ‘మనుష్యులకు శాంతి, మంచి కలగడం’ గురించి మాట్లాడతారు లేదా పాడతారు.—లూకా 2:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

స్నేహరాహిత్యం, నిరాదరణ ఎంతో ఎక్కువగా ఉన్నట్లున్న ఈ ప్రపంచంలో కరుణ చూపించడం సులభం కాకపోవచ్చు. నిర్దయ, స్వార్థం వంటివే విజయాన్ని, గెలుపును ఇస్తాయనేది సర్వవ్యాప్తమైన దృక్పథం. కరుణ చూపించడం కంటే క్రూరంగా ఉండడమే ఎంతో జ్ఞానయుక్తమైనదని విశ్వసించబడుతున్న సిద్ధాంతాన్నే అనేకమంది అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. దురాశ, అహం వంటివి కరుణ చూపించకుండా చేసేస్తాయి.

ఫలితంగా చాలామంది, ఇతరుల భావాలను లేదా అభిరుచులను అలక్ష్యం చేయవలసివచ్చినా సరే తమకు ప్రాధాన్యతనిచ్చుకుంటారు. మృదువైన ప్రేమను చూపించని క్రీడాకారులు, సినీనటులు సాధారణంగా, “నిజమైన మగాళ్ళు” (మగధీరులు) అన్నట్లు చూపించబడతారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తారు.

కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: మనమెందుకు సానుభూతి చూపించాలి? కరుణ చూపించడం మంచి ఫలితాలనిస్తుందా? కరుణ చూపించడానికి మనకేమి సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలను తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.

[3వ పేజీలోని బాక్సు]

•కరుణ చూపించడం ఒక బలహీనతా?

•కరుణ చూపించడం ప్రయోజనకరమైనదేనా?

•మీరు ఏయే ఆచరణాత్మక మార్గాల్లో సానుభూతి చూపించవచ్చు?