కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇంపైన మాటలతో’ మీ కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోండి

‘ఇంపైన మాటలతో’ మీ కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోండి

‘ఇంపైన మాటలతో’ మీ కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోండి

ఒక్కో నిమిషం గడుస్తుండగా డేవిడ్‌కు చిరాకు ఎక్కువౌతోంది. తన భార్య కోసం కార్లో కూర్చొని వేచిచూస్తున్న ఆయన నిమిషనిమిషానికి వాచీ చూసుకుంటున్నాడు. చివరకు తన భార్య డియాన్‌ ఇంట్లోనుండి బయటకు వచ్చేసరికి ఆయన కోపాన్ని అణచుకోలేకపోయాడు.

“నేనెంత సేపని ఇక్కడ నీకోసం ఎదురుచూడాలి, ఒక పట్టాన బయటికి రావే? నువ్వెప్పుడూ ఇంతే! కనీసం ఒక్కసారైనా సమయానికి రాలేవా” అని అరిచేశాడు.

డియాన్‌ బిత్తరపోయింది. ఏడుపు ఆపుకోలేక ఆమె తిరిగి ఇంట్లోకి పరుగెత్తింది. వెంటనే డేవిడ్‌కి తన తప్పేంటో అర్థమైంది. ఆయనలా అరవడం వల్ల వాతావరణమే మారిపోయింది. ఆయన ఇప్పుడేమి చేయగలడు? ఇంజన్‌ ఆపుజేసి, కారుదిగి, నిట్టూరుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు.

మనింట్లో కూడా అప్పుడప్పుడూ ఇలా జరగడం సహజమే. మీకెప్పుడైనా నేనలా అనుండకపోతే బాగుండేది అని అనిపించిందా? మనం ఆలోచించకుండా మాట్లాడితే ఆ తర్వాత మనం అన్న మాటలకు బాధపడాల్సివస్తుంది. అందుకే బైబిలు సరిగానే ఇలా చెబుతోంది: “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును.”​—⁠సామెతలు 15:​28.

అయితే, మనకు మాట్లాడేముందు ఆలోచించడం, అదీ కోపంగా ఉన్నప్పుడు, భయంగానో, బాధగానో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడడం కష్టమనిపించవచ్చు. ముఖ్యంగా మనం స్వంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడైతే ఇతరుల్ని సులభంగా తప్పుపడుతుండవచ్చు లేదా విమర్శిస్తుండవచ్చు. దానివల్ల ఇతరులకు బాధ కలిగించవచ్చు లేదా వాదులాటకు దారితీయవచ్చు.

మరి పరిస్థితులు తిరిగి మామూలుగా అవ్వాలంటే మనమేమి చేయవచ్చు? కోపం మితిమీరకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? బైబిలు రచయితైన సొలొమోను మాటల్లో మనకు సహాయకరమైన సలహాలు కనిపిస్తాయి.

ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో ఆలోచించండి

ప్రసంగి పుస్తకాన్ని వ్రాసిన సొలొమోను, జీవితమెంత వ్యర్థమైనదో చెప్పినప్పుడు తాను చెబుతున్న విషయం గురించి చాలా ఆలోచించే చెప్పాడనిపిస్తోంది. “బ్రదుకుట నా కసహ్యమాయెను” అని ఆయనన్నాడు. ఒక సందర్భంలో ఆయన “సమస్తము వ్యర్థమని” చెప్పాడు. (ప్రసంగి 2:​17; 12:⁠8) అయినా, ప్రసంగి పుస్తకమంతటిలో తాను ఆందోళన చెందిన విషయాల గురించే సొలొమోను వ్రాయలేదు. జీవితంలో జరిగే చెడు గురించే ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అనుకున్నాడు. అందుకే ఆ పుస్తకం చివర్లో, తాను ‘యింపైన మాటలు చెప్పుటకు పూనుకున్నానని, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకున్నానని’ ఆయన వ్రాశాడు. (ప్రసంగి 12:⁠10) ఆయన మాటలు మరో బైబిల్లో ఇలా అనువదించబడ్డాయి: “సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. ఆయన యథార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.”​—⁠పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

సొలొమోను తనను తాను నియంత్రించుకోవాలనే విషయాన్ని గ్రహించాడన్నది స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఆయన తననుతాను తదేకంగా ఇలా ప్రశ్నించుకున్నాడు: ‘నేను చెప్పాలనుకుంటున్న విషయం యథార్థమైనదేనా లేదా సత్యమేనా? నేనిలా మాట్లాడితే ఇతరులకు అది ఇంపైనదిగా ఉంటుందా, వారు దానిని ఇష్టపడతారా?’ ఆయన సత్యాన్ని గురించిన “ఇంపైన మాటల” కోసం వెదకడం ద్వారా తన భావావేశాలు తన ఆలోచనలను ప్రభావితం చేయకుండా కాపాడుకోగలిగాడు.

ఫలితంగా ఆయన సాహిత్యపరంగా ఒక చక్కని పుస్తకాన్ని వ్రాయడమే కాక అందులో జీవిత పరమార్థం విషయంలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి మెండుగా వ్రాశాడు. (2 తిమోతి 3:​16, 17) సొలొమోను ఎంతో భావగర్భితంగా చర్చించిన ఈ పుస్తకం మన ప్రియమైనవారితో మనం చక్కగా మాట్లాడేందుకు సహాయం చేయగలదా? ఒక ఉదాహరణ పరిశీలించండి.

మీ భావావేశాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి

ఉదాహరణకు, ఒక అబ్బాయి తన ప్రోగ్రెస్‌ రిపోర్టును పట్టుకుని దిగాలుగా ఇంటికి వచ్చాడనుకోండి. వాళ్ల నాన్న మొత్తమంతా జాగ్రత్తగా చూసి ఆ అబ్బాయి ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడని గ్రహించాడు. తన కొడుకు ఎన్నోసార్లు హోంవర్కు ఎగ్గొట్టడం గుర్తొచ్చి, ఆయనకు వెంటనే కోపం వస్తుంది. “నువ్వు ఒట్టి సోమరిపోతువి! నువ్వు ఇలాగే ఉన్నావంటే జీవితంలో ఎప్పటికీ పైకి రాలేవు” అని వెంటనే తిట్టేయాలనిపిస్తుంది.

అయితే, అలా అనుకుని వెంటనే తిట్టే బదులు, తండ్రి తనను తాను ఇలా ప్రశ్నించుకుంటే మంచిది: ‘నా ఆలోచన సరైనదేనా?’ ఈ ప్రశ్న వేసుకోవడం ద్వారా ఆయన తాను ఊహించినదానికీ, వాస్తవానికీ మధ్యవున్న తేడాను గమనించ​గలుగుతాడు. (సామెతలు 17:​27) తన కొడుకు ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ అయినంత మాత్రాన ఇక జీవితంలో ఎప్పటికీ పైకి రాడా? ఆ పిల్లవాడు అన్నింటిలోనూ సోమరిగా ఉంటున్నాడా లేక ఆ ఒక్క సబ్జెక్టుని అర్థం చేసుకోవడం వాడికి కష్టంగా ఉండడంవల్ల హోంవర్కు చేయడంలేదా? శాంతంగా, మృదువుగా వ్యవహరిస్తూ, విషయాలను వాస్తవికంగా చూడడం ఎంత ప్రాముఖ్యమో బైబిలు పదేపదే నొక్కిచెబుతోంది. (తీతు 3:⁠1, 2; యాకోబు 3:​17) పిల్లలను ప్రోత్సహించాలంటే తల్లి/తండ్రి వారితో ‘యథార్థంగా’ మాట్లాడాలి.

సరైన పదాల కోసం అన్వేషించండి

తండ్రి ఏమి చెప్పాలో నిర్ణయించుకున్న తర్వాత తననుతాను ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఈ విషయాన్ని నా కుమారునికి ఇంపైనదిగా అనిపించేలా, వాడు దానిని అంగీకరించేలా ఎలా చెప్పాలి?’ సరైన పదాలను ఎంచుకోవడం అంత సులభం కాదన్నది నిజమే. ఎదుగుతున్న పిల్లలు సున్నిత మనస్కులని, వాళ్లు ఒక పని సరిగ్గా చేయలేకపోతే ఇక తామేదీ సరిగ్గా చేయలేమనే నిర్ణయానికి వస్తారని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లలు తాము సరిగా చేయని ఒక పనిని గురించి లేదా తమ బలహీనత గురించి విపరీతంగా ఆలోచిస్తూ తమను తాము నిందించుకుంటారు, లేదా ఆత్మన్యూనతా భావాలకు లోనవుతారు. ఒక తల్లి/తండ్రి అతిగా స్పందిస్తే పిల్లలు మరింత కుంచించుకుపోవచ్చు. “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి” అని కొలొస్సయులు 3:​21 చెబుతోంది.

“ఎప్పుడూ” “ఎప్పటికీ” లాంటి పదాలు వాడడం గోరంతలను కొండంతలుగా చేసినట్లవుతుంది. “నువ్వు ఎప్పటికీ మారవు” అని తల్లి/తండ్రి అంటే పిల్లలకు తమపై తమకే నమ్మకం, గౌరవం లేకుండా పోతాయి. ఒకవేళ తల్లి/తండ్రి అనేక సందర్భాల్లో అలా మాట్లాడితే పిల్లలు తాము దేనికీ పనికిరామని అనుకుంటారు. అది వారిని నిరుత్సాహపరుస్తుంది, పైగా అది నిజం కాదు.

ఎలాంటి సందర్భంలోనైనా సానుకూల అంశాలను గురించి మాట్లాడడం శ్రేయస్కరం. మన ఉదాహరణలోని తండ్రి, “బాబు, నీకు మార్కులు సరిగా రాలేదని నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నీ హోంవర్కు చేయడానికి చాలా కష్టపడతావని కూడా నాకు తెలుసు. సరే, ఇప్పుడు నీకు తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టు విషయంలో ఏమి చేస్తే బాగుంటుందో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం” అని అనవచ్చు. వాళ్ల అబ్బాయికి ఎలా సహాయం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ఆ తండ్రి అసలు సమస్యేమిటో కనుక్కోవడానికి వాళ్ల అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చు.

వెంటనే తిట్టేయడంకన్నా, ప్రేమగా ఆలోచించి మాట్లాడడం ఎంతో మేలు చేస్తుంది. ‘ఇంపైన మాటలు ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి’ అని బైబిలు మనకు హామీనిస్తోంది. (సామెతలు 16:​24) పిల్లలేకాదు కుటుంబ సభ్యులందరూ అలాంటి శాంతికరమైన, ప్రేమపూర్వక వాతావరణంలో వర్ధిల్లుతారు.

‘హృదయంలో నిండియున్న విషయాలు’

ప్రారంభంలో పేర్కొనబడిన భర్త గురించి మరోసారి ఆలోచించండి. ఆయన తన భార్యమీద మండిపడే బదులు సత్యము గురించిన “ఇంపైన మాటలు” ఏమిటో ఆలోచించి మాట్లాడివుంటే ఎంత బాగుంటుంది! అలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్త తననుతాను ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా భార్య సమయానికి రావడం నేర్చుకోవాల్సివున్నా ఆమె ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా? నేను కోపంగా విమర్శిస్తూ మాట్లాడితే ఆమె తనను తాను మార్చుకోవాలని అనుకుంటుందా?’ మాట్లాడే ముందు అలాంటి ప్రశ్నలు వేసుకోవడం వల్ల మనం మన ప్రియమైనవారిని అనవసరంగా నొప్పించకుండా జాగ్రత్తపడతాం.​—⁠సామెతలు 29:​11.

మన కుటుంబంలో తరచూ అలాంటి గొడవలు జరుగుతూ ఉంటే ఏమి చేయాలి? అలాంటప్పుడు మనం ఏ ఉద్దేశంతో, ఎలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నామో ఆలోచించాలి. ముఖ్యంగా మనం ఆందోళనతో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిక్రింద ఉన్నప్పుడు మాట్లాడే తీరునుబట్టి మనం ఎలాంటి​వారమో తెలుస్తుంది. “హృదయము నిండియుండు దానిని​బట్టి నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 12:​34) వేరే మాటల్లో చెప్పాలంటే తరచూ మన మాటల్లో మన అంతరంగ భావాలు, కోరికలు, అభిప్రాయాలేమిటో వెల్లడౌతాయి.

మనం జీవితాన్ని వాస్తవికంగా, ఆశావహంగా దృష్టిస్తూ మంచి జరుగుతుందని ఎదురుచూస్తున్నామా? అదే నిజమైతే మనం మాట్లాడే తీరులో, మన మాటల్లో అది కనిపిస్తుంది. మన మాటలు తరచూ కరుకుగా, చెడుగా లేదా విమర్శనాత్మకంగా ఉంటున్నాయా? అలాంటప్పుడు మనం మాట్లాడే తీరు లేదా మాటలు ఇతరులను నిరాశపర్చవచ్చు. మన ఆలోచనా విధానం, మాటలు ఎంత నిరుత్సాహకరంగా తయారయ్యాయో మనకు తెలియకపోవచ్చు. మనం తలంచేదే సరైనదని మనకు అనిపించవచ్చు. కానీ ఆ విషయంలో మనం ఆత్మవంచన చేసుకోకూడదు.​—⁠సామెతలు 14:​12.

మనకు దేవుని వాక్యం ఉండడం ఎంత ప్రయోజన​కరమో కదా! మనం మన ఆలోచనలను పరిశీలించుకొని, వాటిలో ఏవి సరైనవో, వేటిని సవరించుకోవాలో గ్రహించడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 4:​12; యాకోబు 1:​25) మనం పుట్టుకతో ఎలాంటి వారమైనా, మన పెంపకం ఎలాంటిదైనా, మనం కోరుకుంటే మన ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనా విధానాన్ని మార్చుకోవచ్చు.​—⁠ఎఫెసీయులు 4:​23, 24.

బైబిలు సహాయంతోనేకాక, మనం మాట్లాడే తీరు ఎలా ఉందో పరిశీలించుకోవడానికి ఇంకో పని కూడా చేయవచ్చు. ఇతరులను అడగడం మంచిది. ఉదాహరణకు, మీరు మాట్లాడే తీరు గురించి మీ భర్త, భార్య లేదా మీ పిల్లలు నిజంగా ఏమనుకుంటున్నారో చెప్పమనండి. మీ గురించి బాగా తెలిసిన పరిణతిగల ఒక స్నేహితునితో మాట్లాడండి. అయితే, వారు చెప్పినదాన్ని ఒప్పుకోవడానికి, సరిదిద్దు​కోవడానికి వినయం అవసరం.

మాట్లాడే ముందు ఆలోచించండి!

చివరిగా, మీరు నిజంగా ఇతరులను నొప్పించకూడదని అనుకుంటే, సామెతలు 16:⁠23లోని ఈ సూత్రాన్ని పాటించండి: “జ్ఞానముగల మనిషి మాట్లాడక ముందు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి.” (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నిగ్రహం పాటించడం మనకు అన్నివేళలా సులభం కాకపోవచ్చు. అయితే, ఇతరులను నిందించడం లేదా వారిని చిన్నచూపు చూడడంకన్నా, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సరైన పదాలు ఎంచుకుని మాట్లాడడం చాలా సుళువౌతుంది.

నిజమే, మనలో ఎవరమూ పరిపూర్ణులం కాదు. (యాకోబు 3:⁠2) మనలో ప్రతీ ఒక్కరం ఏదోకసారి ఆలోచించ​కుండా మాట్లాడతాం. (సామెతలు 12:​18) కానీ దేవుని వాక్య సహాయంతో, ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవచ్చు. మనకన్నా ఇతరుల భావాలకు ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోవచ్చు. (ఫిలిప్పీయులు 2:⁠4) మనం ఇతరులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు సత్యమును గురించిన “ఇంపైన మాటలు” ఏమిటో ఆలోచించాలని నిశ్చయించుకుందాం. అప్పుడు మన మాటలు మనం ప్రేమించేవారిని నొప్పించవు లేదా హాని చేయవు బదులుగా అవి వారిని ఓదార్చి, మన సంబంధాలు పటిష్ఠమయ్యేలా చేస్తాయి.​—⁠రోమీయులు 14:​19. (w 08 1/1)

[12వ పేజీలోని చిత్రం]

మాట అనేసి ఆ తర్వాత బాధపడకుండా ఉండేలా మీరెలా జాగ్రత్తపడవచ్చు?