కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి

స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి

వారి విశ్వాసాన్ని అనుసరించండి

స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి

ఏలీయా కర్మెలు పర్వతంపైకి వస్తున్న ప్రజలను గమనిస్తున్నాడు. తెల్లవారుజామున మసక చీకట్లోనూ వారి ముఖాల్లో పేదరికం, కటిక దారిద్ర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడున్నర సంవత్సరాల కరువు వారి జీవితాలను నాశనం చేసింది.

ఆ ప్రజలతోపాటు యెహోవా ప్రవక్తయైన ఏలీయాను ఎంతగానో ద్వేషిస్తున్న గర్విష్ఠులైన 450 మంది బయలు ప్రవక్తలు కూడా ఎంతో గర్వంగా వారితోపాటు నడుచుకుంటూ వస్తున్నారు. యెజెబెలు రాణి అప్పటికే యెహోవా సేవకులెందరినో చంపించింది, అయితే ఏలీయా మాత్రం బయలు ఆరాధనను పూర్తిగా వ్యతిరేకిస్తూనేవున్నాడు. కానీ ఆయన ఎంత​కాలమని అలా వ్యతిరేకించగలడు? తమను ఈ ఒంటరివ్యక్తి ఎన్నడూ ఎదిరించలేడని ఆ యాజకులు అనుకొనివుంటారు. (1 రాజులు 18:​3, 19, 20) అహాబు రాజు కూడా వైభవోపేతమైన తన రథమెక్కి అక్కడికి వచ్చాడు. అతనికి కూడా ఏలీయా అంటే అస్సలు గిట్టదు.

యెహోవా ఆరాధనను సమర్థించిన ఆ ఒంటరి ప్రవక్త తన జీవితంలో ముందెన్నడూ చూడని సంఘటనను చూడబోతున్నాడు! ఏలీయా అలా చూస్తుండగానే, మంచికి కీడుకు మధ్య, లోకంలో క్రితమెన్నడూ జరగనంత అత్యంత నాటకీయ పోరాటానికి రంగం సిద్ధమైంది. తెల్లవారేకొద్దీ ఆయనకు ఎలా అనిపించివుంటుంది? ఆయన కూడా “మనవంటి స్వభావముగల మనుష్యుడే” కాబట్టి ఆయనకు ఖచ్చితంగా భయమేసి ఉంటుంది. (యాకోబు 5:​17) కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. విశ్వాసంలేని మనుష్యులు, వారి మతభ్రష్ట రాజు, కసితో ఉన్న యాజకుల మధ్య తాను ఒక్కణ్ణే ఉన్నానని ఏలీయాకు ఎంతగానో అనిపించింది.​—⁠1 రాజులు 18:​22.

అయితే ఇశ్రాయేలుకు అసలు ఇలాంటి గడ్డుపరిస్థితి ఎందుకు ఎదురైంది, ఆ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు అని మీరు ఆలోచిస్తుండవచ్చు. దేవుని నమ్మకమైన సేవకుల గురించి బాగా తెలుసుకుని “వారి విశ్వాసమును అనుసరించ[మని]” బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 13:⁠7) కాబట్టి ఇప్పుడు ఏలీయా గురించి పరిశీలించండి.

సుదీర్ఘ సంఘర్షణ తుది ఘట్టానికి చేరుకోవడం

ఏలీయా తన జీవితంలోని అధికభాగం, తన దేశంలో, తన ప్రజల మధ్య ఉన్న శ్రేష్ఠమైన అంశమైన యెహోవా ఆరాధన తిరస్కరించబడి, అణగద్రొక్కబడుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇశ్రాయేలీయులు ఎంతో కాలంగా, స్వచ్ఛారాధన చేయాలా లేక అబద్ధారాధన చేయాలా అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా లేక చుట్టుపక్కలున్న దేశాల విగ్రహాలను ఆరాధించాలా అనే విషయంలో సంఘర్షణకు గురయ్యారు. ఏలీయా కాలంలో ఆ సంఘర్షణ మరింత తీవ్రతరమయ్యింది.

అహాబు రాజు సీదోను రాజు కుమార్తె అయిన యెజె​బెలును వివాహం చేసుకున్నాడు. యెజెబెలు ఇశ్రాయేలు దేశంలో యెహోవా ఆరాధనను రూపుమాపి బయలు ఆరాధనను వ్యాప్తి చేయాలనే పట్టుదలతో ఉంది. కొంతకాలానికే అహాబు ఆమె చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. ఆయన బయలుకు ఒక దేవాలయాన్ని, బలిపీఠాన్ని కట్టించి, ఆ అన్యమత దేవతను ఆరాధించడంలో నాయకత్వం వహించాడు. ఆ విధంగా అతను యెహోవాకు ఎంతో కోపం తెప్పించాడు.​—⁠1 రాజులు 16:​30-33. *

బయలు ఆరాధన ఎందుకంత హేయమైనదిగా పరిగణించబడేది? అది ఇశ్రాయేలీయులను ప్రలోభపెట్టి వారిని సత్య​దేవుని నుండి దూరం చేసింది. అది ఒక హేయమైన, క్రూరమైన మతం. దానిలో, స్త్రీపురుషులు ఆలయంలో వేశ్యావృత్తి చేయడం, లైంగిక దుశ్చర్యలకు పాల్పడడం, చివరకు పిల్లలను బలివ్వడం వంటివి భాగంగా ఉండేవి. అందుకే యెహోవా తాను ఆ దేశంపైకి కరువును తెప్పించబోతున్నానని అహాబుకు చెప్పడానికి ఏలీయాను పంపించాడు. ఏలీయా కరువు ఆగి​పోతుందని చెప్పేంతవరకు అది ఆగదు. (1 రాజులు 17:⁠1) చాలా ఏళ్ల తర్వాతే ఏలీయా అహాబును మళ్లీ కలుసుకొని, బయలు ప్రవక్తలతోపాటు ప్రజలందరిని కర్మెలు పర్వతం దగ్గర సమావేశపరచమని ఆయనతో చెప్పాడు.

అయితే ఆ సంఘర్షణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఇప్పుడు మన చుట్టూ బయలుకు సంబంధించిన గుళ్లుకానీ బలిపీఠాలుకానీ లేవు కాబట్టి బయలు ఆరాధన గురించిన వృత్తాంతం మనకు అవసరం లేదని కొందరు అనుకోవచ్చు. అయితే ఈ వృత్తాంతం ప్రాచీన చరిత్ర మాత్రమే కాదు. (రోమీయులు 15:⁠4) “బయలు” అనే పదానికి “యజమానుడు” అని అర్థం. తనను “బయలు”గా లేదా తమ భర్తగా స్వీకరించమని యెహోవా తన ప్రజలకు చెప్పాడు. (యెషయా 54:⁠5) నేడు కూడా ప్రజలు సర్వోన్నత దేవుణ్ణి సేవించే బదులు అనేక ఇతర యజమానులను సేవిస్తున్నారని మీరు ఒప్పుకోరా? ప్రజలు తమ జీవితంలో యెహోవాకు బదులుగా డబ్బు సంపాదించడానికి, ఉద్యోగంలో పైకెదగడానికి, ఉల్లాస కార్యకలాపాలకు, లైంగికేచ్ఛలు తీర్చుకోవడానికి లేదా కోకొల్లలుగా ఉన్న ఇతర దేవుళ్లలో ఒకరిని ఆరాధించడానికి ప్రాముఖ్యతనిస్తే, వారు వాటిని తమ యజమానిగా చేసుకున్నట్లే అవుతుంది. (మత్తయి 6:​24; రోమీయులు 6:​16) అంటే, బయలు ఆరాధనకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన అంశాలు ఏదో ఒకవిధంగా నేడు కూడా వర్ధిల్లుతున్నాయి. అప్పట్లో యెహోవాకు, బయలుకు మధ్య జరిగిన పోరాటం, మనం ఎవరిని సేవించాలి అనే విషయంలో జ్ఞానవంతమైన నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

వారు ఎలా తడబడుతున్నారు?

వేగంగా గాలులు వీచే కర్మెలు పర్వత శిఖరంపైనుండి ఇశ్రాయేలు ప్రాంతం చక్కగా కనబడుతుంది. అంటే కింద ఉన్న కిషోను వాగు, దగ్గర్లోవున్న మహా సముద్రం (మధ్యధరా సముద్రం), సుదూర ఉత్తరాన ఉన్న లెబానోను కొండలు ఈ పర్వతం శిఖరంమీద నుండి కనిపిస్తాయి. * కానీ ఈ నిర్ణయాత్మక రోజు సూర్యోదయమయ్యే సమయానికి దేశ పరిస్థితి భయంకరంగా ఉంది. యెహోవా అబ్రాహాము సంతానానికి ఇచ్చిన నేల ఒకప్పుడు సారవంతంగా ఉన్నా, ఇప్పుడు నిస్సారంగా తయారైంది. ఇప్పుడు అది సూర్యుని ప్రతాపానికి బీటలువారింది, దేవుని ప్రజల మూర్ఖత్వం వల్ల నాశనమైపోయింది! ఆ ప్రజలు పర్వతంపై సమకూడాక ఏలీయా వారితో, “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా [సత్య] దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి” అని అన్నాడు.​—⁠1 రాజులు 18:​21.

ఏలీయా ‘రెండు తలంపుల మధ్య తడబడడం’ గురించి మాట్లాడినప్పుడు ఆయన అసలు ఏమి చెప్పాలనుకున్నాడు? అప్పటి ప్రజలు తాము యెహోవా ఆరాధన, బయలు ఆరాధనలలో ఒకదాన్నే ఎంచుకోవాలని గ్రహించలేదు. వారిద్దరినీ ఆరాధించవచ్చని అంటే హేయమైన ఆచారాలతో బయలును శాంతింపజేస్తూనే ఆశీర్వాదాల కోసం యెహోవా దేవుణ్ణి వేడుకోవచ్చని వారు అనుకున్నారు. ఒకవైపు బయలు వారి పంటల్ని, పశువుల్ని రక్షిస్తే, మరోవైపు “సైన్యములకధిపతియగు యెహోవా” యుద్ధాల్లో తమను రక్షిస్తాడని వారు అనుకునివుంటారు. (1 సమూయేలు 17:​45) కానీ యెహోవా తనకు చెందాల్సిన ఆరాధనను ఎవ్వరితోనూ పంచుకోడు అనే ప్రాథమిక సత్యాన్ని వారు మరచిపోయారు. ఆ సత్యాన్ని నేడు అనేకమంది గ్రహించలేకపోతున్నారు. తన ప్రజలు తనపట్ల సంపూర్ణ భక్తి కనబరచాలని యెహోవా కోరుతున్నాడు, ఆయన దానికి అర్హుడు కూడా. ఆయనకు చేసే ఆరాధనను వేరే ఏ విధమైన ఆరాధనతో కలిపినా ఆయన దాన్ని ఎంతమాత్రం అంగీకరించడు. అలాంటి ఆరాధనను ఆయన అసహ్యించుకుంటాడు!​—⁠నిర్గమకాండము 20:⁠4, 5.

అలా ఇశ్రాయేలీయులు ఎటు వెళ్లాలో తెలీక “తడబడే” లేదా తేల్చుకోలేని ఒక వ్యక్తిలా ఉన్నారు. నేడు కూడా అనేకులు దేవుని ఆరాధనను ప్రక్కనపెట్టి ఇతర ‘బయలులకు’ తమ జీవితంలో స్థానమివ్వడం ద్వారా ఎంత తరచుగా అలాంటి తప్పు చేస్తున్నారో కదా! తడబడడం మానమని ఏలీయా చేసిన ఆ స్పష్టమైన అత్యవసరమైన అభ్యర్థన, మనం వేటికి ప్రాధాన్యతనిస్తున్నామో, మన ఆరాధన ఎలా ఉందో పునఃపరిశీలించుకోవడానికి సహాయం చేస్తుంది.

నిర్ణయాత్మకమైన పరీక్ష

ఆ తర్వాత ఏలీయా ఒక పరీక్షను ప్రతిపాదిస్తాడు. అది చాలా చిన్న పరీక్షే. బయలు యాజకులు ఒక బలిపీఠాన్ని కట్టి దానిపై ఒక జంతువును పెట్టి, దాన్ని కాల్చమని వారు తమ దేవుణ్ణి వేడుకోవాలి. ఏలీయా కూడా అలాగే చేస్తాడు. “ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే [సత్య] దేవుడు” అని ఆయన చెప్పాడు. సత్యదేవుడెవరో ఏలీయాకు తెలుసు. ఆ దేవునిపై ఆయనకు ఎంత గట్టి నమ్మకం ఉందంటే బయలు ప్రవక్తలకు తనకన్నా ముందు ప్రార్థించే అవకాశాన్ని ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆయన తన ప్రత్యర్థులకు ప్రతీది అనుకూలంగా ఉండేలా చేసి, వారికి కావాల్సిన ఎద్దును వారినే ఎన్నుకోనిచ్చి వారే ముందుగా బయలుకు ప్రార్థించే అవకాశాన్ని ఇస్తాడు. *​—⁠1 రాజులు 18:​24, 25.

మనకాలంలో అద్భుతాలేమీ జరగడం లేదు. అయితే యెహోవా మాత్రం మారలేదు. ఆయనపట్ల ఏలీయాకున్న నమ్మకాన్నే మనం కూడా కనబరచవచ్చు. ఉదాహరణకు, బైబిలు బోధల విషయంలో ఎవరైనా మనతో ఏకీభవించకపోతే, వారు తాము చెప్పాలనుకుంటున్నదాన్ని చెప్పనివ్వడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏలీయాలాగే మనం కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి సత్యదేవుణ్ణి ఆశ్రయించవచ్చు. మనం మన స్వశక్తిపైకాక, “తప్పు దిద్దుటకు” రూపొందించబడిన ఆయన ప్రేరేపిత వాక్యంపై ఆధారపడడం ద్వారా ఆయనను ఆశ్రయించవచ్చు.​—⁠2 తిమోతి 3:​16, 17.

బయలు ప్రవక్తలు తమ బలిని సిద్ధం చేసుకుని తమ దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. వారు పదేపదే “బయలా, మా ప్రార్థన వినుము” అని మొరపెట్టుకున్నారు. వారు ప్రార్థించడం మొదలై నిమిషాలు, గంటలు గడచిపోయాయి. కానీ “యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేక​పో[యెను]” అని బైబిలు చెబుతోంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఏలీయా వారిని ఎగతాళి చేస్తూ వారితో, బయలుకు వాళ్లని వినిపించుకునేంత తీరిక లేదేమో, దూరాన ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ అతణ్ణి లేపాల్సివుంటుందేమో అని అన్నాడు. ఆ మోసగాళ్లను “పెద్దకేకలు వేయుడి” అని ఏలీయా ప్రోత్సహించాడు. ఈ బయలు ఆరాధన పచ్చిమోసమని ఏలీయా గ్రహించాడనడంలో సందేహం లేదు, దేవుని ప్రజలు కూడా అది మోసమని గ్రహించాలని ఆయన కోరుకున్నాడు.​—⁠1 రాజులు 18:​26, 27.

దానితో బయలు యాజకులు మరింత రెచ్చిపోయి “మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను” కోసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది! “మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసినవాడైనను లేకపోయెను.” (1 రాజులు 18:​28, 29) నిజానికి బయలు అనేవాడే లేడు. ఆ బయలు, సాతాను ప్రజల్ని యెహోవా నుండి దూరం చేయడానికి సృష్టించిన దేవుడు. గతంలోనూ, ఇప్పుడూ యెహోవానుకాక వేరేదేన్నైనా యజమానిగా చేసుకోవడం నిరాశకు, చివరకు అవమానానికే దారితీస్తుంది.​—⁠కీర్తన 25:⁠3; 115:​4-8.

పరీక్షకు ఫలితం లభించింది

మధ్యాహ్నానికి ఏలీయా వంతు వచ్చింది. ఆయన కూల​ద్రోయబడ్డ బలిపీఠాన్ని బాగుచేశాడు. నిస్సందేహంగా ఆ బలిపీఠాన్ని స్వచ్ఛారాధనను ద్వేషించేవారు పాడుచేసివుండవచ్చు. దానికోసం ఆయన 12 రాళ్లను ఉపయోగించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం, పది గోత్రాల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పటికీ వర్తిస్తుందనే విషయం అక్కడున్న అనేకులకు గుర్తుచేయడానికే ఆయన వాటిని ఉపయోగించివుంటాడు. బలిపీఠంపై జంతువును పెట్టి, బహుశా దగ్గర్లోనే ఉన్న మధ్యధరా సముద్రం నుండి తెచ్చిన నీళ్లను దానిమీద పోయించాడు. ఆ బలిపీఠం చుట్టూ కందకాన్ని కూడా తవ్వించి దాని నిండా నీళ్లు నింపించాడు. ఆయన ఎలాగైతే బయలు ప్రవక్తలకు ప్రతీది అనుకూలంగా ఉండేలా చేశాడో ఇప్పుడు యెహోవాకు ప్రతీది అననుకూలంగా ఉండేలా చేశాడు. దేవునిపై ఆయనకున్న నమ్మకం అలాంటిది!​—⁠1 రాజులు 18:​30-35.

అంతా సిద్ధంచేసుకుని ఏలీయా ప్రార్థించాడు. సరళంగానైనా శక్తివంతంగా చేసిన ఆయన ప్రార్థన ఆయనకు ఎలాంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవో స్పష్టంగా తెలియజేసింది. ప్రప్రథమంగా, యెహోవాయే ‘ఇశ్రాయేలీయుల దేవుడు’ కానీ బయలు కాదు అని అందరికీ తెలియాలని కోరాడు. రెండవదిగా తను కేవలం యెహోవా సేవకుడినేనని, ఘనతంతా దేవునికే చెందాలని అందరూ తెలుసుకోవాలని కోరాడు. చివరిగా, యెహోవా తన ప్రజల ‘హృదయాలను తన తట్టుకు’ తిప్పు​కోవాలని ఏలీయా ఎంతో కోరుకున్నాడు కాబట్టి తన ప్రజలపట్ల తనకింకా శ్రద్ధ ఉందని ఆయన చూపించాడు. (1 రాజులు 18:​36, 37) వారి విశ్వాసరాహిత్యం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఏలీయా వారినింకా ప్రేమిస్తూనేవున్నాడు. మనం కూడా దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని నామంపట్ల అలాంటి శ్రద్ధనే కనబరుస్తూ, సహాయం అవసరమైన వారిపట్ల వినయాన్ని, కని​కరాన్ని చూపిద్దాం.

ఏలీయా ప్రార్థించకముందు అక్కడున్న ప్రజలు యెహోవా కూడా బయలులాగే నిరాశపరుస్తాడేమో అని అనుకుని ఉండవచ్చు. కానీ ప్రార్థన ముగిసిన తర్వాత వారికిక ఆలోచించేంత సమయం లేకపోయింది. దాని గురించి బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.” (1 రాజులు 18:​38) ఎంతటి మహత్తరమైన ఫలితమో కదా! దానికి ప్రజలెలా స్పందించారు?

వారందరూ “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలువేశారు. (1 రాజులు 18:​39) చివరకు వారు ఏది సత్యమో తెలుసుకోగలిగారు. అయితే వారిప్పటి​వరకు ఎలాంటి విశ్వాసం కనపర్చలేదు. నిజం చెప్పాలంటే, ప్రార్థన ఫలితంగా ఆకాశం నుండి అగ్ని రావడాన్ని చూసిన తర్వాత యెహోవాయే సత్యదేవుడని ఒప్పుకోవడం వారికున్న విశ్వాసానికి గొప్ప రుజువు కాదు. అందుకే ఏలీయా వారు తమ విశ్వాసాన్ని మరోవిధంగా చూపించాలని చెప్పాడు. వారు ఎన్నో సంవత్సరాల ముందే చేసివుండాల్సిన పనిని ఇప్పుడు చేయమని అంటే దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండమని ఆయన వారికి చెప్పాడు. అబద్ధ ప్రవక్తలకు, విగ్రహారాధకులకు మరణశిక్ష విధించబడాలని దేవుని ధర్మశాస్త్రం చెబుతోంది. (ద్వితీయోపదేశకాండము 13:​5-9) యెహోవా దేవునికి బద్ధశత్రువులైన ఈ బయలు యాజకులు కావాలనే ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడుచుకున్నారు. వారిని కనికరించాల్సిన అవసరం ఉందా? బయలుకు వారు సజీవంగా అర్పించిన అమాయకులైన చిన్నపిల్లలపట్ల వారు కనికరమేమైనా చూపించారా? (సామెతలు 21:​13; యిర్మీయా 19:⁠5) లేదు, అందుకే ఈ బయలు యాజకులపట్ల కనికరం చూపించే సమయం ఎప్పుడో దాటిపోయింది. అందుకే వారిని వధించాలని ఏలీయా ఆజ్ఞాపించగానే వారు వధించబడ్డారు.​—⁠1 రాజులు 18:​40.

కొందరు ఆధునికదిన విమర్శకులు కర్మెలు పర్వతంపై ఏలీయా బయలు ప్రవక్తలను వధించడాన్ని విమర్శిస్తారు. మతోన్మాదులు దీనిని ఒక సాకుగా చేసుకుని మత దురభిమానంతో తాము చేస్తున్న దౌర్జన్యాన్ని సమర్థించుకుంటారేమోనని వారు ఆందోళన చెందుతారు. విచారకరంగా నేడు అలాంటి మతోన్మాదులు చాలామందే ఉన్నారు. అయితే ఏలీయా మాత్రం మతం విషయంలో మతోన్మాదుడేమీ కాదు. ఆయన న్యాయమైన శిక్షను అమలు​చేయడానికి యెహోవాకు ప్రతినిధిగా పనిచేశాడు. అంతేకాదు, ఏలీయాలాగే తాము దుష్టులను చంపకూడదని నిజక్రైస్తవులకు తెలుసు. మెస్సీయ వచ్చిన తర్వాత, యేసు శిష్యులందరు పాటించాల్సిన ప్రమాణం క్రీస్తు పేతురుతో అన్న ఈ మాటల్లో కనిపిస్తోంది: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:​52) యెహోవా భవిష్యత్తులో దైవిక న్యాయాన్ని అమలు చేయడానికి తన కుమారుణ్ణి ఉపయోగిస్తాడు.

నిజ క్రైస్తవులకు విశ్వాసంతో జీవించాల్సిన బాధ్యత ఉంది. (యోహాను 3:​16) ఏలీయాలాంటి నమ్మమైన వ్యక్తుల మాదిరులను అనుసరించడం ద్వారా వారలా చేయవచ్చు. ఏలీయా యెహోవాను మాత్రమే ఆరాధించాడు, ఇతరులు కూడా అలాగే చేయాలని ప్రోత్సహించాడు. ప్రజలను యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను ఉపయోగించిన మతం మోసకరమైనదని ఆయన ధైర్యంగా వెల్లడించాడు. సమస్యలను పరిష్కరించడానికి తన స్వంత సామర్థ్యాలపై, ఇష్టాలపై ఆధారపడకుండా యెహోవాపై ఆధారపడ్డాడు. నిస్సందేహంగా, ఏలీయా స్వచ్ఛారాధనను సమర్థించాడు. మనందరం ఆయన విశ్వాసాన్ని అనుసరించుదుము గాక! (w 08 1/1)

[అధస్సూచీలు]

^ పేరా 9 ఈ సంఘటన జరగకముందు ఏలీయా అహాబును కలిసిన మరికొన్ని సందర్భాల గురించి తెలుసుకోవడానికి కావలికోట ఏప్రిల్‌ 1, 1992 (ఆంగ్లం) సంచికలోని “మీకు కూడా ఏలీయాలాంటి విశ్వాసం ఉందా?” అనే ఆర్టికల్‌ను చూడండి.

^ పేరా 13 సముద్రం నుండి వీచే తేమతో నిండిన గాలుల వల్ల కర్మెలు పర్వతంపై తరచూ వర్షాలు పడుతుంటాయి, మంచు కూడా బాగా కురుస్తుంది. అందుకే అది సాధారణంగా ఏపుగా పెరిగిన మొక్కలతో పచ్చగా ఉంటుంది. బయలు వల్లే వర్షాలు కురిసేవని ప్రజలు నమ్మేవారు కాబట్టి బయలు ఆరాధనలో ఆ పర్వతం చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడి ఉండవచ్చు. అందుకే, బయలు దేవత ఒక మోసగాడు అని రుజువుచేసేందుకు బీటలువారి, ఎండిపోయిన కర్మెలు పర్వతం సరైన స్థలం.

^ పేరా 17 బలి ‘కింద అగ్నియేమియు వేయవద్దని’ ఏలీయా వారికి ఖచ్చితంగా చెప్పాడు. అలాంటి విగ్రహారాధకులు కొన్నిసార్లు బలిపీఠాల కింద గోప్యంగా ఉన్న రంధ్రంలోనుండి మంట వచ్చేలా చేసి అదేదో మానవాతీత శక్తులవల్ల పుట్టుకొచ్చినట్లు కనిపించేలా చేసేవారని కొందరు విద్వాంసులు చెబుతున్నారు.

[20వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవానుకాక వేరేదేన్నైనా యజమానిగా చేసుకోవడం నిరాశకే దారితీస్తుంది

[21వ పేజీలోని చిత్రం]

‘యెహోవాయే [సత్య] దేవుడు’