కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనంలో ఎదురైన దుఃఖం నుండి ఉపశమనం పొందడం

యౌవనంలో ఎదురైన దుఃఖం నుండి ఉపశమనం పొందడం

యౌవనంలో ఎదురైన దుఃఖం నుండి ఉపశమనం పొందడం

యుసెబియో మోర్సిల్లో చెప్పినది

నేను 1993 సెప్టెంబరులో ఓరోజు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయబడిన ఒక జైలుకు వెళ్లాను. జైల్లో ఉన్న మా చెల్లి మారీవీ బాప్తిస్మం తీసుకోబోతోంది కాబట్టి నేను అక్కడికి వెళ్లాను. నేను బాప్తిస్మ ప్రసంగం ఇస్తుండగా కొందరు ఖైదీలు, జైలు అధికారులు గౌరవంగా నిలబడి గమనిస్తున్నారు. మా చెల్లీ, నేను అసలు అక్కడ ఎందుకు ఉన్నామో చెప్పే ముందు మా జీవితాల్లో అంతకుముందు ఏమి జరిగిందో మీకు చెప్తాను.

నేను 1954వ సంవత్సరం మే 5న స్పెయిన్‌లో పుట్టాను. మేము మొత్తం ఎనిమిదిమంది పిల్లలం, నేను మొదటివాడిని. మారీవీ మూడవది. మా అమ్మమ్మ మమ్మల్ని నిష్ఠగల క్యాథలిక్కులుగా మలచింది. మా అమ్మమ్మ దగ్గరున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించడం నాకు ఇప్పటికీ గుర్తుంది, అవన్నీ తీపిజ్ఞాపకాలు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. నాన్న ఎప్పుడూ అమ్మను, మమ్మల్ని కొడుతుండేవాడు. భయం మా జీవితంలో ఒక భాగమైంది. మా అమ్మ అలా బాధపడుతుండడం చూసి నేను కుమిలిపోయేవాణ్ణి.

స్కూల్లో కూడా నాకు మరింత నిరాశే ఎదురైంది. ఒక పాదిరి మాకు టీచరుగా ఉండేవాడు. మేమేదన్నా తప్పు జవాబిస్తే మా తలల్ని గోడకేసి కొట్టేవాడు. ఇంకొక పాదిరి పిల్లలు చేసిన హోంవర్కును చూస్తున్నప్పుడు వారిని లైంగికంగా వేధించేవాడు. అంతేకాక నరకం వంటి కొన్ని క్యాథలిక్కు బోధలు నన్ను కలవరపెట్టి, భయం కలిగించేవి. అందుకే దేవునిపట్ల నాకున్న భక్తి కొద్దికాలంలోనే సన్నగిల్లిపోయింది.

అర్థరహితమైన జీవితమనే ఊబిలో చిక్కుకుపోవడం

దేవునికి నచ్చేవిధంగా నడుచుకోవడానికి ఎలాంటి మార్గనిర్దేశం ఇచ్చేవారు లేకపోయేసరికి నేను డ్యాన్సు క్లబ్బుల్లో అనైతిక, దౌర్జన్యపరులైన వ్యక్తులతో సమయం గడిపేవాడిని. మాలో కొందరు తరచూ కత్తులూ, గొలుసులూ, గ్లాసులు, స్టూళ్లతో కొట్టుకునేవారు. అలాంటి గొడవల్లో నేను ఉద్దేశపూర్వకంగా పాల్గొనకపోయినా ఒకసారి స్పృహ కోల్పోయేంతగా దెబ్బలుతిన్నాను.

అలాంటి వాతావరణంతో విసిగివేసారిన నేను కాస్త ప్రశాంతంగా ఉండే డ్యాన్సు క్లబ్బుల కోసం వెతకడం ప్రారంభించాను. అక్కడ కూడా మాదకద్రవ్యాలు వాడేవారు. మాదకద్రవ్యాలు నాకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వకపోగా అవి నాకు మానసిక భ్రాంతి కలుగజేసి, దుఃఖాన్నే మిగిల్చాయి.

నా జీవన విధానంవల్ల నేను అంతగా సంతృప్తిపడకపోయినా, మా తమ్ముడు హోసే లూయిస్‌ను, ఆప్తమిత్రుడైన మీజెల్‌ను కూడా ఆ ఊబిలోకి లాగాను. ఆ కాలంలో స్పెయిన్‌లోని ఇతర యౌవనస్థుల్లా మేము కూడా అనైతిక లోకంలో కూరుకుపోయాం. నేను మాదక​ద్రవ్యాల కోసం ఏమి చేసేందుకైనా వెనకాడని స్థితికి దిగజారిపోయాను. నాకేమాత్రం గౌరవం లేకుండాపోయింది.

యెహోవా నన్ను ఆదుకున్నాడు

అదలా ఉండగా, అనేకసార్లు నేను నా స్నేహితులతో దేవుని ఉనికి గురించి, జీవిత పరమార్థం గురించి చర్చించేవాడిని. నేను దేవుణ్ణి అన్వేషించడం ప్రారంభించాను. మా తోటి ఉద్యోగస్థుల్లో ఫ్రాన్థీస్కో అందిరిలో కాస్త భిన్నంగా కనిపించాడు. ఆయన సంతోషంగా, నిజాయితీగా ఉంటాడని, దయగలవాడని అనిపించింది అందుకే నేను ఆయనకు నా అభిప్రాయాలను చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఫ్రాన్థీస్కో ఒక యెహోవాసాక్షి. ఆయన నాకు మాదకద్రవ్యాల గురించి చర్చించే ఒక ఆర్టికల్‌ ఉన్న కావలికోట సంచికను ఇచ్చాడు.

దాన్ని చదివిన తర్వాత నేను సహాయం కోసం దేవునికి ఇలా ప్రార్థించాను: “దేవా, నువ్వున్నావని నాకు తెలుసు. నేను నిన్ను తెలుసుకోవాలని, నువ్వు ఇష్టపడే రీతిలో నడుచుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యి!” ఫ్రాన్థీస్కోతోపాటు ఇతర సాక్షులు బైబిలు లేఖనాలతో నన్ను ప్రోత్సహించి, చదువుకోవడానికి బైబిలు ఆధారిత ప్రచురణలు ఇచ్చారు. నేను దేవుని నుండి ఏ సహాయాన్నైతే కోరానో దాన్నే వీరు నాకు చేస్తున్నారని గుర్తించాను. కొంతకాలానికి, నేను నేర్చుకుంటున్న విషయాలను నా స్నేహితులకు, హోసేకు చెప్పడం ప్రారంభించాను.

ఒకరోజు నేను స్నేహితులతో కలిసి రాక్‌ సంగీత కార్యక్రమం నుండి తిరిగివస్తున్నప్పుడు, నేను వారితో కలవకుండా దూరంగా నడుస్తూ వాళ్ళను గమనించినప్పుడు మేము మాదకద్రవ్యాల ప్రభావంతో ఎంత అసహ్యంగా ప్రవర్తించేవారమో నాకర్థమైంది. ఆ క్షణంలోనే నేను నా పాత జీవితానికి స్వస్తిచెప్పి ఒక యెహోవాసాక్షిగా మారాలని నిశ్చయించుకున్నాను.

నాకు ఒక బైబిలు కావాలని ఫ్రాన్థీస్కోను అడిగాను, ఆయన నాకు దానితోపాటు నిత్యజీవమునకు నడుపు సత్యము * అనే ఒక పుస్తకాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు కన్నీటిని తుడిచివేస్తానని, చివరకు మరణాన్ని కూడా రూపుమాపుతానని చేసిన వాగ్దానం గురించి నేను చదివినప్పుడు, మానవజాతిని విముక్తిచేసే సత్యాన్ని కనుగొన్నానని నాకు పూర్తిగా అర్థమైంది. (యోహాను 8:​32; ప్రకటన 21:⁠4) ఆ తర్వాత నేను యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో ఒక కూటానికి హాజరయ్యాను. వారి స్నేహశీలత, ఆప్యాయత నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.

నాకు రాజ్యమందిరంలో ఎదురైన అనుభవం గురించి చెప్పాలనే ఆత్రంతో నేను వెంటనే నా తమ్ముడు హోసేను, స్నేహితులను ఒకచోటకు పిలిపించి వారికి అంతా చెప్పేశాను. కొన్నిరోజుల తర్వాత మేమంతా ఒక కూటానికి హాజరయ్యాం. మా ముందు వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి మావైపు చూసింది. పొడవైన జుట్టుతో ఉన్న మమ్మల్ని చూసి ఆమె ఖచ్చితంగా ఆశ్చర్యపోయుంటుంది. ఆమె మళ్లీ మా వంక చూడకుండా జాగ్రత్తపడింది. మేము మరుసటి వారం అక్కడికి వెళ్లినప్పుడు ఆమె ఖచ్చితంగా ఆశ్చర్య​పోయేవుంటుంది ఎందుకంటే ఆ రోజున మేము సూటు వేసుకుని, టైలు కట్టుకుని వెళ్లాం.

అది జరిగిన కొంతకాలానికే నేను, మీజెల్‌ యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశానికి కూడా హాజరయ్యాం. మేము ముందెన్నడూ కనీవినీ ఎరుగని నిజమైన సహోదరత్వాన్ని చవిచూశాం, అదీ వయసుతో నిమిత్తంలేని సహోదరత్వం. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మేము కొద్దిరోజుల ముందు వెళ్లిన రాక్‌ సంగీత కార్యక్రమం జరిగిన థియేటర్‌లోనే ఆ సమావేశం జరిగింది. కానీ ఈ సారి అక్కడి వాతావరణం, సంగీతం మాకు కొత్త ఊపిరినిచ్చాయి.

నేను, తమ్ముడు, స్నేహితులందరం బైబిలు అధ్యయనం ప్రారంభించాం. దాదాపు ఎనిమిది నెలల తర్వాత 1974 జూలై 26న మీజెల్‌, నేను బాప్తిస్మం తీసుకున్నాం. అప్పుడు మా ఇద్దరికీ 20 ఏళ్లే. మా గుంపులో మిగతా నలుగురు కొన్ని నెలల తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు ఇంటిపనిలో సహాయం చేయడానికి, నేను కొత్తగా నేర్చుకున్న సత్యాన్ని ఆమెతో పంచుకోవడానికి నేను పొందిన బైబిలు శిక్షణే నన్ను కదిలించింది. దానివల్ల మా అమ్మకు నేను దగ్గరయ్యాను. మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కూడా సహాయం చేయడానికి ఎంతో సమయం వెచ్చించేవాణ్ణి.

అనతికాలంలో మా తోబుట్టువుల్లో ఒక తమ్ముడు తప్ప మిగతా అందరూ బైబిలు సత్యం నేర్చుకుని యెహోవా​సాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నారు. నేను 1977లో సోలీడాడ్‌ను వివాహం చేసుకున్నాను. ఆమె ఎవరోకాదు మేము రాజ్యమందిరానికి మొదటిసారి వెళ్లినప్పుడు మమ్మల్ని ఆశ్చర్యంగా చూసిన అమ్మాయే. కొన్ని నెలల్లోనే మేమిద్దరం పయినీర్లమయ్యాం. సువార్తను పూర్తికాలం ప్రకటించేవారిని యెహోవాసాక్షులు పయినీర్లు అని అంటారు.

మాకు ప్రియమైన వ్యక్తి విడుదలైంది

మా చెల్లెలు మారీవీ చిన్నప్పుడు లైంగిక దురాచారానికి గురైంది. ఆ భయానక సంఘటన ఆమెను ఎంతో ప్రభావితం చేసింది. కౌమారదశకు చేరుకునే సరికి ఆమె మాదకద్రవ్యాలు వాడుతూ, దొంగతనం, వ్యభిచారం చేస్తూ అనైతిక జీవితం గడపడం ప్రారంభించింది. ఆమె 23 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లింది, అక్కడ కూడా ఆమె తన జీవితాన్ని మార్చుకోలేదు.

ఆ సమయానికల్లా నేను ఒక ప్రాంతీయ పైవిచారణకర్తగా అంటే యెహోవాసాక్షుల ప్రయాణ పరిచారకునిగా సేవచేస్తున్నాను. సోలీడాడ్‌ను, నన్ను 1989లో మారీవీ ఉంటున్న జైలున్న ప్రాంతానికి పంపించారు. అధికారులు కొంతకాలం ముందే మారీవీ వాళ్ల అబ్బాయిని ఆమె నుండి వేరుచేశారు. దాంతో ఆమె ఎంతో కృంగిపోయి ఇక జీవితమే వద్దనుకునే స్థితికి చేరుకుంది. ఒకరోజు నేను ఆమెను కలిసి బైబిలు అధ్యయనం చేస్తావా అని అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంది. ఒక నెల అధ్యయనం చేసిన తర్వాత తను మాదకద్రవ్యాలు, పొగాకు వాడడం మానేసింది. ఆమె తన జీవితంలో ఈ మార్పులు చేసుకోగలిగేలా యెహోవా ఆమెని బలపరచడాన్ని చూసి నేనెంతో పులకించిపోయాను.​—⁠హెబ్రీయులు 4:​12.

అధ్యయనం ప్రారంభించిన కొంతకాలానికే మారీవీ బైబిలు సత్యాలను ఇతర ఖైదీలతో, జైలు అధికారులతో చెప్పడం మొదలుపెట్టింది. ఆమెను ఒక జైలు నుండి మరో జైలుకు పంపించినా ఆమె ప్రకటనా పనిని ఆపలేదు. ఒక జైలులోనైతే ఆమె గది గదికి వెళ్లి ప్రకటించింది. ఆ తర్వాత గడిచిన కొన్ని సంవత్సరాల్లో మారీవీ వివిధ సంస్కరణ జైళ్లలోని అనేక తోటిఖైదీలతో బైబిలు అధ్యయనాలు ప్రారంభించింది.

ఒకరోజు మారీవీ తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నానని నాకు చెప్పింది. కానీ జైలు వదిలి వెళ్ళడానికి, కనీసం లోపలైనా ఎవరో ఒకరు బాప్తిస్మం ఇవ్వడానికి కూడా అనుమతి లభించలేదు. ఆమె ఇంకో నాలుగు సంవత్సరాలు భ్రష్టుపట్టిన ఆ జైలు వాతావరణంలో గడపాల్సివచ్చింది. ఆమె తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తనకు ఏది సహాయం చేసింది? స్థానిక సంఘంలో కూటం జరుగుతున్న సమయానికే, ఆమె కూడా కూటంలో చర్చించబడే సమాచారాన్ని అధ్యయనం చేసేది. ఆమె క్రమంగా బైబిలు చదువుకునేది, ప్రార్థన చేసుకునేది.

కొంతకాలానికి మారీవీని ఎంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయబడిన ఒక జైలుకి మార్చారు. అక్కడొక స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. ఈ కొత్త జైల్లోనైనా బాప్తిస్మం తీసుకోవచ్చు అని ఆమె అనుకుంది. అనుకున్నట్లుగానే చివరకు ఆమెకు అనుమతి లభించింది. అందుకనే నేను బాప్తిస్మ ప్రసంగం ఇవ్వడానికి అక్కడికి వెళ్లాను. తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో నేను ఆమెతోపాటు ఉన్నాను.

ఆమెకు గతజీవితం కారణంగా ఎయిడ్స్‌ సోకింది. అయితే, ఆమె మంచి ప్రవర్తనను చూసి ఆమెను జైలునుండి త్వరగా అంటే 1994 మార్చిలో విడుదలచేశారు. ఆమె అమ్మతోపాటే ఉంటూ, తాను బ్రతికివున్న రెండు సంవత్సరాలూ క్రైస్తవురాలిగా చురుగ్గా సేవచేసింది.

ఆత్మన్యూనతా భావాలను అధిగమించడం

నా గతజీవితం వల్ల నాకెలాంటి సమస్యలు ఎదురవలేదని నేను చెప్పను. మా నాన్న చేతిలో తిన్న దెబ్బలు, యౌవనంలో నా జీవిత విధానాన్ని, నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి. నేను పెరిగి పెద్దయిన తర్వాత, తరచూ అపరాధ భావాలతో, ఆత్మన్యూనతా భావాలతో సతమతమయ్యేవాణ్ణి. కొన్నిసార్లు నేను చాలా కృంగిపోయేవాణ్ణి. అయితే, అలాంటి భావాలను అధిగమించడానికి దేవుని వాక్యమే నాకు ఎంతో సహాయం చేసింది. యెషయా 1:⁠18, కీర్తన 103:​8-13 లాంటి లేఖనాలను పదేపదే ధ్యానించడంద్వారా ఎన్నో సంవత్సరాలుగా నాలోని అపరాధ భావాలను అధిగమించ​గలుగుతున్నాను.

ఆత్మన్యూనతా భావాలను అధిగమించడానికి నేను ప్రార్థన అనే మరో ఆధ్యాత్మిక అస్త్రాన్ని ఉపయోగిస్తాను. నేను తరచూ యెహోవాకు కన్నీళ్ళతో ప్రార్థించేవాణ్ణి. అయితే 1 యోహాను 3:​19, 20లోని ఈ మాటలు నన్ను ఎప్పుడూ బలపరుస్తాయి: “ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషా​రోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము.”

నేను “విరిగి నలిగిన హృదయముతో” దేవునికి యథార్థంగా ప్రార్థించేవాణ్ణి కాబట్టి నేను గతంలో అనుకున్నంత చెడ్డవాడిని కాదని గుర్తించాను. తమ గత ప్రవర్తన గురించి నిజంగా పశ్చాత్తాపపడి, ఆయనకు ఇష్టమైన విధంగా నడుచుకునేవారిని యెహోవా తిరస్కరించడని ఆయనను ఆరాధించేవారందరికీ బైబిలు హామీనిస్తోంది.​—⁠కీర్తన 51:​17.

నా మీద నాకు నమ్మకం తగ్గినప్పుడు, ప్రోత్సాహకరమైన విషయాల గురించి ఆలోచించడానికి, ఫిలిప్పీయులు 4:⁠8లో పేర్కొనబడినలాంటి పవిత్రమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నేను 23వ కీర్తనను, కొండమీది ప్రసంగాన్ని కంఠతాపట్టాను. నాకు ఆత్మన్యూనతా భావాలు కలిగినప్పుడల్లా ఆ లేఖనాలను వల్లిస్తుంటాను. ఇలా చేయడం, నాకు రాత్రులు నిద్రపట్టనప్పుడు నా మనసులోంచి నిరుత్సాహకరమైన భావాలను అధిగమించడానికి ఎంతో సహాయంచేస్తుంది.

నా భార్య, అనుభవంగల ఇతర క్రైస్తవులు నన్ను మెచ్చుకోవడం కూడా కొంతవరకు నాకు సహాయం చేసింది. కొత్తలో వారి ప్రోత్సాహకరమైన మాటల్ని అంగీకరించడానికి నాకు కష్టమనిపించినా, ప్రేమ “అన్నిటిని నమ్మును” అనే విషయాన్ని అర్థంచేసుకోవడానికి బైబిలు నాకు సహాయం చేసింది. (1 కొరింథీయులు 13:⁠7) అంతేకాక నేను వినయంగా నా బలహీనతలను, పరిమితులను అంగీకరించడం మెల్లగా నేర్చుకున్నాను.

అయితే, అలాంటి ఆత్మన్యూనతా భావాలవల్ల నాకున్న ఒక ప్రయోజనం ఏమిటంటే, నేను ఒక సానుభూతిగల ప్రయాణ పైవిచారణకర్తగా ఉండేందుకు అవి సహాయం చేశాయి. నా భార్య, నేను సువార్త ప్రకటించే పూర్తికాల పరిచారకులుగా 30 సంవత్సరాలు సేవచేశాం. ఇతరులకు సేవచేయడం ద్వారా నేను పొందుతున్న ఆనందం, ఆత్మన్యూనతా భావాలను, చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు నాకు సహాయంచేస్తోంది.

నా గతజీవితం గురించి, యెహోవా నాపై కుమ్మరించిన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తే, “యెహోవాను సన్నుతించుము. . . . ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు” అని కీర్తనకర్తలాగే నాకు కూడా స్తుతించాలని అనిపిస్తుంది.​—⁠కీర్తన 103:​1-4. (w 08 1/1)

[అధస్సూచి]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది, ఇప్పుడు ముద్రించ​బడడం లేదు.

[30వ పేజీలోని బ్లర్బ్‌]

తరచూ అపరాధ భావాలతో, ఆత్మన్యూనతా భావాలతో సతమతమయ్యేవాణ్ణి. అయితే, అలాంటి భావాలను అధిగమించడానికి దేవుని వాక్యమే నాకు ఎంతో సహాయం చేసింది

[27వ పేజీలోని చిత్రాలు]

మా తమ్ముడు హోసే, స్నేహితుడు మీజెల్‌ ఇద్దరూ నా చెడు మాదిరినేకాక నా మంచి మాదిరిని కూడా అనుసరించారు

[28, 29వ పేజీలోని చిత్రం]

1973లో మోర్సిల్లో కుటుంబం

[29వ పేజీలోని చిత్రం]

మారీవీ జైల్లో ఉన్నప్పుడు

[30వ పేజీలోని చిత్రం]

నా భార్య సోలీడాడ్‌తో