కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం మన హృదయంలోనే ఉందా?

దేవుని రాజ్యం మన హృదయంలోనే ఉందా?

మా పాఠకుల ప్రశ్న

దేవుని రాజ్యం మన హృదయంలోనే ఉందా?

పైన అడిగిన ప్రశ్నకు నేడు చాలామంది అవుననే జవాబిస్తారు. ఉదాహరణకు, క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా నొక్కిచెబుతోంది: “దేవుని రాజ్యం అంటే . . . దేవుడు మన హృదయాలను నియంత్రించే విధానం అని అర్థం.” పాదిరీలు సాధారణంగా అలానే బోధిస్తుంటారు. బైబిలు నిజంగానే దేవుని రాజ్యం మానవుల హృదయాల్లో ఉందని బోధిస్తోందా?

దేవుని రాజ్యం మానవుల హృదయాల్లో ఉందనే నమ్మకాన్ని యేసే ప్రారంభించాడని కొందరు అనుకుంటారు. నిజమే, యేసు “ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” అని చెప్పాడు. (లూకా 17:​21) కొన్ని బైబిలు అనువాదాలు దాన్ని ఇలా అనువదించాయి: “దేవుని రాజ్యం మీలోనే ఉంది.” ఆ అను​వాదాలు యేసు చెప్పిన మాటలను ఖచ్చితంగా అనువదించాయా? దేవుని రాజ్యం మానవుల హృదయాల్లో ఉందనే ఉద్దేశంతోనే ఆయన అలా చెప్పాడా?

ముందుగా మానవ హృదయం గురించి ఆలోచించండి. బైబిలు సూచనార్థక హృదయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అది మన అంతరంగాన్ని అంటే మన ఆలోచనలను, వైఖరులను, భావాలను సూచిస్తోంది. మానవుల్ని మార్చి, ఘనపర్చే ఎంతో ఉన్నతమైన దేవుని రాజ్యం మానవ హృదయంలో ఉంటుంది అనే నమ్మకం వినడానికి బాగానేవున్నా, ఆ నమ్మకం ఎంత​వరకు సమంజసం?

“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 17:⁠9) యేసే స్వయంగా, “మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును . . . వచ్చును” అని చెప్పాడు. (మార్కు 7:​20-22) దీని గురించి కాస్త ఆలోచించండి: నేడు మనం లోకంలో చూస్తున్న బాధలకు పాపభరిత మానవ హృదయం ఎక్కువగా కారణం కాదా? మరి అలాంటి హృదయం నుండి పరిపూర్ణమైన దేవుని రాజ్యం ఎలా వస్తుంది? ముండ్ల పొదకు అంజూరపు పళ్లు కాయడం ఎంత అసాధ్యమో మానవ హృదయం నుండి దేవుని రాజ్యం రావడం కూడా అంతే అసాధ్యం.​—⁠మత్తయి 7:​16.

రెండవదిగా, లూకా 17:21లోని మాటలను యేసు ఎవరితో అన్నాడో కూడా ఆలోచించండి. దానికి ముందున్న వచనం, “దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు” అడిగిన ప్రశ్నకు యేసు జవాబిచ్చాడని చెబుతోంది. (లూకా 17:​20) పరిసయ్యులు యేసుకు శత్రువులు. అలాంటి వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరని యేసు స్పష్టంగా చెప్పాడు. (మత్తయి 23:​13) మరి పరిసయ్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే వారి హృదయాల్లో దేవుని రాజ్యం ఉండగలదా? అసాధ్యం! మరి యేసు మాటలకు అర్థమేమిటి?

జాగ్రత్తగా అనువదించబడిన అనేక బైబిళ్లలో యేసు మాటలు పరిశుద్ధ గ్రంథములో అనువదించబడినట్లుగానే అనువదించబడ్డాయి. కొన్నింటిలో రాజ్యం “మీ మధ్యనే ఉన్నది” అని అనువదించబడింది. మరి దేవుని రాజ్యం ఆ కాలపు ప్రజలతోపాటు పరిసయ్యుల మధ్య ఉందని ఎలా చెప్పవచ్చు? యెహోవా దేవుడు యేసును రాజ్యానికి రాజుగా నియమించాడు. నియమిత రాజైన యేసు ఆ ప్రజల మధ్యనే ఉన్నాడు. ఆయన వారికి దేవుని రాజ్యం గురించి బోధించాడు. ఆ రాజ్యం ఏమి చేస్తుందో చూపించడానికి అద్భుతాలను కూడా చేశాడు. కాబట్టి అక్షరార్థ భావంలో, రాజ్యం వారి మధ్యనే ఉంది.

అవును, దేవుని రాజ్యం మానవుల హృదయాల్లో ఉంది అనడానికి లేఖనాల్లో ఏ ఆధారం లేదు. బదులుగా, ప్రవక్తలు ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పినట్లు అది భూమిపై గమనార్హ మైన మార్పులు తీసుకొచ్చే ఒక నిజమైన ప్రభుత్వం.​—⁠యెషయా 9:​6, 7; దానియేలు 2:​44. (w 08 1/1)