కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్యాన్ని పొందేందుకు యోగ్యులుగా ఎంచబడడం

రాజ్యాన్ని పొందేందుకు యోగ్యులుగా ఎంచబడడం

రాజ్యాన్ని పొందేందుకు యోగ్యులుగా ఎంచబడడం

‘దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడుట, దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.’​—⁠2 థెస్స. 1:⁠5.

అపొస్తలుడైన పౌలు, దాదాపు సా.శ. 50వ సంవత్సరంలో ఏథెన్సులో ఉన్నాడు. ఆ పట్టణం విగ్రహారాధనతో నిండివుండడాన్ని చూసి కలవరపడ్డ పౌలు చక్కని సాక్ష్యమివ్వడానికి ప్రేరేపించబడ్డాడు. ఆయన అన్యులైన తన శ్రోతల దృష్టిని ఆకర్షించే మాటలతో తన ప్రసంగాన్ని ముగించాడు. ఆయనిలా అన్నాడు: “ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు [దేవుడు] ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”​—⁠అపొ. 17:​30, 31.

2 దేవుడు మానవుల కోసం భవిష్యత్తులో ఒక విమర్శదినాన్ని నిర్ణయించాడనే వాస్తవం గురించి ఆలోచించడం ఎంత గంభీరమైన విషయమో కదా! ఏథెన్సులో తాను ఇచ్చిన ప్రసంగంలో పౌలు, ఆ తీర్పు తీర్చబోయే వ్యక్తి ఎవరో తెలియజేయనప్పటికీ ఆయన పునరుత్థానుడైన యేసుక్రీస్తని మనకు తెలుసు. యేసు తీర్పుతీర్చినప్పుడు మనం జీవాన్నో లేదా మరణాన్నో పొందుతాం.

3 ఆ విమర్శదినం వెయ్యేండ్లు ఉంటుంది. దేవుని రాజ్యానికి రాజుగా యేసు, యెహోవా పేరిట ఆ విమర్శదినాన్ని పర్యవేక్షిస్తాడు, అయితే ఆయనొక్కడే దానిలో భాగం వహించడు. ఆ వెయ్యేండ్ల పరిపాలనలో యేసుతోపాటు పరిపాలిస్తూ తీర్పుతీర్చడానికి యెహోవా మానవుల్లో నుండి ఇతరులను ఎంపికచేసుకుంటాడు. (లూకా 22:​29, 30) దాదాపు 4,000 సంవత్సరాల క్రితం యెహోవా తన నమ్మకమైన సేవకుడైన అబ్రాహాముతో ఒక నిబంధన చేసినప్పుడే ఆ విమర్శదినానికి పునాదివేశాడు. (ఆదికాండము 22:​17, 18 చదవండి.) ఆ నిబంధన సా.శ.పూ. 1943లో అమల్లోకి వచ్చింది. నిజానికి ఆ నిబంధనవల్ల మానవులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో అబ్రాహాము పూర్తిగా అర్థంచేసుకోలేకపోయాడు. అయితే మనం, ఆ నిబంధన ప్రకారం, మానవజాతికి తీర్పుతీర్చాలనే దేవుని సంకల్పం నేరవేర్చడంలో అబ్రాహాము సంతానం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నేడు గ్రహించవచ్చు.

4 అబ్రాహాము సంతానంలోని ప్రథమ భాగం యేసే అని తేలింది, ఆయన సా.శ. 29లో పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి వాగ్దత్త మెస్సీయ లేక క్రీస్తు అయ్యాడు. (గల. 3:​16) ఆ తర్వాతి మూడున్నర సంవత్సరాలు యేసు రాజ్య సువార్తను యూదా జనాంగానికి ప్రకటిస్తూ గడిపాడు. ఆ రాజ్యంలో సభ్యులుగా ఉండేందుకు ఇతరులు నిరీక్షించవచ్చని బాప్తిస్మమిచ్చు యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసు వివరించాడు ‘పరలోకరాజ్యంలో ప్రవేశించాలనే లక్ష్యంతో మనుష్యులు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు, అలా ప్రయత్నిస్తున్నవారు దానిని సొంతం చేసుకుంటున్నారు’ అని ఆయన అన్నాడు.​—⁠మత్త. 11:​12, NW.

5 ఆసక్తికరమైన విషయమేమిటంటే, పరలోక రాజ్యాన్ని ‘సొంతం’ చేసుకునేవారి గురించి మాట్లాడే ముందు యేసు, “స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు” అని అన్నాడు. (మత్త. 11:​11) ఆయనలా ఎందుకు అన్నాడు? ఎందుకంటే, సా.శ. 33 పెంతెకొస్తునాడు విశ్వాసులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడేంతవరకు దేవుని రాజ్యంలో భాగస్థులుగా ఉండే నిరీక్షణ పూర్తిగా అనుగ్రహించబడలేదు. ఆ సమయానికి, బాప్తిస్మమిచ్చు యోహాను మరణించాడు.​—⁠అపొ. 2:​1-4.

అబ్రాహాము సంతానం నీతిమంతులుగా తీర్చబడ్డారు

6 తన సంతానం విస్తరించి “ఆకాశ నక్షత్రములవలె” సముద్రతీరంలో ఉన్న ఇసుకవలె అవుతుందని అబ్రాహాముకు వాగ్దానం చేయబడింది. (ఆది. 13:​16; 22:​17) కాబట్టి, ఆయన సంతానంలో ఎంతమంది ఉంటారో తెలుసుకోవడం ఆయన కాలంలోని మానవులకు సాధ్యంకాదు. అయితే, ఆయన ఆధ్యాత్మిక సంతానంలో ఖచ్చితంగా ఎంతమంది ఉంటారనేది చివరకు తర్వాత వెల్లడిచేయబడింది. ఆ సంతానంలో యేసుతోపాటు, 1,44,000 మంది ఉంటారు.​—⁠ప్రక. 7:⁠4; 14:⁠1.

7 అబ్రాహాము విశ్వాసం గురించి దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “[అబ్రాహాము] యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” (ఆది. 15:​5, 6) నిజానికి, ఏ మానవుడూ పూర్ణంగా నీతిమంతునిగా లేడు. (యాకో. 3:⁠2) అయినా, అబ్రాహాము అసాధారణ విశ్వాసం చూపించాడు కాబట్టి, యెహోవా నీతిమంతునితో వ్యవహరించినట్లే ఆయనతో వ్యవహరించడమే కాక, ఆయనను తన స్నేహితుడని కూడా సంబోధించాడు. (యెష. 41:⁠8) యేసుతోపాటు అబ్రాహాము ఆధ్యాత్మిక సంతానంలో భాగంగా ఉండేవారు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఆ కారణంగా వారు అబ్రాహాముకన్నా గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు.

8 అభిషిక్త క్రైస్తవులు యేసు విమోచనా క్రయధన బలిని విశ్వసిస్తారు కాబట్టే, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. (రోమా. 3:​24, 28) యెహోవా దృష్టిలో వారు పాపవిముక్తి పొందారు కాబట్టి, వారు దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా అంటే యేసుక్రీస్తు సహోదరులుగా ఉండేందుకు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడవచ్చు. (యోహా. 1:​12, 13) వారు కొత్త నిబంధనలోకి వచ్చి, దేవుని ఇశ్రాయేలు అనే కొత్త జనాంగంగా రూపొందుతారు. (గల. 6:​16; లూకా 22:​20) వారికెంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడిందో కదా! దేవుడు వారికోసం ఇవన్నీ చేశాడు కాబట్టి అభిషిక్త క్రైస్తవులు ఈ భూమ్మీది నిత్యజీవం కోసం నిరీక్షించరు. విమర్శదినంలో యేసుతో సహవసిస్తూ ఆయనతో పరలోకంలో నుండి పరిపాలించడంవల్ల కలిగే గొప్ప ఆనందం కోసం వారు ఆ నిరీక్షణను త్యాగం చేస్తారు.​—⁠రోమీయులు 8:​17 చదవండి.

9 సా.శ. 33 పెంతెకొస్తునాడు, విమర్శదినంలో యేసుతోపాటు పరిపాలించే అవకాశం కొంతమంది నమ్మకస్థులైన మానవులకు ఇవ్వబడింది. దాదాపు 120 మంది యేసు శిష్యులు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొంది, మొదటి అభిషిక్త క్రైస్తవులయ్యారు. అయితే అది వారికి ప్రారంభం మాత్రమే. అప్పటి నుండి, సాతాను తమమీదకు ఎన్ని పరీక్షలు తీసుకొచ్చినా వారు యెహోవాపట్ల తమకున్న విశ్వసనీయతను కనబరచాలి. వారు పరలోక జీవితమనే కిరీటం పొందాలంటే మరణంవరకు నమ్మకంగా ఉండాలి.​—⁠ప్రక. 2:​10.

10 అభిషిక్త క్రైస్తవులు నమ్మకంగా ఉండేలా, యెహోవా తన వాక్యం ద్వారా క్రైస్తవ సంఘం ద్వారా వారికి కావాల్సిన బోధనను, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని అభిషిక్త క్రైస్తవులకు ఇలా రాశాడు: “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమి.”​—⁠1 థెస్స. 2:​11, 12.

11 అభిషిక్త క్రైస్తవుల సంఘంలోని మొదటి సభ్యులు ఎంపిక చేయబడిన తర్వాత గడిచిన దశాబ్దాల్లో, యేసు భూపరిచర్య గురించిన, మొదటి శతాబ్దపు అభిషిక్త క్రైస్తవులతో ఆయన వ్యవహరించిన తీరు గురించిన, ఆయన వారికిచ్చిన ఉపదేశం గురించిన శాశ్వత వృత్తాంతం రాయబడడం సముచితమని యెహోవా భావించాడు. అలా అప్పటికే అందుబాటులో ఉన్న ప్రేరేపిత హెబ్రీ లేఖనాలకు ప్రేరేపిత గ్రీకు లేఖనాలను యెహోవా జతచేశాడు. హెబ్రీ లేఖనాలు ప్రాథమికంగా శారీరక ఇశ్రాయేలీయుల కోసం రాయబడ్డాయి. వారు యెహోవాతో ప్రత్యేక సంబంధాన్ని కలిగివున్న కాలంలో అవి రాయబడ్డాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాలు ప్రాథమికంగా “దేవుని ఇశ్రాయేలు” కోసం అంటే క్రీస్తు సహోదరులుగా, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా అభిషేకించబడినవారి కోసం రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులు కానివారు హెబ్రీ లేఖనాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందలేరని ఎంతమాత్రం దాని భావం కాదు. అలాగే పరిశుద్ధాత్మతో అభిషేకించబడని క్రైస్తవులు క్రైస్తవ గ్రీకు లేఖనాలను అధ్యయనం చేసి, దానిలోని ఉపదేశానుసారంగా జీవించడవల్ల అపారమైన ప్రయోజనాలను పొందుతారు.​—⁠2 తిమోతి 3:​14-17 చదవండి.

12 మొదటి శతాబ్దపు క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడి, పరలోక స్వాస్థ్యాన్ని పొందేలా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. వారు అభిషేకించబడినంత మాత్రాన తాము భూమ్మీద ఉన్నప్పుడు తోటి అభిషిక్త క్రైస్తవులమీద రాజులుగా ఉండేందుకు హెచ్చించబడ్డారని దానర్థం కాదు. తొలిక్రైస్తవుల్లో కొందరు ఆ విషయాన్ని మరిచిపోయి సంఘంలోని తమ సహోదరుల మధ్య అనుచిత ప్రాధాన్యత కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. అందుకే పౌలు వారిని, “ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతో కూడ రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?” అని అడిగాడు. (1 కొరిం. 4:⁠8) కాబట్టి, పౌలు తన కాలంలోని అభిషిక్త కైస్తవులకు, “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము” అని గుర్తుచేశాడు.​—⁠2 కొరిం. 1:​24.

ముందుగా చెప్పబడిన సంఖ్యను పూర్తిచేయడం

13 మొదటి శతాబ్దంలోనే 1,44,000 అభిషిక్త క్రైస్తవుల్లోని సభ్యులందరూ ఎంపికచేయబడలేదు. అభిషిక్త క్రైస్తవుల ఎంపిక అపొస్తలుల కాలమంతటిలో కొనసాగి, బహుశా ఆ తర్వాతి శతాబ్దాల్లో నిదానించివుండవచ్చు. అయితే, వారి ఎంపిక ఆ తర్వాతి శతాబ్దాల్లోనూ జరుగుతూ మన కాలాలవరకు కొనసాగింది. (మత్త. 28:​20) చివరకు, యేసు 1914 నుండి పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత సంఘటనలు ఒకటి తర్వాత మరొకటి త్వరత్వరగా సంభవించాయి.

14 మొదటిగా, యేసు దైవపరిపాలనకు విరుద్ధంగా ఉన్న వ్యతిరేకులను పరలోకం నుండి సమూలంగా తొలగించాడు. (ప్రకటన 12:​10, 12 చదవండి.) ఆ తర్వాత ఆయన 1,44,000 సంఖ్యను పూర్తిచేసేందుకు తన రాజ్య ప్రభుత్వానికి సంబంధించిన మిగతా భావి సభ్యులను సమకూర్చడం మొదలుపెట్టాడు. 1930 మధ్యకాలానికల్లా ఆ పని దాదాపు పూర్తికావచ్చింది, అంతేకాక, ప్రకటనా పనికి స్పందింస్తున్నవారు పరలోకానికి వెళ్లాలని కోరుకోలేదు. తాము దేవుని కుమారులమని ఆత్మ వారికి సాక్ష్యమివ్వలేదు. (రోమీయులు 8:⁠16ను పోల్చండి.) బదులుగా, తాము పరదైసు భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణగల ‘వేరే గొర్రెలమని’ వారు గుర్తించారు. (యోహా. 10:​16) కాబట్టి, 1935వ సంవత్సరం తర్వాత ప్రచారకులు ప్రకటనాపనిలో ‘గొప్పసమూహాన్ని’ సమకూర్చే పనికే ప్రాధాన్యతనిచ్చారు. “మహాశ్రమల” నుండి రక్షించబడే ఆ గొప్పసమూహాన్ని అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు.​—⁠ప్రక. 7:​9, 10, 14.

15 అయితే, 1930ల తర్వాతి సంవత్సరాల్లో కొంతమంది పరలోక పిలుపు పొందారు. ఎందుకు? గతంలో పిలుపు పొందినవారిలో అవిశ్వాసులైన వారి స్థానాన్ని భర్తీచేసేందుకు వారు ఆ పిలుపును పొందివుండవచ్చు. (ప్రకటన 3:​16 పోల్చండి.) పౌలు తనకు పరిచయమున్నవారు సత్యాన్ని విడిచివెళ్లారని కూడా తెలియజేశాడు. (ఫిలి. 3:​17-19) అలాంటి వ్యక్తుల స్థానాలను భర్తీచేసేందుకు యెహోవా ఎవరిని ఎంపిక చేసుకుంటాడు? ఆ నిర్ణయం ఆయనదే. అయినా, ఆయన కొత్తగా క్రైస్తవులైనవారిని కాక, తమ విశ్వసనీయతను చాలామేరకు నిరూపించుకున్నవారికే అంటే యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడిన శిష్యుల్లాంటి వారికే పిలుపునిస్తాడని అనుకోవడం సముచితంగా ఉంటుంది. *​—⁠లూకా 22:​28.

16 అయితే, 1930ల నుండి పరలోక పిలుపు పొందినవారందరూ సత్యాన్ని విడిచివెళ్లినవారిని భర్తీచేయడానికి పిలవబడినవారుకారని అనిపిస్తోంది. ఈ విధానపు అంత్యదినాలు మొదలుకొని “మహా బబులోను” నాశనమయ్యేంతవరకు అభిషిక్త క్రైస్తవులు మనతో ఉండేలా యెహోవా చర్య తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. * (ప్రక. 17:⁠5) యెహోవా నియమిత కాలంలో 1,44,000 సభ్యుల సంఖ్య పూర్తౌతుందని, వారిలో అందరూ రాజ్య ప్రభుత్వంలో చివరకు పరిపాలిస్తారనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అంతకంతకూ పెరుగుతున్న గొప్పసమూహపువారు ఒక గుంపుగా నమ్మకంగా ఉంటారనే ప్రవచన వాక్యాన్ని కూడా మనం నమ్మవచ్చు. త్వరలో వారు సాతాను లోకంమీదకు వచ్చే ‘మహాశ్రమలను’ తప్పించుకొని, దేవుని నూతనలోకంలోకి ఆనందంగా ప్రవేశిస్తారు.

దేవుని పరలోక ప్రభుత్వం దాదాపు పూర్తైంది

17 సా.శ. 33నుండి వేలాదిమంది అభిషిక్త క్రైస్తవులు బలమైన విశ్వాసాన్ని కనబరచి మరణంవరకు నమ్మకంగా ఉన్నారు. వారు రాజ్యాన్ని పొందేందుకు ఇప్పటికే అర్హులుగా పరిగణించబడ్డారు. వారు క్రీస్తు ప్రత్యక్షతా కాలపు తొలి రోజులనుండి తమ పరలోక ప్రతిఫలాన్ని పొందారనేది స్పష్టం.​—⁠1 థెస్సలొనీకయులు 4:​15-17; ప్రకటన 6:​9-11 చదవండి.

18 భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులు తాము నమ్మకంగా ఉంటే త్వరలో తాము కూడా పరలోక బహుమానాన్ని పొందుతామని సంపూర్ణంగా నమ్ముతున్నారు. లక్షలాదిమంది వేరేగొర్రెలు తమ అభిషిక్త సహోదరుల విశ్వాసాన్ని గురించి ధ్యానించినప్పుడు, థెస్సలొనీకలోని అభిషిక్త క్రైస్తవుల గురించి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలతో ఏకీభవిస్తారు: “మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.” (2 థెస్స. 1:​3-5) భూమ్మీద ఆఖరి అభిషిక్తుడు ఎప్పుడు మరణించినా ఆయన మరణంతో దేవుని పరలోక ప్రభుత్వంలోని సభ్యుల సంఖ్య పూర్తౌతుంది. దానివల్ల ఇటు పరలోకంలోను, అటు భూమ్మీదను ఎంత ఆనందం వెల్లివిరుస్తుందో కదా!

[అధస్సూచీలు]

^ పేరా 19 కావలికోట, మార్చి 1, 1992 సంచికలోని, 20వ పేజీ, 17వ పేరా చూడండి.

^ పేరా 20 కావలికోట, మే 1, 2007 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

మీరు వివరించగలరా?

• విమర్శదినానికి సంబంధించిన ఏ అంశాన్ని దేవుడు అబ్రాహాముకు వెల్లడిచేశాడు?

• అబ్రాహాము నీతమంతునిగా ఎందుకు తీర్చబడ్డాడు?

• అబ్రాహాము సంతానంలోని వారు నీతిమంతులుగా తీర్చబడడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

• క్రైస్తవులందరికీ ఏ నమ్మకముంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. తీర్పు తీర్చే విషయంలో దేవుని సంకల్పమేమిటి, ఎవరు తీర్పుతీరుస్తారు?

3. యెహోవా అబ్రాహాముతో ఎందుకు ఒక నిబంధన చేశాడు, దాని నెరవేర్పులో ఎవరు ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తారు?

4, 5. (ఎ) అబ్రాహాము సంతానంలోని ప్రథమ భాగం ఎవరు, ఆయన రాజ్యం గురించి ఏమి చెప్పాడు? (బి) రాజ్య ఏర్పాటులో భాగంగా ఉండే నిరీక్షణ ఎప్పుడు అనుగ్రహించబడింది?

6, 7. (ఎ) అబ్రాహాము సంతానం ఏ విధంగా “ఆకాశ నక్షత్రములవలె” అవుతుంది? (బి) అబ్రాహాము ఏ ఆశీర్వాదం పొందాడు, అలాంటి ఏ ఆశీర్వాదం ఆయన సంతానం కూడా పొందుతుంది?

8. అబ్రాహాము సంతానంలోని సభ్యులకు ఏ ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి?

9, 10. (ఎ) క్రైస్తవులు పరిశుద్ధాత్మతో మొదటిసారిగా ఎప్పుడు అభిషేకించబడ్డారు, వారికి ఏ నిరీక్షణ ఉంది? (బి) అభిషిక్త క్రైస్తవులు ఏ సహాయం పొందారు?

11. “దేవుని ఇశ్రాయేలుకు” చెందిన సభ్యుల కోసం యెహోవా ఏ వృత్తాంతాన్ని రాయించాడు?

12. పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఏమి గుర్తుచేశాడు?

13. సా.శ. 33 తర్వాత అభిషిక్తుల పిలుపు ఎలా కొనసాగింది?

14, 15. అభిషిక్తులు పిలవబడడానికి సంబంధించి మన కాలంలో ఏమి జరిగింది?

16. అభిషిక్తులకు సంబంధించి మనం ఏ విషయంలో కృతజ్ఞతను కనబరుస్తాం, మనం దేనిని నిశ్చయంగా నమ్మవచ్చు?

17. మొదటి థెస్సలొనీకయులు 4:​15-17; ప్రకటన 6:​9-11 వచనాల ప్రకారం, నమ్మకస్థులుగా మరణించిన అభిషిక్త క్రైస్తవులకు ఏమి సంభవించింది?

18. (ఎ) భూమ్మీద మిగిలివుండే అభిషిక్తులు ఏ నమ్మకంతో ఉన్నారు? (బి) వేరేగొర్రెలకు చెందినవారు తమ అభిషిక్త క్రైస్తవ సహోదరులను ఎలా దృష్టిస్తారు?

[20వ పేజీలోని చిత్రం]

రాజ్యం కోసం ప్రయత్నించమని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు

[21వ పేజీలోని చిత్రం]

సా.శ. 33 పెంతెకొస్తునాడు యెహోవా అబ్రాహాము సంతానంలోని ఇతర సభ్యులు ఎంపికచేయడం మొదలుపెట్టాడు

[23వ పేజీలోని చిత్రాలు]

అభిషిక్త క్రైస్తవులు అంత్యదినాల్లో తమతో ఉన్నందుకు వేరేగొర్రెలు కృతజ్ఞతతో ఉన్నారు