కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత సంకల్పమేమిటి?

జీవిత సంకల్పమేమిటి?

జీవిత సంకల్పమేమిటి?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం? జీవితానికి ఒక అర్థంగానీ, సంకల్పంగానీ లేవు అనే ఆలోచనే మానవులను అన్నింటికన్నా ఎక్కువగా బాధపెడుతుంటాయి. మరోవైపు, జీవితంలో నిర్దిష్టమైన సంకల్పం ఉన్న వ్యక్తి జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులనైనా తట్టుకొని నిలబడగలుగుతాడు. మారణ​హోమం నుండి సజీవంగా బయటపడిన న్యూరాలజిస్టు విక్టర్‌ ఇ. ఫ్రాంకెల్‌ ఇలా రాశాడు: “జీవితానికి అర్థం ఉందనే జ్ఞానమే క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా ఒకరికి ఎంతో సమర్థవంతంగా సహాయం చేస్తుంది, దానికన్నా మరేదీ అంతగా సహాయం చేయ​లేదని నేను బల్లగుద్ది చెప్పగలను.”

అయితే, జీవిత సంకల్పం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది, ఒక వ్యక్తి తన జీవిత సంకల్పమేమిటో నిర్ణయించుకునే బాధ్యత అతనిదే అని అనుకుంటారు. దానికి భిన్నంగా, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవారు జీవితానికి అసలు అర్థమే లేదని వివరిస్తారు.

అయితే నిజానికి, జీవిత సంకల్పం గురించి జీవదాతయైన యెహోవా దేవుని నుండి తెలుసుకోవడమే అత్యంత జ్ఞానయుక్తమైన మార్గం. ఈ విషయం గురించి ఆయన వాక్యం ఏమి చెబుతుందో పరిశీలించండి.

బైబిలు ఇస్తున్న జవాబు ఏమిటి?

యెహోవా దేవుడు ఒక ప్రత్యేక సంకల్పంతో స్త్రీపురుషులను సృష్టించాడని బైబిలు చెబుతోంది. యెహోవా మన మొదటి తల్లిదండ్రులకు ఇలా ఆజ్ఞాపించాడు.

ఆదికాండము 1:⁠28. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.”

ఆదాము, హవ్వ, వారి పిల్లలు సమిష్టిగా ఈ భూమంతటినీ ఒక అందమైన ఉద్యానవనంలా తయారుచేయాలని దేవుడు సంకల్పించాడు. మానవులు వృద్ధులై, చనిపోవాలని​గానీ, మానవజాతి పర్యావరణానికి హాని చేయాలనిగానీ ఆయన ఉద్దేశించలేదు. అయితే, మన మొదటి తల్లిదండ్రులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలవల్ల మనం వారసత్వంగా పాపాన్ని, మరణాన్ని పొందాము. (ఆదికాండము 3:​2-6; రోమీయులు 5:⁠12) అయినా యెహోవా సంకల్పం మారలేదు. త్వరలోనే భూమి అంతా ఒక అందమైన ఉద్యానవనంలా లేదా పరదైసులా మారుతుంది.​—⁠యెషయా 55:⁠10, 11.

యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనలను భౌతిక సామర్థ్యంతో, చక్కని మేధస్సుతో సృష్టించాడు. అంతేగానీ మనం దేవుని సహాయం లేకుండా స్వతంత్రంగా జీవించాలని సృష్టించలేదు. మన విషయంలో దేవుని సంకల్పాన్ని ఇక్కడ ఇవ్వబడిన బైబిలు వచనాలు ఎలా వివరిస్తున్నాయో చూడండి.

ప్రసంగి 12:​13. “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవ​కోటికి ఇదియే విధి.”

మీకా 6:⁠8. “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”

మత్తయి 22:​37-39. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”

బైబిలు ఇస్తున్న జవాబులు నిజమైన మనశ్శాంతిని ఎలా ఇస్తాయి?

ఒక యంత్రం సరిగ్గా పనిచేయాలంటే దాని తయారీదారుడు ఉద్దేశించిన పనికోసం, ఆయన ఉద్దేశించిన విధంగా దాన్ని ఉపయోగించాలి. అలాగే, మనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భావోద్రేకంగా లేదా భౌతికంగా హాని జరగకుండా ఉండాలంటే, మనం మన జీవితాన్ని సృష్టికర్త ఉద్దేశించినట్టు జీవించాలి. దేవుని సంకల్పాలను గురించి మనం తెలుసుకోవడంవల్ల, జీవితంలోని ఈ క్రింది రంగాల్లో మనశ్శాంతిని ఎలా పొందవచ్చో పరిశీలించండి.

జీవితంలో ఏది ప్రాముఖ్యమో నిర్ణయించుకుంటున్నప్పుడు, చాలామంది నేడు తమ జీవితాన్ని ధనార్జనకే ధారపోస్తున్నారు. అయితే బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు.”​—⁠1 తిమోతి 6:​9, 10.

మరోవైపు, డబ్బును కాకుండా దేవుణ్ణి ప్రేమించడాన్ని నేర్చుకునేవారు ఎలా సంతృప్తిగా ఉండవచ్చో తెలుసుకుంటారు. (1 తిమోతి 6:​7, 8) కష్టపడి పనిచేయడంలోవున్న విలువేమిటో అర్థంచేసుకుంటారు. తమ భౌతికావసరాలను తీర్చుకోవడానికి పనిచేయాల్సిన బాధ్యత కూడా తమదేనని గ్రహిస్తారు. (ఎఫెసీయులు 4:​27, 28) కానీ యేసు చేసిన ఈ హెచ్చరికను కూడా వారు గంభీరంగా తీసుకుంటారు: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”​—⁠మత్తయి 6:​24.

కాబట్టి, దేవుణ్ణి ప్రేమించేవారు తమ జీవితంలో ఉద్యోగం చేయడానికో లేదా డబ్బు సంపాదించడానికో కాదుగానీ, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికే అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. వారు తమ జీవితంలో దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు, యెహోవాయే తమను చూసుకుంటాడని వారికి తెలుసు. నిజానికి, ఆ బాధ్యత తనదేనని యెహోవా భావిస్తున్నాడు.​—⁠మత్తయి 6:​25-33.

ఇతరులతో వ్యవహరించేటప్పుడు, చాలామంది కేవలం తమ గురించే ఆలోచిస్తారు. నేడు అనేకమంది ‘స్వార్థ​ప్రియులుగా, అనురాగరహితులుగా’ ఉండడమే ప్రపంచంలో శాంతి లేకపోవడానికి ప్రధాన కారణం. (2 తిమోతి 3:⁠2, 3) ఎవరైనా తమను నిరాశపర్చినా లేదా తమ అభిప్రాయాలతో విభేదించినా వెంటనే వారు తమ ‘కోపాన్ని, క్రోధాన్ని’ వెళ్ళగ్రక్కుతూ ‘అల్లరి చేస్తూ, దూషిస్తారు.’ (ఎఫెసీయులు 4:​31) అలాంటి అదుపులేని కోపావేశాలు, మనశ్శాంతినిచ్చే బదులు ‘కలహము రేగడానికే’ దారితీస్తాయి.​—⁠సామెతలు 15:​18.

దానికి భిన్నంగా, తమను తాము ప్రేమించుకున్నట్టే ఇతరులను కూడా ప్రేమించాలి అనే దేవుని ఆజ్ఞను పాటించేవారు ‘ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్షమించే​వారిగా’ ఉంటారు. (ఎఫెసీయులు 4:​32; కొలొస్సయులు 3:​13) ఇతరులు తమతో నిర్దయగా వ్యవహరించినా, తను ‘దూషింపబడియు బదులు దూషింపని’ యేసును అనుసరించేందుకు వారు ప్రయత్నిస్తారు. (1 పేతురు 2:​23) యేసులాగే వారు కూడా, కృతజ్ఞతలేనివారితో సహా ఇతరులందరికీ సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని గ్రహిస్తారు. (మత్తయి 20:​25-28; యోహాను 13:​14, 15; అపొస్తలుల కార్యములు 20:​35) తన కుమారుని అనుకరించేవారికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఇస్తాడు, అది వారికి జీవితంలో నిజమైన మనశ్శాంతిని ఇస్తుంది.​—⁠గలతీయులు 5:​22.

కానీ, భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆలోచన మీ మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉంది? (w 08 2/1)

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ఒక వ్యక్తి తన జీవితంలో నిర్దిష్టమైన సంకల్పాన్ని కలిగివుండాలి

[7వ పేజీలోని చిత్రం]

మనశ్శాంతిని ఎలా పొందవచ్చో యేసు మనకు బోధిస్తున్నాడు