కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీపట్ల శ్రద్ధవున్న కాపరి

మీపట్ల శ్రద్ధవున్న కాపరి

దేవునికి దగ్గరవ్వండి

మీపట్ల శ్రద్ధవున్న కాపరి

మత్తయి 18:​11-14

‘దేవునికి నేనంటే శ్రద్ధవుందా?’ ఇదే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. మనలో చాలామందిమి బాధలను అనుభవించాం. అయితే కొన్నిసార్లు మనం, ఈ సువిశాల విశ్వానికి సృష్టికర్తయైన దేవుడు మనగురించి పట్టించు​కుంటాడా అని ఆలోచించవచ్చు. అందుకే, యెహోవా దేవుడు మనలో ప్రతీ ఒక్కరిపట్ల శ్రద్ధ కలిగివున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలి. యెహోవా గురించి ఎంతో బాగా తెలిసిన యేసు భూమిపై ఉన్నప్పుడు దానికి చక్కని జవాబునిచ్చే ఒక దృష్టాంతాన్ని చెప్పాడు.

గొర్రెలను శ్రద్ధగా చూసుకునే గొర్రెల కాపరిని ఉదాహరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబది​తొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.” (మత్తయి 18:​11-14) యెహోవా తన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరిపట్ల చూపించే వాత్సల్యపూరిత శ్రద్ధను యేసు ఇక్కడ ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం.

కాపరి తన మందలోని ప్రతీ గొర్రెపట్ల తనకు బాధ్యతవున్నట్లు భావించాడు. ఒక గొర్రె తప్పిపోతే, ఆ తప్పిపోయిన గొర్రె ఏదో ఆయనకు తెలుస్తుంది. ఆయన ప్రతీ గొర్రెను తాను పెట్టిన పేరుతో పిలిచే​వాడు. (యోహాను 10:⁠3) దారితప్పిన గొర్రెను తిరిగి మందకు చేర్చేంతవరకు ఆ శ్రద్ధగల కాపరి దానికోసం వెదుకుతూనే ఉంటాడు. అలా తప్పిపోయిన​దాన్ని వెదకడానికి వెళ్లినా, ఆయన ఈ 99 గొర్రెలు ప్రమాదంలో పడకుండా చూస్తాడు. కాపరులు సాధారణంగా ఒకే చోటకు వెళ్లి తమ మందలన్నీ కలిసి మేయడానికి విడిచిపెడతారు. * కాబట్టి కాపరి తప్పి​పోయినదాన్ని వెదకడానికి వెళ్లినప్పుడు, తాను వచ్చే వరకు మిగిలినవాటిని చూసుకునే బాధ్యతను వేరే కాపర్లకు అప్పగించి వెళ్తాడు. దానిని వెదకడానికి అంతగా ప్రయత్నించాడు కాబట్టి, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు దానికి గాయాలేమీ తగలక​పోవడం చూసి ఎంతో ఆనందిస్తాడు. బెదిరిపోయిన ఆ గొర్రెను తన భుజాలమీద ఎక్కించుకొని, సురక్షితంగా, భద్రంగా ఉండే మంద దగ్గరకు తీసుకువస్తాడు.​—⁠లూకా 15:​5, 6.

ఆ దృష్టాంతాన్ని వివరిస్తూ యేసు, ‘ఈ చిన్నవారిలో ఒకడైనను నశించడం’ దేవునికి ఇష్టం లేదని చెప్పాడు. అంతకుముందు ఒకసారి యేసు, “[తన] యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచే” విషయంలో తన శిష్యులను హెచ్చరించాడు. (మత్తయి 18:⁠6) అయితే యేసు చెప్పిన ఆ దృష్టాంతం యెహోవా గురించి మనకేమి తెలియజేస్తోంది? యెహోవా ‘చిన్నవారిపట్ల’ అంటే లోకం దృష్టిలో అల్పులుగా ఉన్న తన గొర్రెలన్నిటిపట్ల ఎంతో శ్రద్ధ చూపించే కాపరిగా ఉన్నాడు. తనను ఆరాధించే ప్రతీ ఒక్కరూ దేవుని దృష్టిలో నిజంగా విశేషమైనవారే, విలువైనవారే.

మీరు కూడా దేవుని దృష్టిలో విలువైనవారనే పూర్తి హామీ కావాలని కోరుకుంటే, గొప్ప కాపరియైన యెహోవా దేవుని గురించి, ఆయనకు దగ్గరవడం గురించి ఎందుకు ఎక్కువ నేర్చుకోకూడదు? అలా చేయడంద్వారా, తప్పిపోయిన గొర్రెను గురించి యేసు చెప్పిన దృష్టాంతాన్ని చెవులారా విన్న అపొస్తలుడైన పేతురు​కున్నలాంటి నమ్మకాన్నే మీరు కూడా కలిగివుండవచ్చు. పేతురు ఇలా వ్రాశాడు: “[దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన​మీద వేయుడి.”​—⁠1 పేతురు 5:⁠7. (w 08 2/1)

[అధస్సూచి]

^ పేరా 6 ఒక మంద నుండి మరో మందను వేరు చేయడం పెద్ద సమస్యేమీ కాదు, ఎందుకంటే ప్రతీ గొర్రె తన కాపరి స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడిస్తుంది.​—⁠యోహాను 10:⁠4.