కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లి ప్రేమలో వ్యక్తమవుతున్న దేవుని ప్రేమ

తల్లి ప్రేమలో వ్యక్తమవుతున్న దేవుని ప్రేమ

తల్లి ప్రేమలో వ్యక్తమవుతున్న దేవుని ప్రేమ

“స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.”​—⁠యెషయా 49:⁠15.

తల్లి తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లి చేతుల్లో సుఖంగా ఒదిగిపోతుంది. ఆ దృశ్యంలో ప్రేమ ఆప్యాయతలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పామ్‌ అనే ఒక తల్లి ఇలా చెబుతోంది: “నేను నా బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు వాణ్ణి చూసి నాలో ప్రేమ ఉప్పొంగింది. అదే సమయంలో వాడిపట్ల నాకున్న గంభీరమైన బాధ్యత గుర్తొచ్చింది.”

అది తిరుగులేని వాస్తవం అనిపించినప్పటికీ, తల్లి ప్రేమ బిడ్డ ఎదుగుదలపై ఎంతో ప్రభావం చూపిస్తుందన్న విషయం పరిశోధనలో ధృవీకరించబడింది. మానసిక ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ మెంటల్‌ హెల్త్‌) ప్రచురించిన ఒక డాక్యుమెంట్‌లో ఇలా ఉంది: “తల్లులు విడిచిపెట్టేయడంతో వారినుండి వేరైన పిల్లలు సంతోషంగా ఉండరు, పైగా వాళ్ళెంతో కృంగిపోతారు, కొన్నిసార్లు విపరీతమైన భయానికి లోనయ్యేంతగా కృంగిపోతారు.” నిర్లక్ష్యం చేయబడిన పిల్లలకన్నా, చిన్నవయసునుండి ప్రేమాభిమానాలు పొందే పిల్లలకు ఎక్కువ తెలివితేటలుండే అవకాశముందని సూచిస్తున్న ఒక అధ్యయనం గురించి అదే డాక్యుమెంట్‌ పేర్కొంది.

అమెరికాలోవున్న యుసిఎల్‌ఎ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో మనస్తత్త్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆలెన్‌ షోర్‌ తల్లి ప్రేమ యొక్క ప్రాముఖ్యత గురించి ఇలా చెబుతున్నాడు: “పిల్లవాడికి మొదట ఏర్పడే అనుబంధం, అంటే తన తల్లితో ఏర్పడే అనుబంధం ఒక నమూనాలా పనిచేస్తుంది. ఎందుకంటే అది పిల్లవాడు ఆ తర్వాత ఇతరులతో ఎలాంటి అనుబంధాలనైనా ఏర్పరచుకోవడానికి వాడికి అవసరమయ్యే సామర్థ్యాలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తుంది.”

విచారకరంగా క్రుంగుదల, అనారోగ్యం, ఇతర ఒత్తిళ్లు వంటివి ఒక తల్లి తన బిడ్డను నిర్లక్ష్యం చేసేలా చేయవచ్చు, చివరకు ‘తన చంటిపిల్లను మరచిపోయేలా’ కూడా చేయవచ్చు. (యెషయా 49:​15) కానీ చాలా అరుదుగా అలా జరుగుతుంది. నిజానికి, తల్లులు సహజంగానే తమ పిల్లలను ప్రేమిస్తారు. ప్రసవ సమయంలో తల్లి శరీరంలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆ హార్మోన్‌ గర్భసంచి సంకోచించ​డానికి, ఆ తర్వాత ఆమెలో పాలు వృద్ధికావడానికి సహాయం చేస్తుంది. పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉత్పన్నమయ్యే ఈ హార్మోను ప్రేమగా, నిస్వార్థంగా ప్రవర్తించాలనే కోరిక వారిలో కలగడానికి దోహదపడుతుండవచ్చని నమ్మ​బడుతోంది.

ప్రేమకు మూలమేమిటి?

నిస్వార్థ ప్రేమ, అంటే తల్లీపిల్లల మధ్య ఉండేలాంటి ప్రేమ దానంతటదే పుట్టుకొచ్చిందనీ, ఆ లక్షణం వివిధ జాతులకు ప్రయోజనం చేకూర్చింది కాబట్టే సహజవరణం దాన్ని అంతరించిపోకుండా కాపాడిందనీ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవారు బోధిస్తారు. ఉదాహరణకు మదరింగ్‌ మ్యాగజీన్‌ అనే ఇంటర్‌నెట్‌ పత్రిక ఇలా అంటోంది: “సరీసృపాల మెదడు మన మెదడుగా పరిణామం చెందే ప్రక్రియలో మొదటి చర్యగా, మెదడులో భావోద్వేగాలకు మూలస్థానమైన లింబిక్‌ వ్యవస్థ ఏర్పడింది, దీని మూలంగానే తల్లీపిల్లల మధ్య అనుబంధం ఏర్పడుతుంది.”

నిజమే, మనలో భావోద్వేగాలు కలగడానికి లింబిక్‌ వ్యవస్థ దోహదపడుతుందని పరిశోధనలో వెల్లడైంది. అయితే, తల్లికి బిడ్డపై ప్రేమ కలగడానికి సరీసృపాల మెదడులో దానంతటదే జరిగిన మార్పే కారణమనడం మీకు సమంజసంగా అనిపిస్తోందా?

మరో వివరణను పరిశీలించండి. మానవులు దేవుని పోలికగా అంటే దేవుని లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యంతో సృష్టించబడ్డారని బైబిలు తెలియజేస్తోంది. (ఆదికాండము 1:​27) దేవుని ప్రధాన లక్షణం ప్రేమ. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.” ఎందుకు? ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:⁠8) దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, బైబిల్లోని ఈ వచనం దేవునికి ప్రేమ ఉంది అని చెప్పడం లేదుగానీ దేవుడు ప్రేమాస్వరూపి అని చెబుతోంది. ఆయనే ప్రేమకు మూలం.

బైబిలు ప్రేమ గురించి ఇలా చెబుతోంది: “ప్రేమ దీర్ఘ​కాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సర​పడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించు​కొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత​కాలముండును.” (1 కొరింథీయులు 13:​4-8) ఈ సర్వోత్కృష్టమైన లక్షణం దానంతటదే పుట్టిందని నమ్మడం సమంజసమేనా?

మీకేమనిపిస్తోంది?

పై పేరాలో ప్రేమ గురించి చెప్పబడిన విషయాలు చదివినప్పుడు, అలాంటి ప్రేమను ఎవరైనా మీపై చూపిస్తే బావుండునని మీకు అనిపించిందా? అలా అనిపించడం ఎంతో సహజం. ఎందుకు? “మనము దేవుని సంతానం” కాబట్టి మనమలా కోరుకుంటాం. (అపొస్తలుల కార్యములు 17:​29) మనమలాంటి ప్రేమ పొందగలిగేవిధంగా, ఇతరులను ప్రేమించగలిగే విధంగా రూపించబడ్డాం. నిశ్చయంగా దేవునికి మనపై ప్రగాఢమైన ప్రేమవుంది. (యోహాను 3:⁠16; 1 పేతురు 5:​6, 7) అది, తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకన్నా ఇంకా ఎంతో ప్రగాఢమైనదనీ, శాశ్వతమైనదనీ ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో ఇవ్వబడిన లేఖనం తెలియజేస్తోంది!

అయితే మీరిలా అనుకోవచ్చు, ‘దేవుడు జ్ఞానవంతుడు, శక్తిగలవాడు, ప్రేమగలవాడు అయితే ఆయన ఈ బాధలన్నీ లేకుండా ఎందుకు చేయడంలేదు? పిల్లలు చనిపోవడాన్ని, అణచివేత కొనసాగడాన్ని, దుర్వినియోగం చేస్తూ దురాశతో భూమిని నాశనం చేయడాన్ని ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు?’ ఇవి ఆలోచింపజేసే ప్రశ్నలు, వీటికి సమంజసమైన సమాధానాలు అవసరమే.

అజ్ఞేయతావాదుల అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను తెలుసుకోవడం సాధ్యమే. వందలాది దేశాల్లోని లక్షలాదిమంది, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడంద్వారా అలాంటి సమాధానాలు తెలుసుకున్నారు. మీరు కూడా అలాగే చేయాలని ఈ పత్రిక ప్రచురణకర్తలు ప్రోత్సహిస్తున్నారు. మీరు దేవుని వాక్యాన్ని, ఆయన సృష్టించినవాటిని అధ్యయనం చేస్తుండగా ఆయన గురించి మరింత జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు, అప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం, ఆయనకు దగ్గరవడం అసాధ్యమేమీ కాదని గ్రహిస్తారు. ఆయన “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అనే నమ్మకం మీలో ఏర్పడవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 17:​26, 27. (w 08 5/1)

[8వ పేజీలోని బ్లర్బ్‌]

 వునికి మనపై ఉన్న ప్రేమ, తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకన్నా శాశ్వతమైనది