కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారిని ఓదార్చడం

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారిని ఓదార్చడం

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారిని ఓదార్చడం

“ప్రియమైన మా అమ్మ చనిపోబోతోందని తెలిసినప్పుడు అస్సలు నమ్మలేకపోయాను. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఎంతో కృంగిపోయాను.”​—⁠గ్రేస్‌, కెనడా.

ఎవరికైనా ప్రాణాంతకమైన వ్యాధి ఉందని నిర్ధారించ​బడితే, ఆ వ్యక్తిని ప్రేమించే కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతో కృంగిపోయి, ఎటూతోచని స్థితికి చేరుకుంటారు. కొంతమంది, ఆ వ్యక్తికి పరిస్థితి గురించి చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడతారు. ఇతరులు, తమకు ప్రియమైనవ్యక్తి ఆ వ్యాధి ప్రభావం వల్ల బాధననుభవిస్తూ, బహుశా హుందా​తనాన్ని కోల్పోవడాన్ని చూసి తట్టుకోగలమా అని సందేహిస్తారు. చాలామంది, రోగి ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో తమకు తెలియదని బాధపడతారు.

అలాంటి దుర్వార్త విన్నప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉండాలనే దానిగురించి మీరేమి తెలుసుకోవాలి? ఈ ఆందోళన​కర పరిస్థితిలో మీరు ‘నిజమైన స్నేహితులుగా’ ఉంటూ ఎలా ఓదార్చవచ్చు, ఎలా సహాయం చేయవచ్చు?​—⁠సామెతలు 17:⁠17.

సాధారణ ప్రతిస్పందన

ఎవరికైనా తీవ్రమైన వ్యాధి వస్తే ఆ వ్యక్తిని ప్రేమించేవారు కృంగిపోవడం సహజం. ప్రజలు చనిపోవడం తరచూ చూసే వైద్యులు కూడా ప్రాణాంతకమైన వ్యాధికి గురైనవారి భౌతిక, మానసిక అవసరాలు తీర్చవలసిన పరిస్థితులు తలెత్తినప్పుడు వ్యాకులపడతారు, అశక్తులమన్నట్లు భావిస్తారు.

మీకు ప్రియమైనవ్యక్తి బాధపడడం చూసినప్పుడు దుఃఖాన్ని అదుపు చేసుకోవడం మీకు కూడా కష్టమనిపిస్తుండవచ్చు. బ్రెజిల్‌కు చెందిన హొస చెల్లి ప్రాణాంతక​మైన వ్యాధికి గురైంది, హొస ఇలా అంటోంది, “మీకు ప్రియమైనవ్యక్తి తీవ్ర బాధను అనుభవించడాన్ని చూడడం ఎంతో కష్టంగా ఉంటుంది.” అలాగే, విశ్వసనీయుడైన మోషే తన అక్క కుష్ఠువ్యాధికి గురవడాన్ని చూసి, “దేవా, దయచేసి యీమెను బాగుచేయుము” అని ప్రార్థించాడు.​—⁠సంఖ్యాకాండము 12:⁠12, 13.

మనకు ప్రియమైనవ్యక్తి పరిస్థితిని బట్టి ఎంతో ఆందోళన చెందుతాము, ఎందుకంటే మనం కనికరం గల మన దేవుడైన యెహోవా స్వరూపంలో సృష్టించబడ్డాము. (ఆదికాండము 1:⁠27; యెషయా 63:⁠9) మానవుల బాధను చూసి యెహోవా ఎలా భావిస్తాడు? యేసు ప్రతిస్పందనను పరిశీలించండి. ఆయన తన తండ్రి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 14:⁠9) ప్రజలు వ్యాధితో బాధ​పడడాన్ని చూసినప్పుడు యేసు “కనికరపడ్డాడు.” (మత్తయి 20:​29-34; మార్కు 1:​40, 41) దీనికి ముందున్న ఆర్టికల్‌లో చర్చించబడినట్లుగా, యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు, మరణం కుటుంబం మీద, స్నేహితులమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూసి, ఎంతో కలవరపడి “కన్నీళ్లు విడిచాడు.” (యోహాను 11:​32-35) నిజానికి బైబిలు, మరణాన్ని శత్రువుగా వర్ణిస్తూ, త్వరలో అనారోగ్యం, మరణం తీసివేయబడతాయని చెబుతోంది.​—⁠1 కొరింథీయులు 15:​26; ప్రకటన 21:⁠3, 4.

మీకు ప్రియమైనవ్యక్తికి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందన్న దుర్వార్త వినగానే మీరు ఎవరినైనా అంటే ఎవరో ఒకరిని నిందించాలనుకోవడం అర్థం చేసుకోదగినదే. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారిపట్ల శ్రద్ధతీసుకొనే విషయంపై పరిశోధక వ్యాసం సిద్ధం చేసిన డాక్టర్‌ మార్త ఓర్టీస్‌ ఈ సలహానిస్తోంది: “రోగి పరిస్థితికి ఇతరులను అంటే వైద్యబృందాన్ని గానీ, నర్సులను గానీ నిందించకండి, మిమ్మల్ని మీరు నిందించు​కోకండి. లేకపోతే సంబంధాలు మరింత పాడవుతాయి, ప్రాణాంతకమైన వ్యాధితోవున్న రోగి అవసరాలపట్ల శ్రద్ధ తీసుకోవాలనే ముఖ్యమైన విషయం నిర్లక్ష్యం చేయబడుతుంది.” మీకు ప్రియమైనవ్యక్తి తన వ్యాధిని, తాను త్వరలోనే చనిపోతాననే వాస్తవాన్ని తట్టుకునేలా ఆయనకు సహాయం చేయడానికి మీరెలాంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు?

వ్యాధి గురించి కాక వ్యక్తి గురించి ఆలోచించండి

మొదటి చర్యగా, వ్యాధివల్ల కలిగే దుష్పరిణామాలైన బలహీనమవడం లేదా రూపం మారిపోవడం వంటివాటి గురించి కాక వ్యక్తి గురించి ఆలోచించండి. ఇది మీరెలా చేయవచ్చు? శారా అనే ఒక నర్సు ఇలా చెబుతోంది: “రోగి ఆరోగ్యంగా ఉన్నప్పటి ఫోటోలు చూడడానికి నేను సమయం కేటాయిస్తాను. ఆయన గతంలో జరిగిన సంగతులను చెబుతుంటే నేను చాలా శ్రద్ధగా వింటాను. అది రోగి ప్రస్తుత పరిస్థితిపై మాత్రమే దృష్టిసారించకుండా, ఆ వ్యక్తి జీవితాన్ని, జీవితంలో జరిగినదానిని కూడా గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేస్తుంది.”

ఆనీ క్యాథరీన్‌ అనే మరో నర్సు, రోగి వ్యాధిలక్షణాలకు తాను ఎలా ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా ఉంటుందో ఈ మాటల్లో వివరిస్తుంది, “నేను రోగి కళ్ళల్లోకి సూటిగా చూసి, ఆ వ్యక్తి పరిస్థితిని మెరుగుపర్చడానికి ఏమి చేయవచ్చనే దాని గురించి ఆలోచిస్తాను.” ద నీడ్స్‌ ఆఫ్‌ ద డయింగ్‌​—⁠ఎ గైడ్‌ ఫర్‌ బ్రింగింగ్‌ హోప్‌, కంఫర్ట్‌ అండ్‌ లవ్‌ టు లైఫ్స్‌ ఫైనల్‌ చాప్టర్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది, “వ్యాధివల్ల గానీ, ప్రమాదంవల్ల గానీ మనకు ప్రియమైనవ్యక్తి రూపం మారిపోతే సహజంగానే చూడడానికి ఎంతో బాధనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చేయవలసిన శ్రేష్ఠమైన పనేమిటంటే మనకు ప్రియమైనవ్యక్తి మార్పులేని కళ్ళల్లోకి సూటిగా చూడడమే.”

ఆ విధంగా చేయాలంటే ఆత్మనిగ్రహం, స్థిరనిశ్చయం అవసరం. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారిని క్రమంగా సందర్శిస్తున్న జార్జస్‌ అనే క్రైస్తవ పైవిచారణకర్త ఇలా చెబుతున్నాడు: “మన స్నేహితునిపట్ల మనకున్న ప్రేమ వ్యాధికన్నా బలంగా ఉండాలి.” వ్యాధి గురించి కాక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీకు, మీ ప్రియమైనవ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలపట్ల శ్రద్ధ తీసుకున్న ఈవన్‌ ఇలా అంటోంది, “రోగులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారికి సహాయం చేయవచ్చని మీరు గ్రహిస్తే, రోజురోజుకు క్షీణించిపోతున్న వారి ఆరోగ్యం విషయంలో మీరు సరైన దృక్పథంతో ఉండగలుగుతారు.”

వినడానికి సిద్ధంగా ఉండండి

చనిపోబోతున్నవారిని తాము ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ వారి దగ్గరకు వెళ్ళడానికి ప్రజలు వెనకాడతారు. ఎందుకు? వారితో ఏమి మాట్లాడాలో తమకు తెలియదని వారు బాధపడుతుంటారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితురాలిపట్ల ఇటీవలే శ్రద్ధతీసుకున్న ఆనీ క్యాథరీన్‌, మౌనంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను చెప్పింది. ఆమె ఇలా అంటోంది: “మన మాటలతోనే కాక మన వైఖరితో కూడా ఓదార్పునివ్వవచ్చు. కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చోవడం, వారికి దగ్గరగా నిలబడి వారి చేతిని పట్టుకోవడం, వారు తమ భావాలను వ్యక్తం చేస్తున్నప్పుడు మన కన్నీటిని ఆపుకోక​పోవడం ఇవన్నీ మనకు వారిపట్ల శ్రద్ధ ఉందని చూపిస్తాయి.”

మీకు ప్రియమైనవ్యక్తి బహుశా తన భావాలను యథార్థంగా, నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం అవసరం. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తరచూ తనను ప్రేమిస్తున్నవారు ఆందోళన చెందుతారేమో అనుకొని, గంభీరమైన వ్యక్తిగత విషయాలను మాట్లాడడం మానేస్తాడు. వ్యాధితోవున్న వ్యక్తి శ్రేయస్సును కోరే కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆ వ్యక్తికి ఆందోళన కలిగించే విషయాలను మాట్లాడకపోవడమే కాక వ్యాధికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని కూడా దాస్తారు. అలా చేయడం వల్ల ఏమి జరుగుతుంది? ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడేవారికి చికిత్స చేసే ఒక వైద్యుడు, వాస్తవాన్ని దాచిపెట్టడానికి పడే అవస్థ, “వ్యాధి గురించి ఇతరులకు వివరించడానికి, దానిని అంగీకరించడానికి అవసరమైన శక్తి లేకుండా చేస్తుంది” అని చెబుతున్నాడు. కాబట్టి, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన పరిస్థితిని గురించి, తన మరణం గురించి ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడితే అలా మాట్లాడనివ్వాలి.

పూర్వకాలంలోని దేవుని సేవకులు తాము మరణించే పరిస్థితులు ఏర్పడినప్పుడు, యెహోవా దేవునికి తమ భయాలను వ్యక్తం చేయడానికి వెనకాడలేదు. ఉదాహరణకు, 39 సంవత్సరాల వయసున్న హిజ్కియా రాజు తాను మరణించబోతున్నానని తెలుసుకున్నప్పుడు తన బాధను వ్యక్తం చేశాడు. (యెషయా 38:​9-12, 18-20) అలాగే, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారు తాము ఇక ఎంతోకాలం బ్రతకలేమనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు వారి బాధను వ్యక్తం చేయనివ్వాలి. ప్రయాణాలు చేయడం, తమకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం, మనమలు పెద్దవాళ్ళవడాన్ని చూడడం, దేవుణ్ణి వీలైనంత ఎక్కువగా సేవించడం, ఇలాంటివన్నీ వారు చేరుకోలేని వ్యక్తిగత గమ్యాలు, కాబట్టి వారెంతో నిరాశకు లోనవుతారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఏమి మాట్లాడాలో తెలియక తమకు దూరమవుతారేమోనని వారు భయపడతారు. (యోబు 19:​16-18) వ్యాధితో మంచానపడతామనే భయం, శరీరావయవాలు చచ్చుబడిపోతాయనే భయం, చివరకు ఒంటరిగా చనిపోతామనే భయం వాళ్ళను కృంగదీస్తుంది.

ఆనీ క్యాథరీన్‌ ఇలా చెబుతోంది, “మీ స్నేహితుడు తన భావాలను వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయనను మధ్యలో ఆపకుండా, ఆయనను తప్పు పట్టకుండా, అలా భయపడాల్సిన అవసరం లేదని చెప్పకుండా ఆయన భావాలను వ్యక్తం చేయనివ్వడం ప్రాముఖ్యం. నిజంగా ఆయనెలా భావిస్తున్నాడో తెలుసు​కోవడానికి, ఆయన కోరికలేమిటో, భయాలేమిటో, ఆశలేమిటో గ్రహించడానికి అదే శ్రేష్ఠమైన మార్గం.”

ప్రాథమిక అవసరాలను అర్థం చేసుకోండి

బహుశా శక్తివంతమైన చికిత్సలవల్ల, అలాంటి చికిత్సల మూలంగా కలిగే దుష్పరిణామాల వల్ల మీ స్నేహితుడు అనుభవిస్తున్న వేదన ఆయన ప్రాథమిక అవసరాన్ని నిర్లక్ష్యం చేసేంతగా మిమ్మల్ని కలవరపరచవచ్చు. ఆ ప్రాథమిక అవసరం ఏమిటంటే, ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోగలగడం.

కొన్ని సంస్కృతుల్లో, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కాపాడాలనే ఉద్దేశంతో, వారి పరిస్థితిని గురించిన నిజాన్ని దాయడానికి, చివరకు వైద్యచికిత్స గురించిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఆ వ్యక్తికి లేకుండా చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇతర సంస్కృతుల్లో మరో సమస్య తలెత్తవచ్చు. ఉదాహరణకు, నర్సుగా పనిచేస్తున్న జెరీ ఇలా అంటున్నాడు, “వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని చూడడానికి వచ్చినవారు కొన్నిసార్లు, ఆయన మంచం ప్రక్కనే నిలబడి ఆయన అక్కడ లేనట్లు ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు.” ఈ రెండిటిలో ఏది చేసినా అది, వ్యాధితో బాధపడుతున్నవారి గౌరవానికి భంగం కలిగిస్తుంది.

వ్యాధి నయమవుతుందనే ఆశతో ఉండడం మరో ప్రాథమిక అవసరం. ఇది మంచి వైద్యం అందుబాటులో ఉన్న దేశాల్లో, ఏ చికిత్స తమ వ్యాధిని నయం చేయగలదో తెలుసుకోవడంపై ఆధారపడివుంటుంది. మూడుసార్లు క్యాన్సర్‌ వచ్చిన తన తల్లికి సహాయం చేసిన మీషెల్‌ ఇలా వివరిస్తోంది, “మా అమ్మ మరో వైద్యం ప్రయత్నిద్దామన్నా, మరో నిపుణుడ్ని కలుద్దామన్నా నేను అందుకు తగిన సహాయం చేస్తాను. నేను వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అదే సమయంలో అమ్మతో ప్రోత్సాహకరంగా మాట్లాడాలని గ్రహించాను.”

వ్యాధి నయమవుతుందనే ఎలాంటి ఆశా లేకపోతే అప్పుడేమిటి? ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారు, మరణం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలనే విషయాన్ని గుర్తుంచు​కోండి. పైన ప్రస్తావించబడిన జార్జస్‌ అనే క్రైస్తవ పైవిచారణకర్త ఇలా అంటున్నాడు, “మరణం దగ్గరపడుతుందనే విషయాన్ని దాయకుండా చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఇది ఆ వ్యక్తి, అవసరమైన ఏర్పాట్లు చేయడానికి, తన మరణం కోసం తననుతాను సిద్ధంచేసుకోవడానికి సహాయం చేస్తుంది.” అలాంటి సిద్ధపాట్లు ఆ వ్యక్తికి సంతృప్తినిచ్చి, ఇతరులకు భారమవుతాననే చింతను తగ్గిస్తాయి.

సహజంగానే ఈ విషయాల గురించి మాట్లాడడం చాలా కష్టం. కానీ అలా సూటిగా మాట్లాడడం ద్వారా మీరు మీ లోతైన భావాలను వ్యక్తం చేయగలుగుతారు. గతంలో ఏర్పడిన మనస్పర్థలను తొలగించుకోవాలని, పశ్చాత్తాపపడాలని, క్షమాపణ అడగాలని చనిపోతున్న వ్యక్తి కోరుకోవచ్చు. అలా మాట్లాడుకోవడం మీ మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది.

చివరిదినాల్లో ఓదార్పునివ్వడం

కొద్దిరోజుల్లో చనిపోబోతున్న వ్యక్తికి ఓదార్పును ఎలా ఇవ్వవచ్చు? పైన ప్రస్తావించబడిన డాక్టర్‌ ఓర్టీస్‌ ఇలా అంటోంది, “వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని తన చివరి కోరికలను చెప్పనివ్వండి. మీరు జాగ్రత్తగా వినండి. వీలైతే ఆ వ్యక్తి కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి. వీలుకాకపోతే ఆ విషయాన్ని యథార్థంగా చెప్పండి.”

వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తానెంతో ఇష్టపడేవారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకోవచ్చు. జార్జస్‌ ఇలా అంటున్నాడు, “వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నీరసంతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నప్పటికీ ఆయన ఇష్టపడేవారితో ఆయన మాట్లాడడానికి సహాయం చేయండి.” ఒకవేళ ఫోనులో మాట్లాడుకున్నా అది ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, కలిసి ప్రార్థించడానికి సహాయం చేస్తుంది. కెనడాకు చెందిన క్రిస్టీనాకు ప్రియమైనవారిలో ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు, ఆమె ఇలా అంటోంది, “వారు మరణానికి దగ్గరయ్యేకొద్దీ తమ క్రైస్తవ స్నేహితుల ప్రార్థనలపై ఎక్కువగా ఆధారపడ్డారు.”

మీకు ప్రియమైనవ్యక్తి ముందు ఏడ్వడానికి భయపడాలా? అవసరం లేదు. అలా మీరు ఏడిస్తే, చనిపోబోతున్న మీ స్నేహితునికి మిమ్మల్ని ఓదార్చే అవకాశం లభిస్తుంది. ద నీడ్స్‌ ఆఫ్‌ ద డయింగ్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది, “చనిపోబోతున్న వారి నుండి ఓదార్పు పొందడం ఎంతో కదిలింపజేసే అనుభవం, అలా ఓదార్చడం వారికెంతో ప్రాముఖ్యమైన విషయం.” అందరూ శ్రద్ధ తీసుకుంటున్న ఆ వ్యక్తి ఇతరులను అలా ఓదార్చడం ద్వారా ఒకప్పుడు అలా శ్రద్ధచూపించే స్నేహితునిగా, తండ్రిగా, లేదా తల్లిగా తాను నిర్వర్తించిన పాత్రను మరోసారి పోషించడం సాధ్యమవుతుంది.

మీకు ప్రియమైన వ్యక్తి చివరి గడియల్లో ఆయనతోనే ఉండడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చన్నది అర్థం చేసుకోదగినదే. అయినా హాస్పిటల్‌లోగానీ, ఇంట్లోగానీ ఆయనతో మీరు ఉండగలిగితే, చివరి క్షణం వరకూ ఆయన చేతిని విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొనివుండడానికి ప్రయత్నించండి. తరచూ మాటల్లో చెప్పని భావాలను వ్యక్తం చేసే అవకాశం ఈ చివరి క్షణాల్లో లభించవచ్చు. ఆ వ్యక్తి ప్రతిస్పందించలేని స్థితిలోవున్నా, వీడ్కోలు చెబుతూ మీ ప్రేమను, ఆయనను పునరుత్థానంలో తిరిగి కలుసుకోవచ్చనే మీ నిరీక్షణను వ్యక్తంచేయండి.​—⁠యోబు 14:​14, 15; అపొస్తలుల కార్యములు 24:⁠15.

ఈ చివరి క్షణాలను సద్వినియోగం చేసుకుంటే, ఆ తర్వాత విచారించవలసిన అవసరం ఉండకపోవచ్చు. నిజానికి, ఎంతో బాధాకరమైన ఈ క్షణాలు, భవిష్యత్తులో మీకెంతో ఓదార్పునివ్వవచ్చు. అలాచేయడం ద్వారా మీరు “దుర్దశలో” నిజమైన స్నేహితులుగా నిరూపించుకుంటారు.​—⁠సామెతలు 17:⁠17. (w 08 5/1)

[28వ పేజీలోని బ్లర్బ్‌]

వ్యాధి గురించి కాక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీకు, మీ ప్రియమైనవ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది

[29వ పేజీలోని బాక్సు/చిత్రం]

రోగి ఆత్మగౌరవాన్ని గౌరవించే విధం

చాలా దేశాల్లో ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నవారు ప్రశాంతంగా, గౌరవప్రదంగా చనిపోయేందుకు రోగికున్న హక్కును గుర్తించే ప్రయత్నాలు జరిగాయి. ఈ హక్కులను గౌరవించడానికి, రోగులు ఇంట్లోగానీ, వారిపట్ల శ్రద్ధతీసుకొనే ప్రత్యేక స్థలాల్లో గానీ చనిపోయేందుకు అనుమతించడానికి లిఖిత అడ్వాన్స్‌ డైరక్టివ్‌లు సహాయం చేస్తాయి.

అడ్వాన్స్‌ డైరక్టివ్‌:

• వైద్యులతో, కుటుంబసభ్యులతో సరైనవిధంగా మాట్లాడేందుకు సహాయం చేస్తుంది

• నిర్ణయాలు తీసుకొనే భారాన్ని కుటుంబసభ్యులపై నుండి తొలగించేందుకు సహాయం చేస్తుంది

• అవసరంలేని, నిరుపయోగమైన, ఇతర సమస్యలు తీసుకువచ్చే, ఖరీదైన చికిత్సల అవసరాన్ని తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది

అడ్వాన్స్‌ డైరక్టివ్‌ ఉపయోగకరంగా ఉండాలంటే దానిలో కనీసం ఈ క్రింది సమాచారం ఉండాలి:

• మీ ఆరోగ్య సంరక్షణ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు

• మీ పరిస్థితి విషమిస్తే మీరు అంగీకరించే లేదా నిరాకరించే చికిత్సలు

• సాధ్యమైతే, మీ ఎంపికల గురించి తెలిసిన వైద్యుని పేరు