కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇదిగో! యెహోవా దాసురాలు!’

‘ఇదిగో! యెహోవా దాసురాలు!’

వారి విశ్వాసాన్ని అనుసరించండి

‘ఇదిగో! యెహోవా దాసురాలు!’

అపరిచిత వ్యక్తి ఇంట్లోకి రావడంతో మరియ కళ్ళు విప్పార్చుకొని ఆయనవైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ వ్యక్తి ఆమె తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ అడగలేదు. ఆయన మరియను కలవడానికే వచ్చాడు. ఆయన నజరేతువాడు కాదన్నది ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఆమె నివసిస్తున్న అలాంటి చిన్నపట్టణంలో అపరిచితులను వెంటనే గుర్తించ​వచ్చు. ఈ వ్యక్తి అయితే మరీ ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన మరియను ఇంతవరకు ఎవరూ పిలవనిరీతిలో పిలుస్తూ ఇలా అన్నాడు, ‘దయాప్రాప్తురాలా, నీకు శుభము; యెహోవా నీకు తోడైయున్నాడు.’—లూకా 1:28.

గలిలయలోని నజరేతుకు చెందిన హేలీ కుమార్తెయైన మరియను బైబిలు మనకు అలా పరిచయం చేస్తుంది. అది ఆమె జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. వడ్రంగివాడైన యోసేపుతో ఆమె పెళ్ళి నిశ్చయమైంది, ఆయన పెద్ద ఆస్తిపరుడేమీ కాదుకానీ నమ్మకమైనవాడు. కాబట్టి, ఇకమీదట ఆమె జీవితం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసి​పోతున్నట్లుగా ఉంది, ఆమె యోసేపు భార్యగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటుంది, వారిద్దరు కలిసి ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పర్చుకుంటారు. అయితే అకస్మాత్తుగా, ఈ అపరిచిత వ్యక్తి ఆమె సేవిస్తున్న దేవుడు ఆమెకు అప్పగించిన ఒక బాధ్యత గురించి చెప్పడానికి వచ్చాడు, అది ఆమె జీవితాన్నే మార్చివేస్తుంది.

బైబిలు మరియ గురించి ఎక్కువేమీ చెప్పడంలేదని తెలుసు​కొని మీరు ఆశ్చర్యపోవచ్చు. అది ఆమె నేపథ్యం గురించి, వ్యక్తిత్వం గురించి అంతగా తెలియజేయడంలేదు, ఆమె రూపం గురించైతే అసలేమీ చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యం ఆమె గురించి ఏమి చెబుతుందో అది ఎంతో వివరంగా ఉంది.

మరియ గురించి తెలుసుకోవడానికి, ఆమె గురించి వివిధ మతాలు బోధిస్తున్న అనేక తప్పుడు అభిప్రాయాలను మించి చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి తైలవర్ణ చిత్రాల్లో, పాలరాతి విగ్రహాల్లో చూపించబడిన లెక్కలేనన్ని ఆమె “రూపాలను” మనం ప్రక్కనపెడదాం. వినయస్థురాలైన ఈ స్త్రీకి “దేవుని తల్లి,” “పరలోకపు రాణి” వంటి పెద్ద పెద్ద బిరుదులు ఆపాదించిన సంక్లిష్టమైన మతసిద్ధాంతాలను కూడా ప్రక్కనపెడదాం. బదులుగా బైబిలు నిజంగా ఏమి తెలియజేస్తుందనే దానిపై మన అవధానం కేంద్రీకరిద్దాం. ఆమె విశ్వాసం గురించి, దాన్ని మనమెలా అనుకరించవచ్చనేదాని గురించి బైబిలు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

దేవదూత ఆమెను సందర్శించడం

మరియ దగ్గరకు వచ్చిన వ్యక్తి మానవమాత్రుడు కాదని మీకు తెలిసేవుంటుంది. ఆయన గబ్రియేలు అనే దేవదూత. ఆయన మరియను “దయాప్రాప్తురాలా” అని పిలిచినప్పుడు, ఆ మాటకు ఆమె “బహుగా తొందరపడి” అసాధారణమైన ఈ సంబోధన ఏమిటా అని ఆశ్చర్యపోయింది. (లూకా 1:29) ఆమె ఎవరి దయను పొందింది? మనుష్యుల దయ పొందాలని మరియ ఆశించలేదు. కానీ దేవదూత యెహోవా దేవుని దయ పొందడం గురించి మాట్లాడాడు. అది ఆమెకు ప్రాముఖ్యమైన విషయం. ఆమె తాను దేవుని దయ పొందానని గర్వించలేదు. మనపై ఇప్పటికే దేవుని దయ ఉందని భావిస్తూ గర్వించకుండా దానిని పొందడానికి కృషిచేస్తే, యౌవనురాలైన మరియ పూర్తిగా అర్థం చేసుకున్న ఒక విలువైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. దేవుడు గర్వహృదయులను ద్వేషించి, దీన​మనసు, వినయం గలవారిని ప్రేమించి వారికి సహాయం చేస్తాడు.​—యాకోబు 4:6.

మరియకు అలాంటి వినయం అవసరం, ఎందుకంటే ఊహించలేనంతటి ఆధిక్యతను ఆ దేవదూత ఆమె ముందుంచాడు. మానవుల్లోకెల్లా ఎంతో ప్రముఖుడయ్యే బిడ్డకు ఆమె జన్మనిస్తుందని ఆయన వివరించాడు. గబ్రియేలు ఇలా చెప్పాడు, “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) దావీదు వంశస్థుల్లో ఒకరు నిరంతరం పరిపాలిస్తారని దేవుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఆయనతో చేసిన వాగ్దానం గురించి మరియకు తెలిసేవుంటుంది. (2 సమూయేలు 7:12, 13) కాబట్టి ఆమె కుమారుడు శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎదురు​చూస్తున్న మెస్సీయ అవుతాడు!

అంతేకాదు, ఆమె కుమారుడు, “గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును” అని దేవదూత మరియతో చెప్పాడు. మానవ స్త్రీ దేవుని కుమారునికెలా జన్మనివ్వగలదు? మరియకు అసలు కుమారుడెలా పుడతాడు? ఆమెకు యోసేపుతో వివాహం నిశ్చయమయ్యిందేగానీ ఇంకా వివాహం కాలేదు. అందుకే మరియ, “నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగును?” అని సూటిగా ప్రశ్నించింది. (లూకా 1:34) ఆమె తానింకా కన్యనేనని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదని గమనించండి. ఆమె తన కన్యాత్వాన్ని విలువైనదిగా ఎంచింది. నేడు యౌవనులలో అనేకమంది తమ కన్యాత్వాన్ని పోగొట్టుకోవడానికి తొందరపడుతూ, అలా చేయని వారిని ఎగతాళి చేస్తున్నారు. లోకం నిజంగానే మారిపోయింది. అయితే, యెహోవా మారలేదు. (మలాకీ 3:6) మరియ కాలంలోలాగే, ఆయన తన నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండేవారిని విలువైన​వారిగా ఎంచుతాడు.​—హెబ్రీయులు 13:4.

మరియ నమ్మకమైన దేవుని సేవకురాలే అయినప్పటికీ ఆమె అపరిపూర్ణురాలు. అయితే ఆమె పరిపూర్ణుడైన దేవుని కుమారునికి ఎలా జన్మనివ్వగలదు? గబ్రియేలు ఇలా వివరించాడు, “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” (లూకా 1:35) పరిశుద్ధుడు అంటే “నిర్మలమైనవాడు,” “స్వచ్ఛమైనవాడు,” “పవిత్రమైనవాడు” అని అర్థం. సాధారణంగా మానవుల అపరిపూర్ణత వారసత్వంగా వారి పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే ఇక్కడ యెహోవా ఒక విశేషమైన అద్భుతాన్ని చేస్తాడు. ఆయన పరలోకంలోవున్న తన కుమారుని జీవాన్ని మరియ గర్భంలోకి మార్చి, ఆ శిశువుకు అపరిపూర్ణత ఏమాత్రం సంక్రమించకుండా కాపాడడానికి ఆయన తన పరిశుద్ధాత్మ లేదా చురుకైన శక్తి మరియను ‘కమ్ముకొనేలా’ చేస్తాడు. దేవదూత చేసిన వాగ్దానాన్ని మరియ నమ్మిందా? ఆమె ఎలా ప్రతిస్పందించింది?

గబ్రియేలు చెప్పినదానికి మరియ ప్రతిస్పందన

క్రైస్తవమత సామ్రాజ్యంలోని కొంతమంది వేదాంతులతోపాటు సంశయవాదులు కన్యక జన్మనిస్తుందనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. వారెంతో విద్యావంతులైనప్పటికీ, సరళ​మైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. గబ్రియేలు అన్నట్లుగా, “దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదు.” (లూకా 1:37) మరియ ఎంతో విశ్వాసమున్న స్త్రీ కాబట్టి గబ్రియేలు మాటలు సత్యమని అంగీకరించింది. అయితే ఆమెది అంధవిశ్వాసం కాదు. సహేతుకమైన ఏ వ్యక్తికైనా తాను విశ్వసించేదానికి రుజువు అవసరం, మరియకు కూడా అలాగే అవసరం. ఆమెకున్న రుజువులకు గబ్రియేలు ఇంకా కొంత సమాచారాన్ని జతచేశాడు. ఎంతోకాలంగా గొడ్రాలుగావున్న ఆమె బంధువు, వృద్ధురాలు అయిన ఎలీసబెతు గురించి ఆయన చెప్పాడు. దేవుడు, అద్భుతరీతిలో ఆమె గర్భందాల్చేలా చేశాడు.

ఇప్పుడు మరియ ఏమి చేస్తుంది? ఆమెకు అప్పగించబడిన బాధ్యత ఆమె ముందుంది, గబ్రియేలు చెప్పినవన్నీ దేవుడు చేస్తాడని నమ్మడానికి రుజువు కూడా ఆమెకుంది. ఆ బాధ్యత ఎలాంటి భయాలు, కష్టాలు లేకుండా నిర్వర్తించగలిగినదని మనం అనుకోవడానికి లేదు. ఒక విషయమేమిటంటే, యోసేపుతో తనకు వివాహం నిశ్చయమైన విషయాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడా? మరో విషయమేమిటంటే, ఆమెకు అప్పగించబడిన బాధ్యత ఆమెకెంతో భయాన్ని కలిగించివుంటుంది. దేవుడు సృష్టించిన సమస్త జీవకోటిలో అత్యంత అమూల్యమైన వ్యక్తి జీవాన్ని అంటే దేవుని ప్రియకుమారుని జీవాన్ని ఆమె మోయాలి. ఆ బిడ్డ నిస్సహాయ శిశువుగా ఉన్నప్పుడు ఆమె శ్రద్ధ తీసుకోవాలి, ఈ దుష్టలోకంలో ఆ బిడ్డను కాపాడాలి. నిజంగా అది చాలా గంభీరమైన బాధ్యత!

బలవంతులైన, విశ్వసనీయులైన ప్రజలు కూడా దేవుడిచ్చిన సవాలుదాయకమైన బాధ్యతలను నిర్వర్తించడానికి కొన్నిసార్లు జంకారని బైబిలు చూపిస్తుంది. మోషే, దేవుని ప్రతినిధిగా వ్యవహరించడానికి తగినంత నేర్పుగా మాట్లాడలేనని అన్నాడు. (నిర్గమకాండము 4:10) యిర్మీయా తాను “బాలుడనే” అని చెబుతూ, దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడానికి తాను మరీ చిన్నవాడినని అభ్యంతరం తెలియజేశాడు. (యిర్మీయా 1:6) యోనా తనకు అప్పగించబడిన బాధ్యతను నిర్వర్తించకుండా పారిపోయాడు. (యోనా 1:3) మరైతే, మరియ విషయమేమిటి?

వినయంగా, విధేయంగా ఆమె పలికిన మాటలు యుగాలుగా ప్రతిధ్వనిస్తూనేవున్నాయి. ఆమె గబ్రియేలుతో ఇలా చెప్పింది, “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” (లూకా 1:38) దాసురాలు సేవకులందరిలోకి తక్కువస్థానానికి చెందినదిగా పరిగణించబడుతుంది, ఆమె జీవితమంతా యజమాని ఆధీనంలోనే ఉంటుంది. మరియ తన యజమానుడైన యెహోవా గురించి అలాగే భావించింది. తాను ఆయనపై పూర్తి భారాన్ని వేస్తే సురక్షితంగా ఉంటానని, యథార్థవంతులకు ఆయన యథార్థంగా ఉంటాడని, ఈ కష్ట​భరితమైన బాధ్యత నిర్వర్తించడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తే ఆయన తనను ఆశీర్వదిస్తాడని ఆమెకు తెలుసు.—కీర్తన 18:25.

దేవుడు కొన్నిసార్లు మనకెంతో కష్టమనిపించే, చివరికి అసంభవం అనిపించే పనులు చేయమని మనల్ని అడుగుతాడు. అయితే ఆయనపై విశ్వాసముంచడానికి, మరియలా మనం కూడా మన పూర్తి భారాన్ని ఆయనపై వేయడానికి తగినన్ని కారణాలను ఆయన తన వాక్యంలో తెలియ​జేశాడు. (సామెతలు 3:5, 6) మనం ఆయనపై విశ్వాసముంచి, మన పూర్తి భారాన్ని ఆయనపై వేస్తామా? అలా చేస్తే, ఆయనపై మరింత బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు తగిన కారణాలనిస్తూ మనకు ప్రతిఫలమిస్తాడు.

ఎలీసబెతును కలుసుకోవడం

ఎలీసబెతు గురించి గబ్రియేలు మరియతో చెప్పిన విషయాలు ఆమెకెంతో ప్రాముఖ్యమైనవి. ప్రపంచంలోవున్న స్త్రీలందరిలోకి మరియ పరిస్థితిని ఆమెకన్నా బాగా మరింకెవరు అర్థం చేసుకోగలరు? మరియ పర్వత ప్రాంతమైన యూదాకు బయలుదేరింది, అది బహుశా మూడు నాలుగు రోజుల ప్రయాణం కావచ్చు. మరియ యాజకుడైన జెకర్యా ఎలీస​బెతుల ఇంట్లోకి ప్రవేశించగానే యెహోవా ఆమె విశ్వాసాన్ని బలపర్చే మరో గట్టి రుజువును ఆమెకు చూపించాడు. ఎలీసబెతు మరియ వందన వచనము వినగానే, తన గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయడం గ్రహించింది. ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని, మరియను “నా ప్రభువు తల్లి” అని సంబోధించింది. మరియ కుమారుడు ఆమెకు ప్రభువు అంటే మెస్సీయ అవుతాడని దేవుడు ఎలీసబెతుకు వెల్లడిచేశాడు. అంతేగాక, “నమ్మిన ఆమె ధన్యురాలు” అని విశ్వసనీయమైన విధేయత చూపించిన మరియను మెచ్చుకునేలా ఆమె ప్రేరేపించబడింది. (లూకా 1:39-45) అవును, మరియకు యెహోవా వాగ్దానం చేసినవన్నీ నెరవేరతాయి!

ఆ తర్వాత మరియ మాట్లాడింది. ఆమె మాటలు లూకా 1:46-55లో జాగ్రత్తగా భద్రపర్చబడ్డాయి. అది బైబిల్లో నివేదించబడిన మరియ చేసిన అతిపెద్ద ప్రసంగం, అది ఆమె గురించి ఎంతో తెలియజేస్తుంది. మెస్సీయకు తల్లి కాగలిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆమె యెహోవాను స్తుతిస్తున్నప్పుడు ఆమెలో కలిగిన కృతజ్ఞతాభావాన్ని అది చూపిస్తుంది. అది ఆమెకెంత విశ్వాసముందో వెల్లడిచేస్తుంది, ఎందుకంటే యెహోవా గర్విష్ఠులను, శక్తివంతులను పడద్రోసి, తనను సేవించే వినయస్థులకు, బీదవారికి సహాయం చేస్తాడని ఆమె అన్నది. అది ఆమెకున్న అపారమైన జ్ఞానాన్ని కూడా తెలియ​జేస్తుంది. ఒక అంచనా ప్రకారం, ఆమె హెబ్రీ లేఖనాలను దాదాపు 20 కన్నా ఎక్కువసార్లు ఎత్తిచెప్పింది.

మరియ దేవుని వాక్యం గురించి లోతుగా ఆలోచించేదని స్పష్టమవుతోంది. అయినా ఆమె తాను సొంతగా మాట్లాడకుండా లేఖనాలు తన స్థితిని వివరించడానికి ఇష్టపడుతూ, వినయం చూపించింది. ఆమె గర్భంలో ఎదుగుతున్న కుమారుడు కూడా ఆ తర్వాత ఒకరోజు, “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని చెబుతూ అలాంటి స్ఫూర్తినే చూపిస్తాడు. (యోహాను 7:16) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘నేను దేవుని వాక్యంపట్ల అలాంటి గౌరవం, భక్తి కలిగివుంటున్నానా? లేక నా సొంత ఆలోచనలకు, బోధలకు ప్రాధాన్యతనిస్తున్నానా?’ ఈ ప్రశ్నలకు మరియ జవాబేమిటో స్పష్టమవుతూనే ఉంది.

మరియ మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి ఆమెను ఎంతో ప్రోత్సహించడమేకాక, తాను కూడా ఎంతో ప్రోత్సహించబడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. (లూకా 1:56) ఈ ఇద్దరు స్త్రీలు స్నేహానికున్న ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తున్నారు. మన దేవుడైన యెహోవాను నిజంగా ప్రేమించే స్నేహితులను సంపాదించుకుంటే, మనం ఆధ్యాత్మికంగా బలపడి, ఆయనకు సన్నిహితమవుతాం. (సామెతలు 13:20) చివరికి మరియ ఇంటికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. యోసేపు ఆమె గురించి తెలుసుకున్నప్పుడు ఏమంటాడు?

మరియ, యోసేపు

మరియ తాను గర్భవతినని అందరికీ తెలిసిపోయేంతవరకు ఆగివుండకపోవచ్చు, ఆమె ఆ విషయాన్ని యోసేపుకు చెప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా చెప్పడానికి ముందు, తాను చెప్పబోయేదాన్ని విని మర్యాదస్థుడు, దైవభయం గలవాడు అయిన ఈ వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడా అని ఆమె అనుకునివుండవచ్చు. ఏదేమైనప్పటికీ, ఆమె ఆయన దగ్గరకు వెళ్ళి తనకు జరిగినదంతా ఆయనకు చెప్పింది. మీరు బహుశా ఊహించినట్లే యోసేపు చాలా కలవరపడ్డాడు. ఆయన ఆ అమ్మాయి చెబుతున్నదానిని నమ్మాలనే అనుకున్నాడు కానీ ఆమె చెప్పిన విషయం అంతకు ముందెప్పుడూ జరగలేదు. ఆయన ఏమి ఆలోచించాడో, ఎలా తర్కించుకున్నాడో బైబిలు చెప్పడం లేదు. ఆయన ఆమెను విడనాడాలని నిర్ణయించుకున్నాడని మాత్రం బైబిలు చెబుతోంది, ఎందుకంటే ఆ కాలంలో వివాహం నిశ్చయమైతే వివాహమైపోయినట్లుగానే పరిగణించేవారు. కానీ ఆయన ఆమెను అవమానపరచాలనో, శిక్షపడేలా చేయాలనో అనుకోలేదు, అందుకే ఆయన రహస్యంగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. (మత్తయి 1:18, 19) అనుకోకుండా తలెత్తిన ఈ పరిస్థితినిబట్టి దయాపరుడైన ఈ వ్యక్తి అనుభవిస్తున్న బాధను చూసి మరియ కూడా బాధపడివుండవచ్చు. అయితే ఆమె కోపం తెచ్చుకోలేదు.

యోసేపు తనకేది మంచిదనిపించిందో అదే చేసేటట్లు యెహోవా ఆయనను విడిచిపెట్టలేదు. దేవుని దూత కలలో కనిపించి మరియ అద్భుతరీతిలో గర్భం ధరించిందని ఆయనకు చెప్పాడు. అది ఆయనకెంతో ఉపశమనం కలిగించివుంటుంది. మొదటి నుండి మరియ చేసినట్లుగానే ఇప్పుడు యోసేపు కూడా యెహోవా నడిపింపుకు అనుగుణంగా చర్యతీసుకున్నాడు. ఆయన మరియను తన భార్యగా చేర్చుకొని, యెహోవా కుమారుని పట్ల శ్రద్ధతీసుకొనే విశేషమైన బాధ్యతను చేపట్టడానికి సిద్ధపడ్డాడు.—మత్తయి 1:20-24.

వివాహితులు, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నవారు 2,000 సంవత్సరాల క్రితం జీవించిన ఈ యువ జంటను చూసి నేర్చుకోవడం మంచిది. యౌవనురాలైన తన భార్య, తల్లిగా తన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించడం చూసి యోసేపు యెహోవా దూత తనకు నిర్దేశించినందుకు ఎంతో ఆనందించివుంటాడు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవాపై ఆధారపడడం ప్రాముఖ్యమని యోసేపు గుర్తించివుంటాడు. (కీర్తన 37:5; సామెతలు 18:13) కుటుంబ యజమానిగా ఆయన ఎంతో జాగ్రత్తగా, దయతో నిర్ణయాలు తీసుకొని ఉంటాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

మరోప్రక్క, యోసేపును వివాహం చేసుకునేందుకు మరియ చూపించిన సుముఖతనుబట్టి మనమేమి అర్థంచేసు​కోవచ్చు? మొదట్లో ఆమె చెప్పిన విషయాన్ని గ్రహించడం ఆయనకు కష్టమైనప్పటికీ, కుటుంబ యజమానిగా ఆయన తీసుకొనే నిర్ణయం కోసం ఆమె ఎదురుచూసింది. అది ఆమెకు, అలాగే నేటి క్రైస్తవ స్త్రీలకు ఒక మంచి పాఠం. చివరిగా యథార్థంగా మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఈ సంఘటనలు యోసేపు మరియలకు తెలియ​జేసివుంటాయి.

ఆ యువ జంట తమ వివాహాన్ని శ్రేష్ఠమైన పునాదిపై నిర్మించుకున్నారు. వారిద్దరూ అన్నింటికన్నా ఎక్కువగా యెహోవా దేవుణ్ణి ప్రేమించారు, బాధ్యతగల, శ్రద్ధగల తల్లిదండ్రులుగా వారు ఆయనను సంతోషపర్చాలని ఎంతో కోరుకున్నారు. వారు ముందు ముందు ఎన్నో ఆశీర్వాదాలను పొందుతారు, అలాగే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు. ప్రపంచంలోకెల్లా మహా గొప్ప మనిషి కాబోయే యేసును పెంచే బాధ్యత వారికి అప్పగించబడింది. (w 08 7/1)