కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?

‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?

‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?

“జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [‘స్వచ్ఛమైన భాష,’ NW] నిచ్చెదను.”—జెఫ. 3:9.

మానవులు తమంతటతాముగా భాషను కనుగొనలేదు కానీ సృష్టికర్తయైన యెహోవా దేవుడే వారికి ఆ వరాన్నిచ్చాడు. (నిర్గ. 4:11, 12) ఆయన మొదటి మానవుడైన ఆదాముకు మాట్లాడే సామర్థ్యాన్నే కాదు కొత్త పదాలను కనిపెట్టి, పదసంపదను పెంచుకునే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. (ఆది. 2:19, 20, 23) అది నిజంగానే ఒక అద్భుతమైన వరం! దానివల్లనే మానవులు పరలోక తండ్రితో కూడ మాట్లాడగలుగుతున్నారు, మహిమాన్వితమైన ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నారు.

2 మానవ చరిత్రలోని మొదటి 17 శతాబ్దాల్లో మానవులందరూ ఒకే భాషను ‘ఒకే పదజాలాన్ని’ ఉపయోగించేవారు. (ఆది. 11:1, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ తర్వాత నిమ్రోదు కాలంలో తిరుగుబాటు జరిగింది. యెహోవా ఆదేశాలకు వ్యతిరేకంగా అవిధేయులైన మానవులు ఒక ప్రదేశంలో సమకూడి, అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి బాబెలు అని పేరువచ్చింది. వారక్కడ పెద్ద గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. వారు దానిని యెహోవాను మహిమపర్చడానికి కాదుగాని ‘పేరు సంపాదించుకోవడానికి’ కట్టాలనుకున్నారు. అందుకే యెహోవా తిరుగుబాటుదారులు మొదటి నుండి మాట్లాడుతున్న భాషను తారుమారు చేసి వారు వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశాడు. అలా వారు భూమి అంతటా చెదరి​పోయారు.—ఆదికాండము 11:4-8 చదవండి.

3 నేడు ప్రపంచంలో అక్షరాలా వేలాది భాషలున్నాయి. కొందరైతే 6,800 కన్నా ఎక్కువ భాషలున్నాయని అంటారు. ప్రతీ భాష మాట్లాడేవారి ఆలోచనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. యెహోవా దేవుడు తిరుగుబాటుదారుల భాషను తారుమారు చేసినప్పుడు వారు పూర్వం మాట్లాడిన సామాన్య భాషకు సంబంధించిన ప్రతీ అంశాన్ని వారి మనసుల్లోనుండి తుడిచేశాడు. వారి మనసులో కొత్త పదాలను ప్రవేశపెట్టడమేకాక వారి ఆలోచనా విధానాన్ని మార్చి, కొత్త వ్యాకరణాలను సృష్టించాడు. ఆ గోపురం కట్టబడిన ప్రదేశానికి బాబెలు లేక “తారుమారు” అనే పేరు రావడంలో ఆశ్చర్యం లేదు. (ఆది. 11:9, అధస్సూచి) ఆసక్తికరంగా, లోకంలో మనమిప్పుడు చూస్తున్న ఇన్ని భాషలు ఎలా వచ్చాయనే ప్రశ్నకు బైబిలు మాత్రమే సంతృప్తికరమైన జవాబునిస్తోంది.

ఒక కొత్త స్వచ్ఛమైన భాష

4 బాబెలు దగ్గర దేవుడు జోక్యం చేసుకోవడం గురించిన బైబిలు వృత్తాంతం ఎంత ఆసక్తికరమైనదైనా, దానికన్నా మరింత ఆసక్తికరమైనది, ప్రాముఖ్యమైనది మన కాలంలో జరుగుతోంది. తన ప్రవక్త జెఫన్యా ద్వారా యెహోవా ఇలా ప్రవచించాడు: “జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [‘స్వచ్ఛమైన భాష,’] నిచ్చెదను.” (జెఫ. 3:9) ఏమిటా ‘స్వచ్ఛమైన భాష’? మనం దాన్ని అనర్గళంగా మాట్లాడడాన్ని ఎలా నేర్చుకోవచ్చు?

5 యెహోవా దేవుని గురించిన, ఆయన వాక్యమైన బైబిల్లో రాయబడిన ఆయన ఉద్దేశాల గురించిన సత్యమే ఆ స్వచ్ఛమైన భాష. ఆ “భాష” నేర్చుకోవాలంటే దేవుని రాజ్యం గురించిన సరైన అవగాహన సంపాదించుకోవడంతోపాటు, అది యెహోవా నామాన్ని ఎలా పవిత్రపరచి, ఆయన సర్వాధిపత్యం సరైనదని ఎలా నిరూపిస్తుందో, అది ఎలా నమ్మకమైన మానవులకు శాశ్వత ఆశీర్వాదాలు తీసుకొస్తుందో కూడా తెలుసుకోవాలి. దేవుడు ఆ భాషను ఇవ్వడం​వల్ల ఏమౌతుంది? ప్రజలు ‘యెహోవా నామమునుబట్టి ఏకమనస్కులై ఆయనను సేవిస్తారని’ లేఖనం చెబుతోంది. బాబెలులో జరిగినదానికి భిన్నంగా ఈ స్వచ్ఛమైన భాషవల్ల యెహోవా నామం స్తుతించబడుతోంది, ఆయన ప్రజలందరూ ఐక్యంగా ఆయనను సేవిస్తున్నారు.

స్వచ్ఛమైన భాష నేర్చుకోవడం

6 ఎవరైనా కొత్త భాషపై పట్టు సాధించాలంటే కొత్త పదాలను కంఠస్థం చేస్తే సరిపోదు. దానికోసం కొత్త ఆలోచనా విధానాన్ని, ధోరణిని నేర్చుకోవాలి. ఇతర భాషల్లో తర్కించే విధానం, హాస్యం భిన్నంగా ఉండవచ్చు. కొత్త పదాలను పలకాలంటే, మాట్లాడేందుకు ఉపకరించే నాలుకలాంటి అవయవాలను భిన్నమైన రీతిలో ఉపయోగించాల్సి వస్తుంది. బైబిలు సత్యానికి సంబంధించిన స్వచ్ఛమైన భాషను నేర్చుకోవాలంటే మనం కూడా పైన పేర్కొన్నవన్నీ చేయాల్సివుంటుంది. కొన్ని ప్రాథమిక బైబిలు బోధలను నేర్చుకుంటేనే సరిపోదు. కొత్త భాషపై పట్టు సాధించాలంటే మన ఆలోచనా విధానాన్ని, చిత్తవృత్తిని అంటే మనస్సును మార్చుకోవాలి.—రోమీయులు 12:2; ఎఫెసీయులు 4:23 చదవండి.

7 మనం స్వచ్ఛమైన భాషను అర్థం చేసుకోవడానికేకాక దానిని అనర్గళంగా మాట్లాడడానికి ఏవి సహాయం చేస్తాయి? వేరే భాషను నేర్చుకోవడానికి సహాయపడేందుకు కొన్ని ప్రాథమిక పద్ధతులు ఉన్నట్లే బైబిలు సత్యానికి సంబంధించిన భాషను అనర్గళంగా మాట్లాడడానికి సహాయపడే కొన్ని ప్రాథమిక పద్ధతులున్నాయి. ప్రజలు వేరే భాష నేర్చుకోవడానికి ఉపయోగించే కొన్ని ప్రాథమిక పద్ధతులను పరిశీలించి, కొత్త సూచనార్థక భాషను నేర్చుకోవడానికి అవి ఎలా సహాయం చేయగలవో చర్చిద్దాం.

స్వచ్ఛమైన భాషను అనర్గళంగా మాట్లాడడం

8శ్రద్ధగా వినండి. ముందెప్పుడూ వినని కొత్త భాష విన్నప్పుడు విచిత్రంగా అనిపించవచ్చు. (యెష. 33:19) కానీ ఆ వ్యక్తి వింటున్నదానిపై ఏకాగ్రత నిలపడం నేర్చుకున్నప్పుడు వేర్వేరు పదాలను, పదేపదే వాడబడుతున్న వాక్యనిర్మాణాన్ని గుర్తించగలుగుతాడు. ఏకాగ్రత నిలిపే విషయంలో మనం కూడ ఇలా ఉపదేశించబడ్డాం: “మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” (హెబ్రీ. 2:1) “వినుటకు చెవులుగలవాడు వినుగాక” అని యేసు తన అనుచరులను పదేపదే ఉపదేశించాడు. (మత్త. 11:15; 13:43; మార్కు 4:23; లూకా 14:35) అవును స్వచ్ఛమైన భాషను మనం మరింత అర్థం చేసుకోవాలంటే చెప్పబడే విషయాలను శ్రద్ధగా ‘విని గ్రహించాలి.’—మత్త. 15:10; మార్కు 7:14.

9 వినడానికి ఏకాగ్రత అవసరం. కానీ ఏకాగ్రత నిలపడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఖచ్చితంగా ప్రయోజకరమైనదే. (లూకా 8:18) క్రైస్తవ కూటాల్లో వివరించబడే విషయాలను మనం ఏకాగ్రతతో వింటున్నామా లేక పరధ్యానంలో పడిపోతున్నామా? అక్కడ చెప్పేవాటిని ఏకాగ్రతతో వినడానికి శాయశక్తులా ప్రయత్నించడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనం వినే విషయంలో మందగించే ప్రమాదముంది అంటే మనకు గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది.—హెబ్రీ. 5:11.

10అనర్గళంగా మాట్లాడేవారిని అనుకరించండి. కొత్త భాష నేర్చుకునేవారు శ్రద్ధగా వినడమేకాదు ఆ భాష మాట్లాడే​వారు పదాలు ఉచ్ఛరించే తీరును, మాట్లాడే తీరును అనుకరించడానికి ప్రయత్నించాలని ప్రోత్సహించబడతారు. అలా చేస్తే, వారు మున్ముందు ఆ కొత్త భాషను మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు అర్థం కానివిధంగా తమ మాతృభాష యాసలో మాట్లాడరు. అదేవిధంగా మనం కొత్త భాషను ‘బోధించే కళపై’ పట్టుసాధించినవారి నుండి కూడ నేర్చుకోవాలి. (2 తిమో. 4:1, 2, NW) సహాయం కోరండి. తప్పులు చేసినప్పుడు దిద్దుబాటును అంగీకరించడానికి సుముఖంగా ఉండండి.—హెబ్రీయులు 12:5, 6, 11 చదవండి.

11 స్వచ్ఛమైన భాష మాట్లాడాలంటే సత్యాన్ని నమ్మి ఇతరులకు బోధించడమే కాదు, దేవుని ఆజ్ఞలకు సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఇలా చేయాలంటే మనం ఇతరులను అనుకరించాలి. అంటే వారి విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని అనుకరించాలి. యేసు పూర్తి జీవితాన్ని కూడా అనుకరించాలి. (1 కొరిం. 11:1; హెబ్రీ. 12:1, 2; 13:7) మనమలా చేస్తూవుంటే దేవుని ప్రజలమధ్య ఐక్యత నెలకొంటుంది, మనమందరం స్వచ్ఛమైన భాషను ఒకే విధంగా మాట్లాడగలుగుతాం.—1 కొరిం. 4:16, 17.

12కంఠతాపట్టండి. భాష నేర్చుకునేవారు ఎన్నో విషయాలను గుర్తుంచుకోవాలి. అంటే ఎన్నో కొత్త పదాలను, పదబంధాలను కంఠతాపట్టాలి. క్రైస్తవులు స్వచ్ఛమైన భాషపై పట్టుసాధించడానికి కంఠతాపట్టడం ఎంతో సహాయంచేయగలదు. మనం బైబిలు పుస్తకాల పేర్లను వరుస క్రమంలో కంఠతాపట్టడం మంచిది. వివిధ ప్రాముఖ్యమైన విషయాలకు సంబంధించిన బైబిలు లేఖనాలను కంఠతా​పట్టాలనే, ఆ లేఖనాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తుపెట్టుకోవాలనే లక్ష్యాన్ని కొందరు పెట్టుకున్నారు. రాజ్య గీతాలను, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల పేర్లను, 12 మంది అపొస్తలుల పేర్లను, ఆత్మఫలాలను కంఠతాపట్టడంలో ప్రయోజనముందని కొందరు చెప్పారు. ప్రాచీన​కాలాల్లో అనేకమంది ఇశ్రాయేలీయులు కీర్తనలను కంఠస్థం​చేసేవారు. మన కాలంలో చూస్తే, ఒక చిన్నబ్బాయి ఒక పదాన్ని కూడా విడిచిపెట్టకుండా 80 లేఖనాలను బట్టీపట్టాడు, ఆయనకు పట్టుమని ఆరేళ్లు కూడ లేవు. మనకున్న ఈ చక్కని సామర్థ్యాన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించగలమా?

13ఒకే విషయాన్ని పదేపదే వినడం వల్ల మనం దాన్ని గుర్తుంచుకోగలుగుతాం. క్రైస్తవ బోధలో కొన్ని విషయాలను పదేపదే గుర్తుచేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.” (2 పేతు. 1:12) మనకు పదేపదే ఎందుకు గుర్తుచేయ​బడాలి? ఎందుకంటే దానివల్ల మన అవగాహన పెంచుకోగలుగుతాం, విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలుగుతాం, యెహోవాకు విధేయులుగా ఉండాలనే కృతనిశ్చయంతో ఉండగలుగుతాం. (కీర్త. 119:129) దేవుని ప్రమాణాలను, సూత్రాలను పదేపదే గుర్తుచేసుకున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుని, ‘విని మరచువారిలా’ మారకుండా ఉండగలుగుతాం. (యాకో. 1:22-25) సత్యాన్ని పదేపదే గుర్తు​చేసుకోకపోతే వేరే విషయాలు మన హృదయాల్లోకి చొరబడి ప్రభావితం చేస్తాయి, ఇక స్వచ్ఛమైన భాషను అనర్గళంగా మాట్లాడలేకపోతాం.

14లోగొంతుకతో చదవండి. కొంతమంది విద్యార్థులు కొత్త భాషను మాట్లాడకుండా తమంతట తామే దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల మంచి ఫలితాలు రావు. మనం స్వచ్ఛమైన భాషను నేర్చుకుంటున్నప్పుడు ఏకాగ్రత నిలుపుకోవడానికి కొన్నిసార్లు లోగొంతుకతో చదవాలి. అందుకే కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు [‘లోగొంతుకతో చదువువాడు,’ NW] ధన్యుడు.” (కీర్త. 1:2) అలా చేయడం వల్ల మనం చదివేది మన మనసుల్లో ఉండిపోతుంది. హెబ్రీ భాషలో ‘లోగొంతుకతో చదవడానికి’ ధాన్యించడానికి మధ్య దగ్గర సంబంధముంది. తినే ఆహారం నుండి బలం పొందాలంటే దాన్ని ఎలాగైతే జీర్ణించుకోవాలో అలాగే మనం చదివినదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే దానిని ధ్యానించాలి. మనం అధ్యయనం చేసే విషయాలను ధ్యానించడానికి తగినంత సమయం తీసుకుంటున్నామా? బైబిలు చదివిన తర్వాత దాని గురించి లోతుగా ఆలోచించాలి.

15వ్యాకరణాన్ని విశ్లేషించండి. మనం నేర్చుకోవడం ప్రారంభించిన కొంతకాలానికి కొత్త భాషా వ్యాకరణాన్ని అంటే వాక్యనిర్మాణాన్ని, భాషా నిబంధనలను అధ్యయనం చేయడం ప్రయోజనకరం. అలా చేస్తే మనం భాషలో వాక్యనిర్మాణాన్ని అర్థంచేసుకుని స్పష్టంగా మాట్లాడగలుగుతాం. భాషకు ఎలాగైతే వాక్యనిర్మాణం లేదా ప్రమాణం ఉంటుందో అలాగే లేఖనాధారిత సత్యానికి సంబంధించిన స్వచ్ఛమైన భాషకు కూడా “హితవాక్యప్రమాణము” ఉంది. (2 తిమో. 1:13) మనం ఈ ‘ప్రమాణాన్నే’ అనుసరించాలి.

16నేర్చుకోవడాన్ని మానేయకండి. ఒక వ్యక్తి భాషను మామూలుగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకుని ఆ తర్వాత నేర్చుకోవడం మానేసే అవకాశం ఉంది. స్వచ్ఛమైన భాష మాట్లాడేవారి విషయంలో కూడా అదే సమస్య తలెత్తవచ్చు. (హెబ్రీయులు 5:11-14 చదవండి.) మనం దానిని ఎలా అధిగమించగలం? భాషను మరింత ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. “నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.”—హెబ్రీ. 6:1, 2.

17అధ్యయనానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించండి. ఎప్పుడో ఒకసారి ఎక్కువసేపు కూర్చుని అధ్యయనం చేసే బదులు క్రమంగా కొంతసేపు అధ్యయనం చేయడం మంచిది. మీరు ఏకాగ్రత నిలపగలిగే సమయాన్ని ఎంచుకోండి. కొత్త భాష నేర్చుకోవడమనేది అడవిగుండా బాట ఏర్పర్చడం లాంటిది. ఆ బాటగుండా ఎన్నిసార్లు నడిస్తే ఆ బాటలో వెళ్లడం అంత సులభమవుతుంది. కొంతకాలం ఆ బాటగుండా వెళ్లకపోతే మొక్కలు అవీఇవీ పెరిగి దారి కనిపించకుండాపోతుంది. కాబట్టి నిత్యం పట్టుదలతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. (దాని. 6:16, 20) బైబిలు సత్యానికి సంబంధించిన స్వచ్ఛమైన భాషను మాట్లాడే విషయంలో ప్రార్థనాపూర్వకంగా ‘ప్రతి సమయంలో మెలకువగా’ ఉండండి.—ఎఫె. 6:18.

18ఆ భాషలో మాట్లాడుతూ ఉండండి. కొత్త భాష నేర్చుకునే కొంతమంది సిగ్గుపడో తప్పులు చేస్తామన్న భయంతోనో ఆ భాషలో మాట్లాడడానికి సంకోచిస్తారు. అలా చేస్తే వారు భాషపై పట్టుసాధించలేరు. కొత్త భాష నేర్చుకునే విషయంలో ఒకటి మాత్రం నిజం. ఆ భాషలో మాట్లాడుతూ ఉంటేనే ఆ భాషను నేర్చుకోగలుగుతారు. వారు కొత్త భాషను ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత సునాయాసంగా మాట్లాడగలుగతారు. మనం కూడ అవకాశం దొరికినప్పుడల్లా స్వచ్ఛమైన భాషను మాట్లాడాలి. “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” (రోమా. 10:10) మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడే కాక యెహోవా గురించి మాట్లాడిన ప్రతీసారి, పరిచర్యలో పాల్గొన్న ప్రతీసారి రక్షణ కోసం నోటితో ‘ఒప్పుకుంటాము.’ (మత్త. 28:19, 20; హెబ్రీ. 13:15) క్రైస్తవ కూటాల్లో కూడ మనకు స్వచ్ఛమైన భాషలో స్పష్టంగా, సంక్షిప్తంగా మాట్లాడే అవకాశం లభిస్తుంది.—హెబ్రీయులు 10:23-25 చదవండి.

యెహోవాను స్తుతించడానికి ఐక్యంగా స్వచ్ఛమైన భాషను ఉపయోగించండి

19 సా.శ. 33 సీవాను 6 ఆదివారం ఉదయాన యెరూషలేములో సమకూడడం క్రైస్తవులకు ఎంతో ఉత్తేజకరంగా అనిపించివుండవచ్చు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల​కన్నా ముందే మేడగదిలో సమకూడినవారు అద్భుతంగా “అన్యభాషలతో మాటలాడసాగిరి.” (అపొ. 2:4) నేడు దేవుని సేవకులకు భాషల్లో మాట్లాడే వరం లేదు. (1 కొరిం. 13:8) అయితే యెహోవాసాక్షులు రాజ్య సువార్తను 430 భాషల్లో ప్రకటిస్తున్నారు.

20 మన మాతృభాష ఏదైనా మనమందరం ఐక్యంగా బైబిలు సత్యానికి సంబంధించిన స్వచ్ఛమైన భాషను మాట్లాడగలుగుతున్నందుకు సంతోషంగా లేమా? ఒక విధంగా చూస్తే బాబెలులో జరిగినదానికి పూర్తి భిన్నమైనది ఇప్పుడు జరుగుతోంది. యెహోవా ప్రజలు సూచనార్థకంగా ఒకే భాషలో ఆయన నామాన్ని స్తుతిస్తున్నారు. (1 కొరిం. 1:10) మన పరలోక తండ్రియైన యెహోవాను ఘనపర్చేలా మనమందరం ఆ భాషను అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుంటుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీలతో ‘ఏకమనస్కులమై’ ఆయనను సేవిస్తూ ఉండాలనే కృతనిశ్చయంతో ఉందాం.—కీర్తనలు 150:1-6 చదవండి.

మీరెలా జవాబిస్తారు?

• స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి?

• స్వచ్ఛమైన భాషను మాట్లాడడానికి ఏమి చేయాలి?

• స్వచ్ఛమైన భాషను అనర్గళంగా మాట్లాడడానికి మనకు ఏమి సహాయంచేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా మనకు అద్భుతమైన ఏ వరాన్ని ఇచ్చాడు?

2. మానవులందరూ నేడు ఒకే భాషను ఎందుకు మాట్లాడడం లేదు?

3. యెహోవా బాబెలు దగ్గర తిరుగుబాటుదారుల భాషను తారుమారు చేసినప్పుడు ఏమి జరిగింది?

4. మన కాలంలో ఏమి జరుగుతుందని యెహోవా దేవుడు ప్రవచించాడు?

5. స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి, దేవుడు దానిని ఇవ్వడంవల్ల ఏమౌతుంది?

6, 7. (ఎ) కొత్త భాష నేర్చుకోవడానికి ఏమి చేయాల్సివస్తుంది, స్వచ్ఛమైన భాషను నేర్చుకునే విషయంలో కూడా మనం ఏమి చేయాలి? (బి) మనం ఇప్పుడు ఏమి పరిశీలించనున్నాం?

8, 9. మనం స్వచ్ఛమైన భాష నేర్చుకోవాలంటే ఏమి చేయాలి, అది ఎందుకంత ప్రాముఖ్యం?

10, 11. (ఎ) శ్రద్ధగా వినడంతోపాటు మనం ఇంకా ఏమి చేయాలి? (బి) స్వచ్ఛమైన భాషను మాట్లాడాలంటే ఇంకా ఏమి చేయాలి?

12. కొత్త భాష నేర్చుకోవడానికి కంఠతాపట్టడానికి మధ్య ఎలాంటి సంబంధముంది?

13. పదేపదే గుర్తుచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

14. స్వచ్ఛమైన భాషను నేర్చుకుంటున్నప్పుడు మనకు ఏది సహాయం చేస్తుంది?

15. మనం స్వచ్ఛమైన భాష “వ్యాకరణాన్ని” ఎలా అధ్యయనం చేయవచ్చు?

16. భాష నేర్చుకునే విషయంలో ఎదురయ్యే ఏ సమస్యను మనం అధిగమించాలి, ఎలా అధిగమించాలి?

17. క్రమంగా అధ్యయనం చేయడం ఎందుకు ప్రాముఖ్యం? ఉదాహరించండి.

18. మనకు అవకాశం దొరికినప్పుడల్లా స్వచ్ఛమైన భాషను ఎందుకు మాట్లాడాలి?

19, 20. (ఎ) నేడు యెహోవాసాక్షులు ఎలాంటి అద్భుతమైన పనిని చేస్తున్నారు? (బి) మీరు ఏ కృతనిశ్చయంతో ఉండాలనుకుంటున్నారు?

[23వ పేజీలోని బాక్సు]

స్వచ్ఛమైన భాషను అనర్గళంగా మాట్లాడడం నేర్చుకోండి

శ్రద్ధగా వినండి.

లూకా 8:18; హెబ్రీ. 2:1

అనర్గళంగా మాట్లాడేవారిని అనుకరించండి.

1 కొరిం. 11:1; హెబ్రీ. 13:7

కంఠతాపట్టండి, పదేపదే వినండి.

యాకో. 1:22-25; 2 పేతు. 1:12

లోగొంతుకతో చదవండి.

కీర్త. 1:1, 2

“వ్యాకరణాన్ని” విశ్లేషించండి.

2 తిమో. 1:13

భాష నేర్చుకోవడాన్ని ఆపేయకండి.

హెబ్రీ. 5:11-14; 6:1, 2

అధ్యయనానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించండి.

దాని. 6:16, 20; ఎఫె. 6:18

ఆ భాషలో మాట్లాడండి.

రోమా. 10:10; హెబ్రీ. 10:23-25

[24వ పేజీలోని చిత్రాలు]

యెహోవా ప్రజలు ఐక్యంగా స్వచ్ఛమైన భాషను మాట్లాడుతున్నారు